top of page

కూటి కోసం మార్గాలెన్నో

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #KutiKosamMargalenno, #కూటికోసంమార్గాలెన్నో, #TeluguStories, #తెలుగుకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Kuti Kosam Margalenno - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 27/11/2024

కూటి కోసం మార్గాలెన్నో - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


 "ఏటి, పెద్దయ్యా! కాళీగా కూర్చున్నావు? మనవడు శ్రీను కనిపించడేంటి ?" ఇంటి గుమ్మం ముందు చుట్ట కాలుస్తున్న నర్సయ్యను అడిగాడు సన్యాసి రావు. 


"ఏంది సెప్పేదిరా, సన్నాసీ! ఎవసాయం లేక ఊళ్ళో పనులు లేకపోయె. పట్నం మేస్త్రి వచ్చి వయసు కుర్రోళ్లను బవనాల ఇంటి పనులకు తోలుకుపోయాడు. ఆడోళ్లు పీచుఫేక్టరీలో పనులకు పోయినారు. నాలాటి ముసలోళ్లం ఇంటి కాడనైన గంపలు బుట్టలు అల్లుకుందామంటే అన్నీ ప్లాస్టిక్ సరుకులు వచ్చి కొనేవాళ్లు లేకపోయె. కంటి చూపు తగ్గి ఏ పనీ కుదురుగా సేయలేకపోతున్నా. " తన ఆర్థిక ఇబ్బందుల గోడు వెళ్లబోసుకున్నాడు నర్సయ్య తాత. 


"అరె, సన్నాసీ! నాకు తెలవక అడుగుతున్నా. పట్నంలో నువ్వు ఏదో పెద్ద ఏపారం చేస్తున్నావటగా. డబ్బులు దండిగా జమచేసేవట. మీ అమ్మ సెప్పినాది " మనసులో మాట

అడిగాడు తాత. 


"ఔను పెద్దయ్యా, కమిషన్ ఏపారం చేస్తున్నా. పట్నంలో ఒక సేట్ తో కలిసి ఈ ఏపారం మొదలెట్టా. నీ బోటి ముసలి తాతల్ని, ముసలవ్వల్ని, పనీ పాటు లేని ఆడోళ్లకి పని

ఇస్తున్నాము. ఆళ్లకి రోజుకి ఇంతని డబ్బులు ఇచ్చి తిండి,  ఉండటానికి నివాసం ఏర్పాటు చేస్తాం" పట్నంలోని తన ఏపారం గురించి వివరాలు చెప్పాడు సన్యాసి రావు. 


"ఒరె సన్నాసీ ! నాకూ అలాంటి కొలువు సూడరా. డబ్బులు లేక ఇబ్బందిగా ఉంటున్నాది. పెద్ద పనులకి పోదామంటే ఒంట్లో శక్తి లేకపోతోంది. " తన కష్టాలు ఏకరువు పెట్టాడు

 ముసలి తాత. 


"నేను ఆ పని మీదే వచ్చినాను పెద్దయ్యా, పట్నంలో నీలాంటి ముసలోళ్లకు పని చూసినా. ఒళ్లు కష్టం లేకుండా కూకునే డబ్బులు సంపాదించ వచ్చు. రోజు తిండికి మేమే అన్నీ బందోబస్తు చేస్తాము. వారానికో పదిరోజులకో పారి ఇంటికి వచ్చి మళ్లా పట్నం రావాలి, అంతే" అన్నాడు

సన్యాసి రావు. 


"ఔను, నీ మనవడు శ్రీను ఎటుపోయినాడు. ఆడితో పనుండి వచ్చినాను" అడిగాడు సన్యాసిరావు. 


"ఏం సెప్పేదిరా సన్నాసీ! ఆడు సదువు సంద్యా లేకుండా బలాదూర్ గా దోస్తులతో చెట్టా పట్టాలేసుకుంటూ ఊరంట తిరుగుతుండు. నువ్వు పట్నంలో కొలువు చేస్తున్నావటగా, 

శ్రీనుగాడికి కూడా ఏదైనా నౌకిరీ చూడరా, నీ పేరు చెప్పుకుంటాము" నర్సయ్య ప్రాధేయ పడ్డాడు. 


"అలాగే పెద్దయ్యా, శ్రీనుకి టౌన్లో మంచి ఆదాయం వచ్చే కొలువు చూసాను. నాతో పట్నం తీసుకు పోతా. నువ్వేమీ దిగులు పడక. ఆడు ఇంటికి రాగానే నన్ను కలవమను" భరోసా ఇచ్చాడు సన్నాసి. 


 మర్నాడు "అన్నా, నిన్ను కలవమన్నావట. తాత చెప్పేడు." శ్రీను అడిగాడు. 


"అవున్రా శీను, నువ్వు పని లేకుండా బలాదూర్ గా తిరుగుతున్నావటగా. నాతో పట్నం వస్తే అక్కడ నీకు మంచి ఆదాయం వచ్చే పని చూసినా. కష్టం లేకుండా డబ్బు సంపాదించ వచ్చు. నీ జల్షాలకు మస్తుగా చేతిలో పైసలు ఉంటాయి. రెండు రోజుల్లో నేను పట్నం పోతా. నీ దోస్తుల్ని కూడా వెంట తోలుకురా. ఆళ్లకీ బ్రతుకు తెరువు చూద్దాం " సన్యాసిరావు తను వచ్చిన పనిలో పడ్డాడు. 


ఇలా సన్యాసిరావులాంటి ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో బలాదూర్ గా తిరిగే యువకుల్నీ, ముసలోళ్లను పట్నం రప్పించి వారి చేత బిక్షాటన, దొంగతనాల రొంపిలోకి దింపి డబ్బులు సంపాదన సాగిస్తుంటారు. 


ముంబైలో రద్దీగా ఉండే దేవాలయాలు, ట్రాఫిక్ జంక్షన్లు, రైల్వే ప్లాట్ ఫారాల వద్ద కాంట్రాక్టు తీసుకుని బిక్షగాళ్ల దంధా నడిపే ఒక రౌడీ షీటర్ సిటీకి వచ్చి పబ్లిక్ పార్కుల్లో, ఫుట్ పాత్ ల మీద, రైల్వే ప్లాట్ ఫారాల మీద బేవర్సుల్లా తిరిగే కుర్రాళ్లను ముసలోళ్లను చేరదీసి సిగ్నల్ పాయింట్లు, రద్ధీగా ఉండే దేవాలయాల వద్ద బిక్షాటన చేయిస్తు వారికి తిండి, నివాసం ఏర్పాట్లు చేసి రోజూ వారు సంపాదించిన డబ్బులో కొంత ఇచ్చి మిగతాది తను తీసుకుంటాడు. ఆవారాగాళ్లను వెంట ఉంచుకుని అవుసరమైతే వాళ్లకి ఆయుధాలిచ్చి దంధాకు అడ్డు వచ్చిన వాళ్లను అంతం చేయిస్తాడు. 


 కొంతమంది కుర్రాళ్లను చేరదీసి ఏజెంట్లుగా పెట్టి వారి ద్వారా అసాంఘిక  కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. వారు గ్రామాలంట తిరుగుతు ముసలివారిని, వికలాంగుల్ని డబ్బులు ఆశ చూపి వారి ద్వారా బిక్షాటన చేయిస్తు బాగా సంపాదిస్తున్నాడు. 


యువతుల్ని ఉద్యోగాల పేరుతో రప్పించి బలవంతంగా పార్కులు, నిర్జన ప్రదేశాల్లో వ్యభిచారం చేయిస్తు డబ్బులు కూడబెడుతున్నాడు. అలాగే యువకులికి మేకప్ వేయించి కృత్రిమ వస్త్ర ధారణతో హిజ్రాలుగా మార్చి గ్రూపులుగా చేసి శుభకార్యాలు, పసిపిల్లల పుట్టినరోజు వేడుకలు, హోలీ వంటి సంబరాలప్పుడు, చీకటి ప్రదేశాల్లో వారి ద్వారా అసందర్భ పనులతో జనాలను భయపెట్టి డబ్బులు గుంజుతాడు. 


మురికి వాడల్లోని పసిపిల్లల తల్లులను డబ్బు ఆశపెట్టి వారితో ట్రాఫిక్ సిగ్నల్సు వద్ద, ఫుట్ పాత్ ల పైన బిక్షాటన చేయిస్తాడు. చిల్లర సమస్య ఉన్న ప్రాంతాల్లో స్వైప్ మిషిన్లు పంపకం చేస్తాడు. చిల్లర నాణేలు కమిషన్ పద్దతిలో దుకాణాలకు, గుళ్ల దగ్గర అందచేస్తాడు. 


 కొంతమంది యువకులకు నెంబరు ప్లేట్ లేకుండా టూ వీలర్ ద్వారా ఆడవారి మెడలో బంగారు వస్తువులు ఎత్తుకెళ్లడంలో తర్ఫీదు ఇప్పించి ధనం సంపాదిస్తున్నాడు. యువతకు మాదక పదార్థాలు రవాణా చేయించి డబ్బు సంపాదన చేస్తూ, ఎవరైన ఎదురు తిరిగితే తన అనుచరుల ద్వారా వారి కాళ్లు, చేతులు తీయించడం, అవుసరమైతే వారిని చంపించి మురికి కాలువల్లో పడవేయిస్తాడు. 


 ఈ విధంగా అశాంఘిక కార్యకలాపాలతో లక్షలు సంపాదించి రియల్ ఎస్టేట్ దందా చేస్తుంటాడు. రాజకీయ అండతో, లోకల్ పోలీసులకు మామూళ్లు ముట్టచెప్పి కేసులు లేకుండా

చూస్తుంటాడు. అతని నెట్ వర్క్ అన్ని మెట్రో నగరాల్లో వ్యాపించి ఉంది. బిక్షాటన ద్వారా డబ్బులు పెట్టుబడి లేని కొత్త వ్యాపారం.


 ఇలా కొందరు రౌడీషీటర్సు బిక్షాటన, దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలతో రాజకీయ నాయకుల తొత్తులుగా మారి డబ్బులు సంపాదించి రాజకీయాలలో పెట్టుబడి పెట్టి సమాజంలో నాయకులుగా చెలామణి అవుతున్నారు. 

 

 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


41 views1 comment

1 Comment


mk kumar
mk kumar
6 days ago

మీ "కూటి కోసం మార్గాలెన్నో" కథ మంచి సామాజిక చైతన్యాన్ని కలిగించే కథగా ఉంది. కథలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగిత, ముసలి వృద్ధుల కష్టాలు, యువత నిర్లక్ష్య జీవితం, ఈ అన్ని అంశాలను కొంతమంది అనైతిక కార్యకలాపాల కోసం ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అన్నదాని గురించి సవివరంగా వివరించారు.

రచయిత కందర్ప మూర్తి గారి రచన శైలి చాలా సున్నితమైన అంశాలను సులభంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించగలదు. ఈ కథ సామాజిక సమస్యలపై అవగాహన కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


Like
bottom of page