కథలలో ఆమె వ్యధలు - 1
- Padmavathi Komaragiri
- Aug 5
- 3 min read
#PadmavathiKomaragiri, #పద్మావతికొమరగిరి, #KathalaloAmeVyathalu, #కథలలఆమెవ్యధలు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Kathalalo Ame Vyathalu - 1 - New Telugu Story Written By Padmavathi Komaragiri
Published In manatelugukathalu.com On 05/08/2025
కథలలో ఆమె వ్యధలు-1- తెలుగు పెద్ద కథ
రచన, కథా పఠనం: పద్మావతి కొమరగిరి
ఇంటి దగ్గర తాతయ్య, అమ్మమ్మ నాన్నమ్మలు కథలు చెప్పే రోజులు ప్రస్తుత తరం లో ఎక్కడా కన్పించడం లేదు. ఎక్కడ ఎవరి ఇంట్లో చూసినా టి. వి. సీరియల్, మొబైల్ ఫోన్స్, లాప్ టాప్, టాబ్లెట్ ఇవే కనిపిస్తున్నాయి. పిల్లల కోసం కాస్త సమయం కేటాయించి, వారికి కథలు చెప్పే అలవాటు ఎవరూ చేయడం లేదు. ఎవరి పనులు వారికి వుండటంతో ఆన్ లైన్ లో నే సంగీతం / యోగా / ట్యూషన్స్ అన్నీ చెప్పిస్తూ కాలం గడిపేస్తున్నారు. కథలు చెప్పడం ద్వారా పిల్లలకు దగ్గరై తమ ప్రేమను వారికి అందించగలరన్న సంగతిని గ్రహించలేక పోతున్నారు. ఈ కథలనేవి ముఖ్యంగా పిల్లల్లో ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని కలిగించి వాళ్ళ మెదడు పదును చేయడానికి సహాయపడతాయి. అందుకే స్కూల్స్ లో టీచర్స్ స్టూడెంట్స్ కి ఏమైనా చెప్పదల్చుకుంటే కథల రూపంలోనే ఎక్కువగా చెబుతుంటారు. దాంతో వారిలో జ్ఞాపక శక్తి పెరిగి తెలివితేటలు వస్తాయి.
“అమ్మమ్మా” అంటూ ఒక్కసారే మీదపడింది మనవరాలు శ్రీనిక. సీరియస్ గా కథ రాస్తున్న శారద ఉలిక్కిపడింది. తమాయించుకొని “ఏమిటే మీదబడి గోల చేస్తున్నావు? చిన్నదానివా చితకదానివా.. పదిహేనేళ్ళు వచ్చాయి. వయసు కు తగ్గట్లు ప్రవర్తించాలి. మీ అమ్మ ఎక్కడకి వెళ్ళింది? మళ్ళీ పెత్తనాలకు వెళ్ళిందా నిన్ను నాకు పడేసి?..
నాకు చేత కావడంలేదు, నన్ను విసిగించకు - మీ అన్నయ్య ఎక్కడకి వెళ్ళాడు? అయినాయా ఆన్ లైన్ క్లాసులు..” చికాకు పడుతున్న అత్తగారిని చూసి ‘శ్రీనికా’ అని పిలిచాడు ఆనంద్. ‘వస్తున్నా డాడీ’ అంటూ చెంగున పరుగెత్తింది మనవరాలు.
అల్లుడు ఏమనుకున్నాడో అని బిడియపడింది. తరువాత కాసేపు ఏమనుకుంటాడు లే.. వాళ్ళ అమ్మ కూడా ఇదే పరిస్థితి. తను అన్నా కాస్త తిరుగుతున్నది - తను పెడితే తినే స్టేజి ఆమెది. అయినా ఏంటో తన ఖర్మ ఇక్కడ ఉండటం.. కూతురి దగ్గర అసలు ఉండకూడదు అని తన అమ్మమ్మ చెబుతుండేది – అమ్మమ్మ చెప్పింది కానీ కూతురూ అల్లుడు వద్దనే తన కాలం గడిపింది.
అమ్మమ్మ లాగానే తను కూడా చివరకు కూతురి దగ్గరే ఉండాల్సి వస్తున్నది. మహారాజు ముందు పోయాడు ఇవ్వన్నీ చూడకుండా నే - కూతురు అనుకోకూడదు కానీ అల్లుడే నయం మనిషినని గుర్తిస్తాడు – అబ్బబ్బ పొద్దున లేవడం మొదలు రాత్రి పడుకున్నదాకా చాకిరీ తో చచ్చిపోతున్నది. నిద్ర లేవగానే అల్లుడికి కాఫీ ఇవ్వాలి. అదేంటో తన చేతి కాఫీ చాలా బాగుంది అంటాడు. అదే డికాషన్ అవే పాలు, ఎవరు కలిపినా ఒకటే, ఏంటో తెలియదు మరి –
పిల్లలు కూడా తను చేసిన దోశ లు టిఫిన్ తను చేసిన సాంబారు అవీ చాలా బాగుంది అంటారు. నిజమే తన దోశలు అంటే అటు పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు కూడా పడి చస్తారు. మరి సన్నగా తరిగిన ఉల్లిపాయలు దట్టంగా వేస్తాను కదా అందుకేనేమో - నిలబడి దోశలు వేసీ వేసీ నడుము లో పోట్లు వస్తున్నాయి – ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు తింటారు. మళ్ళీ తన కూతురు, అల్లుడు, మనవడు మనుమరాలు, వియ్యపురాలు అందరూ మనవాళ్ళే/ పరాయి వాళ్ళు ఒక్కరూ లేరు – అందరూ తన వాళ్ళే. తన అల్లుడు కొడుకు కంటే ఎక్కువ. ఆ అబ్బాయి తనను అమ్మ లాగా చూసుకుంటాడు. తన తల్లికి ఏది కొంటే తనకు కూడా అది కొంటాడు. తన కూతురు ఇంకా ఖర్చు గురించి ఆలోచిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్లకు ఇంత ఖరీదులు ఎందుకు? అంటుంది. కానీ అల్లుడు ఆనంద్ వాళ్ళకి నచ్చిన వి ఇచ్చి వెళ్ళు బాబూ అంటాడు.
మెత్తగా ఉన్న కొద్దీ ఖరీదు ఎక్కువ వుంటుంది, కట్టుకుంటే హయిగా వుంటుంది. చెమట పీలుస్తుంది. ప్రతీ ఏడూ వెంకటగిరి, మంగళగిరి నేత చీరలు అమ్మే మూటలవాడు వచ్చి తనకూ, తన వియ్యపురాలికీ ఇచ్చి వెళతాడు. చెరొక అరడజను తీసుకుంటారు.
ఏంటో తన ఈ జీవితం – తనకు చిన్నప్పటినుండీ కథలంటే చాలా ఇష్టం. చదవడం, రాయడం అంటే చాలా ఇష్టం. పరిసరాలను చూసి పరవశించడం కూడా. ఎప్పుడూ జీవితం అంతా ఇలానే అయిపోతున్నది. ఇంక లాభం లేదు. ఇక్కడ ఉండలేదు, ఎక్కడికన్నా ఆశ్రమానికి వెళ్లి వుండాలి. తన నిర్ణయాన్ని తన కూతురికి చెప్పాలి. హయిగా కథలు రాసుకోవాలి -- ఇలా ఇక్కడ చాకిరీ చేసుకుంటూ ఉండలేదు తను.
తనకి స్వాతంత్య్రం కావాలి. గోరుచిక్కుడుకాయలు వలుస్తూ అరవై ఏళ్ళ శారద ఆలోచిస్తున్నది, హయిగా ఇంటిపట్టున వుండి టీవీ లో సీరియల్స్ చూసుకుంటూ ఉండక. ఒకవేళ ఇంట్లోనుంచి వెళితే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరకి వెళ్ళాలి? ఉన్న ఒక్క కూతురు దగ్గర ఉండక ఈ ఆలోచనలు ఏమిటి తామర తంపర లాగా, సాయంత్రపు సంధ్యవేళ ముసురుకున్న చిన్న దోమలు లాగ, తనకు కూడా సెక్యూరిటీ కావాలిగదా. ఆశ్రమానికా, ఓల్డ్ ఏజ్ హోం కా ఇంకా ఎక్కడకి వెళుతుంది తను?
“అమ్మా ఏమి చేస్తున్నావు? నీకు ఎన్ని సార్లు చెప్పాలి స్టవ్ వెలిగించి టీవీ చూడొద్దని, మాడు వాసన కూడా రావడం లేదా? అత్తయ్యా! మీరు అయినా చెప్పచ్చుకదా అమ్మకు, మీకు కూడా వాసన లేదా, చంపుతున్నారు ఇద్దరూ, ఇద్దరినీ వదిలి ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నాము”
శారద తెల్లబోయింది కూతురు దీప మాటలకి. తనను అన్నందుకు కాదు, తన వియ్యపురాలిని అన్నందుకు సిగ్గుపడింది.
“ఏమి ఆలోచించాలి? ఉన్నదే గద అంటున్నాను, కొడతావా కొట్టు. చిన్నప్పుడు ఎప్పుడూ కొట్టలేదు ఇప్పుడు కొట్టు..” కోపం గా అన్నది దీప. “నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు. పెళ్ళయ్యాక మా ఫ్యామిలీ నలుగురం కలిసి ఎక్కడికైనా వెళ్ళామా? ఎప్పుడూ సంత లాగా ఇల్లు – పెద్ద ఫ్యామిలీ లో పెళ్లి చెయ్యకు అన్నాను. ‘నాకు నువ్వు ఒక్కదానివే. అందుకే నలుగురు పిల్లలు ఉన్న ఇంట్లో ఇస్తాను’ అని చెప్పావు.. ఇచ్చావుగా.. మిగతా అందరూ హయిగా అమెరికా లో సెటిల్ అయ్యారు. మేము మాత్రం మీ ఇద్దరి బాధ్యతతో పాటు ఈ లంకంత ఇల్లు చూసుకుంటూ ఇక్కడే వున్నాము. ఈ ఇంటితో పాటు మీ ఇద్దరినీ కూడా పోషిస్తూ ఒక సంతోషం సరదా అన్నీ చంపుకొని చస్తున్నాము..” మీద మీద కు వస్తున్న కూతురుని చూసి వెనక్కు అడుగువేసింది శారద. పార్వతమ్మ తన చేతి కర్ర సాయంతో చిన్నగా మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నం చేస్తున్న వియ్యపురాలిని చూసి బాధతో మూలిగింది శారద మనసు. కానీ ఏమీ చేస్తుంది?
=======================================================================
ఇంకా వుంది..
కథలలో ఆమె వ్యధలు-2 త్వరలో
=======================================================================
రచయిత్రి పరిచయం: కొమరగిరి పద్మావతి
నా పేరు కొమరగిరి పద్మావతి. నేను కథలు రాస్తాను.
ఎక్కువ చదవడం వల్ల రాయడం వచ్చి ఉంటుంది . నా రచనలు అన్నీ నా స్వంత ఆలోచనల నుంచి పుట్టినవే. ఎక్కడి నుంచీ కాపీ చేయడం లేదు, అనువదించడం లేదు, ఎవరినీ అనుకరించడంలేదు.
కథలు రాయడం నాకు చాలా ఇష్టం. మనుషుల జీవితాల్లో జరిగే విషయాలు, భావాలు, అనుభవాలు నా రచనల్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. పాఠకులు కథ చదివి, అది అర్థం అయ్యేలా, మనసుకు హత్తుకునేలా ఉండాలని నా లక్ష్యం.
రాయడం నాకు ఒక ఆనందం, అభిరుచి. ప్రతి కథ నాకు ప్రత్యేకం.
@KPSS-SP
•9 hours ago
చాలా బాగుంది అండి కథ 🎉