top of page
Original.png

మనకాలపు మహాకవి - గూడ అంజయ్య

2 hours ago
5 min read

తెలంగాణ ప్రజాకవి గూడ అంజయ్య జీవితం, ప్రజా చైతన్య గీతాలు, తెలంగాణ ఉద్యమం, గ్రామీణ ప్రజల పోరాటాలను ప్రతిబింబించే స్మారక చిత్రం
తెలంగాణ ప్రజాకవి గూడ అంజయ్య

Manakalapu Mahakavi - Guda Anjayya - Telugu Inspirational Article | Thokala Rajesham

మనకాలపు మహాకవి - గూడ అంజయ్య - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | తోకల రాజేశం

Published in manatelugukathalu.com on 01/11/2026


తెలంగాణ ప్రజల బతుకు పోరాటాలకు తన పాటలతో గొంతుకగా నిలిచిన మహాకవి గూడ అంజయ్య. నవంబర్ 1న ఆయన జయంతి సందర్భంగా ప్రజా చైతన్యానికి అంకితమైన ఆయన జీవితం, పాటలు, సాహిత్య విశిష్టతను స్మరించుకుందాం.


తెలంగాణ ప్రజల జీవితంలో పాట ఒక అంతర్భాగం. పాట ఎల్లవేళలా ప్రజల చైతన్యం కోసం కంకణబద్ధమై పనిచేసింది. పనికి, పాటకు గల పేగు బంధాన్ని సాహిత్య చరిత్రకారులే కాదు, సామాజిక చరిత్రకారులు కూడా నిరూపించారు. శ్రమైక జీవన సౌందర్యంలో నుంచి పుట్టిన పాట క్రమంగా శ్రమ ఫలితాన్ని అక్రమంగా దోచుకుంటున్న వాళ్ళ గుండెల్లో గునపమై కూర్చున్న చరిత్ర తెలంగాణ సొంతం. అలాంటి చరిత్ర గూడ అంజయ్య. 


గూడ అంజయ్య తెలంగాణ పాటకు పర్యాయపదం లాంటివాడు. తెలంగాణలో జరిగిన తరతరాల దోపిడీ చరిత్రను ఒక్క పాటలో, ఒక్క వాక్యం ద్వారా రూపు కట్టించిన మహాకవి అంజన్న. తెలుగు సాహిత్య చరిత్రలో గూడ అంజయ్య లాంటివాళ్లకు సరియైన గుర్తింపు లభించలేదు. కానీ ప్రజల గుండెల్లో మాత్రం భద్రమైన, శాశ్వతమైన స్థానం లభించింది.


గూడ అంజన్న మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలానికి చెందిన లింగాపూర్ గ్రామంలో 01 నవంబరు 1954లో ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. తల్లి లసుమమ్మ, తండ్రి లసుమయ్య. అంజన్న అనేక సందర్భాలలో చెప్పిన మాటలను బట్టి — ఆయన తొలి గురువు తన తండ్రి గారే. తన తండ్రి వద్ద రామాయణ, భాగవత, పౌరాణిక గాథలు వింటూ వాటిని లోతుగా అర్థం చేసుకుంటూ పెరిగాడు. అదే బాల్యదశలో వివిధ రకాల వృత్తి కళాకారులు ప్రదర్శించే భాగవతాలు — ఇతరేతర సృజనాత్మక కళారూపాలు — వాటిలోని పద్యాలు, పాటలు అంజయ్య బాల్యానంతర జీవితం మీద కూడా బలమైన ముద్రను వేశాయి. 


ఈ క్రమంలోనే గూడ అంజన్న ఒకరోజు బడికి వెళ్తున్న సందర్భంలో తోవలో ఏదో రందితో బాధగా వెళ్తున్న ఒక ముసలి రైతు కనిపించాడట. ఎంత పని చేసినా దొర దగ్గర చేసిన అప్పు తీరటం లేదని "ఊరిడిచి నేబోదునా, ఉరివోసుకుని సత్తునా" అంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడట. 


ఈ సంఘటన నుంచి స్ఫూర్తి పొందిన అంజన్న దొరల ఆగడాలు, రైతుల జీవితాల నేపథ్యంలో 1970లో అంటే తన 16వ ఏట "ఊరిడిసి నే బోదునా" అన్న పాటను రాశాడు. ఇదే అంజన్న రాసిన మొట్టమొదటి పాట. మొదటి పాటనే దొరతనం మీద ఎక్కుపెట్టిన అంజన్న తన పాటలను చివరిదాకా అలాగే కొనసాగించాడు. 


ఈ పాట 2005లో వచ్చిన 'వేగుచుక్కలు' అనే సినిమాలో చేరి విమలక్క గొంతు ద్వారా తెలంగాణ సమాజాన్ని ఒక కుదుపు కుదిపింది. అయితే తాను కలిసిన ఇలాంటి వ్యక్తుల నుంచి పొందిన అనుభవాలకి తోడు దళితుడైనందుకు బాల్యంలో తాననుభవించిన వివక్ష, తరగతి గదిలోనూ ఎదురుపడిన కులం బాధలు అంజయ్యను తీవ్రంగా ఆలోచింపజేశాయి. 


అదే విధంగా 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం దాని పర్యవసనాలు అంజయ్యలో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే విప్లవ భావాలు కలిగిన సంఘాలకు సన్నిహితుడయ్యాడు. ఈ క్రమంలో అరుణోదయ సాంస్కృతిక సంస్థలో పనిచేస్తూ అనేక గ్రామాలను తిరగటం వల్ల ఆనాటి తెలంగాణ పల్లెల్లోని కష్టాలు, పేదరికం, అవిద్య, కులభేదాలు — మరోవైపు దొరల, భూస్వాముల విలాసాలను దగ్గర నుంచి గమనించే అవకాశం కలిగింది. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను ఎలాగైనా చైతన్యవంతం చేయాలనే పట్టుదల అంజన్నలో కలిగింది. 


ఈ ఆశయానికి పాటకు మించిన ఆయుధం లేదని అంజన్న అనుభవంలోకి వచ్చింది. ఈ రకంగా అంజయ్య ఒక అనివార్య పరిస్థితిలో పాటగాడయ్యాడు. పాటను ఆయుధంగా మలుచుకొని సమాజానికి చేయవలసిన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి చూపించాడు.


అయితే ఎమర్జెన్సీలో భాగంగా విప్లవోద్యమంతో సంబంధాలున్నాయన్న నెపం మీద అరెస్టయిన అంజన్న రెండేళ్లు జైల్లో ఉండవలసి వచ్చింది. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను, విప్లవోద్యమం కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన శ్రమజీవుల జీవితాల నేపథ్యంలో అంజయ్య అద్భుతమైన నవల రాశాడు. దాని పేరు 'పొలిమేర'.

 అంజయ్యనే స్వయంగా చెప్పినట్లు 'ఈ నవలలోని పాత్రలన్నీ సహజ సిద్ధమైనవే. పొలిమేర నవల ఒక అద్భుత కల్పితం కాదు. ఇది ఆధునిక ఆకలి కేకల బతుకు పోరాటం'. ఈ నవలకు ముందుమాట రాస్తూ "ఇది ఇప్పటిదాకా రాయని బడుగు బతుకుల నుంచి వచ్చిన దళిత నవల. దళితుల త్యాగాల నవల" అన్నాడు బి.ఎస్. రాములు. 


అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత డి.ఫార్మసీ చదివి 1978వ సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు గ్రామంలో ఫార్మసిస్ట్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు అంజన్న. 


జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పనిచేసి హైదరాబాదుకు బదిలీపై వచ్చి అక్కడ కూడా అనేక ప్రాంతాల్లో అంకితభావంతో పనిచేసి 2012లో ఉద్యోగ విరమణ చేశాడు. అయితే అంజయ్యలోని ఉద్యోగ జీవితం తాలూకు అనుభవాలు, అంతకు ముందటి జీవితం వెరసి ఆయన పాటకు పదును పెట్టాయి. ఈ నేపథ్యాన్ని ఆయన చాలా పాటల్లో పసిగట్టవచ్చు.


గూడ అంజయ్య ప్రజాపక్షం వహించిన కవి. తన ప్రతి పాటను ప్రజల చేతుల్లో ఆయుధంగా పెట్టిన కవి. సినిమాల కోసం పాటలు రాసినప్పటికీ అందులోనూ ప్రజాహిత దృక్పథంతోనే పాటలు రాసిన నిబద్ధత ఆయనది. తెలంగాణ ప్రజల్లోకి కూడా అంజయ్య పాటలు చొచ్చుకెళ్ళినంత తీవ్రంగా మరొకరి పాటలు వెళ్ళలేకపోయాయి. ఈ పాటల్లోని జీవితం ఆ ప్రజలదే కావటం అందుకు ప్రధాన కారణం. భాష మరొక కారణం. 


కవితాత్మకత, అలంకారాలు అంటూ సాహిత్య సంబంధమైన విషయాలను పెద్దగా పట్టించుకోకుండా చెప్పే విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పటం ఇంకొక కారణం. గూడ అంజయ్య పాటలు పాడుకుంటూ దొరల గడీలను స్వయంగా ప్రజలే కూల్చిన చరిత్ర తెలంగాణ వ్యాప్తంగా చాలా పల్లెల్లో నమోదయింది. ఇట్లాంటి ప్రేరణను ప్రజల్లో కలిగించిన పాట "ఊరు మనదిరా!" అనే పాట. 


ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాట. దేశ స్థాయిలో జరిగిన అనేక ప్రజోద్యమాలకు ముందు నిలిచి అన్యాయాన్ని నిలదీసి, ప్రశ్నించిన పాట ఇది. ఈ పాటకు ముందు, తర్వాత అంజయ్య ఎంతో సాహిత్య సృష్టి చేశాడు. ఆ సాహిత్యమంతా నష్టపోయినా సరే కేవలం 'ఊరు మనదిరా!' అన్న పాటతోనే ఈ ప్రపంచంలో దోపిడీ పీడనలున్నంత కాలం, అది ఎన్ని వేల ఏండ్లయినా సరే గూడ అంజయ్య జీవించే ఉంటాడు. 


వాటి మీద యుద్ధం చేస్తూనే ఉంటాడు. తెలంగాణ తొలి దశ ఉద్యమానంతరం, మలిదశ ఉద్యమంలో కూడా అంజయ్య చాలా శక్తివంతమైన పాటలు రాశాడు. తెలంగాణకు ఎక్కడ నుంచి ఎలా అన్యాయం జరుగుకుంటూ వచ్చిందో తన పాటలతో రూపు కట్టించాడు. తేలికైన మాటల్లో చెప్పే విషయాన్ని గుండెకు గుచ్చుకునేలా రాయటం అంజయ్య విశిష్టత. ఇంత మంది పాటగాళ్లలో తనదైన ప్రత్యేక ముద్రను సాధించి చివరిదాకా దానిని నిలుపుకున్న అరుదైన మహాకవి అంజన్న.


అయితే అంజయ్య పాటలే కాకుండా ముందే చెప్పినట్టు ఒక నవల, కొన్ని కథలు రాశాడు. కథలు 'దళిత కథలు' పేరుతో సంకలనమయ్యాయి. ఆయన తన పాటల్లో ప్రజా పోరాటాలను స్పృశిస్తే, కథలు-నవల ద్వారా ఆ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పాడు. ప్రజలు పోరాటాల వైపు మళ్లటానికి గల భౌతిక, మానసిక పరిస్థితులను కథల్లో చక్కగా అర్థం చేయించాడు. 


ఈ రకంగా తన సాహిత్యం ద్వారా తెలంగాణ ప్రజల జీవిత చరిత్రను, అంటే తెలంగాణ చరిత్రను రికార్డు చేశాడు. ఏనాటి ఉత్తమ సాహిత్యమైనా చేయవలసిన పని ఇదే. ఈ క్రమంలో అంజయ్య సాహిత్యాన్ని విశ్లేషిస్తే తెలంగాణ సమగ్ర చరిత్ర, దాని స్వరూప-స్వభావాలు స్పష్టంగా తెలుస్తాయి. సమాజం పట్ల తనకు గల బాధ్యతను సాహిత్యం ద్వారా సక్రమంగా నిర్వర్తించిన కవుల్లో గూడ అంజయ్య అందరికన్నా ముందువరుసలో నిలుస్తాడు. 


ఇలాంటి మన కాలపు మహాకవి చివరి దశలో తీవ్రమైన అనారోగ్యానికి గురై 21 జూన్ 2016 నాడు కన్నుమూశాడు. మరణం కేవలం ఆయన శరీరానికే కానీ ఆయన పాటకు కాదు. ఆయన పాట ఎప్పటికీ ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంటుంది.


(నవంబర్ 01, గూడ అంజయ్య గారి జయంతి సందర్భంగా)

- తోకల రాజేశం


***



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y








తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



తోకల రాజేశం

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.

తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page