top of page

ఋణానుబంధం'Runanubandham' - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 08/03/2024 

'ఋణానుబంధం'  తెలుగు కథ

రచన: శ్రీపతి లలిత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్సూర్యుడు, అప్పుడే అమ్మ ఒడి లోంచి ఆడుకోడానికి బద్ధకంగా బయటికి వస్తున్న పిల్లాడిలా, నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. అప్పుడే నిద్రలేచిన మహానగరంలో ప్రశాంతంగా ఉన్న ఒక కాలనీ పార్క్ లో, ఓ అరగంట నడిచి, ఇంకో అరగంట అందరితో కబుర్లు చెప్పుకుని, అక్కడే ఉన్న సిమెంట్ బల్లమీద చతికిలపడ్డారు సావిత్రి, సత్యనారాయణ.


"ఇంకో రెండు రౌండ్లు చేసి వస్తా! మీరు వెళ్తానంటే ఇంటికి వెళ్ళండి" అంది మాధవి వీళ్ళవేపు చూసి.

"ఇంటికెళ్లి చేసేదేముంది? చల్లగా హాయిగా ఉంది. నువ్వూ రా! ముగ్గురం వెళదాం" అంది సావిత్రి.


ఏ ఋణానుబంధమో తమది, అందరినీ నవ్వుతూ, పలకరిస్తూ వెళ్తున్న మాధవిని చూస్తూ అనుకుంది సావిత్రి. తమకి ఏమీకాని ఆ అమ్మాయి, ఇప్పుడు తమ ఇంట్లో అమ్మాయి అవ్వడానికి దారి తీసిన విషయాలు గుర్తు చేసుకుంటూ.


సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగిగా చేసి రిటైర్ అయ్యాడు. కొడుకు అమెరికాలో స్థిరపడితే, ఎప్పుడైనా వెళ్లి ఓ మూడునెలలు గడపడం తప్ప, అక్కడే ఉండిపోడానికి ఇద్దరూ ఇష్టపడలేదు.


నేనూ, అమ్మా ఇండియాలో చూడాల్సిన గుళ్ళూ, గోపురాలు చూస్తాం. రానురానూ, ఈ మాత్రం ఓపిక ఉండదు" అంటూ అమెరికాలో ఇంకా కొంతకాలం ఉండమన్న కొడుకు ప్రతిపాదన తోసిపుచ్చాడు సత్యనారాయణ.


కలకత్తా, పూరీ, భువనేశ్వర్ అన్నీ తిరిగి వైజాగ్ లో ఆగారు. రెండురోజులు అక్కడ ఉండి హైదరాబాద్ వెళదామని ప్లాన్. సూర్యోదయం, సూర్యాస్తమయం చూడ్డానికి బావుంటుందని బీచ్ దగ్గర హోటల్ లో రూమ్ తీసుకున్నారు.


ఆ రోజు సింహాచలం, కనకమహాలక్ష్మిగుడి, కైలాసగిరి చూసుకుని కొంచెం సేపు బీచ్ లో కూర్చుని చీకటిపడ్డాక రూమ్ లోకి వెళదామనుకున్నారు.


బీచ్ లో కూర్చుని సముద్రం అలలు చూస్తూ, ఆడుకుంటున్న పిల్లల్ని, కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమికుల్ని గమనిస్తూ, ఆనందిస్తున్న సావిత్రికి, ఒక మూల దిగులుగా, కళ్ళు తుడుచుకుంటూ సముద్రం వంకే చూస్తూ ఉన్న ఆ అమ్మాయిని చూసి

"ఎవరో పాపం ఆ అమ్మాయి, అలా ఏడుస్తోంది, ఏం కష్టమో!" అంది సత్యనారాయణతో.

"ప్రపంచంలో అందరి కష్టాలు నీకే కావాలోయ్! పరీక్షలో ఫెయిల్ అయిందేమో స్టూడెంట్లా ఉంది" అన్నాడు అతను.


చూపు తిప్పుకోకుండా ఆ అమ్మాయినే చూస్తున్న సావిత్రికి, ఆ అమ్మాయి ఒక్క ఉదుటున లేవడం సముద్రం వేపు కదలడం చూసి, అటువైపు పరుగు పెట్టింది.

"అమ్మా! ఆగు" అంటూ పరిగెత్తుకుని వెళ్తుంటే"సావిత్రీ!" అంటూ సత్యనారాయణ వెనకే పరిగెత్తాడు.వీళ్ళ అరుపులు వినకుండా, ఆ అమ్మాయి సముద్రమువేపు వెళ్తుంటే, సావిత్రి ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టి లాగింది, ఇద్దరూ ఆ ఊపుకి కింద పడ్డారు. సత్యనారాయణ ఇద్దరినీ లేపాడు.


"నేను చచ్చిపోవాలి, ఆపకండి" అని ఆ అమ్మాయి విదిలిస్తుంటే, సావిత్రి ఆపి లాక్కుని వచ్చి ఇవతల కూర్చోపెట్టి "చూడమ్మా! చావు దేనికీ పరిష్కారం కాదు. ముందు మా రూమ్ కి వెళ్దాం" అంటూ ఆ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొచ్చి, బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కుని రమ్మని పంపింది.


సత్యనారాయణ, సావిత్రి వేపు చూసి "ఏంటో! ఆ అమ్మాయిని తీసుకొచ్చాం. ఏమీ సమస్య రాదు కదా! ఏదైనా ప్లాన్ వేసి మనదగ్గర డబ్బు, నగలు కాజేద్దామని వచ్చిందా! " భయంగా అన్నాడు.

"ష్! వింటుంది" అంటూ సావిత్రి ఆయన్ని బాల్కనీ లోకి లాక్కెళ్ళింది.

"ఆ అమ్మాయిని చూస్తే అలా లేదు, చిన్నపిల్లండి, చచ్చిపోయేంత కష్టం వస్తే పెద్దవాళ్ళం అలా వదిలేద్దామా! నాకు ఆ అమ్మాయిని చూస్తే మన సుధ గుర్తొచ్చింది" కళ్ళనీళ్ళతో అంటుంటే నీరు కారిపోయి బాల్కనీలో కూర్చుండిపోయాడు సత్యనారాయణ.


లోపలికి వచ్చి ఓదారుస్తూ, అమ్మాయినుంచి నెమ్మదిగా వివరాలు తెలుసుకుంది సావిత్రి.

"నా పేరు మాధవి. మొన్ననే గీతం కాలేజీ నుంచి, ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం పరీక్షలు వ్రాసాను. మాది తెనాలి దగ్గర చిన్నఊరు. నాకు పదేళ్లప్పుడు, మా నాన్న, పొలంలో పాము కరిచి చనిపోయారు, అప్పటినుంచి, అమ్మే బంధువుల సాయంతో వ్యవసాయం చూస్తోంది.

మా అమ్మకి చదువంటే ప్రాణం, మా వాళ్లందరినీ ఒప్పించి, నన్ను హాస్టల్ లో పెట్టి చదివించింది. నేను కూడా బాగా చదుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఉద్దేశ్యం తోనే ఉండేదాన్ని. నిజానికి, నాకు కాంపస్ నుంచి మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది, రెండు నెలల్లో చేరాలి.


నా మీద నాకు అతి విశ్వాసమా! తెలివితక్కువతనమా తెలీదు, నా క్లాస్మేట్ ఒకడు, వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు, ముందు నుంచి చాలా మర్యాదగా ఉండేవాడు, చదువులో కూడా పర్వాలేదు, అతనికీ ఉద్యోగం వచ్చింది, అందరితోలాగానే, నేను కూడా అతనితో స్నేహంగానే ఉండేదాన్ని, ఎలా మాస్నేహాన్ని ప్రేమ అని నమ్మించాడో, ఎలా నన్ను పెళ్లిదాకా లాక్కెళ్లాడో నాకేతెలీదు.


రిజల్ట్స్ వస్తే, ఎవరిదారిన వాళ్ళు ఉద్యోగాలకి వెళ్తాము, పెద్దవాళ్ళతో నెమ్మదిగా చెప్పి అందరిలో పెళ్లి చేసుకోవచ్చు, ముందు సింహాచలం గుళ్లో దండలు మార్చుకుందాం, అని నన్ను ఒప్పించి, ఎలానో భార్య భర్తలమే కదా అని తన రూమ్ లోకి తీసుకెళ్లి, వారం ఉన్నాక, ఊరు వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించి వస్తాను అన్నాడు.


నిజమే అనుకుంటే, నాలుగురోజుల తరవాత ఓనర్ వచ్చి, అతను రూమ్ ఖాళీ చేసాడు, నన్ను కూడా వెళ్ళమని చెప్పాడు. ఫోన్ చేస్తే, స్విచ్ ఆఫ్ వస్తోంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా, అతని అడ్రస్ తెలీదు అంటున్నారు. నన్ను మోసం చేసాడు అనేకన్నా, నేనే తెలివితక్కువగా మోస పోయాను అన్నది నిజం. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాలి? నాకు చావే పరిష్కారం" అంటూ ఏడ్చింది.


"చూడమ్మా! నువ్వే అంటున్నావు మీ అమ్మ ఎంతో కష్టపడి నిన్ను పెంచింది అని. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఆవిడ బతకగలదా? చుట్టూ ఉన్నవారు కాకుల్లా పొడవరా? ఆవిడ కూడా ఏ ఉరేసుకునో చావాల్సివస్తుంది. బతికి సాధించాలి, ఇంజినీరింగ్ చదివాను, మంచి ఉద్యోగం వచ్చింది అంటున్నావు, ఉద్యోగంలో చేరు.. మీ అమ్మని సుఖపెట్టు, మీ వాళ్ళందరూ గర్వంగా మా అమ్మాయి అని చెప్పుకునేట్టు బతుకు" అంది సావిత్రి.


"ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి, మా అమ్మ మొహం చూడలేనండీ, అబద్ధం చెప్పలేను, నిజం ఆవిడ తట్టుకోలేదు" ఏడుస్తూ అంది మాధవి.


అన్నీ వింటున్న సత్యనారాయణ "ఒక పని చెయ్యమ్మా! నువ్వు మాతో హైదరాబాద్ వచ్చేయి. ఉద్యోగం కోసం కొంచెం త్వరగా వెళ్ళాలి అని మీ అమ్మగారికి చెప్పు, ఏకంగా ఉద్యోగంలో చేరాక మీ అమ్మగారితో మాట్లాడు, అప్పటికి నీకూ సమయం కలిసి వచ్చి కొంచెం ధైర్యం వస్తుంది" అన్నాడు.


ఆ అమ్మాయికి ప్రపంచంలో ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. కానీ, భయం కూడా వేసింది, వీళ్ళు ఎలాంటివాళ్ళో? పొయ్యి మీద నుంచి పెనం మీదలా, ఒక కష్టం నుంచి ఇంకో కష్టంలోకి పడితే..


ఆ అమ్మాయి మనసు చదివినట్టు మాధవి" భయపడకమ్మా! అంకుల్ ప్రభుత్వ ఉద్యోగం చేసారు, మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు" ఒక్క నిమిషం ఆగి కళ్ళు తుడుచుకుని " మా అమ్మాయి సుధ, ఇంచుమించు నీలాగానే మోసపోయింది, పిచ్చిపిల్ల! మేము కోప్పడతామనో, బాధపడతామనో ఆత్మహత్య చేసుకుంది.


తను పోయి 20 ఏళ్లయినా, మేము రోజూ చస్తూ బతుకుతున్నాం. తన సమస్య మాకు చెప్పి ఉంటే, కోప్పడ్డా ఏదో ఒక పరిష్కారం చూపేవాళ్ళం. పిల్లలు ఎంతకీ వాళ్ళ గురించే ఆలోచిస్తారు, ఇన్నాళ్లు పెంచిన అమ్మా, నాన్నా తాము లేకపోతే, చావలేక, బతకలేక నరకం అనుభవిస్తారని ఆలోచించరు. కొంచెం కోప్పడితే ఏమైంది మన అమ్మా, నాన్నేగా అనుకోరు" దుఃఖం ఆగలేదు సావిత్రికి, సత్యనారాయణ నెమ్మదిగా భుజం తడుతూ ఓదార్చాడు.


దేవుడే వీళ్ళ రూపములో వచ్చాడేమో తను చనిపోకుండా ఆపడానికి, నిజమే! తనకేమన్నా అయితే తల్లి బతకలేదు అనుకున్న మాధవి "మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలీడం లేదు, మీరు చెప్పినట్టే చేస్తాను" అంది.


మాధవి, తల్లితో తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాని చెప్పి సావిత్రి, సత్యనారాయణలతో మాట్లాడిస్తే, ఆవిడ కూడా ధైర్యంగా ఒప్పుకుంది.


హైదరాబాద్ వచ్చాక కొత్త వాతావరణం, కొత్త మనుషుల పరిచయంతో పాత సంగతులు మర్చిపోయి మళ్ళీ హుషారుగా తిరిగేది మాధవి, ఆమె వచ్చాక సావిత్రి, సత్యనారాయణ కూడా సరదాగా, సంతోషంగా ముందు కంటే ఆరోగ్యంగా ఉన్నారు.


ఉద్యోగంలో చేరాక, ఊరికి వెళ్లి తల్లిని తీసుకుని వచ్చింది మాధవి. సావిత్రి నెమ్మదిగా జరిగిన విషయం చెప్తే ఆవిడ తట్టుకోలేక పోయింది, తేరుకున్నాక, "మా అమ్మాయికి ప్రాణదానం చేసారమ్మా! మీ ఋణం తీర్చుకోలేను" అంటూ దణ్ణం పెట్టింది.


తల్లిని, దగ్గరలో ఇల్లు తీసుకుంటాను ఇక్కడికి వచ్చేయమని మాధవి అడిగితే "నీ పెళ్లి అయి స్థిరపడేవరకు, వ్యవసాయం పనులు నేనే చూస్తాను, ఆ తరవాత నాకు ఓపిక తగ్గితే ఎలానూ తప్పదు, అప్పటివరకు నేను ఊర్లోనే ఉంటాను, నువ్వు హాస్టల్ లో ఉండు" అని మాధవి తల్లి అంది.


"మాధవి హాస్టల్ ఉండడానికి మేము ఒప్పుకోము, తను స్థిర పడేవరకు, మాకు తోడుగా ఇక్కడే ఉంటుంది" అని ఆవిడని ఒప్పించారు సావిత్రీ, సత్యనారాయణ. అలా మాధవి వీళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, వీళ్ళ అమ్మాయిలాగా కలిసిపోయింది.


పెళ్లి ఇప్పట్లో చేసుకోను అన్న మాధవి, సమయం దొరికినప్పుడల్లా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా, దగాపడ్డ ఆడపిల్లలకి దారి చూపడం, కాలేజీలకు వెళ్లి తన జీవితమే ఉదాహరణగా చెప్పి, వయసులో ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం చేసేది.


మధ్య,మధ్యలో సావిత్రి, సత్యనారాయణలని కూడా అందులో పాల్గొనమనేది, అలా నలుగురికి చెప్తే, ఒక్క అమ్మాయిని అయినా ఆత్మహత్య చేసుకోకుండా ఆపగలిగితే తమ జీవితం ధన్యమైనట్లే. ఎక్కడి ఋణానుబంధమో ఆ అమ్మాయికీ, తమకి అనుకుంది సావిత్రి, వాకింగ్ అయిపోయి తమవైపే వస్తున్న మాధవిని చూస్తూ.

***

శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.


70 views0 comments

コメント


bottom of page