గుహుడు
- Pratap Ch
- 2 days ago
- 2 min read
#ChPratap, #గుహుడు, #Guhudu, #TeluguDevotionalStory

Guhudu - New Telugu Story Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 16/08/2025
గుహుడు - తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రామాయణంలోని అనేక పాత్రలు మనకు ఎన్నో విలువలు, పాఠాలు నేర్పిస్తాయి. వాటిలో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం గుహుడు. స్నేహం, విశ్వాసం, భక్తి, కృతజ్ఞతలకు నిదర్శనంగా నిలిచిన ఈ పాత్ర ఆదికవి వాల్మీకి కలంలో అమరమైంది. గంగానది ఒడ్డున ఉన్న గిరిజనుల రాజ్యం “నిషాద”కు గుహుడు రాజు. వనవాసానికి బయలుదేరిన శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యను వీడి నిషాద ప్రాంతానికి చేరుకున్నప్పుడు, వారిని గమనించిన గుహుడు స్వయంగా వచ్చి కలిశాడు. అప్పుడు రామునితో గుహుడికి ఏర్పడిన పరిచయం క్షణాల్లోనే స్నేహంగా మారి, ఆ స్నేహం జీవితాంతం కొనసాగింది.
రామచంద్రుడు, సీత, లక్ష్మణులు గంగానదిని దాటాలని నిర్ణయించగా, గుహుడు వారిని అత్యంత గౌరవంతో ఆతిథ్యం ఇచ్చి, సురక్షితంగా గంగానదిని దాటించాడు. రాముని నిష్కపట స్వభావం, సత్యనిష్ఠ గుహుడి హృదయాన్ని గెలుచుకున్నాయి. “తతో రాజా గుహో నామ రామస్యాత్మసమస్సఖా” అని ఆదికవి వర్ణించినట్లుగా, గుహుడు రాముని ఆత్మసమాన స్నేహితుడిగా నిలిచాడు.
రాత్రి అయ్యాక, గుహుడు తనతో పాటు లక్ష్మణునితో కలిసి సీతారాములకు కాపలా కాశాడు. రాజకుమారుడైన రఘువీరుడు నేలపై పరుండటం గుహుడికి తట్టుకోలేని దుఃఖాన్ని కలిగించింది. లక్ష్మణుడు చెప్పిన రామగాథను వింటూ గుహుడు కన్నీరు మున్నీరు అయ్యాడు. ఆదికవి చెప్పిన “నరేంద్రపుత్రే గురుసౌహృదాద్గుహో ముమోద బాష్పం వ్యసనాబి పీడితః” అనే వాక్యం, గుహుడి ఆవేదన, భక్తిని ప్రతిబింబిస్తుంది.
గుహుడి నిస్వార్థమైన స్నేహం మరోసారి ప్రతిఫలించింది, రాముని తమ్ముడు భరతుడు నిషాద ప్రాంతానికి చేరుకున్నప్పుడు. రాముడు వనవాసంలో ఉన్న సమయంలో భరతుడు అక్కడకు రాగానే, గుహుడు అతన్ని అనుమానించాడు. భరతుడు రామునికి హాని చేసేందుకే వచ్చాడని భావించి, తన స్నేహితుని రక్షణ కోసం ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధమయ్యాడు. కానీ భరతుడు తన అన్నను తిరిగి అయోధ్యకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చాడని గ్రహించిన తర్వాత, గుహుడు అతనికి సాదర స్వాగతం పలికి, తన గౌరవాన్ని చూపాడు.
చిరస్మరణీయమైన ఈ స్నేహం రాముని హృదయంలో ఎప్పటికీ నిలిచింది. 14 ఏళ్ల వనవాసం పూర్తై రాముడు అయోధ్యకు చేరుకున్నాక కూడా గుహుడిని మరిచిపోలేదు. గుహుడు–రాముని బంధం కేవలం రెండు వ్యక్తుల మధ్య ఉన్న స్నేహం మాత్రమే కాదు; అది విశ్వాసం, భక్తి, నిజాయితీకి ప్రతీక.
గుహుడి వ్యక్తిత్వం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది — స్నేహం అనేది స్వార్థరహితం కావాలి, స్నేహితుని సుఖదుఃఖాలలో తోడుగా ఉండాలి, అవసరమైతే రక్షణ కోసం ప్రాణాలనైనా అర్పించడానికి వెనకాడకూడదు. నేటి భారతదేశ అభివృద్ధికి ప్రతి భారతీయుడు ఇలాంటి నిబద్ధత, విశ్వాసం కలిగిన స్నేహాన్ని ఆచరించాలి.
రాముడు–గుహుడి కథ మనసుకు హత్తుకునే ఒక అద్భుతమైన ఉదంతం. నిజమైన స్నేహం కులం, వంశం, స్థితి, సంపదలతో సంబంధం లేకుండా హృదయాల మధ్య ఏర్పడుతుంది. ఆ బంధం ఎప్పటికీ చెదరని, కాలం దానిని మరిపించలేనిది.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
Comments