'Jeevitha Sathyam' - New Telugu Story Written By Kolla Pushpa
'జీవిత సత్యం' తెలుగు కథ
రచన: కొల్లా పుష్ప
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అదొక గవర్నమెంట్ హాస్పిటల్. బయట చెట్ల కింద చాలామంది పేషెంట్స్ తాలూకా మనుషులు వెయిట్ చేస్తున్నారు తమ వారికి ఎలా ఉందో ఏమిటో అనే ఆత్రుతతో..
ఐ. సీ. యూ దగ్గర రాఘవయ్య "అన్నపూర్ణ ఆరోగ్యం ఎలా ఉంది" బయటికి వచ్చిన నర్సుని అడిగారు ఆదుర్దాగా.
"చెప్పాను కదా! ఆమె పరిస్థితి బాగోలేదని ఎందుకు అన్ని సార్లు విసిగిస్తారు ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?" అంటూ మందుల ట్రే పట్టుకుని లోనికి వెళ్ళిపోయింది.
అక్కడున్న బెంచ్ మీద కూలబడి పోయారు రాఘవయ్య.
@@@
రాఘవ ఒక అనాధ, వారాలు చేసుకుంటూ చక్కగా చదువుకున్నాడు. ఒక పుణ్యాత్ముడి సాయంతో టీచరుగా జాయిన్ అయ్యాడు. మంచి ఉపాధ్యాయుడని పేరు తెచ్చుకున్నాడు.
కొన్నాళ్లకు ఆ స్కూల్ హెడ్మాస్టర్ చనిపోతూ "తనకు ఒక కూతురు ఉందని, తనకి నేను తప్ప ఇంకెవరూ లేరు.. అందుకని నువ్వు పెళ్లి చేసుకో రాఘవ" అని చెప్పి కళ్ళు మూశారు.
అన్నపూర్ణ, రాఘవ దంపతులయ్యారు. వారికి మొదటి కాన్పులోనే ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. వాళ్ళని చక్కగా చదివిస్తూ పెంచి పెద్ద చేశారు, వాళ్లకు ఉద్యోగాలు కూడా వచ్చాయి.
పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లు తల్లి, తండ్రుల సంస్కారం వారికి రాలేదు ఉద్యోగాలు రాగానే రెక్కలొచ్చిన పక్షులలా విదేశాలకు ఎగిరిపోయారు. తల్లి, తండ్రి ఉన్నారన్న సంగతి మర్చిపోయారు.
అన్నపూర్ణకు వాళ్ల నాన్న ద్వారా వచ్చిన ఇల్లు మాత్రమే ఉన్నది ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఇల్లుని అమ్మ లేదు. అన్ని పనులు తనే చేసుకునేది, ఎప్పుడూ కూడా తనకు బాగోలేదన్న విషయాన్ని చెప్పలేదు.
ఇప్పుడు హార్ట్ ఎటాక్ అని ఇంతకుముందే రెండుసార్లు వచ్చి ఉంటుందని ఇది మూడోసారి గనక బైపాస్ సర్జరీ చేస్తే గాని బతకదని అందుకు రెండు లక్షల రూపాయలు అవసరపడతాయని చెప్పారు.
అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేగలను, ఇష్టం లేకపోయినా ఇల్లు అమ్మక తప్పదు కానీ వెంటనేఇల్లు ఎవరు కొంటారు అని ఆలోచిస్తూ అలసటగా నిద్రలోకి జారిపోయారు.
@@@
"సార్, సార్ మీ ఆవిడకు ఆపరేషన్ అయిపోయింది. "అన్న నర్సు మాటలకు తెలివిలోకి వచ్చారు.
"ఏంటి ఆపరేషన్ అయిపోయిందా? మరి డబ్బులు అని ఆగి.. అన్నపూర్ణకు ఎలా ఉందమ్మా" అని అడిగారు.
"బాగానే ఉన్నారు, కొత్తగా వచ్చిన డాక్టర్ గారు చాలా మంచి వారట మిగతా విషయాలన్నీ డాక్టర్ గారితో మాట్లాడండి" అన్నది డాక్టరు రూము చూపిస్తూ.
మెల్లగా తలుపు తోసుకొని లోనికి వెళ్లారు.
"రండి మాస్టారు కూర్చోండి "అన్నాడు డాక్టర్ రమేష్ బాగా తెలిసిన వ్యక్తి లాగా.
"బాబు నేను డబ్బులు కట్టలేదు, ఆపరేషన్"..
ఆయన మాట పూర్తిగా కాకుండానే "నేను ఇక్కడికి నిన్ననే వచ్చాను. మిమ్మల్ని, అమ్మగారిని చూశాను. అదంతా వదిలేయండి మాస్టారు.. అమ్మగారికి ఏం పర్వాలేదు. నేనే స్వయంగా చూసుకుంటాను. ఇంతకీ నేను ఎవరో గుర్తుపట్టారా?
నేను రత్తమ్మ కొడుకు రమేష్ ని. మీ ఇంట్లో మీ పిల్లలతో పాటు పెంచారు కదా ఆ రమేష్ ని "అన్నాడు.
అప్పుడు గుర్తుకొచ్చింది. 'తమ స్కూల్లో స్వీపర్ పనిచేసే రత్తమ్మ కొడుకు రమేష్ తల్లి అనారోగ్యం గా ఉన్నప్పుడు రమేష్ ఆ పనులు చేసేవాడు. అందుచేత చదువులో వెనకబడి పోయేవాడు. తన ఇంటికి తీసుకొచ్చి ఆ పాఠాలను చెప్పేవాడు. అలాగే తన పిల్లలతో పాటు అన్నం పెట్టేవాడు. అది పిల్లలకు నచ్చేది కాదు వాడు స్వీపర్ కొడుకని, ఎంత నచ్చచెప్పినా వాడితో కలిసేవారు కాదు. అందరినీ కలపాలనుకునే వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకే తన పిల్లలకు వాడికి తేడా లేకుండా చూసేవాడు. ఎవరేమనుకున్నా పదో తరగతి వరకు తన దగ్గరే చదివాడు.
ఆ తర్వాత తనకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో వాడి సంగతులు తెలియలేదు'.
"మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్" అని రమేష్ అడిగిన ప్రశ్నకు ఆలోచన నుంచి బయటకు వచ్చిన మాస్టారు.
" బాగున్నావా బాబు, మీ అమ్మ బాగుందా" అని అడిగారు.
"లేదు మాస్టారు నేను ఇంటర్మీడియట్ చదువుతుండగానే అమ్మ అనారోగ్యంతో చనిపోయింది.
మీరు పాఠాలు తో పాటు జీవిత సత్యాలు కూడా బోధించేవారు. ఆ పాఠాలు కొంతమంది పిల్లల్లో నిలిచిపోయాయి. మీరు ఒక మాట చెప్పేవారు కదా సార్!
తినడానికి తిండి లేని స్థాయి నుండి ఒకరికి పెట్టే స్థాయి వచ్చినప్పుడు తప్పకుండా పక్కవారికి పెట్టి తినాలి అనే మానవత్వం ఉంటే తప్పకుండా పైకి వస్తారని ఆ రోజు మీరు చెప్పారు కదా!
మాస్టారు.. కొంతమంది విద్యార్థులు మీ మాటలు అక్షర సత్యాలుగా భావించి పాటించారు. వారి సహాయంతోటే నేను చదువు పూర్తి చేశాను. నాకు చేతనైనంత సహాయం నేను కూడా చేయడం నేర్చుకున్నాను. "
"ఒకరోజు గుర్తుందా మాస్టారు స్కూల్లో ఆడుకునేటప్పుడు దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది మీ రక్తాన్ని ఇచ్చి కాపాడారు.
బంధం నిలవడానికి కన్న బంధమే కానక్కర్లేదు.
మనం వచ్చిన దారిని ఎప్పటికీ మర్చిపోకూడదు.
ఎప్పటికీ మర్చిపోకూడని వ్యక్తులు ఒకటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. రెండు పాఠాలు నేర్పిన గురువు గారిని మర్చి పోకూడదనిమీరే చెప్పేవారు కదా సార్. "
"కొన్ని సంఘటనలు జరగడం మన మంచికే, ఇలా మిమ్మల్ని కలిసి మీ రుణం తీర్చుకునే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇకనుంచి మీరిద్దరూ నా దగ్గరే ఉండాలి" అన్నాడు రమేష్ రాఘవయ్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
'తను వెలిగించిన ఈ చిన్న దీపం ఈరోజు తమలాంటి వాళ్ళందరికీ మంచి వెలుగునిస్తుంది' అనుకున్నారు మాస్టారు తేలికైన మనసుతో.
*శుభం*
కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప
Comments