కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Kalamicchina Thirpu' New Telugu Story Written By Dr. Kanupuru Srinivasulu Reddy
రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
భద్రయ్య పోలీసు హెడ్. ఆ టౌన్లో తెలియనోడు లేడు. ఎందుకంటే అతని
చేతి వేళ్ళకు బంగారు ముద్దలు ఉంగరాలుగా మెరుస్తుంటాయి. బాసులడిగితే అత్తారింటి
వారు ఇచ్చారని గర్వంగా చెప్పి ‘ఎదవలు ఆమాత్రం తెలియదా?! పోలీసోడికి
ఎలావస్తాయో పోలీసోడికి ?” నవ్వుకుని ఉంగరాలు మెరిసేటట్లు యునిఫార్మకు బాగా రుద్ది
అపురూపంగా ముద్దుబెట్టుకుని లోకాన్ని మరిచి పోతాడు.
ఒక్కగానొక్క పదహరేళ్ళ కొడుకు. అప్పుడే అన్ని వ్యసనాలు పుట్ట. దారికి
రావడంలేదు. అయినా కొడుకు కోసం కూడ బెట్టాలని ఆశ!! ఏవిటో? కొరివి పెట్టాలనో...
వంశాభివృద్ధి మొలకనో ?
అది చిన్న టౌనయినా, సిటీలోకంటే నల్లమందు, నల్ల డబ్బు దండిగా
దొరుకుతుంది పోలీసులకు. ఒకప్పుడు నెల పెట్టగానే స్టేషన్ కే వచ్చేసేవి. ఈ రోజుల్లో ఎవడిలోచూసినా లెక్కలేనితనం, పెడసరం మందేలేని గజ్జిలా అయిపోయింది.
ఆ ఊళ్ళో మూడు నాలుగు ముఠాలు ఉన్నాయి , చంపడాలు, చంపుకోడాలు
కిడ్నాపులు, స్మగలింగ్ లెక్కే లేదు. ఎంతకయినా తెగిస్తారు. పోలీసులు ఊరికే ఉంటారా?
పట్టుకుంటారు కానీ వదిలేయ్యాలి. పైనుంచి, పక్కనుంచి వొత్తిడి. నిజానికి పోలీసులు
చాలా మంచి వాళ్ళు. చెడిపోయింది, ముఖ్యంగా రాజకీయంగా, అన్నింటిని
శాసిస్తున్నఅక్రమంగా అడ్డ దిడ్డంగా సంపాదించిన డబ్బుతో బలిసిన కక్కుర్తి సమాజం
వలన. మంచి వాళ్లకు! పేద వాళ్లకు ఏ వొక్క పోలీసు డ్యూటీని న్యాయంగా చెయ్యలేడు.
వీధుల్లో అమ్మాయిలు. సందుల్లో అబ్బాయిలు. సారాయి ..మందు, మానభంగాలు,
అమ్మకాలు! మరి ఆ ఇండస్ట్రీకి పోలీసు ,రాకీయ జెండాలు ఆర్ధికంగా అవసరం !! దేశ
పురోభివృద్దికి ?? అని ప్రజాభిప్రాయం!!
ఈ రోజు కలెక్షన్ డ్యూటీ హెడ్ భద్రయ్యది. బయలు దేరాడు.
అడుగు పెట్టగానే కనిపించిన సీను...అందరూ కూర్చుని కట్టలు కట్టలు డబ్బు
ముందు పెట్టుకుని, మందు తాగుతూ పైకప్పులు ఎగిరిపోయేటట్లు నవ్వుతూ. డాన్సులు
వేస్తూ, మన లోకంలో లేరు. హెడ్ నీడ పడగానే అన్నీ టక్కున ఆగిపోయాయి. తనుకు
భయంవేసి టక్కున ఆగిపోయి, వెనకా ముందు చూసుకున్నాడు. ఎందుకంటే, వీళ్ళు
ఎప్పుడు, ఏవిధంగా ప్రవర్తిస్తారో, ఏంచేస్తారో, దేవుడు కూడా ఊహించలేడు . అంత
నమ్మలేని వ్యక్తులు. నేటి ఆధునిక నాగరికత అభివృద్ధి ప్రతినిధులు!!
హెడ్ను చూసి తలెత్తి, ఆ గడ్డాలు, మీసాల లేత పందులన్నీ ఒక్క సారిగా , “ అరె!
హెడ్! రా! కాస్త చప్పరించు ..? రంజుగుంది పిల్ల !” ప్రేమను అసహ్యంతో కలిపి,
చీదరింపును ఆహ్వానంలో ఇమిడ్చి పిలిచారు. తన భాషా పరిజ్ఞానానికి తల మునకలయి
గుటకలు మింగాడు, నములుతున్న గుట్కాను.
అహం చచ్చినా పులుపు కడుపులోనుంచి బ్రేవ్ మని ఎగదన్నుకు వచ్చింది. ఆడు
డబ్బు ఇసిరేసాడు. బురదలో పడింది. ఎంత పొగురు.. కుక్కకు బిస్కెట్ ... ఆలోచించాడు.
ఎలాగొట్టినా, దేన్లో తడిచినా, అది డబ్బు. అత్తరు వాసనల గుబాళింపుతో, గుడ్డలిప్పేసిన
స్టార్స్ లాగా అందుకో.. ఆడుకో అని కదలనివ్వదు. దోషం అసలే అంటదు !! అయినా
మింగుడు పడక ,అయి అటు ఇటు చూసాడు.
“ నీకొడుకు ఖర్చు బ్యాచీ. ఇక్కడకు రాడులే! పో! అడుక్కో...నాక్కో మందులోకి ఊరగాయి !” భూతు భాష , ఛీ వెదవలు!
పోలీసు భాష కంటే ఘోరంగా, తియ్యగా, ఏవిటో?
సిగ్గు అనిపించలేదు. గుండె పగల్లేదు. అవి ఉండవు. పోలీసోడ్నికదా అనుకున్నాడు. తనకొచ్చేది అన్నింటికి సరిపోతుంది. పెడ్లాం అత్యాశ, కొడుకు దుబారా లేకుంటే!!
కొడుకు అవతారం చూస్తే డోకు వస్తుంది. రోజుకో హేర్కట్ గుడ్డలంతా చినుగులు,
తొర్రలు. నేటి అత్యాధునిక ఫ్యాషన్. మరీ వికారంగా ! ఎప్పుడొస్తాడో ఎక్కడికి వెళతాడో
అంతు చిక్కడు.
పెద్ద పోలీసును చెయ్యాలి అని చాలా కోరిక ఉండేది. అదయితే వనరులు,
వసతులు తేలిగ్గా, దండిగా దొరుకుతాయి అని . కానీ ఈ గాడిద అడ్డ దిడ్డంగా పరుగులు
తీస్తుండే ! పేపర్లు స్మగిలింగ్ చేసో, పుస్తకాలెత్తుకుపోయి కాపీ చేసో , ఆ పదో క్లాసయినా
పూర్తి చేస్తే, వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకుని పోలీసు ఉద్యోగం ...?! తన టాలెంట్ కూడా
లేదని బాధపడ్డాడు భద్రయ్య.
“నా కొడుకు చదివితే ఏం- చదవక పోతే ఏం.? ఒక్కగానొక్కడు. నా రాజా రారాజు
అవుతాడు” తల్లి వొక్క మాట పడనిచ్చేది కాదు. ఆ వయసులోనే గ్యాంగులు, కొట్లాటలు,
కిడ్నాపులు.ఇర్రుక్కుంటే వదిలించక పోతే ఇంట్లో విమానపు మోతలు, ఫైరిజన్లు.” చెడి
పోతాడువే ! వెదవ ల...!”
“ మీరేం పతిత్తులా? చెయ్యలా? తాగలా, డబ్బుగుంజలా! మరి వీడు ట్రైనింగ్
అవుతున్నాడు. నా బంగారు తండ్రి.” నోరు మెదపలేక పోయేవాడు. అడ్డమైన గడ్డి
తినేది తన కోసమా?!
,
ఇంటికి వెళ్ళేసరికి పొద్దుపోయింది. సహజం... పోలీసు జాతకంలో. రాగానే భోజనానికి
కూర్చోబోయాడు. పెండ్లాం, ‘కొడుకు బిరియాని తెస్తానన్నాడు, చేయలే’దంది. విపరీతమైన
కోపం వచ్చింది. ఎప్పుడొస్తాడో ఏమో? తప్పదు. పోద్దుపోతుంది. ఆకలి మండిపోతుంది.
తనకు తెలిసి ఎప్పుడూ ఇంత మంచిపని చెయ్యలేదు ?. ఇది మొదలేమూ మారడానికి?
తళ తళ మెరుస్తున్న చేతికున్న నాలుగు ఉంగరాలు చూసుకుని మురిసిపోయాడు.
వాటిల్లో మహత్యం ఉంది. అందుకే కొడుకులో మార్పు.!!
తొందరగానే, అంటే పదకొండుకి కొడుకు తూలుతూ దిగాడు. బిర్యాని ప్యాకెట్టు
ఇచ్చాడు. తప్పలేదు. తినేందుకు కూర్చున్నాడు. చాలా మంచిగా దగ్గర వచ్చి
కూర్చున్నాడు. సారాయి కంపు, తూ !? లేవబోయాడు. ఎదురుగా గుమగుమ లాడే పిట్ట కోడి,
సినిమా అమ్మడు గుడ్డలిప్పి...!?
“వ్యాపారం చెయ్యాలి లక్ష రూపాయిలు కావాలి” అని బ్రతిమిలాడినట్లు డిమాండు
చేసాడు. తన దగ్గర దిమ్మ తిరిగే ప్లాను ఉందన్నాడు. నమ్మలేదు. ‘నువ్వు చచ్చినట్టే.. నీ
అమ్మతోడు’ అని ఒట్టు వేయ బోయాడు. భస్మాసుర హస్తం!! దూరంగా తప్పుకున్నాడు.
అయినా ఏవిటో తెలుసుకోక అంత డబ్బు...?
దగ్గర కూర్చో బెట్టుకుని పెండ్లాన్ని మచ్చిక చేసుకోవాలని, “ఏం వ్యాపారం?
ఎక్కడ? ఎవరితో?” అని అడిగాడు. కొడుకుని పోలీసు ప్రశ్నలు వేస్తుంటే పెండ్లానికి
నచ్చలేదు.
“ ఏదయితే నీకు ఎందుకంట? ఇంత కాలానికి కుదురుగా ఉండాలనుకుటుంటే!
నా రాజా! వందకు వేలు తెస్తాడు” అంటూ కుక్క పడ్డట్టు పడింది.
“ఎప్పుడైనా తెచ్చిచ్చాడా నీకు. నీ ముదిగారం వల్లనే చెడిపోయింది ఈ దొంగనా
కొడుకు. ముండలకు, మందుకు తగలేసినాడు కదవే! నా కష్టం...!” కోపంతో మాట్లాడలేక
గాండ్రించాడు.
“మహా ఇరగ దీసినట్లు. అడుక్కు తిన్న పెంటే కదా ! వ్యాపారం చేసి కోట్లు
సంపాదిస్తానంటే!” ఇదిలించి కొట్టింది పెడ్లాం. పిల్లల చెడ్డ ప్రవర్తనను ఏ తల్లిదండ్రులు
సమర్ధించకూడదు.ఈ ప్రశ్న ఎవరికీ?
కాదంటే, వాగి వాగి శాపనార్ధాలు పెట్టి, నానా రభస చేసి నోరు మూయించింది
భద్రయ్యను.
ఆకలి దహించి వేస్తుంది. కడుపులో మంటపుడుతుంది. ఎదురుగా గుమగుమలాడే
ధమ్ బిర్యాని ప్యాకెట్లు !? పొరలు పొరలుగా మరీ రెచ్చగొడుతుంది.
“అదేవిటో చెప్పి చావు” …దిగిరాక తప్పలేదు.
“ నీ కంటే పది ఇంతలు సంపాదించేది ! బెన్జి కార్లో తిరిగేది.! భడా కిడ్స్, మన
చెప్పు చేతుల్లో ఉండేది. కిందా పైన ముద్దు గుమ్మలు కరుచుకు పడి ఉండేది.
స్వర్గమందిరం .సంతోషానికి సులువైన మోక్ష మార్గం. ” గర్వంగా కాలరు ఎగరేసుకుంటూ
చెప్పాడు కొడుకు.
‘అలాంటి బిజినెస్ ఏముందబ్బా’ అని ఆలోచనలో పడి, అర్ధం అయి, నివ్వెర
పోయాడు భద్రయ్య. గుండె లబ్డబ్ అనిగాక దెబ దెబ అని పరుగెత్తింది. అలిసి పోయి
ఒగురుస్తూ వీధిలో పడలేక, గూట్లోకి దూరి గడ గడ లాడింది. రమారమి పది పదిహేను
లక్షలు పెండ్లానికి, కొడుక్కి తెలియని కనుక్కోలేని గూటిలో దాచాడు. అది గుడ్డలిప్పి
మాన రక్షణకోసం గజ గజ వణుకుతున్నట్లు అనిపించింది.
దడపుట్టి చెమట వోట్లోనుంచి పొంగింది. “ చస్తే ఒప్పుకోను. అలాంటివి మన
ఇంటా వంట లేవు.”
“నేను పంట పండిస్తాగా! చూస్తుండు సంవత్సరం తిరగకముందే కోట్లు!!”
“అడ్రసుండవు . మామూళ్ళు ఇవ్వడానికే సరిపోవు.”
“ రారుగా! వస్తే ఎట్లా మానేజ్ చెయ్యాలో తెలుసు. మందులో ముక్కలదాక ముంచి,
ఓ పోరిని పడేసి వీడియో తీసి జేబులో వేసుకుంటే... సరిపోయే! నీ జాతేగా! ఒక్క నా
కొడుకు దగ్గరకు రాడు”
తనను ఖచ్చితంగా ఇరికించేస్తాడు.“నీకేం తక్కువరా! తగలెయ్యడానికి
మోపెడంత మోసుకోస్తున్నాను కదా ! వాళ్ళబ్బలు అడ్డ దిడ్డంగా... , కక్కుర్తి ఎదవలు.
నపుంసక వ్యభిచారులు”
“వాళ్ళా..వాళ్ళు నపుంసకలింగం కాదు, పుమ్లింగాలే! రోజుకొ ఆడదాన్ని కొలిచి,
తడిమి, రసం జుర్రుకునే వాళ్ళే! అది ఈ కాలపు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందరంటావు.
ఎమ్మేల్లెలు, మినిస్టర్లు, నట పారంగత వంశాంకురాళ్ళు , వెలిగుతున్న, వెలుగు
ఆరిపోయిన మాజీ కంపెనీల తారామణులు, అందరూ షేర్స్. వాళ్ళకేం లేకనా ఈ
ఎక్సట్రా రాబడి!! గుడిలో కంటే, బడి లోకంటే, ఇంట్లోకంటే బతుకును విప్పి చూపించే
ప్రిస్టేజ్ ఇంటర్ నేషనల్ విశ్వ విద్యాలయాలు. అనుభవం, అంతులేని ఆనందం ఈ
ఆడమగ కుర్రగాళ్ళు పరుగులే పరుగులు. ఇరుక్కుంటే చచ్చేదాకా కదలరు. కనుల
పండగ, ఫ్రీ లస్ట్.. ఫ్రీ బ్రెస్ట్ అంతా ఫ్రీ ఫ్రీ! కాబోయే మన జాతి రత్నాలు. వారేవా!
బతుకంటే అది. ఎలైట్ సొసైటీని తీసుకు రావాలబ్బయ్యా ! ”
మాట్లాడుతున్నంత సేపు హిప్ ఫ్లాస్క్ లోనుంచి పెగ్గుమీద పెగ్గు బిగిస్తూనే
ఉన్నాడు. అంత ఖరీదయింది ఏ బడా ప్లే బాయిస్ బాస్ లు, క్రిమినల్ డాన్లు
దగ్గరుండేది. వీడి దగ్గర? అమ్మో! నా డబ్బు!! కడుపు రగిలి పోయింది . కోపం వస్తూ ఉంది.
కానీ కుం కైయ్ మన లేదు భద్రయ్య. తండ్రి ముందు తాగడం. కలిసి వ్యభిచారం
చెయ్యడం నేటి నాగరికత చిహ్నం. ఎదుగుదలకు మణిహారం. చూపించే సినిమాలు
డబుల్ హిట్ట్ !!
నేటి తరం ఆధునిక విప్లవం. ఆడ మగ గుడ్డలిప్పడం అనైతికం కాదు.
గాఢనిట్టూర్పు వదిలి ఇదేదో తన శ్రాద్ధానికి వచ్చిందని గట్టి నమ్మకానికొచ్చాడు భద్రయ్య.
ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఏవిటో అజ్ఞాన జ్ఞానోదయం!? లాభం లేదు వీధి
మీద పడదామని లేస్తుంటే కొడుకు, పెండ్లాం అడ్డొచ్చి చంపుతామన్నారు.
“అదేం ముదిగారమే! వెనకేసుకోచ్చావంటే ఇద్దరి గొంతులు కోస్తాడు,” అని ఎంత
చెప్పినా వినలేదు. గోరుముద్దలు పెట్టిన చేతుల్ని తెగనరికి తాగడానికి గాజులు కొట్టేసిన
కేసులెన్నో?
“వాడు నా కొడుకు. నా గొంతు కోయడు. నీ గొంతు కొస్తే కొయ్యొచ్చు. నా బంగారు. నా
రాజా! ఇవ్వక పోతే నీ పని అంతే!?” కొడుకుకి ముద్దులు పెడుతూ మురిసిపోయింది.
‘వీళ్ళా నా వాళ్ళు . ఇంత గడ్డి తినేది ఈ ఘాతకుల కోసమా!’ అని విపరీతమైన బాధ
వేసింది. పోలీసోడుగా ఉన్నందుకు గర్వంగానే ఉంది. మనిషిగా ఆలోచిస్తున్నందుకు
సిగ్గు అనిపించింది. అంతలోనే నేటి శతాబ్దం చేసిన పోలీసు వికృత రూపం రంకెలేసింది.
చేతికి బంగారు కడియం వేసుకోవాలి. మెడలో ముద్దల బంగార గొలుసు
వేసుకోవాలి. దానికింకా సరిపడా లేదు. రేపు కొట్టాలి, లేకుంటే ఈ నా కొడుకు ఇళ్ళంతా
తగలబెట్టి అది కూడా కొట్టేస్తాడు!!
“చస్తాను! డబ్బు ఇవ్వకపోతే !” గాండ్రించాడు కొడుకు .
అదే మంచిది అని ముసుగు తన్ని పడుకున్నాడు. ‘’అయ్యో! పోతాడేమో?
ఒక్కగానొక్కకొడుకు!! కానీ వీడు తనను ఊచలు లెక్క పెట్టిస్తాడేమో? ఉద్యోగం పోతుంది.
మరి బంగారు దండ, కడియం...?’
"తినకుండా పడుకుంటే ఎట్టా? మేం కూడా పస్తున్డాలా? లే.. లే. తిని పడుకో!”
అంటూ బ్రతిమలాడినట్లు దబాయించారు కొడుకు, భార్య !
తప్పలేదు. తింటూ ఉంటే ఎంతో రుచిగా, పంచభక్ష్య పరమాన్నం తిన్నంత
తృప్తిగా గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. వెంటనే అలివిగాని, ఆదుపు చేసుకోలేని
నిదురొచ్చేసింది. సగం రాత్రిలో విపరీతమై నొప్పితో అరుస్తూ లేచాడు. భార్య, భర్త
చేతులు చూసి, “అయ్యో..అయ్యో! వేళ్ళు ... ఉంగరాలు...ఉంగరాలు! రక్తం...రక్తం!!”
చూసుకున్నాడు. ఉంగరాలున్న నాలుగు వేళ్ళు లేవు. రక్తం కారి పోతుంది. డబ్బు
.. డబ్బు అంటూ గూటి దగ్గరకు పరుగెత్తాడు. లేదు!! వీధి వైపు చూసాడు. కొడుకు
పరుగెత్తుకు పోవడం కనిపించింది. పెడ్లాం, “అయ్యో..అయ్యో! నా నగలు...నగలు”
రక్తం కారి చస్తున్నా?..
“పోలీసు... పోలీస్”... ఇంట్లోనే ఉన్న సంగతి మరిచిపోయింది.
“బంగారు..బంగారు ... కుక్క... కా,..కా...కీ ఎత్తుకు...?” అంటూ చీకటిలో కలిసి పోతున్న
కొడుకు కోసం పరుగెత్తింది!!
***సమాప్తం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.. నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.
Comentarios