top of page
Writer's pictureParupalli Ajay Kumar

వంశానికి ఒక్కరు

#ParupalliAjayKumar, #పారుపల్లిఅజయ్కుమార్, #వంశానికిఒక్కరు, VansanikiOkkaru, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

'Vansaniki Okkaru' - New Telugu Story Written By Parupalli Ajay Kumar

Published In manatelugukathalu.com On 02/11/2024

'వంశానికి ఒక్కరు' తెలుగు కథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి




సిద్ధరామయ్య వాలుకుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. 

"తాతయ్యా ! " మనవడు పిలుపుకు అటు చూసాడు. 


అప్పుడే స్కూల్ నుండి వస్తున్నాడు సిద్ధార్థ. 

రోజూ స్కూలునుండి వస్తూనే స్కూలులో

ఆరోజు జరిగిన విశేషాలు తాతయ్యకు చెప్పటం, స్కూల్లో వచ్చిన డౌట్లు అడగటం సిద్ధార్థకు అలవాటు అయింది. 


"తాతయ్యా ' పరోపకారార్ధం ఇదం శరీరం' అంటే ఏమిటి ? మా తెలుగుటీచరు దీని మీద పది వాక్యాలు రాసుకుని రమ్మన్నది. నువ్వు చెపితె రాత్రికి రాసుకుంటాను" అడిగాడు. 


సిద్ధరామయ్య రెండుక్షణాలు అలోచించి చెప్పసాగాడు. 

" ఇది మంచి నీతివాక్యంరా. 

నరసింహ సుభాషితం లోనిది. 

వివిధ ప్రాచీన గ్రంథములనుండి సంగ్రహించి సంకలనము చేసినవి ఈ సుభాషితాలు. వీటిని ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తిగారు సంకలనం చేసారు. 


'పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।

పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥'


ఇది మొత్తం శ్లోకం. 


దీని అర్థం ఏమిటంటే పరోపకారానికై వృక్షాలు ఫలాలను ఇస్తాయి. పరోపకారార్థమై నదులు ప్రవహిస్తాయి. పరోపకారం కోసమే ఆవులు పాలను యిస్తాయి. పరోపకారార్థమే ఈ మానవశరీరం. 


ప్రకృతిలో వుండే చెట్లు, నదులు, సృష్టిలోని ఉత్కృష్టమైన జంతువు ఆవులు మానవాళికి ఉపయోగపడుతున్నాయి. సృష్టిలోని ఎన్నోరకాలైన జీవజాతులలో మనుష్యజన్మ ఎంతో విశిష్టమైనది. 

అత్యంత ఉత్కృష్టమైన మానవ జన్మ కలిగి ఉండి ఇతరులకి మేలు చేయక పోవడం, ఉపయోగపడకుండా ఉండడం అనేది ప్రకృతి సహజత్వానికి విరుద్ధం. 


అందుచే పరోపకారార్థమిదం శరీరం అనే నానుడి స్థిరపడింది లోకంలో. విశిష్ట జన్మనెత్తిన ఈ మానవ శరీరం పరోపకారము కొరకు మాత్రమే ఉద్దేశింపబడినది అని అర్థం. తెలిసిందా?" అని అడిగాడు. 


" తెలిసింది. ఆ సంస్కృత శ్లోకం ఒక కాగితంపై రాసి ఇవ్వు. మిగతాది నేను రాసుకుంటాను. ” అన్నాడు సిద్ధార్థ బ్యాగ్ తీసుకుని తన రూంలోకి వెళుతూ. 


రెండుఅడుగులు వేసి మరలా ఆగి తాతయ్యను చూస్తూ

“తాతయ్యా! చాలా రోజుల నుండి అడుగుదామని మర్చిపోతున్నాను. నీపేరు సిద్ధరామయ్య, నాన్న పేరు సిద్ధేంద్ర కుమార్, నాపేరు సిద్ధార్థ... కొద్ది తేడాతో అన్నీ ఒకేలా వున్నాయి. ఎందుకని?” అని అడిగాడు. 


సిద్ధరామయ్య మనవడిని నవ్వుతూ చూసాడు. ” దానికి ఒక పెద్దకథ వుందిరా. నీవు హోమ్ వర్క్ చేసి, అన్నం తిన్నాక పడుకునేటప్పుడు చెపుతా” అన్నాడు. 


“సరే” అని వెళ్ళిపోయాడు సిద్ధార్థ. 


కోడలు తెచ్చిన కాఫీ తాగుతూ తన ముత్తాత గారి గురించి తన తండ్రి చెప్పిన విషయాలు మదిలో మెదిలాయి. చాలా చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతులు అవి. 


*********************************


వర్తకానికి అనివచ్చిన ఆంగ్లేయులు భారత దేశాన్ని ఆక్రమించి పరిపాలన చేస్తున్న రోజులవి. 

సిద్ధేంద్ర భూపతి జమీందారీ కుటుంబంలో పుట్టినా చిన్నతనం నుంచి సాటి మానవులను ప్రేమతో చూసేవాడు. జాలీ, దయ, మానవత్వం అతని కన్నుల్లో ప్రతిఫలించేవి. ఏనాడు తాను డబ్బున్న వాడిని అనే అహం ప్రదర్శించేవాడు కాదు. యుక్తవయస్సు వచ్చాక ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించాడు. కొంతకాలం హిమాలయాలకు వెళ్ళి వస్తానని తల్లితండ్రులతో చెప్పి వెళ్ళిపోయాడు. 


ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం.. హిమాలయాలు.. హిందువులకు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానమది.. కైలాస్‌, మానస సరోవర్‌, కేదార్‌నాథ్‌, హరిద్వార్‌, రుషికేష్‌, బద్రీనాథ్‌.. ఒకటా రెండా.. వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్రప్రదేశాలు అక్కడ ఉన్నాయి. 

వీటన్నింటిలో సాధువులు నివసిస్తున్నారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు.. మంచిచెడులు చెప్తారు. ఆశీర్వదిస్తారు.. 


కానీ వీరికి భిన్నంగా హిమాలయ పర్వతశ్రేణుల్లో కొందరు సాధుపురుషులు వుండేవారు. 

హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులనే చెప్పాలి.. కైలాస పర్వత సానువుల సమీపంలో, మానస సరోవరం తీరాన ఆహారం తీసుకోకుండా కేవలం గాలిని శ్వాసిస్తూ కఠోర సాధన చేసే ఎంతో మంది యోగీశ్వరులు, సిద్ధ పురుషులు వున్నారు. 


మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్లు వీరు. వారు కోరుకున్నప్పుడు మృత్యువు దరి చేరే సామర్థాన్ని సాధించారు. అందుకే ఎన్నేళ్లయినా వారి శరీరం క్షీణించదు.. రోగాలు దగ్గరకు రావు. హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుష్షుకు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం. సృష్టి కర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు.. ఈ లోకాన్ని సృష్టించింది.. నడిపిస్తున్నది.. నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అనే వారు భావిస్తారు.. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. 

వీరు ఎవరినీ పట్టించుకోరు. తమనూ పట్టించుకోరు. శరీరంపై మమకారం పెంచుకోరు. కోరికలు లేని జీవనవిధానం అనుసరిస్తారు. ఉపాసనలోనే జీవితం గడుపుతారు. అందులోనే ఆనందం అనుభవిస్తారు. వీళ్ల దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు.. హిమాలయ సానువుల్లో అత్యంత ఎక్కువకాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్లే.. 


అటువంటి వారిలో కొందరిని సిద్ధేంద్ర భూపతి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి కలుసుకున్నాడు. వారు పలుకరించక పోయినా, కన్నెత్తి చూడక పోయినా ఓపికగా ఎదురు చూసేవాడు. 


ఒకటి కాదు, రెండు కాదు.. సుమారు అయిదుసంవత్సరాల పాటు వారిని సేవించాడు. వారు ప్రసన్నులై తమ కరుణా కటాక్షాలను సిద్ధేంద్ర భూపతి మీద చూపి, ఆశీర్వదించారు. గృహస్థు జీవనం సాగిస్తూ మానవులలో నైతికవిలువలు, సత్ప్రవర్తన పెంపొందేలా కృషి చేయమని, వారిని ధర్మమార్గంలో నడిచేలా చేయమని చెప్పి పంపించారు. 


సిద్ధేంద్ర భూపతి తిరిగి ఇంటికి వచ్చాడు. తల్లితండ్రులు చూసిన ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకుకు సిద్ధపురుష్ అని పేరు పెట్టాడు. 


సిద్ధేంద్రభూపతి ఎక్కువకాలం

ధర్మప్రచారం లోనే గడిపేవాడు. 

నైతిక విలువలపై బోధలు చేసేవాడు. 

ఆధ్యాత్మిక ప్రసంగాలు ఊరూరా తిరిగి ప్రవచించేవాడు. సిద్ధ పురుషుల దగ్గర నేర్చుకున్న ప్రకృతి వైద్యం ఎవరికన్నా అవసరమయితే చేసేవాడు. 

ప్రజలందరూ అతన్ని సిద్ధేంద్ర మహర్షి అని పిలవటం మొదలు పెట్టారు. 


**********************************


భారతీయులపై ఆంగ్లేయుల అరాచకాలు, అతి క్రూరమైన అణచివేతలు అధికమయ్యాయి. 

సామాన్య ప్రజలపై ఆంగ్లేయుల దౌర్జన్యాలు, దోపిడీలు అంతులేకుండా పెరిగి పోతున్నాయి. వారు సాగించే దోపిడీ కారణంగా ప్రజలు, రైతులు సర్వం కోల్పోయారు. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల గోడును ఆంగ్లేయ అధికారులు అస్సలు పట్టించుకోలేదు. పైగా రకరకాల పన్నుల వసూలు పేరిట ప్రజలను మరింత పీడించారు. పన్నులు చెల్లించ లేని వారిని చెరసాలలో వేయటమో, తీవ్ర శిక్షలకు గురిచేయటమో చేసేవారు. 


ఆ పరిస్థితులలో వారికి అండగా నిలిచాడు సిద్ధేంద్రమహర్షి. జమీందారీ భూములన్నీ భూమి లేని పేద రైతులకు పంచి పెట్టాడు. జమీందారీ ఆస్తులన్నీ అమ్మి తమ జీవనానికి కావలసిన కొంత ధనాన్ని ఉంచుకుని మిగిలినదంతా నిరుపేద ప్రజలకు ఇచ్చి వారు శిక్షలకు గురికాకుండా చూసాడు. 


అదే సమయంలో పులి మీద పుట్రలా జోసెఫ్ పీటర్ అనే ఒక దొంగ, డబ్బున్న వారు, లేనివారు అనే తేడాలేకుండా జనాలను దోచుకోవడం మొదలు పెట్టాడు. పరమ కిరాతకంగా డబ్బు, నగలు దోచుకునేవాడని, ఎదురు తిరిగినవారిని కాల్చి చంపేవాడని, అందరూ అతని పేరు వింటేనే భయపడేవారు. అతను ఆంగ్లేయుడు కాబట్టి అతనికి ప్రభుత్వ అండదండలు వుండేవని చెప్పుకునేవారు. 


జోసెఫ్ పీటర్ ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. చురుగ్గా ఉండే వాళ్లందరినీ తనతో చేర్చుకున్నాడు. నమ్మకస్తులైన ఇన్ఫార్మర్లతో పథకాలు రచించి దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు. ఆ వేగులు అతడికి బాగా డబ్బున్న వాళ్ల గురించి సమాచారం ఇచ్చేవారు. 


ప్రతి దోపిడీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, దాన్ని విజయవంతంగా అమలు చేసేవాడు. ఎవరికీ భయపడేవాడు కాదు. దోపిడీలు చేస్తున్నప్పుడు అతను వీలైనంతవరకూ రక్తపాతం లేకుండా చూసుకునేవాడు. కానీ ఎవరైనా ఎదురుతిరిగితే, వారిని చంపడానికి కూడా వెనకాడేవాడు కాదు. 

అతడు తన శత్రువులను హత్య చేసినపుడు వారి చేతి వేళ్లను కూడా కోసేవాడని చెబుతారు. 


ఈ కథలన్నీ సిద్ధేంద్రమహర్షి కూడా విన్నాడు. అతన్ని కలుసుకుని అతని దారి మరల్చి సన్మార్గంలోకి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ అతని జాడ కానరాక మిన్నకుండి పోయాడు. 


తలవని తలంపుగా ఆ కిరాతక దొంగ జోసెఫ్ పీటర్ ఒకరోజు సిద్ధేంద్ర మహర్షి ఇంటికి దోపిడీకి వచ్చాడు. అతని బంగళా చూసి అతను ఒక పెద్ద జమీందారు అని భావించి డబ్బు, నగలు పుష్కలంగా దోచుకోవచ్చని అనుకున్నాడు. 


ఇంట్లో సిద్ధేంద్ర మహర్షి ఒక్కడే వున్నాడు ఆ సమయంలో అందరిలాగా అతను తనను చూసి

బెదరకపోవటం ఆశ్చర్యపరిచింది జోసెఫ్ పీటర్ ను. ఇళ్ళు మొత్తం వెదికినా డబ్బులు, నగలు దొరకలేదు. డబ్బు, నగలు ఎక్కడ దాచావో చెప్పమని సిద్ధేంద్ర మహర్షిని అడిగాడు. 


సిద్ధేంద్ర మహర్షికి ఆంగ్లభాష బాగావచ్చు. సంభాషణ అంతా ఆంగ్లంలోనే జరిగింది. 

“నా దగ్గరగానీ, మా ఇంట్లో కానీ ఏ నగలూ, డబ్బు లేదు నాయనా. ” ప్రశాంతంగా అన్నాడు సిద్ధేంద్ర మహర్షి. 


“అబద్ధం. నువ్వు పెద్ద జమీందారువని నాకు తెలుసు. అన్నీ ఎక్కడో దాచి వుంటావు. నిజం చెప్పు. ఎక్కడ వున్నాయి? ప్రాణాల మీద ఆశ వుంటే నిజం చెప్పు “ అని హంకరించాడు జోసెఫ్. 


“ఒకప్పుడు జమీందారును కావచ్చు. కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నాయనా. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. నా సంపదనంతా నేను నిరుపేదలకు, రైతులకు పంచిపెట్టాను. నువ్వు నన్ను చంపినా నేను చెప్పే నిజం ఇదే” చిరునవ్వుతో పలికాడు. 


జోసెఫ్ అతనివంక పిచ్చివాడిని చూసినట్టు చూసాడు. మెరిసే తెల్లటి పొడుగాటి గడ్డం, ప్రశాంతంగా చూస్తున్న కళ్ళు, నుదుటి మీద వీభూతి రేఖలతో భారతీయత ఉట్టిపడేలా వున్నాడు. 


అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక పోతున్నాడు. అతన్ని చూస్తుంటే ఏదో మైకం కమ్ముతున్నట్టు అనిపిస్తున్నది. 


“ఇప్పటికే చాలా సొమ్ము దోచుకుని వుంటావు కదా! ఏం చేస్తావు నాయనా ఆ డబ్బుతో?” శాంతంగా అడిగాడు సిద్ధేంద్ర మహర్షి. 


“డబ్బుంటే యీ లోకంలో దేనినైనా పొందవచ్చు. డబ్బుంటే అన్ని సుఖాలు, సంతోషాలు పొందవచ్చు. ఆనందంగా జీవించవచ్చు. స్వర్గం మన ముందుకు వస్తుంది” హేళనగా నవ్వుతూ చూసాడు జోసెఫ్. 


“లేదు నాయనా నీవు ఒక భ్రమలో వున్నావు. డబ్బు ఇచ్చే ఆనందం తాత్కాలికం. మంచితనం, మానవత్వం ఇచ్చే ఆనందమే శాశ్వతం. నీవు పోయేటప్పుడు నువ్వు దోచుకున్న దానిలో చిల్లిగవ్వ కూడా నీతో తీసుకుపోలేవు. ఆకలి అయితే తినేది పిడికెడు అన్నమే గానీ డబ్బు, నగలు కాదు. 

డబ్బుతో కొనలేనివి చాలా వున్నాయి. ప్రేమ, స్నేహం, ఆప్యాయత, అనురాగం, మనఃశాంతి ఇవన్నీ డబ్బులతో కొనలేము నాయనా! ఒక్కసారి ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది. ఆఖరికి నీవు నిద్రను కూడా డబ్బుతో కొనలేవు తెలుసుకో ఈ సత్యాలను. ‘జీవించడం అంటే ఇతరులకు సాయపడటం, సేవ చేయడం. ఇతరులతో స్నేహసంబంధాలు పంచుకోవడమే జీవించడం అంటే! జీవించడం అంటే మంచిగా ఉండటం, మంచి చేయడం. ఇలా చేస్తే శాంతి, అమరత్వం లభిస్తాయి. ’ అని ఎందరో మహానుభావులు చెప్పారు. ఇప్పటికే నువ్వు దుర్మార్గపు పనులు ఎన్నో చేసి ఎంతో పాపం

మూటకట్టుకున్నావు. ఇకనైనా నీ చెడు నడతను మార్చుకుని మంచిగా బ్రతుకు నాయనా!“ మంద్ర స్థాయిలో చెప్పాడు. 


జోసెఫ్ వికటంగా నవ్వాడు. ప్యాంటు జేబుల్లో వున్న నగలు, డబ్బును బయటకు

తీసి సిద్ధేంద్ర మహర్షి కళ్ళ ముందు ఆడిస్తూ

“ఈ డబ్బునా నువ్వు చులకన చేసేది? ఈ నగలు ఎంత విలువ చేస్తాయో తెలుసా? ఇవి వజ్రాల హారాలు. లక్షలఖరీదు చేస్తాయి. అహ్హ..అహహా..” అని నవ్వుతూ అన్నాడు. 


“నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ లక్షల ఖరీదు చేసే నగలు నీ ప్రాణాలను కాపాడలేవు నాయనా! నీవా సంగతి తెలుసుకున్న నాడు నా మాటలు గుర్తు చేసుకో. వెళ్ళిరా నాయనా! నా ధ్యానానికి వేళ అయింది” అంటూ సిద్ధేంద్ర మహర్షి పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్నుడైనాడు. 


అంతటి గజదొంగ జోసెఫ్ ఆసమయంలో

నిస్తేజుడై నిలుచుండిపోయాడు. అతని వొంట్లో ఉద్రేకం, కరడు కట్టిన క్రూరత్వం ఒక్కసారిగా ఎవరో లాగేసుకున్నట్లు శక్తిహీనుడిలా అయిపోయాడు. తల వంచుకుని బయటకు వెళ్ళిపోయాడు. 


వారం రోజుల తరువాత గజదొంగ జోసెఫ్ ను అతని అనుచరులు మంచం మీద మోసుకుని సిద్ధేంద్ర మహర్షి దగ్గరకు తీసుకు వచ్చారు. మనిషి బలహీనపడి నీరసంగా వున్నాడు. 


“స్వామీ! మీరు మహాయోగ పురుషులని భావించక మిమ్ములను తూలనాడాను. 

ఆరోజు నుండి నాకు ఒంట్లో బాగుండటం లేదు. ఏమీ తినలేక పోతున్నాను. త్రాగలేకపోతున్నాను. ఒళ్లంతా మంటలు. ఏ వైద్యుడు నన్ను యీ బాధ నుండి రక్షించలేక పోతున్నాడు. మీరు వైద్యం బాగా చేస్తారని చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రజలు అనుకోవటం విన్నాను. మీరే నన్ను యీ బాధ నుండి విముక్తుడిని చేయాలి. నన్ను కాపాడండి. ” అంటూ జోసఫ్ లేచి నిలబడబోయి ఒక్కసారిగా పొట్ట పట్టుకుని “అమ్మా” అంటూ తూలి కిందికి కూలిపోయాడు. 


సిద్ధేంద్ర మహర్షి ఆదుర్దాగా “ఏమైంది నాయనా?” అని అడిగాడు. 


“కడుపులో విపరీతమైన మంట. లేవ లేకుండా వున్నాను. కడుపులో విపరీతమైన పోట్లు. భరించలేకుండా వున్నాను” బాధగా మూలుగుతూ అన్నాడు జోసెఫ్. 


సిద్ధేంద్ర మహర్షి అతని చేయి పట్టుకుని చూసాడు. 


జోసెఫ్, సిద్ధేంద్ర మహర్షి వంక దీనంగా చూస్తూ “మీరు వైద్యం బాగా చేస్తారని తెలుసుకుని వచ్చాను. ఈనొప్పి తగ్గటానికి ఏదైనా మందు ఇవ్వండి” అన్నాడు. 


సిద్ధేంద్ర మహర్షి అతని ముఖంలోకి పరికించి చూసాడు. 


“ప్లీజ్ ! నా దగ్గరున్న డబ్బంతా తీసుకుని నాకు వెంటనే మందు ఇవ్వండి” అని తన దగ్గరున్న డబ్బంతా సిద్ధేంద్ర మహర్షి కాళ్ళ దగ్గర పెట్టాడు. 


“తుచ్ఛమైన ఈ ధనం నాకెందుకు నాయనా! నువు చేసిన పాపాలే శాపాలై నిన్ను పీడిస్తున్నాయి. ఎంతో మంది ప్రజల ఉసురు నీకు తగిలింది. అయినా నా వైద్యం, నేనిచ్చే మందు మంచివాళ్ళ మీదనే పనిచేస్తుంది నాయనా! నీకిచ్చినా పనిచేయదు. ”


“స్వామీ! నన్ను క్షమించండి. నేను ఇక నుండి మంచిగా బ్రతుకుతాను. ప్లీజ్ నన్ను కాపాడండి” అని వేడుకున్నాడు. 


“నమ్మమంటావా నాయనా!” జోసెఫ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. 


“స్వామీ! నేను దొంగనే కానీ మాట తప్పే మనిషిని కాను” కళ్ళ వెంట నీరు కారుతుండగా బాధగా అన్నాడు జోసెఫ్. 


“సరే! నా దగ్గర అమృతధార అనే జీవ జలమున్నది. అది ఇస్తాను. తాగు. ” అని కూజాలాంటి పాత్రలో వున్న జలాన్ని గ్లాసులో పోసి ఇచ్చాడు. 


జోసెఫ్ ఆ గ్లాసు లోని జలాన్ని తాగుతూ తలెత్తి సిద్ధేంద్ర మహర్షి ముఖంలోకి చూసాడు. ఒక కాంతిచక్రం ఆ మహర్షి తలవెనుక పరిభ్రమిస్తున్నట్లు కనిపించింది. 

మరుక్షణం సిద్ధేంద్ర మహర్షి యేసు ప్రభువులా గోచరించాడు. కళ్ళు మూసితెరిచే లోగా అది మాయమై పోయింది. మరుక్షణం కరుణ కురిపించే చూపులతో సిద్ధ పురుషునిగా, శాంతరసంతో పరబ్రహ్మ స్వరూపుడుగానూ ప్రకాశించాడు. 


ఆజలం తాగగానే జోసెఫ్ కడుపులో నొప్పి, ఒంట్లో మంటలు మటు మాయమై పోయాయి. 

జోసెఫ్, సిద్ధేంద్ర మహర్షికి కాళ్ళకు నమస్కరించి “మళ్ళీ వస్తా స్వామీ” అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 


మళ్ళీ అతను దొంగతనాల జోలికిపోలేదు.. తను దోచుకున్న డబ్బులు, నగలు నిరుపేదలకు పంచిపెట్టి సిద్ధేంద్ర మహర్షి శిష్యుడిగా చేరిపోయాడు. 


ఆ ఘటనతో సిద్ధేంద్ర మహర్షి పేరు జనాలలో మారుమ్రోగి పోయింది. ఎంతో మందిని ఆ ఘటన ప్రభావితం చేసింది. ఎందరో ఆయన శిష్యులుగా ధర్మ సంస్థాపన కోసం నడుం బిగించి ముందుకు వచ్చారు. ఆంగ్లేయ అధికారులు కూడా సిద్ధేంద్ర మహర్షి వున్న దరిదాపుల్లోకి రావటానికి సంకోచించేవారు. 

కొంత కాలం తరువాత సిద్ధేంద్ర మహర్షి భార్య చనిపోయింది. 


సిద్ధేంద్ర మహర్షి కొడుకు సిద్ధపురుష్ యుక్త వయసుకు రాగానే అతనికి వివాహం చేసి మిగిలి వున్న కొద్దిపాటి ఆస్తిని అతనికి అప్పగించి తాను పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచం వైపు దృష్టి మరల్చాడు. ఊరూరూ తిరుగుతూ ధర్మ ప్రబోధనలు చేస్తూ జనులను సన్మార్గంలో నడిచేలా కృషి చేసాడు. 


దేశంలో స్వాతంత్రోద్యమం ఊపందుకుంది. తాను స్వయంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొనక పోయినా ఎందరో క్షతగాత్రులకు తనకు చేతైన వైద్యం చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. 


ప్రజలను సన్మార్గంలో నడిచేలా చేస్తూ, ఆధ్యాత్మికతను బోధిస్తూ శతవసంతాల జీవితం గడిపి నిర్వాణం చెందాడు సిద్ధేంద్ర మహర్షి. 



*********************************


ఆరాత్రి సిద్ధరామయ్య తన మనవడికి ఈ కథంతా చెప్పుకొచ్చాడు. 

“అటువంటి మహా పురుషులు నూటికో కోటికో ఒక్కరు పుడతారు. మన వంశంలో వారు జన్మించి మన వంశ గౌరవాన్ని పెంచారు. వారే మన వంశోద్ధారకులు. మనమంతా వారి అడుగు జాడలలో నడవాలి. 

ఆ మహాపురుషుడిని స్మరించుకుంటూ, మన వంశంలో పుట్టిన పిల్లలకు పెట్టే పేరులో అతని పేరు వుండేలా పెట్టుకుంటున్నాము. 


మనసుతో గానీ, వాక్కుతో గానీ, శారీరకంగా గానీ ఎవరికీ ఎలాంటి బాధను, కష్టాన్ని కలిగించకుండా వుండాలి. స్వార్థాన్ని త్యజించాలి. ప్రతీజీవి పట్ల ప్రేమ, కరుణ, దయ కలిగివుండాలి. 

ఇచ్చిన మాటకు కట్టుబడిఉండటం, సత్యం పలకడం, నియమబద్ధమైన జీవితం, దొంగతనం చేయకపోవడం, మనది కానిదాన్ని ఆశించకపోవడం, ఆశ, దురాశలను వదిలివేయడం ఇవన్నీ చేసినప్పుడే మనిషి మహాత్ముడు అవుతాడు. 


‘సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి.. ’ అన్నారు మహాకవి గురజాడ. 

‘పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని.. ’ అన్నారు సి. నారాయణ రెడ్డి. 


సాయంత్రం నువ్వు అడిగిన నీతివాక్యం కూడా ఇదే చెపుతుంది. 

ఇతరులకు సహాయం చేయడం అనేది మానవత్వం వున్న ప్రతి మనిషి అలవరచుకోవాలి. 

‘స్వాతంత్య్రం, 

సమభావం, 

సౌభ్రాత్రం

సౌహార్ధం

పునాదులై ఇళ్లు లేచి, 

జనావళికి శుభం పూచి ____

శాంతి, శాంతి, శాంతి, శాంతి

జగమంతా జయిస్తుంది, 

ఈ స్వప్నం నిజమవుతుంది !

ఈ స్వర్గం ఋజువుతుంది !’ అని

ఆకాక్షించారు మహాకవి శ్రీ శ్రీ..


అందరూ బాగుండాలి. అందులో మనముండాలి అని అనుకునే వాళ్లు కూడా చాలా మందే ఉంటారు. అలా అనుకోవడం పురాతన కాలం నుంచే ఉంది. 


దేవుడిని ప్రార్థించేటప్పుడు

‘సర్వేజనా సుఖినో భవంతు’, ‘లోకాసమస్తా సుఖినోభవంతు’

అంటూ మనసులోనే దైవ నామస్మరణ చేసుకుంటూ వుంటాం కదా!


ఇవన్నీ నాకు మా నాన్న చెప్పారు. 

నేను మీ నాన్నకు చెప్పాను. 

ఈ రోజు నీకు చెపుతున్నాను. 

నువ్వు పెద్దవాడిని అయ్యాక

మన వంశ చరిత్రను నీకొడుకులకు, 

నీ మనమలకు చెప్పాలి. సరేనా!

చాలా పొద్దుపోయింది. ఇక వెళ్ళి పడుకో” అన్నాడు సిద్ధరామయ్య. 


సిద్ధార్థ తాతయ్యకు గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. 


***********************************


పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.



51 views0 comments

Comentários


bottom of page