top of page
Original.png

ఏకాగ్రత నేర్పిన పాఠం   

Telugu motivational student story, Telugu education story, concentration story Telugu, study motivation Telugu, microlearning Telugu

కొవ్వొత్తి వెలుతురులో ఏకాగ్రతతో చదువుతున్న విద్యార్థిని
కొవ్వొత్తి వెలుతురులో ఏకాగ్రతతో చదువుతున్న విద్యార్థిని

Ekagratha Nerpina patam - Telugu Inspirational Story | Dr. Krishna Kumar Vepepakomma 

ఏకాగ్రత నేర్పిన పాఠం - తెలుగు ప్రేరణాత్మక కథ | డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ

Published in manatelugukathalu.com on 18/05/2026


చదువుతున్నా గుర్తుండడం లేదా? ఏకాగ్రత లేక ఇబ్బంది పడుతున్నారా?

జాగృతి అనే విద్యార్థిని జీవితంలో జరిగిన చిన్న మార్పులు, మైక్రోలెర్నింగ్ పద్ధతి, ఏకాగ్రత అలవాట్లు ఆమెను ఎలా విజయపథంలో నడిపించాయో తెలిపే ఆలోచింపజేసే కథ ఇది. ప్రతి విద్యార్థి తప్పక చదవాల్సిన ప్రేరణాత్మక రచన.


సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది. స్కూల్ బస్ నెమ్మదిగా ఇంటి దగ్గర ఆగింది. పిల్లలంతా నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ సరదాగా ఉంటే, జాగృతి మాత్రం దిగులుగా ఉంది. ఆమె చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది. గుండెల్లో ఏదో తెలియని భయం. బస్ వెళ్లిపోయినా, ఆమె కొద్దిసేపు అలాగే ఇంటి గేట్ దగ్గరే నిలబడిపోయింది. లోపలికి వెళ్లాలా వద్దా అన్నట్టు కాస్త సంకోచంగా ఉంది. ఇంట్లోకి వెళ్తే అమ్మ ఏమంటుందో అన్న ఆలోచనతో అడుగులు భారంగా పడుతున్నాయి.


ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద తన పర్ఫార్మెన్స్ గురించి ఎర్ర పెన్నుతో రాసిన ఆ ఒక్క వాక్యం మళ్లీ మళ్లీ ఆమె మనసులో మెదులుతోంది: “ప్రతిభ ఉంది... కానీ సబ్జెక్ట్‌ల మీద ఏకాగ్రత లేదు.” ఈ మాటలు తనకు రుచించడం లేదు. తన పట్ల టీచర్ల స్పందన ఎలా ఉందో అనుకుంటూ, ఆ ఆలోచనలతో ఇంట్లోకి అడుగుపెట్టింది.

……………….………………

ఇంట్లోకి వెళ్లగానే వెంటనే అమ్మ అడిగింది: “ఎలా వచ్చాయి మార్కులు?” జాగృతి సమాధానం చెప్పకుండా బ్యాగ్‌ను సోఫాపై విసిరి నేరుగా తన గదిలోకి వెళ్లిపోయింది. అమ్మకు ఆమె చిరాకు అర్థమైంది. కొద్దిసేపటి తర్వాత ఆమె గదిలోకి వెళ్లి చూసేసరికి జాగృతి కిటికీ దగ్గర కూర్చొని బయట చూస్తోంది. కళ్లల్లో నీళ్లు, ముఖంలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది.


“ఏమైంది, జాగృతి?” అని అమ్మ మెల్లగా అడిగింది.


జాగృతి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. “అమ్మా! నేను నిజంగా ఎంత చదువుతున్నా గుర్తుండటం లేదు. అయినా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. కానీ ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తోంది. క్లాస్‌లో బాగా వింటాను. కానీ ఇంటికి వచ్చేసరికి సగం మర్చిపోతాను. చదవడానికి కూర్చుంటాను... కానీ రెండు నిమిషాల్లోనే మనసు ఇంకెక్కడికో వెళ్లిపోతుంది. టీచర్లు ‘ప్రతిభ ఉంది’ అంటున్నారు. కానీ మార్కులు ఎందుకు రావట్లేదు?” అంటూ వాపోయింది.


అమ్మ సమాధానం చెప్పబోతుండగానే బయట సైకిల్ బెల్ వినిపించింది. కిటికీ బయట చూసి అమ్మ నవ్వి వెంటనే “సుధాకర్ సార్ వచ్చారు.” అంది.


సుధాకర్ సార్ వాళ్ల స్కూల్‌లో రిటైర్డ్ తెలుగు టీచర్. పక్కింట్లోనే ఉంటారు. ప్రశాంతంగా మాట్లాడే మనిషి. పిల్లల మనసు అర్థం చేసుకోవడం, వారికి తగిన సలహాలు ఇవ్వడం ఆయనకు అలవాటు.


గదిలోకి వచ్చి జాగృతిని చూసి నవ్వుతూ “ఏమమ్మా? హీరోయిన్‌లా బయటకు చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు?” అని అడిగారు.


జాగృతి బలవంతంగా చిన్నగా నవ్వింది. సుధాకర్ సార్ ఆమె రిపోర్ట్ కార్డ్ తీసుకుని చూశారు. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. జాగృతి ఆవేదన తనకు అర్థమైంది.

తర్వాత కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా అడిగారు. “నువ్వు చిన్నప్పుడు పెయింటింగ్ చాలా బాగా వేసేదానివి కదా?”


జాగృతి ఆశ్చర్యంగా చూసింది. “అవును” అన్నట్టుగా తల ఊపింది.


“ఒక పెయింటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యేదా నీకు?” అన్నాడు.“కాదు సార్. కొంచెం కొంచెంగా పెయింట్ చేసేదాన్ని.”“ఎందుకు?” అన్నాడు.


“ఒకేసారి పెయింట్ వేస్తే అది సరిగా నిలవదు... కొద్దికొద్దిగా వేస్తేనే బాగా కనిపిస్తుంది,” అంది.


సుధాకర్ చిరునవ్వు నవ్వాడు. వెంటనే “మరి చదువుకు సంబంధించిన సబ్జెక్టులు మాత్రం ఒక్కరోజులోనే పూర్తిగా అర్థమవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు?” అన్నాడు.


ఆ మాటలు జాగృతి మనసును బలంగా తాకాయి. ఆమె మౌనంగా సార్ వైపు చూస్తూ ఉండిపోయింది.


“మీ తరం వాళ్లు స్మార్ట్ ఫోన్ కల్చర్‌లో పడి... పెద్ద తప్పు చేస్తున్నారు,” అన్నాడు.


“అందరూ వేగం మీదే దృష్టి పెడుతున్నారు. త్వరగా నేర్చుకోవాలి, వెంటనే పూర్తి చేయాలి అని పరుగెడుతున్నారు. కానీ నేర్చుకోవడం త్వరపడితే ఈ బాటిల్‌లోని నీళ్లు మొత్తం ఒక్కసారిగా తాగగలవా?” అని అడిగాడు.


జాగృతి నవ్వుతూ, “అది అసాధ్యం సార్,” అంది.


“ఎందుకు?” అని మళ్లీ అడిగాడు.


“నెమ్మదిగా కొద్దికొద్దిగా తాగాలి కదా,” అంది జాగృతి.


సుధాకర్ సార్ చిరునవ్వు నవ్వాడు.

“మన మెదడు పని తీరు కూడా అంతే…” అన్నారు సుధాకర్ సార్. "


సమాచారాన్ని ఒక్కసారిగా గ్రహించదు. చిన్న చిన్న మోతాదుల్లోనే, అవసరాన్ని బట్టి స్వీకరిస్తుంది. నువ్వు చిన్న చిన్న భాగాల్లో త్వరగా అర్థం చేసుకునే అలవాటు చేసుకున్నావు. అది తప్పు కాదు,మంచి పద్ధతి కూడా” అన్నాడు. 


“ఒక్కరోజులో అన్నీ విషయాలు నేర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు… చదువు విషయంలో కూడా అలాగే. ఏకాగ్రతతో చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటూ క్రమంగా అలవాటు చేసుకుంటే చదివిన విషయాలు అన్నీ గుర్తుంటాయి. ఒక్కసారిగా   ఏ విషయాన్నీ ఆకళింపు చేసుకోలేము,”

అంటూ సుధాకర్ తన బోటనీ పుస్తకం తెరిచి “ఈరోజు          ఏం చదివావు?” అన్నాడు.


వెంటనే “ఫోటోసింథసిస్,” అంది జాగృతి.


“సరే. మొత్తం చాప్టర్ వివరించాల్సిన అవసరం లేదు. ఆ ప్రక్రియ ఏమిటో ఒక్క వాక్యంలో చెప్పు,” అన్నాడు.


జాగృతి కొద్దిసేపు ఆలోచించి “ మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకోవడం”… అంది మెల్లగా.


“మంచిది, ఇక చాలు,” అన్నాడు మెల్లగా.


జాగృతి ఆశ్చర్యంగా చూసింది. “ఇంతేనా?”


“అవును. నీ మెదడులో ఇప్పుడు ఒక చిన్న ఆలోచన చేరింది. రేపు ఇంకొక చిన్న విషయం జోడించు. అలా ఒక్కొక్కటిగా కలిపితే మొత్తం విషయం స్పష్టంగా అర్థమవుతుంది.”


“దీనినే మైక్రోలెర్నింగ్ అంటారు (Microlearning),” అన్నాడు సుధాకర్. “అంటే పెద్ద విషయాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న భాగాలుగా విభజించి, తక్కువ సమయంలో నేర్చుకోవడం.”

………………………………

అదే రోజు రాత్రి ఫిజిక్స్ పాఠం చదువుదామని టేబుల్ దగ్గరకు చేరింది. అంతలో కరెంట్ పోయింది. వైఫై(wi-Fi) కూడా లేదు.

జాగృతికి చికాకు వచ్చింది. ఫోన్ బ్యాటరీ కూడా ఎర్ర గుర్తు చూపిస్తోంది. ఏం చేయాలో అర్థం కాలేదు తనకు.

అకస్మాత్తుగా సుధాకర్ సార్ మాటలు గుర్తొచ్చాయి— “ఒక్క చిన్న విషయంతో మొదలు పెట్టు.”


ఆమె కొవ్వొత్తి దగ్గర కూర్చుంది. ఫిజిక్స్ పుస్తకం తీసుకుంది. చాప్టర్ మొత్తం కాదు. ఒక్క డయాగ్రమ్ మాత్రమే చూసింది. పది నిమిషాలు దానిపైనే దృష్టి పెట్టింది.

తర్వాత పుస్తకం మూసి పేపర్ మీద బొమ్మ గీయడానికి ప్రయత్నించింది. మొదట సరిగ్గా గీయలేకపోయింది. మళ్లీ చూసింది. మళ్లీ గీసింది. మూడోసారి బొమ్మ సరిగ్గా వచ్చింది.


ఆ చిన్న విజయం ఆమె ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన చిరునవ్వు తెచ్చింది.  


ఆ రాత్రి ఆమెకు ఒక కొత్త అనుభూతి కలిగింది…    చదువు ఇక భారంగా అనిపించలేదు… అది అర్థం చేసుకుంటూ పరిష్కరించే ఒక పజిల్‌లా అనిపించింది.

ఇప్పుడు ధైర్యంగా స్కూల్‌కి వెళ్తోంది. క్లాస్‌లో అన్ని సబ్జెక్టుల్లో తనదే పై చేయిగా ఉంది. చదవాలన్న ఆసక్తి మరింత పెరిగింది జాగృతికి.

………………………………

రోజులు గడుస్తున్నకొద్దీ జాగృతి చదువు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. తన డైలీ రొటీన్‌లో చిన్న చిన్న మార్పులు చేసింది. ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూడటం మానేసి — ఒక చిన్న పాఠం రివిజన్ చేయడం. బస్ కోసం ఎదురుచూస్తూ ఫార్ములాలు గుర్తు చేసుకోవడం.             


లంచ్ బ్రేక్‌లో చదివిన అంశాలను త్వరగా రీకాల్ చేసుకోవడం.

ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో ఉన్న చెడు వ్యాఖ్య “ప్రతిభ ఉంది… కానీ దృష్టి నిలవడం లేదు” అనే మాటను కూడా జాగృతి తన మార్పుతో క్రమంగా అధిగమించి, సరిచేసుకుని, చివరికి ఉపాధ్యాయుల ప్రశంసలు పొందింది.

………………………………

రిజల్ట్స్ రోజు రానే వచ్చింది. ఈసారి జాగృతికి చాలా మంచి మార్కులు వచ్చాయి. ఇంటికి వచ్చాక ఆమె ముందుగా రిపోర్ట్ కార్డ్ చూడలేదు. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది.


ఎందుకంటే ఈసారి ఆమె గెలిచింది మార్కులను కాదు—

తన దృష్టిని, తన ఏకాగ్రతను. తన మీద నమ్మకాన్ని.తన మనసును అర్థం చేసుకునే శక్తిని.


ఆ క్షణంలో ఆమెకు స్పష్టంగా అర్థమైంది—పెద్ద విజయాలు ఒక్కరోజులో రావు.             అవి ఒక చిన్న ఫోకస్ క్షణంతో మొదలవుతాయి.ఒక చిన్న ప్రయత్నంతో పెరుగుతాయి.ఒక చిన్న నిర్ణయంతో దిశ మారుతుంది.


చివరికి జాగృతికి అర్థమైంది—చదువులో నిజమైన మార్పు ఒక్క పెద్ద ప్రయత్నంతో రాదు. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ఏకాగ్రత ప్రయత్నాలే,క్రమంగా పెద్ద ఫలితాలకు దారి తీస్తాయి.


చివరికి జాగృతికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది—జీవితాన్ని మార్చేది కేవలం తెలివితేటలు మాత్రమే కాదు. తమ దృష్టిని నియంత్రించగలిగిన వారే తమ జీవితాన్ని సరైన దిశలో నిర్మించగలరు.


ఆమెకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా బోధపడింది;విద్యార్థుల విజయం కేవలం మార్కులపైనే కాక, సరైన నైపుణ్యాలపై కూడా ఆధారపడుతుందని.


దీనికి జాగృతే ఒక మంచి ఉదాహరణ. ఏకాగ్రతతో ఒకే పనిపై దృష్టిని నిలిపి ఉంచే ఫోకస్ స్కిల్, చదివిన విషయాలను తిరిగి గుర్తు చేసుకునే రీకాల్ స్కిల్, సమయాన్ని సరిగా ఉపయోగించే టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్, పెద్ద విషయాలను చిన్న భాగాలుగా అర్థం చేసుకునే బ్రేక్‌డౌన్ థింకింగ్ స్కిల్, అలాగే ప్రతిరోజూ క్రమంగా కొనసాగించే కన్సిస్టెన్సీ స్కిల్; ఇవన్నీ ఆమె చదువులో పెద్ద మార్పు తీసుకొచ్చాయి.


ఈ నైపుణ్యాలు పెరిగే కొద్దీ ఆమెలో స్పష్టత పెరిగింది, భయం తగ్గింది, ఆత్మవిశ్వాసం బలపడింది. జాగృతికి చదువు ఇక ఒత్తిడిగా అనిపించలేదు… అర్థం చేసుకుంటూ నేర్చుకునే ఒక సులభమైన ప్రక్రియగా మారింది.

………………………………

కొంతకాలానికి జాగృతికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది—ఏకాగ్రత అనేది ఒక్కరోజులో వచ్చే నైపుణ్యం కాదు. అది ప్రతిరోజూ కొద్దికొద్దిగా పెరిగే అలవాటు. చిన్న సమయంతో మొదలైన ఫోకస్, క్రమంగా పెద్ద మార్పులకు కారణమవుతుంది.

మన ఏకాగ్రతను ఎలా నియంత్రించుకోవాలో మనమే నేర్చుకుంటే, చదువుకోవడం కూడా సులభం అవుతుంది. చిన్న చిన్న మంచి అలవాట్లే క్రమంగా మన ఆలోచనలను, నైపుణ్యాలను, చివరికి మన భవిష్యత్తునే మార్చగలవని ఆమె అర్థం చేసుకుంది.

ఆ రోజు నుంచి జాగృతి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. ప్రతి చిన్న ఏకాగ్రత క్షణాన్ని విలువగా చూసింది.


జాగృతికి చదువు ఇక భారం కాలేదు… ప్రయాణంగా మారింది. 

చదువు విషయంలో జాగృతి అనుభవం ఇతర విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచింది.

———————————

డా. కృష్ణకుమార్ వేపకొమ్మ


***

డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్కారం,

నేను డా. వేపకొమ్మ కృష్ణకుమార్, జువాలజీ లో డాక్టరేట్ పొందిన విశ్రాంతి ప్రొఫెసర్; మాజీ ప్రిన్సిపల్. విద్యారంగంలో 30 సంవత్సరాల పైగా అనుభవం కలిగి, పుస్తక రచయిత, పరిశోధక, విద్యా నిపుణుడిగా సేవలందించాను. ప్రస్తుతం పలు ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా సామాజిక, విద్యా, సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాను.

మీ సంస్థలో నా అనుభవాన్ని ఉపయోగించి గుణాత్మక, ఆసక్తికర వ్యాసాలు అందించగలనని తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది.

డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ

ప్రొఫెసర్ & ప్రిన్సిపాల్ (రిటైర్డ్)

వార్తాపత్రిక కాలమిస్ట్

రాజీవ్ నగర్, హైదరాబాద్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page