దేముడిచ్చిన పాపబొమ్మ

Devudichina Papabomma - Telugu Mythological Story | C. V. S. Mahalakshmi
దేముడిచ్చిన పాపబొమ్మ - తెలుగు పౌరాణిక కథ| C. V. S. మహాలక్ష్మి
Published in manatelugukathalu.com on 27/11/2026
స్వాభిమానం, భక్తి, దైవానుగ్రహం కలిసిన అద్భుతమైన తెలుగు జానపద కథ “దేవుడిచ్చిన పాపబొమ్మ”. సువర్చల జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాలు, నారాయణుడి మహిమ ఈ కథకు ప్రత్యేక ఆకర్షణ.
అంగ రాజ్యాధీశుడైన వీరసేనుడికి పుత్ర సంతానం లేదు. అందరూ ఆడపిల్లలే. ప్రతి రాత్రీ పిల్లలతో కబుర్లు చెబుతూ రాజ్యపాలన వ్యవహారశైలి తెలుపుతూ వారిలో ఎంతో ధైర్యం పెంచుతూ ఉంటారు.
ఒకనాటి పున్నమి రాత్రి కుమార్తెలందరినీ ఉద్దేశించి తండ్రి ఇలా అడుగుతాడు: "అమ్మా! మీరు జీవితాంతం ఎవరి సొమ్ము తిని జీవిస్తారు?" అది విన్న కుమార్తెలందరూ "మీ సొమ్మే తింటాము" అని బదులు ఇస్తారు.
రాజుగారు చాలా సంతోషపడతాడు. కానీ ఇంతలోనే రాజుగారి గారాల పట్టి అయిన ఆఖరి కుమార్తె సువర్చల నవ్వుతూ, "నాన్నగారూ! మీరు మహారాజు, అన్నీ తెలిసినవారు. అంతేకాక ఎంతో తెలివైనవారు.
మీకు చెప్పేంతదాన్ని కాను కానీ మేము మీకు పుత్రులము కాదు కదా! జీవితాంతం మీ సొమ్ము తినలేము కదా! వివాహం జరిగే వరకూ మాత్రమే మీ సొమ్ము తింటాం. వివాహం అనంతరం మా భర్త సొమ్ముతో జీవిస్తాం" అని చెబుతుంది.
అది విని రాజు నిశ్శబ్దంగా వెళ్లిపోతాడు. కానీ కోపంతో లోలోపల రగిలిపోతూ ఉంటాడు.
బాగా ఆలోచించి ఒకనాడు సువర్చలను అడవికి వేటకని చెప్పి తీసుకుని వెళ్లి, బెల్లం, శనగపప్పు కలిపి ఉడికించి ఎరగా పెట్టి ఒక ఎలుగుబంటిని పట్టుకుని దానితో సువర్చల వివాహం జరిపించి అడవిలో వదిలేసి వస్తూ "ఇప్పుడు నీ భర్త సొమ్ముతో ఎలా బతుకుతావో బతికి చూపించు" అని తిరిగి రాజ్యానికి వెళ్లిపోతాడు.
సువర్చల ఎలుగుబంటితో పాటు దాని వెనుక పరుగులు తీస్తూ అలసిపోయి ఒక చెట్టుకు దానిని కట్టి పక్కనే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది.
ఆమె నిద్రలో ఉండగా ఎలుగుబంటి తాడు తెంచుకుని అడవిలోకి పారిపోతుంది. నిద్ర లేచిన సువర్చల తన భర్త అయిన ఎలుగుబంటి కోసం వెతుకుతూ వెళుతుంటే ఒకచోట బాటసారుల గుంపు కనబడింది.
వారు ఈమెను చూసి, "ఎవరివమ్మా? ఇలా అడవిలో ఎందుకు తిరుగుతూ ఉన్నావు?" అని అడిగి, "ఏదైనా సహాయం కావాలంటే చేస్తాం, చెప్పమంటారు."
దానికి సువర్చల తన వివాహం, తన భర్త తప్పిపోయిన వివరాలు చెప్పి ఎలుగుబంటి కోసం మరలా బెల్లం, శనగపప్పు ఉడికించి కాపుకాసి పట్టుకోవడానికి సహాయం చేయమని వారిని కోరింది.
గుంపులో పెద్ద వయసు గల భూపతి "నీ తండ్రి లాంటి వాడిని, తప్పక సహాయం చేస్తాము" అని చెప్పి ఎలాగో వారం రోజులు కాపుకాసి ఎలుగుబంటిని పట్టుకుని సువర్చలకు అప్పగించారు.
అంతేకాక తమతో పాటు తీసుకుని వెళ్లి తమ ఊరిలో ధర్మసత్రంలో నివాసం ఏర్పరిచి ధనసహాయం చేస్తానంటే సువర్చల నిరాకరించి, "అయ్యా! మీ సహాయం మరువలేనిది.
నా భర్తను నాకు అప్పగించారు. నేను నా భర్త సంపాదనతో మాత్రమే జీవిస్తాను" అని చెప్పింది.
ధర్మసత్రంలో కటకటాలకి గొలుసు వేసి ఎలుగుబంటిని కట్టి ఉంచి దానికి ఎంతో కష్టపడి చేయి ముందుకు చాపి "నారాయణ నాలుగు రూపాయలు ధర్మం చేయండి" అని ఒకే ఒక వాక్యం నేర్పించినది.
అలా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎలుగుబంటి చేతిలో ఎన్ని రూపాయలు ధర్మాత్ములు వేస్తారో అదే తను రాత్రి తీసుకుని దానినే భర్త సంపాదనగా స్వీకరించి జీవిస్తోంది.
సత్రంలో ఇంకా ఊరిలో ఉన్న పోకిరీవారు ఒకనాటి రాత్రి రాజకుమార్తెను చూసి ఎలాగైనా బయటికి రప్పించాలని తలచి ఆ ఎలుగుబంటి గొలుసును తెంపి వదిలేస్తారు.
ఆనాటి నుండి రాత్రి కూడా బయటికి రాకుండా అలా గదిలోనే దైవ ధ్యానం చేస్తూ ఉండిపోతుంది.
వీరు వదిలేసిన ఎలుగుబంటి "నారాయణ నాలుగు రూపాయలు ధర్మం చేయండి" అని అలా అనుకుంటూ అడవిలో పరుగులు తీస్తోంది.
నారాయణ మంత్ర జపం విని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి ఎలుగుబంటిని మనిషిగా మార్చి, "నీకు వివాహం అయింది. నీ కోసం నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది.
ఎలాగైనా వెతుక్కుంటూ వెళ్లి కలుసుకో" అని చెప్పి, "నీకు ఆకలి వేసి భోజనం కావాలంటే ఎవరినీ అడగకు. నీకు ఒక పాప బొమ్మ ఇస్తున్నాను.
నీకు ఆకలైనప్పుడు కాళ్లు చేతులు కడుక్కొని ఆకు వేసుకుని ఈ బొమ్మకు నమస్కరించి 'బొమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా' అని అడిగితే చాలు.
పంచభక్ష్య పరమాన్నాలతో ఈ బొమ్మే నీకు భోజనం పెడుతుంది. ఈ రోజు నుంచి నీ పేరు విష్ణుశర్మ" అని చెప్పి స్వామి మాయమైపోయాడు.
విష్ణుశర్మ నెమ్మదిగా నడుచుకుంటూ పక్కన ఉన్న ఊరిలోకి పోయి ఆకలి అలసట వలన ఒక ఇంటి అరుగుమీద సేదతీరుతూ ఉంటాడు.
అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు చూసి ఏమి కావాలని అడిగితే, "ఒక ఆకు, ఒక చెంబుతో నీరు ఇవ్వండి చాలు. మీ అరుగుపై భోజనం చేసి వెళ్లిపోతాను" అంటాడు.
సరేనని ఆ ఇల్లాలు నీరు, ఆకు ఇచ్చి భోజనం ఎలా చేస్తాడా అని లోపలనుంచి గమనించడం మొదలుపెట్టింది.
శర్మ తనవద్ద ఉన్న స్వామి ఇచ్చిన పాపబొమ్మను తీసి ఆకు వద్ద ఉంచి "బొమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా" అని అడుగుతాడు. బొమ్మ అన్నీ వడ్డించడం, శర్మ తినడం చూసిన ఇల్లాలికి ఆ పాపబొమ్మపై ఆశ కలిగింది.
నెమ్మదిగా విష్ణుశర్మ దగ్గరకు పోయి, "బాబూ! నీకు నా వద్ద నున్న మహిమగల చేతికర్ర ఇస్తాను. ఆ కర్ర నీవు ఎవరి దగ్గర ఉన్న వస్తువును కోరినా వారిని కొట్టి వెంటనే నీకు తెచ్చి ఇస్తుంది. ఆ కర్రని నీకు ఇస్తాను. ఆ పాపబొమ్మని నాకు ఇవ్వగలవా?" అంటుంది. శర్మ బాగా ఆలోచించి సరేనని చెప్పి చేతికర్ర తీసుకుని బొమ్మనిచ్చేసి వెళ్లిపోతాడు.
మరునాడు వరకూ అలా ప్రయాణం చేస్తూ వేరే ఊరిలో ఆకలి అనిపించి ఒక సత్రంలో కూర్చుని అన్నం తిందామని ఆకు, నీరు పెట్టుకుని బొమ్మ లేదని గుర్తుకొచ్చి వెంటనే ఆ ఊరిలో అమ్మ ఇచ్చిన చేతికర్రతో "ఓ నా కర్రా! ఆ అమ్మని కొట్టి నా పాపబొమ్మని తెచ్చిపెట్టు" అని ప్రార్థిస్తాడు.
వెంటనే కర్ర మాయమై కర్రతో పాటు బొమ్మ కూడా ప్రత్యక్షమయింది. బొమ్మ పెట్టిన అన్నం తిని కర్రను, బొమ్మను జాగ్రత్తగా సంచిలో దాచుకుని కాసేపు నిద్రపోయి లేచి మళ్లీ ప్రయాణం సాగిస్తాడు. తను నిద్రలో ఉండగా సత్రం యజమాని పాపబొమ్మను తీసుకోవడం విష్ణుశర్మ గమనించడు.
మరునాడు వేరే ఊరిలో కూడా ఒక షాహుకారు కొట్టు దగ్గర కూర్చుని ఇలాగే ఆకు, నీరు పెట్టుకుని బొమ్మ లేదని గమనించి చేతికర్రను పంపి బొమ్మను తెప్పించుకుని హాయిగా అన్నం తింటాడు.
అది చూసిన షాహుకారు, "అబ్బాయీ! నా కొట్టు అరుగుపై భోజనం చేశావు కదా! దానికిగాను నీ వద్ద ఉన్న బొమ్మను నాకు ఇవ్వు. దాని బదులుగా నీకు ఒక కాగితం, కలం ఇస్తాను.
ఆ కాగితంపై అదే కలంతో నీవు ఇంటి ప్లాను గీసి నేలపై ఉంచితే అలాంటి భవనమే వస్తుంది. దయచేసి బొమ్మ ఇవ్వవా?" అంటాడు. శర్మ సరే అని ఇచ్చేసి నవ్వుకుంటూ వెళ్లిపోతాడు.
మరుసటి నాడు కూడా యథాతథంగా ఆకలి వేసి కర్రను పంపి బొమ్మని తెప్పించి అన్నం తినడం ఒక ముని చూస్తాడు. ముని విష్ణుశర్మతో, "నేను చాలా కాలం తపస్సు చేసి ఒక మహిమగల చాప సంపాదించాను.
దానిమీద కూర్చుని కళ్లు మూసుకుని దైవనామస్మరణ చేస్తూ ఉంటే నీవు కోరిన ప్రదేశానికి తీసుకుని వెళుతుంది. ఆ చాప నీకు ఇస్తాను.
నీ పాపబొమ్మ నాకు ఇవ్వు" అని అడుగుతాడు. సరే అని బొమ్మ ఇచ్చేసి చాప తీసుకుని దానిపై కూర్చుని కళ్లు మూసుకుని శ్రీమన్నారాయణుని స్మరించి "నీవు చెప్పిన నా భార్య వద్దకు వెళ్లాలి" అని కోరుకుంటాడు.
స్వామి అనుగ్రహంతో ఆ చాప విష్ణుశర్మను సువర్చల ఉన్న సత్రం వద్దకు చేరుస్తుంది. రాత్రి పిలిచినా పలకదని తలచి బయట అరుగుపై నిద్రపోతాడు.
అదే రాత్రి రాజకుమారి సువర్చలకు విష్ణుమూర్తి కలలో కనపడి, "నీ భర్త విష్ణుశర్మ బయట ఉన్నాడు.
నిన్ను వివాహం చేసుకున్న ఎలుగుబంటే ఈ విష్ణుశర్మ" అని చెప్పి మాయమైపోతాడు.
ఉదయం లేచి తలుపు తీసి భర్తను చూసి ప్రశ్నించి సందేహం తీర్చుకుని లోపలకు తీసుకుని వెళుతుంది. ఆ రోజు మధ్యాహ్నం శర్మ కర్రను పంపి దేవుడిచ్చిన పాపబొమ్మను తెప్పించి తనకు, భార్యకు కూడా వడ్డించమని కోరతాడు.
తరువాత అన్నీ వివరంగా చెప్పి ఇద్దరూ మహిమగల చాపపై కూర్చుని సువర్చల తండ్రి దగ్గరకు వెళ్లాలని కోరుకుంటారు.
ఆకాశమార్గంలో పయనించి అంగరాజ్యాన్ని చేరిన సువర్చల వీరసేనుడిని కలిసి జరిగిన విషయాలు వివరించి ఇలా అంటుంది: "నాన్నగారూ! ఇప్పటికైనా నేను చెప్పిన మాట నిజమని తెలిసింది కదా! ఆడపిల్లలమైన మేము జీవితాంతం మీ సొమ్ము తిని జీవించము.
నాపై కోపంతో మీరు ఎలుగుబంటితో వివాహం చేసినా కూడా నేను నా భర్త సంపాదనతోనే జీవించాను కదా!" అని అడిగింది. దానికి రాజు "నీ మాట నిజమే తల్లీ" అని మెచ్చుకున్నాడు.
సమాప్తం.
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
C. V. S. మహాలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: C. V. S. మహాలక్ష్మి









Comments