top of page

కరుణాసాగరం



'Karunasagaram' - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri

Published In manatelugukathalu.com On 09/03/2024

'కరుణాసాగరం' తెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



9 ఏళ్ల వయసున్న చిన్న కుర్రాడు సాగర్. ఆ పసి బాలుడి అమ్మానాన్న ఒక భవంతి దగ్గర ఇటుకలు మోస్తూ, కూలి పని చేసుకుంటున్నారు. సాగర్ కు రోజు మెయిన్ రోడ్డు మీద ఉన్న షాపులను చూస్తూ, కాలం గడపడం ఇష్టం. ఆరోజు చాలామంది పిల్లలు స్కూలుకు వెళ్తూ, సరదాగా గంతులు వేస్తూ, చక్కని బట్టలతో నీటిగా వెళ్లడం చూసి, ‘అయ్యో దేవుడా! నాకు కూడా మంచి బట్టలు బూట్లు ఇవ్వలేవా?’ అంటూ మనసులోనే బాధపడుతూ, ‘మా అమ్మ నాన్న కూలి డబ్బులతో గంజినీళ్లు కూడా ఒక్కొక్క రోజు కరువయ్యేవి, నాకు ఎలా కొంటారు నేను ఎలా చదువుకుంటాను?’ అన్న మాటలు ఆ పసి మనసులో మెదులుతూ ఉండేవి. 


ఆ రోజు కూడా రోజు లాగానే, ఒక 'స్పోర్ట్స్ షాపు ముందు నిలబడి, గాజు అద్దాల, లోంచి లోపలికి చూస్తూ, అక్కడకు వచ్చే తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చినవి చూపిస్తూ కొనడం, ఆ పిల్లలు అవి వేసుకుని, షాప్ అంతా సరదాగా పరిగెడుతూ చిందులు వేయడం, చూస్తూ ‘అయ్యో! అమ్మా నాన్న దగ్గర కూడా డబ్బులు ఉంటే, నేను కూడా మంచి బూట్లు కొనుక్కొని, మంచి బట్టలు వేసుకుని చక్కగా స్కూలుకు వెళ్లి చదువుకుంటాను కదా!’, అనుకుంటూ అక్కడే పెద్ద 'వెంకటేశ్వర స్వామి' ఫోటోను చూస్తూ ఆ పసి హృదయం బాధపడుతూ ఉండేది. 


అలా గంటల తరబడి వాటిని చూస్తూ భోజనం సమయానికి అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి అన్నం తింటూ, అమ్మ మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయి, నేను కూడా బూట్లు డ్రెస్ వేసుకొని స్కూల్ కి ఎప్పుడు వెళతాను? అని అమాయకంగా అడుగుతున్న కొడుకును తండ్రి లాలిస్తూ, బాబు సాగర్ !మనలోటోళ్ళకి కూలీ నాలి తప్ప ఏమి చేయలేము రా, ముందు అన్నం తిని వెళ్లి ఆడుకో, అంటూ దగ్గరికి తీసుకుని బాధపడేవారు ఆ తల్లి తండ్రి. 


అలా మర్నాడు కూడా కొంచెం గంజి అన్నం తిని, అమ్మ నేను వెళ్లి ఆ షాపుల దగ్గర ఆడుకుంటాను అన్న సాగర్ ని జాగ్రత్త రా! బస్సులు, స్కూటర్లు ఉంటాయి జాగ్రత్తగా దాటు, మళ్లీ తొందరగా వచ్చేయ్ అని సాగనంపేది తల్లి. 


ఎంతో సంతోషంగా 'నాన్న టాటా! అంటూ పరిగెత్తుకు వెళ్లి, తన లూజ్ అయిపోయిన నిక్కర్ను పైకి లాక్కుంటూ, మాసిపోయిన టీ షర్ట్ ని దులుపుకుంటూ, అదే స్పోర్ట్స్ షాప్ బయట గాజు అద్దాల్లోంచి లోపల ఉన్న బూట్లు, బట్టలను చూస్తూ నిలబడ్డాడు సాగర్. 


రోజు ఆ వైపుగా ఆఫీస్ వెళ్తున్న' శరణ్య 'కూడా గత వారం రోజుల నుంచి ఆ చిన్న అబ్బాయిని గమనించడం, ‘ఎందుకు ఆ అబ్బాయి కాళ్లు నొప్పులు పుట్టేలా గంటలు తరబడి నిలబడి ఆ షాపు లోపలికి చూస్తున్నాడు? ఈరోజు ఎలాగైనా ఆ అబ్బాయిని అడగాలి!’ అనుకుంటూ “ఒరేయ్ బాబు! నీ పేరేంటి రా!” దగ్గరికి వచ్చి అడిగింది శరణ్య.


“అక్కా! నా పేరు సాగర్, నేను రోజు వస్తాను ఇక్కడ పిల్లలు కొంటున్న బూట్లు చెప్పులు చూస్తుంటాను”, అని చెప్పి మళ్ళీ ఆశగా ఒక తల్లి తన పిల్లాడు ఇవి వద్దు, ఇవి కావాలి! అంటూ మారాం చేస్తూ ఉండడం, ఆ తల్లి విసిగిపోయి వాడికి కావాల్సిన బూట్లు, బట్టలు కొనడం గంటల పట్టి గమనిస్తూ ఉండటం చూసిన శరణ్య, “సాగర్! నీకు కూడా అలాంటివి కావాలా, , అయినా మీ అమ్మానాన్న ఏరి?” అని అడిగేసరికి ఆ షాపుకు దగ్గరలో ఉన్న 'పది అంతస్తుల భవనం 'కట్టడం వేపు చూపిస్తూ, “అదిగో అక్కా! అమ్మానాన్న అక్కడ ఇటుకలు మోస్తున్నారు, నన్ను రానివ్వరు. భోజనం సమయానికి వెళ్లాలి! అందుకే ఇక్కడ ఉండి బోల్డు మంది పిల్లలు రావడం, బూట్లు, బట్టలు కొనడం చూస్తూ ఉంటాను”, అని అమాయకంగా సాగర్ చెప్పేసరికి శరణ్య మనసు ద్రవించిపోయింది. 


అందులోనూ ఎంతో ప్రేమగా 'అక్క' అని పిలుస్తున్న ఆ పసివాడిని దగ్గరికి తీసుకుని, “సరే రా షాప్ లోకి వెళ్దాం!” అని అనగానే, “అక్కా!  నేను ఎన్నోసార్లు లోపలికి వెళ్లాను, కానీ వాళ్లు నన్ను బయటకు గెంటేశారు, డబ్బున్నోళ్ళే వెళ్లాలట”, అని దీనంగా చెప్పేసరికి, “సరే నువ్వు నాతో రా!” అంటూ చేయి పట్టుకుని లోపలికి వెళ్ళగానే, అక్కడ ఉన్న సేల్సమెన్, “గుడ్ మార్నింగ్ మేడం! ఏం చూపించమంటారు?” అంటూ అతి వినయంగా అడిగేసరికి, “ముందు నా తమ్ముడికి కావలసిన బూట్లు, డ్రెస్సులు చూపించండి!” అని అడగగానే నిమిషాల్లో అన్ని రకాలు చూపించేసరికి, “సరే సాగర్, నీ కావలసింది తీసుకో, డబ్బులు గురించి బాధపడకు”, అంటూ ఆ చిన్నవాడు ఎంచుకున్న బూట్లు, మంచి డ్రెస్ సెలక్ట్ చేసి, ఆ సేల్స్ మాన్ ని పిలిచి 'మీ వాష్ రూమ్ ఎక్కడ ఉంది? ఆ పిల్లవాడిని శుభ్రం చేసి, ఈ బూట్లు డ్రెస్ వేయాలి అనే సరికి, “ఓకే మేడం రండి!” అంటూ వాష్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడున్న సోపు, టవలు చూపించి వెళ్లిపోయాడు. 


ఏమీ అర్థం కాని అమాయక పసివాడు సాగర్ అక్క శరణ్య చెప్పినట్టు శుభ్రంగా మొహం కాళ్లు చేతులు కడుక్కొని, కొత్త బట్టలు, కొత్త బూట్లు వేసుకుని, “అక్క, ఇవి చాలా బాగున్నాయి, కానీ ఇవి వేసుకుని వెళ్తే, మా అమ్మ నాన్న ఎక్కడ దొంగతనం చేసావురా? అంటూ చంపేస్తారు, వద్దులే అక్క”, అంటూ అనేసరికి శరణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగి, “నీకేం పర్వాలేదు! నేను వచ్చి మీ అమ్మానాన్నతో మాట్లాడి, నిన్ను స్కూల్లో చేర్పించి చదివిస్తాను. బాగా చదువుతావా?” అని అడిగేసరికి “అక్క! నిజంగా బాగా చదువుతాను, నేను అందరి పిల్లల లాగా ఆడుకుంటూ, పాడుకుంటూ బాగా చదివి అమ్మానాన్న కూలి పనికి వెళ్లకుండా ఉద్యోగం సంపాదించి, నీతో పాటే ఉంటాను అక్కా”, అంటూ శరణ్యని గట్టిగా పట్టుకొని అన్నాడు సాగర్. 


శరణ్య కూడా తన చిన్నతనంలోనే పోయిన తన తమ్ముడి గురించి బాధపడుతూ, “ఒరేయ్ సాగర్! నేను నీ అక్కను కదా! నీకు అన్నీ నేను చూసుకుంటాను, ఈరోజు నుంచి నువ్వు బాగా చదువుకోవాలి”, అంటూ దగ్గరికి తీసుకొని కొత్త బూట్లు కొత్త డ్రెస్ తో మిలమిలా మెరిసిపోతున్న తన తమ్ముడి నుదుటి మీద ముద్దు పెట్టుకుని, పద అంటూ షాపులో బిల్లు చెల్లించి, సాగర్ తల్లి తండ్రి దగ్గరకు వెళ్లి “చూడండి !ఈరోజు నుంచి సాగర్ నా తమ్ముడు, వీడిని స్కూల్లో జాయిన్ చేస్తాను, అన్ని విధాలుగా వాడికి తోడు ఉండి, నేను చదివిస్తాను మీరు ఒప్పుకోవాలి, మీరు కూడా నాకు అమ్మానాన్న లాంటి వాళ్లే, రోజు స్కూలుకి వాడిని తయారుచేసి, మీ పనుల మీద మీరు ఉండండి!” అని వాళ్ళకి చెప్పగానే “అమ్మా! నీ అంత సహృదయరాలు, మా అబ్బాయికి 'అక్కగా’' దొరకడం ఆ భగవంతుడి దయ అంటూ ఎంతో సంతోషపడ్డారు. 


“ఒరేయ్ తమ్ముడు! రేపు రెడీగా ఉండు, నిన్ను స్కూల్ కి తీసుకు వెళ్తాను”, అని అనేసరికి“అక్కా, నేను రోజు ఆ షాపు దగ్గర ఉన్న 'వెంకటేశ్వర స్వామి’ దేవుడికి ‘నాకు ఇవి కొని పెట్టవా?’ అని అడిగేసరికి, ఆ 'వెంకటేశ్వర స్వామి' నిన్ను పంపించాడా, నాకన్నీ కొనమని”, అన్నమాట శరణ్య చేతులు పట్టుకొని పసివాడు సాగర్ అడిగేసరికి, “అవున్రా తమ్ముడు, నాకు ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు, అందుకే నీకు అన్నీ కొనమని, బాగా చదివించమని ఆ దేవుడు నాకు చెప్పాడు”, అనేసరికి సాగరు వాళ్ళ అమ్మానాన్న కూడా ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేస్తూ, “ఏదైనా భగవంతుని దయ. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు, ఆ దేవుడు పంపగా వచ్చిన దేవత వమ్మ నువ్వు”, అంటూ శరణ్యకు కృతజ్ఞతలు తెలిపారు సాగర్ తల్లిదండ్రులు. 

ఆ కలియుగ వెంకటేశ్వరుడు మనుషుల్లోని మానవత్వాన్ని పునరుద్ధరింపజేశాడు.   **********************

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం : 

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  



43 views0 comments
bottom of page