top of page

పుట్టలోని చెదలు'Puttaloni Chedalu' - New Telugu Story Written By Ch. Pratap  

Published In manatelugukathalu.com On 08/03/2024

'పుట్టలోని చెదలు' తెలుగు కథ

రచన: Ch. ప్రతాప్ 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ఉదయం ఆరు గంటలౌతోంది. అప్పుడే తూర్పు దిక్కున తెల్లవారింది. పక్షులు పెరట్లో వున్న జామ చెట్టు మీదకు చేరి కిల కిల రావాలతో తమ సందడి ప్రారంభించాయి. ధ్యానం ముగించుకున్న విశ్వనాథం పెరట్లో కి వచ్చి అప్పుడే ఉదయించిన సూర్య భగవానుడికి నమస్కారం చెసుకొని వంటింట్లోకి వెళ్ళి కాఫి కలుపుకొని, ఆరుబయట వాలు కుర్చీలో కూర్చొని పేపరును చదవడం ప్రారంభించాడు. పక్కనే పోర్టబుల్ సి డి ప్లేయర్ నుండి ఎం ఎస్ సుబ్బ లక్ష్మి అతి శ్రావ్యం గా ఆలపించిన విష్ణు సహస్ర నామం అతి మంద్రం గా వినిపిస్తూ మనస్సుకు అనిర్వచనీయమైన అనుభూతినిస్తొంది. 


బెడ్ రూం లో అతని సతీమణి ఆది లక్ష్మి ఆదమరచి నిద్రపోతోంది. నిద్ర మాత్రలు వేసుకుంటున్న కారణంగా ఆవిడ ఏడు గంటలకు గానీ లేవదు. అప్పటికి విశ్వనాథం యొక్క ఈ మొదటి కార్యక్రమం పూర్తయిపోతుంది. 


ఆతని ఆనందానికి భంగం కలిగిస్తూ మొబైల్ ఫోన్ మ్రోగింది. నెంబరు చూడగా చెన్నయి నుండి కొడుకు కిరణ్. “నాన్నా ! నేను చెప్పిన విషయం ఏం చేసారు ?” ఆతృత అతని కంఠం లో ధ్వనించింది. 


ఆ మాట వినగానే విశ్వనాధానికి చిర్రెత్తుకొచ్చింది. వందల మైళ్ళ దూరంలో వున్న వాడు రిటైరైన తండ్రిని, తరచుగా అనారోగ్యంతో బాధ పడే తల్లి యొక్క క్షేమసమాచారాలు అడగాలని ఏ తండ్రయినా కోరుకుంటాడు కానీ తన బిజినెస్ చేసే తన పుత్ర రత్నం తనతోనే బిజినెస్ చేద్దామని చూస్తున్నాడు. 


“ఏమిటి నాన్నా మాట్లాడవు ?” అసహనం ధ్వనించింది కిరణ్ కంఠంలో. 


ఆ మాటలకు ఈ లోకంలోకి వచ్చి పడిన విశ్వనాథం “ ఇంకా ఏమీ ఆలోచించలేదురా”అన్నారు.

 “త్వరగా తేల్చుకొండి నాన్నా, నా దగ్గరకు వస్తే మీకు, అమ్మకు ఏ ఇబ్బంది కలగదని హామి ఇస్తున్నాను. కాని కండిషన్ గుర్తిందిగా ?రెండు రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను” ఫోన్ కట్ చేసాడు కిరణ్. 


ఆతని విచిత్రమైన వైఖరికి గాఢంగా నిటూర్చాడు విశ్వనాథం. వీళ్ళు పిల్లలు కాదు కన్న వారి రక్త మాంసాలు పీక్కు తినే రాబందులు అనుకుంటూ తిరిగి తన దైనిందిన కార్యక్రమంలో పడిపోయాడు. 


ఫది గంటల వేళ శ్రీమతికి వంట పనిలో సాయం చేస్తుండగా మళ్ళీ మొబైల్ మోగింది. ఈ సారి బెంగుళూరు నుండి కూతురు రాధిక. 


“నానా! నేను చెప్పిన విషయం ఏం చెసావు?” అదే ప్రశ్న, ఆమె కంఠంలో అదే ఆతృత. పొద్దున కిరణ్ కు చెప్పినట్టే ఆమెకు అదే సమాధానం చెప్పాడు విశ్వనాథం. 


“త్వరగా తేల్చుకోండి నాన్నా. అమ్మకు అసలే ఆరోగ్యం బాగుండదు. మీరు ఏ ఫెసిలిటీస్ లేని ఈ ఊళ్ళొ వుండి ఒక్కళ్ళు చేసుకోవడం కష్టం. హాయిగా మన దగ్గరకు వచ్చేస్తే ఏ ఇబ్బం ది లేకుండా కాలం గడిపెయ్యవచ్చు. చెన్నయ్ కంటే బెంగుళూరు బాగా డెవలప్ అయ్యింది” ఆఖరు పదాలను వత్తి పలుకుతూ ఫోన్ పెట్టేసింది రాధిక. 


"దరిద్రపు గొట్టు సంతానం. పుట్టకపోయినా బాగుండేది. కడుపున పుట్టి ఇప్పుడు నన్ను పీక్కోవాలని చూస్తున్నారు" అని చీదరించుకుంటూ తిరిగి తన పనిలో మునిగిపోయాడు విశ్వనాథం. 


భర్త పడుతున్న వేదనను అర్ధం చేసుకొని దీర్ఘంగా నిట్టూర్చింది అనసూయ. అసలే హృద్రోగంతో బాధ పడుతున్న ఆవిడ అంతకంటే ఇంకేమి చెయ్యగలదు ?ఇంకం టాక్స్ డిపార్ట్ మెంటులో సీనియర్ టాక్స్ ఆఫీసర్ గా మూడు నెలల క్రితమే రిటైర్ అయ్యి తన స్వగ్రామం అయిన రాజమండ్రిలో సెటిల్ అయ్యాడు విశ్వనాథం. 


స్వంత అపార్ట్ మెంట్ కనిసం ముప్ఫై లక్షలు చేస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక ముప్ఫై లక్షల దాకా వచ్చాయి. అంతే కాక తన సర్వీస్ అంతా కూడా చాలా పొదుపుగా ఖర్చులు పెట్టుకుంటూ మరొక నలభై లక్షల దాకా వెనకేసాడు ఆయన. వెరసి ఆయన ఆస్థి ఖరీదు అక్షరాలా కోటి రూపాయలు. 


కొడుకు కిరణ్ ఇంజనీరింగ్ చదివి చెన్నయ్ లో ఒక వ్యాపార సంస్థలో ఆఫీసర్ గా చేరాడు. కూతురు రాధిక కంప్యూటర్స్ లో ఇంజనీరింగ్ చెసి తన కంపెనీలోనే పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహమడింది. కొడుకు కూతురు ఇద్దరూ జీవితంలో బాగా సెటిల్ అయిపోయారు కాబట్టి తన రిటైర్మెంట్ జీవితం చాలా సాఫీగా గడిచిపోతుందన్న విశ్వాసంతో వున్నాడు విశ్వనాథం. 


అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందనట్లు వారి సంతానం కళ్ళు ఆయన ఆస్తి మీద పడింది. తల్లి దండ్రులను తమ వద్ద వుంచేసుకుంటే మహా అయితే ఇంకొక పదేళ్ళు బ్రతుకుతారు. ఆ కాలానికి ఆస్థి విలువ రెండు రెట్లు పెరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోయేలోగా వారి ఆస్థి తమ పేరిట రాయించేసుకుంటే ఇక జీవితమంత కాలు మీద కాలేసుకొని దర్జాగా బ్రతికెయ్యవచ్చు అన్నది వారి ప్లాన్. 


అందుకే నా దగ్గరకు రమ్మంటే నా దగ్గరకు రమ్మని బలవంత పెట్టసాగారు. అయితే వారి తర్వాత ఆ ఆస్థి అంతా తమకే ఇవ్వాలన్నది వారి కండిషన్. తల్లి దండ్రుల ప్రాపకం సంపాదించుకోవడానికి కిరణ్ రాధికలిద్దరూ తీవ్రంగా పోటీ పడసాగారు. అందువలనే వారి ఇద్దరి కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి వచ్చింది. 


విశ్వనాథం ఏ సమాధానం ఇవ్వకుండా మిన్నకుండి పోయేసరికి కిరణ్ రాధిక ల దగ్గర నుండి వత్తిడి పెరగసాగింది. ఆస్థి తీసుకొని మా దగ్గరకు వస్తావా లేక ఒంటరిగా చస్తావా అని వేధించడం మొదలెట్టారు. కిరణ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మీరు గనక ఇప్పుడు నా దగ్గరకు రాకపోతే ఇక జన్మలో మీ ముఖం చూడనని బెదిరించాడు. 


నీ లాంటి చేతకానివాడికడుపున పుట్టినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలని అన్నాడు. రాధిక కూడా అంతే పరుషజాలం తో వారిని బెదిరించింది. రెండు కోట్ల ఆస్తి అన్నయ్య ఒంటరిగా ఎగరేసుకుపోతాడేమోనన్న భయం ఆమెను నిలువునా ఆవహించింది. 


అయినా విశ్వనాథం లో ఉలుకు పలుకు లేదు. ఏం చేస్తే ఏం జరుగుతుందోనన్న భయం అతనిది. టన కొలీగ్స్ లో కొంతమంది ఇలాగే ఆస్థిని కన్నవారికి అప్పజెప్పాక తర్వాత వారికి ఏ దుస్థితి దాపురించిందో కళ్ళారా చూసాక తన విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

 

ఒక వారం రోజుల తర్వాత కొడుకూ కూతుళ్ళిద్దరూ కూడబలుక్కొని రాజమండ్రి వచ్చేసారు. కుసల ప్రశ్నలు అయ్యాక తమ ప్రపోజల్ ఏమి చేసావని తండ్రిని నట్టింట్లో నిలదీసారు. మన మధ్య మనస్పర్ధలు కారణంగా నష్టపోయేది తమేనని అందువలన మాచ్ ఫిక్సింగ్ చేసేసుకొని ఇద్దరిని చెరో ఆరు నెలలు తమ వద్ద వుంచుకొని అస్థిని రెండు వాటాలుగా పంచుకుందామని ఒక ఒప్పందానికి ఇద్దరూ వచ్చారు. 

"నేనూ మీ అమ్మ ఎంతో ఇష్టపడి ఈ అపార్ట్ మెంటును రిటైర్ అయ్యాక వుందామని కొన్నుకున్నాము. పైగా ఈ వూరు అంటే మా ఇద్దరికీ ఎంతో ఇష్టం. ఇక్కడే మా శేష జీవితం గడపాలను కుంటున్నాము. పైగా మీరు వుండే పెద్ద పెద్ద వూళ్ళలో మాకు ఏమీ తోచదు. ఈ వృద్ధ్యాప్యంలో అటువంటి కష్టాలు పడలెము. ఇక ఆస్థంటారా! మా తదనంతరం అది మీకే వస్తుందిగా. అందుకని ఇప్పుడు మమ్మల్న్ ఇబ్బంది పెట్టకండి " ఇద్దరికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు విశ్వనాథం. 


అనుకోని ఆ సమాధానానికి కొరణ్ రాధికలిద్దరూ స్టన్ అయిపోయారు. పరిస్థితి చెజారిపోయేలా వుందని ఇక లాభం లెదనుకొని ఎదురుదాడిగి దిగి “మీరు గనక రాకపొతే మాతో ఇక ఏ విధమైన సంబంధం వుందదు, మీదారి మీదే, మా దారి నాదే, ఏ రోగం రొష్టు వచ్చినా మమ్మల్ని పిలవకండి” అని అరిచారు. 


కిరణ్ అయితే తండ్రి కాలర్ పట్టుకున్నాడు. జరిగే దానంతటినీ సంభ్రమంగా చూస్తున్న అనసూయ భర్తను విడిపించడానికి ముందుకు వచ్చింది. భర్త చొక్కాను కొడుకు చేతుల్లో నుండి విడిపించడానికి ప్రయత్నించింది. ఆసలే ఆవేశంలో వున్న కిరణ్ ఆమెను పక్కకు నెట్టగా ఆవిడ కింద కుప్పకూలిపోయింది. ఒక్కసారి గుండెలో కలుక్కు మనగా అమ్మా అంటూ గట్టిగా అరిచింది. చెమటలు విపరీతం గా పట్టసాగాయి. గుండె నొప్పితో వుంగలు చుట్టుకొని పోసాగింది.

 ఆవిడను చూడగనే విశ్వనాథం వెంతనే కర్తవ్యోన్ముఖుడై ఎమర్జన్సీ టాబ్లెట్ వేసి కారులో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. వెంటనే ఐ సి యు లో అడ్మిట్ చేసిన డాక్టర్లు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని నిర్ధారించి ట్రీట్ మెంట్ ప్రారంభించారు. 


అప్పటి నుండి ఆసుపత్రిలోనే విశ్వనాథం మకాం పెట్తాడు. భార్యకు సపర్యలు చేయడంతో పటు మందులు, ఇంజక్షన్లు తీసుకురావడం అన్నీ తానే స్వయంగా చేస్తున్నాడు. కిరణ్, రాధికలను ఆ దరిదాపులకు కూడా రానివ్వలేదు. వారిద్దరి స్వార్ధపూరిత అసభ్యకరమైన ప్రవర్తన వలనే తన భార్యకు ఎటాక్ వచ్చిందని అర్ధం చేసుకున్నాక వారిద్దరంటే అతనికి ఒక విధమైన అసహ్యం కలిగింది. 


నాలుగు రోజుల తర్వాత అనసూయ కోలుకుంది. ఐ సి యూ నుండి స్పెషల్ రూముకు మార్చారు. మరొక వారం తర్వాత ఆమెను డిస్చార్జ్ చేసారు. అసలే హృద్రోగంతో బాధ పడుతున్న ఆమెకు భవిషత్తులో మరొక ఎటాక్ వస్తే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు. అనసూయ ఏ విధమైన వత్తిడులు లేని ప్రశాంతకరమైన జీవితం గడిపేలా చూడాల్సిన బాధ్యత తనదే నన్న విషయాన్ని విశ్వనాథం అర్ధం చేసుకున్నాడు. 


ఆ రోజు రాత్రి కిరణ్ రాధిక లిద్దరినీ పిలిచాడు.


"చూడండి! తమకు పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. కొడుకు పుడితే తమను పున్నామ నరకం నుండి తప్పిస్తాడని మరింతగా సంతొషిస్తారు. అందరు తల్లిదండ్రుల వలే మేమూ ఎన్నో త్యాగాలు చెసి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి మాకు చేతనైనంతగా మీకే ఏ కష్టం రానివ్వకుండా పెంచి పెద్ద చెసి విధ్యా బుద్ధులను చెప్పించాము. మీ అదృష్టం బట్టి, మీకు మంచి ఉద్యోగాలు వచ్చి మీరు జీవితం లో బాగా సెటిల్ అయ్యారు. 


నా పిల్లలు అందరిలా కాక ఉన్నతమైన విశిష్తమైన వ్యక్తిత్వం కలవారని నేనింత కాలం మురుసిపోయాను. కాని నా అభిప్రాయం తప్పని మీరు నిరూపించారు. తుచ్చమైన ఆస్తి కోసం మీరు ఈ విధంగా దిగజారిపోతారని నేను ఊహించలెదు. తల్లి దండ్రుల మేలు కోరని పిల్లలు ఉన్న ఒకతే లేకున్నా ఒకటే. ఈ రోజు మీ వలన అమాయకురాలైన అమ్మ మృత్యువు దగ్గరగా వెళ్ళింది. ఆమెయే నా సర్వస్వం. ఆమె లేని జీవితం ఊహించడం అసాధ్యం. 


జీవితపు చరమాంకంలో వున్న మాకు ఒకరి నొకరు తోడూ నీడగా బ్రతకాలి. మీ కారణం గా ఆమెను ఈ రోజు దాదాపుగా కోల్పోయే స్థితికి వచ్చాను. ఇక ఈ సంఘటన పునరావృతం కాకూడదని నేను ఈ రొజు ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ క్షణం నుండి మన మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు వుందవు. నాకు అసలు పిల్లలే పుట్టలేదనుకుంటాను. దయ చెసి రేపు సూర్యోదయం లోపల మీరు వెళ్ళిపోండి. ఇక మీ ముఖాలు నాకు చూపించకండి. మీతో సంపర్కం లేకపోతేనే మాకు మనశ్శాంతి, ప్రశాంతత దొరుకుతాయి. 


మా కడుపున పుట్టిన మీరు పిల్లలు కాదు, పుట్టలోని చెదలవంటి వారు. ఈ క్షణం నుండి మనం ఒకరికొకరం ఏం కాము. ఈ నిర్ణయాన్ని నా భార్య కూడా మనస్పూర్తిగా స్వాగతిస్తుందని భావిస్తున్నాను. మా తదనంతరం ఈ ఆస్థి మొత్తం మీకే చెందేటట్లు రాసిన ఈ పత్రాలను తీసుకుపొండి. ఇక జన్మలో మీ ముఖాలు మకు చూపించవద్దు, బై బై. " చెమ్మగిల్లిన కళ్ళతో ఆస్థి తాలూకు పేపర్లను వారి ముఖాలపై కొట్టి తమ గదిలోనికి వెళిపోయాడు విశ్వనాథం.

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.


44 views0 comments

Kommentit


bottom of page