top of page
Original.png

ఎన్నిక!

#SripathiLalitha, #శ్రీపతిలలిత, #ఎన్నిక, #Ennika, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Ennika - New Telugu Story Written By Sripathi Lalitha

Published in manatelugukathalu.com on 01/03/2026

ఎన్నిక - తెలుగు కథ 

రచన: శ్రీపతి లలిత

"ఒక హీరోని గెలిపించాలనే ఉత్సాహం… 20 ప్రాణాలు తీసుకుపోయింది! కానీ ఒక అమ్మ మాట… ఒక కుటుంబాన్ని కాపాడింది!"

యువతకు కనువిప్పు కలిగించే శ్రీపతి లలితగారి 'ఎన్నిక' కథ చదవండి. 

“నిజమేనా! మన హీరో ఉదయ్ వస్తున్నాడా?

ఎలా అయినా అతన్ని గెలిపించి మన ముఖ్యమంత్రిని చెయ్యాలి. 

మన వాళ్ళందరికీ   చెప్పండి. సాయంత్రం అందరం కలిసి ప్లాన్ చేద్దాం!” ఉత్సాహంగా మాట్లాడుతున్న నిహాల్‌ని చికాగ్గా చూసింది స్వాతి. 


నిహాల్ స్వాతి, శేఖర్‌ల ఏకైక కుమారుడు. 

ఇంటర్ వరకు చదువులో ప్రథముడిగా ఉండేవాడు. మంచి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్స్ విభాగంలో చేరాడు. 

రెండో సంవత్సరం పూర్తయిన దగ్గరనుంచి అతనిలో మార్పు వచ్చింది. 

కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్లడం, అభిమానసంఘం అంటూ పాలాభిషేకాలు, మొదటిరోజు సినిమా చూడాలంటూ వేలకివేలు తగలెయ్యడం. 


ఏమన్నా అంటే కోపం తెచ్చుకుని తినకుండా వెళ్లిపోవడం… ఇవన్నీ యువతలో   ఉడుకు రక్తం వల్ల వచ్చిన సమస్యలని ఎంత సర్ది చెప్పుకున్నా ఇప్పుడు శృతి మించుతోంది అనిపించింది స్వాతికి. శేఖర్‌తో అంటే “ఇది మామూలే స్వాతీ! ఆఖరి సంవత్సరానికి వస్తే మళ్లీ మామూలే. చదువు నిర్లక్ష్యం చెయ్యడం లేదుగా! “ అనేశాడు. 


ఇప్పుడు ఆ అభిమాన హీరో ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఈ సారి ముఖ్య మంత్రి అవ్వాలనే ఉద్దేశంతో అన్ని ఊళ్లల్లోనూ సభలు ఏర్పాటు చేస్తున్నాడు. 


ఈ రాజకీయ నాయకులకి, విద్యార్థులని వాడుకుంటే, మంచి ఫలితాలు ఉంటాయని  బాగా తెలుసు. అందుకే అభిమాన సంఘాలకి చెప్పి ప్రతీ చోటా విద్యార్థులని కూడగడుతున్నారు. 

ఇప్పుడు అదే వార్త నిహాల్‌కి అందినట్టుగా ఉంది. తన గదిలోకి వెళ్లి ఎలా హీరోని గెలిపించాలి అన్నదానికి కంప్యూటర్‌లో ప్లాన్ తయారుచేస్తున్నాడు. 

అప్పుడే నెమ్మదిగా వెళ్లింది లోపలికి స్వాతి. 


“ఏంటి నిహాల్! ఏదో తయారుచేస్తున్నావు? ఏదైనా సెమినార్ ఉందా?” ఏమీ తెలియనట్లుగా అడిగింది స్వాతి. నిహాల్ ఉత్సాహంగా విషయం చెప్పాడు. 

“ఎలా అయినా మా హీరోని ముఖ్య మంత్రిని చెయ్యాలమ్మా! దానికే ప్లాన్ వేస్తున్నాం” అన్నాడు. 

“ఈ ప్లానింగ్ ఏదైనా ఉద్యోగానికి కానీ, పై చదువులకు పనికి వస్తుందా?” తల్లి అడిగిన దానికి కోపంగా ఏదో అనబోయిన నిహాల్ తల అడ్డంగా ఊపాడు. 


“చూడు నిహాల్! నేను చెప్పేది నీకు నచ్చదు, కోపం కూడా వస్తుంది, కానీ చెప్పడం తల్లిగా నా బాధ్యత. విను, ఆలోచించు,తర్వాత నీకు ఏది మంచిది అని తోస్తే అది చెయ్యి. 


ఇప్పుడు నీ వయసు పంతొమ్మిది. ఇంకా రెండేళ్ల చదువు ఉంది. తర్వాత నువ్వు ఇంకా పై చదువులు చదవచ్చు. మీ స్నేహితులు అందరికీ అలా కాదు. వినీత్ వాళ్ల నాన్న చనిపోయాడు. వాళ్ళ అమ్మ, బంధువుల సాయంతో  చదివిస్తోంది. 


అదే ప్రదీప్ వాళ్ళ నాన్న టైలర్. ఎప్పుడు కొడుకు చదివి ఉద్యోగంలో చేరి ఆదుకుంటాడో అని ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఇంకా చదివినా  మాకు పర్వాలేదు, మేము డబ్బు కట్టి చదివించగలం. నువ్వు ఎంబీఏ చేస్తే నీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంజనీరింగ్ లో మంచి మార్కులు వస్తేగాని మీ భవిష్యత్తు బావుండదు. 



మీ వయసులో హీరో అంటే  ఇష్టం ఉండడం తప్పు కాదు. సినిమా ఒక కాలక్షేపంగా ఉండాలి. అదే మీ జీవితం కాకూడదు. మీకు ఓటు హక్కు ఉంది,  మీరు ఆలోచించి ఎవరు ప్రజలకి ఉపయోగంగా  ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలి. అంతేగాని మీకు నచ్చిన హీరో అనో అతని ఆటలు, పాటలు మీకిష్టమనో ఎన్నుకోకూడదు. 



వారి ఉపన్యాసాలు వినండి, వారి ప్రణాళికలు గమనించండి. ఆలోచించి ఓటు వెయ్యండి. మొన్ననే బెంగళూరులో క్రికెట్ ఫ్యాన్స్, వారి అభిమాన ఆటగాళ్లని చూడడానికి విపరీతంగా వెళ్లి,తొక్కిసలాటలయ్యి కొందరు చచ్చిపోయారు. గుంపులుగా ఉన్న జనంలోకి వెళ్లడం మంచిది కాదు. అక్కడ క్రమశిక్షణ ఉండదు, ఆలోచించండి. మీ అభిమాన సంఘాలు లక్షల్లో వచ్చారు అని గొప్పలు చెప్పడానికి మనుషులని పోగేస్తారు. 


తొక్కిసలాటలో చస్తే ఇన్ని లక్షలు ఇస్తామంటారు. ఇచ్చారో లేదో తెలీదు. ఎన్ని కోట్లు ఇచ్చినా,  పోయిన ఆ మనిషిని ప్రాణాలతో తేలేము.  అందుకే మనమే సవ్యంగా ఆలోచించి ఎన్నుకోవాలి”.


నిహాల్ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది స్వాతి. 


సాయంత్రం టీవీ లో బ్రేకింగ్ న్యూస్, 

“ఉదయ్ సభకి వచ్చిన జనం, ఒక్కసారిగా నటుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. తొక్కిసలాటలో ఇరవైమంది మృతి. పార్టీ ఒక్కోరికి పది లక్షలు  పరిహారం ప్రకటించారు”


వార్తలు చూస్తున్న నిహాల్, స్వాతిని చూసి, “థాంక్స్ అమ్మా! మేము వెళ్ళకపోవడం మంచిదైంది నువ్వు చెప్పాక,  నేనూ ఆలోచించాను. మూడురోజుల్లో పరీక్షలు ఉన్నాయి కదా ! ఇవాళ వెళ్ళద్దు అని మెసేజ్ చేశాను. లక్కీగా మా స్నేహితులు ఎవరూ వెళ్ళలేదు. వెళ్లి ఏదైనా అయ్యుంటే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేక పోయేవాణ్ణి. 


నువ్వు చెప్పినట్టు ఎన్నిక అనేది చాలా ముఖ్యం. అది చదువు విషయం కానీ, పదవి విషయం కానీ.” 


                                    సమాప్తం

 


శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page