top of page

కొవ్వొత్తి


'Kovvotthi' New Telugu Story


Written By Jidigunta Srinivasa Rao


'కొవ్వొత్తి' తెలుగు కథ


రచన : జీడిగుంట శ్రీనివాసరావు


(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


సీతారామయ్య సుందరమ్మలకి ఒక కొడుకు, కూతురు. చిన్న సంసారం, చిన్న ఉద్యోగం. వున్న ఆదాయం తోనే కొడుకు శ్రీరామ్ ని, కూతురు సుమని ఏలోటు రాకుండా పెంచి, కూతురుకి వున్నంతలో బాగానే ఖర్చు పెట్టి పెళ్లి చేసి పంపించాడు. కొడుకు శ్రీరామ్ ని ఎలా అయినా ఇంజనీరింగ్ చదివించి, కొడుకైనా తనలా చిన్న ఉద్యోగం చేస్తో యిబ్బంది పడకూడదు అని భావించాడు. అయితే మనం ఒకటి తలిస్తే దేముడు ఒకటి చేసాడు అని, శ్రీరామ్ ఎమ్. కామ్ చదివి బ్యాంకు ఉద్యోగం చేస్తాను, ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు లేక చాలా మంది ఖాళీగా వున్నారని తండ్రిని ఒప్పించాడు. సీతారామయ్య తన ఉద్యోగం లో గాని, మాములుగా గాని ఉపకారం చేయడమే తప్పా ఎవ్వరికీ తెలిసి అపకారం చెయ్యలేదు. అయితే తను ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే టైమ్ దగ్గర పడింది. దాచుకున్న డబ్బు కూతురు పెళ్ళికి, కొడుకు చదువుకి ఖర్చు చేసాడు. రిటైర్ అయిన తరువాత వచ్చే ఆ కొద్ది డబ్బుతో శేష జీవితాన్ని గడిపేయగలనని ధైర్యం వున్నా, ఈ లోపున కొడుకు ఉద్యోగంలో చేరి సెటిల్ అవుతాడా లేక కొడుకు ఉద్యోగం కోసం ఎవ్వరినైనా బతిమాలుకోవాలా అని బాధ మాత్రం వుంది. సీతారామయ్య చేసిన మంచి వల్లో, కొడుకు అదృష్టమో చదువు అయిన మూడు నెలలకే బ్యాంకు లో ఉద్యోగం సంపాదించుకున్నాడు శ్రీరామ్. ఉద్యోగం కూడా వున్న వూళ్ళోనే.కొడుకు సంపాదన లో కొంత యింటి ఖర్చుకి ఉపయోగించడంతో సీతారామయ్య మీద కొంత భారం తగ్గింది. పర్వాలేదు అనుకుంటూ వుండగానే సీతారామయ్య రిటైర్ అయ్యాడు. జీతం లేదు, పెన్షన్ అంటూ కొద్దిగా యిస్తున్నారు. యింకా కొడుకు సంపాదన తింటూ కూర్చుంటారా, పెళ్లి వయసు వచ్చింది,మంచి సంబంధం చూసి వాడి పెళ్లి కూడా చేసి బాధ్యత అయ్యింది అనిపించుకోండి అని పోరు పెట్టడంతో, కొడుకు అభిప్రాయం ఆడిగాడు. “డాడీ! మా బ్యాంకులో పనిచేస్తున్న అమ్మాయి నాకు నచ్చింది. మనవాళ్లే. మేము ఒకరికొకరు బాగా అర్ధం చేసుకున్నాము. రేపు ఆదివారం మన ఇంటికి రమ్మంటాను. మీరు, అమ్మా చూసి ఓకే అంటారని నా ఆశ” అన్నాడు సీతారామయ్య కొడుకు శ్రీరామ్. సీతారామయ్య ఒకసారి భార్య వంక చూసి, “సరే నీకు యిష్టం అయితే యింకా అభ్యంతరం ఏముంటుంది. అమ్మాయి ని ఒక్కదాన్నే రమ్మనక వాళ్ళ నాన్నగారిని తీసుకుని రమ్మను, ఆడపిల్ల తన పెళ్లి చూపులు తనే ఆరెంజ్ చేసుకోవడం తప్పు” అన్నాడు. ఆదివారం వచ్చింది. రాబోయ్ కోడలు ఎలా వుంటుందో చూడాలి అని ఉదయం నుంచి యిల్లు సద్ధినది సద్దుతో, హడావిడి పడిపోతోంది సుందరమ్మ. కొడుకు శ్రీరామ్ తలుపు చప్పుడైనప్పుడల్లా వులిక్కిపడుతు తలుపు దగ్గరికి వెళ్తున్నాడు. కొంతసేపటి కి అనుకున్న అమ్మాయి రానే వచ్చింది. రాగానే శ్రీరామ్ కి షేక్ హ్యాండ్ యిచ్చి సోఫాలో కూర్చొని వున్న సీతారామయ్య పక్కన వచ్చి కూర్చుంది. లోపలనుంచి మంచినీళ్ల గ్లాసు తీసుకుని వచ్చి అమ్మాయి కి యిచ్చి, “నీ పేరేమిటి అమ్మా” అని అడిగింది సుందరమ్మ. “నా పేరు సుచరిత, మీ అబ్బాయి చేసే బ్యాంకులో నేను కూడా ఆఫీసర్ని. మిగిలిన విషయాలు శ్రీరామ్ మీకు చెప్పే వుంటాడు. మా డాడి కి నేను ఒక్కదానినే సంతానం. ఆయన బాధ్యత నాకు లేదు, నా బాధ్యత ఆయన కి డబ్బు విషయంలో లేదు. మా డాడీ మంచి ఉద్యోగం చేసి రెండు నెలల క్రితం రిటైర్ అయ్యారు. పెన్షన్ బాగా వస్తుంది. యిహ శ్రీరామ్ చెప్పిన దాని బట్టి మీ బాధ్యత తన మీద వుంది అని తెలిసింది. అందుకనే మీ బాధ్యత తీరేవరకు మేము వివాహం చేసుకోము. మీకు తన సంపాదనతో కొంత ఆదాయం ఏర్పాటు చేసిన తరువాత మా పెళ్లి. నాకు ఫ్రీడమ్ కావాలి. యిలా నిక్కచ్చిగా, మొహమాటం లేకుండా మాట్లాడుతున్నానని మీరు ఏమి అనుకోకండి. పెళ్లి అయిన తరువాత మా తల్లిదండ్రుల బాధ్యత కానీ, నా భర్త తల్లిదండ్రుల బాధ్యత కానీ నా సంసారంలో వుండటం కొన్నేళ్లు నాకు యిష్టం లేదు” అంది కాబోయే కోడలు. తెల్లబోయి చూస్తున్న కొడుకు శ్రీరామ్ వంక చూసి సీతారామయ్య, “అబ్బాయ్, మీరిద్దరూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నారు కాని, అమ్మాయి మమ్మల్ని అర్ధం చేసుకోలేదు. చూడమ్మా, నేను నా యిద్దరు పిల్లలకి ఎటువంటి లోటు రాకుండా, వాళ్ళు చదువుకున్నంత వరకు చదివించాను. నీ మాటలు బట్టి రేపు పెళ్లి అయిన తరువాత వేరు కాపురం పెడతారని అర్ధం అయ్యింది. మా అబ్బాయి నీతో వచ్చేసినా, నాకు, మీ అత్తయ్య కి తినటానికి ఎటువంటి లోటు లేదు. పైగా మీ ఆయన మీద పెట్టే ఖర్చు కూడా వుండదు. మా బాధ్యత నువ్వు మీ ఆయన తీసుకునే అవసరం రానియ్యను” అన్నాడు సీతారామయ్య. "మీ పెద్దవాళ్ళని తీసుకుని వచ్చి మిగిలిన విషయాలు.. అంటే కట్నం గురించి కాదు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో నిర్ణయించటానికి మాట్లాడుకొండి” అని లేచాడు, అక్కడ ఎక్కువ సేపు కూర్చోవడం యిష్టం లేక. మొత్తనికి పెళ్లి జరిగిపోయింది. ఆడపిల్ల వారి నుంచి మర్యాదలకు లోటు లేదు. కొత్త పెళ్లికూతురు సుచరిత అత్తవారింట అడుగుపెట్టింది. పెళ్లి అయితే చేసాడు గాని తరువాత ఏమిగొడవలు వస్తాయో అని భయపడుతున్న సీతారామయ్యకి వేసవికాలంలో చల్లటి వానలా సుచరిత ఆఫీసుకి వెళ్లేదాక అత్తగారికి వంటింట్లో సహాయం చెయ్యడం, మామగారికి వేడినీళ్లు పెట్టి ప్లాస్క్ లో పోయటం మొదలగు ఇంటి పనులు చేసేది. సాయంత్రం మొగుడు పెళ్ళాం ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత కాఫీ కాచుకుని కప్పులతో సహా వాళ్ళ రూంలోకి వెళ్లిపోయేవాళ్లు. కొడుకు కోడలికి కావలిసిన ఫలహారం చేసి, సుందరమ్మ గారు భర్తకి పెట్టి తను తిని, పిల్లలకు బాక్సులో సర్ది పడుకునేది. బాగానే జరుగుతున్న సంసారం లో ఒక్కసారిగా కోడలికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యింది అని, తనుకూడా అక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నట్టు సీతారామయ్య కొడుకు శ్రీరామ్ చెప్పడం తో, నువ్వు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకునే బదులు తన ట్రాన్స్ఫర్ ఆపుకుంటే బాగుంటుంది కదా అన్నాడు సీతారామయ్య. “లేదు నాన్నా! తనకి సముద్రపు ఏరియా లో వుండాలని కోరిక వుంది. కానియ్యండి. ఆ మోజు తీరిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాము” అన్నాడు శ్రీరామ్. “విశాఖపట్నం రేపు గోదావరి ఎక్ష్ప్రెస్ లో బయలుదేరాలి అమ్మా” అని తల్లికి చెప్పి, అప్పుడే పడుకున్న తండ్రి దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చుని, “డాడీ! మేము మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నామని కోపంగా వుందా” అన్నాడు శ్రీరామ్ తడిసిన కళ్ళు తుడుచుకుంటూ. “అబ్బే! అటువంటిది ఏమిలేదు రా! ఎప్పటికైనా నిన్ను విడిచి వెళ్లిపోయే వాళ్ళమే. యిది ఒకందుకు మంచిది, మమ్మల్ని విడిచి వుండటం అలవాటు అవుతుంది. పిచ్చ ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్లి పడుకో, అప్పుడే పది దాటింది” అన్నాడు సీతారామయ్య. సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్ లో కొడుకుకోడళ్లను ట్రైన్ ఎక్కించి ఆటోలో ఇంటికి బయలుదేరారు సీతారామయ్య దంపతులు. “ఏమిటి.. ఏదో ఆలోచిస్తున్నారు?” అంది సుందరమ్మ భర్త తో. “ఏమీలేదు. మన అమ్మాయి పెళ్లి అయ్యి, అత్తారింటికి వెళ్తున్నప్పుడు నాకు దుఃఖం తన్నుకొచ్చి ఏడుస్తూ వుంటే మా అన్నయ్య ఓదార్చాడు. మరి 27 సంవత్సరాలనుండి శ్రీరామ్ ని చూడకుండా వుండని నేను, యిప్పుడు వాడు పెళ్ళాం తో వెళ్లిపోతో వుంటే ఎలా నిబ్బరంగా వున్నానా అని ఆలోచిస్తున్నా” అన్నాడు సీతారామయ్య. “అంతే సార్ జీవితం అంటే.. ప్రతీ తల్లిదండ్రులకి ఈ వేదన తప్పదు” అన్నాడు ఆటో అతను కళ్ళు తుడుచుకుంటూ. మొదట్లో ప్రతీ మూడు నెలలకి తల్లిదండ్రులతో గడిపి వెళ్లే శ్రీరామ్ ఆ తరువాత ఫోన్లో మాట్లాడటమే గాని హైదరాబాద్ వచ్చేవాడు కాదు. “మీకు ఒక శుభవార్త” అంది సుచరిత, భర్త శ్రీరామ్ తో. “ఏమిటి అంత శుభవార్త?”అన్నాడు. “మీరు నాన్న అవుతున్నారు” అంది. “ఎంత మంచి కబురు చెప్పావు సుచరిత, అయితే అబ్బాయి పుడితే వాడు కూడా మనల్ని వృద్ధాప్యం లో వదిలి వెళ్ళిపోతాడేమో” అన్నాడు విచారంగా. సుచరిత కి భర్త మాట గుండెల్లో గుచ్చినట్టయింది. “మనకు పుట్టిన వాళ్ళు అటువంటి పని చెయ్యరు కాని, మా అమ్మా, నాన్నలని రమ్మని పిలవనా, నాకు సహాయంగా వుంటారు” అంది. “అలాగే పిలువు” అని చెప్పులు వేసుకుని బయటకు నడిచాడు శ్రీరామ్. తిరిగి యింటికి వచ్చిన శ్రీరామ్, తన భార్య మొహం మాడి వుండటం చూసి, “ఏమైంది?మీ అమ్మా నాన్నా రానన్నారా” అని ఆడిగాడు. “ఛీ.. ఏం తల్లిదండ్రుల్లో, కూతురు కడుపుతో వుంది అని తెలిసి సంతోషించక, సహాయం గా వుండటానికి రమ్మంటే, ‘మా బాధ్యత నీది కాదు అని వెళ్లిన దానివి, నీ బాధ్యత నువ్వే చూసుకో’ అన్నాడు నాన్న. అమ్మ అసలు మాట్లాడలేదు” అంది. “ఎలా మాట్లాడుతారు? నువ్వు పెళ్లి అయ్యి యిక్కడికి వచ్చిన తరువాత, ఎప్పుడైనా నీ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడటం చూడలేదు. పైపెచ్చు వాళ్ళు ఫోన్ చేసి ఏమిచేస్తున్నావే అని అడిగితే, ‘ఏదో మా బాధలు మేము పడుతున్నాము, రోజూ నీకు రిపోర్ట్ చేయాలి అని అనుకోకు’ అని మీ అమ్మగారిని కసిరావు. ప్రపంచంలో తన అత్తమామలంటే పడని కోడళ్ళు ఉంటారని విన్నాను తప్ప తన తల్లిదండ్రులు అంటే కూడా పడని ఆడదానివి నువ్వే” అన్నాడు శ్రీరామ్. “సమయం దొరికింది కదా అని మీ దెప్పిపొడుపులు ఆపండి. తల్లిదండ్రులు అన్నా, అత్తమామలు అన్నా ప్రేమ లేక కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి తమకి పెట్టుబడి గా పనికివస్తారు అనే అభిప్రాయం నాకు నచ్చదు, రిటైర్ అయ్యాము కదా అని కొడుకు మీద ఆధారపడి బతకటం నాకు నచ్చదు. యిప్పుడు ఆ గొడవ ఎందుకు, మీ అమ్మగారిని, నాన్నాగారిని పిలుచుకుంటే సరిపోతుంది” అంది సుచరిత. “వాళ్ళు ఏమీ పనిమనుషులు కాదు. నీకు అవసరం అయినప్పుడు రావడానికి” అన్నాడు శ్రీరామ్. “అయినా మా నాన్న బాగా పట్టింపు మనిషి. అసలు నాతోనే మాటలు తగ్గించేసాడు” అన్నాడు. “మీకెందుకు, నేను వున్న అయిదు నెలలు అత్తయ్యా, మామయ్యగారు నన్ను కన్న కూతురులా చూసుకున్నారు. అన్నిటికి మీరే ముందు అడ్డం కొడతారు” అంది నెపం భర్త మీదకి తోస్తో. “బాగానే వుంది వరస! చూడు.. చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని పెళ్లి అవ్వగానే భార్య అనే మైకం లో పడి, తల్లిదండ్రులని వదిలేసి వేరు కాపురాలు పెట్టి, యిటు భార్య మీద మోజు, అటు వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఏమి చెయ్యాలో తెలియక కొవ్వొత్తిలా కరిగిపోయే మగవాళ్ళు పడే బాధ నీకు తెలియదు” అన్నాడు శ్రీరామ్. “అయినా నువ్వు ఒక్క నిజం చెప్పావు, మా డాడీ మనసు చాలా మంచిది, నువ్వు కడుపుతో ఉన్నావు అని చెప్పితే తప్పకుండా వచ్చేస్తాడు” అన్నాడు. “ముందుగా చెప్పకండి. ఈ రోజే ఫ్లైట్ కి బయలుదేరి హైదరాబాద్ వెళ్లి సర్ప్రైజ్ చేద్దాం” అంది సుచిరిత. సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి క్యాబ్ మాట్లాడుకుని బయలుదేరారు. “అమ్మ ఏమన్నా నువ్వు రియాక్ట్ అవ్వకు” అన్నాడు సుచరిత తో. విశాఖపట్నం నుంచి వచ్చినంత టైమ్ పడుతుంది ఎయిర్పోర్ట్ నుంచి యింటికి రావడానికి. తను పుట్టి పెరిగిన యిల్లు సమిపిస్తోవుంటే శ్రీరామ్ లో తెలియని చలనం కలిగి భార్య చెయ్యి పట్టుకున్నాడు. యింటి ముందు కారు ఆగటంతో, తమ యింటికి కారులో వచ్చే వాళ్ళు ఎవ్వరున్నారు అనుకుంటూ సర్దుకుని కూర్చున్నాడు సీతారామయ్య. కారులో నుంచి దిగి చూసిన సుచరిత కి అక్చర్యం వేసింది.. నాన్న యిక్కడ వున్నాడేమిటి అనుకుంటూ గేటు తీసుకుని, మామగారి కాళ్ళకి నమస్కరించి, తండ్రిన కొగిలించుకొని “నాన్నా! ఇదేమిటి యిక్కడ వున్నారు? నేను వస్తున్నాని తెలుసా?” అంది. కూతురు తల నిమురుతూ, “తెలియదమ్మా! నేను, అమ్మా ఏడాది నుంచి యిక్కడే వుంటున్నాము. మీ అమ్మకి హార్ట్ ఎటాక్ రావడం, పెద్ద ఆపరేషన్ చేసి బ్రతికించారు డాక్టరులు. నువ్వు మా బాధ్యత మాదే అని వెళ్ళిపోయిన తరువాత మేము ఒంటరిగా మిగిలిపోయాము. మీ మామగారు అమ్మకి జరిగిన ఆపరేషన్ గురించి తెలుసుకుని,మమ్మల్ని ఒంటరిగా వూరికి దూరంగా వున్న ఆ యింట్లో వుండటానికి వీలులేదని మమ్మల్ని కూడా వారితో పాటే వుంచేసుకున్నారు.యిప్పుడు వారికి మేము మాకు వాళ్ళు” అన్నాడు సుచరిత తండ్రి వియ్యంకుడి చెయ్యి పట్టుకుని కృతజ్ఞతగా. క్యాబ్ వాడికి డబ్బు యిచ్చి బ్యాగ్ పట్టుకొని లోపలికి వస్తున్న కొడుకుకి ఎదురు వెళ్లి, “బాగున్నావా శ్రీరామ్?”అన్నాడు సీతారామయ్య. అక్కడే వున్న మామగారిని చూసి, “బాగున్నారా మామయ్యగారూ” అని అడిగి, విషయం తెలుసుకున్నాడు. “పద.. అమ్మని, అత్తయ్యని చూద్దురు గాని” అని లోపలకి నడిచాడు సీతారామయ్య. సోఫాలో కూర్చొని భక్తి టీవీ చూస్తున్న సుందరమ్మ కి కొడుకు కోడలిని చూసి కలా నిజమా తెలియక, టీవీ ఆపేసి, పరుగున ఎదురువెళ్ళింది. ఆపరేషన్ తో ఓపిక లేక సోఫాలో తెల్లబోయి చూస్తున్న తల్లిని కొగిలించుకుని, “అమ్మా ఏమిటి యిలా అయిపోయావు” అంటూ ఏడవటం మొదలుపెట్టింది సుచరిత. “అమ్మకి యిప్పుడు భయం లేదు తల్లీ, నువ్వు వచ్చేసావుగా, యిహ చూడు.. నీకోసం రకరకాల పిండివంటలు చేసేస్తుంది” అన్నాడు సుచరిత తండ్రి. సుచరిత కళ్ళు తుడుచుకుని, అత్తగారి చెవిలో “మీరు బామ్మ అవుతున్నారు” అంది సిగ్గుపడుతూ. “విన్నాను తల్లీ, మీ అత్తగారు చెప్పిన దగ్గర నుండి ఎప్పుడు నీ దగ్గరికి వచ్చేద్దామా అని అనుకుంటున్నాము” అంది సుందరమ్మ. భోజనాలు ఆయిన తరువాత మేడ మెట్లు ఎక్కబోతున్న కోడల్ని, “మీరు కింద గదిలో పడుకోండి, నువ్వు మేడ మెట్లు ఎక్కకూడదు” అంది సుందరమ్మ. గదిలో పడుకుని భర్త మీద చెయ్యి వేసి, “నన్ను క్షమించండి, పిల్లలని పెంచటం తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళని వృద్ధాప్యం లో చూడాలిసిన బాధ్యత పిల్లలది కాదని మూర్ఖత్వం తో మిమ్మల్ని మీ తల్లిదండ్రులకి, నన్ను నేను నా తల్లిదండ్రులకి దూరం చేసుకున్నాను. భర్త సంతోషం, భార్య అత్తమామల్ని ప్రేమగా చుసుకున్నప్పుడే అని తెలియక పెళ్ళైన కొత్తలో ప్రతీ ఆడపిల్ల తన భర్త జీవితాన్ని నరకం చేస్తోంది. భార్య సంతోషం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడం భర్తల పని అవుతోంది. మామయ్యగారు ఎంతో మంచి వారు కాబట్టి మా తల్లిదండ్రులు కష్టం లో వున్నప్పుడు ఆదుకున్నారు. మనం విశాఖపట్నం లో పెద్ద యిల్లు తీసుకుని మనతోనే వీళ్ళని వుంచుకుందాము” అంది సులోచన. శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.











38 views2 comments

2 Comments


getrags555 • 2 hours ago

Bagundi

Like

ymanjula13
May 04, 2023

Very very nice

Like
bottom of page