top of page

జానకి విముక్తి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Janaki Vimukthi' New Telugu Story By Penumaka Vasantha

రచన: పెనుమాక వసంత


“ఒరే పెద్దోడా! హలో..” అని ఇటునుండి నాగయ్య మాట్లాడుతున్నాడు.

“ ఆ నాన్నా! ఏంటి ఈ టైం లో కాల్ చేసావు?” అన్నాడు నాగయ్య పెద్దకొడుకు వాసు.

“మీ అమ్మ వచ్చిందా నీ దగ్గరికి?”

“రాలేదు నాన్నా! ఏం.. ఇంట్లో లేదా?” ఆదుర్దాగా అడిగాడు వాసు.

“లేదురా! సాయంత్రం నుండి కనపడటం లేదు. గుడికి వెళ్ళి వస్తుందని చూసా. ఇంకా రాలేదు. సర్లే రాలేదుగా అక్కడికి. ఉంటాను”

“అమ్మ ను ఏవన్నా విసుక్కొన్నావా నాన్నా?” అన్న వాసు మాటకి “అబ్బే! నేను ఏమి అనలేదు . అక్కడికి వస్తే నాకు ఫోన్ చేయి” అని పెట్టేసాడు.

“యేంటండి అత్తగారు ఇంట్లో లేరటనా” అంటూ భార్య సుమతి అడిగిన మాటకు అవునంటూ తల వూపాడు వాసు.

“ఆమెకు చిన్న కొడుకు ఇష్టంగా. అక్కడికి వెళ్లి ఉంటుంది” అన్న భార్య మాటకు తల ఊపి లోపల ‘అమ్మకు అందరూ సమానమే’ అని చెప్పే ధైర్యం లేక ఊరుకున్నాడు.

నాగయ్య, చిన్న కొడుకు గిరికి కాల్ చేసాడు. గిరి కూడా “రాలేదు నాన్న!” అన్నాడు.

“ఎక్కడికి పోయింది? వాళ్ల చెల్లెలు ఇంటికి పోయింది ఏమో.. నేను వాళ్ల వాళ్ల తో మాట్లాడను కాబట్టి చిన్నాడా! మీ పిన్నికి కాల్ చేసి కనుక్కో” అన్నాడు నాగయ్య.

“సరే నాన్నా! పిన్నికి చేసి, నీకు చేస్తా” అని గిరి పిన్నికి చేశాడు.


పిన్ని మాలతి “రాలేదు గిరీ. మీ నాన్న ఏమి చంపుకు తింటే అది ఎటు వెళ్లిందో. మేము ఇంటికి వస్తే ఊరుకోడు కాని, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఊరిలో చెరువు ,అవి వెతుకు” అంది.

“అదేంటి పిన్ని! నీకు ఏవన్నా చెప్పిందాఅమ్మ?”

“ ఏమి చెప్పలేదు కాని మా అక్క ఎక్కడ సుఖపడింది రా మీ నాన్నను చేసుకొని? ఇప్పటికీ ఇగోనే ఆయనకు. కూర్చుంటే తప్పు.. నిల్చుంటే తప్పు. మొన్న ఎపుడో ఫోన్లో ‘ఇంకా ఈయనకు చాదస్తం ఎక్కువైంది. ఇంట్లో ఉండలేక పోతున్నాను. ఫోన్లు మాట్లాడనివ్వడు. టీవీ సీరియల్స్ చూడనివ్వడు. మరి రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుని ప్రతి దానికి గొడవ పడటం.. ఎంత సర్డుకొందామన్న అసలు చాతకావటం లేదు’ అని చెప్పి బాధపడింది.

ఇంటి విషయాలు ఆ పక్క వాళ్లకు కూడా చెప్పదు. ఎక్కడికి బయటికి పోదు. దానిలోనే కుమిలి పోతుంది. ఒక్క నాకే చెప్తుంది ఏమన్నా ఉంటే. నాకు కాల్ చేసి కూడా మూడు రోజులైంది. అందుకని వెళ్లి చూడు. ఊరులో ఎక్కడ వుందో కనుక్కొని చెప్పు” అంటూ మాలతి తొందర పెట్టింది .


“ఒరే మర్చిపోకు, నాకు కాల్ చేయటం..” అన్నది మాలతి.

“సరే పిన్ని! ఇపుడే వెళ్తున్నా” అని లాస్ట్ బస్ కి ఊరి కి వెళ్ళాడు గిరి.

గిరి వెళ్లేప్పటికి నాగయ్య ఊరి లో అన్ని చోట్లా వెతికాడు. ఎక్కడా లేదు జానకమ్మ. ఎవరో ‘జానకమ్మ గారు బస్టాప్ కాడ కనిపించారు కానీ ఏ బస్ ఎక్కింది తెలవదు’ అన్నారు.

“నాన్నా! అమ్మ దగ్గిర ఏమన్నా డబ్బు ఉందా?” అన్న గిరి తో “నేను ఏమి ఇవ్వలేదు. ఒకవేళ మిషన్ కుడుతుందిగా.. ఆ డబ్బులు నేను అడగను” అని ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పాడు నాగయ్య.


గిరి అపుడు ఊహించాడు అమ్మ ఆ డబ్బులతో ఎక్కడికో వెళ్ళి ఉంటుంది అని.

నాన్నతో, “అమ్మని ఏమన్నా అన్నావా?” అన్నాడు.


“అబ్బే! నేను ఏమి అనలేదు. మీ అమ్మకు గీర్వాణము ఎక్కువ. ఏమీ అన కూడదు. ఏవన్నా అంటే ఏడుస్తుంది. పోతే పోనీ.. దానికే అంత ఉంటే మగాణ్ణి నాకు ఎంత వుండాలి. నేను ఎతకను. మీరు ఎతికి చావకుండా ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి” అన్నాడు నాగయ్య.

“నాన్నా! ఇన్నాళ్లు ఇంటి కోసం పాటు పడిన అమ్మను ఏమీ అనకు అట్లా” అన్నాడు గిరి విసుగ్గా.

“నువ్వు మొదటి నుండి మీ అమ్మ ను వెనకేసుకు రావటమేగా. నేను మగాడిని. ఒక మాట కాదు.. వంద అంటా. అయితే కొంప వదిలేసి వెళ్తారా”

‘అమ్మో! ఇంకా ఎక్కువ మాట్లాడితే పొలం ఇవ్వను అన్నా అంటాడు నాన్న. నీ సంగతి మొదటి నుండి నాకు తెల్సులే. మహా జగ మొండివి. రేపు అమ్మ ఫోటో వాట్సప్,ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేసి, ఎక్కడ ఉందో వెతకాలి. పాపం అమ్మ!’ అనుకొంటూ పడుకొన్నాడు.

మరుసటి రోజు పిన్నికి, మామకి చెప్పాడు. వాళ్ళు కూడా వెతుకుతామన్నారు. అందరూ నాగయ్యను తిట్టారు. పిల్లలు వెతికారు కానీ, తల్లి ఆచూకీ కనుక్కోలేక పోయారు. జానకి ఎక్కడ ఉందో కనుక్కొంది మాలతి.

కాశీ వెళ్లి అక్కడ సత్రంలో వుండి మాలతి కి ఫోన్ చేసి ఎవరికీ చెప్పవద్దు అందిట.

‘అక్కా! ఎపుడు వస్తావు?’ అంటే, ‘విలువ లేని చోట కన్నా, దేవుడి దగ్గర వుండటం హాయిగా ఉంది’ అందిట.

గిరి చాలా బాధ పడి, ‘అమ్మ ఎంతో బాధ పడితే తప్ప అలా అనదు’ అనుకొని, అన్న వాసు తో కలిసి కాశీ వెళ్లి జానకి ని కలిశాడు. వాసు, గిరి లను చూసి హ్యాపీ గా ఫీల్ అయింది జానకి. కోడళ్ళు, మనవళ్ల గూర్చి అడిగింది.

“అమ్మా! పద వెళదాం” అన్న వాసు తో “ఎక్కడికిరా?” అంది.

“అదేమిటమ్మా? మన ఇంటికి”.

“ ఏ ఇల్లు ? నా ఇల్లు మాత్రం కాదు. మీకు ఇల్లు ఏమో కానీ నాకు జైలు. నా జీవిత ఖైదు అయిపోయింది రా. మళ్ళీ జైలు కు రమ్మంటారే!” అంది జానకి.

“నాన్న ఒక్కరే ఉన్నారు. రామ్మా పోదాం” అని విసుగ్గా అన్న వాసు తో “మీ నాన్నని అడిగారా అమ్మ ఎందుకు పోయిందని? మీరు ఆయన్ని అడగరు. ఎందుకంటే మీరు మగాళ్లే కాబట్టి. ఒకవేళ అడిగినా ‘నాకు ఎదురు సమాధానం చెప్తుంది. ఆయన ఏమి తప్పు చేసిన ఇది ఏంటండీ అనకూడదు. అంటే ఇక గోలే. ఆమె నాకు అవసరం లేదు. నాకు వంట వచ్చు. ఒకవేళ వచ్చినా మీ అమ్మను మీ దగ్గర అట్టిపెట్టుకొండి’ అని ఉంటారు . ఆయనకు ఎపుడు నా అనే భావన తప్ప మనం అనే భావన ఉండదు.

మీరు ఒక్కసారన్న ‘ఏంటి నాన్న.. అమ్మను ఈ ఏడిపించడం’ అని అడిగారా? అడిగితే ఆయన ఆస్తి ఇవ్వడుగా. అందుకు మీరు పండగలకు వచ్చినా ఆయన అలిగితే ఆయన్ను బుజ్జగించి పోయేవారు. నన్ను సర్దుకుపోవాలి అనేవారు. మీరు వెళ్ళిన తర్వాత ‘మగపిల్లలు నా వైపు. నీది కుక్క బతుకే’ అని నన్ను ఎగతాళి చేసే వాడు ఆయన. ఈ వైపులు, యేంటో నాకు తెలీదు. ఆయన పోలికలు వచ్చి మీరు పెళ్ళాల్ని ఎక్కడ చిన్నచూపు చూస్తే వాళ్ళు నే పడిన బాధ పడకూడదని నేను వాళ్ళను ఏమి అననిచ్చేదాన్ని కాదు.

ఇప్పటిదాక కుటుంబం కోసం కష్టపడ్డాను. మీకు రెక్కలు వచ్చాయి. మీకు నా అవసరం లేదు. నేను మీతో వచ్చినా ఇద్దరి ఇళ్ళల్లో పని, పాట చేస్తే ముద్ద పెడతారు. అది ఎట్లా అంటే మొగుడితో పడక ఇక్కడ ఉంది అనే లోకువతో .

ఇపుడు ఇది నాకు అవసరమా? నాకు మీరు డబ్బులు అవి కూడా పంపనవసరం లేదు. కాలం నాడే నేను ఒక్క పుట్టిన రోజు కీ చీర కాని నగ కాని కొనుక్కొలేదు. మీరు ఉద్యోగస్తులు అయినా ‘అమ్మా ఇదిగో’ అని ఒక చీర కొని ఇవ్వలేదు.

నా ఒక్క దాని ప్రేమతో ఇన్నాళ్లు ఆయన బయటకు నెట్టిన కాపురం పరువు పోగూడదనే నెట్టుకు వచ్చాను. ప్రతి పూట తగాదా. ‘వు’ అంటే తప్పు ‘ఆ’ అంటే తప్పు. జ్వరం వస్తే చూపించడు. ఆయనకు మటుకు జ్వరం వస్తే హాస్పిటల్స్ చుట్టూ తిప్పి చూపించి పచ్చాలు వండాలి. ఇక్కడ మన ఊరి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆ శివయ్యను చూసుకొని రావటం, ఈ సత్రం లో వంట పనిలో సాయ పడటం. ఈ సత్రం వాళ్ళు ఒక రూం ఇచ్చి, పనిచేసినందుకు ఒక ముద్ద పెడతారు.

జీవితపు చివరి దశ లో ఉన్నా! ప్రశాంతంగా బతుకుదామనుకొంటున్నా. ఒకవేళ నేను పోయినా కాశీలో పోవటం ఎంతో పుణ్యం. మీరు వచ్చి నన్ను తగలేసే ఖర్చు కూడా మీకివ్వను.

గిరి “అమ్మా! అలా అనకమ్మా! నా దగ్గర వుందువు గాని. లేదా నాకు దగ్గరలో ఉందుగాని. ప్లీజ్ అమ్మా!” అని బతిమాలాడు .

“లేదురా! నన్ను చివరి దశ లోనైనా ప్రశాంతంగా ఉండనీయండి” అని గట్టిగా చెప్పింది జానకి.

చేసేది లేక వాసు, గిరి తిరిగి వచ్చారు.


***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మొదటి సారి మన తెలుగు కథలకు కథ రాస్తున్నాను. ధన్యవాదములు


101 views0 comments
bottom of page