కడలికెంత గాంభీర్యమో
- Neeraja Prabhala
- Mar 21, 2024
- 1 min read
Updated: May 17, 2024

'Kadalikentha Gambhiryamo' - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 21/03/2024
'కడలికెంత గాంభీర్యమో' తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కడలి కెంత గాంభీర్యమో నదీ నదాలన్నీ తనలో ఇముడ్చుకున్నానని.
కెరటాల కెంత ఉబలాటమో ఉవ్వెత్తున నింగికెగరాలని.
అలలకెంత ఆరాటమో రెట్టించిన ఉత్సాహంతో తీరం దరికి చేరాలని.
హోరుగాలి కెంత సంతసమో అలలతో కూడి మంద్ర స్వర సంగీతం ఆలపిస్తున్నానని.
నింగి కెంత నిగర్వమో నక్షత్ర కూటమితో ప్రశాంత వదనయై ఉన్నానని.
చంద్రుని కెంత చిలిపి దరహాసమో సంద్రునికి అందనంత ఎత్తున ఉన్నానని.
సుడిగుండాల కెంత బాధయో సుగమ మార్గము తెలియక ఇరుకున పడ్డానని.
పుడమి కెంత పులకరింతయో సంద్రము తన అంతరంగమైనందుకు.
చరచరాల ప్రాణులకు ఎంత నిశ్చింతయో సంద్రుని ఆవాసంలో హాయిగా సేద తీరుతున్నందుకు.
ప్రక్రృతి కెంత పరవశమో సంద్రగాలితో సరాగాల నాట్యమాడాలని.
సంద్రుని కెంత నిబధ్ధతయో ఆచంద్ర తారార్క సృష్టికి సాక్షీభూతమైనందుకు.
కవుల కెంత మనోహరమో ఆద్యంతము లేని సంద్రము కవితాత్మక ఊహాకల్పన వర్ణనకు.
నా మదికెంత ఆహ్లాదమో సంద్ర కెరటాలను చూసి ఆనందించే అదృష్టము కలిగి నందుకు.
........నీరజ హరి ప్రభల.
Commentaires