top of page

హామీపత్రం

#Hamipathram, #హామీపత్రం, #KasibhattaSasikanth, #కాశీభట్టశశికాంత్, #తెలుగుకథలు

ree

Hamipathram - New Telugu Story Written By Kasibhatta Sasikanth  

Published In manatelugukathalu.com On 22/09/2025

హామీపత్రం - తెలుగు కథ

రచన: కాశీభట్ట శశికాంత్


"ఇల్లు ఎలావుందిరా?" తను అద్దెకు దిగబోయే ఇంటినిచూసి, బయటకు వస్తూండగా అడిగాడు సురేష్. 


"ఇంటికేం బాగానే ఉంది. కానీ, నువ్వు ప్రస్తుతం ఉంటున్న ఇల్లంత కాదు. అద్దెకూడా ఎక్కువే” అని పెదవి విరిచాను. 


"అయినా ఇల్లు మారక తప్పదు. చెప్పానుగా, ఆ ఇంటి వాస్తు బాగాలేదు. ఆ ఇంట్లో చేరిన దగ్గర్నుంచి మనశ్శాంతిలేదు. ఒకటే ఖర్చులు"


"సరే, నీ నమ్మకం నీదేకానీ నా మాట ఎప్పుడు విన్నావు" అన్నాను. ఇద్దరం బైక్ మీద బయల్దేరాం. 


మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. నేనొక ప్రయివేట్ కంపెనీ ఉద్యోగిని. సురేష్, మునిసిపల్ స్కూల్ టీచర్. అంతే కాదు వాడొక చిన్న రచయిత. వాడి మానాన వాడు విరివిగా రాసి పడేస్తూంటాడు కానీ, రాయగా, రాయగా అపుడపుడు ఒకటీ అరా కథలు పడుతున్నాయంతే. 


ఒక మంచిరోజు చూసి వాడు ఇల్లు మారాడు. నేను దగ్గరుండి సహాయం చేసాను. 


ఆ తరువాత నాలుగురోజులు నాకు ఆఫీస్​లో పని ఎక్కువగా ఉండి వాళ్ళింటికి వెళ్ళడమే కుదర్లేదు. 

-------------------------------

ఒకరోజు నేను వెళ్ళేసరికి సురేష్ వరండాలో కుర్చీలో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. 

"సామానంతా సర్దేసారా" అని ఆడిగాను వాడికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. 


"ఊ" అని ఊరుకున్నాడు ఏదో అలోచిస్తూ. 


"ఏమిటి, ఏదో తెగ ఆలోచిస్తున్నావు" అని అడిగాను. 


"ఇందాక, ఆ మూల గదిలో సామాను సర్దుతుండగా, అల్మారా పైఅరలో తనకి ఒక కాగితం దొరికిందన్నయ్యా. 


అప్పట్నుంచి, ఏదో పురావస్తు తవ్వకాల్లో దొరికిన శాశనాన్ని చదువుతున్నట్టు, కొద్దిసేపు ఆ కాగితాన్నే చూస్తున్నారు, అంతలోనే ఆలోచనల్లో పడుతున్నారు” అంది దివ్య.


"ఏమిటా కాగితం. అంత ముఖ్యమైనదా" 


"ఇదొక హామీపత్రం" అన్నాడు సురేష్.


"దేనికి హామీ? ఆస్థికా. మనకేమైనా ఉపయోగపడుతుందా"


"అలాంటిది కాదు. కథతో పాటూ, అది తన స్వంతమని, రచయితలు ఇచ్చేది" 


"అదెవరిది. ఇంతకుముందు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళదా"


"అవును"


"అంటే, నీకన్నాముందు ఈ ఇంట్లో నీలాంటివాడు ఒకడుండి, వెళ్ళాడన్నమాట" అన్నాను నవ్వుతూ. 


"నాలాంటివాడు కాదురాబాబూ, పెద్ద రచయిత. శ్రీధర్ గారి పేరు విన్నావు కదా" 


విన్నాను అన్నట్టుగా తలూపాను.

 

"నేను ఈ ఇంట్లో దిగడానికి ముందు కొన్ని నెలలు ఈ ఇల్లు ఖాళీగానే ఉంది. అంతకు ముందు ఈ ఇంట్లో శ్రీధర్ గారి కుటుంబం అద్దెకుండేవారట. ఆయన ఈ ఇంట్లో ఉండగానే పోయారట. శ్రీధర్ గారు ఉన్నపుడు, ఈ ఇంటికి పెద్ద, పెద్ద రచయితలు వస్తూండేవారట. అపుడపుడు సమావేశాలు కూడా జరుగుతుండేవిట. ఎదురింట్లో ఉంటున్న వెంకట్రావుగారు చెప్పారు. ఈ ఇంట్లోనే ఆయన ఎన్నో గొప్ప కథలు రాసారు. అలాంటి ఇంట్లో ఉండే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన రాసిన హామీపత్రం ఇది"


"ఇల్లు ఖాళీ చేసేటపుడు ఆ హామీపత్రం పొరపాటున అల్మారాలో ఉండిపోయుంటుంది. ఆ పాత కాగితం ముక్క నీకు దొరికిందే అనుకో, దాన్ని పడేయక, ఏదో గుప్తనిధి మ్యాప్ దొరికినట్టు దాచుకోవడం, దాని గురించి దీర్ఘంగా ఆలోచించడం, అవసరమా"

 "కథపేరు తీర్చుకోలేని ఋణం అని ఉంది. హామీపత్రం రాసారంటే కథ పూర్తయిపోయుండాలి. మరి, కథను ఎందుకు పంపలేదో"


"పంపలేదని ఎందుకనుకుంటున్నావు"


"హామీపత్రం జతచేయకుండా ఎలా పంపుతారు"


"ఒక అనవసర విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు"


"నేను ఆలోచిస్తున్నది అది కాదు" అని ఆ కాగితం నా చేతికిచ్చి "దానిమీదున్న తేదీ చదువు" అన్నాడు.

 

"పదహారు మార్చి, రెండువేల ఇరవైనాలుగు" 


"ఆ తేదీకి పదిరోజుల ముందే శ్రీధర్ గారు చనిపోయారు" అన్నాడు సురేష్ తాపీగా. 


వింటున్న ఇద్దరం ఉలిక్కిపడి "అదెలా సాధ్యం" అన్నాం ఒకేసారి. 


"ఇపుడు అర్థమయిందా ఈ కాగితం ప్రాముఖ్యత"


"తేదీ వేయడంలో పొరబాటు జరిగుండొచ్చుకదా" అన్నాను. 


సురేష్ కొంతసేపు ఆలోచించి "అవకాశం లేకపోలేదు. ఏదిఏమైనా, ఒకసారి ఆయన కుటుంబసభ్యులని కలిస్తే అసలు విషయం బయటపడుతుంది. వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటున్నారని తెలిసింది"


"ఊరుకోరా, ఏదో కాగితంముక్క దొరికితే దాన్ని పట్టుకుని పెద్ద డిటెక్టివ్ లా బయల్దేరావు. ఇంత చిన్న విషయానికి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి కలుస్తావా ఏమిటి" అన్నాను నవ్వుతూ. 

--------------------------------------

ఒకరోజు నేను, సురేష్ శ్యామల థియేటర్ ముందునుంచి బైక్ మీద వెళ్తూండగా "ఈ పక్క వీధిలోనే ముకుందం ఉండేది" అన్నాడు సురేష్.

 

"ఎవరా ముకుందం" 


"శ్రీధర్ గారి అబ్బాయి" 


"అతనా"


"ఒకసారి వాళ్ళింటికి వెళ్ళొద్దామా" 


"శ్రీధర్ గారి అభిమానివి కనక, ఆయనుంటే వెళ్ళినా అర్ధముంది. ఇపుడెందుకు"


"ఊరికినే. నీకు వేరే పనేమీలేదుకదా"


"ఎమీలేదులే. వెళ్దాం" అయిష్టంగానే అన్నాను. 

ముకుందం ఉండే ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. ఆ ఇంటిముందు బైక్ దిగి, గేట్ తీసుకుని లోపలకు వెళ్ళాం. ఇంటి ముందు వరండాలో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ కనిపించాడొకతను.. ముకుందం అనుకుంట. మేమిద్దరం వెళ్ళి పరిచయం చేసుకున్నాం. 


శ్రీదర్ గారి అభిమానినని, గతంలో వాళ్ళున్న ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నానని సురేష్ చెప్పేసరికి అతను చాలా సంతోషించాడు. ముగ్గురం కూర్చుని కొద్దిసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాక, సురేష్ నెమ్మదిగా శ్రీదర్ గారి "తీర్చుకోలేని ఋణం" కథ ప్రస్తావన తెచ్చాడు. 


"నాన్నగారి కథలన్నీ నాకు గుర్తున్నాయి. ఆ పేరుమీద కథేమీ రాయలేదే"


"పత్రికకు పంపారోలేదో తెలియదు గానీ, కథ రాసారని మాత్రం చెప్పగలను. ఆయన రాసిన ఆఖరి కథ అదే అయుంటుంది"


"నేనే ఎపుడూ వినని కథ గురించి మీకెవరు చెప్పారు" 

ఆశ్చర్యంగా అడిగాడు ముకుందం. 


"ఆ ఇంట్లో ఈ హామీపత్రం దొరికింది" అని జేబులోనుంచి హామీపత్రం బయటకుతీసి ముకుందానికి ఇచ్చాడు సురేష్.


ఆ కాగితం జేబులో పెట్టుకుని మరీ వచ్చాడంటే, నాతో అనలేదుగానీ, ఇక్కడికి రావాలనే ఉద్దేశ్యం ముందునుంచీ ఉందన్నమాట అనుకున్నాను.


"నాన్నగారు ఈ కథ రాయాలనుకున్నారన్నమాట. అంతలోనే.. " అని ఆపి నిట్టూర్చాడు ముకుందం. 


"అదేమిటి? కథ పూర్తయ్యాకే హామీపత్రం రాస్తారుకదా. అంతేకాదు, దానిమీదున్నతేదీ చూసారా" ఆశ్చర్యంగా అడిగాడు సురేష్. 


"చూసాను. నాన్నగారు ముందు హామీపత్రం రాసి, తరువాత కథ రాస్తారు"


"చాలా చిత్రంగా ఉందే. ఎందుకలా చేసేవారు"


"నాన్నగారికి ఏదైనా ఆలోచన తడితే, దాన్ని కాగితమ్మీద పెట్టాడానికి చాలా సమయం తీసుకునేవారు. ఒకోసారి నెలలు గడిచిపోయేవి. పైకి, మూడ్ రావాలనేవారుకానీ, అసలు కారణం.. బద్దకం. మా పోరు పడలేక ఆయన ఒక పద్దతి కనిపెట్టారు. 


దాని ప్రకారం, ఆలోచన వచ్చిందే తడవుగా, ముందు తేదీతో హామీపత్రం రాసేయాలి. అందులో వేసిన తేదీకి కథ పూర్తిచెయ్యాలి. అది బాగానే పనిచేసింది. నాలుగైదు కథలు, అనుకున్న సమయానికి రాసేసారు. ఈ హామీపత్రం ఎపుడు రాసారోకానీ, ఆ తేదీ రాకుండానే వెళ్ళిపోయారు" అన్నాడు ముకుందం విచారంగా. 


"క్షమించండి. ఈ కాగితం చూపించి మిమ్మల్ని మరింత బాధ పెట్టినట్టున్నాం" అన్నాను.


"అదేమీలేదులెండి. పైగా, ఏదో కాగితం అని పారేయకుండా, శ్రద్దగా తీసుకొచ్చి నాకు చూపించడం చాలా ఆనందం కలిగించింది. మీరు మాట్లాడుతుండండి, ఇపుడే వస్తాను" అని ముకుందం ఇంట్లోకి వెళ్ళాడు. 


సురేష్ నాకేసి చూసి కళ్ళెగరేసాడు. 


"వీళ్ళు ఆ హామీపత్రం ఆ ఇంట్లో వదిలేయడం, అది ఎటూ పోకుండా నా చేతికి దొరకడం, శ్రీధర్ గారికున్న విచిత్రమైన అలవాటు వలన నాకు దాని మీద ఆసక్తి కలగడం, చూస్తుంటే.. ఈ సంఘటనల మధ్య ఏదో లింకున్నట్టుగా అనిపించడంలేదా" అన్నాడు సురేష్.

 

"నాకు అలా ఏమీ అనిపించడంలేదు. నేను ఆ ఇంట్లో దిగుంటే, అసలు విషయం ఇక్కడిదాకా వచ్చేదే కాదు" తేలికగా అన్నాను.


"ఆ ఇంట్లో నీలాంటివాడుకాకుండా నేను దిగడం కూడా ఒక లింకే"

"ఈ లింకులగోల వదిలేసి, శ్రీధర్ గారు ఎలాగూ రాయలేదుకనక ఆ కథేదో నువ్వు రాయి" అన్నాను.


సురేష్ ఏదో అనబోతుండగా ముకుందం ఒక ట్రేలో కాఫీ కప్పులు తీసుకొచ్చి మా ఇద్దరికీ చెరో కప్పు ఇచ్చి తనొకటి తీసుకున్నాడు. ఆ తర్వాత మేం ముగ్గురం అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ముకుందం, శ్రీధర్ గారి అలవాట్ల గురించి, కథ రాసేపద్దతి గురించి చెప్పి, వాళ్ళ నాన్నగారికి సంకల్పబలం ఉందని, ఆయన అనుకుంటే ఏదైనా జరిగిపోతుందంటూ ఏవేవో చెప్పుకొచ్చాడు. 


అతని మాటల్లో సురేష్ ఎంతగా లీనమయిపోయాడంటే, నేను బయల్దేరదాం అంటూ చేసిన సైగల్ని అసలు పట్టించుకోలేదు. పదినిమిషాలు మాట్లాడి వచ్చేద్దాం అనుకున్నవాళ్ళం కాస్తా గంటసేపు కూర్చుండిపోయాం. 


చివరికి నేనే "బాగా లేటయింది. బయల్దేరదాం" అంటే, అయిష్టంగానే కదిలాడు. అంతలో ఫోన్ వస్తే సురేష్ మాట్లాడుతూ ముందు నడిచాడు. వాళ్ళనాన్నగారి గురించి ఏవో చెబుతూ ముకుందం నాతో పాటూ గేటు వరకూ వచ్చాడు. అతని వద్ద శలవుతీసుకుని మేమిద్దరం బైక్ మీద బయల్దేరాం. 


"ఈ ముకుందం మంచి కలుపుగోలుగానే ఉన్నాడుగానీ, మాటలే చిత్రంగా ఉన్నాయి" అన్నాను.

 

"నాకేమీ చిత్రంగా అనిపించలేదే"

"అతను మనతో చెప్పినవాటి గురించి కాదు నేను అనేది. నువ్వు ఫోన్ మట్లాడుతూ ముందుకు వెళ్ళాక ఇంకా ఏదో చెప్పుకొచ్చాళ్ళే" 


"ఏమన్నాడు"


"శ్రీధర్ గారు ఆ మధ్య కలలోకి వచ్చారుట. ఏదో పని మిగిలిపోయింది, పూర్తిచేయాలి అన్నారట. ఏమిటా అనుకుంటున్నాం. బహుశా ఈ కథగురించే అయుంటుంది అన్నాడు"


"వెరీ ఇంట్రస్టింగ్. ఇంకా ఏమన్నాడు"


"వదిలేయ్. ఏవో అర్ధంలేని మాటలు. చెబితే నువ్వుకూడా నవ్వుతావు" అన్నాను.


"నీకన్నీ నవ్వులాటలే. సస్పెన్స్ లో పెట్టక అదేదో చెప్పరా బాబు"


"ఏం చెప్పను. ఆయన అన్నారంటే ఆ పని అయిపోతుంది అన్నాడు" 


సురేష్ సడన్ గా బైక్ ఆపేసి "ఇదేదో ఆలోచించవలసిందే" అన్నాడు.


"ఏమిటి ఆలోచించేది. అతనికేదో కలొచ్చింది. అదేదో పెద్ద విశేషంలా చెప్పాడు. శ్రీధర్ గారు కలలోకొచ్చి అన్నంత మాత్రన, ఎలా అయిపోతుంది. పోయినాయన వచ్చి కథ రాస్తాడా ఏమిటి. ఆ విషయం వదిలేసి నువ్వు బైక్ పోనీ.. ఇప్పటికే చాలా లేటయింది" అన్నాను.


సురేష్ ఇంకేమీ మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసాడు. 

-----------------------------------------

ఇది జరిగిన తరువాత ఎప్పట్లానే మేమిద్దరం తరచుగా కలుస్తూండేవాళ్ళం. దాదాపు రెండు వారాల తరవాత, ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళినపుడు సురేష్ నన్ను కూర్చోమని, తన చేతిరాతతో ఉన్న ఒక కాగితాల కట్ట ఇచ్చి చదవమన్నాడు. దానిమీద "తీర్చుకోలేని ఋణం" అన్న శీర్షిక చూసి "మొత్తానికి రాసేసావన్నమాట. మంచిది. అయినా, ఎప్పుడూ నాకు చూపించకుండానే పంపేవాడివి. ఈసారేమిటి" అన్నాను. 


వాడేమీ మాట్లాడకుండా, చదవమని సైగ చేసాడు. 

నేను కథ చదవటం పూర్తిచేసి "చాలా బాగా రాసావు. కథ నడిపించిన విధానం చాలా బాగుంది. ముగింపైతే అనూహ్యంగా ఉంది. నువ్వు ఇప్పటిదాకా రాసిన కథలన్నీ దీని ముందు దిగదుడుపు" అని అభినందనగా కరచాలనం చేసాను 


"ఈ కథ నేను రాయలేదు" అన్నాడు నెమ్మదిగా.


"మరెవరు రాసారు. దివ్యా?" ఆశ్చర్యంగా అడిగాను దివ్య వైపు చూస్తూ.


"నేను కాదన్నయ్యా, ఆయనే రాసారు" అంది దివ్య నవ్వుతూ.


"మరేమిటి ఇలా మాట్లాడుతున్నాడు"


"రాసింది నేనే.. "అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు.


"ఏమైంది నీకివాళ" అన్నాను.


"ఏమీలేదులే వదిలేయ్" అన్నాడు.


సురేష్ ఆ కథను ఒక అంతర్జాల పత్రిక ప్రకటించిన కథల పోటీకి పంపాడు. వాడంత బాగా రాసిన కథకి ఏ బహుమతి వస్తుందో తెలుసుకోవాలని ఎంత ఆత్రుత చెందానంటే, ఎన్నడూలేనిది, పోటీ ఫలితాలకోసం వాడికన్నా నేనే ఎక్కువగా ఎదురు చూసాను.


ఎదురు చూడగా, చూడగా ఎట్టకేలకు కథలపోటీ ఫలితాలు వచ్చాయి. సురేష్ కథకు మూడవ బహుమతి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే వాడింటికి వెళ్ళి అభినందించాను. నేను ఉత్సాహంగా మాట్లాడుతుంటే, వాడు మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయాడు. 


"అదేమిట్రా.. నేనింత వాగుతున్నాను, నీలో ఉత్సాహమే కనబడటంలేదు" ఆశ్చర్యంగా అడిగాను. 


"ఇందులో అంత ఆనందించాల్సినదేముంది" చాలా మామూలుగా అన్నాడు. 


"దీన్నే బడాయి అంటారు. పత్రికలలో పడ్డ నీ కథలని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. అలాంటిది, ఎందరో చెయ్యి తిరిగిన రచయితలతో పోటీ పడి, నీ కథ మూడవ బహుమతి గెలుచుకోవడం ఆనందించాల్సిన విషయం కాదా" 


"ఈ కథ రాయించినవారు కూడా చెయ్యి తిరిగిన రచయితే" అని కొన్ని క్షణాలు నా మొహంకేసి చూసి "అర్ధంకాలేదా. రాసింది నేను, రాయించింది శ్రీధర్ గారు" అన్నాడు.

 

"ఏం మాట్లాడుతున్నావు" చిరాకుగా అన్నాను.


"శ్రీధర్ గారు అన్నట్టుగానే తన పని పూర్తి చేసారు"


"ఆ ముకుందం ఏదో అర్ధంలేకుండా మాట్లాడితే ఆ ముక్క పట్టుకున్నావేమిట్రా. నీతో ఆ విషయం అనవసరంగా చెప్పాను"


"నువ్వు చెప్పకపోయినా జరిగేదదే. ఆయన సంకల్పబలం అలాంటిది" అన్నాడు కళ్ళు పెద్దవిచేసి.


"ఓహో.. అంతవరకూ వచ్చావన్నమాట. ఇంతకీ, శ్రీధర్ గారు పక్కన కూర్చుని కథ రాయించారా, లేక కలలో కొచ్చి డిక్టేట్ చేసారా" వ్యంగ్యంగా అడిగాను. 


"కథ రాయడం మొదలుపెట్టానా.. కొన్నిరోజులు అసలు కలం కదిలేదికాదు. నిరాశగా అనిపించేది. అంతలో ఒకోరోజు వేగంగా ముందుకు సాగేది. మధ్యలో ఆగి, అప్పటిదాకా రాసింది చదివితే, ఈ వాక్యాలు నేనే రాసానా అని ఆశ్చర్యం కలిగేది. మళ్ళీ అంతలో స్తబ్దత ఆవరించేది. 


ఆ పదాలు తన్నుకు రావడం, అప్పటి నా మానసిక స్థితి.. స్వయంగా అనుభవిస్తేనేగానీ అర్ధంకాదు. ముగింపైతే, ఒక రాత్రివేళ మెలకువ వచ్చినపుడు అకస్మాత్తుగా తట్టిందంటే నమ్ముతావా" ఒక విధమైన తన్మయత్వంతో అన్నాడు సురేష్.

 

"సర్లే, ఈ చర్చవల్ల ఏమీతేలదులే కానీ, ముందు ముందు ఇంకా మంచి కథలు రాయి చాలు" 


"ఇదే నా చివరి కథ" అన్నాడు సురేష్ స్ఠిరంగా. నేను, దివ్య ఉలిక్కిపడ్డాం. 


"ఇంత మంచి కథ రాసిన తరువాత, బుద్దున్నవాడెవడైనా ఇలా మాట్లాడతాడా" అన్నాను కోపంగా. 


"శ్రీధర్ గారు అర్ధాంతరంగా పోవడం వలన, తాను రాద్దామనుకుని వదిలేసిన కథను నా ద్వారా పూర్తి చేసారు. కనుక, ఇంకముందు ఆయన సహాయం నాకుండదు. నేను కథలు రాయడం కొనసాగిస్తే, గతంలో రాసిన వాటిలానే ఉంటాయి. నా పేరుమీద ఇంత మంచి కథ వచ్చిన తరువాత, పేలవమైన ఆ కథల్ని పత్రికలకు పంపలేను. దానికన్నా ఈ కథతో ఆపేస్తే మర్యాదగా ఉంటుంది" అన్నాడు.


దివ్య ఏదో చెప్పబోతే వారించాడు. 


"ఇంకొక్క కథ రాయి. బాగా రాలేదనుకో, కథలు రాయడం మానేద్దువుగాని. ముందే ఒక నిర్ణయానికి వచ్చేయడమెందుకు" నచ్చచెప్పబోయాను.


"అనవసరం" అన్నాడు తల అడ్డంగా ఊపుతూ. 


"సరే, నువ్వింత గట్టిగా నిర్ణయించుకున్నావుగనక, నీకు నిజం చెప్పక తప్పదు" 


"ఏమిటది"


"శ్రీధర్ గారు తన కలలోకి వచ్చినట్టు ముకుందం నాతో ఏమీ చెప్పలేదు. అది నా కల్పితం"


వాడు నా వైపు అపనమ్మకంగాచూసి "నేను నమ్మను" అన్నాడు.

 

"కావాలంటే ముకుందానికి ఫోన్ చేసి కనుక్కో" అనేసరికి వాడు ఆశ్చర్యపోయి "ఎందుకలా చెప్పావు" అని కోపంగా అడిగాడు.


"శ్రీధర్ గారు, ఒక కథ రాసేటపుడు, ఎంత సమయం కేటాయిస్తారో, ఎంతగా దానిలో మునిగిపోతారో ముకుందం చెప్పినపుడు, నువ్వు చక చకా రాసిపడేసే కథలు గుర్తొచ్చాయి. ముకుందం మాటల్లో నువ్వు లీనమైన విధానం, జరుగుతున్న వాటి మధ్య ఏదో లింకుందన్న నీ అభిప్రాయం విన్న తరువాత శ్రీధర్ గారే కథ పూర్తిచేస్తానన్నారని చెబితే దాని ప్రభావం నీమీద ఎలా ఉంటుందా అని అప్పటికపుడు అనిపించి అలా చెప్పాను. నేను వ్యతిరేకంగా మాట్లాడితే నీ నమ్మకం బలపడుతుందని తెలుసుకనక, కావాలని ఖండించేవాడిని. ఆ అబద్దం నేను ఊహించినదానికన్నా ఎక్కువగానే నిన్ను కదిలించింది"


"అంటే, ఏదో శక్తి నా చేత రాయిస్తోందన్న భ్రమలో పడిపోయి, ఇంత మంచి కథ రాసేశానంటావు. నాలో సాధారణ స్థాయిలో ఉన్న సృజనాత్మకత అమాంతం పొంగి పొర్లిందంటావు" అన్నాడు వ్యంగ్యంగా.


"నీలోని ప్రతిభని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చేయగలదే కానీ, నీలో లేనిదాన్ని ఏ శక్తీ బయటకు తీసుకురాలేదు. ఇంతకాలం, ఆలోచన తట్టడమే ఆలస్యం అన్నట్టుగా హడావుడిగా కథలు రాసి పడేసేవాడివి. మొదటిసారిగా, ఈ కథ విషయంలో బాగా తపన పడ్డావు. ఒక రాత్రివేళ అకస్మాత్తుగా ముగింపు తట్టిందన్నావు చూడు, అదే.. నీ మెదడులో నిరతరాయంగా జరిగిన సంఘర్షణకి ఋజువు.


కథ రాసినంత కాలం నీకు తెలియకుండానే నీ మెదడు ఆ కథ చుట్టూ తిరుగుతూనే ఉంది. నీ లోలోపల బాగా నానింది కనుకనే, కథ అంత బరువెక్కింది. శ్రీధర్ గారే కథ పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉన్న నువ్వు మాత్రం, రాస్తున్నంత కాలం, ఆయన ప్రభావంతోనే కథ ముందుకు కదులుతోందనే భ్రమలో కూరుకుపోయావు. నువ్వు కథలు రాయడం మానేస్తానని అనకపోయుంటే, నేను ఇపుడుకూడా అసలు విషయం చేప్పేవాడినికాదు. అదృశ్యశక్తిని కాకుండా నువ్వు గుర్తించని స్వశక్తిని నమ్ముకుని కృషి చేస్తే ఇంకా మంచి రచనలు చేయగలవని నేను కచ్చితంగా చెప్పగలను"


సురేష్ కొంతసేపు ఎటోచూస్తూ మవునంగా ఉండిపోయి, అంతలోనే తేరుకుని "నువ్వింతచెప్పాకకూడా ఆ కథ నేనే రాసానని ధైర్యంగా అనలేకపోతున్నాను. నా మీద నాకన్నా నీకెక్కువ నమ్మకం ఉన్నందుకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. సరే, నీ మాట ఎందుకు కాదనాలి. సిన్సియర్ గా ఒక ప్రయత్నంచేసి చూస్తాను. ఏది ఏమైనా, వాళ్ళు హామీపత్రం ఇంట్లో వదిలేయడం.. " అని మళ్ళీ మొదలుపెట్టబోయాడు. 


"ఆ హామీపత్రమే దీనికంతటికీ కారణం. ఒప్పుకుంటాను. మళ్ళీ నువ్వు ఆ లింకులగోల మొదలుపెట్టకు" అన్నాను నవ్వుతూ. 


////-----------------------////


కాశీభట్ట శశికాంత్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

ree

పేరు: కాశీభట్ట శశికాంత్ 


తల్లిదండ్రులు: శ్రీమతి హైమావతి, శ్రీ బ్రహ్మనందం గార్లు

పుట్టి, పెరిగినది: తణుకు, పశ్చిమగోదావరి జిల్లా

చదువు: ఎం.కాం,  పి.జి.డి.ఎం.ఎం.,  బి.ఎల్.ఐ. ఎస్సీ. 

ఇష్టాలు: చదవడం, బుద్దికుదిరినపుడు రాయడం (ఆ బుద్దే ఆర్నెల్లకో, ఏడాదికో ఒకసారి కుదురుతుంది - అందుకే ఇప్పటికి మొత్తం రాసిన కథలు 30 మాత్రమే)

చిరునామా: కె.వి.ఎస్.డి తణుకు




1 Comment


కథ బాగుంది సర్

Like
bottom of page