గజేంద్ర మోక్షం
- Srinivasarao Jeedigunta

- Aug 1
- 5 min read
#GajendraMoksham, #గజేంద్రమోక్షం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguHeartTouchingStories

Gajendra Moksham - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 01/08/2025
గజేంద్ర మోక్షం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పర్వతాలరావు, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులతో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలన్న కోరిక లేకుండా, హాయిగా ఉన్న ఆస్తిని వడ్డీలకు ఇస్తూ రూపాయిని పదిరూపాయలు చేయడం నేర్చుకున్నాడు.
భార్య వెంకటలక్ష్మి, ముగ్గురు పిల్లలు, మూడు కారులు, మూడు బంగ్లాలు, నౌకర్లు—మహారాజు జీవితం అనుభవిస్తున్నాడు. ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ గౌరవం (పైకి) చూపిస్తాడు. పర్వతాలరావు చుట్టూ చుట్టాలు, స్నేహితులు, రాజకీయ నాయకులు ఒక్కరేమిటి అందరూ ఆయన వైపే.పర్వతాలరావు లోభి కాదు. అలా అని కర్ణుడూ కాదు. అంతో ఇంతో అవసరం అయినవాళ్లకి సహాయం చేసి “ఆహా! పర్వతాలరావు గారు” అని అనిపించుకునేవాడు. పిల్లలు కూడా తండ్రితో శక్తంగా ఉండి, తండ్రి నుంచి తమ సరదాలు తీర్చుకోవడానికి అవసరమైన సొమ్ము సంపాదించేవారు.
అంత ధనవంతుడు అయినా, పిల్లలు పాడయిపోకుండా ఉండే విధంగా కఠినమైన ఆంక్షలు పెట్టి, తనకు తెలియకుండా ఒక్క రూపాయి బయటకు వెళ్లకుండా చూసుకునేవాడు.
"నాన్నా, మీ నాన్న ఎంతో ఆస్తి సంపాదించి మీకు ఇచ్చారు కదా. అందుకే కష్టం తెలియకుండా మీరు సుఖంగా ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు చదువుకోమంటారు? మంచి మార్కులు రాకపోతే బెల్ట్ ఎందుకు వాడుతున్నారు? మీ దగ్గర ఉన్న డబ్బులు మేము సుఖంగా ఉండటానికి చాలు కదా?” అని కొడుకులు అడిగిన ప్రశ్నకు, పర్వతాలరావు నవ్వుతూ—“మా నాన్నకి నేను ఒక్కడినే కొడుకుని. ఆస్తి అంతా నాకు వచ్చింది. మరి నాకు ముగ్గురు... మీ ముగ్గురు మరొక ముగ్గురిని కంటే, ఆస్తి పల్చనైపోతుంది. కొండంత ఆస్తి ఉన్నా, చదువులో డిగ్రీ లేకపోతే మనకి దక్కేది నిజమైన గౌరవం కాదు, మెచ్చుకొలు కోసం మాట్లాడేవి మాత్రమే.
మీకు రూపాయిని సగం చేయడం తెలుసు, తప్పా పదిరూపాయలు చేయడం రాదు. అందుకే చదువుకుని ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకుంటే, చన్నీళ్లకు వెన్నీళ్లలా నా ఆస్తి పనికివస్తుంది,” అన్నాడు.
“అబ్బా! ఎంత ముందుచూపు నాన్నా. తాతయ్య నిన్ను చదివించలేదో, నువ్వు చదవలేదో గాని, చదివి ఉంటే ఈ దేశం మొత్తానికి నువ్వే ధనవంతుడవయ్యేవాడివి,” అన్నాడు పెద్ద కొడుకు.
పిల్లలకి చదువులు పూర్తి అయ్యాయి, ఉద్యోగాలు రాగానే తనకి తెలిసిన బీదకుటుంబం లోనుండి పిల్లలు ని సెలెక్ట్ చేసి ముగ్గురు కొడుకులకి పెళ్లిచేసాడు.
“అదేమిటండి మనము యింత ఆస్థిపరులం కదా పోయి పోయి బీదింటి ఆడపిల్లలని కోడళ్లుగా తెచ్చుకోవడం ఏమిటి అండి” అంది భార్య వెంకటలక్ష్మి.
“మనం అనకు, నేను ఆస్తిపరుడిని. మీ నాన్న నిన్ను యిచ్చి పెళ్లిచేసినప్పుడు నీకు ఏ ఆస్తి వుంది.. అయినా నీ అదృష్టం నా కృషి వల్ల బాగున్నాము. మనం కావాలంటే కోటీశ్వరుడి పిల్లలు కోడళ్లుగా వస్తారు, దానివల్ల మనకి ఇంకొంత ఆస్తులు కలుస్తాయి. కాని యిప్పుడు ముగ్గురు పేదపిల్లలకి మంచి జీవితం యిచ్చినట్టు అవుతుంది. యిహ డబ్బాంటావా, మనకి వున్నది పోకుండా ఉంటుంది అంతే” అన్నాడు.
పర్వతాలరావు ఉద్దేశ్యం మంచిదే అయినా ఆయన ముగ్గురు కొడుకులకి పేదింటి అమ్మాయిలను చేసుకోవడం వలన తాము చివరి వరకు నాన్న చేతిలో ఉండాలి అనే కోపంతో వుండేవాళ్ళు.
వొంట్లో ఓపిక వున్నంతవరకు నన్ను మించిన వాళ్ళు లేరు అనుకోవటం సహజం. పర్వతాలరావుకి విపరీతంగా జ్వరం, దానితోపాటు దగ్గు రావటంతో ఊరిలోని డాక్టర్స్ మాత్రమే కాదు రాష్ట్రంలోని డాక్టర్స్ కూడా వచ్చి చూసి అన్ని రకాల పరీక్షలు చేసి “మామూలు జ్వరం, భయపడకండి” అని చెప్పి కొన్ని మందులు యిచ్చి వెళ్లిపోయారు.
కరిచింది దోమ అనుకుని నిర్లక్ష్యం గా వుంటే అది పాము అయినట్టుగా అయ్యింది పర్వతాలరావు పరిస్థితి. రక్తం కూడా దగ్గినప్పుడు పోవడంతో ఇహ లాభం లేదు అనుకుని పెద్ద హాస్పిటల్ లో జాయిన్ చేసారు. ఎన్ని మందులు మార్చి మార్చి యిచ్చినా పర్వతాలరావుకి పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదు.
నెలలు గడుస్తున్నాయి, డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, చివరికి పర్వతాలరావు భార్య వెంకటలక్ష్మి కూడా ఆశ వదిలేసుకుంది. పిల్లల చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయి, రోజు హాస్పిటల్ కి వచ్చి పర్వతాలరావు దగ్గర వుండే వాళ్ళు వారం కి ఒకసారి, పదిరోజులుకి ఒకసారి వచ్చి ముక్కుకి మాస్క్ పెట్టుకుని చూసి వెళ్లిపోతున్నారు.
పర్వతాలరావుకి మెలుకువ వచ్చి, ఒక్కసారి గతం గుర్తు చేసుకున్నాడు. తండ్రి తనని ఎంతో గారాబం చేసి అడిగినది లేదనుకుండా యిచ్చి కష్టం అనేది తెలియకుండా పెంచడం, ఆతరువాత తన హయాంలో వడ్డీలు మీద సంపాదన తో ఆ సుఖాలే అనుభవిస్తూ తను తన కుటుంబం అనుకుని నిద్రపోకుండా ఆస్తులు సంపాదించి మూల పడితే ఎవ్వరి కోసం యింత డబ్బులు సంపాదించానో వాళ్ళు తనని చుట్టపు చూపుగా వచ్చి చూస్తో ఉండటం, పేద పిల్లలన్నీ కోడళ్లుగా తెచ్చుకుంటే వాళ్ళు తను మంచం మీద పడితే కనిపెట్టి చూసుకుంటారు అనుకుంటే, మామగారు పడే బాధ చూడలేక పోతున్నాము, ఆ దేముడు త్వరగా ముక్తి కలిగిస్తే చాలు అని అనుకోవడం విని 'ఛీ దేనికోసం ఈ జీవితం' అనుకున్నాడు.
తన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఎంతోమంది వున్నారు, ఓపిక వున్నప్పుడు నేనే వాళ్ళని రక్షిస్తున్నాను అనుకున్నాను. యిప్పుడు ప్రాణం పోయే వేళ చివరికి తెలిసింది నన్ను, వాళ్ళని రక్షిస్తున్నది ఆ భగవంతుడు అని. మనిషి వొంట్లో ఓపిక వున్నప్పుడు ఈ ప్రపంచం అంతా నేనే అనుకుంటాడు, ఒక్కసారిగా శరీరంలో శక్తి కాస్తా పోయినప్పుడు గాని నేను కాదు నువ్వు ఇన్నాళ్ళనుంచి కాపాడుతోంది అని తెలుసుకుంటాము. యిప్పుడు ప్రాధేయ పడి ఉపయోగం ఏముంది, నా డబ్బు, నాభార్య, నా పిల్లలు ఎవ్వరు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
“దేముడా! ‘పత్రం పుష్పం ఫలం తోయం’ అనేది తెలుగులో ‘ఆకు, పువ్వు, పండు, నీరు’ అని అర్థం. ఇది భగవద్గీతలో నువ్వు చెప్పిన మాటలలోని భాగం, అంటే భక్తితో దేనినైనా సమర్పించినా స్వీకరిస్తానని కదా, యిప్పుడు నా కన్నీళ్లు నీకు నీరుగా అర్పిస్తున్నాను, నన్ను ఈ బాధ నుంచి విముక్తిడిని చెయ్యి” అని కోరుకున్నాడు.
“ఎన్నాళ్ళు అని యిలా డబ్బులు ఖర్చు చేసి హాస్పిటల్ లో ఉంచడం? ఎందుకు మీ నాన్నగారిని ఇంటికి తీసుకుని వెళ్ళండి, అక్కడే ప్రశాంతంగా వెళ్ళిపోతారు” అన్న డాక్టర్ గారి సలహాతో పర్వతాలరావుని ఇంటికి తీసుకుని వచ్చి అవుట్ హౌస్ లో ఉంచారు.
పర్వతాలరావుకి సృహ రావడం పోవడం జరుగుతోంది. సృహలోకి వచ్చినప్పుడు భార్య ని చూసి కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఆ రోజు ఉదయం పదిగంటలకు పెద్ద పెద్ద నామాలతో ఇద్దరు వృద్ధులు పర్వతాలరావు యింటి గేట్ దగ్గరికి వచ్చి నౌకర్ ని అడిగారు, సహాయం కోసం మీ యింటి యజమాని కోసం వచ్చాము అని.
“ఆయన తెలియని జబ్బుతో బాధపడుతున్నారు, యిప్పుడు ఆయన చెయ్యగల సహాయం లేదు, మిగిలిన వాళ్ళకి ఆ అలవాటు లేదు” అన్నాడు నౌకర్.
“అయ్యో పాపం, యింత దూరం వచ్చాము కదా ఒక్కసారి చూసి వెళ్తాము” అన్నారు ఆ వృద్ధులు.
“ఆయనకు వచ్చింది అంటు వ్యాధి, మేమే ఆయన దగ్గరికి వెళ్ళము మీకెందుకు అనవసరంగా” అన్నాడు.
“మేము హిమాలయాలలో వుండే వాళ్ళం, స్మశానం లో తిరిగే వాళ్ళం. మాకు అంటుకునే రోగం వుందా.. వెళ్లి చూడని” అని గేటు లోనుంచి లోపలికి వచ్చారు. వాళ్ళ మాటలో ఏదో తెలియని ఆజ్ఞలా అనిపించి “సరే అదిగో ఆ అవుట్ హౌస్ లో వున్నారు వెళ్లి త్వరగా రండి” అన్నాడు.
గదిలో పర్వతాలరావు సృహ లేకుండా పడుకుని వున్నాడు. అతనిని ఒక్కసారి తీక్షణంగా చూసి అతని నుదిటి మీద చెయ్యి వేసి నిమిరారు.
లోపలికి వెళ్లినవారు బయటకు రాకపోవడం తో నౌకర్ గేట్ దగ్గరగా వేసి భయపడుతో గది గుమ్మంలోకి వెళ్లి చూసాడు. లోపల ఎవ్వరు లేరు. గది సుగంధ సువాసనలు గుప్పున వచ్చింది. అలికిడి విని సృహలోకి వచ్చిన పర్వతాలరావు “ఇదిగో కొండయ్య. యిలా వచ్చి కొద్దిగా మంచినీళ్లు యివ్వు, శరీరం బాగా చల్లగా ఉందేమిటిరా, ఏసీ ఆపేయ్” అన్నాడు.
టేబుల్ మీద వున్న మంచినీళ్ల గ్లాస్ చేతికి యిచ్చి మూడు నెలలు తరువాత యజమాని మాట్లాడటం విని “అయ్యా! ఏసీ వేసి లేదు, తమరికి జ్వరం తగ్గినట్టు వుంది, మీ కోసం వచ్చిన స్వాములు ఏరి” అని అడిగాడు. అప్పుడు గమనించాడు కొండయ్య తన యజమాని నుదుటిన మూడు విభూతి రేఖలు.
వచ్చింది దేముడే అనుకుని పరుగున యజమాని గారి భార్య పిల్లలు ని పిలవటానికి పరుగేత్తాడు.
కలడందురు దీనులయెడ
గలడందురు పరమయోగి గణముల పాలం
గల డందు రన్ని దిశలను
గలడు కలండనెడు వాడు గలడో లేడో
పుట్టిన ప్రతీ జీవి ఆయుష్షు వున్నంతవరకు ఇతరులకోసం జీవించడం సహజం, జీవితంలో కనిపించే వాళ్లే కాదు మనల్ని నడిపించే వాడు వేరే వున్నాడు. ఆయన మెప్పు పొందాలని ప్రయత్నం కూడా చెయ్యాలి.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments