జ్ఞాపకాల మధురిమలు
- Neeraja Prabhala

- Jul 25
- 3 min read
#NeerajaHariPrabhala, #JnapakalaMadhurimalu, #జ్ఞాపకాలమధురిమలు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Jnapakala Madhurimalu - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 25/07/2025
జ్ఞాపకాల మధురిమలు - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
అజయ్, సుమ ఇద్దరూ ఒకే కంపెనీలో సాఫ్టువేరు ఇంజనీర్లు. పరిచయాలు పెరిగి ఇద్దరి మనసులు కలిశాయి.
పెద్దలనెదిరించి ప్రేమించి పెళ్ళి చేసుకుని క్రొత్త జీవితం మొదలు పెట్టారు. క్రొత్త కాపురం మూడు పువ్వులు- ఆరుకాయలుగా సాగుతోంది. అన్యోన్యమైన ఆ జంటను చూసి చుట్టు ప్రక్కల అందరూ ముచ్చట పడుతున్నారు. ఇద్దరికీ సంగీతం అంటే చాలా ఇష్టం. అజయ్ చిన్నప్పుడు నేర్చుకున్నందున చాలా శ్రావ్యంగా శ్రృతి లో చక్కగా పాడతాడు. అతని పాటంటే చచ్చే ఇష్టం సుమకు. సుమ సంగీతం నేర్చుకోకపోయినా ఏ పాటైనా చక్కగా పాడగలదు. వీలు కుదిరినప్పుడల్లా వాళ్ళకదే హాబీ.
రెండు సం.. తరువాత వీళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముద్దులు మూటగట్టే బాబు పుట్టాడు. అతనికి 'వినీత్' అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటున్నారు.. పెద్దల పట్టుదలలు ఎంతో కాలం ఉండవు కదా! మనవడు పుట్టగానే ఇరు వైపుల పెద్దల రాకపోకలు, మాటా- మంచి మొదలయ్యాయి. వినీత్ ముద్దు ముద్దు మాటలు వాళ్ళని మరింత మనసుకు దగ్గరకు చేర్చాయి.
అజయ్, సుమలు కంపెనీలో లోను తీసుకుని అందమైన చిన్న ఇల్లు కొనుక్కున్నారు. వినీత్ కాన్వెంట్ కు వెళుతున్నాడు. రోజులు హాయిగా సాగుతున్నాయి. కానీ విధి రాత అనేది ఒకటి ఉంది. దాన్ని ఎవరూ మార్చలేరు కదా ! ఒకనాడు ఆఫీసునుంచి వస్తున్న అజయ్ స్కూటరును లారీ ఢీకొంది. ఆ ప్రమాదంలో అజయ్ అక్కడి కక్కడే విగతజీవుడయ్యాడు.
సుమకు దెబ్బలు తగిలి స్పృహ లేని స్థితిలో ఉంటే స్థానికులు అంబులెన్స్ లో దగ్గరలోని హాస్పిటల్ లో చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు సుమకు చికిత్స చేస్తున్నారు. సుమ వద్ద ఉన్న ఫోను నెంబర్ల ఆధారంగా పోలీసులు వాళ్ళ వాళ్ళ కు సమాచారం అందించారు.
విషయం తెలియగానే ఇరువైపులా పెద్దలు వినీత్ ను తీసుకుని హాస్పిటల్ కు వచ్చారు. కొడుకును, అల్లు డినీ పోగొట్టుకున్న దుఃఖాన్ని ఎవరూ మాన్పలేరు. సుమకు స్పృహ వచ్చినా ఆవిషయం చెప్పద్దన్నారు డాక్టర్లు. చెపితే సుమ ప్రాణానికే ప్రమాదమని ఆవిషయం గోప్యంగా ఉంచమన్నారు. ఇవేమీ తెలియని బాబు అమ్మ, నాన్న అని ఏడుస్తుంటే ఎలాగోలా సముదాయిస్తూ వస్తున్నారు అందరూ.
సుమకు స్పృహ వచ్చి అజయ్ గురించి, బాబుని గురించి అడిగింది. బాబుని చూపించి, అజయ్ ని కంపెనీ వాళ్లు హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ చేశారని నమ్మబలికారు సుమ పేరెంట్స్. గతం మరిచిన సుమ అజయ్ కు ఫోను చేయాలి, అతనితో మాట్లాడాలని పట్టు పట్టింది. ఇంక డాక్టర్ల సలహా మేరకు మిమిక్రీ తెలిసిన బంధువు సుధీర్ చేత ఫోన్ చేయించి అజయ్ లాగా మాట్లాడించారు సుమ పేరెంట్స్.
"హాయ్ సుమా! ఎలా ఉన్నావు? నేను మొన్ననే ట్రాన్సఫర్ మీద ఇక్కడికి వచ్చాను మొన్నటి దాకా నీ వద్దనే ఉన్నాను. నీవు హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్ళగానే వస్తాను. ఆ తర్వాత నీవు కూడా ఇక్కడికి ఉద్యోగం ట్రాన్ఫర్ చేసుకోవచ్చు. నీ ఆరోగ్యం జాగ్రత్త. " అని చాలా ప్రేమగా మాట్లాడాడు సుధీర్.
హాయ్ అజయ్ ! నిన్ను చూడందే నా మనసు మనసులో ఉండదు. నన్ను విడిచి నీవు ఎక్కడికీ వెళ్ళద్దు నీవు ఎప్పుడూ నాతోనే ఉండాలి. నీ రాక కోసం ఎదురుచూస్తుంటాను. త్వరగా వచ్చేయి" అంది సుమ.
"ఓకే డియర్. వస్తాను. గెట్ వెల్ సూన్ " అని ఫోన్ పెట్టేశాడు సుధీర్.
ఆమాటలను విన్న సుమ మనసు ఊరట చెందింది.
ఆ తర్వాత వారానికి సుమ డిశ్చార్జి అయి ఇంటికి వచ్చింది. వినీత్ 'అమ్మ ' అనే ముద్దు ముద్దు మాటలతో మెడచుట్టూ తన చిన్ని చేతులతో ఆల్లుకుంటుంటే మళ్ళీ మామూలు మనిషవుతోంది సుమ. అజయ్ ఎప్పుడెప్పుడొస్తాడా? అని అతని రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది సుమ.
మంచి మసస్సు ఉన్న సుధీర్ "ఒక ప్రాణాన్ని నిలబెట్టటం కోసం తను చేస్తున్న ఈ పని తప్పు లేదు. దేవుడు కూడా తనని హర్షిస్తాడు. తండ్రి లేని వినీత్ కు తల్లికూడా లేకపోతే ఎలా? ఆ పసివాడి ఉజ్వల భవిష్యత్తు కోసం, ఎంతో జీవితం ఉన్న సుమ త్వరగా కోలుకుని మళ్ళీ మామూలు మనిషయి సంతోషంగా ఉండాలి. అందుకోసమే ఇలా చేస్తున్నాను ' అని అనుకున్నాడు.
ఇలా తరచూ ఫోన్లు చేస్తూ సుమకు ఏదో ఒక కారణం చెప్పి నెల రోజులు గా సుధీర్ నెట్టుకోస్తున్నాడు. కానీ ఎక్కువ కాలం అబధ్ధాలను దాచలేం కదా ! డాక్టర్ల సూచన మేరకు సుమకు విషయం చెప్పారు సుమ పేరెంట్స్. ముందు సుమ నిర్ఘాంతపోయి గుండెలు పగిలేలా రోదించింది. మళ్ళీ క్రమేణా వినీత్ కోసం తన మనసును దిట్టవు చేసుకుని తనకు తానే ధైర్యాన్ని, మనో బలాన్ని కూడ దీసుకుని ఉద్యోగానికి వెళుతూ కొడుకుని ప్రేమగా చూసుకుంటోంది.
'వినీత్ కు ఇంక నుంచి తల్లీ తండ్రి తనే. ఏ లోటు తెలీకుండా వాడిని చక్కగా పెంచి మంచి పౌరుడిగా తీర్చి దిద్దాలి' అని అనుకుంది సుమ.
కొంత కాలానికి వ్రృధ్ధులైన సుమ పేరెంట్స్ గతించారు. వినీత్ కాన్వెంట్ చదువు పూర్తయి మంచి స్కూలులో చేరి బాగా చదువుకుంటున్నాడు.
తన జీవితంలో అజయ్ లేని లోటు తీర్చలేని దైనా అజయ్ 'బాబు రూపంలో తనతోనే ఉన్నాడు తన కి నీడలా ఉంటూ తననూ, బాబుని చూసుకుంటాడు'. అన్న నమ్మకంతో, ధైర్యం తో జీవిస్తోంది సుమ కొడుకుతో. అజయ్ పాటలు, మాటలు, అతని అంతులేని ప్రేమ మరపురాని మధురమైన తీపి జ్ఞాపకాలుగా తన హృదయంలో పొందికగా పదిలపరుచుకుంది సుమ.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link



Comments