top of page

ఇదో ఆడపిల్ల జీవితం

Ido Adapilla Jeevitham Written By Shiva Shivamavuri

రచన : శివమావూరి శివ


అది 2008వ సంవత్సరం... గ్రీష్మ కాలం... ఆ ముందు రోజు రాత్రి ఆఫీస్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చే సమయానికి ఎక్కువ టైం అయ్యింది. ఉదయం 8 గంటల వేళ నా ఫోన్ నిరంతరం మోగుతుంది... మూడుసార్లు ఫుల్ రింగ్ అయింది.. నాలుగోసారి చాలా కష్టంగా ఫోన్ లిఫ్ట్ చేశాను... నెంబర్ ఎవరో కూడా చూడలేదు… "హలో".... అనగానే అవతలి నుంచి......" అన్నా శివన్నా !పెద్ద రైల్వే స్టేషన్ కి అర్జెంటుగా రా... ఒక మంచి వార్త అన్నా"...."ఏమైంది..?? " నా ప్రశ్న....???

" చిన్న పిల్లని ఎవరో అమ్మేస్తున్నారు అన్నా.... అర్జెంటు రా... అన్నా...." ఫోన్ కట్.... కొత్త న్యూస్ పేపర్ వచ్చిన సమయం ..... ఒక చిన్న గాయాల వార్త మిస్ అయితేనే పెద్ద పంచాయతీ నడిచే రోజులు.... నిద్ర ఎగిరిపోయింది... ఆఘమేఘాల మీద రెడీ అయ్యా... బండి బయటకు తీస్తూనే ఫోన్ లో నాకు సమాచారం ఇచ్చిన నంబర్కు కాల్ చేశా.

" అన్నా ఎక్కడున్నారు..?? అనగానే,అన్న "ఇంటికి బయలుదేరాను..." అని సమాధానం... "అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్.... ఉండండి వచ్చేస్తున్నా.. ప్లీజ్" అని అవతలి వ్యక్తిని బతిమాలాను.... "అన్నా ఇంటికి వెళ్తున్నా అన్నా.. నాకు అర్జెంటు... పిల్ల అక్కడే ఉంది.. నేను తాడేపల్లిగూడెం నుంచి వస్తున్నా... అప్పటి నుంచి వాళ్లని చూస్తున్నా.. చంకలో చంటి బిడ్డను వేసుకొని వాళ్ళు అడుక్కుంటున్నారు... పిల్లను విపరీతంగా కొడుతున్నారు.. ఏలూరు రైల్వే స్టేషన్ వరకు వాళ్లని గమనించాను. కిందకు దిగి వాళ్లని ఫాలో అయ్యాను. అక్కడ వాళ్ళు ఆ బిడ్డను అమ్మేయాలని మాట్లాడుకోవడం విని, ఇదేదో కాంప్లికేటెడ్ కేసు అని... మా ఫ్రెండ్ ద్వారా మీ నెంబర్ తీసుకొని కాల్ చేశాను.. అయితే నేను మళ్ళీ విజయవాడ వెళ్లాలన్నా.. మీరు వెళ్లి ఆ పాపను కాపాడండి ప్లీజ్! " అంటూ నాకు సమాచారం ఇచ్చిన వ్యక్తి మాట్లాడాడు.

"ఆ పాప ఎక్కడ ఉందో చెప్పండి" అన్నాను.

" ఖచ్చితంగా ఏలూరు బోర్డు అని ఉన్న చోట వాళ్ళు కూర్చుని ఉన్నారు "అని మాత్రమే చెప్పాడు.

హీరో హోండా స్ప్లెండర్ బైక్ ఏలూరులో నేనెప్పుడు అరవై లో వెళ్ళలేదు... కానీ ఆ రోజు నా బండి అరవై దాటి పరుగెత్తింది.. గూడ్స్ షెడ్ రోడ్డు వైపు నుంచి లోనికి వెళ్లి నేను అక్కడ మొత్తం వెతికాను... మూడో ప్లాట్ ఫారం అవతల గూడ్స్ బళ్ళు నిలిపే ప్రాంతంలో కొందరు అనుమానాస్పదంగా ఉండటం గమనించాను... ప్లాట్ఫారం మొత్తం మరోసారి కలిసి తిరిగినా ఫలితం లేదు. మళ్లీ వచ్చి ఏలూరు బోర్డు దగ్గరే నిలబడి ఉన్నాను.. అంతలో ఓ నలభై నుంచి నలభై ఐదేళ్ల వయసున్న మహిళ చంకలో చంటి పాప తో రైలు పట్టాలు దాటుకుంటూ ఉన్న విషయాన్ని గమనించాను.. బాగా మురికిగా.. సరైన బట్టలు సైతం లేకుండా ఉన్న మహిళ చంకలో మాత్రం కొంచెం తెల్లగా ఉన్న చిన్నారి ని చూసి నాకు మొదట అనుమానం వచ్చింది. ఆమెను జాగ్రత్తగా గమనిస్తూ ఫాలో అయ్యాను.. పాపను పట్టించుకోకుండా ఓ బల్ల మీద పడేసి ఆ మహిళ తిరగడం చూసి ఖచ్చితంగా ఇదేదో తేడా కేసుగా భావించాను.. బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తున్నా పట్టించుకోని ఆ మహిళ ప్రవర్తన నా అనుమానాన్ని మరింత బలపరిచింది... ఇక ఆలస్యం చేయకూడదని భావించి.. వెంటనే ఆ మహిళ దగ్గరికి వెళ్లి "ఎవరు ఈ పిల్ల?" అని అడిగాను... " మేరా బచ్చా " అనగానే నాకు అనుమానం నిర్ధారణ అయింది.

"పిల్లను అక్కడ పెట్టు నీ పిల్ల కాదు నాకు తెలుసు.. అక్కడ పెట్టు" అని గట్టిగా గదమాయించాను... అంతలో మరో ఇద్దరు వాళ్ల తాలూకు వారు వచ్చారు.

" ఆప్ కౌన్ హై.." అంటూ వాళ్ళు నన్ను ప్రశ్నించారు.

" నేను ఎవరో మీకు చెప్తా. మీరు పిల్లను వదిలిపెట్టి ఇక్కడినుంచి వెళ్లిపోండి.. పిచ్చిపిచ్చి వేషాలు వేయకండి. మొత్తం అందరూ బొక్కలో ఉంటారు... కథలు పడకండి" అని నేను తెలుగులో చెప్పినా, నా భావం వాళ్ళకి అర్థం అయింది.. అప్పటికే ప్లాట్ఫామ్ మీద గొడవ గమనించిన రైల్వే పోలీసులు అటు వచ్చారు. అప్పటికే పోలీసులు పరిచయం ఉండడంతో వాళ్లు నన్ను "ఏమైంది శివన్నా ఏమైనా ప్రాబ్లమా" అని అడిగారు.

" వీళ్ళు ఈ పిల్లని అమ్ముతున్నారు.. ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చారు. కొంచెం చూడండి అన్నా.. మళ్ళీ అడిగితే నా మీద తిరగబడుతున్నారు" అని పోలీసులకు చెప్పాను.. పోలీసులు రావడంతో అవతలి వాళ్ళు కాస్త మెత్తబడ్డారు. నామీద అరవడం కూడా ఆపేశారు.

" కానిస్టేబుల్ కల్పించుకొని ఆ పాప ఎవరిది.. ఎక్కడినుంచి తెచ్చారు" అంటూ వాళ్ల ను ప్రశ్నించాడు.

వాళ్లంతా" భాయ్ సాబ్!... మా తప్పేమీ లేదు. మాకు ఆ పాప కొద్ది రోజుల క్రితం రైలు పట్టాల సమీపంలో దొరికింది" అంటూ చెప్పారు.. బిడ్డ బంగారు బొమ్మలా ఉంది.. కనీసం రెండు నెలలు కూడా నిండవు... నాకు అప్పుడే నా కూతురు అమ్ము పుట్టిన క్షణాలు కళ్ళలో కదులుతూ ఉన్న సమయమది.. ఆ బుజ్జి పాప ని చూడగానే భలే ముద్దొచ్చింది. అయితే ఎడమ చేయి మాత్రం సగమే ఉంది.

" ఏం చేద్దాం సార్" అని కానిస్టేబుల్ ని అడిగాను.

" మీకు తెలిసిన ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఉంటే వాళ్లకు ఫోన్ చేయండి సార్. వచ్చి తీసుకు వెళ్తారు" అని కానిస్టేబుల్ చెప్పాడు.. అప్పటికే నాకు ఆపిల్ స్వచ్ఛంద సంస్థ ద్వారా పరిచయం ఉన్న మున్ని గారికి కాల్ చేశాను.. విషయాన్ని ఆమెకు వివరంగా చెప్పాను. ఆమె నిమిషాల్లో స్పందించి వెంటనే రైల్వే స్టేషన్ కు వచ్చారు.. పాప ని చూసి 'భలే ఉంది' అంటూ మురిసిపోయారు మున్ని గారు.

"ఏం చేద్దాం చెప్పండి మేడం" అంటూ ఆవిడను సలహా అడిగాను.

" ఒకసారి పోలీసులతో మాట్లాడు శివా" అని ఆమె సలహా ఇచ్చారు.

రైల్వే పోలీసులు "ఇది లా అండ్ ఆర్డర్ మేటర్" అని 'ఒకసారి టూటౌన్ పోలీసులతో మాట్లాడా'లని సూచించారు.. అప్పటి ఎస్ ఐ రవి కుమార్ గారికి నేను కాల్ చేశాను. ఈ విషయం చెప్పి ఒకసారి ఎవరినైనా పంపించాలని చెప్పడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను రైల్వేస్టేషన్ పంపించారు... పిల్లను వాళ్ల దగ్గర నుంచి తీసుకొని వాళ్లను కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించారు.. ఎస్ఐ గారితో మాట్లాడితే రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న వీధుల్లోని వాళ్ల పిల్ల అయి ఉంటుందని.. పిల్లకు ఎడమ చేయి లేకపోవడంతో వదిలేసి ఉండవచ్చని ఆయన చెప్పారు... తర్వాత రోజు పేపర్లలో ఈ వార్త వచ్చింది. ఏలూరు 12 పంపులు సెంటర్కు చెందిన ఓ కుటుంబం దీనికి స్పందించి పోలీస్స్టేషన్కు వచ్చారు.. బిడ్డ మాదే అని... కొన్ని కుటుంబ కారణాల వల్ల బిడ్డను రైలు పట్టాలు వద్ద వదిలేయాల్సి వచ్చిందని చెప్పారు.. దానికి తగిన ఆధారాలను పోలీసులు ముందు వారు ఉంచారు.. దీంతో రైల్వే స్టేషన్లో బిడ్డతో ఉన్నవారిని వదిలేసారు... రవికుమార్ గారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు.. తర్వాత రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో పాప తాలూకా కుటుంబ సభ్యులు అక్కడ కనిపించారు.. ఎస్సై గారు 7:00 సమయంలో రౌండ్ నుంచి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. రాగానే నన్ను లోపలికి పిలిచారు. "ఏం చేద్దాం శివా" అని అడిగారు.. అప్పటికే చంటి పాపను పోలీస్ స్టేషన్ లోని మహిళా కానిస్టేబుల్ సాకుతున్నారు.. 'సమస్య ఏమిటో అడగండి సార్.. చంటి పాపను వదిలించుకునే ఎంత సమస్య ఉందో కనుక్కోండి సార్...?? మీరు గట్టిగా వార్నింగ్ ఇస్తే బాగుంటుంది... ఆ పాపకు భవిష్యత్తు ఉంటుంది" అని సూచించాను... సార్ వాళ్ల కుటుంబ సమస్య ఏమిటో పాపను ఎందుకు విడిచిపెట్టాలి వచ్చిందో వివరంగా కనుక్కున్నారు.. పాపకు పుట్టుకతోనే ఎడమ చేయి లేకుండా పుట్టింది... దీంతోపాటు వాళ్ళు పేదరికంలో ఉండడంతోపాటు, ఆడపిల్ల, చేయి లేకుండా పు ట్టడంతో తర్వాత భారం అనుకునే ఉద్దేశంతో వదిలేశారని కౌన్సిలింగ్ తర్వాత తెలిసింది.. అయితే పత్రికల్లో మీడియాలో ఈ వార్త రావడంతో వారు రియలైజ్ అయ్యి బిక్షగాళ్ల చేతుల్లో తమ బిడ్డ ఉందన్న విషయం తెలుసుకుని పోలీసుల వద్దకు వచ్చినట్లు తెలిసింది.. బోరున విలపించి మరోసారి ఇలాంటి పరిస్థితి రానివ్వము అంటూ వారు వేడుకోవడం తో ఎస్ఐ గారు కౌన్సిలింగ్ చేసి తగిన సూచనలు చేసి ఇంటికి పంపారు...

(కట్ చేస్తే ).........

తరువాత రోజు ఉదయం 9 గంటల సమయంలో మా మరదలు ఫోన్.. నిన్న నువ్వేదో చంటి పాపను పోలీస్స్టేషన్లో అప్పగించావు అంటగా... వాళ్లు మా ఫ్రెండ్ వాళ్లే... నువ్వే కావాలని ఆ పాపను మళ్ళీ తీసుకువచ్చి నాటకం ఆడావని.... వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది.. పాపను తీసుకు వచ్చినందుకు ఒక గొడవ.. నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్లకు సర్దిచెప్పేందుకు మరో గొడవ. 'మొత్తం నీ పనే' అనేలా వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పింది....

" సరేలే వాళ్లెలా అనుకుంటే మనకెందుకు. ఆ చంటి బిడ్డను వదిలేస్తారా ఉంచుకుంటారా" అని అడిగాను.

" లేదు లేదు ఆ పిల్లను ఉంచుకుంటారు…. కాకపోతే వాళ్ళ కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి..." అని చెప్పుకొచ్చింది.....

'మీ బావ కావాలని చేశాడు' అంటూ మా ఫ్రెండ్ అనడం నాకు బాధేసింది. ఎందుకు నీకు ఇవన్నీ?" అని నన్ను అడిగింది మా మరదలు....

"ఒక చంటి పాపను అలా ఎలా వదిలేస్తాం వాసంతి" అంటూ నేను తనకు సర్ది చెప్పాను. 'ఎవరు ఏమనుకుంటే మనకెందుకు ఆ బిడ్డ బాగుంటే చాలు అనుకున్నాను'...... ( కట్ చేస్తే ) 11 ఏళ్ళు గడిచిపోయాయి.. నా గర్ల్ ఫ్రెండ్ మూడు రోజుల క్రితం మా ఏలూరు వెళ్ళింది. అదే సమయంలో మా మరదలు వాసంతి కూడా ఏలూరు పిల్లలతో సహా వచ్చింది. వీళ్ళిద్దరూ మళ్ళీ మా మరదలు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. అక్కడ పదకొండేళ్ల క్రితం రైల్వే స్టేషన్ లో కొందరి చేతికి చిక్కి మళ్ళీ తల్లిదండ్రుల వద్దకు చేరిన చిట్టి పాప పెద్దదై నా భార్య కు కనిపించింది... శ్రావణి తనను గుర్తుపట్టింది.. అందంగా బుట్ట బొమ్మలా ఉన్న తనతో నాకు ఫోటో దిగి పంపింది... ఈ పాప ఎవరో నీకు గుర్తుందా అని నన్ను ప్రశ్నించింది... లేదు ఎవరో గుర్తుకురావడం లేదు.... అని చెప్పాను.. మళ్లీ నన్ను శ్రావణి గతంలో కి తీసుకెళ్ళింది.. ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో నువ్వు కాపాడి, మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పాపే ఈ పాప అంటూ నాకు ఆమె గతాన్ని మళ్లీ గుర్తు చేసింది... ఆ పాప రూపం... ఆ పాప నవ్వు నా కళ్ళలో ఎప్పటికి మెదలాడుతుంది....

"మీరు నా భర్త కావడం గర్వంగా ఉంది. " అని భళ్ళున ఏడ్చేసింది నా భార్య.................... ఎన్ని కోట్లు పెడితే వస్తాయండి ఇలాంటి పొగడ్తలు..... పదిహేనేళ్ల మా జీవన ప్రయాణం లో నా భార్య నాకు ఇచ్చిన గొప్ప కాంప్లిమెంట్ లలో ఇది ఒకటి....

ఈ విషయంలో నేను నా అక్షరానికి, నేను పని చేసే పత్రికకీ ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాను.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

117 views0 comments

Comments


bottom of page