top of page

ఎంత చెట్టుకి అంత గాలి


' Entha Chettuki Antha Gali ' written by Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

చెట్టు సైజుకి తగ్గట్టు.... అది చిన్నదైతే తక్కువ గాలి, పెద్దదయితే ఎక్కువ గాలి సహజం… అలాగే దేనికి తగ్గ సమస్యలుదానికి వస్తాయి. ఒకరి సమస్య మరొకరికి సిల్లీగా, తేలికగా అనిపించచ్చు! అలాంటి సందర్భాల్లో ఈ సామెత వాడతారు.

* * * *

"కోటమ్మ ఇల్లు తుడిచి వెళ్ళి పావుగంట కాలేదు. ఏమిట్రా అంత చేటు కుస్తీ పడుతున్నావు. చెక్కిన పెన్సిల్ తొక్కలు, తుడిపితుడిపీ ముక్కలు చేసిన ఇరేజర్.... డైనింగ్ టేబుల్ యుద్ధ భూమిలాగా చేశావు వరుణ్!"

"అయినా నీకెన్ని సార్లు చెప్పాను డైనింగ్ టేబుల్ ని స్టడీ టేబుల్ చెయ్యద్దని" అని శైలజ గట్టిగా అరిచింది.

"ఈ శనివారం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉందమ్మా! నన్ను "చర్మం క్రాస్ సెక్షన్" బొమ్మతో చార్ట్ తయారు చేసుకురమ్మన్నారు" అన్నాడు.

"దానికి ఇంత హైరాన పడుతున్నావేంటి, ఏదో రోదసిలోకి పంపే ఉపగ్రహం డిజైన్ డ్రాయింగ్ వేస్తున్నట్టు" అన్నది హాస్యంగా!

"నీకేం తెలుస్తుంది మమ్మీ.. ఆ బొమ్మ వెయ్యటం ఎంత కష్టమో" అన్నాడు పన్నెండేళ్ళ వరుణ్, ఏ చదువూ లేని తల్లిని చూసినట్లు చూస్తూ.... ఆ నిముషంలో తన తల్లి జూవాలజీలో పిహెచ్ డి అనే విషయం మర్చిపోయి!

"నిజమేరా నాకేం తెలుసు అవన్నీ!" అని నవ్వుతూ "అక్కనడక్కపోయావా" అన్నది.

"ఆవిడగారు స్కూటర్ ప్రాక్టీస్ చేసుకోవాలిట" అన్నాడు ఉక్రోషంగా!

"వాడికేం కావాలో చూడు నళినీ" అన్నది కూతురితో.

"నేను ఆ వయసులో ఒక్కదాన్నే వేసుకోలేదా? అప్పుడు వాడు సహాయం చేశాడా? ఇప్పుడు చిన్నవాడు చిన్నవాడంటూ వాడి పనులన్నీ నన్ను చేసి పెట్టమంటావ్! నాకు స్కూటర్ ప్రాక్టీస్ చేసుకోవటానికి టైం దొరకట్లేదు. నిన్ను తోడు రమ్మంటేఇంటి పనంటావ్! నాన్నగారిని పిలిస్తే ఆయన కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నారు" అని కాళ్ళు నేలకేసి బాదుకుంటూఅసహనంగా స్కూటీ తాళాలు తీసుకుని బయటికెళ్ళింది.

"అది ఏ కాళ్ళో చేతులో విరక్కొట్టుకొస్తుంది.. కాస్త దానికి తోడుగా గ్రౌండ్ దాకా వెళ్ళి రావచ్చు కదండీ" అన్నది భర్తతో!

"కాన్ఫిడెన్షియల్ గా చెయ్యాల్సిన ఆఫీస్ స్టేట్మెంట్ "ఎక్సెల్" లో తయారు చేద్దామని పొద్దుటి నించీ ట్రై చేస్తుంటే కుదరట్లేదోయ్! నా బాధలు నావి… ఆర్చేవారా, తీర్చేవారా? నీకు తెలుసని నిన్నడిగితే ఇంటి పని అని పెద్ద పోజు కొడతావు. "తెలిసితే మోక్షము.. తెలియకున్న బంధము" అని అన్నమాచార్య కీర్తన కూని రాగం తీస్తూ.. నీకు అసలు సమస్యలు, కష్టాలు ఉండనట్టు?" అని "నాకు దానితో వెళ్ళి ప్రాక్టీస్ చేయించటం కుదరదు" అన్నాడు కొండల్రావు.

"ఎన్ని సార్లు చెప్పినా మీకు ఏకాగ్రత లేక, తప్పు కమాండ్స్ ఇస్తున్నారు. దానితో కరప్ట్ అవుతున్నది. కంప్యూటర్ ఆపరేషన్లో ఓపెన్ అయ్యే మెసేజ్ విండో ని జాగ్రత్తగా గమనిస్తే అన్నీ సెల్ఫ్ ఎక్స్ ప్లనేటరీ గా ఉంటాయి. చూసుకోకుండా విసుక్కుంటే ఎప్పటికీ నేర్చుకోలేరు. కొంచెం శ్రద్ధ, సహనం అవసరం. అంతే!" అన్నది శైలజ.

ఇంట్లో ఎవరి స్థాయి కష్టాలతో వాళ్ళు అంతర్జాతీయ సమస్యల లాగా కొట్టు మిట్టాడుతూ ఉండగా...

"మీ గోల మీదే కానీ నా గోడు ఎవరయినా వినిపించుకుంటారా లేదా" అని పెద్దగా వంటింట్లో నించి సీతమ్మ గారు కేకేసింది.

"ఏంటత్తయ్యా" అంటూ వంటింట్లోకొచ్చిన శైలజ, అయిపోయిన సిలిండర్ తీసి కొత్త సిలిండర్ పెట్టే ప్రక్రియలో చెయ్యినలిగిన అత్తగారిని చూసి "అయ్యో, మీరెందుకండీ మార్చటం! మీకు చేతకాదు! గ్యాస్ అయిపోతే, మీకు వంట మధ్యలో ఇబ్బంది అవుతుందనే కదా ... రెండో స్టవ్ కూడా పెట్టింది" అని గబ గబా అత్తగారి చేతికి తడి గుడ్డ చుట్టి, సిలిండర్మార్చింది.

* * * *

"ఈ సారి వరలక్ష్మి వ్రతానికి పూర్ణంతో బూరెలు నేను చేస్తానత్తయ్యా! మిగిలినవన్నీ చేసి నేను పూజకి కూర్చుంటే ప్రతి సారి మీరే చేస్తున్నారు. మొన్న నళిని తన పుట్టిన రోజుకి బొబ్బట్లు చెయ్యమంటే, మీ చేతికి దెబ్బ తగిలింది అని ప్రయోగంచేశాను. కానీ దిబ్బ రొట్టెల్లాగా వచ్చాయి. చూశారుగా! ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకోవాలి కదా! మీరు కూడా పెద్దవారైపోతున్నారు" అన్నది.

"కంప్యూటర్ ఆపరేషన్ లో సహాయం చెయ్యమంటే లెక్చర్ దంచావుగా! అమ్మ తేలిగ్గా, ఎడం చేత్తో చేసే పని నీకు కష్టమవట్లా! శ్రద్ధగా, ఓపికగా చేస్తే అదే వచ్చేస్తుంది. అదేమయినా బ్రహ్మ విద్యా?" అన్నాడు కొండల్రావు… భార్యకి పాఠం చెప్పటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా.

"ఏంటర్రా మీ గొడవ? 'ఎంత చెట్టుకి అంత గాలి'... చెయ్యటం చేతకానప్పుడు ఎవరి సమస్య వాళ్ళకి పెద్ద భూతంలా కనిపిస్తుంది. నడక వస్తున్న పిల్లలకి కింద పడిపోకుండా నడవటం ఒక పెద్ద సవాలు. అట్లా అని కారు నడిపేవాడు తప్పటడుగులతో కింద పడుతున్న పిల్లవాడిని చూసి ఎగతాళి చేస్తే అది హాస్యాస్పదం!

"పని పిల్లకి వాళ్ళాయనతో దెబ్బలు తినకుండా రోజు పూర్తవటం కష్టమయితే, పిల్లలని తీసుకెళ్ళే ఆటొవాడికి పోలీస్ కంటపడకుండా రాంగ్ రూట్ లో వెళ్ళి పెట్రోల్ సేవ్ చేసుకుంటూ త్వరగా స్కూల్ కి చేరటం కష్టం!"

"మన పక్కింటి బ్యాంక్ మేనేజర్ జెన్నీ గారికి ఎగ్గొట్టే వాళ్ళ దగ్గర నించి అప్పులు వసూలు చేసి ఆ నెల లక్ష్యం చేరుకోవడం పెద్ద సవాలు."

"జీవితమంటేనే తుఫానుల మయం!"

"తెలిస్తే మోక్షము.. తెలియకున్న బంధము.... కిటుకంతా అక్కడే ఉంది" అని సీతమ్మ గారు శ్రావ్యంగా అన్నమయ్య కీర్తన ఆలపించి, సమస్యని 'వడ్ల గింజలో బియ్యపు గింజ ' అంత సహజం అన్నట్టు తేల్చేశారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు

779 views1 comment

1 Comment


syam kp
syam kp
Mar 17, 2022

chaala baaga raasaru madam


Like
bottom of page