top of page

గంగమ్మ ధార


'Gangamma Dhara' written by Dr. Kanupuru Srinivasulu Reddy

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి


మొక్కలు నాటడం ఇప్పుడొక పెద్ద ఉద్యమం.

ఎవరి నోటా విన్నా అదే మాట.

దాని కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేస్తున్నారు.

కానీ నిజంగా చెట్లను, ప్రకృతిని ప్రేమించే వారికి అడుగడుగునా ఆటంకాలు, అవమానాలు ఎదురవుతాయి.

ప్రముఖ సీనియర్ రచయిత డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు ఈ కథను సజీవంగా మన కళ్ళ ముందు ఉంచారు.


చంద్రయ్య రెండెకరాల రైతు.ఊరికి కాస్త దూరంలో చిన్నపాటి ఇడవలి, తుంగ,

కప్పిన తాటాకు ఇంట్లో కొడుకు, కోడలు, ఇద్దరు మనవళ్ళతో కాపురం ఉంటున్నాడు.

ఇంటిముందు వసారా అరుగులు. అక్కడే మనవళ్ళతో రాత్రుళ్ళు పడుకుంటాడు. ఎదురుగా

తర తరాలనుంచి ఉన్నపోలేరమ్మ వేప చెట్టు, ఎప్పుడూ పెద్ద తామర పూలతో నీళ్ళు తగ్గని

గంగమ్మ ధార మడుగు. దేవుళ్ళు ఎక్కడో లేరు వాళ్ళేనని, సంజీవిని అంత శక్తీ ఉందని, వేప

చెట్టు పోలేరమ్మ దివ్యస్వరూపమని విశ్వాసం. దయ్యాల భూతాల భయం లేదు. ఎలాంటి

జబ్బుకైనా వేప రసం ఉండలు వేస్తే యిట్టే తగ్గి పోతాయి. ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా

ఉన్నారంటే ఆ గాలి, గంగమ్మ నీటి చలవే అని, డెబ్బై ఏండ్ల చంద్రయ్య పూర్తి విశ్వాసం.

ఉదయం లేస్తూనే ఇంటి చుట్టూ బంతి , చేమంతి, మల్లె, సన్నజాజి విరగపూసి

ఉంటాయి. ఇంటి

వెనకాల ఆకు కూరలు, కాయకూరలు చెట్లు, సమృద్దిగా పాలిచ్చే రెండు గేదెలు. సేద్యానికి

నునుపు తేలిన కాడెద్దులు. గంగమ్మధార గట్టు పైన ఏపుగా పెరిగే పచ్చి గడ్డి మేసి ఎప్పుడూ

ఉషారుగా కళ కళ లాడుతుండే రెండు ఆవులకు కొడేలే పుడతాయి. గంగమ్మధార లో

బోలెడు చేపలు! చుట్టూ ప్రక్కల ఎన్నో ఊళ్లకు నీటి దిక్కు. ఆరోగ్యంగా బ్రతకడానికి అన్నీ

అందుబాటులో ఉంటాయి. అవే ఆపదలో ఆదుకునే దేవతలు.

గంగధారమ్మ గట్టు మీద ఈ వైపున చంద్రయ్య ఇల్లు, దక్షణం నడిచి పోతే

పోలేరమ్మ గుడి, వెలగ చెట్టు, ఒక నేరేడు చెట్టు. ఇంటికి ఉత్తరం పెద్ద మామిడి చెట్టు.

విపరీతగా కాస్తుంది. బలే తియ్యగా ఉంటాయి పండ్లు. దానికి దూరంగా శ్మశానం,

సమాధులుతో నిండి ఉంటుంది. తన తాత ముత్తాతలు, చివరికి తన భార్యకు కూడా అక్కడే

సమాధి కట్టించాడు చంద్రయ్య. అది ఒక పుణ్య భూమి.

‘నా ఆడది బతికున్నప్పుడు ఈ వేప దేవత కింద కూర్చొని, గంగమ్మ ధారను చూస్తూ ఎన్ని

ఊసులు చెప్పుకునే వాళ్ళో. వెన్నెల రాత్రుళ్ళ లో పరాచికాలు ముదిగారం తీర్చుకునే

వాళ్ళు. కొడుకు ,కూతురు పుట్టినప్పుడు ఈ చెట్టు కొమ్మకే ఉయ్యాల వేసి పాటలు పాడేది.

కూడుతినక పోతే గంగమ్మ ధారను చూపిస్తూ ఎన్నెన్నో కధలు చెప్పేది . స్నానం, పానం

అక్కడే చేయించేది. పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది. ఉన్నట్లుండి తన్నొదిలి పెట్టి

అమ్మోరును చూసుకోమని దేవుడు దగ్గరకు ఎల్లిపోయింది.’ ఆ రోజులు వేరే! తలపుకొచ్సెసరికి

ఏడుపు ఎగదన్ను కొచ్చి కళ్ళ నిండా నీరుగమ్మాయి. పై గుడ్డతో తుడుచు కున్నాడు

చంద్రయ్య.

ఆ రోజుల్లో తానొక్కడే వ్యవసాయం పనులు చేసుకునేవాడు. ఎక్కువగా ఉంటే ఒక

మనిషిని పిలిచేవాడు. ఒక పని అనుకుంటే ఎంతో పొద్దుపోయినా చేసి గట్టు ఎక్కే వాళ్ళు.

ఇప్పుడో వస్తే, తను చేస్తూ ఉంటే వాళ్ళు గట్టుమీద కూర్చొని అదేదో సెల్లు ఫోనల్లో పాటలు

వింటున్నారు. మధ్యాహ్నం వరకే అది. కూలీలు భరించలేనంత ఎక్కివై పోయాయి. కొడుకు

ఎదిగి వచ్చి పనుల్లో సాయపడేవాడు. పెండ్లి ఘనంగా చేసాడు.

రాను రాను కోడలు, ఉన్న ఎద్దులు అమ్మేయ్యండి టాక్టర్లు ఉన్నాయిగదా, వాటి

తిండికే ఎక్కువ ఖర్చు అని గొడవ. , పాలు తీసుకోవడం కష్టం అని పాడి గేదెను

అమ్మేయ్యమని అప్పుడప్పుడు తగువు . అమ్మడానికి లేదు అని కరాఖండిగా చెప్పేసాడు

చంద్రయ్య . అప్పుడప్పుడు పొలం అమ్మేసి పట్నం వెళ్లి పోదాం పిల్ల చదువుకోసం అని

మొగుడ్ని సతాయిస్తూ ఉంటుంది అని కూడా చంద్రయ్యకు తెలుసు. ఎందుకూ?

చదివించడానికి కాదు. సోకు చేసుకుని సినిమాలు, బజారులు, బలాదూరుగా తిరగొచ్చని.

కలికాలం మరి !!

ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లోనుంచి బస్సులు ఏవీ లేని రోజుల్లో కాలినడకన గుట్టల్లో

నడిచి పోయి, ఎంతో మంది పిల్లలు పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు. చదివించాలని

పట్నం వెళ్లిన వాళ్ళు ఎందుకూ పనికి రాకుండా పోయిన వారూ ఉన్నారు. ఇప్పుడు బస్సు

ఎక్కాలంటే అడివిలో కొంచెం దూరం నడవాల. అంతే! దానికెందుకు పుట్టినూరు వదిలి

​1

పెట్టడం?అని చంద్రయ్య సమర్ధన.

మంచి జాతి కోళ్ళు ఉండేవి, నాలుగు పావురాళ్ళు ఉండేవి, సాయంకాలం మనవళ్ళు

ఆ కోళ్ళుకు, పావురాళ్ళుకు మేత వేస్తూ నవ్వులుతో పరుగులు తీస్తూ పట్టుకోవాలని తనను

కూడా పోరు పెట్టేవారు. కొన్ని బుజాల మీదకు చేతుల్లోకి వచ్చేవి. ఒక్కోదాన్ని గురించి

చంద్రయ్యకు వర్ణించి, వర్ణించి కధలు చెప్పేవాళ్ళు. ఆ కధలు వింటూ ముద్దు మాటలకు

మురిసి మూడు చెక్కలయ్యేవాడు చంద్రయ్య. దీనికి తోడు ‘రాజా’ పెంపుడుకుక్క ఆ

పిల్లలతో పోటీ పడి, పైన ఎక్కి, దొరక్కుండా పరుగెత్తుతూ ఆటలాడేది. తనివి తీరని మదుర

దృశ్యాలే, కమనీయ విందులే,ఎంత డబ్బుపోసినా కొనలేని దొరకని ఆనంద సంతోషాల పాల

సముద్రపు దీవిలో నందనవనం ఆ ఇండ్లు.

కూతుర్ని పక్కూల్లో ఇచ్చాడు. అప్పుడప్పుడు పోయి రెండు మూడురోజులుండి

వస్తుంటాడు. కొడుకు శీనయ్యకు ఇద్దరు మగ పిల్లలు కూతురికి ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళను

వీళ్ళకిచ్చి చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అందరికీ పేర్లు భార్యపేరు

కలిసేటట్లు పెట్టాడు.

మనవళ్ళకు తాతంటే ప్రాణం. రాత్రుళ్ళు కూడా అయన దగ్గరే పడుకుంటారు.

చీకటితో లేచి గంగమ్మ ధార గట్టు మీద వాళ్ళతో నడుస్తూ కలేపండ్లు కోసి పెట్టేవాడు.

పోలేరమ్మ గుడిదాకా తీసుకెళ్ళి వెలక్కాయలు పడుంటే ఏరుకొని వచ్చె వాళ్ళు . నేరేడు పండ్ల

కాలంలో అవి తెచ్చుకుంటారు. గట్టుమీద ఉన్న పూలన్నే కోసుకోచ్చే వాళ్ళు. వాళ్ళమ్మ

పాములుంటాయని భయపెడితే తాత ఉంటే దగ్గరకేరావు అని ఆమె నోరు మూసేవారు.

చుట్టూ ప్రక్కగాలలో చంద్రయ్య అంటే ఎంతో గౌరవం. నికార్సయిన మనిషని.అందుకే

పొలం తగాదాలనుంచి ఆలుమగల మధ్యాస్తాలకు ఆయన తీర్పు వేద వాక్కు.

ఒకప్పుడు ఎండా కాలంలో ఎగువగా ఉన్న పై ఊళ్ళ భావుల్లో నీళ్ళు ఎండిపోతే

గంగమ్మధారే పశువులకు మనుషులకు జీవనాడి, బ్రతుకు దారి! లేకుంటే చావులే గతి.

ఇప్పుడు గంగమ్మధారలోని నీళ్ళు టాక్టర్లుతో తోలుకు పోతున్నారు. పసువులన్నీ

అమ్మేసు కున్నారు. పాలు లేవు ఎరువు లేదు, పల్లెల కళ పోయింది. పోరుంబోకులకు ,

పొద్దుకూగలా ఆ టీవీ బొమ్మలు చూసి సోమరిపోతులైన ఆడోళ్ళకు పిలిచి పిలిచి

డబ్బులిస్తున్నారు. ఏందో ఈ గవర్మెంటోళ్లు ఒక ఆవు ఉంటే ఇంత, నాలుగు గేదేలుంటే

ఇంత అని డబ్బు యిస్తే, పంటకు పంట ,మంచి ఆహారం ఆరోగ్యం. దేశం శశ్యశ్యామలమై

ఉండదా! మొగుళ్ళు తాగుళ్ళు , పెళ్ళాళ్ళు తిరుగుళ్ళు. పల్లెలు వ్యసనాల కుంపట్లు గా,

తిరుగుబోతుల తోటలుగా తయారు చేసింది.

గంగమ్మ ధారా కింద కామందుల పొలాలు. చంద్రయ్య చుట్టూ అందరూ ఎకరా, అర

ఎకరా రైతులు. చంద్రయ్య మాట జవ దాటరు. కానీ కాలం మారే కొద్ది తాగుడు, దొంగతనం

అలవాటు చేసుకున్నారు. ఈ మద్య కోళ్ళు రెండు కనిపించ కుండా పోయాయి, గడ్డి

దొంగలించుకు పోయారు. విచారిస్తే పలానా అని తెలిసింది. అయినా పోయేకాలం

దాపురించిందడని సర్దుకున్నాడు చంద్రయ్య.

ఒక రోజు ఉదయాన్నే పెద్ద తామరలతో నిండి కళ్ళు చెదిరేలా ఉన్న గంగమ్మధార

దగ్గర నిలుచుని లోకాన్ని మరిచి పోయిన చంద్రయ్యకు కార్లు, మోటార్లు వచ్చి నిలిచిన

శబ్దాలు విని తిరిగి చూసాడు.

ఆ బళ్ళల్లోనుంచి తాళ్ళు, గడలు తీసుకుని, మనుషులు కొలతలకు పూనుకున్నారు

ఇంటి ముందు దాక వచ్చేసారు. ఏవిటని నిలదీస్తే పెద్ద రోడ్డు వేస్తున్నాము మీ ఇంటి దగ్గరగా

వస్తుంది అన్నారు. వేపమాను, పోలేరమ్మ గుడి, మామిడి చెట్టు, వెలగ చెట్టు, గంగమ్మ ధారో

అనడిగాడు. అన్నీ పోతాయి అన్నారు తేలిగ్గా! ఉగ్రుడయి పోయాడు చంద్రయ్య. నోటీసు

ఇచ్చాము అన్నారు.కొడుకు వైపు చూసాడు.

కోపంతో ఉన్న తండ్రిని చూసి,” పెద్ద రోడ్డోస్తాది ,బస్సులు మీ ఇంటి ముందుకే

వస్తాయి, అంటే .., !’ ఆ మాట మధ్యలోనే నిలిపెసాడు.

​2

“ఎట్లా చెపుతావు. ఆ తల్లులు పోతే మన కొంప ఏమవుతుంధో తెలుసా? రాత్రిళ్ళు తెల్ల

వార్లు లారీల శబ్దాలతో నిదరుండదు. ఆ పొగతో, బిడ్డలకు మనకు జబ్బులొస్తాయి, ఈ గాలి

నీరు పాశానం అయి పోతాయి. తాగుబోతులు సగం రాత్రి పూట తలుపులు తడతారు.” అని

అరిఛి, వాళ్ళను తరిమేసాడు.

మరుసటి రోజు ఆ కాంట్రాక్టర్ పెద్ద పెద్ద కారుల్లో దూరంగా దిగి మనిషిని పంపి

చంద్రయ్యను పిలుచుకు రమ్మంటున్నాడని చెప్పారు . ఆయనకు పనుంటే రమ్మను అని

వచ్చిన వాళ్ళను విసుకున్నాడు, చంద్రయ్య. విషయం తెలిసి ఊళ్లోనుంచికూడా చాలా

మంది వచ్చారు.

దర్జా చూపిస్తూ వెనక పదిమందిని వేసుకుని వచ్చాడు ఒకతను . మర్యాదగా మంచం

వేసి కూర్చోమన్నాడు.

“ఏంది పెద్దాయనా! నేనే కాంట్రాక్టు తీసుకున్నా! కొలతలకు అడ్డు పడ్డావంటనే!

గవర్నమెంటు వారే

ఏసుకోమంటే మధ్యలో నీదేన్ధంట . మీకు స్థలాలు ఇస్తారు.డబ్బు ఇస్తారు. గుట్టుగా చెప్పినట్టు

ఇను. లేకపోతే ఆ ఇండ్లు కూడా తోయిన్చేస్తా!” అన్నాడు దబాయింపుగా.

చంద్రయ్య కోపంతో రగిలిపోయాడు.

అతన్ని అసహ్యంగా చూస్తూ, “లేయ్యా! లే! పో ... ఎల్లిపో! నా ఇండ్లు కూలుస్తావా?

ఎయ్యనివ్వను. ” చాలా ఖచ్చితంగా అంటూ కర్ర తీసుకుని లేచాడు.

చంద్రయ్య మాటల్లోని లెక్క లేనితం, మొండి తనానికి చంపేటట్టు చూసాడు

కంట్రాక్టర్.

‘“చూసినావు పో ! పోయి, ఏరే మార్గం చూసుకో.ఎళ్లు. లెగు.”

“అంతేనా! అంతేనా! మంచి జరగతాది. నీ కొడుకుని పనిలో పెట్టుకుంటా!”

“ఒకరికింధ పని చెయ్యాల్సిన ఖర్మ పట్టలే! నువ్వు రా నేను పెట్టుకుంటా. కష్ట పడితే,

ఉండే జబ్బులు పోతాయి. మంచి బుద్ది వస్తాది, కొవ్వు తగ్గతాది.”

“ ఏం మాట్లాడుతున్నావురా ముసిలోడ, మక్కెలు ఇరగ తంతా!” అంటూ విసురుగా

కొట్టేటట్లు ముందుకు వచ్చాడు.

చంద్రయ్య మనుషులు కోపంతో లేచారు. వాళ్ళను అడ్డుకొని మళ్ళీ వచ్చావంటే తిరిగి

పోలేవు అని గట్టిగా చెప్పాడు .

“చూస్తాను. ఎట్టా ఇవ్వవో. తలలెగిరి పోతాయి.” అంటూ కోపంతో అరుస్తూ

వెళ్ళిపోయాడు కంట్రాక్టరు.

“ ఎట్లాగయినా పెరుక్కుంటారు. ఎందుకు వాళ్ళతో గొడవ ఇచ్చేస్తే పోలా”

అన్నారెవరో. దాంతో అతన్ని నానామాటలు అని, కలిసికట్టుగా ఉండాలని అందరిచేత

ప్రమాణాలు చేయించుకున్నాడు.

చంద్రయ్య ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు. దూరంగా కొడుకు ఆందోళనగా

నిలుచుని చూస్తున్నాడు. రాత్రి నిదురపోలేక పోయాడు.

మూడు నాలుగు రోజులు వాళ్ళు రాలేదు . కట్ట కింద కనిపించారు. పోనీలే

గంగమ్మధారకు పట్టు ఉంటుందని అనుకున్నాడు. కానీ ఊళ్ళో మిగిలినోళ్ళతో మంతనాలు

చేస్తున్నారని విన్నాడు.

ఆ తరువాత వారానికి కలెక్టరు, ఆ కాంట్రాక్టర్ తో వచ్చాడు. “ పెద్దాయనా! అన్నీ

ఆలోచించి ఈ దారి అయితే బాగుంటుందని నిర్ణయించాము, నువ్వు అడ్డు చెపితే ఎట్లా?”

అన్నాడు కలెక్టర్ .

అయిష్టంగా ఉన్న చంద్రయ్యను చూసి,“రా! వచ్చికూర్చో. దేశం అభివృద్దిలోకి

రావాలంటే మనం చిన్న చిన్న త్యాగాలు చెయ్యాలి. ఇది అందరికోసం.” అని పిలిచాడు.

నమస్కారం చేసి,” బాబు గారు కట్టకింద చాలా పోరుంబోకు ఉంది, అది మీదే! అట్లా

వేసుకుంటే మాకు ప్రాణ బిక్ష, అన్న భిక్ష పెట్టినోల్లు అవుతారు. నేనీయడం జరగదు.”

మొహమాటం లేకుండా చెప్పాడు చంద్రయ్య .

​3

“ అట్లా అంటే ఎలా! అదీ చూసాము. ఐదు మైళ్ళు చుట్టవుతుంది. పైగా కొండల్ని

పగల గొట్టాలి. పర్యావరణం వాళ్ళు వొప్పుకోరు.”

“చెట్లు కొట్టడానికి ఒప్పుకుంటారా? మంచి నీటి గుంట పూడ్చడానికి ఏవీ అనరా?

తరతరాల మా నమ్మకాన్ని చంపితే పరవాలేదా ! మా వంశాల గుర్తులు ఆ స్మశాన పుణ్య

భూమిలో ఉండాయి. అది నమ్మి బతికే మా గుండెల్లో నిప్పులు పోస్తే పరవా లేదా! మమ్మల్ని

ఈదిలో ఏస్తారా? ”

“మళ్ళీ చెట్లు నాటుతాం. చెరువులు తవ్విస్తాం. మీకు పని కల్పిస్తాం. నా మాట విను.”

“మన్నించండయ్యా! ఈ ఏప చెట్టు, గంగమ్మ ధారా, మా తాతల కాలం నాటివి . మా

ఇలవేల్పులు. కోరుకుంటే కోటి కోరికలు అప్పటికప్పుడే తీర్చే తల్లులు . అలాంటి దైవాలను

నాశనం చేస్తే పుట్టగతులుండవు. మా తల్లుల్ని నేను బతికుండగా చంప లేను. ” కన్నీళ్లు

పెట్టుకున్నాడు చంద్రయ్య .

కలెక్టరు,” ఆలోచించు.పదిమంది కోసం ...!”అన్నాడు.

“ఒక చెట్టు ఇంత ఎదగాలంటే ఎన్ని సవత్సరాలు పడతాది. మూడూళ్ళకు గంగమ్మ

ధార ఆ తల్లి, మళ్ళీ మాకియ్యగలరా? మీ తల్లిని అడిగితే మీరిస్తారా?” ఆయన వైపు బెదురు

లేకుండా చూస్తూ అన్నాడు చంద్రయ్య

వింటున్న వాళ్ళు అవాక్కయ్యారు. దూరంగా ఉన్న కాంట్రాక్టరు,” ఏం కూసావురా!

ముసలోడా!” అంటూ ముందుకు దూకాడు. కలెక్టర్ ఆపాడు. అలాగే చంద్రయ్యను చూస్తూ

ఆలోచిస్తూ ఉండిపోయాడు కలెక్టర్.

గాఢంగా నిట్టూర్పు వదిలి లేస్తూ,” సరే చూద్దాం. మరో మార్గ ముందేమౌ ? మీ

నమ్మకాల్ని, అనుబంధాన్ని, నేను అవమానించలేను.” అని లేచాడు.

” నెత్తురు పారకుండా చూడండి సామీ.” అంటూ కంట్రాక్టర్ని లెక్కలేనట్లు చూస్తూ

కలెక్టర్కి నమస్కారం చేసాడు.

కాంట్రాక్టర్ వైపు చూసి చంద్రయ్య వైపు తిరిగి భయం లేదన్నట్లుగా నవ్వాడు కలెక్టర్ .

ఒక ఆర్నెల్లు దాని జోలికి రాలేదు. చంద్రయ్య స్థిమిత పడ్డాడు.చాలా

రోజులయ్యిందని కూతుర్ని చూసి అని మనవళ్ళను తీసుకుని బయలు దేరాడు. కూతురు

దగ్గర వారం రోజులుండి సంతోషంగా ఇంటికి బయలు దేరాడు.

దార్లో ఎన్ని కధలు ,కొట్లాటలు చెప్పారో మనవళ్ళు అత్త కూతుర్ల పైన . మురిసి

ముక్కలైపోతు ఇల్లోచ్చిందే గమనించ లేదు. పోలేరమ్మ గుడికాడికి వచ్చిన తరువాత ఏదో

బోసిగా కనిపించింది. ఇంటి వైపు చూసాడు.ఆ మసకలో ఏం కనిపించ లేదు. ఒక్క లగువున

ఇంటి ముందుకొచ్చాడు. వేపమాను లేదు. గంగమ్మధార మడుగులో నీళ్ళు లేవు. నా

బతుకమ్మా అంటూ ఒక్కసారిగా ఇరగబడి పోయాడు. పిల్లల అరుపులతో వాళ్ళ అమ్మా

నాయన పరుగెత్తు కొచ్చారు..

ఉదయం స్మశానం వెళ్లి వస్తున్న మనుషులకు. పిల్లలిద్దరూ ఏడ్చి ఏడ్చి కళ్ళు

ఉబ్బిపోయి ఎదురు వస్తూ కనిపించారు.

ఎక్కడికిరా అనే సరికి, తాత దగ్గరకు అంటూ పరుగులు పెట్టారు.” పోకూడదురా...

పోకూడదురా!” అంటున్నా “తాతకిచ్చి వస్తాం.” అంటూ ఎందరు పట్టుకున్నా నిలవ లేదు.

ఇద్దరి చేతుల్లో వేప మొలకలు కనిపించాయి.

*** శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.. నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.



54 views0 comments

Comments


bottom of page