'Kanipinche Devatha' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 23/09/2024
'కనిపించే దేవత' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఏమే! రంగీ! నీవు నాలుగిళ్ళల్లో కష్టపడి పనిచేసి సంపాదిస్తున్నావు కదుటే! ఇప్శటికైనా ఏమన్నా నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నావా?" అడిగింది సరోజ, పనిమనిషి రంగిని.
"లేదమ్మా! ఏడ సరిపోద్దమ్మా! నేను కష్టపడి సెవటోడ్చి సంపాదిచ్చిందంతా ఇంటి అద్దె, మా మావ తాగుడు, పిల్ల సదువుకే సరిపోద్దమ్మా! ఆ ఎదవని తాగొద్దంటే ఇనడాయే. పైగా ఏ పనీ సేయడాయె. ఇంక ఆ భగవంతుడే వాడిని, వాడి మనసుని సరిసేయాల " అని తన మనసులోని గోడును వెళ్ళబోసుకుంది రంగి.
నాలుగేళ్ళనుంచి తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న రంగి పరిస్థితి తెలుసుకనుక సరోజ ఆమెను చాలా వరకూ కనిపెట్టుకుంటూ ఉండటమే కాక తనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా దానికి పని ఇప్పించింది. దాని మొగుడు సత్తయ్యను పిలిచి చాలా సార్లు మందలించింది సరోజ. అయినా వాడి ధోరణి మారలేదు.
"ఎల్లొత్తానమ్మా"! అన్న రంగి మాట విని "సరే! రేపు కొంచెం ముందుగా రా!" అని చెప్పి రంగిని పంపింది సరోజ. ఇలా రోజులు గడుస్తున్నాయి. తాగుడు ఎక్కువయ్యి కొన్నాళ్ళకు సత్తయ్య చనిపోయాడు. రంగి, దాని కూతురు దీప దిక్కులేని వారైతే సరోజ వాళ్ళకు కొంత డబ్బు సర్ది దీపను తనే చదివిస్తోంది.
దీప చక్కగా చదువుకుని డిగ్రీ పూర్తి చేసి ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకుని తన తల్లికి సాయంగా ఉంటోంది. స్వతహాగా బుధ్ధిమంతురాలైన దీప ఇంకా పై చదువులు చదవాలనే తన కోరికను సరోజ వద్ద వెళ్లబుచ్చింది. అందుకు సరోజ చాలా సంతోషించి దీపని పై చదువులకు చదివించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది సరోజ.
దీప ఆ చిన్న ఉద్యోగం మానేసి చదువుపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. మంచి యూనివర్సిటీలో పిజి సీటుకి దీపచేత అప్లై చేయించింది సరోజ. కొన్నాళ్లకు అదృష్టవశాత్తు దీపకి యూనివర్సిటీ లో తను కోరుకున్న గ్రూపులో సీటు రావడం, దీప అందులో చేరడం జరిగాయి. రంగి ఆనందానికి అవధులు లేవు. వాళ్లిద్దరినీ తన వద్దే ఉండమని కోరింది సరోజ.
అందుకు అంగీకరించి దీప తన తల్లితో సరోజ ఇంటికి చేరింది. దీప చక్కగా చదువుతూ మరో రెండు సం..లకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసింది. కొన్ని నెలల తర్వాత అదే కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఖాళీ ఉంటే అందులో చేరింది దీప. ఆ యూనివర్సిటీ లో యాజమాన్యం వాళ్లు దీప ప్రతిభాపాటవాలను గుర్తించడమే అందుకు దోహదం.
ఆ శుభవార్తను రంగికి, సరోజకు చెప్పి వాళ్ల ఆశీస్సులు తీసుకుంది దీప. చక్కగా రోజూ ఉద్యోగానికి వెళుతూ ఇంట్లో ఉన్న కాసేపు సరోజకు సాయపడుతూ తన వినయవిధేయతలతో ఆమె మనసుని మరింత దోచుకుంది దీప.
తనకు పిల్లలు లేని లోటును దేవుడు దీప రూపంలో తనకు తీర్చాడని మనస్ఫూర్తిగా ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది సరోజ.
తన తొలి జీతాన్ని తీసుకొచ్చి సరోజ చేతికిచ్చి ఆమె పాదాలకు నమస్కారం చేసింది దీప. సరోజ ఆమెని పైకి లేవనెత్తి కన్నతల్లి అయిన రంగికి దీపచేత నమస్కారం చేయించింది. ఆమె పెద్ద మనసుకు రంగి చాలా సంతోషించింది. మరో ఏడాది తర్వాత రంగి అంగీకారంతో దీపని దత్తతకి తీసుకుని ఆమె పేరున తన ఆస్తిని రిజిస్టర్ చేయించింది సరోజ.
తనకు తెలిసిన మంచివాడు, అనాధ, మంచి ప్రతిభావంతుడైన లెక్చరర్ రమేష్ కు దీపనిచ్చి పెళ్లి జరిపించింది సరోజ. వాళ్లిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు.
కొన్నాళ్లకు వాళ్ళిద్దరూ ఇంకా మంచి జీతంతో వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. రంగిని, సరోజని కూడా రమ్మంటే సరోజ తను రాలేను, కడదాకా తను ఈ ఇంట్లోనే ఉంటానంది. రంగి కూడా తను పుట్టి పెరిగిన ఆ ఊరునొగ్గి రానంది. చేసేది లేక వాళ్ళు వెళ్ళారు.
రంగి దీపని తలుచుకుని ఇంక ఒంటరిగా బాధపడకూడదని రంగికి అక్షరాలు నేర్పి చదువు చెప్పింది సరోజ. తన ఇంట్లో కంప్యూటర్లో దానికి శిక్షణని ఇచ్చి ఆన్లైన్ లో డబ్బులు సంపాదించటం ఎలాగో నేర్పింది. స్వతహాగా తెలివైన రంగి చక్కగా అవన్నీ నేర్చుకుని కొన్నాళ్లకు కంప్యూటర్ లో ఆన్లైన్లో ఉపాధి పొందుతూ హాయిగా ఉంటోంది. రంగి కంప్యూటర్ లో వీడియో కాల్ చేస్తూ ఇప్పుడు తన కూతురు - అల్లుడితో కూడా చక్కగా మాట్లాడుతోంది. తల్లిని చూసి చాలా గర్వపడుతోంది దీప.
తన కాళ్ళ మీద తను నిలబడేలా చేసి తన జీవితాన్ని నిలబెట్టిన తన యజమాని సరోజ అంటే రంగికి చాలా భక్తి, గౌరవాభిమానం. దీపకి ఇంక సరోజ సాక్షాత్తూ దేవతే. ఆ తల్లి కూతుళ్లు సరోజకి తమ మనసులలో కోవెల కట్టి అందులో దేవతగా ఆమెని కొలుస్తున్నారు.
"దేవత అంటే ఎక్కడో లేదు. మా సరోజమ్మే మాకు కనిపించే దేవత. ఎన్ని జన్మలెత్తినా ఆయమ్మ ఋణం తీర్చుకోలేము" అంటున్నారు రంగి, దీప అందరితో.
.. సమాప్తం ..
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Comments