'Gunturu Gongura - Part 2/3' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao Published In manatelugukathalu.com On 27/05/2024
'గుంటూరు గోంగూర - పార్ట్ 2/3' పెద్ద కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
జరిగిన కథ:
మహేష్ ఒక సెలెబ్రిటీ.
స్టార్ హోటల్ లో పార్టీ జరుగుతున్నప్పుడు అతని స్నేహితుడు మురళి పై అంతస్తునుండి కిందికి దూకి మరణిస్తాడు.
మహేష్ అమెరికాకి బయలుదేరుతాడు.
ఇక గుంటూరు గోంగూర పార్ట్ 2 చదవండి.
మహేష్ కి మేఘాల మాటున విమానం అందంగా ఆనందంగా ఆహ్లాదంగ సాగిపోతున్నట్లనిపించింది. విమానం లో మహేష్ ఉన్నాడు. " ఇకపై విమానాన్నే నా యిల్లు చేసుకోవాలి. అందుకు సరిపడ సంపాదించాలి.
బాగా బాగా సంపాదించాలి. ధనమూలం ఇదమ్ జగత్. " అనుకున్నాడు మహేష్.
తను అనుకున్నట్లే మహేష్ విమానంలోనే తిరగ సాగాడు. తను అనుకున్నదే తన అదృష్టమైతే, తన జీవితం స్వర్గ తుల్యమవుతుంది. నోటినుండి మాట రాక ముందే మనసులోనిది కంటి ముందు నిలుస్తుంది. మహేష్ ను చూస్తుంటే అంత అదృష్టం త్రిమూర్తులకు, తదితర దేవతలకు కూడా లేదనిపిస్తుంది.
మహేష్ తను సంచరించే విమానం లో ద్వాదశాది త్యుల్లా 12 మంది ఉన్నారు. అందులో ముగ్గురు పైలెట్లు ఉన్నారు. పైలెట్లు లో ఒక ఆడఫైలెట్ కూడా ఉంది. మిగతా తొమ్మిది మంది మహేష్ కు విమానంలో సపర్యలు చేస్తుంటారు. అందులో ఆరుగురు అమ్మాయి లే ఉన్నారు. విమానం లోనే గుంటూరు గోంగూర పచ్చడి, ఉలవచారు వేసుకుని మహేష్ అన్నం తిన్నాడు. ఆ తర్వాత ఆడవారితో ఆడిపాడాడు.
విమానం మేఘాల మాటునుండి భూమి మీదకు వచ్చింది. మహేష్ కనులు తెరిచాడు. " ఓ ఇదంతా కలా!" అని అనుకున్నాడు. ఈ కలనే నిజం చేసుకోవాలనుకుంటూ మహేష్ విమానం దిగాడు.
***
కాల చక్రం రమారమి ఇరవై సంవత్సరాలు ముందు కు మున్ముందుకు సాగిపోయింది.
ఏ వంక లేని చంద్రవంక ఒంటరిగా తన గదిలో కూర్చుంది. తను అనుభవించిన రాజ భోగాలను యాది చేసుకుంది. ఒకప్పుడు తన దేవుని గదిలో ఉన్న బంగారు పీఠను, దాని మీద ఉన్న బంగారు వరలక్ష్మీ బొమ్మను గుర్తు చేసుకుంది. కొందరు రాజకీయ నాయకులు తన కాలికి బంగారు చెప్పులు చేయించి, తొడిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది. అవసరమైతే తన యింటి ముందు విమానం దింపు తానన్న రాజకీయ నాయకులను గుర్తు చేసుకుంది.
ప్రస్తుతం విరగటానికి సిద్దంగా ఉన్న గదిలోని టేబుల్ ని చంద్రవంక చూసింది. తన వైభవం గతించ డానికి తన దోషం కించిత్ కూడా లేదని చంద్రవంక అనుకుంది. తన భర్త గోవిందరావు వలనే తనకీ దుస్థితి వచ్చిందనుకుంది.
చంద్రవంక గోడ మీద ఉన్న తన తండ్రి అమర్నాథ్ ఫోటోను చూసింది. తన తండ్రి అమర్నాథ్ తన భర్త గోవిందరావు ను " మై డియర్ అల్లుడు.. కిళ్ళీ కోసం పదివేలు తగలేయడం అవివేకం. యంగ్ ఏజ్ లో నేను ఎంజాయ్ చేయలేకపోయానని మీ అందరిని ఎంజాయ్ చెయ్యమంటున్నాను. ఎంజాయ్ చేయడం ఎంత ముఖ్యమో సంపాదనా మార్గాలు అన్వేషించడం అంత ముఖ్యం. మనీ వచ్చే మార్గం మహా పెద్దదైతే లక్షపెట్టి గోంగూర కాడ కూడ కొనవచ్చును. రాబడి తక్కువ పోబడి ఎక్కువ అయినప్పుడు ఆ మార్గాన్ని చూడనే చూడకూడదు. " అని మందలించిన సంఘటనను యాది చేసుకుంది.
చంద్రవంక తన భర్త గోవిందరావు ను వెనకవేసుకు రావడానికి " యస్. గోంగూర.. గోంగూర పచ్చడి.... గోంగూర.... గుంటూరు గోంగూర అంటూ నా భర్త యిల్లిల్లు తిరిగి గోంగూర వ్యాపారమే చేసాడు. మేం గోంగూర తోట దగ్గరే కలుసుకున్నాం. కళ్ళు కళ్ళు అక్కడే కలుపుకున్నాం. అక్కడే ఒకటయ్యాం. అంత మాత్రాన అల్లుడిని పట్టుకుని గోంగూర గోంగూర... గుంటూరు గోంగూర అంటూ అన్నేసి మాటలు అనడానికి మీకు నోరెలా వచ్చింది డాడీ? అసలు మీరు మనుషులేనా? లేక మనీకి పుట్టిన వారా? మా వారు ఇల్లరికపు అల్లుడుగా రావడానికి ఒప్పుకుంది మీ మనీ చూసి కాదు. నా మీద ఉన్న సూపర్ లవ్వుతో... మేం ఒంటరిగా ఇక్కడికంటే హాయిగా,రిచ్ గా బయట ఉండి బతకగలం. " అని పంతం పట్టి పుట్టిల్లును వదలడం యాది చేసుకుంది.
పంతం పట్టి బయటకు వచ్చిన చంద్రవంకకు పది సంవత్సరాలు తిరిగేసరికల్లా సినిమా హాలు ముందు గుంటూరు గోంగూర పచ్చడులు, టమోట పచ్చడులు, ఆవకాయ,మాగాయ పచ్చడులు అమ్ముకోవలసిన దుస్థితి వచ్చింది. గుంటూరు గోంగూర కు తన భర్తకు ఉన్న సంబంధం యాది చేసుకుని మనకు గాడ్ రాసిందే గ్రేట్ వే. గాడ్ వే ఈజ్ గ్రేట్ వే అని చంద్రవంక సరి పెట్టు కుంది. తండ్రి దగ్గరకు వెళితే తన తండ్రి తనని మరలా ఒళ్ళో కూర్చోపెట్టుకుని గుంటూరు గోంగూర పచ్చడి ముద్దల్లో శ్రేష్టమైన నెయ్యిని,బంగారపు చుక్కలను కరిగించి పోసి తినిపిస్తాడని చంద్రవంకకు తెలుసు.
అయితే తండ్రిని భర్త కోసం అనరాని మాటలు అని యింటిని వదిలేసాక మరలా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? ఎంత చెడ్డా ఆ తండ్రి కూతురినే కదా? ఆ రాజసం వదులుకోకూడదు. అని చంద్రవంక అనుకుని తండ్రి ముఖం చూడటం మానేసింది.
చంద్రవంక గత వైభవ యోచనలనుండి బయట పడింది. కళ్ళజోడు సరిచేసుకుంది. ఒకప్పుడు బంగా రపు కళ్ళజోడును వాడేదానిని అనుకుంది. సెల్ఫోన్ మోగడంతో టేబుల్ మీద ఉన్న సెల్ఫోన్ దగ్గరకు వచ్చింది. చంద్రవంక సెల్ తీసింది.
సెల్ఫోన్ లో తన కూతురు అమృత చేసిన వీడియో కాల్ ను కళ్ళజోడు సరిచేసుకుంటూ చూసింది.
" హాయ్ అమృ... ఇప్పుడు ఫోన్ చేసావ్ విషయం ఏమిటి? ఇంపార్టెంటా? మోస్ట్ ఇంపార్టెంటా?" కూతురుని అడిగింది చంద్రవంక.
" యస్ మమ్మీ... మోస్ట్ ఇంపార్టెంట్ విషయం... ఇక్కడ వంటశాలలో ఒక యంగ్ హీరో తాతయ్య రూపంలో ఉన్నాడు. అతగాడు " వంటశాలలో మగవాడు.. నలభీములకు సరిజోడు.. మగవాడంటే అలుసా? వేమనకిది తెలుసా? గుమ్మడికాయ వడియాలు చక్కగ పెట్టే మగవాడు.. మహిళలకు ఆదర్శపురుషుడు " అని పాడుకుంటూ పప్పు రుబ్బుతున్నాడు. వాడు రుబ్బడ మే కాదు. మరో వందమందితో పప్పు రుబ్బిస్తున్నాడు అంటూ ఆ దృశ్యాన్ని అమృత సెల్ ఫోన్ లో తల్లి చంద్రవంకకు చూపించింది.
చంద్రవంక కళ్ళజోడు సరిచేసుకుంటూ ఆ దృశ్యాన్ని పరీక్షగా చూసింది.
" వీడు అమెరికా లో ఉన్న మా మహేష్ సుపుత్రుడై ఉంటాడు. తండ్రి సంపద సృష్టించడం లో సూపర్ అయితే కొడుకు పప్పు రుబ్బడంలో సూపర్ కాబోలు. " అని చంద్రవంక అనుకుంది. వెంటనే" అమృ.. నువ్వు అక్కడే ఉండు. నేను వస్తున్నాను. " అని చంద్రవంక సెల్ ఆఫ్ చేసింది.
అమృత హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్ళింది. సెల్ఫోన్ లోని వీడియోను చూపిస్తూ" మిష్టర్ ఈ పప్పు రుబ్బే జెంటిల్మెన్ ఎవరు? ఈ కాలంలో రోట్లో పప్పు రుబ్బిస్తున్నారు. మీ హోటల్లో పప్పు రుబ్బే మిషన్స్ లేవా?" అని అమృత మేనేజర్ ని అడిగింది.
" ఎందుకు లేవు తల్లి. ? మా హోటల్ లో అంటే ఈ హోటల్ లో పప్పు రుబ్బే మిషన్స్ ఒకటికి పది పైగా ఉన్నాయి. అన్నీ బాగా అంటే చాలా చాలా బాగా పని చేస్తున్నాయి. కానీ అతగాడే.. పది రోజుల క్రితం కాబోలు హోటల్ కి వచ్చాడు. మిషన్ లో రుబ్బిన పిండి కంటే రోట్లో రుబ్బిన పిండికే టేస్టు ఎక్కువ అన్నాడు. ముందు నా వర్క్ చూడండి. ఆపై శాలరీ ఇవ్వండి అన్నాడు. ఎక్కడో మూలన ఉన్న రుబ్బు రోలు తీసాడు. మరో వంద రోళ్ళు తెప్పించి ఈ రుబ్బు రోళ్ళ కార్యక్రమం మొదలు పెట్టాడు. మంచి పనిమంతుడు. ఆడుతుపాడుతూ పిండి రుబ్బేస్తున్నాడు. అతగాడు వచ్చాక మాకు కరెంట్ ఆదా పెరిగింది. అతగాడి పుణ్యమా అని రోటిపిండి దోశకు గిరాకికూడా పెరిగింది. హోటల్ రద్దీ కూడా పెరిగింది.
అతగాడు రాకముందు ఈగలు తోలుకునే మేము ఇప్పుడు మనీ మనీ... లెక్కపెట్టుకోవడంలో మహా బిజీగా ఉన్నాము. మా లేడీ యజమాని మెడలో తాళికట్టించుకొనగానే ఈ హోటల్ లో ఈగల రద్దీ పెరిగింది. అతగాడి ఆగమనంతో మనీ మనీ మోర్ మనీ రద్దీ పెరిగింది. అందుకే గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు. అనేది పెద్దలే కాబోలు. వారికేం పనిపాట ఉండదు కదా? అందుకే ఇలాంటివి చాలా అంటారు. అన్నోడు ఆరింద. విన్నోడు గోవింద "అని అమృత అడిగిన ప్రశ్నలకు,అడగని ప్రశ్నలకు సమాధానం ఆనందంతో చెప్పాడు హోటల్ మేనేజర్.
వారిద్దరూ సెల్ ఫోన్ లోని వీడియోను చూస్తూ మాట్లాడుకొనుచుండగా అక్కడకు చంద్రవంక వచ్చింది.
అమృత పక్కన నిలబడింది.
చంద్రవంక చేతిలో కుక్క మెడకు తగిలించే గొలుసు ఉంది. కానీ ఆ గొలుసు చివర కుక్క లేదు. హోటల్ మేనేజర్ చంద్రవంక చేతిలోని కుక్క గొలుసు చూచి కొంచెం భయపడ్డాడు.
" మేడమ్ పప్పు రుబ్బే వానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మేడమ్. కుక్క గొలుసు తో వచ్చారు. దానితో నన్ను వీరబాదుడు బాదుతారా? " భయపడుతూ చంద్రవంకను అడిగాడు హోటల్ మేనేజర్.
" అలాంటిదేం లేదు. ఒకప్పుడు మాకూ మహా మంచి కుక్క ఉండేదని తెలియచేయడాని కుక్క గొలుసు తో వచ్చాం. " అని హోటల్ మేనేజర్ తో అంది చంద్రవంక.
చంద్రవంక పప్పురుబ్బే వాని దగ్గరకు వచ్చి కిందనుంచి పైకి ఒకటికి నాలుగు సార్లు చూసింది.
" మీ డాడీ పేరు మహేష్ కదా?" అని అడిగింది.
" యస్. మై డాడీ నేమై ఈజ్ మహేష్. ఐ యాం గుంటూరు గోంగూర. నిజం చెప్పాలంటే ఈ పప్పు రుబ్బడంలో ఉన్న సుఖం మరెక్కడ లేదండి. అందుకే గుండమ్మ కథ సినిమా లో యన్. టీ. ఆర్. పప్పు రుబ్బాడు. ముందడుగు సినిమా లో సూపర్ స్టార్ కృష్ణ పప్పు రుబ్బాడు.
పప్పు రుబ్బడమంటే అంత ఆషా మాషా తమాషా కాదండి. పప్పు రుబ్బాలంటే చాలా చాలా టెక్నిక్స్ తెలిసి ఉండాలి. లేకపోతే చేతివేళ్ళు నలుగు తాయి. కన్నీళ్ళు వస్తాయి. " చంద్రవంక తో అన్నాడు గుంటూరు గోంగూర.
" గుంటూరు గోంగూర అదేం పేరు? అయినా ఎక్కడో అమెరికాలో ఉండవలసినవాడివి ఇక్కడ ఉన్నా వేమిటి?" గుంటూరు గోంగూర ని అడిగింది చంద్రవంక.
" అమెరికా ప్రెసిడెంట్... యస్.. అమెరిక ప్రెసిడెంటే మా డాడీని కిడ్నాప్ చేసాడు. నన్ను ఇండియా వెళ్ళి పప్పు రుబ్బడంలో ఉన్న టెక్నిక్స్ అన్నీ తెలుసుకుని వచ్చి నాకు చెప్పు. లేకుంటే మీ డాడీ ని మర్డర్ చేసి, నాకే గుర్తుండని ప్రదేశంలో పడేస్తా అన్నాడు. మా డాడీకి అమెరికా ప్రెసిడెంట్ బాగానే తెలుసులే. అందుకే ఇండియా వచ్చాను. " పప్పు రుబ్బడం వేగం చేస్తూ అన్నాడు గుంటూరు గోంగూర.
" ఆ ప్రెసిడెంట్ పప్పు రుబ్బడం నేర్చుకోవాలంటే మీ డాడీనే కిడ్నాప్ చెయ్యాలా? గుండమ్మ కథ సినిమా చూస్తే సరిపోతుంది కదా? గుంటూరు గోంగూర ఇదేం పేరు రా విచిత్రంగా ఉంది? నీకొక మేనత్త ఉన్నట్లు మీ డాడీ నీకు చెప్పలేదా?" గుంటూరు గోంగూర ను అడిగింది చంద్రవంక.
" ఎందుకు చెప్పలేదు? చెప్పాడు. ఏదో వంక చంద్రవంక ఆమె పేరని కూడా చెప్పాడు. మై నేమ్ ఈజ్ గుంటూరు గోంగూర. దాని వెనుక కొండవీటి చాంతాడంత పెద్ద చరిత్ర ఉంది లే. " అన్నాడు గుంటూరు గోంగూర.
" ఇక్కడ అదంతా ఎందుకు? ఇంటికి వెళ్ళి మాట్లా డుకుందా రా " గుంటూరు గోంగూర తో అంది చంద్రవంక.
" అమెరికా ఇండియా అయినా ఇండియా అమెరికా అయినా నీ యింటికి నేను రాను అత్తా.. మేనత్త. కావాలంటే నువ్వే నా గదికి రా.. అక్కడ అఖిల పక్ష సమావేశం లాంటి సమావేశం ఏర్పాటు చేద్దాం. " అన్న గుంటూరు గోంగూర మాటలను విని అమృత, చంద్రవంక గుంటూరు గోంగూర యింటికి ప్రయాణం అయ్యారు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments