top of page

కూర'గాయాల' కడగండ్లు



'Kura Gayaala Kadagandlu' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana

'కూర గాయాల కడగండ్లు' తెలుగు కథ

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


'ఏమండీ.. శ్రీ వారు.. ఇంట్లో కూరగాయలు పూర్తిగా నిండుకున్నాయ్! ఇంటి ఖర్చుకు మీరిచ్చేది.. బజార్లో మండుతున్న కూరగాయల ధరలతో.. ఏ మూలకు సరిపోవటం లేదు!.. నెలలో మొదటి రెండు వారాలకే చేతిలో చిల్లిగవ్వ మిగలటం లేదు! నిత్యం వాడే టమాటా, ఉల్లి, మిర్చి, ఆలూ.. ధరలు ఏవీ.. బజార్లో అందుబాటులో లేవు! ఇక నా వల్ల కాదు.. ఖర్చులు మేనేజ్ చెయ్యడం!.. ఇక మీదట మీరు తెచ్చే వాటితో వంట చేయడమే.. నా పని..' అంటూ భర్తకు నోటీసు ఇచ్చింది.. ఆ ఇంటి ఇల్లాలు గాయిత్రి.


భర్త సదానందానికి భార్య నిస్సహయత అర్ధమైంది! అతనికీ తెలుస్తోంది రోజువారీ పరిస్థితి. అయినా ఇంటి పెద్దగా భరించకా తప్పదు!.. సంసారం సాగించకా తప్పదు మరి!.. ఆలోచనాపరుడు కాబట్టి నిదానంగా భార్యకు చిన్నగా.. అనునయంగా.. నచ్చచెప్పడానికి పూనుకున్నాడు.


'చూడు.. భార్యామణీ!.. నువ్వు చెప్పిందేదీ నాకు తెలియంది కాదు!.. ప్రస్తుత గడ్డు రోజుల్లో సంసారాన్ని మోస్తున్న మనమిద్దరం సర్దుబాటు చేసుకోక తప్పదుగా!. నేను చెప్పేది కాస్త.. శాంతంగా.. ఓపిగ్గా ఆలకించి.. గ్రహించు. వీలయితే అనుకూలతను బట్టి ఆచరించి.. సమస్య పరిష్కారానికి ప్రయత్నిద్దాం!.. సరేనా?!' అంటూ ఉపోద్ఘాతంతో.. అనునయంగా తన మనసులో విషయం వివరించటం మొదలుపెట్టాడు సదానందం.


'గాయత్రీ.. ప్రకృతి నుంచే కదా.. మనం మనకు అవసరమైన ఆహారాన్ని పొందుతున్నాం!.. ముఖ్యంగా శాకాహరాన్ని!.. ప్రకృతిలో.. భోజ్యానికి అనువైన వాటిని గుర్తించి.. తగిన విధంగా సేద్యం చేసి.. అవసరానికి తగ్గట్టుగా ఉత్పత్తి చేసుకుంటున్నాం!.. అవునా?!..'


'నాగరిక ప్రపంచంలో కొన్నింటికే అలవాటు పడి.. వాటి లభ్యత కొరవడినప్పుడు.. అలజడి ఆందోళన చెందటం పరిపాటిగా మారింది!.. సమయానుకూలంగా లభించే ఇతర కూరగాయల జోలికి పోకుండా.. కొరతగా ఉన్నవాటికై గగ్గోలు పడడం.. సబబు కాదు!.. నిజానికి కొంత కాలం క్రితం వరకూ.. ఈ టమాట, బీట్రూట్, కేరెట్, ఆలూ వంటివి అరుదుగా వాడినవారే.. నేడు వాటిని నిత్యావసర సరుకులుగా దేవిరిస్తున్నారు! కొన్ని అలవాటైన కూరలు, వంటలు కనుమరుగవుతున్నాయి! సాంప్రదాయ వంటల స్థానే ఆధునిక సమాజం.. విదేశీ రుచులకు.. ఫాస్ట్ ఫుడ్సు.. , పిజ్జా, బర్గర్, పాస్తా వంటి మసాలా రుచులకూ అలవాటు పడి.. వివిధ ఉదరకోశ వ్యాధులకు గురవుతున్నారు!..'


'అటవీ ప్రాంతాల్లో నివసించే.. ఆదివాసీలు, కొండజాతి ప్రజలు.. సాగుచేయని, .. గట్ల మీద, కొండ చరియలలో పెరిగే వివిధ రకాల ఆకులు, కాయలు, పండ్లు, దుంపలు తిని.. బలంగా ఆరోగ్యంగా బతుకుతున్నారు! పూర్వం ఎన్నో రకాల పంటలు, ఆహరం సహజంగా లభిస్తూ.. సాగుచేయనివే.. ఉండేవి!


ఇప్పుడు వ్యవసాయం ఖరీదైన వ్యవహారంగా మారింది! క్రిమిసంహారక మందుల వాడకం వల్ల.. సహజ పంటలు కూడా అంతరిస్తున్నాయి! ప్రకృతి ఆధారిత పంటల్ని కాపాడుకోక పోతే.. జీవ వైవిధ్యం దెబ్బతినటం ఖాయం!. సహజ సాగు పంటల్లోని పోషకాల సారాన్ని, .. సహజ విత్తన పెరటి పైరుల అవసరాన్ని.. మనం, .. రైతులు, ప్రభుత్వాలు.. గ్రహించాలి!


సేంద్రీయ ఎరువులతో పండించే.. కూరలు, ఆకుకూరలు.. మాంసం కంటే కూడా.. ఎక్కువ పోషకాలతో.. శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి!..'


'వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న వంటి సాంప్రదాయ వ్యవసాయ సాగు పంటలే కాదు.. ఇంకా సేంద్రీయంగా సాగుచేయతగ్గ పంటలు.. చాలానే ఉన్నాయి!.. అంతరించి పోతున్న సాగు చేయని పంటలను సంరక్షింప వలసిన అవుసరం ఎంతైనా ఉంది! ఇటీవల అందరిలో ఆరోగ్యం పట్ల.. చైతన్యం పెరగడం వల్ల.. పాత పంటలు మళ్లీ తిరిగి జీవం పోసుకుని.. రాగులు, కొర్రలు లాంటి వివిధ చిరు ధాన్యాల పట్ల.. ప్రపంచ వ్యాప్తంగా.. ఆసక్తి, ఆదరణ క్రమంగా పెరుగుతోంది!'


'పరిశీలన అధ్యయనం ద్వారా తెలిసే విషయం ఒక్కటే! మన చుట్టూ పనికివచ్చే మొక్కలు చాలానే ఉంటాయి! వాటిని గుర్తించి, .. పెరట్లో పెంచి.. వాడుకుంటే చాలా మంచిది! ఆరోగ్యానికే కాకుండా, డబ్బు ఆదాకి కూడా ఎంతో మేలు!.. మనం పెరట్లో సేంద్రీయంగా పెంచగలిగే పోషకాహరాన్ని తినకుండా.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నాం!!'


'ఇకనైనా నిర్లక్ష్యాన్ని వదిలి, .. ప్రకృతి ప్రసాదం!.. పెరటి సేంద్రీయ పంటలను ఆస్వాదిద్దాం.. మన కుటుంబ ఆరోగ్యాన్ని సదా కాపాడుకుందాం!.. ఏమంటావ్?.. గాయత్రీ!..' అంటూ ముగించి, .. సాలోచనగా భార్య వైపు చూసాడు సదానందం.


భర్త ఆలోచన ఆంతర్యం, .. విషయం అర్ధం చేసుకున్న గాయత్రి.. మెచ్చుకోలు అంగీకారంగా తల పంకిస్తూ.. ‘సరేనండీ!.. రేపే.. మన పెరట్లో.. సేంద్రీయ సాగుకు శ్రీకారం చుడదాం!.. కానీ.. ప్రస్తుతానికి బజారుకెళ్ళి మీకు నచ్చిన, అనువైన.. కూరలు, ఆకుకూరలు తెస్తేనే.. ఈరోజుకి వంట..' అంటూ ముక్తాయించిందా ఇల్లాలు!


భార్యను ఒప్పించి గెలుపు సాధించిన ఉత్సాహంతో సంచీ తీసుకుని బజారు వైపు నడిచాడా భర్త!


- సమాప్తం -


గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/vsg

ముందుగా మన తెలుగు కధలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కధలను, కధకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు. నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను. స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కధలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కధలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!



50 views0 comments
bottom of page