'Virinchi' written by Dr. Kanupuru Srinivasulu Reddy
రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
మాది మధ్యతరగతి కుటుంబం. తినడానికి కొదవలేదు గాని ఆశలు తీర్చుకోవాలంటే కష్టమే. అమృతం స్వర్గంలో కాదు నా కళ్ళలోనుంచే కురుస్తుందని, అంత ముగ్ధ మనోహరంగా ఉంటానని అమృత నయని అని పేరు పెట్టారు. చదువులో ప్రధమం, ఆటల్లో పోటీ లేదు, అందంలో సాటి లేరు! యుక్త వయస్సు వచ్చేసరికి నాకు స్పీడ్ బ్రేకర్లు ఎక్కువయ్యాయి. బయటకెళ్ళితే 'తిరిగి వస్తానో, రానో.. కాలం ఇలా ఉంది' అని పిచ్చి భయం అమ్మా నాన్నకు. ఉన్నట్టుండి నా జీవితంలో సునామీ వచ్చింది “ఎంత అదృష్టం! అంత పెద్దవాళ్ళు మన అమ్మాయినే చేసుకుంటాం అని కాళ్లావేళ్లా పడుతుంటే మనం కాదంటే అష్టమ శని తగులుకున్నట్లే ! అలాంటి అవకాశం ఎవరికి వస్తుంది” అని అమ్మానాన్న విసిగించేసారు.
“నేను చదువు కోవాలి! పెండ్లి నాకొద్దు. మరో రెండు సంవత్సరాలు ఆగితే ఇంజినీరింగ్ పూర్తి అవుతుంది. ఉద్యోగం వస్తుంది.”
“నీకు పెండ్లి చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాం .!?”
“అందుకే చదువుకుంటా! మిమ్మల్ని చూసుకుంటా !! అందరం ఒక్కటిగా ఉందామనే సంస్కారవంతుడు, నా మనసుకు నచ్చిన వాడు దొరికితే చేసుకుంటా! అదే నా జీవిత ఆశయం.”
“ అవన్నీ రాతలు, కలలు! మనస్తత్వాల లోతులు, మనుషుల తత్వాలు జల్లెడ పడుతూ కూర్చుంటే ఒక జీవితం చాలదు. అప్పుడు పెండ్లి అవసరం ఉండదు. మాకు పాడె అవసరం ఉంటుంది. నీ బ్రతుకే కాకుండా మా అందరి జీవితాలు నీ చేతిలో ఉన్నాయి. చిన్నవాళ్ళ భవిష్యత్తు నీ నిర్ణయం మీద ఉంది. చంపుతావో బ్రతికించుకుంటావో?” అని అందరూ ఒక్కటయ్యారు. నా తల్లిదండ్రులు బెదిరించి, బ్రతిమిలాడి, విసిగించి చూపులకు ఒప్పించారు. అబ్బాయిని చూసాను. చాలా బాగున్నాడు. మర్యాదస్తుడుగా, అహంకారం లేనివాడుగా, మాటల్లో స్నేహితుడుగా అనిపించాడు. నా కోరికను, ఆశయాన్ని, చెప్పాను. అందుకు ‘తనకు అభ్యంతరం లేదని, నన్ను చూసిన తరువాత, తన ప్రపంచమే అందాలతో విరబూసినట్లు, జీవితంలో సంతోషం తప్ప మరేది ఉండబోదని అనిపిస్తుంద'ని, 'మనం జన్మ జన్మల స్నేహితులమేమో, ఈ ఆకర్షణ పూర్వజన్మ బంధమేన’ని తలమునకలై పోతూ చెప్పాడు. అంతకంటే ఏ యువతైనా కోరుకునేది ఏముంది.? సరే అన్నాను. మా వాళ్ళ సంతోషం చూసి బాధ్యత తీరుస్తున్నాను అనే తృప్తి కలిగింది.
నా కాబోయే అత్తగారు పదే పదే దిష్టి తీస్తూ, మా ఇంటి మహాలక్ష్మి, మా అదృష్ట దేవత, పోతపోసిన అపరంజి బొమ్మ అంటూ మురిసి ముక్కలయి పోయారు. జాతకాలు చాలా బాగా కలిసాయట! అన్నవరంలో ఆర్భాటంగా పెళ్లి చేసుకుని, అంగరంగ వైభవంగా పుట్టింట్లో కన్నెరికాన్ని అర్పించి, అత్తగారింటికి బయలుదేరాం.!!. మనసు, మంచు దుప్పటి కప్పుకొని పుట్టింటిలో నా చిన్నతనాన్ని, అనుబంధాన్ని శాశ్వతంగా తగలబెట్టి, ఆపుకున్నా ఆగని, ఆర్పలేని కన్నీళ్లను తుడుచుకోవాలని మరిచిపోయాను. నవ్వులు, చతురులతో కారు ఆగ మేఘాల మీద పరుగెత్త సాగింది. ఉన్నట్టుండి ఆనందసాగరం అల్లకల్లోలం అయ్యింది. కారు బోల్తా పడింది. బ్రతుకు తల్ల క్రిందులయ్యింది. అదేమి చిత్రమో అతనొక్కడే..!?
పసుపు పారాణితో గడపలో అడుగు పెట్టాలా లేక ముండ మోసి వెనక ద్వారం నుంచి వచ్చి, పూలు గాజులు తీసెయ్యాలా.. ఉంచాలా ? ఎవ్వరికీ దిక్కు తోచలేదు. తలలు బద్దలు కొట్టుకున్నారు.
‘అన్నీ తీసేయ్యాల్సిందే! ముండమోపికే అందం ఉండకూడదు!!' - ఇదీ అందరి నిర్ణయం!
అర్దమే కాలేదు. చిమ్మ చీకటి...? అతను చనిపోయినందుకు అయ్యో పాపం అనిపించినా, బంధంగా బాధపడలేదు.
”నేనెందుకు పూలు తీసేయాలి.. గాజులు పగలగొట్టుకోవాలి ? ”
చెయ్యనన్నాను. అందరూ నోరెళ్ళబెట్టారు. కాల్చుకు తినేటట్లు చూశారు.
“ ముండమోపి, బొట్టు కాటుక పూలు గాజులు ఉంచుకో కూడదు. అది సంప్రదాయం. ఆనవాయితీ!!”
“ నేను గాజులు, పూలు, పసుపు పారాణి, తీసేస్తే ఇవన్నీ నిలుస్తాయా ? చాదస్తం!!. పుట్టుకతోనే అవి స్త్రీకి అర్ధం చెప్పాయి. ఆడతనానికి ఆదర్శంగా నిలిచాయి. నాకు ఇష్టమైన వాటిని ఎవరో చచ్చారని నేనెందుకు వదులుకోవాలి? మరీ రాతి యుగంలో ఉన్నారు. ఈ కాలంలో మరుసటి వారమే పెండ్లి చేసుకుంటున్నారు.”
“ ఇడిచి పెట్టిన వాళ్ళుంటారు. ఇది సంస్కృతి , సనాతన ధర్మం, ఆచారం తప్పడం సహించం! అవే మా పరువు, ప్రతిష్ట. మాది ఆత్మగౌరవంగల జమిందారి వంశం. వాటిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం.”
“నా ప్రవర్తనలో ఉంటుంది మీ ఇంటి గౌరవం. మన్నించే ఆదర్శంలో ఉంటుంది ఆ వంశ ప్రతిష్ట.”
“ తెగించిన దానివంటారు. బొట్టు తీసేయ్యకపోతే రంకు చెయ్యడానికి పనికొస్తుంది అంటారు! కుటుంబ పరువు పోతుంది.. ఎంత తలవంపులు? మా కట్టుబాట్లు అతిక్రమిస్తే ప్రాణం ఉండగా నీ ఇష్టాఇష్టాలు జరగనివ్వం.”
‘ రంకు చేయడానికి ఇవన్నీ లేకపోయినా అడ్డుకాదే.!? ప్రవర్తనలో ఉండాలి. వేషంలో కాదు.!! నేను తియ్యను !!”
“ ప్రతి మగకుక్క జొళ్ళు కార్చుకుంటూ మా ఇంటి ఆడపడుచును ఉంపుడుకత్తెగా చూడటం సహించం. మా వంశాన్ని తరతరాలు భోగం కొంప అంటారు. అలా అనిపించుకునే దానికంటే నిన్ను చంపి తగలబెట్టేస్తే పోతుంది.. మా మాట కాదంటే నరకం చూపించి ఆత్మహత్య చేసుకునేట్లు చేస్తాం.”
అలాగే చూపించారు. సాయంకాలం అయితే, ఆడ మగ తేడా లేకుండా తాగేసి, నన్ను నానా మాటలు అంటూ, చితక బాదేవారు. ఇలా కూడా మనుషులు ఉంటారా? తాగుతారా? ఇదేం మధ్యతరగతి ఆనవాయితీనో, ప్రతిష్టకు కీర్తికిరీటమో, అర్ధమే కాలేదు. నేనే వాళ్ళ కొడుకు చావుకు కారణం అని, నష్టజాతకురాలినని, ఇంటికి పట్టిన శని దరిద్రం అని జాలి దయ చూపించక గొడ్డు కంటే హీనంగా చూసారు.!! ఆరునెలలు నోరుమెదపలేదు, అలమటించాను. భరించలేక, “జాతకాలు చూసింది మీరు. ముహూర్తం పెట్టింది మీరు. కడుపు కాలుతున్నానన్ను ఉపవాసాలు పెట్టి పూజలు చెయ్యించింది మీరు. నా బ్రతుకేమయ్యింది ? దానికి కారణం ఎవ్వరు?” అని ఎదురు తిరిగాను.
“ నీ దరిద్రం! మా శని.!! నోరు తెరిచావంటే వాతలు పెడతాం. ఉప్పు పాతర వేస్తాం. !!”
“ ఇలా బ్రతికేకంటే అదే నయం. పోలీసు రిపోర్ట్ ఇస్తాను. మా స్త్రీ సంఘాలున్నాయి. మానవహక్కుల ఉల్లంఘన చేయరాని నేరం. జీవితాంతం మీరు జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది.”
“ఎంత పొగురు ? అంతమాట అంటావా? నిన్నూ నీ వాళ్ళను నిలువునా నడి వీధిలో నరుకుతాం. మమ్మల్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరు. గుట్టు చప్పుడు కాకుండా చెయ్యగల శక్తి ఉంది. ” అని చావ చితకకొట్టారు.
మా వాళ్ళను ఏమయినా చేస్తారేమోనని భయం వేసి నోరు మెదపలేక కుళ్ళి కుళ్ళి ఏడవటం నా జీవితం అయిపోయింది. ఎందుకు అలా చేతగాని దానిలా ఉండిపోయానో అర్ధమే కాలేదు. వాళ్ళ కొడుకు తాళి కట్టినంత మాత్రాన నా మనసు, శరీరం, వ్యక్తిగత స్వాతంత్రం, వాళ్ళ అధీనంలో ఉండాల్సిందేనా ? నాకు ఇష్టాయిష్టాలు ఉండకూడదా? ఎవరైనా ఇంటి కొస్తే పలకరించ కూడదు, చూడకూడదు. కావాల్సింది కోరుకోకూడదు. ఈ నరకం ఎంత కాలం భరించాలో, ఎలా ఈ సజీవ సమాధి నుంచి తప్పించుకోవాలో అని తిండి తిప్పలు మానేసి రాత్రింబవళ్ళు ఒకటే ఆలోచన. పారిపోవడమే తగిన పరిష్కారం అని ఒకటి రెండుసార్లు ప్రయత్నించి దొరికిపోయాను. అప్పటి నుంచి నా బతుకు మరీ ఘోరాతి ఘోరంగా తయారయ్యింది.
'ఆత్మహత్య చేసుకుంటే? ఛీ.. ఈ వెధవలకు భయపడి పండంటి జీవితాన్ని అగ్నికి ఆహుతి చెయ్యాలా? పిరికి తనం, అసమర్ధత ,నా పుట్టుకకే అవమానం. నా తల్లిదండ్రులకు నిత్య నరకం. నా వంశానికే తీరని అప్రతిష్ట. బ్రతికి నేనేమిటో నిరూపిస్తాను.'
ఆ సమయంలోనే ప్రగతితో పరిచయమయ్యింది. వాళ్ళ చుట్టాల అబ్బాయి. ఉద్యోగ ప్రయత్నానికి ఆ ఇంటికి వచ్చాడు. ప్రగతి ఎప్పుడూ నన్ను గమనిస్తున్నట్లు కనిపెట్టాను . అతని కళ్ళల్లో, దయ, సానుభూతి కొట్టొచ్చినట్టు కనిపించేది. మరొక మెరుపుకూడా ఉన్నట్లు అనిపించేది. భయం వేసేది వీళ్ళెక్కడ గమనిస్తారో తగలబెడుతారోనని. 'ఇదేవిటి ఇంత భయం.. ఛీ!' అనుకుని నన్ను నేను తిట్టుకునేదానిని . అతను నాతో మాట్లాడటానికి, నన్ను చూడటానికి చాలా ప్రయత్నిస్తున్నట్లు గ్రహించాను. అతని సహాయం తీసుకుని పోలీసులకు రిపోర్టు చేస్తే ? మా వాళ్లకు వచ్చే ప్రమాదం గుర్తొచ్చి ఆగిపోయేదాన్ని. ఆవేదన నా జీవితం అయిపోయింది.
ధైర్యం చేసి అతనితో రెండు మూడుసార్లు మాట్లాడాను. నన్ను ఇక్కడనుంచి బయట పడేయమని బ్రతిమలాడాను. అతను చాలా వెనకాడాడు. 'ప్రాణాలతో ఉండాలంటే అంత పని చెయ్యకండి, మంచి రోజులు వస్తాయి' అని ధైర్యం చెప్పేవాడు. ఇది తెలిసిపోయి నానా మాటలు అని, అతన్ని తరిమేశారు. అప్పటినుంచి రాత్రుల్లే కాదు, పగలు కూడా చిత్ర హింస పెట్టడం మొదలెట్టారు.
తప్పదు! వెళ్ళి పోవాలి, ఏమయినాగాని ఇక ఆలస్యం చెయ్యకూడదు, చచ్చినా పరవాలేదు అనే నిర్ణయానికి వచ్చాను. రోజూ జరిగేదే ఆ రోజు మరో రకంగా జరిగింది. పిచ్చి పట్టి పోయింది ఇంత వికృతంగా విడ్డూరంగా , కర్కోటకంగా , అమానుషంగా మనుషులు ప్రవర్తిస్తారా? భయంతో జుగుప్సతో తల్లకిందులై వణికి పోయాను. వొళ్ళు తెలియకుండా తాగి పచ్చి బూతులు మాట్లాడుతూ ఆడ, మగ, వావి వరస అనే తేడా లేకుండా నన్ను చెరిచినట్టే చిత్ర హింసలు పెట్టారు.
బ్రతిమలాడాను. ఏడ్చాను! లాభం లేకుండా పోయింది. నా గొంతులో బలవంతంగా సారాయి పోసి మింగే వరకు చావగొట్టారు. స్మారకం తప్పి పోయాను. మెలుకువ వచ్చి, మెల్లగా ప్రక్కకు తిరగాలని ప్రయత్నిస్తే, వళ్ళంతా విపరీతమైన నొప్పులు! శరీరం చూసుకుంటే అంతా కొరికిన గాయాలు, గుడ్డలు చిరిగిపోయి ఉన్నాయి. రూమంతా కలియ చూసాను. అందరూ స్మారకం లేకుండా ఒకరి మీద ఒకరు పడి ఉన్నారు. వాళ్ళ కిరాతక ప్రవర్తన జ్ఞాపకం రాగానే , విపరీతమైన కోపంతో రగిలి పోయాను. శక్తినంతా కూడా దీసుకుని, అందిన దాంతో అందరినీ చచ్చేటట్లు కొట్టి, ఇంట్లో నుంచి బయట పడ్డాను.
ఎక్కడికి పోవాలో తెలియదు, ఎటు పోతున్నానో తెలియదు. తరుముకొని వచ్చి చంపుతారేమో? సందుల్లో, గొందుల్లో దూరి, నరమానవుడు లేని దారిలో, కుక్కలు తరుముకుంటూ ఉంటే పడుతూ లేస్తూ, పరుగెత్తాను. ఎటువైపు నుంచో రైలు కూత వినిపించింది. చేరుకోవాలి. అప్పటికే చాలా అలసిపోయాను. ఇక శక్తీ లేదు. అడుగు ముందుకు వెయ్య లేక పోతున్నాను. కళ్ళు తిరిగి పోతున్నాయి. విపరీతమైన దాహం. కాళ్ళు తడబడుతున్నాయి. స్పృహ తప్పి పోతున్నట్లు అనిపించింది. అంతే..!
ఎంతసేపు అయ్యిందో, ఎక్కడున్నానో తెలియదు! మెలుకువ వచ్చేసరికి బలవంతంగా కళ్ళు తెరిచి చుట్టూ చూసాను. ఒక రూములో ఉన్నట్లు తెలిసింది. దూరంగా ఎవరో యువకుడు కిటికీ దగ్గర నిలుచుని, వీధిలోకి కాబోలు చూస్తున్నాడు. శరీరం తడిమి చూసుకున్నాను. గుడ్డలు మార్చినట్లు, దెబ్బలకు కట్లు కట్టినట్లు అనిపించింది. ఎవరు చేసారు? అతను...అంటే నన్ను నగ్నంగా... అంతే చివుక్కున లేచాను. ఆ శబ్దానికి అతను తిరిగి చూసాడు. నన్ను రాత్రి ఏమయినా చేసాడా అనే ఆలోచన రాగానే తల తిరిగింది. పడబోయాను.హటాత్తుగా వచ్చి పట్టుకున్నాడు. విదిలించేసాను. పట్టు వదలని అతన్ని చూసి ఆశ్చర్యంతో , అంతులేని ఆనందంతో, అతుక్కుపోయాను.
అతను ప్రగతి! ఎంత సేపు ఏడ్చానో అలివిగాని అలుపుకు విశ్రాంతి దొరికినట్లు, ఎక్కడలేని ధైర్యం నిండినట్లు అనిపించి, మునుపెన్నడూ లేనంత తృప్తిగా, హాయిగా, ప్రశాంతంగా మనసు నమ్మకంగా అతని ఎదపై నిదురపోయింది. మెలుకువ వచ్చి గబుక్కున దూరంగా తోసి, భయంగా అతని వైపు చూసాను.
” భయపడకండి. కాస్సేపు పడుకోండి.” అన్నాడు. మంచం మీద కూర్చో పెట్టి కాఫీ ఇచ్చాడు. తీసుకున్నాను. అన్నీ ఆలోచనలే! నేను ఇతనికే ఎందుకు దొరికాను? అడిగాను. చెప్పాడు. నేరుగా నేను ఇక్కడే ఉంటానని, వెతుక్కుంటూ వచ్చి, చాలా బెదిరించి కొట్టబోయారంట! 'లేదు, రాలేదు' అని ఎంత చెప్పినా వినిపించుకోలేదంట! చివరకు 'మేము గమనిస్తూ ఉంటాము, ఆమె వస్తే చెప్పకపోతే ఇద్దరినీ ఇక్కడే సజీవ దహనం చేస్తామ'ని, దబాయించి వెళ్ళారంట.
వాళ్ళు అటు వెళ్ళగానే, ఇటు తను నన్ను వెతుక్కుంటూ, టౌను అంతా గాలించ మొదలు పెడితే, రైల్వే స్టేషన్ కు దగ్గరలో స్పృహ తప్పి పడిపోయి ఉంటే తీసుకొచ్చాడంట. “ఇప్పుడు ఏం చెయ్యాలో తోచడం లేదు. వాళ్ళు మళ్ళీ వస్తారేమో? మిమ్మల్ని ఏం చేస్తారో?” అగమ్యగోచరమైన చూపు చూసాడు.
“భయపడుతున్నారా?”
“లేదు. మృగాల దగ్గర ఆవేశం పనికిరాదు.”
అదీ నిజమే! వాళ్ళ నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. ఎందుకో అప్పుడు లేని భయం ఇప్పుడు పట్టుకుంది. ధుఖం పెల్లుబికింది. ఎలా నా జీవితాన్ని నేను ఏర్పరుచుకోవాలి? ఎక్కడ మొదలు పెట్టాలి అని ?.
ఆలోచిస్తున్న అతన్ని చూసి,” పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే?” అన్నాను.
మెల్లగా నా వైపు తలెత్తి చూసి,” వాళ్ళకో లెక్క కాదు. రాక్షసులు! నిర్దాక్షిణ్యంగా పోలీసు స్టేషన్లోనే నరుకుతారు” అన్నాడు.
“ఒకవేళ వాళ్ళే రిపోర్టు ఇస్తే?”
“ఇవ్వరు!! అది చేతగాని పని. తమ అహంకారానికి, అహంభావానికి అవమానం. చంపడమే వాళ్ళ వంశపు పరువు, ప్రతిష్ట! అందుకు ఎంత దూరమైనా వెళతారు.”
ఏడుపు తప్ప మరో మార్గం కనిపించలేదు. నిస్సహాయంగా అతని వైపు చూస్తుండిపోయాను. కన్నీళ్లు తెలియకనే కారిపోతున్నాయి.
“నన్ను మా వాళ్ళ దగ్గరకు చేర్చరా?” అని చేతులు జోడించి అడిగాను.
“వాళ్ళను కూడా బ్రతకనివ్వరా?ఎన్ని సంవత్సరాలు అయ్యింది వాళ్ళు ఉన్నారని గుర్తుకొచ్చి!?”
అయోమయంగా చూసాను. ఆ నరకం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించానే తప్ప, వాళ్ళు ఏమయ్యారో ఒక్క సారి కూడా అనుకోలేదు. నేను ఇలా ఉన్నాను అని చెప్పినప్పుడు, ‘ఇప్పుడు మా బిడ్డవు కాదు! ఒకరింటి కోడలివి’ అని తప్పుకున్నారు. ఆ రోజు విరక్తి పుట్టింది. మరి ఇప్పుడెందుకు వాళ్ళ దగ్గరకు వెళ్లాలని..? వెళితే..? వాళ్ళు కాదంటే..? కాదనరు. అంత హృదయం లేని రాక్షసులు కాదు. అయినా..ఏమో?
ఎవరి దయ, సానుభూతి అక్కరలేదు. నా చదువుంది, ప్రేమించే హృదయముంది. తల్లి తండ్రి లేని పదిమంది అనాధులకు అమ్మనయ్యే ఆదర్శముంది. కానీ ఈ ముష్కరులు..? ఏ మూలో భయం దాగున్నట్లు అనిపించింది. విపరీతమైన ఆలోచనలతో తల పగిలి పోతుంది.
” మూడు సంవత్సరాలు ఎలా గడిచాయో మీకు ..?” అని, చెప్పడం నిలిపి నన్ను చూసాడు.
“మూడు సంవత్సరాలు అయ్యిందా!?” ఆశ్చర్యంగా అతని వైపు చూసాను.
“అవును. ఎన్ని మార్పులు జరిగాయో! అసలు ఈ ప్రపంచం ఉందా లేదా అని కూడా మీకు గుర్తులేదు. వాళ్ళను నేను పలకరిస్తూనే ఉన్నాను. ఇప్పుడు వెళ్లి ప్రమాదంలో పడేస్తారా? ”
“లేదు. ఆదుకుంటాను.”
“వీళ్ళు నిన్ను బ్రతకనివ్వాలిగా ?”
“మరీ లోకం అంత గొడ్డుబోయిందా ?”
“పంతానికి, ప్రతీకారానికి, సంఘం ఊడిగం చేసి దాసోహమవ్వాల్సిందే. విచక్షణ అసలే ఉండదు. అహంకారం, అభిజాత్యం అనే నిర్దాక్షిణ్యమైన ఉక్కు ముసుగులు ఉంటాయి.”
“మరి నన్నేం చేయమంటారు?” ఎందుకో ఆడతనం వినిపించింది ఆ మాటలో.
“వాళ్ళ దగ్గరకే వెళ్ళిపో !” అతి సాధారణంగా వ్యంగం దాచి అన్నాడు. ఆశ్చర్యంగా, విభ్రాంతితో అతని వైపు చూసాను.
“ఎందుకు అలా చూస్తారు? అంత ధైర్యంగా తెగించి ఆ గడప దాటేటప్పుడు జ్ఞాపకం రాలేదా, ఏం చెయ్యాలని, ఇప్పుడు నన్ను అడుగుతారెందుకు ?”
మరీ అంత నిర్మోహమాటంగా, నిర్దయగా మాట్లాడుతుంటే బాధ, కోపం పెనవేసుకున్నాయి.
నిజమే! వాళ్ళ నెదిరించినప్పుడు చావుకు తెగించే కదా చేశాను. ఇప్పుడు భయపడటం ఏమిటి? బహుశా ఇది నన్ను రెచ్చగొట్టి, ఆత్మవిశ్వాసం కలిగించడానికేమో? స్థిరమైన నిర్ణయం, ఎదుర్కోగల శక్తీ, ధైర్యం నాకే ఉండాలి, అని లేచి అతని వైపు చూసి “వస్తాను.” అని ముందుకు అడుగు వేసాను.
“గుడ్! మెచ్చాను. నేను మీతో రావచ్చా?” అని నా కళ్ళలోకి చూసాడు. ఎదురుచూస్తున్న ఆత్రుత కనిపించింది.
తుంటరితనం మనసులో మెదిలింది “విపంచిని కాదు” అన్నాను నా ముఖ కవళికలు కనిపించనీయక.
“అంటే?”
“కొనగోట మీటితే రాగాలు పలకడానికి” భావగర్భితంగా చూస్తూ అన్నాను.
“మీరు విరించి అని నాకు తెలుసు” నేను చూసినట్లే చూస్తూ అన్నాడు.
“అంటే?”
“మీ రాతలే కాకుండా మగవాళ్ళ రాతలు కూడా తిరిగి రాయగల అపర బ్రహ్మలు. ఆదిశక్తి స్వరూపాలు!! ”
అతని కళ్ళల్లోకి సూటిగా చూసాను. ధైర్యం, అభయం, నమ్మకం కనిపించింది.
అడుగు ముందుకు వేసాను.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..
నమస్తే !
నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష.
చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.
コメント