top of page

హతవిధీ!



'Hathavidhi' written by Siriprasad

రచన : శిరిప్రసాద్


కనకారావు తన యిద్దరు కొడుకులతో కలిసి, కాష్ కౌంటింగ్ మెషీన్ లో నగదు లెక్కిస్తున్నాడు. ఒక్కో చెక్కపెట్టెలో ఐదు కోట్ల రూపాయలు పట్టేటట్టు చెక్కపెట్టెలు చేయించాడు.

ఆ పెట్టెలు చేసేటప్పుడు కార్పెంటర్ అడిగాడు, 'అయ్యా, యిన్ని పెట్టెలు చేయిస్తున్నారు; యెందుకు ?'

'ఎందుకోలేరా! ... పుస్తకాలు, ఫైల్స్, డాక్యుమెంట్స్ పెట్టి భద్ర పరచడానికి. నీ పని నువ్వు కానియ్యి! ...' అన్నాడు కనకారావు, మనస్సులో వాడ్ని అనవసర విషయాల్లో తల దూర్చుతున్నందుకు తిట్టుకుంటూ. నిజానికి వాడ్ని దూరప్రాంతం నించి పిలిపించాడు. ఇక్కడివాళ్ళకైతే అనుమానం రావచ్చని.

మొత్తం యిరవై పెట్టెల్లో వందకోట్లు సర్దేసారు కుటుంబం అంతా కలిసి. ఆ పెట్టెల్ని జాగ్రత్తగా కార్ గ్యారేజ్ లో నేలకింద కట్టిన నేలమాళిగ లోకి చేర్చారు. అది పూర్తిగా నిండిపోయింది. అక్కడున్న చిన్న కాష్ సేఫ్ లో ఆస్థిపత్రాలు, అగ్రీమెంట్లు , కొంచం క్యాష్ వుంటాయి . ఆ క్యాష్ తిరుపతి హుండీలో వేయాల్సింది. తన అదనపు ఆదాయంలో రెండు శాతం తిరుపతి హుండీలో వేస్తుంటాడు కనకారావు.

పని పూర్తయ్యాక కొడుకులిద్దరికీ చెరి పది లక్షలు యిచ్చాడు. కూలీ కింద కాదు; బహుమతిగా. ఆ డబ్బు మొత్తం యెలాగైనా ఆ కొడుకులకీ , వొక్కగానొక్క కూతురికి వెళ్లేవే ! తను అనుభవించేదెంత? ... గుప్తంగా వున్న రోగాలు తిండి కూడా సంతృప్తిగా తిననియ్యవు. ఇంట్లో అయితే పిల్లలే తిననివ్వరు . ఒక్క చికెన్ లెగ్ పీస్, వో యాభై గ్రాములు ఫిష్ కర్రీ , కొంచెం పప్పు, మూడు పుల్కాలకి మించి పెట్టనివ్వరు. బయటి వూళ్ళకి పోయినప్పుడు ఆత్రంగా తిని, అనారోగ్యం పాలవుతుంటాడు. అప్పుడప్పుడు సినిమాల్లో ఎక్స్ట్రాలంటూ వో అనుచరుడు అరేంజ్ చేస్తుంటాడు. అందులో లభించే సుఖం కన్నా, యెవరైనా వీడియో తీస్తున్నారేమో అనే భయం యెక్కువ. ఆ భయాన్ని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిలు, బ్రోకర్ చాలా డబ్బు వసూలు చేస్తుంటారు. అందరూ తనకి కష్టాలుండవనుకుంటారు. ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోగలడు?

స్నానం చేసివచ్చి సోఫాలో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు కనకారావు. ఇంతకీ కనకారావు యెవరో చెప్పలేదుకదూ? ......

కనకారావు పార్లమెంట్ సభ్యుడు. రెండో టర్మ్. ప్రజల నాడిని పసిగట్టి పార్టీ మారి రెండో టర్మ్ సాధించుకున్నాడు. కనకారావు తండ్రి పేరున్న ఆయుర్వేద డాక్టర్. నాడిని పట్టి రోగాల చిట్టా చెప్పేసేవాట్ట. నోరెళ్లబెట్టడం పేషెంట్ వంతు. పేషెంట్ నోరు వెళ్లబెట్టినదాన్ని బట్టి ఫీజు వసూలు చేస్తుండేవాడు. కనకారావు కూడా ఆయుర్వేదం కొంత నేర్చుకున్నాడు కానీ, రోగిష్ఠుల దగ్గిర యెక్కువ డబ్బు గుంజడానికి మనసొప్పక ఆయుర్వేదం కంటే రాజకీయ వేదం మంచిదని అందులో దూరాడు. కార్పొరేటర్ నించి ఎం ఎల్ ఏ , అక్కడ్నించి ఎం పీ దాకా ఎదిగాడు. మంత్రి పదవి అందని ద్రాక్ష పండయింది. అయితేనేం యే మంత్రికీ తగ్గకుండా సంపాదిస్తున్నాడు. పదవి లేకున్నా మంత్రి కంటే తక్కువకాదని నిరూపించాడు.

ఇంతలో సెక్రటరీ వచ్చి 'గుడ్ ఈవెనింగ్ సర్!' అన్నాడు. ఫోన్ మాట్లాడడం ముగించి, 'రత్నారావ్ , మన ప్రోగ్రామ్స్ యేమిటి ?' అడిగాడు.

'ఈ రోజు యేమీ లేవు సర్. రేపు వుదయం ఎనిమిదికి కొరియన్ టీమ్ వస్తోంది. మీ ఫ్యాక్టరీ కొనుగోలు విషయంలో మాట్లాడడానికి . పదింటికి సి ఎం తో అపాయింట్మెంట్ వుంది. అది యింకా కన్ఫర్మ్ కాలేదు'

'సరే!... నేను చెప్పిన రెండు లెటర్స్ టైపు చేసివ్వు !'

ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు రత్నారావు.

అక్కడ వైకుంఠంలో ......

విష్ణు మూర్తి పాదాలు వత్తుతూ లక్ష్మీ దేవి, 'స్వామీ! ...' అని పిలిచింది.

'ఏమీ?'

'ఆ రోజు భూలోకంలో మీ భక్తుడు వెంకటేశన్ ని కనకారావు అనే పార్లమెంట్ సభ్యుడు చంపినప్పుడు , ఆ కనకారావు కి బుద్ధి చెప్పాలి అన్నారు కదా! ఆ విషయం లో మీరింకా యేమీ చేసినట్టు లేదు...'

'అవును దేవీ! అన్నాను. వేంకటేసేన్ నా భక్తుడే కానీ, అత్యాశతో డబ్బు మీద వ్యామోహంతో కనకారావు ని బెదిరించి అయిదు కోట్లు గుంజాలని చూసాడు. అది కూడా నేరమే కదా, అధర్మమే కదా అని ఆలోచిస్తున్నాను. '

'చంపడం తప్పేకదా స్వామీ!'

'తప్పే!... దాని సంగతి యమ ధర్మరాజు చూసుకుంటాడు కదా!...'

'మరైతే ఆ రోజు అంత ఆవేశ పడ్డారెందుకు ?'

'వెంకటేశన్ హత్య కాబడ్డప్పుడు నన్ను తలుచుకుంటూ మరణించాడు. అతనికి సద్గతినైతే ప్రసాదించానుకానీ, నా భక్తులు కూడా అలా ప్రవర్తిస్తుండడం, అత్యాశలకి లోను కావడం నన్ను బాధించింది దేవీ!... అటువంటి ఆశలకు లోనౌతున్నారంటే దానిక్కారణం కనకారావు వంటి అవినీతిపరులే కదా!... చూస్తాను. అక్కడ సూర్యాస్తమయ సమయంలో కనకారావు వద్దకు వెళ్ళి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాను ...'

'మీరు అనుకుంటే అవుతుందిగా!... దానికి ప్రయత్నమేమిటి?'

'అనుకుంటే అన్నీ అవ్వవు దేవీ!... నీ మాట కాదనడమెందుకని యీ ప్రయత్నం చేయ నిర్ణయించుకున్నాను!'

'సరే స్వామీ!.. నన్ను కూడా రమ్మంటారా?'

'అటువంటి దుర్మార్గుల దగ్గిర ధనం రూపంలో వుండనే వున్నావుగా!...'

లక్ష్మీ దేవికి కోపమొచ్చింది. క్షణంలో తమాయించుకుని, 'నేను విధాతని కాదు,' అని క్లుప్తంగా జవాబిచ్చి వూరుకుంది . ఆమె మనస్థితిని రంజింపచేసే ప్రయత్నంలో పడ్డాడు పరమాత్మ.

రత్నారావు రెండు లెటర్స్ ని టైపు చేసి, కనకారావు దగ్గిర సంతకం తీసుకుని కొరియర్ లో పంపుతానంటూ బాస్ దగ్గిర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

కనకారావు తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి , విస్కీ బాటిల్ ఓపెన్ చేసాడు. స్కాచ్ విస్కీ అంటే అతనికి ప్రాణం. అన్నీ వెరైటీ లు కలిపి వందకు పైగా లీటర్ బాటిల్స్ స్టాక్ పెడతాడు. కిచెన్ లో వంటమనిషికి ఫోన్ చేసాడు. ఆమె వెంటనే బోయిల్డ్ పల్లీలు ఒక ప్లేట్ లో పెట్టి తీసుకొచ్చింది. టేబుల్ మీద పెట్టి, 'యింకా యేమైనా కావాలయ్యా?' అని అడిగింది. వద్దన్నట్టు తలూపాడు. ఆమె వెళ్ళగానే, డోర్ దగ్గిరకి వేసి, అద్దంలో చూసుకుంటూ 'చీర్స్' అని, ఒక సిప్ రుచి చూసాడు. సోడా యెక్కువైనట్టనిపించింది . కొద్దిగా విస్కీ వేసి, చేత్తో గ్లాస్ ని తిప్పాడు. మళ్ళీ ఒక కొద్దిగా రుచి చూసి, బాగుందనుకున్నాడు. అక్కడున్న టీవీ ని ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు. ఒక పెగ్గు లాగించి, రెండో పెగ్గు కలుపుకున్నాడు. దాన్ని సిప్ చేస్తుండగా ఆ గదిలోకి ఒక వ్యక్తి వచ్చాడు. విచిత్ర వేషధారణలో వున్న ఆ వ్యక్తిని చూసి ఖంగుతిన్నాడు.

'ఎవరు నువ్వు? లోపలి యెలా వచ్చావ్?... సెక్యూరిటీ!.... '

'నేను దేవుడ్ని ... లోపలికేమిటి, యెక్కడికైనా రాగలను ...'

'దేవుడివా?... ఎర్రగడ్డ నించి వస్తున్నావా?' సెక్యూరిటీ కి ఫోన్ చేసాడు. సిగ్నల్ దొరకలేదు. మళ్ళీ ట్రై చేసాడు. సిగ్నల్స్ లేవని మెసేజ్ వచ్చింది. కనకారావు ముఖం చెమట తో తడిసిపోయింది. గొంతు పెగలట్లేదు. డోర్ వైపుకి వెళ్ళడానికి ప్రయత్నం చేసాడు. దేవుడు కూర్చోమన్నట్టుగా చేత్తో సంజ్ఞ చేసాడు. భయం భయంగా కూర్చున్నాడు. విస్కీ యిచ్చిన మత్తు కాస్తా పోయింది.

'నీకేం కావాలి? చెప్పు. చేసిపెడతాను... '

'ఏమైనా చేసిపెడతావా?'

'నాకు అయ్యే పని ఏదైనా చేస్తాను. నన్ను నమ్ము. నీళ్ళు కావాలా?'

'ఉహూఁ ... నా భక్తుణ్ణి నిర్దాక్షిన్యంగా చంపేశావ్!...'

ఒక్క క్షణం వూపిరి ఆడనట్టయింది కనకారావు కి. 'నీ భక్తుడా? ఎవరు?'

'వెంకటేశన్ ... '

'వెంకటేశనా ?... ఎవడు వాడు?... నేను చంపలేదు ...'

'దేవుడితో కూడా అబద్దాలు చెప్తావా?...'

'ఎవడు?... వాడా?... ఐదు కోట్లు అడిగాడు?... వాడేనా?'

'వాడే!...'

'వాడు నీ భక్తుడా?... బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గిర ఐదు కోట్లు గుంజాలనుకున్నాడు. వాడు నీ భక్తుడైతే నువ్వెలాంటి దేవుడివో అర్దమౌతూంది ...'

'నేనెలాంటి దేవుడినో నీకు తెలుసు. నువ్వు సంపాదించే అక్రమ ధనంలో నాకు రెండు శాతం యిస్తున్నావు కదా!... ఎందుకిస్తున్నావ్?'

అవాక్కయ్యాడు కనకారావు. ఈ లెక్క వీడికెట్లా తెలుసు?... కొంపతీసి యిక్కడ యింటిలిజెన్సు వాళ్ళెవరూ ట్రాప్ వేయలేదు కదా! ... ఆ వెంకటేశన్ గాడు దయ్యమై రాలేదు కదా?... అంతా అయ్యోమయ్యంగా వుంది. సరైన సమయంలో భార్యా, కొడుకులు యింట్లో లేరు...

'నీ భార్యా , పిల్లలు యింట్లో లేరేమిటని ఆలోచిస్తున్నావా?'

ఖంగుతిన్నాడు. 'నీకెలా తెలుసు నా ఆలోచన?'

'చెప్పాకదా... నేను దేవుడ్ని!... '

'ఆ వెంకటేశన్ అన్యాయంగా నా దగ్గిర డబ్బు గుంజాలనుకున్నాడు. వాడికి నా రహస్యాలన్నీ తెలిసి పోయాయి. చంపడం కంటే మార్గం తోచలేదు...'

'చంపి శవాన్ని గుట్టల్లో పడేశావెందుకు ? సరైన అంత్యక్రియలకి కూడా నోచుకోకుండా?'

అర్ధమైంది, అనుకున్నాడు కనకారావు.

'అయితే నువ్వు వేంకటేసేన్ ఆత్మవా?... నన్ను క్షమించు. నువ్వు అడిగిన ఐదు కోట్లు నీ భార్య కిస్తాను. నన్నేమీ చెయ్యకు, ప్లీజ్!'

'నేను దేవుడ్ని. చెప్పాకదా!... వెంకటేశన్ భార్యకి ఐదు కోట్లు అవసరం లేదు. ఒక్క కోటి యివ్వు చాలు. ఎప్పుడిస్తావ్?'

'మీరు అనుమతిస్తే యిప్పుడే వెళ్లి యిచ్చి వస్తా!... '

'గ్యారేజ్ లో దాచిన వంద కోట్లు యేమి చెయ్యాలనుకుంటున్నావ్?'

గుండె ఆగినంత పనయ్యింది కనకారావు కి.

'నీకెలా తెలుసు?... నేను దాచలేదు. అంత డబ్బు నాకెలా వస్తుంది?'

దేవుడు పెద్దగా నవ్వాడు. 'చూపించమంటావా?... నన్ను నవ్వించినందుకు నీకు వొక చిన్న వరం యిస్తాలే తర్వాత. పద !...'

'వద్దు ప్లీజ్! ... నీకు దణ్ణం పెడతా!...'

తన ప్రధాన అనుచరుడు రామ్మోహన్ కి ఫోన్ చేసాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఈ వెధవలందరినీ పార్టీ చేసుకొమ్మని యివ్వాళే పంపాలా? ...మూఁర్గుడ్ని !... వాళ్ళే కనక వుంటే యీ పాటికి యీ బ్లాక్ మైలర్ గాడ్ని కర్రలతో, కత్తులతో, బరిసెల్తో ముక్కలు ముక్కలు చేసేవాళ్ళు.

'ఇక్కడ లేని నీ అనుచరుల గురించి ఎందుకాలోచిస్తున్నావ్?... నన్ను ముక్కలు చేయడం సాధ్యమయ్యే పనేనా?...'

'నా ఆలోచనల్ని చెప్పేస్తున్నావ్.... నిజంగా నువ్వు దేవుడివేనా?... ఇక నుంచి నీ షేర్ పది శాతం పెంచుతాను. నన్ను వదిలేయ్. ప్లీజ్!'

'ఎన్ని సార్లు చెప్పాలి నీకు?... ఆ వందకోట్లు యేమి చెయ్యాలనుకుంటున్నావ్?'

భార్య వున్నా యీ పాటికి పోలీసులకి ఫోన్ చేసేది.

'నీ భార్య యిప్పుడు నీ స్నేహితుడు మంత్రి తో ఆనందంగా వుంది. ఇంకా గంట దాకా రాదు. నా ప్రశ్నకి జవాబు చెప్పు. '

మళ్ళీ గుండాగినంత పనయ్యింది. తన భార్య ఆ మంత్రి గాడితో ఆనందంగా వుందా ! దొంగ ముండ . అంత ద్రోహం చేస్తోందా?

వణికి పోతూ, కుర్చీలో కాళ్ళు పైన పెట్టుకుని కూర్చుని, భయం భయంగా దేవుడి కళ్ళల్లోకి చూస్తున్నాడు కనకారావు.

'ఏమి చెయ్యమంటారో ... మీరే చెప్పండి...'

'ఆ డబ్బు ఆ గుత్తే దారు కిచ్చేసి, మంచి సామగ్రితో నాణ్యమైన రహదార్లను నిర్మించమని చెప్పు. అది జరిగేలా దగ్గిరుండి చూడు...'

'సరే... తప్పకుండా ...' ఈ వంద కోట్లు పోతే పోనీ, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇంతమంది రాజకీయ నాయకులు, అధికారులు సంపాదించుకుంటుండగా వీడు నా వెంటే పడ్డాడెందుకు ? వాళ్ళెవరూ రెండుశాతం కూడా యివ్వరు వెంకటేశ్వర స్వామికి. తను క్రమం తప్పకుండా యిస్తున్నాడు . అయినా తననే శిక్షించాలనుకుంటున్నాడా దేవుడు? ఇలాంటి నమ్మక ద్రోహం చేసేవాడు దేవుడెట్లా అవుతాడు? ... వీడు ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ పంపినవాడే! మినిస్టర్ కి రెండొందలు యిచ్చాక , తనకి వంద యివ్వడానికి యేడ్చాడు . పని చేయించింది తనే ! కృతజ్ఞత లేదు వెధవలకి. ఛీ... ఛీ...

'యేమిటాలోచిస్తున్నావ్?... నాకు తెలియదనుకోకు. ఇప్పుడా గుత్తేదార్ని తిట్టి వుపయోగం లేదు. నేను చెప్పినట్టు చేస్తావా, లేదా?'

'చేస్తాను... మీరిక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి.'

'సరే!... నేను ఆ గుత్తేదారుకి చెప్పి నీ దగ్గిరకి పంపిస్తాను.'

'అలాగే అయ్యా!'

దేవుడు క్షణంలో మాయమైపోయాడు. కనకారావు కళ్ళు బైర్లు కమ్మి ఆ అదృశ్యాన్ని చూడలేక పోయాడు.

కనకారావు యింటి నించి అదృశ్యమైన శ్రీ మహావిష్ణు, కింద నగరంలోని సునీల్ బార్ అండ్ రెస్టారెంట్ లో జరుగుతున్న పార్టీ లో కనకారావు అనుచరులని చూసాడు. వాళ్ళ పట్ల ఆయనకీ జాలి కలిగి, కిందకి దిగి వాళ్ళకి ఉపదేశం చేద్దామనిపించింది. ఎన్నో కోట్లమంది ప్రజలు రాజకీయ నాయకుల కింద దాస్యం చేస్తూ వాళ్ళు విసిరే రొట్టె ముక్కలకోసం పండంటి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారనిపించింది. అయితే యిలాంటి వాళ్లకి ఉపదేశం అవసరమా, అని వొక క్షణం అనిపించింది. ఒక రాయి విసిరి చూద్దాం అనుకున్నాడు.

ఆ బార్ లోకి ప్రవేశించాడు శ్రీ మహావిష్ణు. కనకారావు యింటికి యే రూపంలో వెళ్ళాడో, అదే రూపం ధరించాడు.

'ఎవడివిరా నువ్వు?' వొక అనుచరుడు మీదకొచ్చి అడిగాడు.

'దేవుడు' అన్నాడు విష్ణువు.

'ఎవరూ?'

'దేవుడు'

అర్ధంకానట్టు చూసాడు. వెంటనే తమాయించుకుని అడిగాడు, 'దేవుడివైతే గుడిలో కూర్చోక యిక్కడికెందుకొచ్చావ్?'

ఇంతలో అందరూ చుట్టుముట్టారు.

'గుడిలో కూర్చుని, కూర్చుని విసుగు పుట్టింది. మిమ్మల్ని వొకసారి కలిసి వెళదాం అని యిక్కడికొచ్చాను. కనకారావు అనుచరులు కదా, పండగ చేసుకుంటున్నారని చూసిపోదామని '

'చూసావుగా, యిక వెళ్ళు!' గుంపులో ఒకడు అరిచాడు.

'ఎవడ్రా నువ్వు? నిన్ను యెప్పుడూ చూడలేదే? సారూ దగ్గిర కూడా యెప్పుడూ చూడలేదు!'

'దేవుడట్రా !!! గుళ్లో విసుగుపుట్టి యిక్కడికొచ్చాట్ట!' యింకోడు పెద్దగా నవ్వుతూ అన్నాడు.

'నీ గుడికి మేమెప్పుడూ రాలేదు... అసలు గుడికే పోలేదు మేము. నీకు మాతో పనేంటి?'

'అరే ! ఆ పిచ్చొడ్ని బయటికి తోసి రండిరా! ... ' కొంచం దూరంగా వున్న మరొకడు అరిచాడు.

చిన్న నవ్వు నవ్వి విష్ణువు అన్నాడు, 'నేను వెళ్తాలే కానీ, మీకు కనకారావు యీ విందు యెందుకు యేర్పాటు చేసాడు?'

'నెలకి రెండుసార్లు పార్టీ చేసుకోమంటాడు మా సారు . నీ కెందుకు?'

'ఎక్కువ మొత్తం డబ్బు వచ్చింది మీ యజమానికి. అందుకేమో అనుకున్నాను!'

'ఆయనకీ డబ్బు వస్తూనే వుంటుంది . కుష్ అయి మాకు పార్టీ యిస్తూనే వుంటాడు !'

'నిజమే! మంచివాడు కదా!... మీరు ఆయనకోసం ప్రాణం కూడా యిస్తారు. ఆయన చెప్తే యెందరి ప్రాణాలైనా తీస్తారు! వాడేమో మీకు యిలా ముష్టి పడేస్తాడు!... మీకంటూ ఒక స్వతంత్ర జీవితం లేదా? ఉద్యోగమో, వ్యాపారమో చేసుకొని మీ కుటుంబంతో మీరు సుఖంగా వుండకూడదా ? ఇలా దాస్యం చేస్తూ ముష్టి బ్రతుకు బ్రతకాల్సిందేనా?'

అందరూ వొకరి ముఖాలు వొకరు చూసుకున్నారు. వాళ్ళ నాయకుడు, రామ్మోహన్ గట్టిగా అరిచాడు,' అరేయ్! వాడ్ని బయటికి తోసి, రండిరా! కిక్కు కాస్తా పోగొట్టేస్తున్నాడు. బయటికి తోసేయండిరా!... అసలు లోపలికి యెవరు రానిచ్చాడ్రా వాణ్ణి ?...'

'నువ్వు లోపలికి యెట్లా వచ్చావురా, దర్వాజా బందుంటే?'

'నాకు వాకిలితో, తలుపులతో పనిలేదు. ఎప్పుడు యెక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్తాను. నేను దేవుడ్ని! అరేయ్! వీడు దేవుడట్రా !... ' పెద్దగా నవ్వారు అందరూ!

'ఒరేయ్! వాడి బొక్కలిరక్కొట్టి గుళ్ళో పడేసి రండిరా!... రేపు పొద్దుగాల గుడికి పోయి చూసొద్దాం!'

'అంటే నేను చెప్పేది మీకు అర్ధం కావట్లేదా?... మీ శ్రమని, మీ జీవితాల్ని దోచుకుని కనకారావు కోట్లు గడిస్తున్నాడు. మీ బతుకు మీరు బతకండి, స్వేచ్ఛగా జీవించండి, మీ కుటుంబాలతో ఆనందంగా వుండండి అని చెప్తున్నాను!'

'ఒరే వీడు కమ్యూనిస్ట్ లా వున్నాడ్రా!...' ఎవరో కొద్దిగా చదువుకున్న వాడల్లే వున్నాడు.

'మొన్న వొక రహదార్లు నిర్మించే వ్యాపారవేత్త నించి వంద కోట్లు సంపాదించి, ఆ నగదుని చెక్క పెట్టెల్లో పెట్టి, వాడి వాహనాలుంచుకునే గది నేల మడిగలో దాచుకున్నాడు. మీ అందరికీ కలిపి పదివేలిచ్చి పండగ చేసుకోమంటున్నాడు!... మీరు గుడ్డిగా వాడినే నమ్మి మీ జీవితాలు పాడుచేసుకుంటున్నారు!... మిమ్మల్ని యెవరు బాగుచేయగలరు?...' కొంచం నిరాశ ధ్వనించింది విష్ణు మూర్తి కంఠంలో.

నిశ్శబ్దం ఆవరించింది. అందరూ వొకరి ముఖాలు వొకరు చూసుకుంటూ దగ్గిరగా జరిగారు.

శ్రీ మహావిష్ణు అక్కడ్నించి అదృశ్యమయ్యాడు. వెనక్కి తిరిగి చూసిన ఆ గుంపు స్థాణువులైపోయారు. దేవుడి కోసం వెతికారు. ఆయన కనపడలేదు.

రామ్మోహన్ అందరినీ దగ్గిరకి రమ్మన్నాడు. అందరూ వచ్చారు.

'వాడు యేమన్నాడు ?'

'సారుకి మొన్న వంద కోట్లు వచ్చిందన్నాడన్నా!...'

'బహుశా ఆ కాంట్రాక్టర్ యిచ్చుంటాడన్నా !'

'అదేగా ఆ దేవుడు చెప్పింది!...'

'వాడు నిజంగా దేవుడేనంటావా?...'

'మరెట్లా మాయమయ్యుండూ?... దేవుడే !... వాడు దేవుడే!'

'ఆ డబ్బు యెక్కడ దాచిపెట్టిండు మన సారు ? ఎదో చెప్పిండుగా?...'

'వాహనాల గది అన్నట్టున్నాడన్నా!... అంటే ఏంటి ?'

రామ్మోహన్ ఆలోచించాడు. 'అంటే సారు ఆ వందకోట్లు గ్యారేజ్ లో దాచిపెట్టాడ్రా!... '

'గ్యారేజ్ లో కార్లుంటాయిగా అన్నా!'

'కార్లు బయటే పెడతాడు. మనం రోజూ చూడట్లేదా?'

'అవునన్నా! ఇంకా యేదో అన్నాడన్నా ...... నేల ...నేల ... గుర్తుకొస్తట్లేదన్నా!... '

'నేల కింద దాచివుంటాడు. ...'

రామ్మోహన్ కొంచం సేపు అలోచించి, ' వొరేయ్ ! ఆ దేవుడు చెప్పినట్లు మనం ఆ కనకారావు గాడికి దాస్యం చేయుడేట్రా మన లైఫ్ ?... మనకంటూ పిల్లాజెల్లా లేరా? వాళ్ళని కూడా యిట్లనే దాస్యం చేయించాల్నా ?... మనం సుఖ పడగూడదట్రా ?... '

'నిజమే అన్నా!... మనం అందరం గుట్టుగా పోయి ఆ వంద కోట్లు కొట్టేద్దామన్నా!... ఇంక జీవితం లో పని చేయక్కర్దేదన్నా!...'

అందరికీ మనసులో వొక్కసారిగా ఆశ మొలకెత్తింది. అందరూ మాట్లాడుకున్నారు. నిముషాల్లో ప్రణాళిక వేసుకున్నారు. కొందరు మార్కెట్ కి వెళ్ళి సుత్తులు, గుణపాలూ, క్లోరోఫామ్ తెచ్చారు. అవి యెవరికీ కనపడకుండా అందరూ యెప్పటిలా కనకారావు యింట్లోకి వెళ్ళారు. ఆఫీస్ రూమ్ లో సోఫాలో విచారంగా కూర్చుని కనకారావు కనపడ్డాడు. వీళ్ళని చూడగానే ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెట్టినందుకు తిట్టాడు. అందరూ సారీ చెప్తూ ఆయన దగ్గిరకి వెళ్ళి క్లోరోఫామ్ ముఖం మీద కొట్టారు. కనకారావు అచేతనంగా సోఫాలో పడిపోయాడు. నెమ్మదిగా యిల్లంతా కలియతిరిగి వంటమనిషి పడుకొని వుండడం గమనించి ఆమె కి కూడా క్లోరోఫామ్ కొట్టి, బయటి తలుపులు వేసేసారు.

నలుగురు బయట గేట్ దగ్గిర నిలబడ్డారు. నలుగురు లోపల నిలబడ్డారు. పదిమంది గ్యారేజ్ తాళం పగలగొట్టి లోపలి వెళ్ళారు . అక్కడ అంతా చెత్త, బూజు, ఖాళీ కార్డు బోర్డు పెట్టెలు కనపడ్డాయి. కింద నేల మీద చెత్త తప్ప యే మాళిగ ఆనవాళ్లు కనపడలేదు. సెల్ ఫోన్ లైట్లు వేసి ప్రతి అంగుళం చూసారు. చివరికి వెనక వున్న గోడ కింద వొక మూల తాళం కనపడింది. పలుగుతో వొక్క వేటు వేయగానే తాళం పగిలింది. నెమ్మదిగా అక్కడున్న వొక ఐరన్ ప్లేట్ తొలగించి చూస్తే కింద వొక గదిలాగా వుంది. చిన్నయినుప నిచ్చెన వుంది. దాని సహాయంతో వరసగా ఐదుగురు దిగారు. టార్పాలిన్ ని తొలగించి చూస్తే చెక్క పెట్టెలు కనపడ్డాయి. చాలా బరువుగా వున్నాయి. నెమ్మదిగా ఆ యిరవై పెట్టెల్ని పైకి తెచ్చారు. ఒకటి తెరిచి చూస్తే నగదు కనపడింది. వెంటనే ఒక ప్లాన్ ప్రకారం వొక్కొక్కరు వొక్కొక్క పెట్టేం బయటికి తీసికెళ్ళి దొరికిన ఆటోల్లో తీసుకెళ్లి పోయారు. అలా యిరవై మందీ యిరవై పెట్టెల్ని పట్టుకెళ్ళే ప్లాన్.

అక్కడ పోలీస్ సర్వే లైన్స్ రూమ్ లో ఎం పీ గారి యింటి ముందున్న సీ సీ టీ వీ లోని దృశ్యాల్ని స్క్రీన్ మీద ఇన్స్పెక్టర్ గమనించాడు. పక్కనున్న అసిస్టెంట్ తో అన్నాడు, 'ఎం పీ కనకారావు యిల్లే కదా ? ఏం జరుగుతోంది?'

'ఏముంది సార్. ఆయన ఫాలోయర్స్ అక్కడే వుంటారు. '

'రాత్రి పది దాటింది కదా!... ఏవో పెట్టెలు బయటికి వెళ్తున్నాయి. చూసావా?'

'అవును సార్'

'వెంటనే పెట్రోలింగ్ స్క్వాడ్ కి చెప్పు!'

పోలీస్ పెట్రోల్ వెంటనే కనకారావు యింటి దగ్గిరకి చేరారు. ఐదుగురు అనూయాయులు మాత్రం మిగిలిపోయారు. వాళ్ళకి ఆటో లు దొరకలేదు. బాగా తాగి వుండడంతో వాళ్ళు వేగంగా కదలలేక పోయారు. వాళ్ళని ప్రశ్నించిన పోలీస్ ఆ పెట్టెల్లో వున్న నగదు చూసి అవాక్కయ్యారు. ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ తో మరి కొంతమంది పోలీస్ ని పంపమని ఫోన్ చేయమన్నాడు. అతని అసిస్టెంట్ వెంటనే, 'సార్. మనం ముగ్గురం. ఇక్కడ ఐదు పెట్టెలున్నాయి. వాటిని కార్ లో పెట్టేస్తాను. ఈ అయిదుగుర్ని తంతే పారిపోతారు. ఆ నగదు మనం వుంచుకుందాం. లేదా ఒకపెట్టెని పట్టుకున్నట్లు చెపుదాం!...'

ఇన్స్పెక్టర్ ఆలోచించాడు.

'సరే!... అట్లాగే కానీయ్ . ముందు అన్నీ పెట్టెలు లోపలేసి, నువ్వొక్కడివే మీ యింటికెళ్లి అక్కడ దించేసి వచ్చేయ్ !... నేనిక్కడ చూసుకుంటా!'

ఇనస్పెక్టర్ కనకారావు అనూయాయుల్ని లాఠీతో కొట్టడం మొదలెట్టేసరికి వాళ్ళు పారిపోయారు.

తర్వాత ఆ పోలీసులిద్దరూ లోపలికి వెళ్ళారు . ముందుగా హాల్లో స్పృహలోలేని వంటమనిషిని, ఆఫీస్ రూమ్ లో సోఫాలో అప్పుడే కళ్ళు తెరుస్తున్న కనకారావు కనపడ్డారు. ఆయన ముఖం మీద నీళ్ళు చల్లి, అక్కడే వున్న ఫ్రిడ్జ్ లోంచి చల్లటి నీళ్ళు యిచ్చాడు ఇనస్పెక్టర్ . కొద్దిసేపటి తర్వాత కనకారావు అన్నాడు ,'మీరు యెప్పుడు వచ్చారు?'

'అర్ధగంట అయ్యింది. ఎలా వున్నారు? అంబులెన్సు ని పిలిపించమంటారా?'

'నేను బాగానే వున్నాను. నాకు యేమి జరిగిందో గుర్తురావట్లేదు. మీకు యెవరు ఫోన్ చేశారు?'

'మేము మీ యింటి ముందున్న సీ సీ టీ వీ ని మోనిటర్ చేస్తుంటే యెవరో నలుగురైదుగురు మీ యింటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతుంటే మాకు ఫోన్ వచ్చింది. మేము వచ్చాము...'

'అట్లనా! నా భార్య, కొడుకులు యింకా రాలేదా?'

'లేరు మరి.'

ఇన్స్పెక్టర్ బయటికి వెళ్ళి సర్వేలెన్స్ నించి తనకు ఫోన్ చేసిన అసిస్టెంట్ ఇనస్పెక్టర్ తో మాట్లాడాడు. ఆ సీ సీ టీ వీ ఫ్యూటేజ్ ని డిలీట్ చేయమని, దానికి ఆకర్షణీయమైన ప్రతిఫలం వుంటుందనీ సూచించాడు. అది అర్ధమైన ఆ అసిస్టెంట్ తన ఇనస్పెక్టర్ తో మాట్లాడి డీల్ కి ఓకే చెప్పాడు. అయితే అందరూ మేధావులే కాబట్టి ఆ ఫ్యూటేజ్ ని సీడి లోకి యెక్కించి డిలీట్ చేశారు.

ఇనస్పెక్టర్ లోపలికి వెళ్ళి కనకారావు స్థితిని గమనించి డాక్టర్ దగ్గిరకి వెల్దామన్నాడు. ఇంతలో అతని భార్య యింటికొచ్చింది . విషయం చూచాయగా తెలుసుకుని అంబులెన్సు పిలవమంది.

అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ డాక్టర్ బీ పీ చెక్ చేసి, చాలా యెక్కువగా వున్నదని నిర్ధారణ కొచ్చాడు. వెంటనే ఐ సీ యూ లో అడ్మిట్ చేసాడు. మర్నాడు డాక్టర్ పర్యవేక్షణ లో పోలీస్ ఐ జీ కనకారావు ని ప్రశ్నించాడు.

'అసలేమి జరిగింది సార్? స్టెప్ బై స్టెప్ చెప్పండి. '

'నేను ఆఫీస్ లో కూర్చుని పనిచేసుకుంటుండగా, దేవుడు వచ్చాడు ఐ జీ గారు... '

'దేవుడా?' ఆశ్చర్యంగా అడిగాడు ఐ జీ.

'అవును... దేవుడనే చెప్పాడు... చాలా విషయాలు చెప్పాడు. నా గురించి, నా భార్య గురించి , మా మంచితనం, దాన ధర్మాలూ అన్నీ చెప్పాడు. నా నోట మాట రాలేదు. నమ్మండి . ఇంతలో అదృశ్యమై పోయాడు. నాకు భయం, అనుమానం. అంతా వెతికాను. ఎక్కడా కనపడలేదు. షాక్ అయ్యాను...'

'సరే రెస్ట్ తీసుకోండి. తర్వాత మాట్లాడదాం. '

తర్వాత కొడుకులిద్దరూ హాస్పిటల్ కి వచ్చి హుటాహుటిన ఐ సి యూ లోకి వెళ్ళి , గ్యారేజ్ లో పెట్టిన నగదు పెట్టెలన్నీ యెవరో కొట్టేశారని తండ్రికి చెప్పారు. ఆయనకీ గుండె ఆగినంత పనైపోయింది. పెద్దగా అరిచాడు. 'దేవుడే కొట్టేసాడు... దేవుడే కొట్టేసాడు ...'

కొడుకులిద్దరికీ అర్ధం కాలేదు. పోలీస్ ఐ జీ కి కూడా అర్ధం కాలేదు. డాక్టర్ తో చర్చించి, మానసిక రోగ నిపుణుడిని పిలిపించారు. ఆయన పరీక్షించి ,'యిది కొంచం తేడా గానే కనిపిస్తోంది. రెండురోజుల తర్వాత మళ్ళీ పరీక్షిద్దాం ' అన్నాడు.

అక్కడ వైకుంఠంలో ……

'దేవీ చూస్తున్నావుగా యేమి జరుగుతున్నదీ?'

'చూస్తున్నా స్వామీ. మీరు మంచిని బోధిస్తే , దాన్ని పక్కన పెట్టి, దుర్మార్గమైన మార్గాన్ని యెంచుకున్నారు అందరూ! ఇది నిజంగా విషాదకరమే!'

'అవును దేవీ!... నన్ను కూడా లక్ష్య పెట్టలేదు ఆ మానవులు. నీకెలా అనిపిస్తోంది?'

'అనిపించేదేముంది స్వామీ!... కలి పురుషుడు తన విధిని సమర్ధంగా నిర్వహిస్తున్నాడు!...'

'హతవిధీ!' అంటూ శ్రీ మహావిష్ణువు పవళించాడు.

[సమాప్తం]


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ'విప్లవం' కిబహుమతి వచ్చింది. తర్వాతకొన్ని కథలుపత్రికల్లో వచ్చాయి. అక్కడితోసాహితీ ప్రస్థానంఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాతయీ మధ్యమళ్ళీ రాయడంమొదలెట్టాను. అయితేడిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతిసమయం లోఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడోబహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనేమరో కథ10 ఉత్తమకథల్లో వొకటిగానిలిచింది. గోతెలుగు డాట్కామ్ లోవొక హాస్యకథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామంతర్వాత మళ్ళీరాయగలననే ఆత్మవిస్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతోరాస్తుంటాను.

ఇంతకంటేచెప్పుకోతగ్గవిషయాలు లేవు. కృతజ్ఞతలు.




89 views0 comments
bottom of page