top of page

జోకర్

#జోకర్, #Joker, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguHeartTouchingStories

ree

Joker - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao

Published In manatelugukathalu.com On 15/08/2025

జోకర్ - తెలుగు కథ

రచన: కర్లపాలెం హనుమంతరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


 

షరీఫ్ చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయి పొట్టకూటికి ఓ సర్కస్ కంపెనీలో చేరాడు. కాలక్రమేణా అక్కడ జోకర్ గా స్థిరపడ్డాడు. షరీఫ్ బఫూన్ చేష్టలే ప్రదర్శనల్లో ప్రధాన ఆకర్షణగా రాణించే సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా సర్కస్ కంపెనీ మూతపడింది. వేరే జీవనాధారం తెలీని షరీఫ్ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఊరి వారందర్నీ తన బఫూన్ చేష్టలతో నవ్విస్తూ గ్రామానికి ప్రీతి పాత్రుడయ్యాడు. పెళ్లి, పేరంటం, ఉత్సవం, ఊరేగింపు, జాతర, కొలుపు.. ఊళ్లో ఏ శుభకార్యం జరిగినా ఇప్పుడు షరీఫ్ నవ్వుల ప్రదర్శన తప్పనిసరి. 


ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉల్లాసంగా కాలం వెళ్లబుచ్చే షరీఫ్ ఉన్నట్లుండి పెద్ద జబ్బు బారినపడ్డాడు. తగిన వైద్యం చేయించుకొనే స్తోమతు లేక రోగం బాగా ముదిరింది. షరీఫ్ సందడి లేక ఊరంతా వెలవెలబోయే సమయం ఆసన్నమయింది. 


ఆ రోజు షరీఫ్ ఆరోగ్యం బొత్తిగా బాగోలేదు. తెల్లవారడం కష్టం అన్నాడు వైద్యం చేసే ఆచారి. తన సందడి ఇక కనిపించదని దిగాలు పడ్డ ఊరి జనాలను ఓ ఆఖరి కోరిక కోరాడు షరీఫ్. ఆ రాత్రంతా తనను ఓ గోడకు చేరగిలా చేర్చి ఒంటరిగా వదిలేయమన్నది ఆ చివరి కోరిక. 


జోకర్ అభిలాష ఊరి జనానికి చిత్రమనిపించింది. అయినా ఆత్మీయుడి ఆఖరి కోరిక నెరవేర్చడం తమ కనీస ధర్మంగా భావించారు. అయిష్టంగానే అతని అభీష్టాన్ని మన్నిస్తూ కాళ్లు రెండూ బార చాపిన స్థితిలో ఒంటరి షరీఫ్ ను ఓ గోడ వారకు చేర్చి అంతా వెళ్లిపోయారు. 


వైద్యుడి మాటను ఖాయం చేస్తూ షరీఫ్ ఆ రాత్రి ఏ క్షణాన కన్ను మూసాడో.. తెల్లారి ఊరి జనానికి ప్రాణంలేని అతని పార్థివదేహం చిరునవ్వుతో గోడకు చేరగిలబడి కనిపించింది. 


ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం షరీఫ్ బొందిని ఖననం చేసే సమయంలో పెద్ద సమస్య వచ్చిపడింది. కాళ్లు బారజాపి గోడకు చేరిగిలబడి ప్రాణాలు విడిచినందువల్ల షరీఫ్ కళేబరం ఎక్కడి కక్కడ బిగుసుకుపోయి ఉంది. తలను నేలను తాకితే పాదాలు ఆకాశాన్ని చూస్తున్నాయి. పాదాలను నేలకు ఆనిస్తే దేహం కూర్చున్నట్లుగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్థితిలో మార్పులేదు. సందర్భం కాకపోయినా చూసేవారికి ఆ ప్రయాస వినోదం కలిగించక మానలేదు. 


చనిపోయిన తరువాతా తన బఫూన్ చేష్టలతో వినోదం అందించి ఆనందపరుస్తూ ఊరి జనం స్మృతుల్లో చిరంజీవిగా శాశ్వత స్థానం సంపాదించిన జోకర్ షరీఫ్ వృత్తి ధర్మం నిబద్ధతతో నిర్వహించేవారందరికీ ఆదర్శం. 


(అక్రాముల్లా సయ్యద్ అరబ్ స్టోరీస్ అధారంగా - కల్పితం )


 ***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


Comments


bottom of page