జగన్నాథ రథయాత్ర
- Sudha Vishwam Akondi
- Jun 29
- 5 min read

Jagannatha Rathayathra - New Telugu Article Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 29/06/2025
జగన్నాథ రథయాత్ర - తెలుగు వ్యాసం
రచన: సుధావిశ్వం ఆకొండి
పురుషోత్తమ క్షేత్రమైన పూరీ జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ విదియ నుంచి దశమి వరకు జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. జగన్నాథుడు, సోదరుడు అయిన బలభద్రుడు, సోదరి అయిన సుభద్ర సమేతంగా రథాలపై ఊరేగింపుగా గుండిచా ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను చూడటం ఒక అదృష్టంగా భావిస్తారు భక్తులు. సాక్షాత్తు భగవంతుడే ఆలయం నుంచి భక్తుల కోసం బయటకు వచ్చే విశిష్ట యాత్ర ఇది.
శ్రీపురుషోత్తమ జగన్నాథ స్వామి దేవతలందరికీ చక్రవర్తి. ఈ క్షేత్రం సకల క్షేత్రాలు లేదా ధామాలన్నిటికీ చక్రవర్తి లాంటిది అంటారు. అన్ని పుణ్య క్షేత్రాలు, పుణ్యతీర్థాలలో కెల్లా సర్వశ్రేష్ఠమైన పూరీ క్షేత్రం ప్రత్యక్షంగా భూమిపైన వెలసిన వైకుంఠం’ అని కపిలసంహిత శ్లాఘించింది. ఈ లోకంలో పురుషోత్తముడు కొలువున్న పూరీని మించిన పుణ్యభూమి మరొకటి లేదని బ్రహ్మాండ పురాణం కొనియాడింది. పూరీలో నివసించేవారికి మరణానికి ముందే మోక్షం లభిస్తుందని చెబుతారు. అంటే ఆయన దర్శనం చేత మనసు ఆయనతో మమేకం అవుతుంది.
దేశంలో సనాతన ధర్మం యొక్క పరిరక్షణ కోసం చారిత్రకమైన నాలుగు మఠాలను ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారు. వీటిలో ఒకటి పూరీలోని గోవర్ధన మఠం. ఇది తూర్పు దిక్కుకు అధిపతి. దీనిని సుమారు ఐదో శతాబ్దం చివర లేదా ఆరో శతాబ్దంలో స్థాపించినట్లు విశ్వసిస్తారు. ఇది తూర్పు భారతదేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా వ్యవహరిస్తోంది.
పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విశ్వ ప్రసిద్ది చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర కోసం ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఏటా ఆషాడ శుద్ధ విదియ నుంచి దశమి వరకు పన్నెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది.
సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనిక భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు అంతేకాదు, పరంపరగా ఆ వంశంలోని రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్రదేవిలతో కలిసి పెంచిన తల్లిగా భావించే గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని, అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను చూడటం ఒక అదృష్టంగా భావిస్తారు.
దేశంలోని చార్ ధామ్ క్షేత్రాలుగా బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరం అని చెబుతారు. వాటిలో పూరీని ఒకటిగా భావిస్తారు. ఇక్కడ జరిగే అన్ని ఉత్సవాలలో జగన్నాథ రథయాత్ర చాలా ముఖ్యమైనది. జగన్నాథుని రథయాత్ర ఆషాడ శుద్ధ విదియ రోజున మొదలవుతుంది. ఇది పన్నెండు రోజుల పాటు జరుగుతుంది. దేవస్థానం రెండు నెలల ముందుగానే ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు.
రెండువందల అడుగులకు పైగా ఎత్తుండే పూరీ ఆలయ గోపురంపై జెండాను ప్రతిరోజూ మార్చుతారు. ఈ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం ప్రత్యేకత. అలాగే, సూర్యుడి గమనంతో సంబంధం లేకుండా ఆలయంపై నీడ కూడా పడదు.
సాధారణంగా సముద్రం నుంచి వీచే గాలి తీరం వైపుకు వీస్తుంది. కాని ఈ ఆలయంలో మాత్రం దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. అలాగే, బంగాళాఖాతం పక్కనే ఉన్నా ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత సముద్రపు అలల శబ్దం వినిపించదు. అంతేకాదు, ఆశ్చర్యకరంగా, జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం మీదుగా ఒక్క పక్షి కూడా ఎగరదు. ఇలా ఎన్నో వైశిష్ట్యాలు కలిగిన క్షేత్రం పూరి క్షేత్రం.
పూరీ జగన్నాథ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలతో సహా ఏడాదికి ఒకసారి గుడి నుంచి బయటికి వచ్చి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల ఈ యాత్రను చాలా గొప్పగా భావిస్తారు.
సాధారణంగా ప్రతి గుడిలో ఊరేగింపు సేవ కోసం ఒకే రథాన్ని ఉపయోగిస్తారు. కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు.
పూరీ రాజు వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి రథం చేయడానికి అవసరమైన చెట్లను (దారువు) వెయ్యిడెబ్భైరెండు ముక్కలుగా నరికి పూరీకి తీసుకువస్తారు. ఆ 1072 ముక్కలను రథం చేయడానికి అనువుగా 2188 ముక్కలుగా చేస్తారు. వాటిలో 832 ముక్కలను జగన్నాథుని రథం తయారీకి, 763 ముక్కలను బలరాముడి రథం చేయడానికి, 593 ముక్కలను సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారు.
తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో నూటా ఇరవై అయిదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలు తయారవుతాయి. యాత్రకు సిద్ధంగా ఉంచుతారు.
జగన్నాథుడి రథాన్ని "నందిఘోష" అని, బలభద్రుడి రథాన్ని "తాళధ్వజం" అని, సుభద్రాదేవి రథాన్ని "దర్పదళన్" అని పిలుస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తర ముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు.
రథయాత్ర మొదటి రోజున పూజారులు మేళతాళాలతో గర్భగుడిలోకి వెళతారు. ఉదయకాల పూజాదికాలు చేస్తారు. మంచి సమయం రాగానే "మనిమా (జగన్నాథా)" అని పెద్దగా అరుస్తూ విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు.
ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తు ఉండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ఉంచుతారు. ఆ తరువాత స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా, ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. అవి అందుకోవడానికి భక్తులు పోటీ పడతారు. తరువాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి దర్పదళన్ అనే రథం మీద ఉంచుతారు. చివరగా భక్తులంతా ఎదురు చూస్తుండగా దాదాపు ఐదడుగుల ఏడు అంగుళాల ఎత్తు ఉండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకు వచ్చి నందిఘోష రథం మీద ఉంచుతారు. ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను "పహాండీ" అంటారు.
ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుని నీలమాధవుడి రూపంలో పూజించిన విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు కోసం మూల విరాట్టులను గర్భగుడి నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ఉంచే అధికారం వీరికి మాత్రమే ఉంటుంది. ఇప్పటికీ ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.
విగ్రహాలను తీసుకువెళ్ళే సమయంలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు.
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథంపై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను "చెరా పహారా" అంటారు. ఘోష యాత్రపూరీ సంస్థానాధీశులు ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామిపై గంధం నీళ్లు చల్లుతారు. తరువాత కిందికి దిగి రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే బలరాముడిని, సుభద్రాదేవిని కూడా పూజించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇక జగన్నాధుడు రథ యాత్రకు సిద్ధమవుతాడు. జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి "జై జగన్నాథా" అని బిగ్గరగా అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు.
లక్షలాది మంది భక్తుల మధ్య జగన్నాథుని రథం చాలా నెమ్మదిగా కదులుతుంది. దీనినే ఘోష యాత్ర అంటారు. ఈ క్రమంలో రథ చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. అడ్డు వచ్చిన వాటిని కూలగొట్టైనా సరే రథం ముందుకే వెళుతుంది కానీ ఆగదు.
జగన్నాథుడి ఆలయం నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే దేవుళ్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీనిని "బహుదాయాత్ర" అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది. యాత్ర పేరుతో పది రోజులుగా స్వామి లేని ఆలయం ఆనాటి నుంచి తిరిగి కొత్త శోభతో నిండిపోతుంది.
రథయాత్రకు ముందు జ్యేష్ఠ పౌర్ణమి రోజు నుంచి 15 రోజుల పాటు జగన్నాథుడికి గోప్య సేవలు కొనసాగుతాయి. అస్వస్థతకు గురయ్యే జగన్నాథుడికి మూలికా చికిత్స నిర్వహించి. ఆయుర్వేద ఔషధాలు, పాలు, పండ్లు, తేనె మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు.. ఆషాఢ మాసం శుక్లపక్ష పాఢ్యమి నాడు స్వామి నవయవ్వన నేత్రోత్సవం.. ఆ తరువాత రోజు పూరీలో రథయాత్ర జరుగుతుంది.. రెండు వారాల పాటు అనారోగ్యంతో బాధపడుతున్న స్వామివారు కోలుకోవడం గురువారం (జూన్ 26న) నేత్రోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా 56 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు.
స్వామి అస్వస్థతకు గురికావడంతో పక్షం రోజులుగా మహాప్రసాదం (ఒబడా) నైవేద్యం సమర్పించరు. పళ్లు, పంచామృతం, పేలాల చోకడా, మజ్జిగ మాత్రమే సమర్పింస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు 108 కలశాలతో జలాభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామికి జ్వరం వచ్చింది. అప్పటినుండి మందిరంలో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు స్వామి కోలుకున్నారు.
"ఆనవాయితీ ప్రకారం మరోసారి స్వామి తన దివ్య తేజోమయ రూపంతో భక్తులను వీక్షిస్తాడు. తన పెద్దకళ్లతో లోకాన్ని చూస్తాడు. అందుకే దీన్ని నేత్రోత్సవంగా పేర్కొంటారు రథయాత్ర నేపథ్యంలో ఈ వేడుకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఇవీ రథయాత్ర విశేషాలు..
జై జగన్నాథ!
����������
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
Comments