top of page

కొడుకులందు ఉత్తమ కొడుకులు వేరయా

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link


'Kodukulandu Utthama Kodukulu Verayaa' New Telugu Story Written By Nallabati Raghavendra Rao


రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు


సుందరయ్య , కుక్కుటేశ్వరరావు చిరకాలమిత్రులు. గుడిలో దైవదర్శనం చేసుకుని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.


'' అందుచేత నే చెప్పేదేమిటంటే సుందరయ్యా... పురాణాల్లో ఎవరో కుర్రోడు తల్లిదండ్రులను కావడిలో పెట్టి మోసాడని ఇప్పుడూ అలాంటి వాళ్ళు ఉంటారు అని నువ్వు కలగనడం , ఆశ పడటం నీ అమాయకత్వం అవుతుంది. మరో విషయం చెప్పనా? ఆ మధ్య తల్లిని గంపలో పెట్టి, కావడి మోస్తూ తీర్థయాత్రలు తిప్పుతున్న యువకుడి ఫోటో చూశాం పేపర్లలో... ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిలో అలాంటి వారు ఒక్కరే ఉంటారయ్యా బాబు.


మా అబ్బాయి కృష్ణమూర్తి విషయం చూడు.. చిన్న ప్పటి నుండి సరైన దారిలో నేను పెట్టబట్టి, ఇప్పుడు నా మాట జవదాటకుండా నడుచుకుంటున్నాడు. అదే.. మీ అబ్బాయి రవిని నువ్వు నాలా కండిషన్ లో పెట్టలేకపోయావు. వాడిప్పుడు కరుకుబద్దలా తయారయ్యాడు. ' మా అబ్బాయి లో ఏదో మార్పు వచ్చినట్టు ఉంది' ...అని నువ్వు ఇప్పుడు చెప్పావు చూడు.... అక్కడే మొదలయిందన్న మాట అసలు స్టోరీ.


నడిగోదాట్లో నీ పడవ ఉంది. నువ్వు చుక్కాని పట్టుకున్నావు. ఇప్పుడు చుక్కాని మీ అబ్బాయి అన్నమాట. చుక్కానే నీ మాట విననప్పుడు పడవ ఎట్లా ప్రయాణిస్తుందో ఆలోచించు.. అది..

అలాగయింది నీ బ్రతుకు''


చుట్ట నోట్లో పెట్టుకుని నములుతూ అగ్గిపుల్ల వెలిగించి దమ్ములాగి... ఇంకా చెప్పడం మొదలె ట్టాడు కుక్కుటేశ్వరరావు. సుందరయ్య చేతులు వెనక్కి పెట్టుకుని అతను చెప్పేది వింటూ నెమ్మదిగా నడుస్తున్నాడు.


'' మన కుర్రాళ్ళను ఇతర ప్రాంతాల్లో చదివించేట ప్పుడు నెలకోతూరి డబ్బుల కోసం మన ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు.. .'వస' నూరి నోట్లో పోసి నట్లు... ఏది... చిలక కు పోస్తాం.. అట్టాగన్నమాట.. మన బాధలు ఏకరువు పెట్టాలయ్యా వాళ్ళతో.


కానీ నువ్వు ఏం చేసావు ఈ నాలుగేళ్లలో... నీ శరీర బాధలు, అప్పులు గాని,... నీ భార్య పడిన కష్టాలు, రోగాలు కానీ వాడొచ్చేటప్పటికీ తెలియ నివ్వలేదు. గోనెమూటలో ముడిపెట్టి దాచేసే వాడివి. పైగా ' రవీ... ఇక్కడ అంతా బానే ఉంది నువ్వేమి బెంగపెట్టుకోక... బాగా సదువుకో..' అని ధైర్యం చెప్పేవాడివి. 'వాడి మనసు పాడు చేస్తే ఎలా సదువుకుంటాడు....' అని నాకు పాఠాలు చెప్పేవాడివి. ఇప్పుడు చూడు నీ నెత్తి మీద వెంట్రుకలన్నీ పీకి పారేస్తున్నాడు. నువ్వు చేసుకున్నదే ఇదంతా.. అనుభవించు.


నీ భార్యకు టైఫాయిడ్ వచ్చినా వాడికి తెలియ నివ్వలేదు. నీకు గుండెల్లో నొప్పి వచ్చిహాస్పిటల్ పాలైనా వాడికి చెప్పనివ్వలేదు. ఓరబ్బో గొప్ప త్యాగమూర్తివి నువ్వు.


ఇప్పుడు నీ తిక్క తీరిందా... అనుభవించు కర్మ! నాకే.. నాఇల్లు చూడిప్పుడు.. ఇంద్రభవనం లాగా మార్చేశాడు నా కొడుకు కృష్ణమూర్తి. మీ వాడికి.. మా వాడికి హైదరాబాదులో ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి కదా... ఇద్దరికీ చెరొక పాతికవేలు సమానజీతం. నీకు తెలుసు కదా వారం క్రితం మా అబ్బాయి కృష్ణమూర్తి మొదటి నెల జీతం మొత్తం పట్టుకొచ్చి నాకు ఇంట్లోకి కావలసినవన్నీ కొని పడేసాడు.


కొత్త టీవీ , కొత్త మిక్సీ , కొత్త చైర్స్ , దుప్పట్లు తలగడలు, అలారం టైం పీస్..కొత్త బీరువా.. కొత్త సోఫా..కొత్త ఫర్నిచర్..కొత్త స్టవ్..కొత్త స్టీలు సామాన్లు.. కొనేశాడు. అంతేనా ఇంటికి టాటా కంపెనీ వారి వైట్ సిమెంట్ వేయించాడు. ఆప్కో లైట్ కంపెనీ రంగులు పామించాడు. అష్టలక్ష్మీ వైభోగభవనం లా ...కళకళలాడిపోతోంది నా ఇల్లిప్పుడు.


ఆలోచించుకో సుందరయ్యా.. మీ వాడికి మొదటి నెల జీతం అందినా.. పట్టుకుని ఇంటికి ఇప్పటి వరకు ఎందుకు రాలేదంటే.. లాజిక్కు నీకు అర్థం కాలేదా.. నువ్వు ఫోన్ చేసి..' జీతం ఏది రా'.. అని అడుగుతున్నా...'నేను తర్వాత వస్తాను..' అంటా లెక్కలేకుండా అంటున్నాడoటే.. వాడు పెట్టే తిర కాసు నీకు బోధ పడలేదా?..వాడు ఇప్పడే..డబ్బు మదుపు చేయడంలో పడిపోయాడు అని లెక్కలు కట్టి నీకు చెప్పాలా?? నా ఇల్లు దగ్గర పడింది.. నేను ఇలా వెళ్లిపోతా.. నేను ఏం చేయలేను. నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది.'' అంటూ పక్కకు తప్పుకున్నాడు సుందరయ్య చిరకాల మిత్రుడు కుక్కుటేశ్వరరావు,


సుందరయ్య తల గోక్కుంటూ తన ఇంటి దారి పట్టాడు.


మరో నాలుగు రోజులు గడిచాక సుందరయ్య కొడుకు రవి.. ఓ రోజు తెల్లవారుజామున.. రైలు దిగి తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు.


అతని తల్లి సావిత్రమ్మ కోపంగా మాట్లాడడం మొదలుపెట్టింది..

'' రవి.. మాట్లాడవేరా.. అడిగేది నిన్నే .. నీ సంపా దన కోసం మీ నాన్నగారు ఎన్ని కలలు కన్నారో నీకేం తెలుసు. ఆ కుక్కుటేశ్వరరావు గారబ్బాయి కృష్ణమూర్తి తో పాటు నీకు ఆరోజే 25 వేల రూపా యలు జీతం ఇచ్చేశారని తెలిసింది.


ఆ అబ్బాయి ఈ మధ్యన వచ్చి తల్లిదండ్రులను ఆనందపరచి వెళ్ళాడు. వాడికన్నా బుద్ధిమంతుడు అనేవారు నిన్ను అందరూ.. కానీ నీ ప్రవర్తన ఇలా తయారయ్యిందేమిటిరా.

వచ్చిన దగ్గర నుండి..'టాక్సీ తీసుకొస్తాను హైదరాబాద్ వెళ్దాం రండి. అక్కడ పని ఉంది' అంటు న్నావ్. మరో విషయం మాట్లాడవు. అక్కడ ఏదై నా సమస్య లో ఇరుక్కున్నావా! వివరంగా చెప్ప రా బాబు! మాకు అర్థంకావడం లేదు..." అంటూ కొడుకు దగ్గర కూర్చుంటూ అడిగింది తల్లి సావి త్రమ్మ. కొంచెం దూరంగా తుంగచాప మీద తండ్రి సుందరయ్య మౌనంగా కాళ్లు నిమురుకుంటూ కూర్చున్నాడు.


మళ్లీ మొదలు పెట్టింది తల్లి సావిత్రమ్మ...

''ఆ వంటింట్లో వాడపల్లి పెంకుల సూరి చూడు.. ఎలా ఒరిగి పోయిందో.. దానికి 5000 ఖర్చు అవుతుంది అన్నాడు మేస్త్రి.. ఎవరి మీద పడుతుందో నన్న భయం... నీ చదువు జరుగుతున్నప్పుడు ఏమనుకున్నామో గుర్తుందా.. నీ నెల మొదటి జీతం తో చేయిoచేద్దామనుకున్నామా లేదా??


మరిచిపోయావట్రా. ఆ వీధిలో పాతకాలంనాటి దూలాలు చెదబట్టి.. ఆ పురుగులు మీద పడుతు న్నాయి. నువ్వు ఏమన్నావో గుర్తుందా.. '' అమ్మా నేను అన్నీ చేయించేస్తాను.. కంగారుపడకు ''

అన్నావు. ఇల్లంతా వర్షం పడుతుంటే మొత్తం ఇలారం బాగుచేయించి 20,000 అయినా కొత్త పెంకు తో నేయిస్తానన్నావు. ఎలా మరిచి పోయా వురా ఇవన్నీ... ఇంట్లో ఏమున్నాయి నువ్వు వస్తే కూర్చోబెట్టడాని కి స్టూలు కూడా లేదు.''


మౌనంగా వింటున్న రవికి ఇంకా చెప్తూనే ఉంది అతని తల్లి సావిత్రమ్మ.


'' అసలు ఒక్క విషయం దాచకుండా చెప్పరా రవి! మా దగ్గర రహస్యం వద్దు. అసలు మేమిద్దరం ఈ రోజే హైదరాబాద్ ఎందుకు రావాలిరా... వచ్చి అరగంట కాలేదు..అక్కడకు ఎనిమిది గంటలకు వెళ్లిపోవాలి అంటూ కంగారు పెట్టేస్తున్నావు. టిఫినీలు కూడా అక్కడకు వెళ్లేక చేద్దాం అంటున్నావు .. ఏదైనా పోలీసు కేసు గొడవా? ఎవరైనా అమ్మాయిని ప్రేమించావా..? నీ మొదటి నెల జీతం 25 వేల రూపాయలు ఏమైందిరా అసలు ?.. రాయిలా మాట్లాడవే? చెప్పు చెప్పరా.. ఛీ..నువ్వు కాకుండా ఆ కృష్ణమూర్తి మా కొడుకై ఉంటే ఎంత బాగుం డునో!! దౌర్భాగ్యుడా అప్పుడే డబ్బు సంపాదన లో పడిపోయావా ..అమ్మను...శపించానంటే తగులుతుంది.. ఆ..' ఏడుస్తూ అంది సావిత్రమ్మ.


కొడుకు రవి అదేమీ పట్టించుకోలేదు.. ఊర్లో ఉన్న టాక్సీ ని ఫోన్లో మాట్లాడుతూ తిరుగు ప్రయాణా నికి ప్రయత్నం చేస్తున్నాడు.. టెన్షన్ తో.


కాసేపటికి..రవి హైదరాబాద్ వెళ్లడానికి మాట్లా డిన టాక్సీ వచ్చి వీధిలో ఆగింది. తల్లిదండ్రులను కంగారు పెట్టి టాక్సీ ఎక్కించాడు. స్పీడ్ గా హైదరా బాద్ వెళ్ళిపోతున్న టాక్సీ ఎనిమిది గంటలకు కోటి సెంటర్ లో ఆగింది.. అంతవరకూ తల్లిదండ్రు లు ఏమడిగినా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు రవి.


కోటి సెంటర్ లో రవి మాత్రమే కిందకు దిగాడు. అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యం అక్కడ రెడీగా ఉన్నాడు.


'' ఇదిగో సుబ్రహ్మణ్యం .. అంటూ ఏదో ఇంగ్లీషులో చెప్పాడు.. రవి. ఇప్పుడు అతని బదులు సుబ్ర హ్మణ్యం టాక్సీ లో కూర్చున్నాడు ఆ టాక్సీ ముందుకు దూసుకు పోయింది.


కొడుకు తమతో రాకపోవడంతో కంగారుపడిన సుందరయ్య..


'' ఏమయ్యా నీ పేరు సుబ్రమణ్యమా ? నువ్వు మా వాడి దోస్త్ వా.. ఇద్దరూ ఒకే రూమా? శభాష్

చాలా బాగుందయ్యా.. అసలు విషయం చెప్ప కుండా మాఅబ్బాయి రవి మమ్మల్నిద్దరిని టాక్సీలో హైదరాబాద్ తీసుకు రావడం ఏమిటి..? వాడు ఈ సెంటర్ లో కారు దిగిపోయి ఇక్కడ నీకు మమ్మల్ని ద్దరిని అప్పచెప్పటం ఏమిటి..? ఇద్దరూ తోడు దొంగలా? ఏమిటి ఈ ఆట. మాయల పకీరు సినిమాలోల ఈ దోబూచులు ఏంటి అంట! ఇదిగో సుబ్రహ్మణ్యం ఆ డ్రైవర్ ను కొంచెం టాక్సీ స్పీడ్ తగ్గించమను. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నా మట?'' ఆశ్చర్యంగా అడిగాడు సుందరయ్య.


'' హాస్పిటల్కి వెళ్తున్నా మండి'' చెప్పాడు సుబ్రహ్మణ్యం.


'' హాస్పిటల్ కా ఎందుకూ..'' భయంగా ప్రశ్నిం చింది సావిత్రమ్మ.


'' సుబ్రహ్మణ్యం నువ్వు, మా అబ్బాయి, నేను మా ఆవిడ.. అందరూ క్షేమంగానే ఉన్నాము. మరి ఎవరికి సీరియస్..


ఓహో అర్థమైంది సావిత్రీ..మన వెధవ లవ్ లో పడ్డాడు. ఆ అమ్మాయి కి కడుపు చేశాడు. ఈ అబ్బాయి సుబ్రహ్మణ్యం మధ్యవర్తి అన్నమాట.. ఇద్దరూ కలిసి ఆ పిల్లకు కడుపు తీయిoచేశారు. ఇదంతా హాస్పటల్ లో జరుగుతుంది ఆ అమ్మా

యి తరపు వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే మన రవి ని చంపేస్తామంటున్నారు. అర్థమైందా.


ఇదో సుబ్రహ్మణ్యం.. మా భార్య భర్తలకు ఆ సీను చూపించి పెళ్ళికి ఒప్పించి అక్కడే మా వాడి చేత తాళి కట్టించేయాలి....అదన్న మాట... అందు కోసం తీసుకెళ్తున్నావు మమ్మల్నిద్దరిని,కరెక్టేనా?'' ఊహించి చెప్పాడు సుందరయ్య.


'' మీరు ఊహించింది తప్పు సార్.. సాయంత్రానికి అన్ని విషయాలు మీకు అర్థం అవుతాయి. అంత కుమించి నేనేం చెప్పాను సార్.'' ప్రశాంతంగా చెప్పాడు సుబ్రమణ్యం.


' ఏమిటయ్యా ఈ బుడబుక్కల వేషాలు.. టాక్సీ ఆపు దిగి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను..'' అరిచారు సుందరయ్య.. సావిత్రమ్మ లు.


'' సార్ మీరు ఎన్ని అన్నా నా ప్రాణ స్నేహితుడు రవి అదే మీ అబ్బాయి చెప్పింది నేను చేస్తాను సార్. ఇదిగో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేసింది దిగండి.'' సుబ్రహ్మణ్యం చేయి పట్టుకొని వాళ్ళిద్దరినీ క్రిందకు దింపాడు. వాళ్ళ కొడుకు రవి ఎక్కడ కనిపించలేదు. సుబ్రమణ్యం అన్ని చూసుకుంటున్నాడు.


నెమ్మదిగా మధ్యాహ్నం 3 గంటలు అయింది.


'' చూడబ్బాయ్ సుబ్రహ్మణ్యం.. ఇప్పటివరకు మా ఇద్దరికీ అన్ని పరీక్షలు ఎందుకు చేయించావయ్యా? 12 మంది డాక్టర్లు నర్సులు మా శరీరంలో ప్రతి భాగం కంప్యూటర్లతో ఏదేదో చేసి పడేశారు. ఇంకా రకరకాల పరీక్షలు.. అంతా బాగానే ఉంది.. చివర్లో నువ్వు అక్కడ బోల్డంత డబ్బు కట్టేశావు.. నలుగురు డాక్టర్లు మమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడిగి ఏదేదో కాగితం మీద రాసి నీకు ఇచ్చారు. ఎందుకు అసలు.. ఇదంతా?'' బోల్డంత విచిత్రంగా అడిగాడు సుందరయ్య.. సావిత్రమ్మ బొమ్మలా నిలబడిపోయింది.


అక్కడ పని పూర్తి అయ్యాక సుబ్రహ్మణ్యం ఆ ఇద్దరిని బయటకు తీసుకొచ్చి మళ్ళీ టాక్సీ ఎక్కిం చాడు.


''సుందరయ్య గారు, సావిత్రమ్మగారు.. మీరిద్దరూ వినండి.. నేను చెప్పటం పూర్తయ్యేలోపున మన మందరం ఈ టాక్సీ మీద మీ అబ్బాయి రవి ఉన్న రూమ్ కి వెళ్లిపోతాo..' సుబ్రహ్మణ్యం తను కొన్న మందులు.. డాక్టర్లు ఇచ్చిన సీట్లు బ్యాగ్లో పెడుతూ అన్నాడు.


'' ఏమిటి నస.. ఏమిటి జాగ్రత్తగా వినడం అసలు విషయం చెప్పవయ్యా''... చిరాగ్గా అన్నాడు సుందరయ్య.


సుబ్రహ్మణ్యం ప్రశాంతంగా చెప్పడం మొదలెట్టాడు

'' మేమిద్దరం చదువుకునే రోజుల నుండి స్నేహి తులం. మీఅబ్బాయి గుణం ముందు పురాణాల్లో సత్పురుషులు కూడా పనికిరారు. మీ భార్యాభర్త లిద్దరూ.. అతను చదువుకునే రోజుల నుండి మీ . ఆరోగ్యాల గురించి ఆలోచించుకోకుండా అవన్నీ దాచిపెట్టి తన కోసం తెగ ఖర్చు పెడుతున్నారని నాదగ్గర బాధ పడుతూ.. తెగ ఏడ్చేవాడు.. మీ అబ్బాయి రవి.అమ్మా నాన్నల రుణం తీర్చుకో వడం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు..మీ రవి బంగారం.... ఇంకా చెప్పాలంటే దేవుడు!!


కొడుకులందరూ దుర్మార్గులు అంటే ఎలా.. పురు షులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు..

కొడుకులoదు ఉత్తమ కొడుకులు కూడాఉంటారు. అలాంటి వాడే మీ రవి.


వాడు ఒకసారి నాతో ఏమన్నాడో తెలుసా.. 'మన సంపాదన మొదలయ్యాక ఇంట్లోకి కావల సిన సామాగ్రి కొనటం కాదు ఇల్లుని బాగు చేయడం కాదు రా సుబ్రహ్మణ్యo... ముందు మన అమ్మా నాన్న కు పూర్తి హెల్త్ చెకప్ చేయించాలి అనేది నా అభిప్రాయం రా' అని చెప్పేవాడు. నిజమే చదువు కునే రోజుల్లో ఎవరు మాత్రం ఏం చేయగలo. కష్టా లు చూస్తూ దిగమింగుకోవటం తప్ప. అదే జరిగి ఉంటుంది మీ రవి విషయంలో...కానీ ఇప్పుడు సమయం వచ్చింది. మీ ఇద్దరి పూర్తి ఆరోగ్య భద్రత అతని మొదటి ప్రధాన విధిగా భావించి.. ఏం చేయాలో అన్నీ... నాకు పురమాయించాడు. అందుకోసం నా దగ్గర మరో 5000 కూడా అప్పు తీసుకున్నాడు. ఇదంతా అతను మీకు చెప్పి అతనే చేయించవచ్చు.. కానీ మీరు ఇంత పెద్ద మొత్తంలో హాస్పిటల్ ఖర్చు కి ఒప్పుకోరని.. ఇది అనవసరం అంటారని.. ఏదన్నా వస్తే అప్పుడు చూద్దాంలే అంటారని... వేళాకోళం చేస్తారని..కోప్ప డతారని..ఈ పనంతా నాకు అప్పచెప్పాడు..


ఇందాకనే ఇక్కడ జరిగింది అంతా మీ అబ్బాయికి ఫోన్ చేసి కూడా చెప్పేసాను... అదిగో మాటల్లోనే మేమిద్ద రమూ ఉండే రూమ్ వచ్చేశాo''

సుబ్రమణ్యం కారు నుంచి సుందరయ్య, సావిత్ర మ్మలను క్రిందకు దించి రూమ్లోకి తీసుకువెళ్ళాడు.


ఎదురుగా ఆనంద వదనంతో కొడుకు రవి.

ఇప్పుడు అతని హృదయం పరవశించిపోతుంది.


'' అమ్మా నాన్నా..క్షమించండి.. మిమ్మల్ని బాధ పెట్టాను కదా..మీరు కోప్పడతారని..నా ఆలోచన తో .... ఆస్సలు ఏకీభవించరని ఇలా చేశాను. మీ ఇద్దరి ఆరోగ్యాలు చాలా బాగున్నాయని.. డాక్టర్లు అందరూ చెప్పారట. సుబ్రహ్మణ్యం ఫోన్లో అన్ని విషయాలు చెప్పాడు..అతను కొన్న ఈ కొద్దిపాటి మందులు మీరిద్దరూ వాడితే చిన్న చిన్న సమస్య లు ఉన్నా తగ్గిపోతాయట.''


రవి ఇంకా ఏదో చెప్పబోతూ తల్లిదండ్రులను కుర్చీలలో కూర్చోబెట్టాడు వాళ్ళ ముఖం వైపు చూస్తూ. వాళ్ళిద్దరి కళ్ళు చెమర్చి ఉన్నాయి.


'' అర్థమైందమ్మ.. మీరిద్దరూ కంగారు పడకండి. ఇప్పుడు నా తృప్తి కోసం ఇదంతా చేయించాను. మిగిలిన విషయాల కోసం మీరు అసలు ఆలో చించకండి ఇక నుంచి మన ఇంట్లోకి కావలసిన వన్నీ సమకూరుస్తానమ్మా. ఇల్లు కూడా బాగు చేయిస్తాను గా... నిజం నన్ను నమ్మండి.. మీకు ఇచ్చిన మాటలన్నీ నెమ్మది నెమ్మదిగా నిలబెడ తాను.. మీరు ఏమి ఆలోచించకండి మన ఇంటి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను గా.'' ప్రేమగా అన్నాడు రవి.


సుందరయ్య ..సావిత్రమ్మలు.. గుండెలోతుల్లోంచి ఉబికివస్తున్న బాధను ఆపుకోలేకపోతున్నారు


'' ఓహో అప్పుడప్పుడో బిర్లా మందిరం చూడాలని అన్నారు కదూ.. ఈ రోజే తీసుకెళ్తానమ్మ.. మీరు ఇష్టపడే ఆ దేవుడిని చూపిస్తాను..నాన్న .. నిజం.. తయారుకండి'' ..రవి ప్రేమతో తల్లిదండ్రులు వైపు చూస్తూ అన్నాడు.


"వద్దురా రవీ... మాకిద్దరికీ దేవుడు ఇక్కడే కనిపించాడు నాయనా.. ఇక ఏ గుడికీ... వెళ్లక్కర్లేదురా!" అంటూ కొడుకు మీద ప్రేమతో గట్టిగా కౌగలించు కుని.. ఆప్యాయంగా ముద్దాడుతూ తాము కొడుకుని అపార్థం చేసుకున్నందుకు ఎక్కి ఎక్కి రోదించడం మొదలుపెట్టారు.. సుందరయ్య సావిత్రమ్మ లు.


* సమాప్తం *


(చెడ్డ కొడుకులు ఎక్కువగా ఉండడం వల్ల కొంత మంది మంచి కొడుకుల మంచితనం మరుగున పడిపోయింది....'రవి'..లాంటి మంచి కొడుకులు అందరికీ ఈ కథ అంకితం)... రచయిత.


****

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం....


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు


70 views2 comments

2 Comments


Varalakshmi G • 2 hours ago

Kodukulandu vuthamakodukulu veraya chala bavundi 👌Rachayitha chala baga raseru

Like

Rama Krishna • 18 minutes ago

బాగుంది. రచయితకు అభినందనలు 💐💐

Like
bottom of page