'Kasintha Apyayatha Kusintha Adarana' New Telugu Story
Written By Neeraja Hari Prabhala
'కాసింత ఆప్యాయత - కూసింత ఆదరణ' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సాయంత్రం అయింది. అప్పుడే ఆఫీసునుంచి అలసిపోయి ఇంటికి వచ్చి, భార్య సీత ఇచ్చిన కాఫీ త్రాగుతూ పేపరు చూస్తున్నాడు రవి.
"ఏమండీ! మార్కెట్ కు వెళ్లి కూరలు తీసుకువస్తారా?" అన్నది సీత.
"సరే!" ఆని సంచి తీసుకుని మార్కెట్ కు బయలుదేరాడు రవి. ఇంటికి తిరిగివస్తూ దారిలో " హాయ్ రవీ!" అన్న పిలుపువిని ప్రక్కకు తిరిగి చూడగా కొద్దిదూరంలో రోడ్డు దాటి నడుస్తూ తనవేపే వస్తున్నాడు మధు.
తను, మధు డిగ్రీ దాకా కలిసి చదువుకున్నారు. చదువు పూర్తవగానే ఉద్యోగాల వేటలో ఎవరికి వారు విడిపోవడము, ఆ తర్వాత తనకు ఉద్యోగము, పెళ్లి అయి ఇక్కడ స్ధిరపడడము జరిగాయి. ఆతర్వాత మధు వివరాలు తెలియలేదు. మరలా ఇన్నేళ్లకు మిత్రుడిని చూసిన సంతోషంతో రవి ముఖం వెలిగిపోతోంది.
దగ్గరకు వచ్చిన మధు "ఏరా! బాగున్నావా? ఎన్నేళ్లయిందిరా నిన్ను చూసి?" అని అడిగాడు. సంతోషంతో రవి అతన్ని హత్తుకొని "హాయ్! మధూ! బాగున్నావా ? ఇక్కడికి దగ్గరే మాఇల్లు. రా! ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం" అని అతన్ని తీసుకుని ఇంటికి వెళ్లి భార్య సీతకు అతన్ని పరిచయం చేశాడు రవి.
నమస్కార ప్రతి నమస్కారాలయ్యాక ఇద్దరూ కూర్చుని సీత తెచ్చిన కాఫీని త్రాగుచూ "ఎలా ఉన్నావురా? ఇప్పుడు ఏంచేస్తున్నావు? పిన్ని ఎలాఉంది?" అని అడిగాడు రవి. మధు వాళ్ల అమ్మ శాంతమ్మగారిని రవి 'పిన్ని' అని పిలిచేవాడు.
"అమ్మ బాగుందిరా. నేను బాంకులో ఉద్యోగం చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి ట్రాన్సఫరయి ఇక్కడికి వచ్చి రెండు నెలలైంది. అమ్మ, నేను, నా భార్య, పాప ఇక్కడే ఉంటున్నాము. " అన్న మధు మాటలకు చాలా సంతోషించాడు రవి.
స్నేహితులిద్దరూ చాలా సేపు సరదాగా కాలేజీ కబుర్లు, అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. వాళ్లను తన ఇంటికి రమ్మని ఆహ్వానించి అడ్రసు ఇచ్చి వెళ్తున్న మధుని చూస్తూ ఉంటే కళ్లముందు గతస్మృతులు కదలాడాయి రవికి.
మధు వాళ్ల ఇల్లు తమ ఇంటి ప్రక్క సంందులోనే ఉండేది. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయిన మధుని శాంతమ్మ గారు మూడు గదుల స్వంత ఇంట్లో ఉంటూ, ఏదో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కష్టపడి పెంచి చదివించింది. ఆవిడ పేరుకు తగినట్లే శాంత స్వభావురాలు. అందరితో మంచిగా కలుపుగోలుగా ఉంటూ గౌరవంగా ఉండేది. మధు కూడా బాగానే చదివేవాడు. శాంతమ్మగారు తనని పెద్ద కొడుకులాగా చూసుకుని ఇంటికి వెళ్లినప్పుడు ప్రేమగా తనకు అన్నం కొసరి తినిపించేది. ఆవిడ ప్రేమాప్యయతలు మరువలేనివి. మరలా ఇన్నేళ్లకు ఇద్దరం కలుసుకున్నాం ' అనుకున్నాడు రవి.
"స్నేహితుడిని చూసిన ఆనందంతో మీకు ఆకలి కానట్లుంది. భోజనానికి లేవండి" అని నవ్వుతూ లోపలికి వెళ్లి భర్తకు భోజనం వడ్డించింది సీత.
ఆ తర్వాత ఏదో పనిమీద అటుగా వెళుతూ మధు ఇచ్చిన ఇంటి అడ్రసు ‘ఈ వీధిలోనే కదా! వాడింటికి వెళ్తే ఒకసారి వాడినీ, పిన్నిని చూడొచ్చు’ అనుకుని మధు ఇంటికి వెళ్లి
గేటు తీసి లోపలికి వస్తూ చుట్టూ పరికించి చూశాడు రవి. చుట్టూ పచ్చని పూలచెట్లతో చూడముచ్చటగా ఉన్న అందమైన పెద్ద ఇల్లు. 'వస్తున్నానని ముందుగా వాడికి ఫోన్ చేయలేదు, వాడు ఇంట్లో ఉన్నాడో? లేడో?' అని అనుకుని తలుపు తట్టబోతూ లోపలినుంచి మాటలు వినిపించి ఆగిపోయాడు.
"బీరువాలో పెట్టిన డబ్బు కనబడట్లేదు. మీ అమ్మగారు తీసుంటారు. గుడినుంచి ఆవిడ రాగానే మీరు గట్టిగా నిలదీయండి. మీరు అడుగుతారా? నేను అడగనా?" అని పెద్దగా రంకెలు.
దానికి జవాబుగా "అమ్మ అలాంటిది కాదు. ఆవిడ వచ్చే వేళయింది. వింటే చాలా బాధపడుతుంది. " అన్న సముదాయింపు.
"మీరు నామాటలు ఎప్పుడు విన్నారు కనుక? ఆవిడని ఏదైనా ఆశ్రమంలో చేర్చమని ఎన్నిసార్లు చెప్పినా వినరు కదా!" అన్న సంభాషణలకు నిశ్చేష్టుడై 'ఎలాగూ వచ్చాను కదా! వాడిని పలకరించి పోదాం' అనుకుని తలుపు తట్టాడు రవి.
తలుపు తీసిన మధు రవిని చూసి ఆశ్చర్యపడి ' ఇంతకు ముందు జరిగిన సంభాషణలను రవి విన్నాడేమో?' అని మనసులో బాధపడుతూ పైకి తెచ్చి పెట్టుకున్న నవ్వుతో “ఏరా రవీ! లోపలి రా! " అని ఆహ్వానించాడు.
'జయా!' అని భార్యను పిలిచి "వీడు నా స్నేహితుడు రవి. కలిసి చదువుకున్నాం. ఈవిడ నా భార్య జయ. " అని ఇద్దరికీ పరిచయం చేశాడు మధు.
"కూర్చోరా! పాపను తీసుకుని అమ్మ గుడికి వెళ్లింది. వచ్చే వేళయిందిలే". అని జయను కాఫీ తీసుకురమ్మని పురమాయించాడు. జయ తెచ్చిన కాఫీని అందుకుని త్రాగుచూ విలాసవంతమైన ఆ ఇంటిని పరికించి చూస్తూ "ఇల్లు చాలా బావుందిరా!" అన్నాడు రవి.
"ఊరిలో ఉన్న ఇంటిని అమ్మి ఈ ఇల్లు కొన్నానురా!" అన్నాడు మధు.
ఇంతలో గేటు చప్పుడికి అటుగా తలత్రిప్పి చూశాడు రవి. బక్కచిక్కిన ఒక పెద్దావిడ. ఆవిడకి సుమారు 60సం.. ఉంటాయేమో, సుమారు 4సం.. వయస్సు ఉన్న పాప చేతిని పట్టుకుని లోపలికి రావడం, ఆ పాప లోపలికి వస్తూనే రివ్వున పరిగెత్తుకు వచ్చి "నాన్నా!" అంటూ మధు ఒడిలో కూర్చోవడం లిప్తకాలంలో జరిగింది.
"మా అమ్మాయి స్వాతి" అన్నాడు మధు ఆ పాపని చూపిస్తూ. ముద్దుగా, ముచ్చటగా ఉన్న స్వాతి "నమస్తే! అంకుల్!" అంది రవిని. స్వాతి వైపు నవ్వుతూ చూశాడు రవి.
లోపలికి వచ్చిన ఆవిడతో "అమ్మా! వీడిని గుర్తుపట్టావా? వీడిని నీవు పెద్దకొడుకు అనేదానివి. గుర్తుందా ?" అన్నాడు మధు.
ఆ మాటలకు ఆవిడ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. రూపురేఖలు మారిన ఆవిడ ని చూసి మనసులో బాధపడుతూ "బాగున్నావా పిన్నీ ! నీ ఆరోగ్యం ఎలా ఉంది? అన్నాడు రవి.
ఆవిడ సంతోషంగా "బాగున్నాను. నీవెలా ఉన్నావు బాబూ! " అని కుశల ప్రశ్నలు వేసి లోపలికి వెళ్లింది.
కాసేపటికి లోపలినుంచి మాటలు వినబడుతున్నాయి. బీరువాలోని డబ్బు విషయం జయ ఆవిడని అడగడం, ఆవిడ గద్గద స్వరంతో తీయలేదని చెప్పడం, ఆ తర్వాత జయ అరుపులు, తను ఉన్నాననికూడా లేకుండా జయ ఆవిడని పదేపదే 'దొంగ' అనడం వినబడుతోంది. ఆ సంభాషణలను విన్న రవి ఖిన్నుడై మధు ముఖంవేపు చూశాడు. 'ఇవన్నీ మామూలే' అన్నట్టుగా ఉంది వాడి వాలకం.
ఇంక అక్కడ ఉండబుద్దిగాక రవి లేచి "వెళ్లొస్తారా! పిన్నికి చెప్పు వెళ్తున్నానని. వీలుచూసుకుని మీరందరూ మా ఇంటికి రండి". అని చెప్పి ఇంటికి వెళ్లాడు రవి.
ఆరాత్రి రవికి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆ మరుసటి రోజు ఆఫీసు పనులతో బిజీ అయ్యాడు. రెండు నెలల తర్వాత మధు వాళ్ల అమ్మని, భార్యను, స్వాతిని తీసుకుని తనింటికి రావడం, అందరూ సరదాగా గడపడం జరిగింది కొన్నాళ్ల తర్వాత రవి శాంతమ్మగారిని చూద్దామని మధు ఇంటికి వెళ్లాడు. గుమ్మంలోంచి స్వాతి పరిగెత్తుకుంటూ వచ్చి "అంకుల్! అమ్మ బామ్మని కోప్పడుతోంది. బామ్మ ఏడుస్తోంది. నాన్న ఇంట్లో లేరు" అంది.
లోపలినుంచి జయ వస్తూ "రండి! కూర్చోండి. ఆయన బయటకు వెళ్లారు" అని కుర్చీ చూపించింది.
కాసేపటికి హాలులోకి వచ్చిన శాంతమ్మగారిని చూసి "పిన్నీ! బాగున్నావా?" పలకరించాడు రవి.
'బావున్నాను' అన్నట్టు తలూపింది కానీ ఆవిడ తనతో ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లు, ఇక్కడ చెప్పే ధైర్యం లేనట్లు బేలగా ఉన్నాయి. ఆవిడ చూపులు. ఆవిడ పరిస్థితి కొంతవరకు అర్ధమైంది రవికి. కాసేపటికి మధు రావడం, ఏదో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకోవడం జరిగింది.
రవి లేచి వెళ్లబోతూ "పిన్నీ! నీవు గుడికి వెళ్లే వేళయినట్లుంది కదా! దా! నేను మరలా నిన్ను ఇంటివద్ద దింపివెళతాలే!" అన్నాడు రవి.
"సరే!" అని "గుడికి వెళ్లొస్తారా మధూ !" అని రవితో బయలుదేరింది శాంతమ్మ.
దారిలో రవి అడగ్గా ఆవిడ తన పరిస్థితిని వివరించింది. కోడలుకు తను ఆ ఇంట్లో ఉండడం ఇష్టంలేదనీ, అందుకే తనని ఎలాగైనా ఏదో ఆశ్రమానికి పంపాలనే ప్రయత్నాలు, భార్య మాటలకు ఎదురుచెప్పలేని మధు నిస్సహాయత అన్నీ వివరంగా చెప్పి బాధపడింది.
"బాధపడకు పిన్నీ! మంచి రోజులు వస్తాయిలే!" అని ఆవిడని ఓదార్చి గుడిలో దేవుడిని దర్శించుకున్నాక ఆవిడని వాళ్ల ఇంటివద్ద దింపి తనింటికి వెళ్లాడు రవి. రవికి మనసులో పదేపదే ఆవిడ పరిస్థితి గుర్తొచ్చి మనసు కకావికలమై 'ఈవయసులో ఆవిడకు ఎందుకీ బాధలు'? అని బాధపడ్డాడు.
భర్త ముఖం చూసి "ఎందుకలా ఉన్నారు? ఏమైంది?" ఆందోళనతో అడిగింది సీత. రవి జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.. "మీరు బాధపడకండి. ఆవిడను ఒప్పించి మనింటికి తీసుకొచ్చుకుని మనతోనే ఉంచుకుందాం. ఆవిడను నా కన్నతల్లి లాగా చూసుకుంటాను. ఏ లోటూ రానివ్వను. " అంది సీత.
"నీ లాంటి మంచి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. నా మనసులోని భావన కూడా అదే. నీకు ఎలా చెప్పటమా? అని తటపటాయిస్తున్నాను" అన్నాడు రవి.
"ఇదేనా! ఇన్నేళ్ల మన కాపురంలో మీరు నన్ను అర్థం చేసుకుంది? మన తనువులు వేరైనా మన మనసులు ఒకటే. మీ మాటను నేనెప్పుడూ కాదనను. మీరు నిశ్చింతంగా నిద్రపోండి" అంది సీత.
ఆ మాటలకి రవి ప్రేమగా సీతను మరింత దగ్గరకు తీసుకోగా భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది సీత.
ఆ మరుసటిరోజు రవి ఆఫీసునుంచి తిన్నగా మధు ఇంటికి వెళ్లాడు. కబుర్లయ్యాక మాటలమధ్యలో "ఒరేయ్ మధూ ! పిన్నిని కొన్నాళ్లు మా ఇంటిలో ఉంచుకుంటానురా. సీత కూడా తీసుకుని రమ్మని మరీమరీ చెప్పింది. ఆవిడ మాకు కూడా అమ్మలాంటిదే కదా! పంపిస్తావా?" అడిగాడు రవి.
"అమ్మని నీవద్దకు పంపిస్తే లోకం ఏమనుకుంటుందిరా? నేను అమ్మని సరిగ్గా చూడట్లేదని లోకం నిందిస్తుందిరా. బాగుండదు" అన్నాడు మధు. ఆ మాటలకు ఆశ్చర్యము, బాధ కలిగాయి రవికి. వాడికి తల్లి మీద ప్రేమ లేదు. లోకం ఏమనుకుంటుందో అని సమాజం కోసం తల్లిని చూస్తున్నాడు. ఇన్నాళ్లు భార్య మాటలకు ఎదురుచెప్పలేని వాడి నిస్సహాయత అని అనుకున్నానే గానీ ఇప్పుడు వాడి కుసంస్కారం తెలిసింది. డబ్బు, హోదా రాగానే మనుషులు మారుతారు అని విన్నాను గానీ తల్లితండ్రుల విషయంలో కూడానా?" అని అనుకున్నాడు రవి.
"ఆవిడని తీసుకెళ్లి మీ వద్దే ఉంచుకోండి. మరలా మా వద్దకు పంపద్దు. ఆవిడను ఎలా వదిలించుకోవాలా? అనుకున్నాను. ఎన్నోమార్లు ఆవిడని ఏదైనా ఆశ్రమంలో చేర్చమని ఈయనకి చెప్పాను. వినిపించుకోరాయే!. " అంది జయ.
ఆ మాటలకు మరింత బాధ పడ్డాడు రవి.
"మనింటికి వస్తావా పిన్నీ?" అన్నాడు రవి శాంతమ్మతో.
కొడుకు, కోడలి వైపు ఒక్క క్షణంచూసి " సరే! వస్తాను" అని సంచీలో కాసిని బట్టలు సర్దుకుని రవి వెంట బయలుదేరింది శాంతమ్మ.
గేటు దాటుతుండగా స్వాతి పరిగెత్తుకుని ఏడుస్తూ వచ్చి “బామ్మా! వెళ్లొద్దు. ఇక్కడే ఉండు. " అని కాళ్లకు చుట్టేసుకుంది.
ప్రేమగా ఆపసిదాన్ని లేవదీసి ఎత్తుకొని ముద్దిచ్చి "ఏడవకు. వస్తూ ఉంటాను కదా!" అని దాని కనులు తుడిచి స్వాతిని లోపలికి పంపింది శాంతమ్మ.
తన పైటకొంగుతో కళ్లుతుడుచుకుంటూ ఆ ఇంటివేపు పదేపదే చూస్తూ నడుస్తున్న శాంతమ్మని చూసి రవి కళ్లు చెమర్చాయి.
దారిలో ఆవిడ "రవీ! మధు చాలా మంచివాడు. వాడిని అపార్థం చేసుకోకు. భార్య మాటలకు ఎదురు చెప్పలేని నిస్సహాయుడు. నాగురించి వాడు బాధపడకూడదు. వాడు భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలి. అందుకే నీతో వస్తున్నాను" అంది.
"ఎంతైనా తల్లి మనసు కదా! తల్లి విలువ మధు ఎప్పుడు తెలుసుకుంటాడో? వాడిలో పరివర్తన ఎప్పుడొస్తుందో? సంపద అంటే ఆస్తి అంతస్థు, హోదా కాదు. ప్రేమ, ఆప్యాయత, అనుబంధము. 'తల్లిదండ్రులు అంటే తరగని పెన్నిధి ' అని వాడు తెలుసుకునే రోజులు త్వరలో రావాలి" అని మనసులో అనుకున్నాడు రవి.
ఇంటికి చేరగానే సీత ఎదురొచ్చి "రండి! అత్తయ్యా!" అని ఆవిడ చేయిపట్టుకుని లోపలికి తీసికెళ్లి సాదరంగా కూర్చోబెట్టింది. శాంతమ్మ కనులలో సంతోషంతో కూడిన ఆనందభాష్పాలు రవి దృష్టిని దాటిపోలేదు.
రోజులు గడుస్తున్నాయి. శాంతమ్మను ఏలోటూ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు రవి దంపతులు. శాంతమ్మ మనసు పదేపదే మధు, స్వాతిల మీద మరలి వాళ్లని చూడాలని ఉందని రవిని అడిగింది.
"సరే! వాడికి ఇప్పుడే ఫోన్ చేస్తాను పిన్ని" అని మధు సెల్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. "అలాగే రా! స్వాతి కూడా అమ్మ మీద బెంగపడి చూడాలని అంటోంది. ఇద్దరం రేపు వస్తాము. ఏదీ! అమ్మకు ఫోనివ్వు" అన్నాడు మధు.
రవి ఇచ్చిన ఫోన్ అందుకుని " హలో! మధూ! ఎలా ఉన్నావురా? స్వాతి ఎలా ఉంది? కోడలు కులాసానా?" గబగబా ప్రశ్నల వర్షం కురిపించింది శాంతమ్మ.
"అమ్మా! నీవెలా ఉన్నావు? మేము బాగానే ఉన్నాము. నిన్ను చూడాలని ఉంది. స్వాతి కూడా నీమీద బెంగపడి నిన్ను చూడాలంటోంది. మేము రేపు నీవద్దకు వస్తాము " అన్నాడు మధు. తర్వాత రవి, మధులు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని ఫోన్ పెట్టేశారు.
మధు, స్వాతిలు వస్తున్నారన్న సంతోషంతో ఆ రాత్రి శాంతమ్మకు కలతనిదురే అయింది. ఆ మరురోజు ఉదయాన్నే మధు, స్వాతి రవి ఇంటికి వచ్చారు. స్వాతి లోపలికి వస్తూనే "బామ్మా" అంటూ వచ్చి శాంతమ్మను చుట్టేసింది. ఆవిడ దాన్ని ఎత్తుకొని ముద్దుపెట్టుకుంది. మధు "అమ్మా" అంటూ దగ్గరకు వచ్చి పలకరించాడు శాంతమ్మని.
"ఏరా! మధూ! ఎలా ఉన్నావురా?" అడిగింది ఆవిడ.
"బావున్నాను" అన్నాడు మధు.
ఆతర్వాత టిఫెన్లు చేస్తూ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. స్వాతి తన స్కూలు కబుర్లు చెబుతూ గలగలా మాట్లాడుతుంటే ముగ్ధురాలై వింటోంది శాంతమ్మ.
"అమ్మా ! మేము వెళ్లొస్తాము. స్వాతీ! ఇంక బయలుదేరుదామా?" అన్నాడు మధు.
"నాన్నా! బామ్మని మనతో మనింటికి తీసుకెళదాం. బామ్మ రానిదే నేను రాను". అని శాంతమ్మ వేపు తిరిగి " బామ్మా! నీవు మాతో రావాలి" అంది స్వాతి.
"అమ్మా! నీవు రా! జయ స్వభావం నీకు తెలీనిది కాదు. తన మాటలను పట్టించుకోవద్దు" అన్నాడు మధు.
"లేదురా! రాలేనురా! నేను వస్తే అక్కడ నాకు మనశ్శాంతి ఉండదు. జయ మాటలను ఎంత పట్టించుకోకపోయినా ఏదో ఒక సమయంలో నా మనసుకు బాధ కలుగుతుంది. ఈ వయసులో నాకు బాధలు వద్దురా! ఆప్యాయత, ఆదరణ కావాలి. అవి ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. నాకు తెలుసు నేనంటే నీకిష్టమని. కానీ నీ నిస్సహాయతను నేనర్థం చేసుకున్నాను. అందుకే రవితో వచ్చేశాను. ఏమీ అనుకోకు. రాలేనురా!" అంది శాంతమ్మ.
తల్లి 'తను రాలేను' అన్నందుకు మనసులో బాధ కలిగినా తనింట్లో జయ వలన తన తల్లి ఎన్ని బాధలు పడిందో తనకు తెలుసు. ఆవిడ క్షేమంగా, మనశ్శాంతిగా ఉండడమే తనకు కావాలి అని తన మనసుకు తానే సర్దిచెప్పుకున్నాడు మధు.
"స్వాతీ! నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్నతో నా వద్దకు వస్తూవుండు. ఇప్పుడు నీవు నాన్నతో వెళ్లు. రేపు స్కూలు ఉంది కదా! నా బంగారు తల్లివి కదూ!" అని దాన్ని దగ్గరకు తీసుకుని ఎత్తుకొని ముద్దుపెట్టుకుంది. బామ్మకు ముద్దిచ్చి ఇంక చేసేదిలేక "బై" చెప్పి తండ్రితో బయలుదేరింది స్వాతి.
వాళ్ల వద్ద శెలవు తీసుకుని మధు స్వాతిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. వాళ్లు వెళ్లాక కాసేపు అలాగే మూడీగా కూర్చున్న శాంతమ్మ మనసుని రవి, సీతలు అర్ధం చేసుకున్నారు.
"అత్తయ్యా! స్వాతి వాళ్లు ఉండేది ఈ ఊరిలోనే కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము అక్కడికి వెళ్లి మధు వాళ్లని చూసిరావచ్చు. అలాగే వాళ్లని రమ్మంటే వాళ్లూ వస్తారు. ఇది కూడా మీ ఇల్లే. మీరు ప్రశాంతంగా ఉండటమే మాకు కావాలి. నేను మీ పెద్ద కోడలినే" అంది ప్రేమగా శాంతమ్మ చేతులను పట్టుకుని సీత.
"మరి నేనో! పిన్నీ! నీవు చెప్పు". అంటూ నవ్వుతూ దగ్గరకు వచ్చాడు రవి.
"నీవు నా పెద్దకొడుకువి. నేను మీ అమ్మనే" అని చెమర్చిన కనులతో వాళ్లిద్దరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది శాంతమ్మ.
ముగ్గురూ కాసేపు సరదాగా, నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి అత్తాకోడళ్లిద్దరూ ఏదో పనుందని వంటింట్లోకి వెళ్లారు. వాళ్లు వెళ్లిన వైపే సంతోషంగా చూస్తూ ఉన్న రవి తనకు ఇంత మంచి భార్యను ఇచ్చినందుకు మనసులోనే ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
రోజులు సాఫీగా గడుస్తున్నాయి. వీలు కుదిరినప్పుడల్లా మధు, స్వాతి వచ్చి కాసేపు శాంతమ్మతో, రవి వాళ్లతో సరదాగా గడపడం పరిపాటి అయింది. వాళ్లు తన కనులముందు కనపడుతుంటే శాంతమ్మ మనసు సంతోషపడుతోంది. ఒకటి, రెండు సార్లు శాంతమ్మని తీసుకుని రవి దంపతులు మధు వాళ్లింటికి వెళితే ఏదో ఫార్మాలిటీగా అన్నట్టు పలకరించి ముభావంగా ప్రవర్తించిన జయ తీరుకి బాధపడి 'జయ స్వభావం మారలేదు' అనుకుని మిన్నకుంది శాంతమ్మ.
కొన్నాళ్లకు సీత గర్భవతయింది. రవి, శాంతమ్మలు చాలా సంతోషించారు. తల్లి తండ్రులు లేని సీతకు తనే తల్లి లాగా అయి ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటోంది శాంతమ్మ. నెలలు నిండి సుఖప్రసవం జరిగి చక్కటి ఆడపిల్లను కన్నది సీత. ఆ పాపకు 'శాంతి' అని శాంతమ్మ పేరును పెట్టుకున్నారు రవి దంపతులు.
స్వాతి, మధు ఆ పాపను చూసి చాలా సంతోషించారు. ఆపాపకు తన తల్లి పేరును పెట్టుకున్నందుకు రవి దంపతులను మెచ్చుకంటూ కృతజ్ఞతలు తెలిపాడు మధు.
"మనలో మనకు కృతజ్ఞతలు ఏంటిరా? అమ్మకు నేను పెద్ద కొడుకుని" నవ్వుతూ మధుని హత్తుకున్నాడు రవి.
అల్లారుముద్దుగా పెరుగుతోంది శాంతి. దాని ముద్దు ముద్దు మాటలకు, ఆటలకు మురిసిపోతోంది శాంతమ్మ. వారాంతంలో స్వాతి వచ్చి శాంతితో, బామ్మతో హాయిగా గడుపుతోంది. శాంతితో ఆడుకోవడం స్వాతికి ఇష్టం. వాళ్లిద్దరినీ చూసి ముచ్చటపడుతోంది శాంతమ్మ.
కొన్నినెలల తరువాత శాంతమ్మకు గుండెపోటు వచ్చి కార్డియాక్ అరెస్టుతో నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూసింది. జరిగిన దారుణానికి రవి, సీతలు చాలా. బాధపడి మధు వాళ్లకు కబురుచేశారు. విషయం విన్న వెంటనే పరుగు పరుగున వచ్చారు మధు, స్వాతిలు. ఆ దుర్వార్తను మధు జయకు చెపితే జయ విని ఊరుకుందే గానీ శాంతమ్మని చూసేందుకు రాలేదు.
శాంతమ్మని కడసారి చూసి చాలా రోదించారు మధు, స్వాతిలు. "నన్ను క్షమించమ్మా" అని రోదించాడు మధు. రవి దంపతులు వాళ్లని ఓదార్చారు. జరగవలసిన తతంగాన్ని పూర్తి చేయాలని రవి చెప్పాడు మధుకి.
"నేను అమ్మ కడుపున పుట్టినా ఆవిడని దగ్గరుంచుకుని ప్రేమగా చూడలేకపోయాను. సేవ చేయలేకపోయాను. నీవు చాలా ప్రేమగా కడదాకా అమ్మని చూసుకున్నావు. 'నీవు పెద్దకొడుకువి ' అని అమ్మ అన్నట్లుగానే ఆవిడని కంటికిరెప్పలా నీవు చూసుకున్నావు. నీవే అమ్మకు తలకొరివి పెట్టు. ఇంక నుంచి మనం అన్నదమ్ముల్లాగా ఉందాము" అన్నాడు మధు.
మధు మాటలకు చాలా సంతోషించి "సరే" అని రవే శాంతమ్మకు తల కొరివి పెట్టాడు. స్నానాది కార్యక్రమాలు పూర్తవగానే మధు స్వాతిలు భోజనం చేసి బాధాతప్త హృదయంతో వాళ్లింటికి వెళ్లారు.
తన ఇద్దరి కొడుకులను చూసి శాంతమ్మ ఆత్మ శాంతించి వాళ్లని చల్లగా ఉండమని దీవించింది.
సమాప్తం..
|
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
VBM Rao • 29 minutes ago
కథ చాలా బాగుంది. కథ వ్యాఖ్యానం చాలా బాగుంది. అభినందనలు.