top of page
Original.png

గణతంత్ర దినోత్సవం

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, #GanathanthraDinotsavam, #గణతంత్ర దినోత్సవం, #RepublicDay


Ganathanthra Dinotsavam - New Telugu Article Written By Sudhavishwam Akondi Published in manatelugukathalu.com on 26/01/2026

గణతంత్ర దినోత్సవం - తెలుగు వ్యాసం

రచన: సుధావిశ్వం ఆకొండి


గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరును భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు.


భారతదేశం ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి భారత రాజ్యాంగం ఎంతో దోహదం చేసింది. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్న వారిని స్మరించుకుందాం! డా.బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం నిలిచింది. భారత రాజ్యాంగంలో ఒక పౌరుడికి ఉండాల్సిన హక్కులతో పాటుగా బాధ్యతలను కూడా పొందుపర్చారు. ప్రతి పౌరుడు హక్కులను వినియోగించుకోవడమే కాదు వాటితో పాటుగా భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన దేశం అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిచి ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా రూపుదిద్దుకుంటుంది.


బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగంగా నిలిచింది. మన రాజ్యాంగం మానవ విలువలు, ప్రజాస్వామ్య విలువలను యావత్ ప్రపంచానికి చాటి చెబుతుంది. ఒక భారతీయ పౌరుడికి ఉండాల్సిన హక్కులు, బాధ్యతలను గుర్తు చేస్తుంది.

 

మన దేశానికి పదిహేను ఆగస్టు, పంతొమ్మిది వందల నలభై ఏడున స్వతంత్రం లభించినప్పటికీ, పరిపాలన కోసం విధి విధానాలను రూపొందించడం జరగలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వివిధ రంగాల్లోని మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి ఒక కమిటీని ఏర్పరిచింది అప్పుడు మొదటగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. డాక్టర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో ఎందరో మేధావుల కృషి ఫలితంగా చివరికి రాజ్యాంగం రూపొందించబడింది. ఇరవై ఆరు జనవరి, పంతొమ్మిది వందల యాభై నాడు రాజ్యాంగం అందరి చేత ఆమోదం పొందింది. ఆ రోజు మన దేశం తనను తాను సార్వభౌమ, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది.


ఆ రోజున తుపాకులతో వందనం మరియు దేశ తొలి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మన భారతదేశ గణతంత్రం యొక్క చారిత్రాత్మక ఘట్టం ఇది. 


అప్పటినుంచి జనవరి ఇరవై ఆరవ తేదీని జాతీయ సెలవుదినంగా ప్రకటించి భారత గణతంత్ర దినోత్సవ రోజుగా గుర్తించారు. భారత రాజ్యాంగం భారత పౌరులకు వారి స్వంత ప్రభుత్వాన్ని ఎంచుకునే అధికారాన్ని ఇచ్చింది మరియు ప్రజాస్వామ్యానికి మార్గం సుగమం చేసింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.


ఇరవై ఆరు జనవరి, పంతొమ్మిది వందల యాభై నాడు మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి వివిధ దేశాల రాజ్యాలు అధ్యయనం చేసి, చర్చలు చేసి, సమిష్టి నిర్ణయాల ద్వారా భారత రాజ్యాంగాన్ని వ్రాశారు. పంతొమ్మిది వందల నలబై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. చివరికి జనవరి ఇరవై ఆరును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడానికి నిర్ణయించారు అప్పటి పార్టీల నాయకులు.


గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా వేడుకలు చేసుకుంటారు. జనవరి ఇరవై ఆరవ తేదీని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా నిర్ణయించారు. 


ఈరోజు దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో దేశ ప్రధాని ఎర్రకోటలో జెండా ఎగరేసి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విశాలమైన అక్కడి గ్రౌండ్ లో దేశంలోని రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబించేలా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు. రాష్ట్రాల వైవిధ్యమైన ప్రదర్శనలు, కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ రంగాల్లో కృషి చేసిన విశిష్ట వ్యక్తులకు బహుమతి ప్రదానం చేసి, గౌరవిస్తారు. 


రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయులంతా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు, రాజ్యాంగం మనకు అందించిన ప్రాథమిక హక్కులను గుర్తించుకుంటూనే, భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుంది. అభివృద్ధి పథంలో పయనిస్తుంది. 


 జై హింద్! జై భారత్! భారత్ మాతా కీ జై! 



-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page