top of page
Original.png

ఎవరిది అదృష్టం???

13 minutes ago
3 min read

అదృష్ట దేవత, దురదృష్ట దేవతల మధ్య అయోమయంలో నిలిచిన స్త్రీ – ఎవరిది అదృష్టం కథ

Yevaridi Adrustam??? - Telugu Moral Story | A. Sandhyarani Siripragada

ఎవరిది అదృష్టం??? - తెలుగు నీతి కథ | ఏ. సంధ్యారాణి సిరిప్రగడ

Published in manatelugukathalu.com on 27/11/2026


అదృష్టం కోసం ఎదురుచూస్తూ దురదృష్టంతోనే జీవించడం నేర్చుకున్న ఓ స్త్రీ జీవితంలోకి ఒక్కరోజు అదృష్ట దేవత వస్తుంది. కానీ ఆమె కోరుకున్న కోరికే చివరికి అదృష్టం–దురదృష్టం తలరాతలను తలకిందులు చేస్తుంది.


ఒక స్త్రీ ఇంట్లో ఎప్పుడూ దురదృష్టం తాండవిస్తూ ఉండేది. అందుకు ఆమె ఎక్కువగా దుఃఖిస్తూ ఉండేది. 


అదృష్ట దేవత కోసం ప్రార్థించేది! కానీ దురదృష్ట దేవతని వెళ్లగొట్టలేకపోయింది. అలా ఏడుస్తూనే ఆ దురదృష్టంలో తనని తాను సర్దుకుని, ఆ దురదృష్టాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. 


దురదృష్ట దేవతని బాగా చూసుకోవడం వల్ల ఆమెకు కూడా వెళ్లాలనిపించలేదు. అలా అలా ఈ విషయం అదృష్ట దేవతకి తెలిసి.. "దురదృష్ట దేవతనే ఇంత బాగా చూసుకుంటే నన్నెంత బాగా చూస్తుందో" అని అనుకుంది, ఆశ్చర్యపోయింది. 


కొంచెం ఈర్ష్య కూడా కలిగింది. ఎలాగైనా ఆ స్త్రీ ఇంట్లోకి వెళ్లాలని అనుకుంది. కానీ దురదృష్ట దేవత ఉన్న ఇంట్లోకి ఎలా వెళ్లడం? ఆమె బయటికి వస్తే కానీ వెళ్లలేని పరిస్థితి.


ఇక ఆ స్త్రీ అదృష్టం గురించి మర్చేపోయింది. రాదనీ, తనకా రాత లేదని నమ్ముతూ దురదృష్ట దేవతని పూజిస్తూ జీవితం సంతోషంగా వెళ్లదీస్తోంది. కానీ అదృష్ట దేవతకి వెళ్లి చూడాలని అనిపించింది. 


వెళ్లడానికి ప్రయత్నించింది కానీ దురదృష్టం అడ్డుకుంది. ఏం చేయాలో తెలీక బతిమాలుకుంది. "ఒక్క రోజుకైనా వెళ్లు, తరువాత నేను వెళ్లిపోతా, నువ్వు మళ్లీ వద్దువుగాని" అని ఒప్పందం కుదుర్చుకుంది. 


సరే అని దురదృష్ట దేవత బయటికి వచ్చింది. ఒక్కసారిగా జరిగిన మార్పుకి ఆ స్త్రీకి ఏమీ అర్థం కాలేదు. ఎంతో కాలంగా కోరుకున్న అదృష్ట దేవత కదిలి వచ్చింది. ఎలా చూసుకోవాలో తెలియలేదు. అయోమయంలో ఆనందం కూడా అనుభవించలేకపోయింది.


తికమకపడింది, ఉబ్బితబ్బిబ్బయింది, నివ్వెరపోయింది. అంతలో అదృష్ట దేవత, "నీకేం కావాలో కోరుకో. 


ఈ ఒక్క రోజే నేను నీతో ఉంటా, అందుకే బాగా ఆలోచించుకుని అడుగు" అంది. దానికి ఆ స్త్రీ మౌనంగా అయోమయంగా చూసింది, నోట మాట రావడం లేదు మరి. 


అదృష్ట దేవత విషయం అర్థం చేసుకుని, "సరే నువ్వు సంతోషంలో ఏమీ చెప్పలేకపోతున్నావు కాబట్టి, నీకు నీవు మదిలో నన్ను భక్తితో తలుచుకుని ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరాలని ఆశీర్వదిస్తున్నా. 


తథాస్తు!" అంది. అంతే!! ఒక్కసారిగా అదృష్ట దేవత రూపు మొత్తం మారిపోయింది. గుమ్మం ముందు పగలబడి నవ్వుతూ అచ్చంగా అదృష్ట దేవత లాగే కనిపిస్తూ వెక్కిరిస్తోంది దురదృష్ట దేవత. లోపలున్న ఆ స్త్రీకి, అదృష్ట దేవతకి ఏమీ అర్థం కాలేదు. 


అప్పుడు గుమ్మం బయట అదృష్ట రూపంలో ఉన్న దురదృష్ట దేవత ఇలా చెప్పింది: "ఓ అదృష్ట దేవతా! ఇక ఈ రోజు నుంచి నేను అదృష్ట దేవతను, నువ్వు దురదృష్ట దేవతవు. నీకు ఈ స్త్రీ నివాసం ఇక శాశ్వతం. 


నీవు తీసుకున్న గోతిలో నీవే పడ్డావు, అనుభవించు" అని పలికి అదృశ్యమయింది.


ఒక్కసారిగా ఒళ్లు జల్లుమని ఇద్దరికీ మతిపోయింది. కాస్తలో తేరుకుని, ఇంట్లో ఉన్న దురదృష్ట దేవతగా మారిన అదృష్ట దేవత ఆ స్త్రీని అడిగింది: "తల్లీ నువ్వేం కోరుకున్నావు? ఈ విపత్కర పరిస్థితి ఏమిటి??? నా అదృష్టాన్నే మార్చేంతగా, మా ఇద్దరి తలరాతలు తలకిందులుగా చేసినంతగా నువ్వు ఏం కోరుకున్నావు???" అని అడిగింది. 


అప్పుడు ఆ స్త్రీ ఏడుస్తూ.. "నన్ను క్షమించు తల్లీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎప్పటి నుంచో కోరుకున్న అదృష్టం నన్ను వరించింది అని, ఆ అదృష్టం శాశ్వతం కావాలని, మదిలో ఇలా భక్తితో స్మరించుకున్నా... 


'ఓ అదృష్ట దేవతా! నీవు అచ్చంగా మా ఇంట్లో దురదృష్ట దేవత ఎలా నివసించిందో అలాగే శాశ్వతంగా మా ఇంట నిలిచిపో.. 


నా ఇల్లు వదిలిపోయిన దురదృష్ట దేవత అచ్చంగా నీ లాగే శాశ్వతముగా బయట ఉండిపోనీ..'


అని కోరుకున్నా! అంతే" అంది. పాపం దురదృష్ట దేవతగా మారిన అదృష్ట దేవత బిక్కమొహం వేసుకుని, తను ఆ స్త్రీ తలరాత మార్చాలనుకుంటే ఆ స్త్రీ తన తలరాతను మార్చేసింది అని ఏడుస్తూ కూర్చుంది.


ఒక అమాయకత్వం.. ఒక ఆశ.. ఒక ఈర్ష్య.. ఇదే స్టోరీ..!!! ఇక కథ కంచికి మనం ఇంటికి!!!


- సమాప్తం -

***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


ఏ. సంధ్యారాణి సిరిప్రగడ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





ఏ. సంధ్యారాణి సిరిప్రగడ

నా పేరు ఏ. సంధ్యారాణి సిరిప్రగడ.


నేను చదువుకుంది బీకాం., ఎంబీఏ., ఎల్ఎల్ బి.

ఇంజనీరింగ్, ఎంబీఏ, & ఎంసీఏ కాలేజిలలో అసోసియేట్ ప్రోఫేసర్‌గా చేశాను. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశాను. మాసపత్రికలు, ఆన్లైన్ పత్రికలు, వేరువేరు పోటీల కోసం, సామాజిక మాధ్యమాల గ్రూపుల కోసం ఇప్పటివరకు మొత్తం దాదాపు 40 కథలు, 20 కవితలు వ్రాసాను. 2011 నుంచీ 2014 వరకు ఆంధ్రభూమి దినపత్రికలో 'రాణి సంధ్య' పేరుతో 18 వ్యాసాలు అచ్చయ్యాయి.  2025లో జెవి పబ్లికేషన్స్ వారి 'ధీర' పుస్తకంలో నావి నాలుగు కథలు అచ్చయ్యాయి. వివిద పోటీలలో ప్రథమ, ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాను. ఒక పోటీ కోసం మినీ నవల కూడా వ్రాసాను. నవల వ్రాయాలని కోరిక ఉంది. కథలు, కవితలు, వ్యాసాలు వ్రాయడమే కాకుండా నాకు పాటలు పాడడం, చిత్రలేఖనం చాలా ఇష్టం. నా స్వస్థలం, నివాసం హైదరాబాదు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page