'Janapadam' New Telugu Story
Written By Gannavarapu Narasimha Murthy
'జానపదం' తెలుగు కథ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఎన్నికల సమయం! ఆరోజు అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగరాజు ఎన్నికల ప్రచారం నిమిత్తం వస్తుండటంతో పెద్ద బహిరంగ సభని ఆ ఊరి సర్పంచ్ నాయుడు ఏర్పాటు చేసాడు. ఎమ్మెల్యే నాలుగుగంటలకే రావలసి ఉన్నా చాలా మీటింగ్‌లుండటం వల్ల ఆలస్యం అయింది. ఆ సభకు చుట్టుపక్కల ఊళ్ళ నుండి జనాల్ని తరలించడంతో సభలో గందరగోళం మొదలైంది. ఆలస్యం అవుతున్న కొద్ది ఈలలు, గోల, అరుపులతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. వీళ్ళని ఎలా కంట్రోల్ చెయ్యాలో నాయుడుకి అర్థంకావట్లేదు. ఆ సమయంలో అతనికి సత్యం గుర్తుకొచ్చాడు. అంతే! ఐదు నిముషాల్లో సభ సద్దుమణిగింది. సత్యం వస్తూనే కంజెరా పట్టుకొని మైకు దగ్గరకు వెళ్ళీ “ఏటిరేవుకొచ్చావా నారాయణమ్మ నీకు పెళ్ళోరు వొచ్చేరే నారాయణమ్మ” అన్న జానపద గీతాన్ని అందుకున్నాడు. అంతే! సభ హోరెత్తి పోయింది. ఆ పాటతో జనాలు కూడా గొంతు కలపడంతో ఆ ప్రాంతమంతా చప్పట్లతో మారు మ్రోగింది. అలా సత్యం పాట తరువాత పాట. జనాలు అతని పాటల హోరులో మునిగిపోవడంతో ఎమ్మెల్యే గురించి మరిచిపోయారు. అదీ సత్యం మహిమ. అతని పాటంటే ఆ చుట్టుపక్కలే కాదు, చాలా జిల్లాల్లోని ప్రజలు చెవికోసుకుంటారు. వినాయక నవరాత్రుల దగ్గర నుంచి దసరా సంబరాల వరకు ఏ పండగ వచ్చినా స్టేజిమీద సత్యం పాట పాడవలసిందే. అలా అని సత్యం పెద్దసంగీత కళాకారుడేమీ కాదు. పాడుతా తీయగా లాంటి పాటల పోటీల్లో పాల్గొన్న కళాకారుడు కూడా కాదు. స్టేజీల మీద "శివశంకరీ, శివానందలహరీ", "శ్రీ తుంబుర నారద నాదామృతం" లాంటి సంగీత సాహిత్యాలు కలబోసిన అతి కష్టమైన పాటల్ని అలవోకగా పాడిన గాయకుడు అంతకన్నా కాదు. అతను ఓ జానపద గాయకుడు. ఓ పల్లె పాటగాడు. చిన్నప్పట్నుంచీ ఊళ్ళో పశువుల్ని మేపుకుంటూ చెట్లమీద, గట్ల మీద పల్లె పదాలను అలవోకగా పాడుకునే ఓ పల్లె గాయకుడు. మొదట్లో సత్యం చుట్టుపక్కల గ్రామాల్లో వాడుకలో ఉన్న పల్లె పాటల్నే పాడినా రానురాను అవి పాతవై పోవడంతో అతనే కొత్త కొత్త పల్లె పదాలతో పాటలు వ్రాసి బాణీలు కట్టి సభల్లో పాడటంతో అనతి కాలంలో అవి జనాల నోళ్ళలో నానుతూ చాలామందికి రింగ్ టోన్‌లుగా మారిపోయేయి. అలా వాడి పాటలు ఊళ్ల పొలిమేరలు దాటి, జిల్లాలకు పాకి, చివరకు రాష్ట్రం అంతా మారుమ్రోగుతూ ఓ సినిమా సంగీత దర్శకుడి చెవినపడీ అతనికి ఓ రోజు కబురొచ్చింది. ఆరోజు సత్యం పొలానికి వెళ్తున్న సమయంలో అతని ఇంటి ముందు కారాగి ఇద్దరు వ్యక్తులు దిగారు. "మీరేనా సత్యం" అని అడిగాడు ఒకతను. "అవును" "మీరు సినిమాల్లో పాడతారా?" అని అడిగాడు రెండో వ్యక్తి. ఆ మాటలు సత్యానికి ఆశ్చర్యం కలిగించి "మీరెవరు సార్?" అని అడిగాడు. "ఇంట్లోకి పదండి. మాట్లాడుకుందాం" అని వాళ్ళు చెప్పగానే సత్యం వాళ్ళిద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్లాడు. కాఫీలు తాగిన తరువాత వాళ్ళలో ఒకతను చెప్పడం మొదలు పెట్టాడు. "సత్యంగారూ! నా పేరు రవి. ఇతను రాజు. మేమిద్దరం ప్రముఖ సంగీత దర్శకులు శ్రీధర్ గారి దగ్గర సహాయకులుగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం మా గురువుగారు ఓ పల్లెటూరి నేపథ్యంతో తీస్తున్న సినిమాకి సంగీతం చేస్తునారు. అందులో హీరో పశువుల్ని మేపుకునే ఓ పల్లెటూరి యువకుడు. అందుకనీ ఓ మంచి పల్లె పదాన్ని పాటగా పెట్టాలనుకుంటున్నారు. మీరు పల్లె పదాల్ని బాగా పాడతారనీ మా గురువుగారికి తెలిసి మిమ్మల్ని కనుక్కోమనీ మమ్మల్ని పంపారు. మీకిష్టమైతే చెప్పండి" అన్నాడు రవి. "నేను సినిమా పాట పాడటం ఏమిటి చెప్పండి? సంగీతం నా కస్సలు తెలీదు. ఏదో తెలిసీ తెలియని పల్లెపాటల్ని నాకు తోచిన రీతిలో పాడుకుంటూ ఉంటాను" అన్నాడు సత్యం. "సత్యం గారూ! మాకు మీలాంటి కొత్తవారే కావాలి. హీరో మీలాంటి పల్లె యువకుడు. కాబట్టి మీరు పాడితే సరిగ్గా సరిపోతుంది. మీరు ఇంకేమి ఆలోచించకుండా ఊ అనండి. మళ్ళీ వారం మేమొచ్చి మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళతాం" అంటూ పర్సులోంచి కొంత డబ్బు తీసి అడ్వాన్స్‌గా ఇవ్వబోతుంటే సత్యం "వద్దులెండి.. నేనే వస్తాను.. మీరు రావద్దు" అంటూ చెప్పడంతో వాళ్ళు సత్యానికి తమ అడ్రసు ఇచ్చి వెళ్ళిపోయారు. పదిహేను రోజుల తరువాత సత్యానికి హైదరాబాద్ రమ్మనమని ఫోన్ వచ్చింది. రెండు రోజులు వెళ్ళాలా వద్దా అని తీవ్రంగా ఆలోచించి చివరకు వెళ్ళడానికే నిర్ణయించుకొని హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాడు సత్యం. రైల్వే స్టేషన్‌కి రాజు వచ్చి అతన్ని శ్రీధర్ దగ్గరికి తీసికెళ్ళాడు. ఆ సమయంలో అతను ఓ స్టూడియోలో రికార్డింగ్‌లో ఉన్నాడు. రెండు గంటల తరువాత అతన్ని లోపలికి తీసికెళ్ళారు. శ్రీధర్ తెల్లగా, నల్లటి గెడ్డంతో పొడవుగా ఉన్నాడు. "సత్యంగారూ! అన్నీ మా వాళ్ళు మీకు చెప్పారనుకుంటాను. ఈరోజు పాటని ప్రాక్టీస్ చెయ్యండి. రేపు రికార్డింగ్ చేద్దాం. ఇది ఒక పల్లె పదాలతో అల్లిన జానపద గీతం. బాగా పాడాలి" అన్నాడతను. పక్క గదిలో ఆ పాట వ్రాసిన రచయిత రాంబాబు అతనికి ఒక కాగితాన్నిచ్చి ఎలా పాడాలో పాడి వినిపించాడు. కానీ పదినిముషాల సాధన తరువాత, ఆ పదాలు ట్యూన్‌కి అనువుగా లేవన్న విషయాన్ని గమనించి రచయితతో ఆ విషయాన్ని చెప్పాడు సత్యం. కానీ అతను ఒప్పుకోక, తను చెప్పినట్లు పాడవలసిందే అని చెప్పడంతో సత్యం రెండుసార్లు పాడి వెళ్ళిపోయాడు. ఆమర్నాడే రికార్డింగ్. సత్యం శ్రీధర్‌ని కలిసి ట్యూన్‌కి, పాట పదాలకి పొంతన లేకపోవడం వల్ల పాడటానికి ఇబ్బంది అవుతోందని ఆ పాటను పాడి వినిపించాడు. శ్రీధర్‌కి అతను చెప్పిన విషయం సహేతుకంగా అనిపించి "సర్లెండి! పాటని మార్పించి రాయిద్దాం" అన్నాడు. ఆ మాటలకు సత్యం "అయ్యా! మీరు ఒప్పుకుంటే నేను ఇదే పాటను మార్చి వేరే ట్యూన్‌లో పాడతాను" అంటూ తను వ్రాసిన పాటని అతనికి చూపించి మళ్ళీ వేరే ట్యూన్‌లో పాడి వినిపించాడు. శ్రీధర్ ఆ పాటని అసాంతం విని “ఈ ట్యూన్ బాగుంది. నేనిచ్చిన దానికన్నా ఇదే బాగుంది. ఈ పాటని మీకు నచ్చినట్లుగా పాడండి” అని చెప్పటంతో ఆ మర్నాడు తాను రాసిన పాటని పాడి ఇంటికి వచ్చేసాడు సత్యం. ఆ తరువాత అతను ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. కొన్ని దినపత్రికలు అతని గురించి కొన్ని వార్తలు వ్రాసాయి. ******** ******** ******** నాలుగు నెలల తరువాత అతనికి శ్రీధర్ నుంచి ఆడియో ఫంక్షన్‌కి రావలసిందిగా ఆహ్వానం వచ్చింది. ఆ సినిమా హీరో చాలా ప్రముఖుడు కాబట్టి దాని నిర్మాత ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసాడు. దానికి తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించిన పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, నటులు, వర్ధమాన గాయనీ గాయకులు అందరూ హాజరయ్యారు. ఆ సభావేదిక మీద ఆ కార్యక్రమ ప్రయోక్త లత గట్టిగా మాట్లాడుతూ "ఈ సినిమాలో ఈ పాటని పాడిన గాయకుడు ఎవరో తెలుసా?" అనీ అడగగానే ప్రేక్షకుల్లోంచి ’సత్యం’, ‘సత్యం’ అని అరుపులు వినిపించడం మొదలైంది. “అవును. మీరు చెప్పింది నిజం. అతన్ని స్టేజి మీదకు రావసలిందిగా కోరుతున్నాను” అని పిలవగానే సత్యం ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య వేదిక మీదకు చేరుకున్నాడు. ఆ తరువాత అతనికి ఆమె మైకిచ్చి ఆ పాట పాడమని చెప్పగానే అతను ఆ పాట అందుకున్నాడు. ఆ పాటలో ఒక విధమైన ఊపు, రిథమ్, పదాల్లో లాలిత్యం ఉండటంతో ప్రేక్షకులు కూడా పాడుతూ డాన్సులు చెయ్యడంతో, సభంతా హోరెత్తిపోయింది. ఆ తరువాత ఆ సినిమా హీరో వచ్చి పాటల సీడీలు విడుదల చెయ్యడంతో ఆ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మరో రెండు నెలలకి సినిమా విడుదలైంది. కానీ ఆశ్చర్యంగా ఆ సినిమాలో సత్యం పాటలేదు. అతనికి బదులు ఆ పాటని ఓ ఉత్తరాది గాయకుడి చేత పాడించినట్లు ఆ సినిమా సంగీత దర్శకుడు శ్రీధర్ పత్రికా ముఖంగా చెప్పడంతో సత్యానికి చాలా బాధ కలిగింది. ఆ సినిమా విడుదలైన మర్నాడు ఓ ప్రముఖ వార్తా పత్రికలో "జానపద గాయకుడికి జరిగిన అన్యాయం. సంగీత దర్శకుడు శ్రీధర్ తప్పిదం!" అన్న ఓ వార్త వచ్చింది. ఆ హెడ్డింగ్ కింద “నిన్న రిలీజైన ప్రముఖ హీరో విజయ్ సినిమా `పల్లెసీమ`లో జానపద గాయకుడు సత్యం పాట పాడిన విషయం పాఠకులందరికీ తెలిసిందే. ఆ చిత్ర ఆడియో ఫంక్షన్లో కూడా ఆ సినిమా సంగీత దర్శకుడు శ్రీధర్ పాటను బాగా పాడినందుకు సత్యాన్ని సత్కరించిన విషయం పాఠకులందరికీ తెలుసు. కానీ ఆశ్చర్యంగా అతను పాడిన పాటని సినిమాలో పెట్టకుండా ఎవరో తెలుగురాని ఉత్తరాది గాయకుడిచేత పాడించి ఆ పాటను సినిమాలో పెట్టడం తెలుగు జానపద గాయకుడికి చేసిన అన్యాయంగా అందరూ చెప్పుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆ సినిమాని తెలుగు వారెవ్వరూ చూడకూడదన్న పోస్టులు వైరలౌతున్నాయి. తెలుగు జానపద కళాకారుల సంఘం రేపట్నుంచీ ఆ చిత్రం ప్రదర్శిస్తున్న సినిమా హాళ్ళ ముందు ధర్నాలు చెయ్యాలనీ నిర్ణయించడంతో ఆ సినిమా నిర్మాతలు ఏం చెయ్యాలో తోచక తలలు పట్టుకుంటున్నారు" అని వ్రాయబడింది. నాలుగు రోజుల తరువాత అ సినిమా కలెక్షన్లు అనూహ్యంగా తగ్గిపోవడాన్ని దాని నిర్మాతలు గమనించారు. సంగీత దర్శకుడు చేసిన ఓ తప్పిదం ఇంత నష్టాన్ని, చెడ్డపేరునీ తెచ్చి పెడుతుందని వాళ్ళూహించలేదు. ఆ తరువాత వాళ్ళు నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు . శ్రీధర్, చిత్ర నిర్మాతలు, హీరో విజయ్ సత్యానికి క్షమాపణలు చెప్పి ఆ పాటని త్వరలోనే సినిమాలో పెడతామని ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ మర్నాడు రాజధానిలో ఓ సభ లో ఈ విషయాన్ని సత్యం ద్వారా చెప్పించాలని నిర్ణయించారు నిర్మాతలు. అనుకున్నట్లుగానే మర్నాడు ఆ సభ ప్రారంభమైంది! మొదట సంగీత దర్శకుడు శ్రీధర్ సభని ప్రారంభిస్తూ ``నాకు జనపద కళలన్నా, కళాకారులన్నా, పల్లె పదాలన్నా, తెలుగు భాషన్నా ఎంతో ఇష్టం. అందుచేతనే ఈ సినిమాలో ఈ పాటని సత్యం చేత పాడించేను. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెదవుల అమరిక సమస్య తలెత్తి సత్యం పాడిన పాటని సినిమాలో పెట్టటం కుదరలేదు. ఆ విధంగా నా వల్ల జరిగిన తప్పిదం వల్ల మా నిర్మాతలు చాలా నష్టపోయారు. అందుకు నేను సత్యానికి, మరీ ముఖ్యంగా జానపద కళాకారులకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఈ సభ ద్వారా బహిరంగ క్షమాపణ కోరుతూ ప్రేక్షకులు పెద్దమనసుతో మమ్మల్ని క్షమించి ఆ సినిమాని ఆదరించమనీ వేడుకుంటున్నాను. చివరగా ఇంకో రెండు రోజుల్లో ఆ పాటని సినిమాలో చేర్చటం జరుగుతుందనీ, ఇక నుంచీ నా ప్రతి సినిమాలో సత్యం చేత కనీసం ఒకపాటైనా పాడిస్తాననీ సభా ముఖంగా హామీ ఇస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.. ఇప్పుడు గాయకుడు సత్యం మాట్లాడతారు" అంటూ మైక్ సత్యానికిచ్చి అతను వేదిక దిగిపోయాడు. ఆ తరువాత సత్యం ప్రసంగం మొదలైంది. "ప్రజలకు నమస్కారం! పల్లెల్లో, పచ్చటి పొలాల్లో, తోటల్లో, ఏటిగట్ల మీద హాయిగా పల్లెపదాలు పాడుకుంటూ ఇన్నాళ్ళూ జీవితం గడిపిన నన్ను శ్రీధర్ గారు పెద్ద మనసుతో ఈ సినిమాలో ఓ పాట పాడించారు. సినిమా అన్నది ఓ రంగుల ప్రపంచం. అందులో కళాకారులకు స్వేచ్ఛ ఉండదు. మరమనుషుల్లా పాడాలి. నా పాట సినిమాలో రాలేదనీ సినిమాని చూడటం మానొద్దు. దానివల్ల నిర్మాతలు నష్టపోతారు. తద్వారా ఎంతో మంది కళాకారులు ఉపాధి కోల్పోతారు. చివరగా నాలాంటి పల్లె కళాకారుల్ని, తెలుగు గాయకుల్ని ప్రోత్సహించమని తెలుగు సినిమా హీరోలను, నిర్మాతలను, సంగీత దర్శకులనూ వేడుకుంటున్నాను. ఇంకో ముఖ్యం విషయం సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నేనికనుంచీ సినిమాలకు పాటలు పాడకూడదని నిర్ణయించుకున్నాను. నేను జానపద కళాకారుడిగానే కొనసాగుతాను" అంటూ జనాలకి నమస్కారం పెడుతూ వేదిక దిగిపోయాడు సత్యం. |
(సమాప్తం)
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments