top of page
Original.png

హృదయ భాష

12 hours ago
6 min read

జ్ఞాపకశక్తి కోల్పోయిన భర్త శివరాం చేతిని ప్రేమగా పట్టుకున్న మహేశ్వరి – హృదయ భాష తెలుగు కథలోని భావోద్వేగ దాంపత్య అనుబంధం

Hrudaya Basha - Telugu Emotional Family Story| Dr. Darala Vijaya Kumari

హృదయ భాష - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | డా. దారల విజయ కుమారి

Published in manatelugukathalu.com on 14/10/2026 


హృదయ భాష డా. దారల విజయ కుమారి రచించిన హృదయాన్ని కదిలించే తెలుగు కుటుంబ కథ. జ్ఞాపకశక్తి కోల్పోయినా హృదయంలోని అనుబంధం ఎలా కొనసాగుతుందో ఈ కథ మనకు తెలియజేస్తుంది.


మహేశ్వరికి కోపం వచ్చినప్పుడు కిటికీ మూసేది. శివరాంకి అది తెలుసు.


పెళ్లయిన కొత్తలో శివరాం ఒకసారి అడిగాడు, "కోపం వస్తే కిటికీ ఎందుకు మూస్తావు?"

మహేశ్వరి సమాధానం చెప్పలేదు.


ఆమెకు బాధ ఎక్కువైనప్పుడు మాత్రం కిటికీ తెరిచి ఉంచేది. అది కూడా అతనికి తెలుసు. వాళ్లిద్దరి మధ్య ఇదే భాష.


దానికి అక్షరాలు లేవు, వ్యాకరణం లేదు, ఎవరూ నేర్పలేదు, ఒకసారి నేర్చుకున్నాక మర్చిపోలేదు. వాళ్ల పెళ్లయిన మొదటి రోజుల్లోనే ఈ భాష మొదలైంది.


"ఏం అనుకుంటున్నావో చెప్పొచ్చుగా?" అతను పేపర్ చదువుతూ అనేవాడు.

"ఏమీ లేదు," అనేదామె.


"అదే నీ సమస్య! 'ఏమీ లేదు' అంటావు, ముఖం చూస్తే పది విషయాలు కనిపిస్తున్నాయి."

"అయితే నీకే తెలుసు కదా!"


అతను నవ్వేశాడు. ఆమె వంటగదిలోకి వెళ్లి గిన్నెను కొంచెం గట్టిగా పెట్టింది. అతను పేపర్ మడిచాడు, లేచి ఆమె దగ్గరకు వెళ్లలేదు.


కొద్దిసేపటి తర్వాత వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఆమె వెనక్కి తిరిగి చూడలేదు, అతను కూడా ఏమీ అనలేదు.


కొద్దిసేపటికి ఆమె రెండు కప్పుల కాఫీ తీసుకొచ్చింది. ఒకటి అతని ముందు పెట్టింది... చక్కెర తక్కువ, అతనికి కోపం వచ్చినప్పుడు తాగే కాఫీ. మరోటి తన ముందు!


శివరాం కప్పు చేతిలోకి తీసుకుని ఆమె వైపు చూశాడు, "నిన్న కోపం పోయిందా?"

"ఎవరు చెప్పారు?"

"కాఫీ చెప్పింది."


ఆమె పెదవుల చివర చిన్న నవ్వు కదిలేది... అంతే, ఇక ఆ రోజు గొడవ ముగిసినట్టే!

ఆ రోజుల్లో వాళ్లిద్దరికీ అంతకంటే ఎక్కువ మాటలు అవసరం ఉండేవి కాదు.


చెప్పని మాటల దొంతరలు, నివేదించుకోలేని ఊసుల కట్టలు విప్పేసుకుని బయటపడటానికి ఒక్కో మనసు ఒక్కో భాషను వెతుక్కుంటుంది. మహేశ్వరికి ఆ భాష కిటికీ అయితే, శివరాంకి కాఫీ! వాళ్లిద్దరి మధ్య అలాంటి భాష నెమ్మదిగా పెరిగింది.


వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఇల్లు చిన్నదే... ముందు రెండు కుండీల్లో తులసి, మందారం; వెనుక చిన్న పెరడు, ఒక జామచెట్టు. ఉదయం పత్రిక, మధ్యాహ్నం వంట వాసన, సాయంత్రం పిల్లల అరుపులు, రాత్రి టీవీ శబ్దం. పడకగదిలోని కిటికీ తెరిస్తే ఉదయపు వెలుగు మంచం మీద పడేది.


మహేశ్వరికి పుస్తకాలు ఇష్టం, శివరాంకి రేడియో. ఆమె పుస్తకం చదువుతున్నప్పుడు అతను రేడియో పెద్దగా పెడితే ఆమె పుస్తకం మూసేది. అతను రేడియో ఆపేవాడు, ఆమె మళ్లీ పుస్తకం తెరిచేది. అది వాళ్ల మధ్య మొదలైన మొదటి ఒప్పందం!


ఆ ఇంట్లో వాళ్ల మధ్య పెద్దగా రహస్యాలేవీ లేవు, కానీ చెప్పని విషయాలు మాత్రం చాలానే ఉండేవి.


ఒకసారి శివరాం ఆఫీసు పని మీద రాత్రి ఆలస్యంగా వచ్చాడు. "ఎక్కడికి వెళ్లావు?" అని మహేశ్వరి అడగలేదు, అతను కూడా వివరాలు చెప్పలేదు.


ఆమె భోజనం పెట్టలేదు. అతను వంటగదిలోకి వెళ్లి అన్నం వడ్డించుకున్నాడు. మహేశ్వరి కిటికీ మూసేసింది.


భోజనం మధ్యలో శివరాం లేచి కిటికీ దగ్గరకు వెళ్లాడు. "ఇంట్లో చాలా వేడిగా ఉంది," అన్నాడు.


ఆమె కొద్దిసేపటి తర్వాత కిటికీ తెరిచింది. అతను ఆమె వైపు చూడలేదు, కానీ పెదవుల చివర చిన్న నవ్వు వచ్చింది. అది వాళ్ల భాష! ఎవరికి వారు అనువదించుకుని, నిర్వచించుకుని, భావాలను భద్రంగా దాచుకునే ఒక సమాంతర హృదయం.


మరుసటి ఉదయం అతని టిఫిన్ డబ్బాలో ఇడ్లీలు నాలుగు ఉన్నాయి.


శివరాం నవ్వుకున్నాడు, "ఇవాళ నాలుగా? ఎందుకు? నిన్న కోపం ఎక్కువగా ఉంది కదా!"

మహేశ్వరి అతని వైపు చూసి నవ్వింది. ఆ నవ్వే ఆ రోజు ఉదయపు సంధి! ఒక రూపం, ఒక మాట, ఒక పదం, ఒక నవ్వు ఏదైనా ఎదుటి మనసుకు అవగతమయ్యేంత దగ్గరగా ఉంటే చాలు.


పదేళ్ల తర్వాత శివరాం ఉద్యోగం పోయింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన అతను షర్టు మార్చుకోకుండా కుర్చీలో కూర్చున్నాడు. మహేశ్వరి వంటగదిలోంచి చూసింది. అతని చేతిలో ఒక కాగితం ఉంది.


"ఏమైంది?"

"ఏమీ లేదు."


ఆమె మళ్లీ అడగలేదు. అతను ఆ కాగితాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు.

ఆ రాత్రి భోజనం పెట్టేటప్పుడు అతని పళ్లెంలో రెండు రొట్టెలు మాత్రమే పెట్టింది, తన పళ్లెంలో ఒక్కటి.


"నాకు ఆకలి లేదు," అన్నాడు.


"నాకూ లేదు."

ఇద్దరూ తినలేదు. మరుసటి ఉదయం ఆమె అల్మారా తెరిచి బంగారు గొలుసు తీసింది. అతను చూశాడు.


"అది ఎందుకు?"

"మనకు పని వస్తుంది."


అతను ఆమె చేతిని పట్టుకున్నాడు, "వద్దు, అది మీ అమ్మ ఇచ్చింది."


"ఈ కుటుంబం కూడా నాదే!" ఆమె అతని చేతిలోంచి గొలుసు తీసుకుంది.

ఆ రోజు వాళ్లిద్దరూ కలిసి బయటికి వెళ్లారు, గొలుసు అమ్మేశారు. తిరిగి వస్తూ అతను ఏమీ మాట్లాడలేదు, ఆమె కూడా మాట్లాడలేదు.


ఆ తర్వాతి నెలల్లో వాళ్ల ఇంట్లో వస్తువులు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి. టేబుల్ మీద ఉండే పూలదానీ పోయింది, పాత రేడియో పోయింది, మహేశ్వరికి ఇష్టమైన వెండి గిన్నె కూడా పోయింది... కానీ కిటికీ మాత్రం అలాగే ఉంది!


ఒక రాత్రి శివరాం చాలాసేపు బయటికి చూస్తూ కూర్చున్నాడు. మహేశ్వరి అతని పక్కన వచ్చి కూర్చుంది. ఏమీ అడగలేదు, అతని చేతిమీద తన చెయ్యి పెట్టింది. శివరాం ఆ చేతిని బిగించి పట్టుకున్నాడు. ఆ రాత్రి వాళ్లిద్దరికీ మాటలు అవసరం కాలేదు. ఇరవై రెండేళ్లుగా వాళ్లిద్దరి మధ్య నడిచిన భాష అది!


ఏళ్లకు పిల్లలు పెద్దయ్యారు. కూతురు హైదరాబాద్ వెళ్లింది, కొడుకు అమెరికా వెళ్లాడు. ఇల్లు ఒక్కసారిగా పెద్దదైపోయింది. మొదట కొడుకు ఉద్యోగం కోసం వెళ్లాడు, తర్వాత కూతురు పెళ్లయి వెళ్లిపోయింది. ఇంట్లో మిగిలింది రెండు కుర్చీలు, ఒక మంచం, వంటగదిలో రెండు కప్పులు.


ఉదయం శివరాం పేపర్ చదివేవాడు, మహేశ్వరి కిటికీ దగ్గర మొక్కలకు నీళ్లు పోసేది. ఒకరోజు ఆమె అంది, "నిన్న కొడుకు ఫోన్ చేశాడు."


"ఏమన్నాడు?"

"వచ్చే నెల వస్తానన్నాడు."


శివరాం పేపర్ మడిచాడు, "నువ్వు నమ్ముతున్నావా?"

మహేశ్వరి కొద్దిసేపు అతని వైపు చూసి నవ్వింది, "నమ్మాలని ఉంది."


అతను పేపర్ మళ్లీ విప్పుకున్నాడు, ఆమె మొక్కలకు నీళ్లు పోయసాగింది. ఆ చిన్న సంభాషణలో వాళ్లిద్దరూ చెప్పుకున్నది ఆ మాటలకంటే ఎక్కువ.


ఒక ఉదయం శివరాం అద్దం ముందు నిలబడి షర్టు బటన్లు పెట్టుకుంటున్నాడు.


"మహేశ్వరీ! మన పెళ్లయి ఎన్ని సంవత్సరాలు?"

ఆమె నవ్వింది, "ఇరవై రెండేళ్లు."


శివరాం అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు, "నిన్ననే కదా?"

మహేశ్వరి నవ్వు అక్కడే ఆగిపోయింది. మెల్లగా, "అవును," అంది. ఆ రోజు ఆమె కిటికీ మూయలేదు.


కొన్ని రోజుల తర్వాత శివరాం ఆమెను చూసి అడిగాడు, "మీరు ఎవరు?"

ఆమె గుండెలో ఏదో విరిగినట్టైంది, కానీ ముఖం మీద ఏమీ చూపించలేదు. "ఈ ఇంట్లో ఉంటాను," అంది.


శివరాం తల ఊపాడు, ఆ సమాధానం అతనికి నచ్చినట్టుంది.


జ్ఞాపకాలు ఒక్కసారిగా వెళ్లిపోవు... మొదట పేర్లు పోతాయి, తర్వాత ముఖాలు, తర్వాత సంఘటనలు.


మిగిలేది కొన్ని అలవాట్లు! శివరాంకి మహేశ్వరి పేరు గుర్తుండేది కాదు, వాళ్ల పెళ్లి గుర్తుండేది కాదు, పిల్లల పేర్లు గుర్తుండేవి కాదు... కానీ ఉదయం కాఫీ తాగేటప్పుడు కప్పును రెండు చేతులతో పట్టుకునే అలవాటు పోలేదు; కిటికీ మూసి ఉంటే అసహనంగా చూడటం మాత్రం పోలేదు.


ఆ రాత్రి అతను నిద్రపోయాక ఆమె అల్మారా తెరిచింది. మొదటి ఇంటి తాళం, పిల్ల చిన్నప్పటి గాజులు, అతను ఇచ్చిన పాత పెన్, పెళ్లి రోజు తీసిన ఒక ఫోటో... ఆమె ఫోటోను చేతిలో పట్టుకుని చాలాసేపు కూర్చుంది.


చదువు, తెలివి, అందం, ఆస్తి... ఇవన్నీ ఒక మనిషి జీవితానికి అవసరమే కావచ్చు, కానీ జ్ఞాపకం పోతున్న మనిషి పక్కన కూర్చుని, అతను ఒకప్పుడు ఎవరో గుర్తు చేయడానికి ఇవేవీ అక్కరకు రావు! అక్కడ కావలసింది ఇంకేదో... పలుకు అక్కర్లేని ఒక మాట, చూపులో దాచిన ఒక గుర్తు, చేతిలోకి జారే మరో చేయి!


కొన్ని నెలల తర్వాత అతని జ్ఞాపకాలు మరింత దూరమయ్యాయి. పిల్లల పేర్లు మర్చిపోయాడు, తన ఉద్యోగం మర్చిపోయాడు. చాలాసార్లు ఆమెను చూసి అడిగేవాడు, "మీరు ఎవరు?"


ఆమె గుండెలో ఏదో విరిగినట్టు అనిపించినా నవ్వేది, "ఈ ఇంట్లో ఉంటాను."

అతను తల ఊపేవాడు, "అలాగా!"


ఆమె గదిలోకి వెళ్లి ఏడ్చేది, కానీ అతని ముందు కాదు. ఎందుకంటే జ్ఞాపకాలు పోయినా, తన ఏడుపును మాత్రం అతను ఎక్కడో గుర్తుపట్టవచ్చని ఆమెకు అనిపించేది.


ఒక సాయంత్రం అతను మంచం మీద కూర్చుని కిటికీ వైపు చూస్తున్నాడు. ఆమె అతని పక్కన కూర్చుంది.


చాలాసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. అతను తన చేతిని ముందుకు చాచాడు, ఆమె తన చేయి అతని చేతిలో పెట్టింది. అతను వేళ్లను బిగించాడు.


అతనికి ఆమె పేరు గుర్తులేదు, కానీ ఆమె చేతి స్పర్శకు అతని వేళ్లు మళ్లీ ఆమె వేళ్లను వెతుక్కున్నాయి. ఆమె కళ్లలో నీళ్లు నిలిచాయి, వాటిని అతనికి చూపించలేదు.


ఆ రాత్రి శివరాం నిద్రపోయిన తర్వాత మహేశ్వరి వంటగదిలో కూర్చుని ఏడ్చింది. వెక్కిళ్లు బయటికి రాకుండా చీర కొంగును నోటికి అడ్డం పెట్టుకుంది.


ఒకరోజు అతను ఆమె చేతిని పట్టుకున్నాడు, "మీకు నేను తెలుసా?"

మహేశ్వరి గొంతులో మాట ఆగిపోయింది. "తెలుసు" అనాలనిపించింది, కానీ అతని కళ్లలో తనను గుర్తించని ఖాళీ కనిపించింది. ఆమె ఏమీ అనలేదు.


శివరాం కిటికీ వైపు చూపించాడు, "అది తెరువు."

ఆమె లేచి కిటికీ తెరిచింది, చల్లని గాలి లోపలికి వచ్చింది. అతను కళ్లు మూసుకున్నాడు, "ఇప్పుడు బాగుంది."


ఆమె మళ్లీ అతని పక్కన కూర్చుంది, అతని భుజానికి తల ఆనించింది. ఆమెకు అప్పుడు అర్థమైంది... జతలో ఏడ్చేందుకు, వెక్కిళ్లలో పొదివి పట్టుకునేందుకు, శూన్యం చుట్టేసుకున్నప్పుడు పక్కనే కూర్చునేందుకు ఒక హృదయం కావాలి. జ్ఞాపకాలన్నీ ఉన్నా ఆ హృదయం లేకపోతే ప్రయోజనం లేదు; జ్ఞాపకాలు లేకపోయినా ఆ హృదయం ఉంటే మనిషి పూర్తిగా ఒంటరివాడు కాదు!


కొన్ని రోజులకు అతను ఆసుపత్రిలో చేరాడు. పిల్లలు వచ్చారు, కూతురు ఏడుస్తోంది, కొడుకు డాక్టర్‌తో మాట్లాడుతున్నాడు. ఆసుపత్రి గదిలో శివరాం మంచం మీద పడుకున్నాడు. ఆమె మాత్రం అతని మంచం పక్కనే కూర్చుంది. కిటికీ మూసి ఉంది. మహేశ్వరి నెమ్మదిగా లేచి దాన్ని తెరిచింది.


అతను కళ్లను తెరిచి ఆమె వైపు చూశాడు, "మీరు..."

ఆమె నవ్వింది, "ఈ ఇంట్లో ఉంటాను."


అతను కూడా నవ్వాడు... చాలా చిన్న నవ్వు. తర్వాత తన చేతిని కాస్త కదిలించాడు. ఆమె అతని చేతిని పట్టుకుంది. అతను కళ్లు మూశాడు. ఆమె వేళ్లు అతని వేళ్ల మధ్య అలాగే ఉన్నాయి... మాటలు రాలేదు, అవసరం కూడా లేదు!


ఆ తర్వాత ఇల్లు మరింత నిశ్శబ్దమైంది. పిల్లలు వెళ్లిపోయారు. గదులు అలాగే ఉన్నాయి, కిటికీ అలాగే ఉంది, జామచెట్టు అలాగే ఉంది... ఒక్క కుర్చీ ఖాళీగా ఉంది.


ఒక సాయంత్రం ఆమె కాఫీ చేసింది. అలవాటుగా రెండు కప్పులు తీసింది. రెండో కప్పులో కాఫీ పోయబోతూ చేయి ఆగిపోయింది. ఆ కప్పును మెల్లగా తిరిగి పెట్టింది. ఒక్క కప్పుతో కిటికీ దగ్గర కూర్చుంది. బయట గాలి కదులుతోంది. ఆమెకు చాలా ఏళ్ల క్రితం అతను అడిగిన మాట గుర్తొచ్చింది:


"ఏం అనుకుంటున్నావో చెప్పొచ్చుగా?"


అప్పుడు ఆమె చెప్పలేదు, ఇప్పుడు చెప్పడానికి అతను లేడు. అయినా ఆమె పెదవుల మీద చిన్న నవ్వు వచ్చింది.


ఆ నవ్వును ఎవరూ చూడలేదు, అర్థం చేసుకునే మనిషి కూడా లేడు. కానీ ఆమెకు అనిపించింది... కొన్ని భావాలు చెప్పుకోవడానికి మనిషి ఎదురుగా ఉండాల్సిన అవసరం లేదు, అవి ఒకసారి హృదయానికి చేరితే చాలు అక్కడే ఉంటాయి!


మనసుకూ మనసుకూ మధ్య ఒక అనువైన, అరుదైన హృదయ భాష ఉండాలి!

ఆమె కిటికీ మూయలేదు... ఆ రాత్రంతా అది తెరిచే ఉంది!


ఈ కవిత మీ మనసును తాకితే SHARE చేయండి 🙏

***************

డా. దారల విజయ కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


డా. దారల విజయ కుమారి

రచయిత్రి పరిచయం: డా. దారల విజయ కుమారి

పేరు : డా. దారల విజయ కుమారి

చదువు : డాక్టరేట్ ఇన్ సైకాలజీ

కుటుంబం : భర్త శ్రీ సురేంద్ర బాబు, పిల్లలు సాహితీ చరణ్, ప్రవల్లిక

స్వంత జిల్లా కర్నూలు, ప్రస్తుత నివాసం తిరుపతి


రచనలు : వేచాను కలకై..కవితా సంకలనం,

చర్విత చరణం - కథా సంకలనం

వివాహ బంధం.. దీర్ఘ కవిత (తానా - ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి పోటీలో చోటు చేసుకుంది)


మొదటి నవల, "హేమంత తుషారం" ఉషా- శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందింది.


రెండవ నవల "ఎ బర్డ్ ఇన్ ది హ్యాండ్" ఉషా సుజన ఫౌండేషన్ నవలల పోటీలో బహుమతి లభించింది


బహుమతులు..పురస్కారాలు :

************

సాహిత్య ప్రస్థానం , కౌముది, కథా మంజరి, వివిధ, స్నేహ ప్రజా శక్తి, సాక్షి ఫన్ డే, నెచ్చెలి, ఈమాట, మల్లెతీగ ,సహరి , విశాలాక్షి, స్వాతి సచిత్ర వార పత్రిక, విమల సాహితీ సంస్థ, వార్త, నేటి నిజం, మహిళా మార్గం, శ్రమ జీవి, ప్రజా సాహితి పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన కథల కవితల పోటీలలో పలు కథలు కవితలు బహుమతులు పొందాయి, ప్రచురించబడ్డాయి. కొన్ని కథలు,  సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఆలిండియా రేడియో లోనూ ప్రసారం చేయబడ్డాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page