top of page

కాశీయాత్ర



'Kasiyathra' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam 

Published In manatelugukathalu.com On 19/05/2024

'కాశీయాత్ర' తెలుగు కథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


కాశీకి తీర్థయాత్ర హిందూమతంలో కాశీనగరానికి యాత్రను సూచిస్తుంది. హిందూమతం లోని అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఈ నగరానికి ముక్తి సాధించేందుకు వీలు కల్పిస్తారనే నమ్మకం కారణంగా యాత్రికులు వెళుతుంటారు.

 

ఈ తీర్థయాత్ర యొక్క ప్రాముఖ్యత స్కాందపురాణంలో వివరింబడినది. హిందూ సాహిత్యంలో కాశీ ఒక

ముఖ్యమైన తీర్థంగా పేర్కొనబడినది. నగరం లోని కాశీ విశ్వనాథ దేవాలయం శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటి. 


మేము మొత్తం 120 మందిమి కాశీ యాత్రకు బయలు దేరాము. సాయికృష్ణా ట్రావెల్స్‌ ధ్వారా ఓ 40 మందిమి మాత్రమే ఫ్లైట్ల్స్‌ లో వెళ్ళాము. మేము 18 వ తారీఖ నవంబర్‌ 2023 నాడు బయలుదేరి లక్నోకు వెళ్ళాము. ఉద్యమం 10. 30 కు చేరుకున్నాము. రైలు ప్రయాణీకులు రావటము ఆలస్యమగుట వలన బజారు లన్నీ 2, 3 గంటలు తిరిగాము. ఈ లోపున రైలు ప్రయాణీకులు కూడా మాతో కలిసారు. 


మొత్తం 120 మంది  3 బస్సులలో “నైమిషారణ్యము” బయలుదేరాము. మార్గమధ్యము లోనే మధ్యాహ్న భోజన కార్యక్రమాలు అయిపోయినవి. మా ట్రావెలర్స్‌ వారివెంట   ఎల్లప్పుడూ క్యాటరింగ్‌ వ్యాన్‌ ఉంటుంది. ఏ పూట కా పూటే వండి పెడతారు. మాకంటే ముందుగా వారు చేరుకుని మా సౌకర్యాలన్నీ వాళ్ళు చూస్తారు. 

సాయంత్రం చీకటి పడువేళకు మేము నైమిషారణ్యము చేరుకుంటిమి. ఆ రోజు సత్రాలలో బస చేసి

రాత్రి భోజన కార్యక్రమాలు యధావిధిగా నిర్వర్తించి, తెల్లవారు ఝామునే లేచి స్నానాదులు కావించుకుని

పుణ్యక్షేత్ర సందర్శనకు బయలుదేరాము. 


“నైమిషారణ్య మహాత్యము. ”


నైమిషారణ్యం పవిత్ర తపోభూమి. ఎనభై ఎనిమిది వేలకుపైగా ఋషులు, ముునులు తపస్సు చేసిన

పుణ్యభూమి. ఈ నైమిషారణ్యము ఉత్తరప్రదేశ్‌ లోని సీతాపూర్‌ జిల్లాలో గోమతి నది తీరానికి ఉంది. 


ప్రాచీన చరిత్ర, భూగోళ వివరాల ప్రకారం నైమిషారణ్యం పాంచాల రాజ్యానికి, కోయల రాజ్యానికి మధ్య

నున్న ప్రదేశం. 


ఉగ్రశ్రావశౌతి ముని మహాభారత కథను వేల శ్లోకాలతో రచించి ఏకబిగిన గానం చేసిన ప్రదేశం. అలాగే

శ్రీరామచంధుడు అశ్వమేధ యాగము చేసిన సమయంలో, లవకుశులు ఇక్కడకు వచ్చి, వాల్మీకి రామాయణం గానం చేసిన ప్రదేశమని కూడా ప్రసిద్ది. 


నైమిషారణ్యం ముల్లోకాలలోను ప్రఖ్యాతి గాంచిన ఉత్రమ పుణ్యతీర్థం. శివుడికి అత్యంత ప్రియమైన ప్రదేశం. మానవులు చేసే పాపాలన్నీ నాశనం చేసే ప్రదేశం. ఇక్కడ దానం, తపస్సు, శ్రాద్దకర్మలు, యజ్ఞాలు మొదలగునవి ఒకసారి చేసినా, ఏడు జన్మల పాపాలన్నీ పోతాయని అనేక పురాణాలు విశదీకరించాయి. 


చూసిన ప్రదేశాలు- వాటి మాహాత్యాలు:


నైమిషారణ్య చరిత్ర— కలియుగం ప్రారంభమయ్యే ముందు ఋషులు, మునులు బ్రహ్మ గారి దగ్గరకి వెళ్ళి ప్రార్థించిరి.. ‘మాకు కలియుగ ప్రభావము లేని ప్రదేశం చూపించండి. మేము అక్కడకి వెళ్ళి పూజలు, యజ్ఞాలు చేసి యత్యుత్తమ ఫలం ప్రాప్తించేలా చేయండి’ అని బ్రహ్మ గారిని వేడుకొనిరి.

 

ఋషుల అభ్యర్థన మన్నించి, బ్రహ్మగారు మనసు ద్వారా ఒక చక్రాన్ని ( మనోచక్రం). నిర్మించి , ఆ చక్రాన్ని విసిరి, ఇలా చెప్పెను “ఈ చక్రం యొక్క ఇరుసు(నేమి) ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం పరమ పవిత్ర మవుతుంది. అక్కడకు వెళ్ళండి. ” అని.


 బ్రహ్మగారి మనోమయ చక్రం బ్రహ్మాండం నుంచి భూమి ని చుట్టుతూ ఈ అరణ్యానికి వచ్చింది. బ్రహ్మగారి మనోమయ చక్రం యొక్క ఇరుసు ( నేమి) ఇక్కడ పడింది కనక ఈ అరణ్యానికి నేమి ( ఇరుసు) +శీర్ష( పడిన)+ అరణ్య =

నైమిషారణ్యం అని పేరు వచ్చింది. 


చక్రతీర్థం——- బ్బహ్మగారు పంపిన మనోమయ చక్రం ఎక్కడ భూమి మీద పడిందో అక్కడ పరమ

పావనమయిన పుష్కరిణి. (లోతైనచెరువు ) నిర్మించబడినది. దానినే చక్రతీర్థం అందురు. 

మేమందరం పుణ్యస్నానాలని ఆచరించాము. చక్రతీర్థలో స్నానం, ఆచమనం, దానం, ధర్మకార్యాలు

మొదలైనవి చేసినచో, వాటన్నింటికీ విశేషమైన ఫలితం లభిస్తుంది. 


లలితాదేవి—— దక్షప్రజాపతి కూతురు సతీదేవి తండ్రి చేత అవమానింపబడి, దక్షయజ్ఞానికే తన దేహాన్ని ఆహుతి ఇచ్చేసింది. శివుణి గణాలు అప్పుడు ఆ యజ్ఞాన్ని విధ్వంసం చేసాయి. ఇదంతా తెలుసుకుని శివుడు ఆ యజ్ఞవాటికకు వచ్చి, సతీదేవి శరీరాన్ని చూసి దుఃఖితుడై ఆ మృత కళేబరం చేత బట్టి, తిరుగుతూ తిరుగుతూ తన పనులన్నిటిమీద విరక్తి చెందాడు. దాంతో సృష్టి సంహార క్రియ ఆగిపోయింది. సృష్టి యంతా అస్తవ్యస్తం అయిపోయింది. 


అప్పుడు జగత్ కళ్యాణ కారకుడైన విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని 108 ముక్కలుగా నరికి భూమండలమంతా విసిరెను. ఎక్కడైతే ఆ భాగాలు పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ శక్తి పీఠాలయ్యాయి. 


ఈ నైమిషారణ్యంలో సతీదేవి యొక్క హృదయభాగం పడింది. అందుచేత ఈ శక్తీపీఠం లలితాదేవిగా

పిలువబడింది. 


సూతగద్ది:

ఈ ప్రదేశంలో సూతమహర్షి ఎనభై ఎనిమిది వేల ఋషులకు శ్రీమధ్బాగవతము, ఇంకా అనేక పురాణాలు వుపదేశించారు. మనం తరచుగా చేసుకునే సత్యనారాయణ వ్రతం కూడా సుత, శౌనకాది మహామునులు శిష్యులకు వుపదేశించిన స్థలం ఇదే. 


శౌనకగద్ది:

శౌనక మహర్షి మొదలైన మహా ఋషులందరూ లోకహితం, లోక కళ్యాణార్థం, స్వర్గప్రాప్తి కొరకు వేల సంవత్సరములు తపస్సు చేసి జ్ఞానసిద్ది పొందిన ప్రదేశం. 


హనుమాన్‌ గడీ, పాండవుల మెట్ట——-


రామారావణ యుద్దం జరుగుతున్న సమయంలో మాయావి అయిన అహిరావణుడు శ్రీరామడిని, లక్ష్మణుని మాయోపాయముచే అపహరించెను. హనుమంతుడు అది గ్రహించి ఆ అహిరావణుడితో యుద్దం చేసి ఆ మాయావిని చంపి, రామలక్ష్మణులను విడిపించి, తన భుజస్కంధాలపై కూర్చోపెట్టకుని మొదటిగా నైమిషారణ్యములో అడుగుపెట్టెను. 


అందుకనే ఇక్కడ హనుమంతుడి భారీవిగ్రహం, ఆయన భుజస్కంధాలపై కూర్చున్న రామలక్ష్మణులు మనకు దర్శనమిస్తారు. ద్వాపరయుగంలో పాండవులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేశారని అంటారు. అందుకనే ఈ కొండని

పాండవుల మెట్ట అని కూడా అందురు. 


మిశ్రితతీర్థం, దధీచి తపస్థలం—— 

దధీచి మహర్షి దానవసంహరణార్థం తన ఎముకలను ఇచ్చట ప్రాణత్యాగ మొనర్చి ఇచ్చిన ప్రదేశం. ఆ సమయమున సకల భూమండలములోని జలరాశులను

ఇచ్చటకి రప్పించి ఆయన పుణ్యస్నానాదులు నిర్వహించిన ప్రదేశము. దధీచిమహర్షి ఎముకలతో తయారు చేసిన వజ్రాయుధమే ఇంద్రుని ఆయుధము. ఆయన తపశ్శక్తి అంతయు అందులో నిక్షప్తమై యున్నది. 


ఇవే కాకుండా నైమిషారణ్యములో ప్రతి ఇల్లు ఒక దేవాలయము. ఇంకా ఎన్నో పుణ్య ప్రదేశాలున్నాయి. 

ఇదొక పవిత్ర స్థలము. కలిదోషం లేని ఈ భూమి మీద నడిస్తేనే మానవులు పాపాల నుండి విముక్తు

లవుతారని ప్రసిద్ది. 


నైమిషారణ్యమును చూసిన కిష్కింద జ్ఞాపకం వస్తుంది. అదేనండీ.. మన హనుమంతుల వారి బంధు పుత్ర మిత్ర సమేతంగా మనకు కనబడతారు. వానరాలు జాస్తి. ఒక్క మనిషుంటే పది వానరాలుంటాయి.


కానీ అవి మనని ఏమీ చేయవు. ప్రక్క నుంచి వెళ్ళిపోతూంటాయి. నాకు అలా స్వీయానుభవమైంది. 

మెట్లు దిగి వస్తుంటే నా అంత వానరము, నా ప్రక్కనుంచి దిగుకుంటూ వెళ్ళింది. 


మధ్యాహ్నము భోజనాలు కానిచ్చి “ చలో అయోధ్య- రామజన్మభూమి” కి “జైశ్రీరామ్‌, జైజైశ్రీరామ్‌”

అని నినాదాలు చేసుకుంటూ బయలుదేరాము. దాదాపు మూడు గంటల ప్రయాణం తరవాత అయోధ్య చేరుకున్నాము. 


రామమందిరము—— 


ప్రస్తుతం రామాలయ పనులు మొదటి దశ పనులు పూర్తి అయి, రెండవ దశ పనులు శరవేగముతో సాగుతున్నవి. 22. 01. 2024 నాడు శ్రీరాముడి మూలవిరాట్టు విగ్రహస్థాపన

జరగగలదని అక్కడి మహంతులు తెలిపారు. ఈ రామాలయ పునరుద్దరణ పనులను గుజరాత్‌ కి చెందిన “సోమ్‌పురా ఫామిలీ” చేపట్టింది. 


అయోధ్యలో రామమందిరం 2. 77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్థు నుంచి గర్భగుడి శిఖరం

వరకూ 161 అడుగుల ఎత్తులో, ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, 

ఒక్కో అంతస్తు 20 అడుగులతో, మొదట అంతస్తులో 160, రెండవ అంతస్తు లో 74 స్తంభాలతో నిర్మాణ పనులు దాదాపు పూర్తి యగుచున్నవి. 


నిర్మాణపనులు చాలా చురుకుగా కొనసాగుచున్నవి. శిల్పకళానైపుణ్యము అనన్యం, అసమానము, 

శిల్పుల చేతిలో గండ్రశిలలు సయితం వెన్నముద్దల వలె జాలువారుతున్నాయా అన్నట్లు గా యున్నవి. 

సీతారసోయ్‌ఘర్‌, హనుమాన్‌గఢీ దర్శించుకుని సాయంకాలమునకు సరయూ నదికి చేరుకున్నాము. 

రామ చరిత్రకు సజీవ సాక్ష్యం—- గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన పుణ్యనదులు మన దేశంలో ఉన్నాయి. ఇవి అన్ని విధాలుగా ప్రసిద్ది చెందిన నదులు. అయితే యావత్‌ భారతమంతయూ భక్తి శ్రద్దలతో, ప్రేమాభిమానాలతో పూజించుదునే ఒక అవతార పురుషుల్ని జీవితంలో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర ఈ నదులకు లేదు. అటువంటి మహధ్బాగ్యం

పట్టిన నది కేవలం సరయూ నది ఒక్కటే. 


అక్కడ కొంతమంది పుణ్యస్నానాలు చేశారు. అక్కడ నుండి హరహరమహదేవ్‌ అనుకుంటూ కాశీకి పయనమయ్యాము. దాదాపు అర్దరాత్రికి కాశీ పట్టణ ప్రవేశము జరిగింది. అస్లీఘాట్‌ దగ్గరలో కల “మార్వాడా సేవా సంఘ్‌” సత్రములో బస

చేసితిమి. కాశీలో ఉన్నన్ని రోజులు అక్కడే. సకల సదుపాయాలతో ఉన్నదా సత్రం. మంచి వెలుతురు, 

ధారాళమైన స్వచ్చమైన గాలి, సూర్యకిరణాలు మొదలగు వన్నియూ పరిశుభ్రమైన పరిసరాలతో కూడు

కొన్నదా సత్రం. 


కాశీ క్షేత్ర విశేషాలు. ————


మొదటి రోజు వ్యాసకాశీ, సంకటమోచన హనుమాన్‌ మందిర్‌, తులసీ మానస మందిర్‌, దుర్గామందిర్‌, గవ్వలమ్మ, సారనాథ్‌, బిర్లామందిర్‌+ బెనారస్‌ హిందూ యూనివర్సిటి

మొదలగునవి దర్శించాము. 


సారనాథ్‌ స్థూపం—- ‘ సారంగనాథ్‌, ఇసిపట్టన, ఋషిపట్టణ, మిగదయ లేదా మృగదన అని కూడా పిలుస్తారు. వారణాసికి ఈశాన్యంగా పది కిలోమీటర్ల దూరంలో, గంగా మరియు వరుణ నదుల సంగమానికి సమీపంలో ఉన్న ప్రదేశం. 

పురాతన మలగండి కుటీ విహార శిథిలాలు నేటికి మనకు అగుపడుచుండును. 


సుమారు 528బిసిఈ నాటి సారనాథ్‌, 35 సంవత్సరాల వయస్సులో గౌతమబుద్దుడు జ్ఞానోదయం పొందిన తరువాత బోధ్ గయలో తన మొదటి ప్రవచనమును బోధించెను. అతని మొదటి ఐదుగురు శిష్యులు ‘ కౌండిన్య, అస్సాజీ, భద్దియా, వస్సా, మహానామా. 


జ్ఞానోదయం ఫలితంగా బౌధ్దసంఘం మొదట ఉనికిలోకి వచ్చింది. మహాపరినిబ్బన సూత్రం( దిఘా నికాయ యొక్క సూత్రం- 16) ప్రకారం, బుద్దుడు సారనాధ్‌ ను తన భక్త అనుచరులు సందర్శించి, భక్తి భావాలతో చూడవలసిన నాలుగు తీర్థ ప్రదేశాలలో ఒకటిగా పేర్కొన్నాడు. ఇతర మూడు ప్రదేశాలు లుంబినీ( బుద్దుని జన్మస్థలం,) భోద్‍గయ( బుద్దుడు జ్ఞానము పొందిన ప్రదేశము ) మరియు కుశినగర్‌ బుద్దుడు పరినిర్వాణం పొందిన ప్రదేశం).

 

బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయము—- 


మదన్‌మోహన్‌ మాలవ్యా 1916 లో డా. అనీబెసెంట్‌ సహాయంతో ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయానికి కాశీ నరేషుడు‌ స్థలము కేటాయించాను. ఇది ఆసియా

లోనే అది పెద్ద విశ్వావిద్యాలయము. 1916లో స్థాపించబడినది. భారతదేశ జాతీయ ప్రాముఖ్యత కలిగిన

విశ్వవిద్యాలయము. 


1300 వందల ఎకరాల విస్తీర్ణంలో వారణాసి యొక్క దక్షిణ అంచున గంగా నది ఒడ్డున ఉన్నది. ప్రాంగణం మధ్యలో శ్రీవిశ్వనాథ మందిరము కలదు. 


తులసీమానసమందిర్‌—- ఇతర దేవాలయాల వలె అది పురాతనమైనది కాదు. 1964 లో నిర్మించబడినది. ఇది రాముడికి అంకితమగు చేయబడింది. మరియు తులసీదాస్‌ రామచరితమానస్‌ రాసిన అదే స్థలంలో ఉంది. అవధి భాషలో వ్రాసిన రామచరితమనస్‌ యొక్క శ్లోకాలతో చెక్కబడిన తెల్లటి గోడలు మనకు దర్శనమిస్తాయి.. దీనిని తులసీ బిర్లా మానస మందిర్‌ అని కూడా పిలుస్తారు. 

ఇక్కడ తులసీదాస్‌ విగ్రహము, రామలక్ష్మణ, సీతా సమేతముగా హనుమంతుని అందమైన

చిత్రాలు కలవు. 


కాశీ క్షేత్ర మహిమ—-

 కాశీ పుణ్యక్షేత్రం గురించి దాని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ స్థలమహాత్యం గురించి సంపూర్ణంగా వివరించడంతో అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో.. ?

సముద్రంలో నీటి బిందువు లాంటి ఈ సంక్షిప్త సమాచారం తెలియ జేయడం జరుగుతోంది. 


హిందువులు జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించాలి. మా దంపతులు ఇది రెండవ సారి కాశీ

రావడము. ఈ క్షేత్రదర్శనం వలన బాహ్య సౌందర్య దృశ్యాల కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోపానం అవు

తుంది. చిత్త శుద్దితో ఎవరైతే ఈ క్షేత్రాన్ని దర్శిస్తారో వారిలోపల అనేక మార్పులు కలిగి, ఆత్మజ్ఞానం

కలిగిస్తుంది. 


1. కాశీపట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీ క్షేత్రం అనేది బ్రహ్మ దేవుని సృష్టిలోనిది కాదు. 

2. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న నగరం. శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం. 

3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక నగరం. 

4. స్వయంగా శివుడు నివాసంగా ఉండే నగరం. 

5. ప్రపంచంలో మునులకి అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. 

6. కాశీ భువిపై వెలసిన సప్త మోక్షద్వారాలలో ఒకటి. ద్వాదశ జ్యోతిర్లంగాలలో కాశీ ఒకటి. 


మరునాడు ప్రాతఃకాలముననే లేచి స్నానాదులు కావించుకొని కాశీ విశ్వేశ్వర దర్శనం మరియు

అభిషేకం గురించి తెల్లవారు ఝామున 4. 30 గంటలకు క్యూలో నించున్నాము. 5. 30కల్లా స్పర్శ

దర్శనం కావించుకుని అభిషేకమునకు ఆలయ ఆవరణ లో కూర్చున్నాము. 


అభిషేక మహాత్మ్యము-


విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేక ప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారలతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. అందువలన శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. 


జలం పంచభూతాలలోనూ, శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. ”అప ఏవ ససర్జాదౌ” అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృజించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే. 

మంత్రపుష్పంలోని — ‘ యోపా మాయతనంవేద’ ఇత్యాది మంత్రాలలో నీటి యొక్క ప్రాముఖ్యం విశదీకరింపబడింది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. 


భగవంతుని పదహారు ఉపచారాలతో పూజిస్తారు. ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది. 


‘ప్రజాపాన్‌ శతరుద్రీయా అభిషేకం సమాచరేత్‌’ అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయా పటిస్తూ

అభిషేకం చెయ్యాలి. పూజయా అభికేహేమో హోమోత్తర్పణ ముత్తమ్మా - తర్పణాఛ్చ జపః శ్రేష్టో హ్యాభిహేకః పరో జపాత్‌’ 


పూజ కంటే హోమము- హోమము కంటే తర్పణమ్‌- తర్పణం కంటే జపము- జపంకంటే అభిషేకం శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెబుతారు. 


మేము పంచామృతాలతోనూ, జలం తోనూ అభిషేకించు ఆ జలమును తీసుకువెళ్ళి విశ్వనాథ లింగం మీద పోసి మరల స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చాము. 


కాశీ అనగా( మెరుస్తున్న) అని అర్థం. ప్రస్తుత నిర్మాణాన్ని 1780 లో ఇండోర్‌ కు చెందిన మరాఠా రాణి అహల్యాబాయి నిర్మించారు. కాళీవిశ్వనాథ్‌, గంగానది మధ్య దూరంను సరళతరం చేయడానికి కారిడార్‌ నిర్మించారు. దానిని నడవా యందురు. ఆలయ వైశాల్యం యాభైవేల చదరపుమీటర్లు

పెంచారు. నలభైకి పైగా శిథిల దేవాలయాలను పునర్నిర్మించారు. యాత్రికుల సౌకర్యార్థం ఇరవై

మూడు కొత్త భవనాలు నిర్మించారు. 


మందిరం లోని ప్రధాన దేవతాలింగం అరవై సెంటీమీటర్ల పొడవు, తొంభై సెంటీమీటర్ల చుట్టుకొలతలో వెండి పానవట్టం లో ఉంది. ప్రధాన దేవాలయం చతుర్భుజాకారంలో తుట్టె ఇతర దేవతా మూర్తుల ఆలయాలతో ఉంటుంది. 


లోపలి గర్భగృహ లేదా గర్భాలయానికి దారితీసా సభాగృహం ఉంది. జ్యోతిర్లింగం ఒక ముదురు గోధుమరంగు శిల. ఇది గర్భగుడిలో ప్రతిష్టించబడి, వెండి పానవట్టం పై ఉంటుంది. మందిర నిర్మాణం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి దానిలో ఆలయం పై ఒక శిఖరం ఉంటుంది. రెండవది

బంగారు గోపురం, మూడవది జెండా త్రిశూలాలతో కూడిన బంగారు శిఖరం. 


ఆలయానికి సంబంధించిన 15. 5 మీటర్ల ఎత్తైన బంగారు శిఖరం, బంగారు ఉల్లిపాయ గోపురం ఉన్నాయి. 1835 లో మహారాజా రంజిత్‌సింగ్‌ ఇచ్చిన మూడు గోపురాలు స్వచ్చమైన బంగారంతో చేయబడ్డాయి. 


కాశీవిశ్వనాథ్‌ ఆలయానికి, మణికర్ణిక ఘాట్‌కు మధ్య గంగానది వెంబడి శ్రీకాశీవిశ్వనాథ్‌ ధామ్ కారిడార్‌ ను నిర్మించారు. 


అన్నపూర్ణ మందిరము- 

ప్రస్తుత ఈ ఆలయాన్ని పదునెనిమదవ శతాబ్దంలో మరాఠా మొదటి పీష్వా బాజీరావ్ నిర్మించెను. పెద్ద స్తంభాల వాకిలితో గర్భగుడి ఉంటుంది. ఈ ఆలయంలో అన్నపూర్ణ దేవీ

చిత్రపటం ఉంటుంది. ఈ ఆలయంలో దేవత రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి బంగారంతో, మరొకటి ఇత్తడితో.


 ఇత్తడి విగ్రహం రోజువారీ దర్శనం కోసం అందుబాటులో ఉంది. బంగారు విగ్రహాన్ని సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే చూడవచ్చు. అన్నకూట్‌ రోజున. అమ్మవారి ఎదురుగా కొంచం ప్రక్కగా ఆడవాళ్ళందరూ కుంకుమార్చన చేశారు లలితా పారాయణంచేస్తూ. 

ఒకసారి శివుడు ప్రపంచం మొత్తం అంతా మాయ ( భ్రమ) అని వ్యాఖ్యానించెను. ఆహారదేవత అయిన పార్వతీదేవి కి రూపం వచ్చి, భూమిపై ఉన్న మొత్తం ఆహారాన్ని అదృశ్యం చేయడం ద్వారా ఆహారం ప్రాముఖ్యతని ప్రదర్శించారని నిర్ణియించుకుంది. ప్రపంచం మొత్తం ఆకలితో నకనక లాడుతూ బాధపడటం ప్రారంభించింది. శివుడు చివరకు ఆహార ప్రాముఖ్యతను గుర్తించి, ఆమె వాకిట వద్దకు

వచ్చి ఆహారం కోసం వేడుకొన్నాడు. పార్వతిదేవి సంతసించి, శివుడికి తన చేతులతో ఆహారాన్ని సమర్పించి, తన భక్తులకోసం వారణాసిలో వంటగదిని తయారు చేసింది. 

అక్కడి అన్నప్రసాదశాలలో ఆరోజు అన్నప్రసాదాన్ని స్వీకరించాము. 


విశాలాక్షి ఆలయం—- 

వారణాసి జంక్షన్‌ నుండి ఐదు కి. మీ. దూరంలో శ్రీకాశీవిశాలాక్షి ఆలయం గంగానది ఒడ్డున మీర్‌ఘాట్‌ వద్ద ఉన్నది. పురాణాల ప్రకారం 52 శక్తిపీఠాలలో విశాలాక్షి మణికర్ణిక ఒకటి. సతీదేవి కర్ణకుండలం( చెవిపోగు) ఇక్కడ పడిపోయిందని చెబుతారు. అందుకే మణికర్ణిక అని ఆమె పేరు పెట్టారు. కళ్ళు కూడా ఇక్కడే పడిపోయాయి కాబట్టి విశాలాక్షి అని కూడా పిలుస్తారు. నల్లరాయితో చెక్కబడిన అద్భుతమైన మూర్తి అమ్మవారిది. ఆమె కుడిచేయి అరచేతిలా కమలాన్ని కలిగి ఉంది. అయితే ఆమె క్రిందటికి తిరిగిన ఎడమ చేయి అరచేతి ఖాళీగా దూరంగా చూస్తోంది. అమ్మ వారిని భక్తి ప్రపత్తులతో దర్శించుకుని

కాలభైరవ ఆలయమునకు బయలుదేరాము. 

కాలభైరవ ఆలయం- ఈ ఆలయం పాత నగరంలో, కాశీవిశ్వనాథుని ప్రధాన ఆలయానికి మరియు ఘాట్‌లకు కొద్ది దూరంలో ఉంది. 


సంప్రదాయాల ప్రకారం శివుడు ఈ రూపంలో భయాన్ని పోగొడతాడు. అఘోరాలు మరియు తాంత్రికుల ప్రార్థన కేంద్రంగా ప్రసిద్ది చెందిన కాలభైరవ మందిరం అపారమైన మతపరమైనా విలువలను కలిగి ఉందని నమ్ముతారు. శతాబ్దాలుగా వెలుగుతూ పవిత్రమైన అఖండ దీపం ఈ మందిరంలో ఆకర్షణీయమైన అంశం. 


ఈ దీపం యొక్క నూనెలో ఔషద విలువలు గల గుణాలు ఉన్నాయని భావిస్తారు. కాలభైరవ ఆలయం అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంది. ఆలయానికి ముందు భాగంలో కాలభైరవుడి గుడి రక్షణగా ఒక ప్రవేశద్వారం ఉంటుంది. ఆలయం లోపల సుందరమైన ప్రాంగణం ఉంది. ప్రధాన ఆలయం ప్రాంగణం మధ్యలో ఉంది. కాలభైరవుని విగ్రహం వెండి రంగులో ఉంటుంది. 


ఈ విగ్రహం కుక్క విగ్రహంపై అమర్చబడి, త్రిశూలం కలిగి ఉంది. ఈ ఆలయాల దర్శనం కానిచ్చుకుని మా సత్రమునకు బయలుదేరాము. 


సాయంత్రం గంగా హారతిని దర్శించుకున్నాము. ఎంతో వైభవోపేతంగా, కనులపండుగగా, కాశీపట్టణం

జ్యోతులతో వెలిగిపోతూ ఉంది. 

పరమ పవిత్రమైన వారణాసి నగరంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ సాయంత్రం వేళ గంగానదికి నిర్వహించే హారతి యాత్రికులు, భక్తులకు కన్నుల పండుగలా

అనిపిస్తుంది. 


ప్రకాశవంతమైన వెలుగులతో గంగానది అధ్బుతమైన దృశ్యాలను ఆవిష్కరించే గంగా హారతి మనలో

, మన చుట్టూ ఉన్న గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తుంది. యుగాల నుండి పవిత్ర గంగానదిని

ఆరాధించకుండా ఏ రోజూ గడిచిపోలేదు. ప్రతి యాత్రికుడు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన, తమ

ప్రయాణాల జాబితాలో తప్పక చేర్చుకోవాలిసిన కార్యకలాపాల్లో ఇది ఒకటి. ప్రత్యేకమైన గంగా హారతిని

చూడాలనే కోరికతో వారణాసి నగరానికి అన్ని వర్గాల ప్రజలు వస్తూంటారు. 


గంగా హారతిని నిర్వహించే పూజారుల వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు ధోతీ, కుర్తాతోపాటు పొడవైన గంచా( తువ్వాలు) ధరిస్తారు. ఐదు ఎత్తైన పలకలతో కూడిన ఒక ఇత్తడి దీపం, గంగాదేవి విగ్రహం, పూలు, ధూపంవంటి ఇతర పూజా సామగ్రిని హారతి కార్యక్రమం కోసం సిద్దం చేస్తారు. 


వారు నిర్వహించే ఈ అపురూప దృశ్యాన్ని చూడటానికి ఆసక్తి గల భక్తులు నగరం నలుమూలలనుండే కాకుండా దేశంలోనూ, బయటి దేశాలనుంచి వస్తూంటారు. చాలామంది ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు దశాశ్వమేధఘాట్‌ ఒడ్డున పడవలు ఆపి ఉంచుతారు. చక్కని హారతి దృశ్యాన్ని. తిలకించి సత్రానికి చేరుకున్నాము. 


మరునాడు పంచగంగా స్నానానికి వెళ్ళాము. కాశీమహాక్షేత్రంలో గంగానది తీరాన 64ఘాట్లు ఉన్నప్ప

ట్టికి అందులో ప్రధానమైనవి ఐదు మాత్రమే. వాటిలో అస్సీ, కేదార్‌, దశాశ్వమేధ, పంచగంగ మరియు మణికర్ణిక ఘాట్లు ఉన్నాయి. 


అస్సీఘాట్‌—  దుర్గాదేవి ‘ శుంభ-నిశంభ’ రాక్షసులను చంపిన తరువాత, తన ఖడ్గాన్ని నదిలో( అస్సి

అని పిలుస్తారు) విసిరిందని పురాణాల ప్రకారం. ఈ ఘాట్‌కు ఆపేరు వచ్చింది. అక్కడ స్నానం చేసి

కేదార్‌ ఘాట్‌కు బయలుదేరాము.

 

కేదార్‌ఘాట్‌—- గౌరీ కేదారేశ్వరాలయానికి నిలయమైన కేదార్‌ఘాట్‌ వారణాసిలోకి ఐదు పవిత్ర

ఘాట్‌ లో ఒకటి. కాశీ భారతదేశ భక్తి మండలిని విశ్వసించినట్లే, కేదారాన్ని కాశీ- కేదార్‌ ఖండం

యొక్క మండలిని నమ్ముతారు. కేదార్‌ఘాట్‌ లో గౌరీ కేదారేశ్వరాలయం గౌరీకుండ్‌ ఉన్నాయి. కేదార్‌టఘాట్‌కు ఆదిమ‌ర్ణిక అని నమ్ముతారు. ఈ ఘాట్‌లో కూడా స్నానమాచరించి తదుపరి ఘాట్‌ దశాశ్వమేధకు బయలుదేరాము. 


దశాశ్వమేధ ఘాట్‌— గంగానది పై ఉన్న వారణాసిలోకి ఒక ప్రధాన ఘాట్‌. ఇది విశ్వనాధఆలయానికి సమీపంలో ఉంది. ఘాట్‌కు సంబంధించిన రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి- శివుడిని స్వాగతించడానికి బ్రహ్మ దీనిని సృజించెను. మరియు మరియు మరొక కథనం ప్రకారం బ్రహ్మ ఇచ్చట

పది అశ్వమేధ యాగాలు చేశారని ప్రతీతి. 

ప్రస్తుత ఘాట్‌ను 1748 లో పేష్వాబాలాజీబాజీ రావు నిర్మించెను. మరల 1774 లో అహల్యాబాయి

హోల్కర్‌ పునర్మించారు. అక్కడ కూడా పుణ్యస్నానములాచరించి పంచగంగ ఘాట్‌కు బయలు

దేరాము. 


పంచగంగ ఘాట్‌— పంచగంగా ఘాట్‌ లేదా బిందుమాదవ్‌ ఘాట్ గంగానది ఒడ్డున కలదు. మరియు

ఈ ప్రదేశంలో సంగమించు ఐదు పవిత్రనదుల పేర్లు పెట్టబడింది. గంగా, సరస్వతి, ధూమపాప, యమునా మరియు కిరణ్. గంగా నది మాత్రమే కనబడి, మిగిలిన నాలుగు అతీంద్రియ వ్యక్తీకరణులుగా మారినట్లు భావిస్తున్నారు. మహాభారత కాలంలో భృగుమహర్షిచే నిర్మించబడిందని నమ్ముతారు. ఇచ్చట కూడా పుణ్యస్నానా లాచరించి మిట్యమధ్యాహ్నానికి మణికర్నికా ఘాట్‌కు బోట్‌లో

వెళ్ళాము. ఈ ఐదు ఘాట్‌ ల ప్రయాణమా బోట్‌లలోనే సాగినది. 


మణికర్ణికా ఘాట్‌—- గంగానదిపై ఉన్న పవిత్ర ఘాట్ల లో అత్యంత పవిత్రమైన శ్మశానవాటికలలో

ఒకటి. ’ హిందూమతంలో మరణం అనేది ఒకరి కర్మ ఫలితం ద్వారా  గుర్తించడాన్ని మరొక జీవితానికి

ప్రవేశద్వారం గా పరిగణించబడుతుంది. మానవుల్ని ఆత్మ మోక్షాన్ని పొందుతుందని, అందువల్ల ఇక్కడ దహనం చేసినప్పుడు పునర్జన్మ చక్రాన్ని విచ్చిన్నం చేస్తుందని నమ్ముతారు. ఇక్కడ సతీదేవి చెవిపోగులు పడిన కారణంగా ఈ పేరు వచ్చింది. ఇది శక్తిపీఠం కూడా. 


ప్రతిరోజూ వందలాదిమంది మణికర్ణికా ఘాట్‌ వద్ద దహన సంస్కారాలు చూసేందుకు, మృతులకు నివాళులు అర్పించేందుకు వస్తూంటారు. ఇక్కడ కూడా పుణ్య స్నానాలాచరించి సత్రానికి తిరుగు ప్రయాణమైతిమి. 

సాయంత్రము ఆ రోజు అందరికీ విశ్రాంతి. షాపింగ్‌లకు వెళ్ళేవాళ్ళు షాపింగ్‌లకూ, దర్శనాల గురించి కొందరూ అందరూ తలో దోవన వెళ్ళాము. 


మరునాడు తెల్లవారుదాము రెండు గంటలకే బయలుదేరాము మూడు బస్సుల్లో గయకు. 

అక్కడ విష్ణుగయలో పితృదేవతలకు పిండప్రదానాలు, విష్ణుపాదాల దగ్గర పిండాలు వదలడం మరియు మాంగళ్యగౌరీ శక్తిపీఠం చూశాము. 


కాశీనుంచి ఏడు గంటల ప్రయాణము గయకు. అక్కడ స్నానాదులు కావించుకొని పితృదేవతల కార్య

క్రమములకు కూర్చున్నాము. 

గయయెక్క ప్రాముఖ్యము—- కొండలతో చుట్టుముట్టబడిన గయా నగరం. “ఫల్గు” అనే పవిత్ర నది, నగరం నడిబొడ్డున కలదు. ఇక్కడ మత విశ్వాసాల ప్రకారం పిండప్రదానం( శ్రాద్దకర్మ) కోసం దైవికగమ్యం. రామలక్ష్మణులు, సీతామ్మవారితో కలిసి దశరథమహారాజుకు పిండప్రదానం చేశారని పురాణకథనం. ఈ నగరం చుట్టూ మూడు వైపులా చిన్న రాతి కొండలతో( మంగళగౌరి, శంగస్థాన్‌, 

రామ్‌శిల మరియు బ్రహ్మయోని) తూర్పు వైపున ఫల్గు నది కలదు. 


గయాసురుని అంత్యకాలంలో విష్ణుమూర్తిని ప్రార్థించగా, ఆయన కోరుకున్న వర ప్రభావంతో ఆయన తల, నాభి, పాదం ప్రాంతాల్లో గయాక్షేత్రాలు ఏర్పడ్డాయి. శిరోగయ మధ్యగా, పాదగయ గా పిలువబడే వీటిలో శిరస్సుకు సంబంధించినది గయాక్షేత్రం గాపిలువబడుచున్నది. 


పాదగయను పిఠాపురం గా వ్యవహరిస్తున్నారు. శ్రాద్దకర్మ కార్యక్రమము ముగిసిన తరువాత పిండాలు తీసుకుని వెళ్ళి విష్ణు పాదాల దగ్గర వదులుతారు. 

ఆ పిదప మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ముగిసిన పిదప మాంగళ్యగౌరీ దర్శనానికి బయలుదేరాము. 

మంగళ గౌరీ దేవాలయము—— ఇక్కడ మా సతీదేవి వక్షోజాలు పడినందువలన, ఈ ఆలయం పోషణకు చిహ్నం గా భావిస్తారు. ఎవరైతే తన దగ్గరకి కోరికలు మరియు వరాలకై అమ్మ దగ్గరకి వస్తారో, వారి సకల కోరికల తీరి విజయవంతంగా తిరిగి వెళతారని ప్రగాఢ నమ్మకం. 


మరల తిరుగు ప్రయాణం కాశీకి. దాదాపు అర్దరాత్రి దాటినది. 

మరుసటిరోజు మన బస చేసిన సత్రములోనే “సహస్రలింగార్చన” పూజలు జరిగినవి. వచ్చిన బృంద

సభ్యులంతా పాల్గొనిరి. ఆడువారందరూ కుంకుమార్చన పూజలు చేసిరి. 


సహస్రలింగార్చన—— కార్తీకమాసానికి సమానమైనది ఏది లేదు. గంగా నది మించి ఇతర నదేది లేదు. కాశీక్షేత్రము వంటిది ఈ భూమండలం మీద ఏదీ లేదు. 


కనుక కార్తీకమాసంలో శివలింగార్చన చేయటం భక్తి ముక్తి దాయకాలుగా మనయొక్క పురాణాలు మనకు చెబుతున్నాయి. మరి భక్తులు ఎటువంటి శివలింగాన్ని అర్చన చేయవచ్చు అనగా ‘ వల్మీకము“ అనగా పుట్టమన్నుతో చేసిన శివలింగము కలియుగమున విశేషమని చెప్పబడినది. శాస్త్రంలో మనకు వల్మీకము నకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిని అనేక వైదిక కార్యక్రమాలలో వినియోగిస్తారు. కనుకనే పుట్టమన్నును పవిత్రమైనదిగా శాస్త్రం చెబుతుంది. ఇక శాస్త్ర సంబంధ విషయానికి వస్తే పుట్టమన్నుతో శివలింగము చేసి అర్చించటం సత్వర విశేషఫలితం ఇస్తుంది. 


పరమేశ్వరునకు కంఠము నందు అలంకారం అయిన నాగేంద్రుడికి నివాసస్థలం అయిన పుట్ట శివుడికి ఎంతో ప్రీతిని కలిగించును. 


“మృత్తికల హనమే పాపం యన్మయా దుష్కూృతాం కృతం” అన్న వేదవాక్యం మనకు మృత్తిక స్పర్శనంవల్ల చేతనే, మనయొక్క చెడు స్వభావం, స్వయంకృత పాదములు తొలుగునని పురాణములు చెబుచున్నవి. 


అందుకనేనపుట్టమన్ను పవిత్రమైనది. 

పుట్టమన్ను శివలింగ రూపముగా మట్టిముద్దను చేసిన, అర్చన, అభిషేకం చేయటం సాధారణం, 

సులభమైన మార్గము. మహాలింగార్చన లో 365 లింగములను ఒక క్రమ పద్దతి లో వేద మంత్రము

లతో కైలాస మహా యంత్ర రూపముగా అమర్చి శివలింగాకృతిని ఏర్పరచి మహాన్యాసముతో దేహ ఇంద్రియశుద్ది చేసుకొని నమక చమకములతోనఅభిషేకం చేస్తారు. 


ఈ ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి చేసినను, ప్రతిరోజు అభిషేకం చేసిన ఫలితం పొందగలరు. ఇక సర్వోత్కృష్టమైన సహస్ర లింగార్చనా వేదమంత్రములతో పదహారు దశలలో ( ఆవరణములు) 1128 లింగములని ఒకదాని తరువాత ఒకటి శివప్రోక్తకైలాస రహస్య మహా యంత్ర ప్రకరణం ప్రకారంగా ఏర్పరుస్తూ చేయటం ఒక మహా అద్భుతం. 


హైదరాబాద్‍ నుంచి వచ్చిన వేదభ్రాహ్మణులు మాతో ఈ కార్యక్రమము చేయించారు. 1128 లింగములు

చేసి ప్రొద్దున సంకల్పము, పూజా విధులు నిర్వహించాము. ఆడవారందరూ లలితా పారాయణ చేస్తూ

కుంకుమార్చన చేశారు. ’లక్ష ‘పారాయణము చేశారు. 

సాయంత్రం పంచామృతాలు, ఫలోదకములు, భస్మము, పసుపు, కుంకుమది సుగంధ ద్రవ్యములతో

అభిషేకము కనులపండుగగా, వైభవోపేతముగా, నిర్విఘ్నముగా చేసాము. 


‘ రుద్రం దావయతీతి రుద్రం ‘ శంకరోతీతి శంకరః

రుద్రం అనగా ఏడుపు. బాధ. దుఃఖం. వీటిని మననుంచి ద్రవించ చేయగలిగినది, కడిగివేయ గలిగివది రుద్రము. శం అనగా శుభము. మనకు శుభములను ప్రసాదించగలిగిన వాడు శంకరుడు. 


మేము పవిత్ర కార్తీకమాసములో వారణాసి పట్టణంలో గంగానది ఒడ్డున శివ అర్చన, అభిషేకములు

అతి ఘనంగా ఆరాధనగా పూర్వకంగా చేసితిమి. 

—————————————————————-

మరునాడు ప్రాతఃకాలముననే అనగా ఉదయం నాలుగు గంటలకే మూడు బస్సులలో వారణాసి నుండి బయలుదేరాము. కాశీనుండి ప్రయాగ దూరం వంద కిలోమీటర్లు. వాస్తవంగా దీనిని త్రివేణిసంగమం అని కూడా అంటారు. గంగా, యమున మరియు సరస్వతీ నదుల సంగమమే ఈప్రయాగ. 


పన్నెండు ఏళ్ళ కొకసారి కుంభమేళా జరుగును. శాక్తేయులు అత్యధికంగా ఆరాధించే పుణ్యక్షేత్రాల్లో అలహాబాద్‍ శక్తిపీఠం ఒకటి. సతీదేవి వేలు పడిన దివ్యక్షేత్రమని విశ్వసించబడుచున్నది. 

ఈ అమ్మవారిని మాధవేశ్వరిగను, పరమశివుడిని కాలభైరవుడుగా ఆరాధిస్తూంటారు. ఈమెను అలోపి/ లలితా దేవి అని పిలుస్తుంటారు. అలోపి అంటే అదృశ్యమైన వ్యక్తి. ప్రతి ఆలయంలో కనీసం ఒక విగ్రహం లేదా చి‌హ్నం అమ్మవారిని పూజించడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విగ్రహం లేదు, చిహ్నం లేదు. చెక్క డోలీపై దేవత ఉందని మనము ఊహించుకోవాలి. అలోపి మాత కొత్తగా పెళ్ళయిన వదువు. దొంగలు వివాహబృందంపై దాడిచేసినప్పుడు ఆమె పల్లకి నుండి అదృశ్యమయింది. వధువు ఆశ్చర్యకరంగా కనిపించకుండా పోవడంతో ఆమెను “ అలోపి” మాతగా

పూజిస్తారు. 


మొదటగా త్రివేణిసంగమంలో పుణ్యస్నానలాచరించి అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ నుండి బయలుదేరి బడే హనుమాన్‌ మందిరము నకు వెళ్ళాము. హనుమాన్‌జీ నిద్రిస్తున్న స్థితిలో నున్న ఏకైక ఆలయం ఇది. 

ఆలయం లోపల శయన భంగిమలోన ఉన్న హనుమంతుని దక్షిణాభిముఖ విగ్రహం ఉన్న గర్భగుడి. 


మరియు సగభాగం నీటిలో మునిగి ఉండును. తల ఉత్తరాభిముఖుడై పాదములు దక్షిణవైపుగా తొమ్మిది అడుగుల వెడల్పులో ఉండును. వీరముద్ర ఆకారములో ఉండును. విశాలమైన తల, మోకాళ్ళ వరకూ చేతులు విశాలమైన వక్షఃస్థలము, తొడలు- మొత్తము మూడు అంతస్తులలో ఉండును స్వామి వారి విగ్రహము.

 

ఇక్కడ నుండి బయలుదేరి “ సీతామర్హి” కి వెళ్ళాము. సీతమ్మవారు ఇక్కడ దొరికిన ప్రదేశము. 

జనకమహారాజు నాగలితో భూమిని దున్నుతుండగా లభించిన ప్రదేశము. ఈ జిల్లా. నేపాల్‌కు సరిహద్దులో ఉంది. చుట్టూ హలేశ్వర్‌ స్థాన్‌, జానకీమందిర్‌ కలవు. ఎంతో శోభాయమానంగా, చుట్టూ పచ్చని వాతావరణముతో చూపరులకు మంత్రముగ్దులను చేసే విధంగా ఆలయ సముదాయముకలవు. 


సీతమ్మవారు తన అవతార పరిసమాప్తి అనగా భూగర్బంలోకి వెళ్ళిపోయిన ప్రదేశముగా కూడా ఇక్కడే. 

ఇక్కడ  తిరుగు ప్రయాణము వారణాసికి బయలుదేరాము. రాత్రి పది గంటలు దాటింది సత్రము చేరే సరికి. 

————-

మరునాడు ఆదిదంపతులైన “ శివపార్వతుల కళ్యాణ మహోత్సవము” ఎంతో కనుల పండుగగా, రమణీయంగా, శోభాయమానంగా జరిగింది. 


అంబర చుంబిత మహా సంబరం.. 

అధ్బుతం పరమాధ్బుతం..: ఆనందం.. మహానందం

మహాదేవుడు అందరి మనస్సున కొలువైన క్షణమది..

భక్తుల మనోఫలకాలలో ఆ ఫాలనేత్రుని ; దివ్యరూపం రూపుదిద్దుకున్న క్షణమది.. 


మహారుద్రాభిషేకానికి .. ఆ రుద్ర స్వరూపుడు కైలాసగిరిన ..

ఆనందనర్తనం చేసిన అపురూప క్షణమది.. 

ప్రమదగణాలు ..మహాదేవుని దివ్యకళ్యాణాన్ని చూసి మురిసిన క్షణమది


మహాదేవుడు నీలకంఠునిగా..దిగివచ్చిన శుభలక్షణమది..

అధ్బుతం .. పరమాధ్బుతం..

ఆనందం.. మహదానందం


శ్రీశివపార్వతుల కళ్యాణంతో ఆధ్యా‌త్మిక నగరి వారణాసి పులకించిపోయింది. భక్తకోటి జయజయధ్వానాల మధ్య ఆదిదంపతుల కళ్యాణం తో సత్రములో సరికొత్త శోభను సంతరించుకుంది. అశేష జనవాహిని కరతాళధ్వనుల మధ్య శ్రీశివపార్వతుల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కల వారణాసి ఆదిశంకరులా నివాసస్థలము కూడా. ప్రణవభూమిగా కూడా

విరాజిల్లుతున్న నగరం. 


పరమశివునికి ఎంతో ప్రీతికరమైన శంఖానాదంతో తొలిఅడుగు వేయడం ఆనవాయితీ. శంఖానాదంతో

మహాదేవుని కళ్యాణఘట్టం ప్రారంభమైంది. విశ్వకళాస్ఫూర్తి పరమేశ్వరుడు, ఆ నటరాజును స్తుతిస్తూ

భజనలు, కీర్తనలు మరియు పెక్కు సాంస్కృతిక కార్యక్రమాలు రసరమ్యంగా కొనసాగాయి. 

హైదరాబాద్‍ నుంచి వచ్చిన ఋత్విక్కులతో వేదమంత్రములతో దాదాపు. రెండు గంటల సేపు సభా

ప్రాంగణం హోరెత్తిపోయింది. భక్తులు ఉపిరి బిగియపట్టి హరహరమహాదేవ్ అని నినదిస్తుండగా నిరాటంకంగా. కొనసాగింది. ఒకవైపు వేదనాదం, మరొకవైపు ఢమరుకనాధంతో కొనసాగిన కళ్యాణఘట్టం రోమాంచితమైంది. అనేకగొంతులు శివపంచాక్షరీ పఠిస్తుండగా ప్రమధగణాలే కైలాసనాథుడిని

అర్చిస్తున్నట్టుగా అనిపిపించింది. 


ప్రమదగణాలతో పరమశివుడు వెలసిన పరమపవిత్ర నగరం వారణాసి. ముక్కోటి దేవతలు దేవలోకమై మనందరి ముందు సాక్షాత్కరించిన భూకైలాలం వారణాసి. ఉఛ్వాస నిశ్వాసాలలో శివనామం ఉప్పొంగిన మహాసాగరమం.. వారణాసి. 


ఇక శ్రీశివపార్వతుల కళ్యాణోత్సవ ఘట్టం అధ్బుతం.. మహాధ్బుతం. సాక్షాత్తు కైలాసమే అగు

వారణాసిలో “ మహాదేవుడు - శైలజాదేవి చేయందుకొనే కమనీయ క్షణాలని వర్ణిస్తూ ఆదిదంపతుల

కళ్యాణవిశేషాలని వివరిస్తూ సాగింది. సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైనా మన హైందవధర్మ

విశేషాలను చక్కగా ఋత్వికులు వివరించి ఈ కళ్యాణోత్సవానికి మరింత శోభను తెచ్చారు. 

మరునాడు శ్రీసత్యనారాయణస్వామి వ్రతమును మేము బస చేసిన సత్రములోనే జరిగింది. 


ప్రాముఖ్యత—— హిందూ మత విశ్వాసాల ప్రకారం సత్యనారాయణస్వామి వ్రతం వినడం, ఆచరించడం, చదవడం వలన ఆ ఇంటిలోన ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. 

ఆరోజు సాయంత్రం కార్తీకపౌర్ణమి కావున గంగాహారతి చూచుటకు ఘాట్‌లకు బయలుదేరాము. 

ముందుగానే పడవలు బుకింగ్‌ లన్నీ చేశారు మా టూరిస్ట్‌ వాళ్ళు. 


దీపాల వెలుగులో వారణాసి ధగధగలు——

స్వర్గం దిగివచ్చిందా అన్నట్లు కాశీలో వైభవంగా దేవ్‌దీపావళి ఇరవైరెండు లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగాయి ఘాట్స్‌ అన్నీ. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి దీపాల వెలుగులో, గంగాతీరంలో ఆకాశం నుండి స్వర్గం దిగి వచ్చిం దా అన్నట్లు కనిపించాయి. ఆరోజు ఒక్క కాశీలోనే ఇరవై

రెండు లక్షల దీపాలు వెలిగించారు. ఒక్క చంద్రవంక ఘాట్‌లోనే పన్నెండు లక్షల పైన దీపాలు వెలిగించారు. 


వీటిలో లక్షదీపాలను ఆవుపేడతో తయారుచేశారు. పశ్చిమతీరంలోని ఘాట్స్‌లపై, తూర్పుతీరంలోని ఘాట్‌లపై దీపాలు వెలిగించారు. చెరువులు, కాశీసరస్సులు, గంగా- గోమతి ఒడ్డున ఉన్నఘాట్‌లలో లక్షలాదిగా దీపాలతో వెలిగిపోయాయి. ఇరవైరెండు లక్షల దీపాల కాంతితో కాశీ ప్రకాశవంతమైనది. అయోధ్య లోని రామాలయ రూపాన్ని కూడా తీర్చిదిద్దారు. పదకొండు వేల దీపాలతో

ఆకృతి చెక్కారు. ఈ రేజు దేవతలు కాశీలోకి దిగివస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. రామాలయ దృశ్యం

చూపరులందరినీ ఆకర్షించేలా ఉంది. 


కాశీలో అధ్బుతమైన దృశ్యం కనువిందు చేసింది. ఎనభైనాలుగు ఘాట్‌లపై ఇరవై రెండు లక్షలకు పైగా దీపాలు వెలిగించడంతో కాశీ స్వర్గాన్ని తలపింపజేసింది. కాశీలోకి అన్ని ఘాట్‌ల అందాలు హృదయాన్ని

ఆహ్లాదపరచాయి. భక్తుల రద్దీ అసామాన్యము. మెరిసే దీపాల వెలుగులో స్నానమాచరించే ఘాట్‌లు చాలా అందంగా కనబడినాయి. కాశీ ఘాట్‌లపై వెలుగుతున్న దీపాలను చూస్తుంటే నేలపై నక్షత్రాల రేకులు విప్పినటుల అనిపిస్తుంది. అంతే కాకండా దీపాలతో వెలిగే పురాతన ఆలయాలవైభవం కూడా మనకు కనబడుతుంది. 


ఈ సారి దేవ్‌దీపావళి రోజున కాశీనుండి ప్రపంచం మొత్తానికి “ సనాతనీకులందరూ ఒకే వర్గం” అనే సందేశాన్ని అందించారు. ఎనభైనాలుగువఘాట్‌ల వద్ద జరిగే కార్యక్రమాల ధ్వారా ప్రపంచంలోని డెబ్బై దేశాల రాయబారుల ముందు ‘ ఏక్‌ భారత్‌, శ్రేష్ఠభారత్‌ ‘ స్వావలంబన భారత్‌, ధృడభారత్‌ రూపాన్ని ప్రదర్శించారు. 

ఈ కార్యక్రమముతో యాత్ర ముగిసినది. 


నేను యాత్ర గురించి రాసినది అణువంత—- రాయవలసింది. ఆకాశమంత. 

చూసిన ప్రదేశాలు స్వల్పమే—- చూడవలసినవి ఎన్నో, ఎన్నెన్నో కలవు. 

కాశీకి ఒకటి రెండు సార్లు వెళ్ళినంత మాత్రాన మనము అన్నీ చూడలేము. కనీసం అరడజను సార్లు వెళితే అప్పటికి మనము ఓ ముప్పైశాతం చూడగలము. చూసి తరించేవి, చూసి చూసి తరించేవి ఎన్నో ఎన్నెన్నో కలవు. 

———————————శుభంభూయాత్‌——————————————————-

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు. 



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






155 views0 comments

Comments


bottom of page