top of page

గంగమ్మ జాతర

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.


Gangamma Jathara written by Otra Prakash Rao

రచన : ఓట్ర ప్రకాష్ రావు

పది మంది యువకులు. అందరూ ఇరవైనుండి ముపై వయసు లోపున వారే.అందరూ ఒక్కటిగా గుంపుగా ఆ కోర్ట్ వరండాలో ఉన్నారు.

"కోర్ట్ నందు మొదటి కేసు మనదే నంట"

“ జైలు శిక్ష వెయ్యరుగా”

"మనం ఏమైనా హత్య చేశామా జైలు శిక్ష వెయ్యడానికి "

"కొంత డబ్బు పెనాల్టీ కట్ట మంటారు.అది కట్టేస్తే సరి...."

"ఎవరో ఒక ముసలోడి కాలు ఫ్రాక్చర్ అయిందిగా "

"ఎట్టి పరిస్థితిలోనూ మనం ఆ ముసిలోడ్ని గుద్దిన సంగతి చెప్పకూడదు"

"పోలీసులు అడిగితేనే చెప్పలేదు ...అలాగే కోర్టులో కూడా చెప్పకూడదు . మనమే చేశామన్నందుకు సాక్షం ఏముంది మనలాగే వేరెవరో తాగి వాహనం నడుపుతూ ఆక్సిడెంట్ చేసివుండొచ్చుగా ""

“ అవునవును ఎవడో చేసివుండొచ్చు”

"ఆ ఇన్స్పెక్టర్ బతక నేర్చిన వాడైతే మనం ఇచ్చిన డబ్బు తీసుకునేవాడు....అనవసరంగా మనకు ఒక రోజు వృధా చేసాడు."

"కానీ మనల్ని మర్యాదగానే చూసుకున్నాడు కాబట్టి బతికిపోయాడు."

"లేకుంటే..."

"మానాన్న ఒకప్పుడు మంత్రి ...ఇప్పటికీ అయన తలచుకొంటే వీడ్ని కరువు ప్రాంతాలకు బదిలీ చేస్తారు”.

“మనలో సగం మందికి పైగా మంచి పలుకుబడి కలిగిన కుటుంబాలకు చెందిన వారం అని తెలుసు అందుకే ఆ ఇన్స్పెక్టర్ ఏమీ చెయ్యలేదు”.

"ఏమన్నా చేసివుంటే నేనే వాడ్ని ఉతికివేసేవాడ్ని.."అన్నాడు మాజీ మంత్రి కొడుకు.

" కానీ ఈ రోజు వచ్చే న్యాయాధిపతి ఒక తిక్క మనిషి అని వినపడ్డాను "

"తిక్క మనిషి అయినా మంచి మనిషి అయినా ఒకటే శిక్ష ...పెనాల్టీ....ఒక వేళ జైలు శిక్ష వేస్తె మరుక్షణమే మనమంతా బెయిల్ పై వద్దాం "

"ఇంతవరకు మన ఇండ్లలో ఎవరికీ తెలీదు. మన సెల్ ఫోన్లు ఆ ఇన్ స్పెక్టర్ తీసుకొని స్వచి ఆఫ్ చేశారు.అదిగో వస్తున్నాడు అడుగుతాను " అంటూ దగ్గరకు వచ్చిన ఇన్ స్పెక్టర్ వైపు చూస్తూ “సార్ ...మా ఇంటికి ఫోన్ చెయ్యాయిలి మా సెల్ ఫోన్ ఇస్తారా ..."

"అన్నీ కోర్ట్ లోపల ఉంచాను.కావాలంటే నా సెల్ ఫోన్ తీసుకోండి " అంటూ ఇవ్వగానే ఒక యువకుడు ఫోన్ చేసి తండ్రికి చెప్పాడు .

ఒక్కొక్కరు ఆ ఫోన్ తీసుకొని వారి వారి ఇంటికి తెలపడం జరిగింది..

అందరూ ఫోన్ చెయ్యడం ముగించగానే ఆ ఫోన్ ఇన్స్పెక్టర్ చేతికి అందజేశారు. అతనూ పక్కనే ఉండటం వల్ల మామూలుగా మాట్లాడలేక మెల్లగా గుసగుస మని మాట్లాడుకొంటున్న సమయాన ఒక పోలీసు వచ్చి "సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు లోనికి వెళ్ళండి " అన్నాడు

. లోపలకు వెళ్ళగానే జడ్జి వైపు చూస్తూ పది మంది నమస్కారం చేశారు.

జడ్జి అందరినీ వేళ్ళతో లెక్కబెడుతూ " పది మంది ఉన్నారు....ఇందులో ఉద్యోగులు ఎంతమంది " అనడిగాడు.

ఇన్స్పెక్టర్ సమాధానం చెప్పబోతుంటే "మీరు ఎందుకు సమాధానం చెబుతారు ....అందరూ ఇక్కడే ఉన్నారుగా ...ఒక వేళ తప్పుగా చెబితే మీరు చెప్పండి " అంటూ మృదువుగా మందలించగానే ఒక్క అడుగు వెనక్కు వేసి నిలబడ్డాడు ఆ ఇన్ స్పెక్టర్ .

నలుగురు మంది చేతులు ఎత్తారు.

“ఇందులో ప్రభుత్వోద్యోగులు ఎంతమంది”

ఇద్దరు చేతులు ఎత్తారు

"అంటే ఇద్దరు ప్రభుత్వోద్యోగులు మరో ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు ...మంచిది . ఇక మిగిలిన వారి గురించి చెప్పండి మీలో ఎంతమంది ఉద్యోగాన్వేషణలో ఉన్నారు.”

ఇద్దరు చేతులు ఎత్తారు.

“ మీ గురించిన వివరాలన్నీ చదివాను నలుగురు ఉద్యోగులు ,మరొఇద్దరు ఉద్యోగాన్వేషణలో వున్నారు ఇద్దరు తండ్రితో వ్యాపారపనులలో ఉంటె మరో ఒకడు రాజకీయాల్లో ఇక మిగిలిన ఒకడు జులాయి అనుకోవచ్చు.అంతేకదా "అన్నారు జడ్జి

అందరూ ఔనన్నట్టుగా తలా ఆడించాడు.

“నేను మీరంతా రైడ్ లో వేరువేరుగా దొరికారనుకొన్నాను.కానీ మీరంతా ఒక గుంపుగా త్రాగి బండ్లు నడిపారంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు మీరంతా ఒక్కటిగా ఎలా కలిశారు.”

“ప్రతి సంవత్సరం కలుసుకుంటాము సార్ “అన్నాడు ఒకడు

“అదే ఎందుకు” మరలా కావాలనే ప్రశ్నించాడు

“మా ఊరులో జరిగే గంగమ్మ జాతర కు కలుసుకుంటాము.”

“ప్రతి సంవత్సరము ఇలా కలుసుకుంటారా”

“ ఔను సార్”

"గంగమ్మ జాతర కోసం అందరూ కలుసుకొంటా మన్నారు. మరి గంగమ్మ జాతర కథ ఏమిటో తెలుసా"

అందరూ ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక బిక్క మొగం వేశారు.

"ఇన్ స్పెక్టర్ మీరైనా చెప్పగలరా "

"సార్...గంగమ్మ జాతర...."అంటూ నీళ్లు నమలసాగాడు .

కోర్ట్ కేసు చూడటానికి వచ్చిన వారి వైపు చూస్తూ "గంగమ్మ జాతర కథ ఎవరైనా చెప్పగలరా "అడిగారు జడ్జి

ఒక ముసలాయన చేయి పైకెత్తగానే "కాస్త ముందుకు వచ్చి చెప్పండి"అన్నారు

ఆ ముసలి వ్యక్తి ముందుకు వచ్చి" పూర్వం ఒక రాజు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ రాజు ని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత గంగమ్మగా జన్మించింది . యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా రాజు గాడికన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. అప్పుడు గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించగానే, తనను అంతమొందించేందుకు గంగమ్మ అవతరించిందని తెలుసుకొన్నాడు . రాజు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా రాజు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ- ఆ రాజును పట్టుకొని తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.” అన్నాడు.

"చాలా చక్కగా చెప్పావు పెద్దాయనా ....మీరెళ్ళి కూర్చోండి"అంటూ మర్యాదపూర్వకంగా చేతులు జోడించాడు జడ్జి.ఆ తరువాత వారి వైపు చూస్తూ "గంగమ్మ జాతర ఎందుకు జరుపుతారో అర్థమైందా దుష్ట శిక్షణకు గంగమ్మ జాతర జరుపుకొంటారు. అవునా "

“మరి మీరంతా పీకలదాకా త్రాగి బండి వేగంగా నడపడం దుష్టమైన పని కదా ...శిక్షించాలి కదా"

వారందరి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. బిక్క మొహంతో జడ్జి వైపు చూడసాగారు.

“మీకు జైలు శిక్ష వేసానంటే నలుగురికి ఉద్యోగం ప్రమోషన్ లో బాధింపు కలగవచ్చు నిరుద్యోగికి ఉద్యోగం దొరకకపోవచ్చు …..... ఒకడి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా దెబ్బ తింటుంది....ఇద్దరి వ్యాపారస్తుల వ్యాపారం తగ్గడానికి అవకాశం వుంది ఇక జైలు శిక్ష విదించమంటారా”

“సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కు జైలు శిక్షా ఇంత వరకూ ఎవ్వరూ ......”

"డ్రంక్ అండ్ డ్రైవ్ హైదరాబాద్ విజయవాడ పట్టణాలలో ఉండేది ...ఇప్పుడు ఈ ఊరికి కూడా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది.మిమ్మల్ని వదిలివేశానంటే ఈ ఊరు కూడా సాంకేతికంగా ముందుకు వెళ్లక పోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ మనుషులు పెరుగుతారు. ఈ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు పోలీసులను కొట్టగల దైర్యం తెచుకున్నారంటే అందుకు ముఖ్య కారణం శిక్షలు కఠినంగా విధించలేకపోవడమే. " అన్నారు జడ్జి .

"సార్, మమ్మల్ని క్షమించి వదిలివేయండి సార్ ఇక ఎప్పటికీ త్రాగం ...." బొంగురు గొంతుతో అందరూ వేడుకోవడం ప్రారంభించారు.

"మిమ్మల్ని క్షమిస్తే… రేపు ఇలాంటి కేసులో దొరికిన వారు కూడా క్షమించమంటారు."అన్నారు జడ్జి.

"సార్ మా భవిష్యత్తు దెబ్బతింటుంది మమ్మల్ని వదిలెయ్యండి..."అంటూ ఒకడు బోరుమని విలపించసాగాడు.

" సరే మీరందరూ ఒక్కొక్కరు పది వేల రూపాయలు చొప్పున ఇవ్వగలరా. జైలు శిక్ష లేకుండా వేరే మార్గం చూస్తాను.అదీ ఒక్క గంటలో ...."

'ఇంత బాహాటంగా అడుగుతున్నాడే.... ' అని మనసులో అనుకొంటూ చేతులు జోడించి "అలాగే ఏర్పాటు చేస్తాను సార్ "అన్నాడు మాజీ మంత్రి కొడుకు.

“ఇన్ స్పెక్టర్ వీరి కేసు మధ్యానానికి తీర్పు చెబుతాను. అంతవరకూ మీ కష్టడీలో ఉంచుకోండి.అలాగే వాళ్ళ దుస్తులు చూడండి ఎంత ఘోరంగా ఉందని గమనించారా …..కోర్ట్ ఎదురుగా ఉండే కో-అప్ టెక్స్ నందు అందరికీ ఒక రెడీ మేడ్ చొక్కా, పంచె తీసివ్వు .ఆ సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేయ్ ఆ దుస్తులు మార్చుకొనడానికి ముందు స్నానం చేసుకొనే ఏర్పాటు చెయ్యండి,మధ్యాహ్నం భోజనం మంచి హోటల్ నందు తెప్పించండి." అన్నారు జడ్జి .

'ఈ జడ్జి నిజంగా తిక్క మనిషే 'అనుకొన్నారు.

" మరొక్క విషయం ఇన్ స్పెక్టర్ ఒక బ్యాంకు అకౌంట్ నంబర్ చెబుతాడు . మీరు సేకరించే మొత్తం సొమ్ములో డెబ్భై ఐదు వేల రూపాయలు ఆ అకౌంట్ లో వేసే ఏర్పాటు చెయ్యండి . ఆ రశీదుతో పాటు మిగిలిన సొమ్ము తీసుకొని రండి " అన్నారు జడ్జి .

*** *** ***

పది మందీ కో-ఆప్ టెక్స్ దుస్తుల్లో వచ్చారు.

జడ్జి బాహాటంగా డబ్బు అడిగిన విషయం మీడియాకు చెప్పినందువల్ల మీడియా వారు కూడా ప్రవేశించారు.మొదట పోలీసులు అడ్డుకొనబోతే జడ్జిగారు అనుమతించమని చెప్పారు.

"నిన్న రాత్రి ఈ పది మంది పీకలదాకా త్రాగి గుంపుగా వాహనాలు నడుపుతూ ఒక వృద్ధుడి కాలు ఫ్రాక్చర్ చేసినందువల్ల పోలీసులుమిమ్మల్నందరినీ అరెస్ట్ చేశారు . రోడ్ ప్రక్కగా నడచుకొంటూ వెళ్తున్న వృద్ధుడిని ఢీ కొట్టారు.పాపం ఆ వృద్ధుడి కాలు విరిగింది. ఆ సమయంలో ఆ వృద్దుడికి మీరు సాయం చెయ్యడం మరచి అతనిని తిడుతున్న సమయాన ఇన్స్పెక్టర్ చూసి మిమ్మల్ని ఖైదు చేశారు నేను చెప్పిన అకౌంట్ నెంబర్ ఆ వృద్దుడిది. వీళ్ళ దగ్గర వసూలు చేసి అతని అకౌంట్లో వేయించాను".అంటూ ఆరసీదు మీడియా వారికి చూపించ మంటూ సైగ చేస్తూ ఇన్ స్పెక్టర్ కిచ్చాడు జడ్జి . ఇన్ స్పెక్టర్ ఆ బ్యాంకు రశీదును మీడియా వారికి చూపించాడు

"వీళ్లకు జైలు శిక్ష వేస్తే భవిషత్తు దెబ్బ తింటుంది.శిక్షించకుండా ఉంటా ఇలాంటివాళ్ళు పెరిగిపోతారు.గంగమ్మ జాతర జరిగే చోటున పెద్ద షామియానా ఏర్పాటు జరుగుతోంది.అందులో వీరిని కుర్చీల పైన కూర్చొని బెట్టి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తాము ఆ షామియా ముందు. ' డ్రంక్ అండ్ డ్రైవ్ నందు పట్టుబడ్డ వారు' అన్న బ్యానర్ ఉంటుంది దోషులు అన్న వార్త ఉండదు.ఈ రోజు మంగళవారం.ఈ రోజు కోసమే భక్తులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఈ రాత్రినుంచే పడిగాపులు కాస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ పది మందీ ఆ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్లి పోవచ్చు. ఆ షామియానా లోనికి ఎవరూ ప్రవేశించడానికి వీలు లేనంతగా బందోబస్తు ఉంటుంది. అక్కడి నుండి ఎవరు పారిపోవడానికి ప్రయత్నించినా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విదిస్తాను.అలాగే అక్కడ ఎవరైనా వీళ్ళను విడిపించాలని గొడవచేసేవారికి నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ మీద అరెస్ట్ చెయ్యమని ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. ఇకపోతే వారిచ్చిన డబ్బులో వృద్ధుడి కుటుంబానికి ఇచ్చాము . మిగిలినది ఈరోజు ఉదయం ఆ పది మందికి టిఫన్ భోజనం ,షామియానా ఖర్చులు పోనూ మిగిలింది లెఖ్ఖ చెప్పి వారికి తిరిగి ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది . ఇన్ స్పెక్టర్ మీరు ఈ పది మందిని ఇక్కడనుండి జాతరదగ్గర వేయించిన షామియానాకు తీసుకెళ్లండి. " అన్నారు జడ్జి .

*** *** ***


ఆ పట్టణంలో మద్యం అలవాటున్న వారందరికీ షామియానాలోని పది మందిని చూసాక డ్రంక్ అండ్ డ్రైవ్ కలలో కూడా చేయకూడదన్న భావన కలిగింది. షామియానాలో ఉన్న పది మంది అవమానంతో కృంగిపోయారు.కొంతమంది తెలిసిన వారు పిలిచినా తల ఎత్తలేదు .ఇక జన్మలో మద్యం వైపు వెళ్లకూడదన్న నిర్ణయానికి వచ్చారు. గంగమ్మజాతర వేడుకలో పది మంది ఉన్న షామియానా కూడా ముఖ్యత్వం వహించింది.


(అయిపోయింది )


1. పేరు ఓట్ర ప్రకాష్ రావు 2. నా గురించి : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు : 1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి, 2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి, 2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను. 2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను 2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక 2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది 2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి 2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు

301 views1 comment

1 Comment


eswar.vanu
Jan 15, 2021

అమ్మ వదిలి వెళ్లిపోతుందేమోనన్న ఆలోచనే అంత బాధగా ఉంటుందే..., నిజంగా దూరమైన వారి హృదయవేదన వర్ణించలేనిది. ఈ చక్కని కధ ద్వారా కొంతమంది అయినా తల్లి ప్రేమను దూరం చేసుకోరని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. కథ రచయిత్రి సంపుటిక మనస్సును హత్తుకుంది...👌👌

Like
bottom of page