top of page

జీవిత చదరంగం


'Jeevitha Chadarangam' New Telugu Story


Written By Yasoda Pulugurtha


(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

శ్రీధర్ కి ప్రగతి నగర్, నిజాంపేట్ రోడ్ లో మూడువందల గజాల స్థలం.. ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం కొని పెట్టినది అలాగే ఉంచేసాడు. శ్రీధర్ పెద్ద అన్నయ్య వేణుగోపాల్ అప్పట్లో తను కొనుక్కుంటూ శ్రీధర్ చేత కూడా కొనిపించాడు. అప్పట్లో శ్రీధర్ 'గురుగాం సిటీ' లో 'ఆదిదాస్ కంపెనీ హెడ్ ఆఫీస్' లో అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఇరవై సంవత్సరాలు అక్కడే పనిచేసి రెండు సంవత్సరాల క్రితం హైద్రాబాద్ వచ్చేసాడు. హైద్రాబాద్ లో 'బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్' లో ఇన్ వెస్ట్ మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు.


శ్రీధర్ ఒక్కగానొక్క కొడుకు ఆదిత్య ఐ. ఐ. టి ఖర్గ్ పూర్ లో చదువు పూర్తి అయిన వెంటనే హైద్రాబాద్ 'ఎమ్ జాన్' కంపెనీ లో పోస్టింగ్ రావడం తో కుటుంబం అంతా 'గురుగాం' నుండి హైద్రాబాద్ వచ్చేసారు.


తను ఎప్పుడో కొన్న స్థలం ఇప్పుడు బాగా డెవలప్ అయి చుట్టుపక్కల అనేక భవంతులు, అపార్ట్ మెంట్ లు వెలిసాయి. అక్కడ ఇల్లు కట్టుకుంటే కొడుక్కి ఆఫీస్ కూడా దగ్గర అవుతుందన్న ఉద్దేశంతో సొంత ఇంటి నిర్మాణం కోసం ప్లేన్ చేస్తున్నాడు. పైగా శ్రీధర్ పెద్ద అన్నయ్య వేణు అక్కడ ఇల్లు కట్టేసుకున్నాడు. తమ్ముడిని కూడా కట్టుకోమని ప్రోత్సహిస్తున్నాడు.


తను కొన్న స్థలంలో సదుపాయంగా ఉండేటట్లు డూప్లెక్స్ ఇల్లు కట్టాలన్న ఉద్దేశ్యంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేట్ ఆఫీస్ కు ప్లేన్ అప్రూవల్ మొదలైన ఫార్మాల్టీస్ నిమిత్తమై వారం రోజులనుండి నుండి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆఫీస్ అంతా వచ్చీ పోయే జనంతో కిట కిటలాడిపోతోంది.


తన పని ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. ఆ రోజు తను వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో తన ముందు నుండి ఒక నలభై అయిదు సంవత్సరాల యువతి నడుచుకుంటూ లోపలకు వెళ్లడం చూసాడు.


ఆమెను ఎప్పుడో ఎక్కడో చూసినట్లు చటుక్కున మనసుకి అనిపించినా పెద్దగా ఆలోచించకుండా మామూలుగానే తీసుకున్నాడు. అనేకమంది వస్తున్నారు వెడుతున్నారు. ఆ జన ప్రవాహంలో ఎవరు ఏమిటోనని ఆలోచించే ధ్యాసే ఉండడం లేదు. మరో గంట తరువాత మళ్లీ ఆ యువతే బయటకు వస్తూ ఏదో ఫైల్ తీసుకుని రిజిస్ట్రార్ కేబిన్ వైపు వెడుతూ, మధ్యలో ఆగి ఎవరితోనో మాట్లాడుతున్నపుడు ఆమెను పరీక్షగా చూసే అవకాశం కలిగింది.


ఒక్క క్షణం సాలోచనగా చెంపలు నిమురుకుంటూ ఆమె వైపే చూస్తూ ఆలోచిస్తున్నాడు. పింక్ కలర్ ప్యూర్ సిల్క్ చీర కి సన్నని జరీ అంచు, కాంట్రాస్ట్ బ్లౌజ్, జారుముడి, చెవులకు చిన్న చిన్న స్టడ్స్, మెడలో సన్నని ముత్యాల దండతో ఎంతో హుందాగా అందంగా ఉంది. ముఖాన బొట్టులేదు. ఎవరబ్బా ఈవిడ, ఎక్కడో, ఎప్పుడో చూసిన జ్నాపకాలు కందిరీగల్లా ముసురుకుంటుంటే ఆలోచనలలో పడ్డాడు గానీ గుర్తుకు రావడంలేదు.


ఈలోగా అటెండర్ తన దగ్గరకు వస్తూ మిమ్మలని సూపర్ వైజర్ సర్ రమ్మంటున్నారని అనేసరికి తన ఆలోచనలను పక్కకు పెట్టి సూపర్ వైజర్ ని కలిసాడు. తన ప్లాట్ లే ఔట్ అంతా క్లియర్ గా ఉందని, సర్వేనంబర్లు అవి కూడా ప్రాపర్ గా ఉన్నాయని, రెండుమూడురోజుల్లో ప్లేన్ అప్రూవల్ వస్తుందని, మీరు ఇంటినిర్మాణం చేపట్టచ్చని చెప్పేసరికి చాలా ఆనందం కలిగింది.


ఆ ఆనందంలో ఇంటికి వచ్చేసాడు. భార్య అనుపమ తో ఆనందాన్ని పంచుకుంటూండగా సడన్ గా తనకు అక్కడ తారసపడిన యువతి గురించి చెప్పాడు. 'బాగా పరిచయమున్న వ్యక్తిగా అనిపించింది అనూ, కానీ గుర్తురావడంలేదు. అదే ఆఫీస్ లో పనిచేస్తోందనుకుంటా’నని చెప్పాడు.


మరో నాలుగురోజుల తరువాత అఫీషియల్ గా ప్లేన్ అప్రూవల్ కలక్ట్ చేసుకుందామని ఆఫీసుకి వెళ్లాడు. కిందటిసారి తనను రమ్మనమన్న సూపర్ వైజర్ రాలేదు. అటెండర్ ను అడిగితే మేడమ్ ను కలవమన్నాడు. మేడమ్ పేరేమిటంటే 'సుష్మ' అని సెక్షన్ ఆఫీసర్ అని చెప్పాడు. ఆ పేరు ఏమిటో సుపరిచితమైనదిగా తోచింది. ఆలోచిస్తూనే ఆమె కేబిన్ లోకి వెళ్లి ఆమెను విష్ చేసాడు.


ఆమె శ్రీధర్ ను సరిగా పరికించకుండానే కూర్చోమంది. శ్రీధర్ తన వచ్చిన పనేమిటో చెపితే అటెండర్ ను పిలిచి అప్రూవ్డ్ ప్లేన్ లను తెమ్మనమని చెప్పింది. అతను తెచ్చిన వాటిలో శ్రీధర్ డాక్యుమెంట్లు, ప్లేన్ తీసిస్తూ కంగ్రాట్స్ చెపుతూ తలెత్తి చూసింది.


వెంటనే ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసిన శ్రీధర్ ఆశ్చర్యపోతూ 'మీరు సుష్మ, రాజగోపాల్ వైఫ్ కదూ' అనేసరికి ఆమె ఒక్కక్షణం తెల్లబోతూ 'అవును, మీరెవరంటూ అడిగింది'.


'నేనమ్మా సుష్మా, రాజగోపాల్ ఫ్రెండ్ శ్రీధర్ ని, అన్నయ్యా అంటూ పిలిచేదానివి మరచిపోయావా' అనగానే సుష్మ ఉద్వేగభరితురాలై ' శ్రీధర్ అన్నయ్యా.. గుర్తు పట్టలేకపోయాను, సారీ, ఎంత మారిపోయావో తెలుసా? దగ్గరగా ఇరవై సంవత్సరాలు అయిపోలేదూ నిన్ను చూసీ’ అంటూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.


'అవునమ్మా, నమ్మలేకపోతున్నాను, నిన్ను ఇక్కడ ఇలా చూస్తూ'. నీలో అయితే పెద్దగా ఏమీ మార్పులేదు. నాలుగు రోజుల క్రితం వచ్చినపుడే నిన్నుచూసాను. ఎక్కడ చూసానబ్బా అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాను. మీ వదినతో కూడా అన్నాను. ఇన్ని సంవత్సరాల తరువాత నిన్ను ఇలా కలవడం నిజంగా యాదృచ్చికమే.

'ఎలా ఉన్నావమ్మా? మీ అమ్మాయి పెద్దదయి ఉంటుంది. ఎక్కడ ఉంటున్నారు? రాజు గురించి అప్పుడే తెలిసింది. చాలా బాధపడ్డాను. విధివ్రాతను ఎవరూ తప్పించలేరు కదమ్మా'.


'నేనూ, మా అమ్మాయి 'అంజలి' మియాపూర్ లో ఉంటున్నాం'. రాజు నన్ను పెళ్లి చేసుకున్నందుకు తన వాళ్లకు, నేను రాజుని చేసుకున్నందుకు నా వాళ్లకు దూరమైనాం. అనుకుంటూ ఉంటాను అన్నయ్యా, 'నా జీవితమే ఒక చదరంగం అని, కోరుకున్నది ఒకటైతే జరిగిందొకటని'. నా జీవితం ఇలా వివిధ మలుపులు తిరుగుతుందని ఊహించనే లేదు. చదరంగంలోని పావులన్నీ ఒక్కసారిగా నా మీద దండయాత్రకు వచ్చినట్లుగా ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. కానీ ధైర్యంగా సర్దుకుని, ఒంటరి పోరాటం సాగిస్తూ, ఇక్కడ ఉద్యోగం చేస్తూ అంజలిని ప్రయోజకురాలిని చేయగలిగాను.


'సారీ అన్నయ్యా, మరో పది నిమిషాలలో నాకు మీటింగ్ ఉంది'. వదినను తీసుకుని మా ఇంటికి రావూ, మాట్లాడుకుందాం అంటూ తన అడ్రస్ ఇస్తూ, శ్రీధర్ ఫోన్ నంబరు తీసుకుంది.


'అలాగే వస్తామమ్మా’ అంటూ శ్రీధర్ ఆమెనుండి శెలవు తీసుకున్నాడు.


తిరిగి వస్తూ అనుకున్నాడు. రాజు బ్రతికున్నప్పుడు సుష్మ ఎలా ఉండేది. నిండు ముత్తైదువులా నుదుటిమీద కుంకుమ బొట్టుతో కళ కళ్లాడుతూ ఉండేది. రాజు పోయాడని నుదుటి మీద కుంకుమ బొట్టుని వదిలేసి నుదుటిని బోసిగా వదిలేసింది. 'ప్చ్, రాజుని నిస్వార్ధంగా నమ్ముకుని వచ్చి అన్నీ పొగొట్టుకున్న నిర్భాగ్యురా’లని జాలిపడ్డాడు.


ఇంటికి వచ్చి అనుపమతో చెప్పాడు. అనుపమ చాలా బాధ పడింది విషయం విని.

ఆ రాత్రి పడుకున్నప్పుడు తన స్నేహితుడు రాజగోపాల్ పదే పదే గుర్తొచ్చాడు.


తనూ రాజూ హైద్రాబాద్లో 'శ్రీరామ్ ఫైనాన్స్ కార్పొరేషన్' లో నాలుగు సంవత్సరాలు కలసి పనిచేసారు. చాలా స్వల్ప కాలంలోనే మంచి స్నేహితులు అయిపోయారు. తన పెళ్లికి వైజాగ్ కూడా వచ్చాడు. చాలా తరచుగా తన ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆదిత్యను ఎత్తుకుని ఆడిస్తూ ఉండేవాడు.


'తొందరగా పెళ్లిచేసుకోరా అంటే నవ్వేసేవాడు'.


ఒకరోజు తనే చెప్పాడు. 'తను సుష్మ అనే క్రిష్టియన్ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తమ వివాహం ఇరువైపుల కుటుంబాలకు ఇష్టం లేద’ని చెప్పాడు. సుష్మ మతం మార్చుకుంటానన్నా తన తల్లితండ్రులు ససేమిరా చేసుకోవద్దంటున్నారని చెపుతూ చాలా బాధపడ్డాడు. అటు సుష్మ తల్లితండ్రులు సుష్మని మత మార్పిడి చేసుకుంటే నీవు మాకు చచ్చినట్లే లెక్కని బెదిరిస్తున్నారని చెప్పాడు.


నేను వెళ్లి నచ్చ చెప్పనా అంటే 'వద్దురా శ్రీధర్, వెళ్లి భంగం పడడం తప్పించితే మరే ప్రయోజనం లేద’ని తనను ఆపేసాడు. సుష్మని మతం మార్చుకోనవసరం లేదని రాజు ఎంత చెప్పినా ఆమె వినలేదు.


సుష్మ, రాజగోపాలం ల వివాహం గుడిలో శాస్త్రోక్తంగా హిందూ సాంప్రదాయప్రకారం జరిగిపోయింది. వారి పెళ్లికి తనూ అనుపమా కూడా వెళ్లివచ్చారు. ఇద్దరూ వేరుగా కాపురం పెట్టి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరోజు రాజు తమింటికి పిలిస్తే వెళ్లారు. ఎంతో ముచ్చట వేసింది. సుష్మ క్రిష్టియన్ అని చెపితేగాని ఎవ్వరూ నమ్మరు.


పూజ గదిలో వెంకటేశ్వర స్వామి, ఆజంనేయ స్వామి ఫొటోలు, వాటికి పూలదండలు. దీపారాధన, అగరొత్తుల సువాసనలతో ఇల్లు పవిత్ర దే వాలయంలా గోచరిస్తోంది. సాంప్రదాయ వంటలు చేసి కొసరి కొసరి వడ్డించింది. పట్టుచీర కట్టుకుని, నుదుటన కుంకుమ బొట్టు, మెడలో మంగళ సూత్రాలు, నల్లపూసలు, కాళ్లకు మట్టెలు, తల్లో పూలతో లక్ష్మీదేవిలా మెరిసిపోతోంది.


రాజుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు రాజూ వాళ్లింటి సాంప్రదాయాలనూ, పధ్దతులనూ తూచా తప్పకుండా పాటించాలని అనుక్షణం తపన పడ్తూ ఉండేది. అనుపమకి అదేపనిగా ఫోన్ చేస్తూ ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఆచరించేది. అనుపమతో అంటూ ఉండేదిట, ఇవాళ కాకపోతే, రేపైనా మా అత్తవారు మమ్మలని కలుపుకోవచ్చు. అప్పుడు వాళ్లింటి ఆచారాలను, సాంప్రదాయాలను బాగా వంటపట్టించుకున్నానని నన్ను చూసి మా అత్తింటివారు మురిసిపోవచ్చన్న ఆశాదృక్పధాన్ని వెలిబుచ్చుతూ ఉండేదిట.


ఇటువంటి కోడలిని దూరం చేసుకోవడం రాజు తల్లితండ్రుల దురదృష్టమని తనూ అనుపమా చాలాసార్లు అనుకునేవారు.

వారికి పాప పుట్టిన రెండు సంవత్సరాలకు తను 'గురుగాం సిటీ కి' మంచి ఉద్యోగ అవకాశం రావడంతో వెళ్లిపోయాడు.

అప్పుడప్పుడు రాజుతో కాంటాక్ట్ లో ఉంటున్నా, కొత్త ఉద్యోగం, కొత్త ప్రదేశం, ఉద్యోగ బాధ్యతలలో పడిపోయి నెమ్మదిగా కాంటాక్ట్ తగ్గిపోయింది.


తను అక్కడకు వెళ్లిన మూడు సంవత్సరాల కు అనుకుంటా, వేరే కొలిగ్ ద్వారా తెలిసింది. రాజు బైక్ మీద వస్తూండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర స్కిడ్ అయి బండితో బాటూ దొర్లిపోయి కిందపడిపోయిన మూలాన హెడ్ ఇంజ్యురీతో అక్కడకక్కడే చనిపోయాడని తెలిసి చాలా రోజులు బాధపడ్డాడు. సుష్మతో మాట్లాడాలని ప్రయత్నించినా కుదరనే లేదు.

తరువాత వాళ్ల సంగతులే తెలియలేదు. తను ఎప్పుడో గాని హైద్రాబాద్ వచ్చేవాడు కాదు. వచ్చినా ఒకటి రెండురోజుల్లో వెళ్లిపోవడం జరిగేది.


మళ్లీ ఇన్ని సంవత్సరాల తరువాత తన ప్రాణ మిత్రుని భార్యను చూస్తానని అనుకోలేదు. 'పాపం రాజు అనుకుంటూ ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు'.


మర్నాడు నుండి ఒక రెండు వారాలు తను చాలా బిజీ అయిపోయాడు. మంచి మహూర్తం చూసుకుని ఇంటి శంఖుస్తాపన చేసుకోవడం, తరువాత తన అన్నయ్యద్వారా మంచి సివిల్ కాంట్రాక్టర్ ను మాట్లాడుకుని ఇంటి నిర్మాణాన్ని అప్పగించడం లాంటి పనుల్లో మునిగిపోయాడు.


ఆరోజు రాత్రి భోజనాలు చేస్తున్న సమయంలో సుష్మ నుండి ఫోన్. 'అన్నయ్యా మా ఇంటికి ఎప్పుడు వస్తావు వదిన్ని తీసుకుని’ అంటూ.


'సారీ సుష్మా, కొత్త ఇంటి నిర్మాణంతో కాస్త బిజీ అయ్యాను. ఈ ఆదివారం వస్తామమ్మా’ అనేసరికి లంచ్ కు రావాలంటూ బలనంతం చేసింది.


సుష్మ, శ్రీధర్ నూ అనుపమని ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది. 'మా ఇంటికి వచ్చిన మా అన్నయ్యా వదినా అంటూ చిన్నపిల్లలా గంతులేసింది. టూ బెడ్ రూమ్ సొంత అపార్ట్ మెంట్. ఎంతో పొందికగా నీట్ గా ఉంది. ఒక వైపు పూజా గది. అప్పుడే దీపారాధన, పూజ చేసినట్లు ఉంది.


కూర్చోమని చెప్పి అరిటాకులో దేవుడి ప్రసాదం చక్రపొంగలి పెడ్తూ 'మాఘపాదివారం కదూ అన్నయ్యా, సూర్యనారాయణమూర్తికి నివేదన చేసా’నంటూ చెప్పింది.

ఈలోగా 'అమ్మా’ అని పిలుస్తూ బయటనుండి వచ్చిందొక అమ్మాయి. బంగారు తీగలా మెరిసిపోతోంది. 'మా అమ్మాయి అంజలి అన్నయ్యా, ఇక్కడే కాగ్నిజెంట్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సంవత్సరం నుండి పనిచేస్తోం’దని పరిచయం చేసింది.


'మామయ్యా! నీవూ, అత్త వస్తారని అమ్మ ఎంతలా ఎదురుచూస్తోందా తెలుసా? ఎప్పుడూ మీ గురించే మాట్లాడుతుంది. నాన్నకు మంచి ఫ్రెండ్ అని మీ గురించి చెప్తూనే ఉంటుంది. ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవడమే లే’దంటూ తల్లి మీద ఫిర్యాదు చేసేసరికి అందరూ నవ్వేసారు.


భోజనాలు అవీ అయిపోయాక శ్రీధర్ అడిగాడు. 'ఏం సుష్మా.. మీ అత్తగారు వాళ్లూ వస్తున్నారా’ అంటూ.

సుష్మ గొంతుకు దుఖంతో పూడుకు పోయింది. 'రాజు మరణ వార్త విని వస్తారనుకున్నాను అన్నయ్యా. మా ఇంటికి శనిలా దాపురించి మా వాడిని పొట్టన పెట్టుకుందన్న నిందారోపణలు నా మీద. రాజు పోయిన తరువాత అతని ఇన్సూరెన్స్ డబ్బులు, ఆఫీసు నుండి కొంత సొమ్ము అందుకున్నాను. ఆ డబ్బు గురించి గురించి కూడా మా అత్తవారి నుండి ఎన్నో గొడవలు. నామినీ లో నా పేరు ఉన్న మూలాన నాకే వచ్చాయి ఆ డబ్బులు.


రాజు బ్రతికి ఉండగా మా అత్తవారింటి వైపు వారు మా ఇంటి గడప తొక్కేవారే కాదు. రాజు పోయిన తరువాత, మా బావగారు, ఆడపడుచులూ పనిగట్టుకుని మరీ వచ్చి వచ్చి నన్ను మాటలతో హింసిస్తూ బాధపెడ్తుండేసరికి నేనే వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఇలా మాటి మాటికి మీరు వచ్చి నన్ను హెరాస్ చేస్తున్నారని పోలీసు కంప్లైంట్ ఇస్తానని. అప్పటినుండి రావడంలేదు. ఎమ్ కామ్ పాసైనాను కాబట్టి ఎలాగో కష్టపడి మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ సంపాదించాను. గవర్నమెంట్ జాబ్, టెన్షన్ ఉండదని. మా పుట్టింటి వాళ్ల దృష్టిలో నేను ఎప్పుడో చనిపోయానన్నయ్యా’ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంటున్న సుష్మను చూస్తూ అనుపమ కూడా కన్నీళ్లు పెట్టుకుంది.


'ఎంత కిరాతక మనుషులు! రాజు పోయినందుకు ఆసరాగా ఉండడం పోయి సుష్మను దిక్కులేని దానిలా వదిలేయడం ఎంత అమానుషం అనుకుంటూ బాధపడ్డాడు శ్రీధర్.


'చూడండి మామయ్యా, మన గురించి ఆలోచించని వాళ్లనే తలచుకుంటూ అమ్మ క్షణం క్షణం బాధ పడ్తూనే ఉంటుంది. నిజమే.. ఎవరి ఆసరాలేక అమ్మ ఎంతో కష్టపడింది. భగవంతుడి దయవలన మేము నిలదొక్కుకున్నాం. ఇంకా ఎందుకు జరిగినవే తలచుకుంటూ బాధపడాలి? ఇంక జీవితమే లేదనుకునేటట్లు?’

'నాకు పెళ్లిచేస్తే, నేను పిల్లలని కని అమ్మ కిస్తే అమ్మ వాళ్లతో ఆడుకుంటూ ఎంత ఆనంద పడుతుంది? 'ఇవి అందమైన అనుభూతులు కావా చెప్పండి మామయ్యా?’


'పోయిన నాన్న తిరిగిరాడు. ఆ పెధ్దవాళ్లు మారరు. ఉన్నంత లో హాయిగా ఆనందంగా ఉండదెందుకో అర్ధం కాదు నాకు.

అమ్మకు మీరు గట్టిగా చెప్పండి మామయ్యా'.


'ఏమని ? నీకు వెంటనే పెళ్లి చేసేయమనా?’ అన్న శ్రీధర్ మాటలకు అక్కడ నవ్వుల జల్లులు విరిసాయి.

'ఎన్ని రోజుల తరువాత మా ఇంట్లో ఇంతటి సందడి, ఆనందం అన్నయ్యా’ అంటూ సుష్మ ఒకటే సంబరపడిపోయింది.


'మీరూ మా ఇంటికి రండమ్మా.. అంటూ శ్రీధర్ సుష్మతో చెప్పి వారినుండి శెలవు తీసుకున్నారు.

ఇంటికి వస్తూ దారి పొడవునా అనుపమ అంజలిని తలచుకోవడమే.

'అబ్బ, అంజలి ఎంతందంగా ఉందో కదండీ. ఆ అమ్మాయి వైపు చూస్తూ కళ్లు తిప్పుకోలేకపోయా’నంటూ ఒకటే సంబరపడిపోయింది. ఏ ఆడపిల్లను చూసినా అనుపమకి ముచ్చటే. ఎంత బాగుందో కదా ఆ అమ్మాయంటుంది. కానీ ఏమాటకు ఆ మాటే, అంజలిని అనుపమ మెచ్చుకోవడంలో వాస్తవం ఉంది. ఆకట్టుకునే అందం అంజలిది.


శ్రీధర్ వాళ్ల కొత్త ఇంటి నిర్మాణం పూర్తి అయిపోయింది. ఇంటి గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయం అయింది.

గృహప్రవేశానికి దగ్గర బంధువులతో బాటూ కొంత మంది మిత్రులు, సుష్మ, అంజలి కూడా వచ్చారు. అందరి దృష్టి చలాకీగా తిరుగుతూ అందంతో మెరిసిపోతున్న అంజలివైపే.


తెలియని వాళ్లైతే శ్రీధర్ వాళ్ల బంధువులేమో ననుకుంటున్నారు. 'ఆదిత్యని' తనే పరిచయం చేసుకుంది అంజలి. అతని ప్రొఫెషన్, వర్క్ మాత్రమే కాదు, ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ గురించి, పెరుగుతున్న ఇన్ ఫ్లేషన్ గురించి, ఫెడరల్ బేంక్ రేట్ కట్ గురించి, రాబోయే రిసెషన్ లో కంపెనీలు ఉద్యోగస్తులను తగ్గించడం లాంటి విషయాలెన్నిటినో ఆదిత్యతో డిస్కస్ చేసింది. ఆ అమ్మాయి వాక్ప్రవాహానికి ఆశ్చర్యపోయాడు ఆదిత్య. అసలే మితభాషి, తనంతట తను మాట్లాడడుగానీ ఎవరైనా టాపిక్ రైజ్ చేస్తే మటుకు తను కూడా దగ్గేదే లేదన్నట్లు మాట్లాడతాడు.


' ఆదిత్య బాగా స్తిరపడ్డాడు. కాబట్టి వాడికి పెళ్లి చేస్తే మన బాధ్యత తీరుతుంది కదా అనూ, ఏమంటా’వని ఒకరోజు శ్రీధర్ అనుపమని అడిగాడు.


'నిజమేనండీ, ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులో జరిపిస్తే పిల్లలు త్వరగా జీవితంలో సెటిల్ అవుతారు. ముఫై ఏళ్లు వచ్చాకా పెళ్లి చేయడం, వాళ్లు లేట్ గా పిల్లలని కనడం లాంటివి మంచి పధ్దతి కాదు. ఆదిత్యకు కూడా చెపుదాం. పెళ్లిసంబంధాలు చూస్తామని.


' ఆ అన్నట్లు, నా మనస్సులో ఒక ఆలోచన రూపు దిద్దుకుంటోందండీ ఈ మధ్య, చెప్పమంటే చెపుతా’నంటూ ఊరిస్తున్న అనుపమ వైపు చిరునవ్వుతో చూస్తూ ' చెప్పు అనూ, సందేహిస్తావేం' అంటూ ప్రోత్సహించాడు.


'నాకు అంజలి చాలా నచ్చేసిందండీ. ఆ పిల్లను చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఆదిత్యకు చక్కని జోడి. మన ఇంటి గృహప్రవేశం రోజున వారిద్దరూ పక్క పక్కన కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆ దృశ్యం ఎంత బాగుందో తెలుసా. చిలకాకు పచ్చని కంచి పట్టుచీరలో బంగారు బొమ్మలా మెరిసిపోయింది అంజలి. అందరి చూపు ఆ అమ్మాయి వైపే. మీకు ఇష్టం అయితే సుష్మ తో మాట్లాడండి. అలాగే ఆదిత్యను, అంజలిని ఒకరినొకరు ఈ విషయంలో మాట్లాడుకోమని చెపుదాం. 'అందరికీ ఇష్టమైతేనే సుమా, ఏమంటారంటూ భర్తవైపు చూసింది'.


'ఎంత మంచి ఆలోచన అనూ, అలాగే’నంటూ అంగీకరించాడు.

సుష్మ అయితే ఆనందంతో కన్నీళ్లు పెట్టేసుకుంది. 'నాకింత అదృష్టమా అన్నయ్యా, మా అంజూ మీ ఇంటి కోడలవుతుందంటే ఆనందంతో నేను తట్టుకోలేకపోతున్నా’నంటూ.


ఆదిత్య అయితే 'మీకు నచ్చితే నాకూ నచ్చినట్లే. మీరు ఎంతో ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోరని నాకు తెలుసు. నేనూ అంజలీ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. తను నచ్చిందని చెప్పాడు.


అంజలి అయితే 'మామయ్యా, నేను అదృష్టవంతురాలినని నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే భగవంతుడు అన్నీ దురదృష్టాలే ఇవ్వడని, మాకూ మంచిరోజులు వస్తాయని నమ్మకం నాకు. అది ఈ రూపంలో రావడం నా అదృష్టం కాదా?’

'కానీ మామయ్యా, నేను పెళ్లిచేసుకుని వచ్చేస్తే మా అమ్మ ఒంటరి అయిపోదా? అప్పుడప్పుడు మా అమ్మను చూసుకోవచ్చా మామయ్యా' అని బేలగా అడుగుతున్న అంజలివైపు ప్రేమగా చూస్తూ, ' పిచ్చి తల్లీ, మనం అందరం ఉండగా మీ అమ్మ ఒంటరి ఎందుకు అవుతుంది? నీవూ ఆదిత్యా తరచుగా అమ్మ దగ్గరకు వెడ్తూ ఉందురుగాని . అమ్మను కూడా మనతోనే ఉంచేసుకుందాం. ఆ విషయం గురించి అసలు ఆలోచించకు. నేను మీకు లేనా తల్లీ? నీవూ ఆదిత్యా కలసి జీవించబోయే మీ వైవాహిక జీవిత మధురిమలు గురించి ఆలోచించు అంజలీ, సరేనా’ అంటూ ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు శ్రీధర్.

--సమాప్తం--

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.









50 views0 comments
bottom of page