#గారడీ, #Garadi, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి
'Garadi' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
Published In manatelugukathalu.com on 03/11/2024
'గారడీ' తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“బాబూ, ఈ బుడ్డోడ్ని కొంచెం అన్నవరం దగ్గర దింపండి” గంగవ్వ, అన్నవరం వైపు వెళ్ళే మోటార్ సైకిళ్ళని ఆపి అడుగుతోంది. ఆమె పక్కనే ఆంజనేయుడి వేషంలో ఉన్న, పదేళ్ళ సత్తిపండు ఉన్నాడు. ఆకుపచ్చ నిక్కరు, నెత్తి మీద బంగారు రంగులో ఉన్న అట్ట కిరీటం, మెడలో కాగితం పూల దండ, ఒళ్లంతా ఆకుపచ్చ రంగు, కుడి భుజం మీద చెక్కతో చేసిన గద, మూతి పైన, కిందా ఎర్ర రంగు.. చూడగానే బుల్లి హనుమంతుడిలా ఉన్నాడు. ఆ కుర్రాడిని బైకు మీద ఎక్కించుకుందామనుకున్నా, వాడి వంటి నున్న రంగు తమ బట్టలకు అంటుకుంటుందని వెళ్ళిపోతున్నారు.
చివరకి ఒక స్కూటర్ వాడు ఆగి ‘రారా హనుమా’ అన్నాడు సరదాగా.
“ఉహూ.. నేను రాను. మా మామ్మని ఎక్కించుకోండి. తనకి కాళ్ళు నొప్పులు. నాలుగు కిలోమీటర్లు నడవలేదు. బస్సు కి మా దగ్గర డబ్బులు లేవు” అన్నాడు సత్తిపండు ఎడమచేయి తిప్పుతూ.
వాళ్ళ మామ్మ మీద ఉన్న ప్రేమకి స్కూటర్ అతని కళ్ళు చెమర్చాయి.
“సరే. ఇద్దరూ ఎక్కండి తీసుకువెళ్తాను” అన్నాడు స్కూటర్ అతను.
‘హాయ్ భలే.. భలే ‘ మామ్మా నువ్వు ముందు ఎక్కు. తర్వాత నేను ఎక్కుతాను’ అని అన్నాడు కుర్రాడు. గంగవ్వ ఎక్కాక, తానూ కూడా ఎక్కి ‘జై శ్రీరామ్’ అన్నాడు సత్తిపండు.
స్కూటర్ ముందుకు కదిలింది. కొద్దిసేపటికి అన్నవరం కొండ మెట్ల దారి దగ్గర వాళ్ళని దింపి ముందుకు వెళ్ళిపోయాడు స్కూటర్ అతను.
గంగవ్వ భుజానికి ఉన్న సంచీలోంచి ఇత్తడి తాళాలు తీసి, ‘రామ నీల మేఘశ్యామా, కోదండరామా’ అని పాడుతుంటే, బుల్లి ఆంజనేయుడు అభినయం చేస్తున్నాడు. కొద్దిసేపు అయ్యాక పాట ఆపి ‘ధర్మం చేయండి బాబూ’ అని అడిగింది గంగవ్వ చుట్టూ ఉన్నవారిని. కొందరు చిల్లర పైసలు ఇచ్చారు ఆమెకి. యాత్రీకులతో పాటు వచ్చిన చిన్న పిల్లలు, ఆంజనేయుడి దగ్గరకు వెళ్లి ‘హుప్.. హుప్ ‘ అని గెంత సాగారు. పెద్దవాళ్ళు తమ పిల్లల చేతుల్లో డబ్బులు పెట్టి ఆంజనేయుడికి ఇప్పించారు. మెయిన్ రోడ్ కి రెండు వైపులా ఉన్న కొట్లముందు నిలబడి గంగవ్వ భక్తీ పాటలు పాడడం, ఆంజనేయుడు అభినయించడం.. యాత్రీకులు చిల్లర పైసలు ఇవ్వడం జరుగుతోంది.
మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యింది. “బామ్మా, ఆకలేస్తోంది. ఏమైనా తిందాము” అన్నాడు సత్తిపండు.
‘అలాగే’ అంది గంగవ్వ. చాలాసేపు పాడడం వలన ఆమెకీ ఆకలిగానే ఉంది. పక్కనే ఉన్న హోటల్ దగ్గరకు వెళ్లి ఇద్దరూ రెండు ప్లేట్ల బజ్జ్జీలు తిన్నారు. రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగారు. కొద్దిసేపు ఆగి పక్కనే ఉన్న బస్సు స్టాండ్ దగ్గరు వెళ్లి ‘బుల్లి ఆంజనేయుడు బాబూ, ధర్మం చేయండి’ అని అడిగింది గంగవ్వ. తోచిన వాళ్ళు చిల్లర ఇస్తున్నారు, కొందరు పొమ్మంటున్నారు. ఒంటి గంట దాటింది. ఇద్దరికీ అలసట కలిగింది. డబ్బులు వచ్చే అవకాశం కనిపించడంలేదు. “ఇంటికి వెల్లిపోదాం బామ్మా’ అన్నాడు సత్తిపండు. ఒక పావుగంట చూసారు, తేటగుంట వైపు వెళ్ళేవారు, తమని అక్కడ దింపు తారేమోనని.
బస్సులో అయితే ఇద్దరికీ టిక్కెట్లు కొనాలని, ఆటో ఎక్కి మనవడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది గంగవ్వ.
కృష్ణాపురం రాగానే ఆటో వాడికి పది రూపాయలు ఇచ్చింది. ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. గంగవ్వ వంట పని మొదలుపెట్టింది. సత్తిపండు తన వేషం విప్పుకుని వేరే బట్టలు వేసుకున్నాడు. వంట అయ్యాక ఇద్దరూ భోజనాలు చేసి పడుకున్నారు.
ఒక వారం గడిచింది. బామ్మకి జ్వరం రావడంతో ఆరోజు బయటకు రాలేదు.
పక్క ఇంటి రాములమ్మ ‘ఓ గంగవ్వా, ఇంకా నెగలేదా’ అంటూ వచ్చింది.
మంచంలో మూలుగుతున్న గంగవ్వ ఒంటిమీద చేయి వేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది.
‘ఒరేయ్ సత్తిపండు, సైకిల్ డాక్టర్ దగ్గరకు వెళ్లి, జ్వరం తగ్గడానికి మందులు ఇమ్మను’ అని బోడ్లోంచి పదిరూపాయల కాగితం ఇచ్చింది.
పావుగంటలో సత్తిపండు వచ్చి నాలుగు టాబ్లెట్లు రాములమ్మకి ఇచ్చి, బామ్మ మంచం దగ్గర దిగులుగా నిలబడ్డాడు. రాములమ్మ టీ కాచి గంగవ్వ కిచ్చి టాబ్లెట్ వేసింది. సత్తిపండుకి తన ఇంట్లోనే భోజనం పెట్టింది రాములమ్మ. సాయంత్రం బన్ను పెట్టి ఇంకో టాబ్లెట్ వేసింది గంగవ్వకి. మర్నాడు ఉదయానికి గంగవ్వకి జ్వరం తగ్గింది. చాలా నీరసంగా ఉంది. రాములమ్మ వచ్చి ఇద్దరికీ వంట చేసింది. సాయత్రం సత్తిపండు ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు.
“గంగవ్వా, పిల్లగాడిని హాస్టల్ లో చేర్పించు. వాడికి చదువు, భోజనం రెండూ ఉంటాయి. నీకు ఇలా ఊళ్లు పట్టుకు తిరగడం తప్పుతుంది. ఏమంటావు?” అంది రాములమ్మ.
“ఆడిని విడిచి నేను ఉండలేనక్కా” అంది దిగులుగా గంగవ్వ.
మూడురోజులు గడిచాయి. చేతిలో డబ్బులు అయిపోవడంతో నాల్గవరోజు ఉదయం సత్తిపండు కి ఆంజనేయుడి వేషం కట్టి తేటగుంట సెంటర్లో నిలబడింది. మోటార్ సైకిళ్ళ వాళ్ళు ఎవ్వరూ ఆపకుండా వెళ్ళిపోతున్నారు.
టాపులేని జీపులో వస్తున్న కాంట్రాక్టర్ శేషగిరి గంగవ్వని, సత్తిపందుని చూసి జీపు ఆపాడు. గంగవ్వ అతనికి దణ్ణంపెట్టి “బాబూ మమ్మల్ని అన్నవరం తీసికెళ్ళండి” అంది.
బుల్లి ఆంజనేయుడి వేషంలో ఉన్న సత్తిపండుని చూసి చిన్నగా నవ్వి “ఎక్కండి” అన్నాడు శేషగిరి.
‘జై శ్రీరాం’ అంటూ సత్తిపండు ముందు ఎక్కి, బామ్మకి చేయి అందించాడు.
‘దేవుడి దర్సనానికా?’ అని అడిగిన శేషగిరితో “లేదు బాబూ, యాచన చేసి బతుకుతున్నాం” అంది గంగవ్వ. అన్నవరంలో వాళ్ళని దింపేసి సత్తిపండుకి ఏభై రూపాయలు ఇచ్చాడు
శేషగిరి. “పిల్లా, పాపలతో చల్లగా ఉండు బాబూ” అని దీవించింది గంగవ్వ.
ఆమె మాటలకి చిన్నగా నిట్టూర్చాడు శేషగిరి. పెళ్లి జరిగి పది ఏళ్ళు గడిచినా పిల్లలు లేరు శేషగిరికి.
కాకినాడలో ఉంటూ తుని, నక్కపల్లి, ఎలమంచిలి ప్రాంతాలలో కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. మరుసటి వారం తుని నుంచి కాకినాడ వస్తూ దారిలో మళ్ళీ కనిపించిన గంగవ్వని, సత్తిపండుని జీపు ఎక్కించుకున్నాడు. అన్నవరంలో హోటల్ కి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించాడు ఇద్దరికీ. సత్తిపండుని చూసి జాలి కలిగింది ‘చదువుకునే వయసులో జీవనపోరాటం చేస్తున్నాడని’.
“మామ్మా, కుర్రాడిని స్కూల్ లో వేసి హాస్టల్లో చేర్పించు. బాగా చదువుకుని ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటాడు” నవ్వుతూ అన్నాడు శేషగిరి.
“లేదు బాబూ. ఆడిని విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి వాడూ ఉండలేడు”అంది గంగవ్వ.
వెళ్లేముందు సత్తిపండుకి ఏభై రూపాయలు ఇచ్చాడు శేషగిరి. ఒక రోజు ఉదయాన్నే కృష్ణాపురం వచ్చి గంగవ్వని కలిసాడు శేషగిరి. తను తెచ్చిన బొమ్మలు, స్వీట్స్ సత్తిపండుకి ఇచ్చి ‘బయటకు వెళ్లి ఆడుకోమని’ చెప్పాడు. స్వీట్ తింటూ ఒక బొమ్మ తీసుకుని బయటకు వెళ్ళాడు సత్తిపండు.
“చూడు బామ్మా. నువ్వు పెద్దదానివి అవుతున్నావు. నీకు ఏదైనా అయితే వాడిని ఎవరు చూస్తారు? బంగారం లాంటి వాడి భవిష్యత్తుని నువ్వే పాడుచేసినట్టు అవుతుంది. నా మాట విను. నేను దగ్గర ఉండి వాడిని స్కూల్ లో చేరుస్తాను. తర్వాత హాస్టల్ లో కూడా వేస్తాను. నువ్వు ఎప్పుడు కావాల్సిస్తే అప్పుడు వాడిని చూడటానికి హెడ్ మాస్టర్ ని, హాస్టల్ వార్డెన్ ని ఒప్పిస్తాను. నీకు నెల నెలా కొంత డబ్బు ఇస్తాను. నువ్వు ఎక్కడికీ తిరగక్కరలేదు. రేషన్ బియ్యం, పెన్షన్ తో నీకు గడిచిపోతుంది. నీకు అనారోగ్యం వస్తే నాకు చెప్పమని మీ ఊరి సర్పంచ్ కి చెబ్తాను. మీ ఇద్దరి బాధ్యతా నాది”అన్నాడు శేషగిరి.
గంగవ్వ రెండునిముషాలు ఆలోచించింది. ‘తనకి అకస్మాత్తుగా ఏదైనా జరిగితే వాడు అనాథ అయిపోతాడు. ఈ పెద్దాయన వాడి చదువు చూసుకుంటానంటున్నాడు. తన బ్రతుకుకి ఆసరాగా ఉంటానంటున్నాడు. చూద్దాం. ఇదీ ఒకందుకు మంచిదే’. దీర్ఘంగా నిట్టూర్చి ‘అలాగే బాబూ. మీరు చెప్పినట్టే చేద్దాం’ అంది గంగవ్వ.
సత్తిపండు అయిదోతరగతి సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు ఇద్దర్నీ జీపు ఎక్కించుకుని తునిలోని హై స్కూల్ కి వెళ్ళాడు శేషగిరి. సత్తిపండు ని ఆరోతరగతిలో చేర్పించాడు. తర్వాత హాస్టల్ కి తీసికెళ్ళి అక్కడి ఫారం పూర్తిచేసి గార్డియన్ గా తను సంతకం చేసాడు. రెండు చోట్లా ‘గంగవ్వ ఎప్పుడు వచ్చి మనవడిని చూడాలన్నా అడ్డుచెప్పవద్దని, వాళ్ళని రిక్వెస్ట్ చేసాడు. హెడ్ మాస్టర్, వార్డెన్ అలాగే అన్నారు. తిరిగి కృష్ణాపురం వచ్చి గంగవ్వని ఇంటి దగ్గర దింపి, ఆమెకి వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్ళాడు శేషగిరి.
ఆరోజల్లా బెంగగానే ఉంది గంగవ్వ. రాములమ్మ వచ్చి “ఇన్నాల్లకైనా ఆ బాబు మాట విని ఆడిని స్కూల్ కి పంపి మంచిపని చేసావు. ముందు బెంగ గానే ఉంటాది. తర్వాత అదే సద్దుకుంటాది” అని ధైర్యం చెప్పింది. నాలుగురోజులు గడిచాకా రాములమ్మని తోడు తీసుకుని తుని వెళ్లి సత్తిపండుని చూసి వచ్చింది.
వాడి మొహంలో కనిపిస్తున్న ఉత్సాహం చూసి ఆనందించింది గంగవ్వ.
ఆరునెలలు గడిచాయి. సెలవులలో ఇంటికి వచ్చి వెళ్తున్నాడు సత్తిపండు. చదువు పట్ల వాడికి ఉన్న శ్రద్ధ చూసి సంతోషించింది గంగవ్వ. ఒక రోజు కృష్ణాపురం సర్పంచ్ ఫోన్ చేసాడు’గంగవ్వ కి నాలుగు రోజుల నుండి ఒంట్లో బాగుండడం లేదని, మిమ్మల్ని చూడాలని అంటోందని’.
శేషగిరి వెంటనే బయల్దేరి గంగవ్వ ఇంటికి వచ్చాడు. మంచం మీద పడుకుని ఉంది గంగవ్వ. రాములమ్మ ఆమె పక్కనే ఉంది.
“మామ్మా హాస్పిటల్ కి తీసుకెళ్తాను పద” అన్నాడు శేషగిరి.
“వద్దు బాబూ” అంది నీరసంగా. వెంటనే డ్రైవర్ ని కేకేసి ‘తుని వెళ్లి సత్తిపండు ని తీసుకురమ్మని’ చెప్పాడు.
రాములమ్మకేసి తిరిగి “అక్కా ఓ సారి బాబు గారితో మాట్లాడాలి”అంది గంగవ్వ.
ఆమె ఉద్దేశ్యం గ్రహించి తలుపు దగ్గరగా వేసి బయటకు వెళ్ళింది రాములమ్మ.
“బాబూ. మీకు ఓ సంగతి చెప్పాలి. సత్తిపండు నా మనవడు కాదు. నాకు దొరికిన బిడ్డ. పది ఏళ్ళ క్రితం ఒక ఏకాదశి రోజున అన్నవరం వచ్చాను. తెల్లవారు ఝామున మెట్లు ఎక్కుతుంటే చంటిపిల్ల వాడి ఏడుపు వినిపించి పక్కకు చూస్తె ఒక వెదురుబుట్టలో కనిపించాడు. చాలాసేపు చూసాను. పిల్లాడి తాలూకు ఎవరైనా వస్తారేమోనని. ఉహూ.. ఎవరూ రాలేదు. ఆ పిల్లాడిని తీసుకుని స్వామి వారిని చూసి ఇంటికి వచ్చాను. వాడిని స్వామి ప్రసాదంగా భావించి ‘సత్తిపండు’ అని పిలుచుకుంటున్నాను. ” ఒక నిముషం ఆగింది గంగవ్వ. శేషగిరి ఆశ్చర్యపోతున్నాడు ఆమె చెప్పిన విషయం విని.
“బాబూ, ఆ మూలన ఉన్న చెక్కపెట్టె తీసి అందులో ఉన్న ప్లాస్టిక్ సంచీ తీసుకురండి” అంది నీరసంగా గంగవ్వ. శేషగిరి పెట్టె తీసి, అందులో ఉన్న సంచీ తీసుకువచ్చి గంగవ్వకిచ్చాడు. వణుకుతున్న చేతులతో సంచీలోంచి ఒక ప్లాస్టిక్ భరిణి తీసి అందులోంచి ఒక ఉంగరం తీసింది. తర్వాత ఒక గళ్ళ తువ్వాలు తీసింది.
అవి రెండూ శేషగిరి చేతిలో పెట్టింది. “ఆరోజు ఆ చంటిబిడ్డతో పాటు ఇవి రెండూ ఆ వెదురు బుట్టలో ఉన్నాయి బాబూ” అంది గంగవ్వ.
ఉంగరం మీద చెక్కి ఉన్న ‘ఎస్’ అక్షరం చూడగానే, వెన్ను మీద ఎవరో, కొరడాతో కొట్టినట్టు ఉలిక్కిపడ్డాడు. వెంటనే తువ్వాలు మడతవిప్పి చూసాడు. తువ్వాలు చివర ‘ఎస్’ అని అందంగా
ఎంబ్రాయిడరీ చేసి ఉంది. వెంటనే అతనిలో దుఃఖం కట్టలు తెంచుకుని బయటకు వచ్చింది. ఆ ఉంగరం, తువ్వాలు రెండూ తను సుగుణకి ఇచ్చాడు. నక్కపల్లి లో కాంట్రాక్టులు చేసేటప్పుడు పరిచయం అయ్యింది సుగుణ. అది ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ తండ్రికి అనారోగ్యం అని, అర్జెంట్ గా రమ్మని ఫోన్ రావడం, విజయవాడ వెళ్ళడం, బంధువుల బలవంతం మీద మేనమామ కూతురు వనజతో పెళ్లి జరగడం అన్నీ రెండు రోజులలో జరిగిపోయాయి.
ఆ వెంటనే తండ్రి చనిపోయాడు. తర్వాత నెల రోజులకి నక్కపల్లి వెళ్ళాడు. సుగుణ ఊళ్ళో లేదు. తన పెళ్లి విషయం ఆమెకి తెలిసి ఉంటుంది. అందుకే ఊరు విడిచి వెళ్ళిపోయింది. చాలా చోట్ల సుగుణకోసం వెదికాడు. ఫలితం లేకపోయింది. ఆమెకి చేసిన ‘అన్యాయం’ కి ఫలితం అన్నట్టు వనజకి పిల్లలు కలగలేదు. చాలా మంది డాక్టర్ల చుట్టూ తిరిగారు. లాభం లేకపోయింది.
వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. కానీ పిల్లలు లేరు అన్న దిగులుతోనే జీవిస్తున్నాడు. కానీ సత్తిపండు తన రక్తం పంచుకుని పుట్టిన కొడుకు. అపురూపంగా, గారంగా పెరగాల్సిన తన కొడుకు, పొట్టకూటి కోసం వేషం వేసుకుని గెంతుతూ, పదిమంది ముందూ చేయిచాపాడు. ఎంత ఘోరం? ఎంత దౌర్భాగ్యం? దానికి కారణం తనే. ఆ విషయం తలుచుకోగానే మరోసారి దుఃఖం పొంగుకువచ్చింది శేషగిరికి. అకస్మాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. సత్తిపండు, అతని వెనుకే డ్రైవర్.
“బామ్మా” అంటూ మంచం దగ్గరకు వచ్చాడు సత్తిపండు.
అప్పటికే గంగవ్వ ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయాయి. గంగవ్వని పట్టుకుని విలపిస్తున్న సత్తిపండుని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు శేషగిరి. ఆనందం, బాధ, అవేదన ఒకేసారి అతనిలో ‘త్రివేణి సంగమం’లా కలిగాయి.
సమాప్తం
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
@umadevi8931
• 14 hours ago
కథ చాలా బావుంది.సత్తిపండు ని ఇంటికి తీసుకుని వెళ్ళినట్లు చెప్పవల్సింది
@umadevi8931
• 16 hours ago
కథ చాలా బావుంది. సత్తి పండు ను తనతో తీసుకువెళ్ళి, కొడుకు గా పెంచుకుంటున్నట్టు గా ముగిస్తే... నాలాంటి వారికి బాగా అర్థం అవుతుంది
@mrvsmurthy311
• 18 hours ago
కథ బాగా చదివారు..
@malapakarajeswari5285
• 18 hours ago
కధ, వినిపించిన విధానం బావుంది. మీకు, మూర్తి గారికి అభినందనలు
@kappagantulasubbarao3915
• 19 hours ago
కధ బాగుంది