మనసులు కలిసిన వేళ..
- Dr. Krishna Kumar Vepakomma

- 26 minutes ago
- 5 min read
Manasulu kalisina Vela - Telugu Inspirational Story | Dr. Krishna Kumar Vepepakomma
మనసులు కలిసిన వేళ.. - తెలుగు ప్రేరణాత్మక కథ | డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ
Published in manatelugukathalu.com on 30/05/2026
అది హైటెక్ సిటీ, హైదరాబాద్. ఒక అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సంస్థలో రాహుల్ ఉన్నత స్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంచి జీతం, ఆధునిక జీవితం, సమాజంలో గుర్తింపు అన్నీ అతని సొంతమే. అయినా అతని హృదయానికి అత్యంత దగ్గరైనది మాత్రం తను నిర్మించుకున్న అత్యాధునిక సాంకేతికతతో విరాజిల్లే కొత్త ఇల్లు మాత్రమే.
హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న ఒక విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలో అతను అత్యాధునిక సాంకేతికతతో కూడిన “స్మార్ట్ హోమ్”ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇంట్లో ప్రతి పనీ సెన్సార్లు, వాయిస్ కమాండ్లు, ఆటోమేటెడ్ సిస్టమ్‌ల ఆధారంగా నడిచేది. ఇంట్లోని ప్రతి పరికరం సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై పనిచేసేది. రాహుల్ మొబైల్‌లోని ఒకే యాప్‌తో ఇంటి మొత్తం వ్యవస్థను నియంత్రించగలిగేవాడు.
ఉదయం లేవకముందే బెడ్‌రూమ్ కర్టెన్లు స్వయంగా తెరుచుకోవడం, గదిలో ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఎయిర్ కండిషనర్ పని చేయడం, ఫ్రిజ్‌లో సరుకులు తగ్గిపోతే వెంటనే నోటిఫికేషన్ రావడం ఆ ఇంటి ప్రత్యేకతలు.
ఇంటి భద్రత కోసం ఫేస్ రికగ్నిషన్ డోర్ లాక్స్, ప్రతి గది మూలను గమనించే AI కెమెరాలు, అనుమానాస్పద కదలికలను గుర్తించే మోషన్ సెన్సార్లు అమర్చబడ్డాయి.
పిల్లలు ఇంటికి చేరుకున్న వెంటనే రాహుల్ ఫోన్‌కు సమాచారం వెళ్లేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా రోబోటిక్ క్లీనర్లు నేలను శుభ్రం చేసేవి. ఆ ఇంట్లో ప్రతి పని యంత్రాలపై ఆధారపడి నడిచేది.
………………………
రాహుల్ స్మార్ట్ హోమ్ గురించి విన్న బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు తరచూ ఇంటిని చూడటానికి వచ్చేవారు. ఇంట్లోని ఒక్కొక్క సాంకేతిక సౌకర్యాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయేవారు…
వాయిస్ కమాండ్‌తో కర్టెన్లు కదలడం, ముఖాన్ని గుర్తించి తలుపులు తెరుచుకోవడం, మనుషులు లేని గదుల్లో లైట్లు స్వయంగా ఆఫ్ కావడం చూసి చాలామంది విస్మయంతో ఒకరినొకరు చూసుకునేవారు.
“ఇది నిజంగా ఇల్లేనా… లేక రాబోయే విజన్ 2050లో కనబడబోయే స్మార్ట్ జీవితం ఇప్పుడే ఇక్కడ ప్రత్యక్షమవుతోందా!” అని వారు ఆశ్చర్యంగా మాట్లాడుకునేవారు.
………………………
రాహుల్ తల్లి సరోజకు మాత్రం ఆ ఇంట్లో ఎప్పుడూ అసౌకర్యంగానే ఉండేది. ఆమెకు యంత్రాల కంటే మనుషులపై నమ్మకం ఎక్కువ. ఇంట్లో అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు, భద్రత, ఆధునికత. కానీ ఎక్కడో ఒక వెలితి ఆమెను నిశ్శబ్దంగా బాధించేది.
ఒకరోజు రాత్రి హాల్‌లో ల్యాప్‌టాప్‌తో బిజీగా ఉన్న రాహుల్ దగ్గరకు వచ్చి ఆమె మెల్లగా అడిగింది. “రాహుల్… ఈ ఇంట్లో లైట్లు మన ప్రమేయం లేకుండానే వెలుగుతున్నాయి. తలుపులు మన ముఖం చూడగానే తెరుచుకుంటున్నాయి. కానీ మనుషుల్లో సాన్నిహిత్యం తగ్గిపోయింది బాబూ…” అంది. ఆమె మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది.
“ముందు రోజుల్లో ఇళ్లలో సౌకర్యాలు తక్కువైనా… మనుషులు దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు అందరూ ఒకే ఇంట్లో ఉన్నా, ఒక్కొక్కరూ ఒక్కో స్క్రీన్‌లో బతుకుతున్నారు.” అని చెప్పి ఆమె డైనింగ్ టేబుల్ వైపు చూసింది. ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి భోజనం చేసిన ఆ టేబుల్ మీద ఇప్పుడు ఎక్కువగా మొబైళ్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లే కనిపిస్తున్నాయి అంటూ రోదించింది.
రాహుల్ చిన్నగా నవ్వి మళ్లీ తన పనిలో మునిగిపోయాడు. కానీ తల్లి సరోజ మాటలలోని అంతరార్థం మాత్రం ఆ ఇంట్లో చెవిటికి శంఖం ఊదినట్టే అయింది.
………………………
రోజులు గడుస్తున్నాయి…
ఇంట్లో చేసే ప్రతి పని యంత్రాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఉదయం అలారం లేపేది. కాఫీ మిషన్ స్వయంగా కాఫీ తయారు చేసేది. పిల్లలు డిజిటల్ టాబ్లెట్ చూస్తూనే భోజనం ముగించేవారు.
మాధవి ఆన్‌లైన్ మీటింగ్స్‌లో బిజీగా ఉండేది. రాహుల్‌కు మాత్రం మొబైల్, ల్యాప్‌టాప్‌లే ప్రపంచంగా మారిపోయాయి. ఒకే ఇంట్లో ఉంటూ… అందరూ ఒక్కొక్క గదిలో ఒక్కొక్క జీవితాన్ని గడుపుతున్నట్టుండేది. మాటలు తగ్గిపోతున్నాయి. మనుషుల మధ్య నిశ్శబ్దం పెరుగుతోంది.
సరోజ మాత్రం ప్రతిరోజూ బాల్కనీలో నిశ్శబ్దంగా కూర్చొని ఎదురింటి పిల్లలు కలిసి ఆడుకోవడం చూస్తూ ఉండేది. ఆ పిల్లల నవ్వుల్లో ఆమెకు ఎక్కడో గత జ్ఞాపకాలు, ఆ రోజుల్లో మనుషుల మధ్య ఉన్న ఆప్యాయతలు గుర్తొచ్చేవి.
……………………….
ఒక ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా అపార్ట్‌మెంట్‌లో కరెంట్ పోయింది. కొద్దిసేపటికే బ్యాకప్ కూడా ఆగిపోయింది. క్షణాల్లో ఆ అత్యాధునిక స్మార్ట్ హోమ్ మూగబోయింది. ఎప్పుడూ “Welcome Home” అని పలకరించే వాయిస్ అసిస్టెంట్ స్పందించలేదు. వైఫై ఆగిపోయింది. ఆటోమేటిక్ లైట్లు వెలగలేదు. గోడలపై మెరుస్తూ ఉండే డిజిటల్ స్క్రీన్‌లు ఒక్కసారిగా నల్లబడిపోయాయి.
ఆ ఇంట్లో మొదటిసారి యంత్రాల శబ్దం కంటే నిశ్శబ్దమే ఎక్కువగా వినిపించింది.
రాహుల్ కుమారుడు ఆదిత్య చేతిలో మొబైల్ పట్టుకుని ఇంట్లో అటూ ఇటూ తిరగసాగాడు. ఎక్కడైనా సిగ్నల్ వస్తుందేమోనని బాల్కనీ దగ్గర నిలబడ్డాడు. కొద్దిసేపటికే అసహనంగా సోఫాలో కూర్చుని: “నెట్ లేదు… గేమ్ ఆడలేను… ఇప్పుడు ఏం చేయాలి?” అని విసుగ్గా అడిగాడు.
ఆ మాట విన్న సరోజ నిశ్శబ్దంగా అతన్ని చూసింది.“ఎంత విచిత్రం…” అనుకుంది.
అప్పుడు సరోజ మెల్లగా పాత అల్మారాలో నుంచి ఒక చిన్న బ్యాగ్ తీసుకొచ్చింది. అందులో పాచికలు, చెస్ బోర్డు, పాత ఫోటోలు ఉన్నాయి.
రాహుల్ వైపు చూసి ఆమె చిరునవ్వుతో అడిగింది: “ఈ రోజు మనందరం ఇలా యంత్రాల్లా కాకుండా… మనుషుల్లా కూర్చొని మాట్లాడుకుంటూ, సరదాగా చెస్ గానీ పాచికలు గానీ ఆడుకుంటే ఎలా ఉంటుంది?” అంది.
మొదట ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ కరెంట్ లేక, ఏం చేయాలో పాలుపోక అందరూ హాల్‌లో కూర్చొన్నారు. కొద్దిసేపటికి కోడలు హాసిని కూడా తన ల్యాప్‌టాప్ పక్కన పెట్టి వారితో చేరింది.
చెస్ ఆడుతూ రాహుల్ చాలా రోజుల తర్వాత తన కుమారుడు ఆదిత్య కళ్లలో కనిపించిన ఆనందాన్ని గమనించాడు. తన పాత ఫోటోలు చూస్తూ హాసిని పెళ్లి రోజున జరిగిన మరపురాని సంఘటనలను గుర్తుచేసుకుని నవ్వుకుంది. తల్లి సరోజ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను, అప్పటి మధురానుభూతులను అందరితో పంచుకుంది.
బయట వర్షం కురుస్తోంది…
ఇంట్లో మాత్రం చాలాకాలం తర్వాత నిజమైన జీవితపు ఘోష వినిపిస్తోంది. నవ్వులు, చిన్న చిన్న మాటలు, సరదా ఆటల మధ్య ఆ ఇల్లు ఒక్కసారిగా జీవం పోసుకున్నట్టైంది.
అప్పుడే కూతురు అనన్య అమాయకంగా తండ్రి వైపు చూసి అడిగింది: “నాన్నా… కరెంట్ పోయిన తర్వాత మన ఇల్లు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది?”
ఆ ప్రశ్న విన్న వెంటనే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
సరోజ మాత్రం లోపలే ఒక నిట్టూర్పు విడిచింది.“యంత్రాలు ఆగిపోయినప్పుడు… మనుషులు మళ్లీ ఒకరిని ఒకరు చూసుకోవడం మొదలుపెడతారేమో చిట్టితల్లి…” అంది.
ఆ మాట రాహుల్ మనసులో ఎక్కడో బలంగా తాకింది.
ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు.సాంకేతికత వాళ్ల ఇంటిని ఆధునికంగా మార్చింది. కానీ కుటుంబాన్ని దగ్గర చేయలేకపోతోంది.
……………………….
కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన జరిగింది…
ఒక రాత్రి అకస్మాత్తుగా సరోజకు తల తిరగడం మొదలైంది. నెమ్మదిగా హాల్‌లోకి వెళ్లి సోఫాలో కూర్చుంది. చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఆమె గుండె వేగంలో అసాధారణ మార్పును గుర్తించి వెంటనే రాహుల్ ఫోన్‌కు అలర్ట్ పంపింది.
కానీ ఆ సమయంలో రాహుల్ విదేశీ క్లయింట్‌తో వీడియో కాల్‌లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. ఫోన్‌లో వచ్చిన అలర్ట్‌ను ఒకసారి చూసి, “ఇప్పుడు కాదు… తర్వాత అటెండ్ అవుతాను.” అంటూ నిర్లక్ష్యంగా ఫోన్ పక్కన పెట్టేశాడు.
కొద్దిసేపటికే ఇంట్లోని AI అసిస్టెంట్ గట్టిగా ప్రకటించింది: “Emergency detected.”
ఆ శబ్దంతో అందరూ ఒక్కసారిగా బయటికి పరుగెత్తుకొచ్చారు.సరోజ నేలపై వాలిపోయి ఉంది.
ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. పరీక్షలు పూర్తయ్యాక డాక్టర్ గద్గద స్వరంతో అన్నాడు: “ఇంకొంచెం ఆలస్యమై ఉంటే పరిస్థితి చేజారిపోయేది” అని.
………………………
ఆ రాత్రి రాహుల్‌కు అసలు నిద్ర పట్టలేదు.
యంత్రాలు మనుషుల ఆరోగ్యాన్ని గమనించగలవు… కానీ వారి మనసుల్లోని బాధను మాత్రం గుర్తించలేవు.
మరుసటి రోజు ఉదయం సరోజ నెమ్మదిగా అంది. రాహుల్, “ఇంటి రూపం ఎంత మారినా పరవాలేదు, కానీ మనుషుల మనసులు మాత్రం ఒకరికి ఒకరు దూరం కాకూడదు బాబూ…” అంది.
ఆ రోజు నుంచి ఆ ఇంటి జీవితంలో మార్పు మొదలైంది. అందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. రాత్రి ఎనిమిదిన్నర తర్వాత అందరూ గాడ్జెట్లు పక్కన పెట్టేయాలి. భోజనం అందరూ కలిసి చేయాలి. వారంలో ఒకరోజు పూర్తిగా “డిజిటల్ ఫ్రీ డే”గా పాటించాలి అని నిర్ణయించారు.
మొదట అది అందరికీ కష్టంగానే అనిపించింది. కానీ మెల్లగా ఆ ఇంట్లో మార్పు కనిపించింది. డైనింగ్ టేబుల్ మీద మళ్లీ మాటల కలకలం మొదలైంది. హాల్‌లో నవ్వులు పెరిగాయి. ఒకే ఇంట్లో ఉంటూ దూరమైన మనసులు… మళ్లీ దగ్గరవడం మొదలుపెట్టాయి.
“స్మార్ట్ హోమ్స్ మన జీవితాన్ని సులభతరం చేయవచ్చు. కానీ మనుషులను నిజంగా దగ్గర చేసేది యంత్రాలు కావు రాహుల్, మనసుతో పలికే మాటలే…” అంది సరోజ.
“సాంకేతికత సౌకర్యాన్ని ఇవ్వగలదు… కానీ ఇంటికి ప్రాణం పోసేది మాత్రం మనుషుల మధ్య ఉన్న ఆప్యాయత, మంచి మాటలు, అనుబంధమే అని ఆ ఇంట్లో ప్రతిధ్వనించింది.”
———————————
డా. కృష్ణకుమార్ వేపకొమ్మ
***
డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ గారి కొన్ని ఇతర రచనలు:
డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్కారం,
నేను డా. వేపకొమ్మ కృష్ణకుమార్, జువాలజీ లో డాక్టరేట్ పొందిన విశ్రాంతి ప్రొఫెసర్; మాజీ ప్రిన్సిపల్. విద్యారంగంలో 30 సంవత్సరాల పైగా అనుభవం కలిగి, పుస్తక రచయిత, పరిశోధక, విద్యా నిపుణుడిగా సేవలందించాను. ప్రస్తుతం పలు ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా సామాజిక, విద్యా, సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాను.
మీ సంస్థలో నా అనుభవాన్ని ఉపయోగించి గుణాత్మక, ఆసక్తికర వ్యాసాలు అందించగలనని తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది.
డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ
ప్రొఫెసర్ & ప్రిన్సిపాల్ (రిటైర్డ్)
వార్తాపత్రిక కాలమిస్ట్
రాజీవ్ నగర్, హైదరాబాద్








Comments