top of page

పరమార్థం


' Paramartham ' written by Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గరకి పని మీద వెళ్ళి తిరిగొస్తున్న కపర్ధికి, లుంబిని పార్క్ సమీపిస్తుండగా పెద్ద శబ్దం వినిపించింది. ఎవరో టపాకాయలు కాలుస్తున్నారేమో అనుకుంటూనే స్కూటర్ స్లో చేశాడు.

జనాల హాహాకారాలు! గుంపులు గుంపులుగా తోసుకుంటూ పార్కులోంచి బయటకు పరుగులు తీస్తున్నారు. కొందరు కాళ్ళు, చేతులు తెగి.. నెత్తురోడుతున్నారు! ఒకరి మీద ఒకరు పడుతూ, తొక్కుకుంటూ తోసుకుంటూ రోడ్డుకి అడ్డంపడి పరుగులు పెడుతున్నారు.

ఈ సందట్లో నాలుగైదేళ్ళ పిల్లవాడు పరుగున వచ్చి కపర్ధి స్కూటర్ కి అడ్డం పడ్డాడు. షర్ట్ చిరిగిపోయి ఉంది. పెద్దగా ఏడుస్తూ అటూ ఇటూ భీతావహంగా చూస్తున్నాడు.

స్కూటర్ ఆపి, పిల్లవాడిని దగ్గరకు తీసుకుని ఏం జరిగిందని అడిగాడు.

"తాతా! పెద్ద చప్పుడయింది. అందరూ పరుగెత్తుతున్నారు. నేను కూడా భయంతో పరుగెత్తాను. అమ్మా నాన్నా కనిపించట్లేదు" అన్నాడు వెక్కుతూ.

కపర్ధి పిల్లవాడిని సముదాయించి, చుట్టూ చూశాడు. ముందుగా తన దగ్గర ఉన్న సీసాలోంచి ఆ పిల్లవాడికి నీళ్లు తాగించాడు. కొన్ని నీళ్లతో మొహం కడిగాడు.

అతని ఒంటి మీద దెబ్బలేమీ లేవని నిర్ధారించుకున్నాడు.

సెక్రెటేరియట్, అసెంబ్లీ భవనాలు పార్కుకి దగ్గరే ఉండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. జనాలని చెదరగొట్టి.. శవాలని, దెబ్బలు తగిలిన వారిని అంబులెన్సుల్లో హాస్పిటల్ కి తరలిస్తున్నారు. ‘ఈ పిల్లవాడి తల్లి దండ్రులు కనపడతారేమో! కొంత సేపు వేచి చూద్దాం’ అని పక్కగా నిల్చున్నాడు.

చీకటిపడుతున్నది. పిల్లవాడిని వెతుక్కుంటూ ఎవ్వరూ రాలేదు. ఇక అతణ్ణి ఇంటికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

***

ఓ గంటలో వస్తానని బయటికి వెళ్లిన భర్త నాలుగు గంటలైనా రాకపోయే సరికి కంగారుతో, కాలుకాలిన పిల్లి లాగా బయటికి లోపలికి తిరుగుతున్నది గౌరి. అసలే ఒకసారి ఘాతు తిని ఉన్నందువల్ల మనసు కీడు శంకిస్తున్నది!

మొహమంతా మసి, కన్నీటి చారికలు, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు, చిరిగిపోయిన షర్ట్ తో ఉన్న ఒక చిన్న పిల్లవాడితో సహా వచ్చిన భర్తని చూసి "వీడెవరండీ, ఎక్కడి నించి తీసుకొచ్చారు?" అన్నది.

"నేను పెద్దమ్మ గుడి దగ్గర పనుంది, వెళుతున్నానని చెప్పాను కదా! తిరిగొస్తుంటే, లుంబిని పార్క్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది. వందల మంది జనం తొక్కిసలాటతో ఆ ప్రదేశం అంతా యుద్ధ భూమి లాగా ఉన్నది.

వాళ్ళల్లో ఈ పిల్లవాడు ఏడుస్తూ పరుగెత్తుకొచ్చి నా స్కూటర్ ముందు పడిపోయాడు. కొంచెంసేపు చూశాను. ఎవరూ రాలేదు. పోలీసులు జనాలని చెదరగొడుతున్నారు. వీడి కోసం వెతుక్కుంటున్న వారెవరూ కనిపించలేదు. తల్లిదండ్రులేమయ్యారో తెలియదు. వీడేమో షాక్ లో ఉన్నాడు. అందుకే తీసుకొచ్చేశాను. ముందు కాస్త తిండి పెట్టి ఈ రాత్రికి పడుకోనిస్తే, కాస్త తెప్పరిల్లాక వివరాలు ఏమైనా చెప్పగలడేమో చూద్దాం" అన్నాడు.

ఏ జ్ఞాపకాలు కలచాయో కపర్ధికి, గౌరికి ముఖాల్లో నీలి నీడలు కదిలి మనసులు భారమయినాయి.

స్నానం చేయించి, బీరువాలో మనవడి స్కూల్ యూనిఫార్మ్ బట్టలుంటే తొడిగి, భోజనం పెట్టి పడుకోబెట్టారు, ఆ పిల్లవాడిని.

స్నానం చేసి, భోజనం చేసి, ఉయ్యాల మీద పడుకున్న కపర్ధిలో కదులుతున్న భయంకరమైన చేదు జ్ఞాపకాలకి, కళ్ళు.. నీటి చెలమలయ్యాయి.

***

కొడుకు వంశీ, కోడలు అపర్ణ, మనవరాలు శ్రేయ సంక్రాంతి పండుగ గడపటానికి అమెరికా నుంచి వచ్చారు. తమ్ముడు భార్యా పిల్లలతో వచ్చాడని, వారితో గడపటానికి కపర్ధి చిన్న కూతురు శైలజ కుటుంబం విజయవాడ నుంచి వచ్చింది. పెద్ద కూతురు వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు.

పిల్లల ఆట పాటల కేరింతలు, పండుగ వేడుకలు, పిండివంటల సందడితో అందరూ సరదాగా గడిపారు. గౌరి మనవరాళ్ళతో బొమ్మల కొలువు పెట్టించింది. మనవలందరికీ భోగిపండ్లతో దిష్టి తీసింది.

"నాన్నగారూ! అందరం సరదాగా కాళేశ్వరం వెళ్ళి శివుడి దర్శనం చేసుకుందాం" అన్నాడు కొడుకు వంశీ.

"మీరు వెళ్ళి రండి నాన్నా! నాకు పనుంది" అన్నాడు కపర్ధి.

కొడుకు వంశీ కుటుంబం, చిన్న కూతురు శైలజ కుటుంబం, పెద్ద కూతురు భారతి, మనవడు శ్రేయస్.. మూడు కార్లల్లో బయలుదేరారు. పెద్ద అల్లుడు తనకేదో ముఖ్యమైన పనుందని వారితో వెళ్ళ లేదు.

పిల్లలు బయలుదేరి వెళ్ళాక కపర్ధి ఆఫీస్ మీటింగ్ ఉన్నదని బయటికి వెళ్ళాడు. గౌరి వంట పనిలో పడింది. అరగంట గడిచిందో, లేదో ఇంట్లో ఫోన్ గణగణా మోగింది. రిసీవర్ అందుకున్న గౌరి మొహంలో రంగులు మారుతున్నాయి. పక్కన కుర్చీలో చతికిలపడింది. అప్పుడే పక్కింటి అబ్బాయి రామకృష్ణ అమ్మ పంపిన కరివేపాకు ఇవ్వడానికి వచ్చాడు. "ఆంటీ ఏమయింది" అని ఆదుర్దాగా అడుగుతూ ఫోన్ అందుకున్నాడు.

వార్త విని పరుగున ఇంటికెళ్ళి తన తండ్రికి విషయం చెప్పి అంకుల్ ని పిలుచుకు రావటానికి ఆఫీస్ కి వెళ్ళాడు. ఆ టైంలో ఆఫీస్ కి తన కోసం వచ్చిన రామకృష్ణని చూసి ఆశ్చర్యపోయి జరిగింది తెలుసుకుని, వారు తెచ్చిన కార్లోనే బయలుదేరి కపర్ధి సంఘటనా స్థలానికి వెళ్ళాడు.

***

కపర్ధి కొడుకు వాళ్ళు ఎక్కిన ఇన్నోవా డ్రైవర్, ఎదురొచ్చిన లారీని తప్పించబోయి, సడెన్ బ్రేక్ వేసేసరికి దాని వెనకాల ఉన్న మరో రెండు వెహికిల్స్ అన్నీ ఒక దాని మీదికి ఒకటి ఎక్కి తిరగబడ్డాయి.

కార్ అంత స్పీడ్ లో వెళుతున్నందువల్ల, అందులో ప్రయాణిస్తున్న కపర్ధి పిల్లలందరూ మాంసపు ముద్దలయ్యారు. శవాలయి చెల్లాచెదురుగా రోడ్డు మీద పడ్డారు. ఆ కార్లల్లో ఎవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు.

అక్కడి లాంఛనాలు పూర్తి అయ్యాక.. సతీదేవి శవాన్ని, భుజాన మోసుకొచ్చిన పరమశివుడు లాగా ఇంటిల్లిపాది శవాలు తీసుకుని.. ఆఫీస్ కొలీగ్స్ తో కలిసి ఇంటికొచ్చాడు కపర్ధి. ఉదయంనుంచి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయి చేష్టలుడిగి కుర్చీలో కూర్చున్న గౌరిని ఎలా ఓదార్చాలో కపర్ధికి అర్ధం కాలేదు. ఎంతయినా కని పెంచిన తల్లి!

తల్లిదండ్రులతో కలిసి పండుగ జరుపుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన కొడుకు కుటుంబం, తమ్ముడి కుటుంబంతో సరదాగా గడపడానికి వచ్చిన కూతురి కుటుంబం.. అందరివి సామూహిక దహనాలు జరిపించ వలసి వచ్చిన కపర్ధి షాక్ లోంచి బయట పడలేక పోతున్నాడు. జరిగింది తలచుకుంటుంటే.. ఇది కలేమో.. తన పిల్లలు ఏ పక్కనించో వస్తారు అనే భ్రమ కలుగుతున్నది. భార్యని చూసి తన దు:ఖాన్ని పైకి కనపడనీయకుండా దిగమింగుకుని మౌనాన్ని ఆశ్రయించాడు. గౌరిని ఊరుకోబెట్టటం ఎవరి తరం కావట్లేదు. భార్యాభర్తలు ఒకరినొకరు తప్పించుకు తిరుగుతున్నారు.

అప్పుడప్పుడు దేవుడిని "అసలు నీకు పూజ ఎందుకు చెయ్యాలి? ఇంక నాకు ఈ భూమి మీద ఏం మిగిలింది? ఎందుకు స్వామీ నన్ను మాత్రం తీసుకుపోకుండా వదిలేశావ్? ఈ దు:ఖాన్ని భరించమనా?" అని ప్రశ్నించేవాడు. అప్పటి నుంచి కపర్ధి, గౌరి జీవచ్ఛవాల్లా బ్రతుకులు ఈడుస్తున్నారు.

***

లుంబినీ పార్క్ దగ్గరనుంచి తీసుకొచ్చిన పిల్లవాడి కోసం ఎవ్వరూ వాకబు చెయ్యకపోయే సరికి, ముందు పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇద్దామనుకున్నాడు. కానీ దేవుడి లీలలు ఎంత చిత్రమో! తన స్వంతం అనుకున్న వారు ఎవ్వరినీ మిగల్చకుండా తీసుకెళ్ళిపోయి, ఎవరో ముక్కూ మొహం తెలియని వాడిని తెచ్చి జత చేశాడు!

ఇందులో ఏ పరమార్ధముందో అనుకున్న ఆ దంపతులు, ఆ పిల్లవాడిని పెంచుకోవాలని నిర్ణయించుకుని, బ్రతికున్న తమ పెద్ద అల్లుడిని సంప్రదించారు. "ఈ వయసులో ఇంత చిన్న పిల్లవాడిని పెంచటమనే పెద్ద బాధ్యత నెత్తికెత్తుకోగలరా మామయ్యా? ఒక్క సారి ఆలోచించండి" అన్నాడు.

"వీడికి మేమో, మాకు వాడో ఋణపడి ఉంటాం అనిపిస్తున్నది. ఇది దైవనిర్ణయంగా భావించి భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా, దత్తత చేసుకుంటాం" అన్నారు.

డాక్టర్ సర్టిఫికెట్ తో షుమారుగా వయసు వేసి, బర్త్ సర్టిఫికెట్ తీసుకుని, వాడికి "కార్తీక్" అనే పేరు పెట్టి ఇంటికి దగ్గరలో స్కూల్లో వేశారు. వాడితో మళ్ళీ వీరి జీవితంలో సందడి మొదలైంది.

***

మొదట్లో నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ‘అమ్మ కావాలి’ అని హఠం చేసేవాడు. ఎంతకీ ఏడుపు ఆపేవాడు కాదు. ఏనాటి ఋణమో.. ఓపిగ్గా పక్కన పడుకోబెట్టుకుని కబుర్లు చెబుతూ పాటలు పాడుతూ నిద్ర పుచ్చేవారు కపర్ధి దంపతులు.

స్కూల్ కి వెళ్ళటం మొదలయ్యాక, వాడి మనసులో ఆ భయంకరమైన సంఘటన తాలూకు జ్ఞాపకాలు మరుగున పడటం మొదలయ్యింది. ఎప్పుడైనా లుంబిని పార్క్ దారిలో వెళ్లడం జరిగితే, భయంగా కళ్ళు పెద్దవి చేసి చూసేవాడు.

పదేళ్ళ కాలం గడిచింది. కార్తీక్ టెంత్ క్లాస్ లోకొచ్చాడు. ఒక రోజు కపర్ధి వాళ్ళ ఇంటికి పని మీద పరిచయస్థుడు, దూరపు చుట్టం, గోపాల్ వచ్చాడు. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన కార్తీక్ ని చూసి ఆశ్చర్యపోయి "ఈ అబ్బాయి..” అని సందేహంగా మొహం పెట్టాడు.

కపర్ధి వాళ్ళ ఇంట్లో జరిగిన ఘోరమైన సంఘటన.. కుటుంబ సభ్యులందరు ఆహుతై పోవడం గోపాల్ కి తెలుసు. ఆ వయసు పిల్లలు ఆ ఇంట్లో లేరనీ తెలుసు. అందుకే ఆశ్చర్యంగా చూస్తున్న గోపాల్ తో బాంబ్ బ్లాస్ట్ సంఘటన, తన వారు కనిపించక బిక్కు బిక్కు మంటున్న పిల్లవాడిని తను తీసుకురావటం గురించి కపర్ధి చెప్పగానే గోపాల్

"సర్, మీరు పోలీస్ స్టేషన్లో ఈ పిల్లవాడి గురించి కంప్లెయింట్ ఇవ్వలేదా?" అనడిగాడు.

"మా ఇంట్లో జరిగిన ఘోర ప్రమాదం గురించి మీకు తెలుసు కదా! అది అంత తేలికగా మరవగలిగినది కాదు. రోజూ దేవుడిని నిందించేవాడిని. నన్ను తీసుకు పొమ్మని వేడుకునే వాడిని. ఇంతలో తలవని తలంపుగా జరిగిన మరో ఘోర ప్రమాదంలో వీడు మా దగ్గరకు చేరాడు. ఆ రోజు నా పిల్లలు కూడా ఇలాంటి దిక్కులేని స్థితే అనుభవించి ఉంటారు! అంతా దైవ ఘటనగా భావించాము” అని కపర్ధి చెబుతుండగా సత్తిరాజు వేణుమాధవ్ పాడిన,

"దైవమిచ్చినా వరమే జీవితమూ

దాన్ని అనుభవించు మోదంతో అనుదినము

.. ..

విశ్వమంత విశ్వంభర లీలా విలాసమే

పరవశంతొ పరమాత్మకు ప్రణమిల్లుటె జీవితము

బాధలు వ్యాధులు తరగని వ్యధలు

పరమాత్ముని దరి జేర్చే పరమౌషధాలు

లోయ వలననే శిఖరము సాధ్యము

వేసవిలేని వర్షము అసాధ్యము

ద్వంద్వ ఇటుకల సౌధమీ భువనము

సుఖ దు:ఖ యుగళ గానమీ జీవనము //దైవ//"

చెవిన పడింది. ఈ పాటలో చెప్పినట్టే, మన ప్రమేయం లేకుండానే అనేక సంఘటనలు మన జీవితాల్లో జరుగుతాయని మాకు దీనితో అర్ధమయింది.

అందరం "విశ్వదర్శకుని" చేతిలో పాత్రలం అనిపించింది.

"ముళ్ళు లేని గులాబీలు పూయునా

రేయి లేని ఉదయాన్నూహింతువా

కష్టమే ఇష్టమను భావన రానీయవోయ్

విషాదమే వినోదమౌ వింతను గమనించవోయ్

జీవితమొక దివ్య జగన్నాటకము

విశ్వ దర్శకుని చేతిలోని పాత్రలము అందరము //దైవ//


అంతర్యామి అందించిన అక్షయ పాత్ర జీవితము

ప్రేమ భరిత జీవనము అంతిమ యాత్ర లక్ష్యము

సహజమౌ జీవనమే ఆధ్యాత్మిక తత్వము

అనంతుని అందుకునే అద్భుత సోపానము

వేణు మాధవుని పాద రేణువై

ఒరిగి కరిగి రాలిపోవుటే జీవితము //దైవ// "


ఈ పిల్లవాడిని పెంచమని మాకు దైవాజ్ఞ అయిందని భావించాము.

లేకపోతే పిల్లలని పోగొట్టుకున్న మాకు ఆసరాగా ఉండమని, తల్లిదండ్రులని పోగొట్టుకున్న ఈ పిల్ల వాడిని దగ్గరకి చేర్చాడంటే ఏమర్ధం చేసుకోవాలి అన్నాడు కపర్ధి.


లుంబిని పార్కులో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన తన అన్న-వదినల కొడుకు, వారితోనే చనిపోయాడేమో అని ఇన్నాళ్ళూ గోపాల్ కుటుంబం సభ్యులు అనుకుంటున్నారు. జరిగింది వారి నోటి నుంచి విన్నాక, వాడు "కార్తీక్" గా వీరింటికి చేరడం నిజంగా దైవసంకల్పంగా భావించాడు గోపాల్. వాస్తవం వారికి చెప్పి మరోసారి వారికి అన్యాయం జరగకూడదని భావించి, మనసులోనే వాడిని ఆశీర్వదించాడు. ఆ విషయాన్ని తన వారితో పంచుకోవటానికి ఆనందంతో వెళ్ళాడు.

***

బెంగళూరు ఐ ఐ ఎస్ సి లో "కార్తీక్" పి హెచ్ డి ప్రదానం కార్యక్రమంలో అక్కడి ప్రొఫెసర్స్ అతని తెలివి తేటలని పొగుడుతూ ‘అతన్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు’ అనే సరికి కపర్ధి దంపతులు, కొడుకు వృద్ధి చూడలేకపోయిన అతని తల్లిదండ్రులని తలచుకుని ఒక్క క్షణం మూగపోయారు.

కార్తీక్.. కపర్ధ, గౌరిలను వేదిక మీదికి పిలిచి తన తల్లిదండ్రులని అందరికీ పరిచయం చేసి పాదాభివందనం చేసేసరికి, అతని చిన్నతనం తలచుకుని గౌరికి కళ్ళు నీటితో నిండిపోయి చూపు ఆనలేదు.

ఆ రాత్రి హోటల్ రూం కి తిరిగి వచ్చిన కపర్ధికి హృదయం బరువెక్కింది. ఉద్వేగం తట్టుకోలేక కుర్చీలో అచేతనంగా అయిపోయిన తండ్రిని వెంటనే మంచం మీదికి చేర్చి తనకి తెలిసిన డాక్టర్ కోసం ఫోన్ చేశాడు.

డాక్టర్ వచ్చి చూసి "పెద్ద వయసు వల్ల వచ్చిన అలసట! కంగారేం లేదు. ఆయన ఏదో మానసికంగా ఉద్వేగ పడినందువల్ల కాసేపు అచేతనంగా అయ్యారు" అని చెప్పి మందిచ్చి వెళ్ళాడు.

రెండు రోజులు రెస్ట్ తీసుకుని కపర్ధి దంపతులు బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు. కార్తీక్ తన పెళ్లి బాధ్యత తల్లిదండ్రుల మీద పెట్టాడు. ఒకరిద్దరు అతను వీరికి దత్త పుత్రుడు అని, అతని నేపథ్యం తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఆ అవకాశం కార్తీక్ ఎవ్వరికీ ఇవ్వదల్చుకోలేదు. తనని బేషరతుగా అంగీకరించే సంబంధమే చూడమని తల్లిదండ్రులకి ఖచ్చితంగా చెప్పి నిర్ణయం వారికే వదిలేశాడు.

తమ బంధువర్గంలో మంచి పిల్లగా మార్కులు పొందిన వల్లితో పెళ్ళి జరిపించిన కపర్ధి దంపతులు, భగవంతుడు తమకి అప్పగించిన బాధ్యత నెరవేర్చామని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఒకనాడు ఉదయం పేపర్ చదువుతూ.. ఊపిరి బరువయి, గొంతుకడ్డంపడి కపర్ధి నెమ్మదిగా కుర్చీలో తల వాల్చేశాడు. కాఫీ ఇవ్వటానికి వచ్చిన గౌరి భర్త పరిస్థితి చూసి కొడుకుని కేకేసి, పక్కన చతికిలపడింది.

కార్తీక్, వల్లి సాయంతో ఆయన్ని చాప మీదికి చేర్చి, కపర్ధి గారి పెద్ద అల్లుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతను వస్తూనే, అంత్య క్రియల ఏర్పాట్లలో పడ్డాడు.

చూడటానికి వచ్చిన వారు, "కన్న కొడుకుని కారు ప్రమాదంలో పోగొట్టుకున్న ఆయనకి అంత్య క్రియలు శాస్త్రోక్తంగా జరిపించటానికి భగవంతుడు కార్తీక్ ని ఆయన దగ్గరకి చేర్చాడు. ఆయన జీవితంలో జరిగిన నాటకీయ సంఘటనల "పరమార్ధం" ఇదేనేమో! అదృష్టవంతుడు, ఆత్మకి తప్పక శాంతి లభిస్తుంది" అనుకుని, కపర్ధికి చివరగా నమస్కరించి తమ నివాళి తెలియచేశారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


నా గురించిన పరిచయం:

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ

సెలవు

ఎం బిందుమాధవి

96 views0 comments
bottom of page