జంట దెయ్యాలు
- Mohana Krishna Tata

- Aug 21, 2025
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #JantaDayyalu, #జంటదెయ్యాలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Janta Dayyalu - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 21/08/2025
జంట దెయ్యాలు - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"అక్కా.. ! ఎలా ఉన్నావు?"
"బాగానే ఉన్నాను.. నువ్వు, మీ ఆవిడ ఎలా ఉన్నారు?"
"బాగున్నాము.. ఎప్పుడు వస్తున్నావు మరి మా కొత్త ఇంటికి?"
"మీ బావగారు ఉన్నప్పుడు అంతా ఒకరకం. ఇప్పుడు నేను ఇక్కడ పొలం పనులు అవీ చూసుకుని రావాలి కదా.. అసలే తీరిక ఉండట్లేదు. "
"నువ్వేమో మా దగ్గరకు వచ్చి ఉండిపోమంటే.. ఊరు, ఆ ఇల్లు వదిలి రానని అంటావు.. ఎప్పుడు వచ్చేది చెప్పు?"
"తీరిక చూసుకుని బండి కట్టించుకుని, నేనే వస్తానులే.. "
"నీ కోసం ఈ తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటాడు మరి"
"సరే"
***
సరోజ భర్త పోయిన తర్వాత, అదే ఇంట్లో చాలా సంవత్సరాలుగా ఉంటోంది. ఆ ఊరు వదిలి ఎక్కడికి పోనని తమ్ముడికి చెప్పేసింది. సరోజ హుషారైన మనిషైనా, దెయ్యాలంటే చెడ్డ భయం. పొలం గట్టుమీద చాలా సార్లు దెయ్యం చూశానని ఎప్పుడూ భర్తతో అప్పట్లో చెప్పేది. పెళ్ళాం మాటలు పట్టించుకోకుండా తన పని చేసుకుపోయేవాడు. తన భర్తని పొలం గట్టుమీద దెయ్యం చంపేసిందని సరోజ గట్టి నమ్మకం. కానీ ఆమె మాటలు ఎవరూ వినలేదు. చనిపోయేముందు, ఆ పొలాలు అమ్మవద్దని, ఊరు వదిలి వెళ్ళవద్దని సరోజ దగ్గర మాట తీసుకున్నాడు. ఆ మాట కోసం, పొలం పనులకోసం ఒక మనిషి సాయంతో అక్కడే ఉండిపోయింది సరోజ.
సరోజ తమ్ముడికి కొత్తగా పెళ్లైంది. ఈ మధ్యే కొత్త ఇల్లు కూడా కొన్నాడు. చాలా రోజులకి సరోజకి కాస్త తీరిక దొరికింది. వెంటనే తమ్ముడు గుర్తొచ్చాడు. బండి మాట్లాడుకుని ఊరికి బయల్దేరింది. పొద్దుపోయే లోపు తమ్ముడు ఊరు చేరుకోవాలని అనుకుంది. బండి వాడికి ఆ ఇల్లు తాలూక ఆనవాలు చెప్పి తీసుకెళ్లమని అడిగింది. ఊరంతా తిరిగిన తర్వాత, చివరికి ఉన్న ఒక్క ఇంటి దగ్గర దింపేసి పోయాడు ఆ బండి వాడు.
"ఒరేయ్ కాముడు.. !" అని గట్టిగా కేక వేసింది సరోజ.
"అక్కా.. ! ఒక ఉత్తరం రాసి ఉంటే, నేనే వచ్చేవాడిని కదే.. నా పేరు కామేశ్వరరావు, కాముడు అనకే"
"నాకు అదే బాగుంటుంది.. నాకు ఆ మాత్రం తెలియదా చెప్పు. అయినా ఈ చుట్టుపక్కల ఒకే ఇల్లు ఉందేమిటి? కొనడానికి ఎక్కడా ఇల్లే దొరకలేదా.. ? నేను గట్టిగా అరిచినా ఇక్కడ ఎవరు వింటారు చెప్పు.. ?"
"ఇక్కడైతే చవకగా వచ్చింది.. అందుకనీ కొనేసాను. ఇంటికి పద అక్కా. ! తర్వాత మాట్లాడుకుందాము"
"ఇలాంటి మారుమూల చోట దెయ్యాలు గట్రా ఉంటాయేమో కదరా.. ?"
"ఏమిటక్కా! ఈ రోజుల్లో కూడా దేయ్యలంటావు? అలాంటివేవి ఉండవు.. "
"నువ్వు ఎన్నైనా చెప్పు.. ! దెయ్యాలు ఉన్నాయి.. మీ బావగారిని అవే పొట్టన పెట్టుకున్నాయి.. "
"ఆ రోజే నీకు చెప్పాను.. నువ్వు చూసింది దెయ్యం కాదని.. సరే పదా ఇంటికి పోదాం"
ఇంటికి చేరిన సరోజ.. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంది. సాయంత్రం చల్లగాలి కోసం మేడ మీదకు వెళ్లారు ఇద్దరు ఆడవారు..
"వదినా.. ! చూడండి చుట్టూ ఎంత ఖాళీగా ఉందో.. బాగా గాలి కూడా వీస్తోంది.. "
"ఈ వీధికి మీ ఒక్క ఇల్లు లాగే ఉంది మరి.. "
"అవును వదినా.. ! అందుకే ఈ వీధికి మా ఆయన పేరే.. కామేశ్వర్ నగర్"
"సంతోషించాను గానీ.. చుట్టు పక్కలు నలుగురు ఉంటె, ధైర్యంగా ఉంటుంది"
"అక్కడ చూడండి వదినా! ఆ దూరానా ఒక పెంకుటిల్లు ఉంది కదూ.. నేను ఇంతవరకు గమనించనేలేదు.. "
"నాకు ఎటూ వూసుపోదు.. ఒకసారి ఆ ఇంటికి వెళ్లి.. వారిని పరిచయం చేసుకుంటా.. " అంది సరోజ
మర్నాడు ఉదయం, సరోజ ఆ ఇంటికి వెళ్ళింది. అదొక పాడుబడ్డ ఇల్లు. తలుపు దగ్గర ఉండగానే.. లోపలనుంచి..
"ఒసేయ్.. పెళ్ళాం దెయ్యం! ఈ రోజు ఏం చేసావు చెప్పు.. "
"మీకిష్టమని.. గుండెకాయి వండాను.. భలే రుచిగా ఉంటుంది.. " అంటూ గంభీరంగా అంది ఆ ఆడగొంతు.
"అవును.. ఈ కొండప్రాంతంలో అన్నీ భలే రుచిగా ఉంటాయి.. " ఇంకా భయంకరమైన గొంతులో అన్నాడు ఒక మగగొంతు.
"అవును మొగుడు దెయ్యం.. ! ఈరోజు మన పెద్దనాన్న దెయ్యం భోజనానికి పిలిచారు కదా.. ఆ కొండవెనుక రాత్రికి భలే విందు.. కాళ్ళు, చేతులు, మెడ అన్నీ కొరుక్కుని తినొచ్చు.. మాంస విందు భలే ఉంటాది.. "
ఇదంతా కిటికీలోంచి చూసి, ఆ మాటలు విన్న సరోజ.. భయంతో వణికిపోయింది. వెనుకకు చూడకుండా.. ఇంటికి పరిగెత్తింది.
రోజూ సరోజకు అదే గుర్తు వచ్చేది. నిద్ర పట్టేది కాదు. ఎప్పుడూ దెయ్యాలను ఇలా దగ్గరగా చూడడం, మాటలు వినడం ఇదే మొదటిసారి. రోజూ రాత్రి కొండపైన దూరంనుంచి వచ్చే శబ్దాలు విని భయపడేది. ఇంట్లోవారికి చెప్పినా ఎవరూ నమ్మరు. తమ్ముడు అసలే నమ్మడు.
తన ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయింది సరోజ. తమ్ముడుకి దెయ్యాల గురించి చెబితే, తిట్టి ఊరికి పంపించడని.. చెప్పకుండా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యింది. ఒక కిలోమీటరు నడిస్తే, బండి దొరుకుతుందని అనుకుంది. తెల్లవారగానే, ఎవరికీ చెప్పకుండా నడచుకుంటూ పోయింది.
***
మర్నాడు నిద్రలేచాక, అక్క కనిపించకపోవడంతో, కంగారుపడి అంతా వెదికాడు తమ్ముడు. చివరికి ఒక లెటర్ కనిపించింది..
"ఒరేయ్ కాముడు.. ! ఎలాంటిచోట ఇల్లు కొన్నావు రా.. ! ఇక్కడ నేను ఉండలేను. నేను చెప్పినా నువ్వు నమ్మవు. ఇక్కడ జంట దెయ్యాలు ఉన్నాయి. అవి మాంసానికి బాగా అలవాటుపడ్డాయి. ఎప్పుడైనా మీ ఇంటిమీదకు రావొచ్చు. నా మాట విని, ఇల్లు అమ్మేసి, మన ఊరు వచ్చేసేయ్.. నేను వెళ్తున్నాను".
ఈ లోపు తలుపు ఎవరో తట్టిన శబ్దం. తలుపు తియ్యగా.. ఒక భారీ మనిషి, ఇంకో ఆడ మనిషితో కలిసి విచిత్రమైన ఆకారంలో.. తన అక్కను మోసుకుని లోపలికి వచ్చాడు.
"మా అక్క చెప్పిన జంట దెయ్యాలు మీరేనా.. ? మా అక్కను ఏం చేసారు" అని గట్టిగా కేకలు వేసాడు.
"మీరు మమల్ని అపార్ధం చేసుకుంటున్నారు.. మేము దెయ్యాలు కాదు. ఆ పెంకుటింట్లో ఉంటాము. కొండపైన పనులు చేసుకుంటూ బతుకుతాము. మా ఆకారాలు చూసి భయపడతారని మేము బయటకు రాము అంతే.. ! ఇంక దెయ్యం అనేది మా ఇంటిపేరు.. మేము అలాగే పిలుచుకుంటాం. ఆ కొండపైన దొరికేదే మాకు ఆహారం. మా పెద్దనాన్న దెయ్యం కొండపైనే ఉంటారు"
"మరి మా అక్కకు ఏమైంది?"
"ఈవిడ.. ఆ పొలం గట్టుపైన పడిపోవడం చూసి, ఇక్కడే ఉంటుందని అనుకుని తీసుకుని వచ్చాము. స్పృహ తప్పారు అంతే.. ఏమీ కాలేదు. మీరూ మా ఇంటికి రావాలి.. మా వీధి పేరు దెయ్యం వీధి.. అక్కడా మాది ఒక్కటే ఇల్లు"
ఆ మాటలు విన్న కామేశ్వరరావు, వారికి థాంక్స్ చెప్పి, భోజనం పెట్టి పంపించాడు. జరిగింది తెలుసుకున్న సరోజ, ఇక దెయ్యాలు గురించి నమ్మడం మానేసింది.
*************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ




Comments