top of page

జ్ఞాపకాల పూలసజ్జ


'Jnapakala Pulasajja' New Telugu Story


Written By Yasoda Pulugurtha


రచన: యశోద పులుగుర్త
ఆముక్త- తన భర్త విక్రాంత్, కూతురు గేయ తో కలసి ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక సారి అమెరికా నుండి ఇండియా వచ్చి వెడుతుంది. ఆరు సంవత్సరాల క్రితం చనిపోయిన తల్లి ప్రియంవద జ్ఞాపకాలెన్నో పూలసజ్జలో పేర్చిన పూల దొంతర్లలాగ కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి.


అమ్మా తనూ కలసి ఎన్నో సాయంత్రాలు తమ తోటలో కలసి తిరిగిన జ్ఞాపకాలనెన్నిటినో సన్నజాజుల మాలలా అందంగా అల్లుకుంటూ, పువ్వుల్లా పూసిన రోజులు రాలిపోయాక తొడిమల్లా మిగిలిన జ్ఞాపకాలతో భారంగా అమెరికా తిరిగి వెడ్తుంది.

అలాగే ఈ సారీ వచ్చారు. ఔట్ హౌస్ లో తోటమాలి శీనూ, అతని కుటుంబం ఆ ఇంటినీ, తోటనీ పర్యవేక్షిస్తూ అక్కడే ఉంటారు. ఆముక్తా వాళ్ళు వచ్చేసరికి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతారు. తాను ఆ తోటలో తిరుగుతూంటే అమ్మతో గడిపిన ఎన్నో జ్ఞాపకాలు మదిలో మెదులుతూ అమ్మతో గడిపిన జీవితంలో ప్రతీ సంఘటన కళ్లకెదురుగా కదలాడుతుంటే వాటినే తలచుకుంటూ అలాగే నిలుచుండి పోయింది.


ప్రియంవద పెళ్లైన నాటికే ఒక డిగ్రీ కాలేజ్ లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేది. భర్త సుధాకర్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లో సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. తల్లితండ్రులకు ఒకర్తే కూతురు అయిన మూలాన ఎంతో గారాబంగా పెంచి పెద్దచేసి చదువు చెప్పించారు. కూతురూ అల్లుడూ తమ కళ్ల ఎదుటే ఉండాలన్న తాపత్రయంతో సుధాకర్ సంబంధాన్ని ఇరువైపుల పెద్దలే కాకుండా ప్రియంవద, సుధాకర్ కూడా ఇష్టపడడంతో పెళ్లి జరిపించారు.


ప్రియంవదకి తన పుట్టింటివారు బహుమానంగా ఇచ్చిన అందమైన విల్లాలో సుధాకర్ తో ఆనందంగా కాపురం చేసుకుంటోంది. అందమైన తోట మధ్యలో కట్టబడిన ఆ విల్లాని తన అభిరుచికి అనుగుణంగా మార్చుకుంది. తోటలో ఎన్నెన్నో పూలమొక్కలు తెప్పించి నాటించింది. ఆ తోటలో పూసిన గులాబీల రంగులను చూడడానికి రెండుకళ్లూ సరిపోవు. సాయంత్రం కాలేజ్ నుండి రాగానే ముందస్తుగా తోటలోకి వెళ్లి ప్రతీ మొక్కనీ, పూవునీ ప్రేమగా పరామర్శించేది.


ఒకరోజు ఆమె పున్నాగ చెట్టుకింద నిలబడి ఏదో ఆలోచిస్తున్న తరుణంలో సుధాకర్ వచ్చాడు అక్కడకు.


“నీకు నామీద కంటే ఈ తోటమీదే ఎక్కువ ప్రేమ కదూ ప్రియా..” అన్న సుధాకర్ మాటలకు " అసలు ప్రేమంటే ఏమిటి సుధా" అంటూ ప్రశ్నించింది.


"నువ్వు నాటిన మొక్కకి పూసిన పూరేకు విచ్చుకాగానే నీ మనసులో కలిగే సందడి!" అన్నాడు.

' నిజమా సుధా ' అనగానే అప్పుడే విరిసిన ఇంద్రధనస్సును చూసినట్లుగా ఆమెను చూస్తూ నవ్వాడు.


నెలలో రెండు మూడురోజులు ఆఫీసు పనిమీద బెంగుళూర్ వెళ్లి వస్తూ ఉంటాడు సుధాకర్. బెంగుళూర్ నుండి వచ్చిన తరువాత ఎందుకో మూడీగా అన్యమనస్కంగా ఉంటాడు . ప్రియంవద ఎంత తరచి అడిగినా ఏమీ సమాధానమివ్వడు.


పెళ్లైన సంవత్సరం తరువాత 'ఆముక్త' పుట్టింది.

ఒకరోజు ఆఫీసు నుండి వస్తూనే అర్జంట్ గా బెంగుళూర్ వెళ్లాలని చెపుతున్న భర్త వైపు చూస్తూ, "ఆమూ కి జ్వరంగా ఉంది సుధా, ఇప్పుడే వెళ్లాలా.." అంటూ అడుగుతున్న ప్రియంవద వైపు చిరాగ్గా చూస్తూ, “ఆ మాత్రం సమర్ధించుకోలేవా..” అంటూ హడావుడిగా వెళ్లిపోతున్న భర్త వైపు అప్రభితురాలై చూస్తూ ఉండిపోయింది.


ప్రియంవద తల్లి రాధాదేవి హార్ట్ పేషెంట్. ఆవిడ ఒక రోజు తెల్లవారుఝామున హార్ట్ స్ట్రోక్ వచ్చి నిద్రలోనే చనిపోయింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక పోయింది ప్రియంవద. ఆ సమయంలో తనని దగ్గరకు తీసుకుని ఓదార్చేవారే లేరు. సుధాకర్ అంతకు రెండురోజుల ముందే బెంగుళూర్ వెళ్లాడు. అతని మొబైల్ కి చేస్తే స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. ఎప్పటికో రెస్పాండ్ అయ్యాడు. తల్లి మరణం గురించి చెపితే ‘అర్జంట్ వర్క్ లో ఉన్నాను, ఐయాం సారీ, మరో రెండురోజులు పడుతుంది రావడాని’కంటూ ఫోన్ పెట్టేసాడు.


తల్లి మరణం కంటే ఆ సమయంలో అతని ప్రవర్తన ప్రియంవదని మానసిక క్షోభకు గురిచేసింది.


మరో రెండు సంవత్సరాలు గడచిపోయాయి. ఈలోపు తండ్రి మరణం ప్రియంవదని బాగా కృంగతీసింది.


' ఆమూ' సెవెన్తె క్లాస్ లోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి వస్తూనే పరుగెత్తుకుంటూ తోటలో తల్లి కూర్చుండే చోటుకి వచ్చింది.


' ఆమూ' కి తల్లి కనపడలేదు. అమ్మ కూర్చునే సిమెంట్ బెంచ్ మీద పూల సజ్జనిండా అప్పుడే కోసిన ఫ్రెష్ గులాబీలు, సగం చదువుతూ వదిలేసిన పేజ్ మధ్యలో కళ్లజోడూ, కొంచెం తాగి వదిలేసిన కప్పులోని కాఫీ, చలిగాలికి కప్పుకోవాలని తెచ్చుకున్న షాల్ అవీ అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోతూ అమ్మకోసం ఇంటి లోపలికి పరుగుతీసింది.


హాఫ్ ఇయర్లీ ఎక్జామ్ లో స్కూల్ ఫస్ట్ వచ్చానన్న సంతోషాన్ని తల్లితో పంచుకోవాలన్న ఆరాటం.


అంతకుముందే ప్రియంవద తోటలో కూర్చుని కాఫీ తాగుతూ నవల చదువుకుంటోంది. తోటమాలి శీను ఆరోజు గులాబీలు విరగపూసాయని కోసి, సజ్దనిండా నింపి ఆమె పక్కనే పెట్టాడు. రోజూ సాయంత్రం స్నానం చేసి దేవుడి గదిలో దీపారాధన చేసి, తోటలో కోసిన పూలతో దేవుని మందిరంలో సీతారాములను అలంకరించడం ప్రియంవద కి అలవాటు.


ఇంతలో సుధాకర్ వచ్చాడని, మిమ్మలని పిలుస్తున్నారని శీను చెప్పడంతో హడావుడిగా అన్నీ అక్కడే వదిలేసి లోపలకి వెళ్లింది.


ప్రియంవదని చూస్తూనే ‘నేను ఊరువెడుతున్నా’ననేసరికి ప్రియంవదలో అన్నాళ్లూ దాగిన ఆవేశం ఒక్కసారిగా పెల్లిబుకింది.


'ఆఫీస్ టూరా' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించేసరికి ప్రియంవద ముఖంవైపు చూడలేక పక్కకు చూస్తూ ఔనంటూ తల ఊపాడు.


'ఇంక ఎన్నాళ్లు నాదగ్గర దాస్తారు సుధా?’ అని అడిగేసరికి అతని ముఖం నల్లగా మాడిపోయింది.


అతను ఏదో చెప్పబోతుంటే, “మీరు తరచుగా ఆఫీసు పనంటూ బెంగుళూర్ వెడుతుంటే అమాయకంగా నిజమని నమ్మాను. ఎందుకంటే మీ మీద నమ్మకం. రీసెంట్ గా బెంగుళూర్ లోని నా స్నేహితురాలు పద్మిని మిమ్మలని మరో స్త్రీ తో తరచుగా చూస్తున్నానని, తను ఉంటున్న ఫ్లాట్ వీధిలోనే మీరిద్దరూ తరచుగా కనపడుతున్నారని, మీ ఆయనకు ఆవిడ చుట్టమా అంటూ ఫోన్ లో నన్ను అడిగింది. అది మన పెళ్లికి వచ్చింది.. మీకు గుర్తు ఉందోలేదో.. ? మనిద్దరం కలసి ఉన్న ఎన్నో ఫొటోలను తనకు వాట్సాప్ లో షేర్ చేస్తూ ఉంటాను. అది అడిగిన ప్రశ్నకు తెల్లబోయాను.


ఆవిడా మీరూ కలసి ఉంటున్నారని, మీకొక కొడుకు కూడా ఉన్నాడని చెపుతుంటే నేను కాదంటూ వాదించాను. పద్మిని కజినొకరు బెంగుళూర్ లో మీ ఫ్లాట్ పక్కనే ఉంటుందిట. ‘మా కజిన్ కూడా చెప్పిందే’ ప్రియా అంటే నోటమాటరాలేదు. ఇంకా నన్ను నమ్మించాలని ఎందుకు ప్రయత్నిస్తారు సుధాకర్?”


"నీకు జరిగిన విషయం ఏమిటో చెప్పలేని పిరికితనం ప్రియా. ఇంక దాచలేను! నేను బెంగుళూర్ లో బయోకెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నపుడు 'ఆమని' నా క్లాస్ మేట్. ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను ఎమ్ టెక్ లో చేరాను, ఆమని ఉద్యోగంలో చేరింది. ఇద్దరం లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటుండగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం.


మా నాన్న నేను ఆమనిని చేసుకుంటే చస్తానని బెదిరించి నీతో నా పెళ్లి నిశ్చయం చేసాడు. నాన్నకి డబ్బాశ. మీ తల్లితండ్రులకు ఒక్కగానొక్క కూతురువని, వారి తదనంతరం వారి ఆస్తినంతటికీ నీవే వారసురాలువని ఆయన దూరాలోచన.


ఆమని కి ఈ విషయం చెపితే చచ్చిపోతానంది. నన్ను పెళ్లి చేసుకోకపోయినా ఫరవాలేదు, కానీ ఈ రిలేషన్ షిప్ ఇలాగే ఉండాలంటూ ఏడ్చింది. నాన్నని ఎదిరించలేని నా బలహీనతతో నీతో పెళ్లికి సిధ్దమైనాను. పెళ్లి చేసుకున్న నీకు అన్యాయం చేయకూడదనుకున్నాను. నీకు నిజం చెప్పలేక దాచిపెట్టాను.

" అంటే, ఇలాగే దాచిపెట్టి మా ఇద్దరితో సంసారం చేయాలనుకుంటున్నారా?" కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ ప్రశ్నిస్తున్న ప్రియంవదకి మౌనమే అతని సమాధానం.


“మీరు మా ఇద్దరితో సర్దుకు పోవాలనుకున్నా, ఆమనికి కూడా నేను ఉన్నా తనకు అభ్యంతరం లేదంటూ సర్దుకు పోగలిగినా, నాకు అంతటి విశాల హృదయం లేదు. నా భర్త నాకే సొంతం కావాలని కోరుకుంటున్న ఒక స్వార్ధపరురాలిని. మీరు నా జీవితం నుండి వెళ్లిపొండి సుధాకర్. డైవర్సు పేపర్స్ పంపిస్తాను. సంతకాలు చేసి పంపండి”


ఇంతలో అమ్మా అంటూ పరుగెత్తుకు వస్తూనే తల్లిని వాటేసుకుంటూ ఆముక్త స్కూల్ విషయం తల్లితో పంచుకుంటుండగా, సుధాకర్ సూట్ కేస్ తీసుకుని తలవంచుకుని వడి వడిగా ఆ ఇంటినుండి శాశ్వతంగా వెళ్లిపోయాడు.


ఆముక్త ఐఐటి లో చదువు ముగించుకుని వచ్చింది . మొదట్లో ‘నాన్న ఏరమ్మా, బెంగుళూర్ నుండి ఇంకా రాలేదా’ అంటూ తరచుగా అడిగే ప్రశ్నకు ‘ఏం.. నేను నీకు లేనా, మనిద్దరం ఒకరికొకరం’ అంటూ సమాధాన పరిచేది. ఒకరోజు ప్రియంవదే ఆమూ కి అంతా చెప్పేసింది. ఎవరిద్వారానో వినేకంటే తనే ఆమూకి స్వయంగా చెప్పడం ఒక బాధ్యతగా భావించింది.


'ఆమూ క్లాస్ మేట్ విక్రాంత్ ' ఐఐటి తరువాత పై చదువులకు అమెరికా వెళ్లాడు. అతనికి అమెరికాలో ఉద్యోగం రాగానే ఇండియా వచ్చి తన తల్లితండ్రులతో ప్రియంవద దగ్గరకు వచ్చి, ఆముక్తా తనూ ప్రేమించుకున్నామని, ఆముక్తని పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి ఇరువైపుల అంగీకారంతో ఆముక్తను విక్రాంత్ కి ఇచ్చి పెళ్లి చేసింది.


పెళ్లి అయిన రెండు సంవత్సరాలకు 'ఆమూ' కన్సీవ్ అయిందని మురిసిపోయింది ప్రియంవద. కూతురి పురుటికి అమెరికా వెళ్లింది. పండంటి మనవరాలిని చూస్తూ ఆనందం పట్టలేకపోయింది. పాపకి ' గేయ' అని పేరు పెట్టుకున్నారు. ఒక ఆరునెలలు ఉండి తిరిగి వచ్చేసింది.


ఒకసారి ప్రియంవదకి ఉన్నట్టుంది మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. విషయం విన్న ఆమూ వెంటనే తల్లిని చూడాలనుకుంటూ పరుగెత్తుకుంటూ వచ్చేసింది. తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నా విధిని ఎవరం ఆపలేమన్నట్లు మరోసారి మాసివ్ స్ట్రోక్ వచ్చి ' ఆమూ' ఒడిలోనే కళ్లుమూసింది. దుఖంతో విలవిల్లాడిపోయింది ఆముక్త.


తన ప్రియమైన అమ్మ, నాన్న దూరమైనా, నాన్నలేని లోటుని తీరుస్తూ ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంది. విక్కీ ని ప్రేమించానని చెపితే అతనికే ఇచ్చి తన వివాహం జరిపించింది. నలభై సంవత్సరాలు దాటకుండానే భర్త చేసిన పనికి తట్టుకోలేక అతనికి విడాకులిచ్చేసి స్వతంత్రంగా తనకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకున్న అభిమానధనురాలు.


ఇలా అమ్మతో ముడిపడిన ఎన్నో జ్ఞాపకాలను తలచుకుంటూ, ఇంట్లోని ప్రతీ అణువూ అమ్మ జ్ఞాపకాలనే గుర్తుచేస్తున్నపుడు అమ్మే తనను 'ఎలా ఉన్నావు ఆమూ' అంటూ పరామర్శించినట్లుగా అనుభూతికి లోనౌతుంది.


'ఆమూ' గత జ్ఞాపకాలనుండి బయటకు వచ్చింది. మూడువారాల వాళ్ల వెకేషన్ పూర్తి అయిపోయింది. ఇక్కడనుండి అమెరికా వెళ్లాలంటే ఈ జ్ఞాపకాలను వదలలేక అయిష్టంగా వెడుతుంది.


మర్నాడే వాళ్ల ప్రయాణం. ఆరోజు పొద్దుటే వంటింట్లో టిఫిన్ చేస్తూండగా శీను వచ్చాడు. పూలసజ్జనిండా పూలు తెచ్చి దేవుడి గదిముందు పెడ్తూ. ఆముక్తతో “తల్లీ! ఒక్కమాట చెప్పాలనుకుంటున్నాను..”.


“ఏమిటది శీనయ్యా?”


“ఇంత ఇంటిని అలా ఖాళీగా ఉంచే బదులు పైన రెండుగదులు మీకోసం ఉంచుకుని, మిగతా భాగాన్ని అద్దెకు ఇచ్చుకోవచ్చు కదమ్మా, ఎందరో ఇంటిని అద్దెకిస్తారా అంటూ అడుగుతున్నారు”.


“శీనయ్యా, రాత్రి నేనూ విక్రాంత్ కలసి ఆలోచించాం. ఒక ఆరునెలల్లో మేము పూర్తిగా ఇండియాకి వచ్చేసి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం”.


“ఓ.. అవునా అమ్మాయిగారూ, మంచి ఆలోచనే. మీరు ఇక్కడే మీ ఇంటిలో చక్కని ఈ తోటలో గడుపుతుంటుంటే పైన ఉన్న ప్రియంవదమ్మ మిమ్మలని రోజూ చూస్తూనే ఉంటుంది. శుభం తల్లీ” అంటూ వెళ్లిపోతున్న అతనివైపే చూస్తూ మనసులో అనుకోసాగింది.


అమ్మ జ్ఞాపకాలను నా వెంట తీసుకు పోవడానికి ఈ పూలసజ్జ సరిపోవడంలేదు. అందుకనే ఇక్కడే ఉండిపోతే అమ్మ ఎప్పుడూ నాతోనే, నా వెనుకే నడుస్తూ బోల్డు కబుర్లు చెపుతూ ఉంటుంది.


అమెరికాలో నేను పొందుతున్న సుఖాలు, విలాసాలు కంటే చక్కని ఈ అనుభూతులు చాలవా అని అనుకోగానే ఆమె మనస్సు పురివిప్పిన నెమలిలాగ నాట్యమాడసాగింది.


***సమాప్తం***


యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం79 views0 comments
bottom of page