గతి తప్పుతున్న మనిషి మార్గం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Jan 23
- 5 min read
#KandarpaMurthy, #కందర్పమూర్తి, #గతితప్పుతున్నమనిషిమార్గం, #GathiThapputhunnaManishiMargam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Gathi Thapputhunna Manishi Margam - New Telugu Story Written By Kandarpa Murthy Published In manatelugukathalu.com On 23/01/2025
గతి తప్పుతున్న మనిషి మార్గం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
కోటీశ్వరుడైనా సామాన్య మానవుడైనా బిక్షగాడైనా కోటివిద్యలు కూటికోసమే, కడుపుకు పట్టెడు మెతుకుల కోసమే అన్న విషయం అందరికీ తెల్సిందే.
ఆకలి అనేది లేకపోతే ప్రపంచమే లేదు. మనుషులైనా జంతువులైనా పక్షులైనా జల చరాలైనా సమయానికి ఏదో ఒక ఆహారం ఉండవల్సిందే. అన్ని జీవులు ఆహారం కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఆ ఆహారం కోసం రాత్రి పగలు కష్టపడవల్సి వస్తుంది.
శ్రీమంతులు విలాసవంతమైన భవనాల్లో నివశిస్తూ, గాలి మోటార్లలో వాతానుకూల నాలుగు చక్రాల విదేశీ వాహనాల్లో తిరిగినా, నక్షత్రాల హోటళ్లు క్లబ్బులు పబ్బుల్లో గడిపినా, ఆకలిని తీర్చుకోడానికి ఏవి ఎలా తిన్నా పట్టెడు మెతుకులు కావాల్సిందే.
సామాన్యుడు ఆశించేది కడుపుకు పట్టెడు మెతుకులు, కట్టుకోడానికి గుడ్డ, ఉండటానికి గూడు. ఆస్తులు అంతస్తులు సూట్లుబూట్ల కోసం ఆరాట పడడు. ఉన్నంతలో తిని కంటినిండా కునుకు తీస్తాడు. ధనవంతులు వారి సంపదను పెంచుకోడానికి పరిశ్రమలు, వ్యాపారాలు, సంస్థలు వంటివి ప్రారంభించి కార్మిక కూలి జనాల శ్రమను దోచుకుంటున్నారు.
గ్రామాల్లో అన్నదాతలకు సరైన విత్తనాలు ఎరువులు, బేంకు రుణాలు అందక, కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, దళారుల చేతిలో ఆర్థికంగా నష్టపోవడం, మార్కెట్లకు తెచ్చిన పంటకు రక్షణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షాలు సమయానికి కురవక పంటలు పండక జీవనోపాధి కోసం పల్లెజనులు పట్నాలు, నగరాలు ఇతర రాష్ట్రాలకు గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారు. ఉన్న ఊరును కన్నవారిని కట్టుకున్న వారినీ వదిలి వారందరి నివాసం కోసం పిల్లల చదువుల కోసం కష్టపడుతున్నారు.
పల్లె రైతుకూలి ప్రజలు వృత్తి విద్యల వారు జరుగుబాటు లేక పట్నాలు నగరాలకు ఎగబడటంతో అక్కడ జనాభా వత్తిడి పెరిగి ఆహార నీటి నివాస విద్యుత్ మురుగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. మురికి వాడలు కార్మిక కోలనీలు బిక్షగాళ్లు చిరు వ్యాపారాలు పెరుగుతూ వచ్చాయి.
కడుపులో చల్ల కదలకుండా చేసేవే ప్రభుత్వ ఉద్యోగాలు. ఉద్యోగ భద్రత, మధ్యలో జీతాల పెరుగుదల, కావల్సిన వస్తు సంపద, జీవిత చరమాంకంలో చింతలేని పెన్షన్ ఆసరా.
అయినా సంతృప్తి లేని ఉద్యోగ జీవులు ఎంగిలి మెతుకుల కోసం జలగల్లాగ సామాన్యబడుగు జీవులను పీల్చి లంచాల రూపంలో డబ్బు కూడబెడుతున్నారు.
ప్రజల కోసం ప్రజల చేత ఓటు ఆనే రాజ్యాంగ హక్కుతో ఎన్నుకో బడిన ప్రజాప్రతినిధులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు పొంది అనైతిక అవినీతి అక్రమ ఆస్తుల కేసుల్లో ఇరుక్కుంటున్నారు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ పెద్ద అక్షరాలతో
బోర్డులు కనిపించినా ప్రభుత్వ ఆదాయానికి మద్యం దుకాణాలు శ్రీరామ రక్ష.. కార్పొరేట్ హాస్పిటల్సుకు కాసుల పంట.
వ్యాపార వాణిజ్య వేత్తలు తమ పలుకుబడి డబ్బు ఖర్చు చేసి ఎలక్షన్లలో గెలిచి వారి వ్యాపారాలు పరిశ్రమలు సంస్థలను అక్రమ పద్దతుల్లో విస్తరించి నల్ల బజారు ద్వారా అక్రమ ఆస్థులు కూడబెట్టి ప్రభుత్వ బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు ఋణంగా తీసుకుని ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతున్నారు.
మనిషికి భయం పాపభీతి అనేది లేకపోతే అన్యాయాలు అక్రమాలు హత్యలు మానభంగాలు తప్పవు. ఇప్పుడు సమాజంలో అవే జరుగుతున్నాయి. మతం కులం జాతి భేద
భావనతో వర్గాలుగా విడిపోయి వైషమ్యాలతో సఖ్యత లేకుండా దుర్భర జీవితాలు గడుపుతున్నారు.
ఓట్ల కోసం రాజకీయ నాయకులు మతాల కులాల చిచ్చుతో ప్రజలను విడదీసి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఎప్పుడో జరిగిన చారిత్రాత్మక తప్పిదాలను వెలికి తీసి రెచ్చగొట్టి సామరస్యత లేకుండా చేస్తున్నారు. ఈ ఘర్షణల్లో నలిగిపోయేది బడుగు బలహీన సామాన్య ప్రజలే. అన్యాయాల్ని అక్రమాల్ని ప్రశ్నించిన వారిని ఆటంకవాది సమాజద్రోహి అని ముద్ర వేసి కేసులు పెట్టి కారాగారాల్లో తోస్తారు. మరి కొందర్ని అడ్రసు లేకుండా చేస్తున్నారు.
న్యాయంగానో అన్యాయంగానో కోటాను కోట్ల రూపాయలు కూడ బెడుతున్న బడాబాబులు తృప్తిగా పట్టెడు మెతుకులు తినలేరు. కంటినిండా నిద్ర పోలేరు. ఆ డబ్బును ఎలా దాచుకోవాలనే మానసిక శరీర ఆరోగ్య వేదనలే కావచ్చు. పేరుకు కోటీశ్వరుడు, నిజానికి తిండికి బిక్షాధిపతి. సమాజంలో సెలబ్రిటీలుగా చెలామణి అవుతుంటారు.
ఒక సామాన్య మనిషి రోడ్డు మీద నిలబడి టీ స్టాల్లో తృప్తిగా ఒక కప్పు చాయ్ తాగి కావల్సింది కొని తినగలడు. సెలబ్రెటీల మాదిరి అంగరక్షకులు రక్షకభటుల అవుసరం లేదు. దొరికింది తిని నిశ్చింతగా నిద్రపోతాడు.
కోటి విద్యలు కూటికోసమే, కడుపుకు పట్టెడు మెతుకుల కోసమే అని తెలిసినా దురాశ అత్యాశలతో మనిషి లోని స్వార్థం చావడం లేదు. ఎంత ఆస్థి కూడ బెట్టినా వారసులకు అప్పగించడం తప్ప చనిపోయి నాక వెంట తీసుకుపోయేది ఏమీ లేదనే నిజం తెల్సినా ఎందుకో ఈ యాతన? జీవించి ఉన్నప్పుడే సమాజంలో ఆర్థికంగా బాధ పడే నిస్సహాయకులు, వికలాంగులు, వయోవృద్దులకు, పాఠశాలలకు, ధర్మశాలలు, వైద్య శాలలు, వృద్ధాశ్రమాలకు మూగజీవాలకు ఆశ్రయం, ఆర్థిక సాయంతో వసతులు ఏర్పాట్లు చేస్తే సంపాదించిన డబ్బుకు విలువ, పేరు, సార్థకత ఉంటుంది.
మనిషి చేసిన కరెన్సీ నోట్లే మనిషి జీవిత మనుగడను ప్రశ్నిస్తున్నాయి. డబ్బుతో మానవ సంబంధాలు విచ్ఛిన్న మవుతున్నాయి. డబ్బు కోసం మనిషి ప్రాణాలు తీస్తున్నారు. డబ్బుతోనే ప్రాణాలు పోయగలుగుతున్నారు.
ఆప్యాయతలు అనుబంధాలు డబ్బుతోనే కలుస్తున్నాయి.
కొంతమంది సత్పురుషులు వారి ప్రవచనాలతో ఆధ్యాత్మిక బోధన చేస్తుంటే మరికొందరు బాబాలు గురువులు పీఠాధిపతుల పేరుతో ప్రజల మానసిక బలహీనతలను సాకుగా చూపి మాన ధన్నాన్ని దోచుకుంటున్నారు.
విద్య నేర్పే గురువులంటే గౌరవ భావన కనబరుస్తారు. అటువంటి గురువులే నైతిక విలువలకు తిలోదకాలిచ్చి వివిద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చెయ్యడం సిగ్గుచేటు. కంటికి రెప్పలా కాపాడ వల్సిన చిన్నారులను ఆప్తులే వేధిస్తుంటే వారికి రక్షణ ఎక్కడ?
రెక్కలొచ్చిన పిల్లలు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలు, మఠాలు, స్వచ్ఛంద సామాజిక సంస్థలకు అప్పగిస్తున్నారు. డబ్బు సంపాదన కోసం పరాయి దేశాలకు పోయి అక్కడే స్థిర నివాసం చూసుకుంటున్నారు.
విజ్ఞానాన్ని పెంచే చదువు వ్యాపారం, ప్రాణాలు పోసే వైద్యం వ్యాపారం, దేవాలయాలలో దేవుడి దర్శనం వ్యాపారం, అన్నం పెట్టే అన్నదాతలకు కావల్సిన దినుసులు వ్యాపారం, యువతకు బ్రతుకు తెరువు చూపే కొలువులు వ్యాపారం, గాలీ నీరూ గూడూ ఆహార సామగ్రి అన్నీ వ్యాపారాలైతే సామాన్య జీవి బతికే దెట్లా ? దేశంలోని న్యాయ స్థానాలు ధర్మ నిరతితో వారి విధులు నిర్వహిస్తున్నందున కొంతైనా బడుగు బలహీన వర్గ ప్రజలకు మేలు జరుగుతోంది.
కోవిడ్ వైరస్ వంటి భయంకర మహమ్మారి ఎలా ప్రపంచ దేశాల ఆర్థిక వాణిజ్య వ్యాపార వినోద విద్య వైద్య రంగాలపై ప్రభావం చూపి ఎన్ని వేల ప్రాణాలు పోయాయో అందరికీ తెల్సిందే. ఇదంతా ఎవరి పాపం?
నవతరం యువతలో చదువులు ఎక్కువై అతి తెలివి పెరిగింది. పాత తరం పెద్దలు మంచి మాట చెప్పినా పాత చింతకాయ పచ్చడి మాదిరి తీసిపారెస్తున్నారు. వారిని ఎగతాళి చేస్తు అగౌరవ పరుస్తున్నారు.
వయోవృద్ధ తల్లిదండ్రుల్ని వృద్దాశ్రమాలకు పంపుతున్నారు. వారికి ఆస్థిపాస్తుల్ని పంచితే ఒకలా లేకపోతే దుర్భాషలతో మానసిక క్షోభకు గురిచేస్తూ ఇక జీవితం
చాలు భగవంతుడా అనేలా చేస్తున్నారు.
నేటి తరం వత్తిడి జీవితంతో డబ్బు సంపాదనలో రాత్రి పగలు కష్ట పడుతూ కుటుంబ సుఖ సంతోషాలకు అనుబంధాలకు దూరమవుతున్నారు. డబ్బు సంపాదనలో పెడ దారులు అనుసరిస్తు మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు.
దుర్వ్యసనాలతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమై భార్యాభర్తల విడిపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు లేక సంఘ విద్రోహక శక్తులుగా మారుతున్నారు.
నేటి ఆధునిక యుగంలో మనిషి సాంకేతికంగా ఎదిగి ఎంతో సాధించానని జబ్బులు గుద్దుకుంటున్నాడు కాని ఇదే సాంకేతికత తన మనుగడను శాసిస్తుందని గ్రహిస్తే
మంచిది. మనిషి సాంకేతికంగా ఎంత ప్రగతి సాధిస్తున్నాడో నైతికంగా అంత పతనమైపోతున్నాడు.
అణ్వాయుధాలు చూపి ఒకరి నొకరు భయపెడుతున్నారు. ఆధిపత్యం కోసం దేశాల మద్య స్పర్థలు పెంచి పబ్బం గడుపుతున్నారు. అణు జీవ రసాయన పరిశోధనలు మానవ శ్రేయస్సు కోసం కాకుండా ప్రపంచ వినాశనం కోసం వినియోగింపబడి జన నాశనమవుతుంది.
యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు. యుద్ధం జరిగిన రెండు లేక ఎన్ని దేశాలలోనైన ప్రాణ నష్టం ఆస్తి నష్టంతో పాటు వాతావరణ కాలుష్యం జలకాలుష్యంతో పాటు భూమి నిస్సారమవుతుంది.
ప్రాచీన కట్టడాలతో పాటు భవంతులు కూలుతాయి. యుద్ధం ముగిసిన తర్వాత తరాల వరకు ఆర్థిక మాంద్యం, దారిద్య్రం పీడిస్తుంది. ఇలా అన్ని విధాల దేశంలో విధ్వంసం జరుగుతుంటే యుద్ధాల వల్ల ఎవరికి లాభం ?
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments