top of page

లూప్‌ లైన్‌ పోస్టింగ్స్

#AyyalaSomayajulaSubrahmanyam, #లూప్‌ లైన్‌, #Loopline Postings, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguStory, #తెలుగుకథ


Loopline Postings - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 03/04/2025

లూప్‌ లైన్‌ పోస్టింగ్స్ - తెలుగు కథ

రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



"ఎన్ని రోజులయిందండీ మిమ్మల్ని కలిసి, ఎలా ఉన్నారు?”

"ఆ..ఏదో లెండి ఉన్నాం ఇలా”. 

"అన్నట్లు మొన్నీమధ్య మీ రెండో అమ్మాయి పెళ్ళి చేసారట గదా. అల్లుడుగారు ఏం చేస్తున్నారో?”

"ఎక్సయిజ్‌ డిపార్టుమెంటు లో ఆఫీసర్‌”. 

"ఇంకేం రెండు చేతులా సంపాదన. మీ అమ్మాయిది అదృష్టం “. 

"ఏం అదృష్టం. నా బొంద. మా అల్లుడుగారు అదో రకం. నీతీ నిజాయితీ అంటూ సత్యకాలపు మనిషి”. 

"ఈ రోజుల్లో అలా వుంటే కష్టమే సుమండీ. అంత మాత్రానికి గవర్నమెంట్‌ ఉద్యోగం లో ఎందుకు చేరినట్టో?”

"అంతా నా ఖర్మండి ఖర్మ”. 

 ————————————————————-

"రోడ్డు వేసి నాలుగు రోజులైనా కాలేదు. అప్పుడే గుంతలు. అసలే స్పాండిలైటిస్. ఆపై ఈ డొక్కుస్కూటర్‌ ఒళ్ళంతా హూనమైపోతుంది. ”. 


"ఎవరో ఆ కాంట్రాక్టర్ లక్కీఫెలో; బాగా సంపాదించి ఉంటాడు. ”


"మా బాబు డొనేషన్‌ కట్టి ఉంటే ఇంజనీరింగ్‌ చదివేవాణ్ణి. ఇలాంటి వర్క్స్‌లో పర్సెంటేజీ అయినా దక్కేది. వెధవ గుమాస్తా ఉద్యోగం ఎదుగూ బొదుగూ లేదు. ”


 "ఖర్మండి బాబు ఖర్మ. ”

 ————————————————-

"ఈ అవార్డు రావడంపై మీ స్పందన “?


"ఆలస్యంగా వచ్చినా చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు ఇచ్చిన అవార్డ్‌ కాదు. తెలుగు భాషకు ఇచ్చిన అవార్డ్‌”. 


"మీ కవిత్వం లాగే ప్రాసయుతంగా చక్కగా చిక్కగా చెప్పారు. అసలు మీ మాటల్లోనే అలవోక గా కవిత్వం జాలువారుతుంటుంది. మీ కుటుంబ సభ్యులు అదృష్టవంతులు. ”


"ఆ..ఏం అదృష్టం లెండి. మా పిల్లలంతా కాన్వెంట్‌లో చదువుకున్నారు. కవితావాణి వారికి దుర్గ్రాహ్యం. గుడ్డిలో మెల్ల ..కనీసం అప్పుడప్పుడయినా తెలుగు పత్రికలు కూడదీసుకుని చదువుతారు. మా మనముళ్ళున్నారే పొట్ట చీల్చినా తెలుగు ముక్కరాదు. అంతా ఆంగ్లమయం “. 


"తెలుగు దీనావస్థను అధిగమించటానికి ఒక సాహితీవేత్తగా, అవార్డు గ్రహీతగా మీ కార్యాచరణ “


"తెలుగు భాషకు ప్రాచీన హోదాను ఆపాదించేందుకు అవిశ్రాంత పోరాటం సాగిస్తాను”

 —————————+++++++++++———++———————-

"నువ్వు మగాడివైతే, మొనగాడివైతే, నీకు మూతి మీద మీసం ఉంటే ఇక్కడ కాదురా నా సీమకు రా.. వేటకొడవలి వాడి, నాటు బాంబుల వేడి చూపిస్తా”. 


"నీ సీమకే కాదురా, ..నీ పేట కొస్తా, నీ బాట కొస్తా. నీ ఇంటి కొస్తా..ఏం పీక్కుంటావో చూస్తా.. నా గోరే వజ్రాయుధం, నా చూపే అగ్నిహోత్రం. నా మాటే పాశుపతాస్త్రం. నాతో 

పెట్టుకుంటే..”. 


"అందుకే గదా ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని ఇలాంటివాళ్ళకు పదవులిచ్చి భాషాసేవ చేయాలి. ఈ పండితులున్నారే శ్రీనాథుడు, పోతనలు . అంటూ నీరసంగా..

 —————————————————

"అన్నట్లు మీకు పరిచయం లేదుకదా. ఇతను నా ఫ్రెండ్‌చక్కటి రచయిత. మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్యనే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వారు రియల్‌ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. "


"సాహిత్య అకాడమీ అవార్డు అంటే ఎంత ఇస్తారేమిటీ?”. 


"ఓ పది లక్షలు ఇస్తారేమో;”


"ఓస్‌ అంతేనా, నిన్న లాండ్‌డీల్‌ లో నావాటాకి యాభై లక్షలు. మొన్న పార్టీలో పరిచయ మయ్యాడు ఓ రచయిత. సినీమాలకు కథలు రాస్తాట్ట. ఒక్కో సినిమాకి ఇరవై లక్షలట. మీకు రాలేదాండీ ఆ అవకాశం. 

 ——————————————————

"మీరు కమ్యూనిస్టు నాయకులై కూడా ఈ పూజలు, పునస్కారాలూ..మార్క్సిజం దేవుడి ఉనికిని ఒప్పుకోరు కదా?”


“కానీ మా ఆవిడా పిల్లలూ ఒప్పుకుంటారే.. ”


"అంటే కేవలం మీ ఇంట్లో వాళ్ళకోసమేనా ఈ పూజలు వ్రతాలూ..”


"అంతే కాదనుకోండి. లేకపోతే మొత్తానికి పస్తులు పడుక్కోబెడతారు ఈ ఆడాళ్ళు. ఏ మూలనో నాక్కూడా నమ్మకం లేకపోలేదు. రిస్క్‌ తీసుకోలేం కదా:ఎందుకైనా మంచిదని చేతులు ఖాళీగానే ఉన్నాయని ఓ నమస్కారం పడేస్తున్నా..”

 ————————————————-

 "ఈ టెండర్లలో వందకోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.”

 

“మరి వారు అధికారంలో ఉన్నప్పుడు రెండువందల కోట్లు గోల్‌మాల్‌ జరిగిందని పత్రికల్లో వచ్చింది. దాని మాటేమిటీ? మా పార్టీలో పాతికశాతం మంది నేరచరిత్ర, రౌడీలుగా పోలీసు స్టేషన్‌ ల్లో కేసులు నమోదు అయినవారేనని గగ్గోలు పెడుతున్నారే. మరి వారి పార్టీలో ఆ సంఖ్య యాభైశాతం పైనే అనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. గురివింద గింజలాగా మాపై నిందలు వేయడానికి వారికి నైతిక అర్హత లేదు. కాబట్టి ప్రతిపక్షం వారు చేసే.. ”

“చూసారాండీ.. నాయకుడంటే అలా ఉండాలి. ఏమి వాగ్ధాటి? ఏమి ఖండన; ఈయనకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడం నిజంగా దురదృష్టకరం. కానీ తప్పకుండా ఏదో ఒకరోజు..”

 —————————————————————

"ఇన్నాళ్ళ నా విన్నపాన్ని మన్నించి స్వామీజీ మొన్ననే మా గృహం పావనం చేశారు. ఏమి తేజస్సు. ఏమి వర్చస్సు”


"నిజంగా మీరు పుణ్యం చేసుకున్నారండీ. పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రమే కలిగే వారి దర్శనభాగ్యం మీకు కలిగింది. అఫ్‌కోర్స్.. మీకు మాత్రం తక్కువా ఏమిటీ?”


"శషభిష స్వామివారు రావడం అంటే మామూలు కాదు. బానర్లు, కార్పెట్లు పరవాలి. టీవీ కవరేజి అరేంజ్‌ చెయ్యాలి. వారికీ, వారి శిష్యులకు స్వచ్చమైన ఆవుపాలతో మృష్టాన్న భోజనాలు ఏర్పాటు చేయాలి. ఆశ్రమానికి డొనేషన్లు .. పాదసేవకు అనుగ్రహ భాషణానికి అదనవు చదివింపులు..”


 "ఖర్చు బాగానే అయ్యిందన్నమాట”. 


"అయితేనేం.. మంత్రులు, అధికారులు అందరూ స్వామీజీ శిష్యులే. మొన్నటి వరకూ మన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి శిష్యులే. పనిలో పనిగా కాంట్రాక్ట్ టెండర్ విషయం కదిపా;.. అనుగ్రహించారు స్వామీజీ; వారి అనుగ్రహం ఉంటే ఏమి లోటు.. ”


“ఎప్పుడైనా వీలు చూసుకుని నా పని ఒకటి స్వామివారితో చెప్పండి. ఋణం ఉంచుకోను లెండి.. ”

 ———————————————————————

 "ఎలిగేషన్‌ మీద లూప్‌లైన్‌ పోస్టింగిచ్చారు. మా కమీషనర్‌ తలతిక్క. ఎవరి మాట వినడు. వెంకన్నస్వామిని మొక్కుకున్నా.. నెల తిరక్కుండా కమీషనర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు మంత్రి గారితో పడక. ఆయన మనవాడే. మళ్ళీ నెల తిరక్కుండా చార్జ్‌మెమో విత్‌డ్రా అయ్యింది. అను

 కున్న పోస్టింగూ వచ్చింది. తిరుపతెళ్ళి నిన్ననే వచ్చా. మొక్కు తీర్చుకుని.. ”

 ——————————————————————-

“మీకులా కాదండి మా లా ప్రొఫెషనలో.. క్రిమినల్‌ కేసుల్లో మరీనూ. సాక్షుల్ని లొంగదీసుకోవాలి. పోలీసులనీ, పి. పీ. ని.. అవసరమయితే జడ్జిలనీ మానేజ్‌ చేయాలి. రెండు సంవ 

 త్సరాల క్రితం ఓ కేసు వచ్చింది. వివరాలు ఎందుగ్గానీ క్లయింట్లు బ్యాక్‌గ్రౌండ్‌ పెద్దది. 


కాలేజీలో క్లాస్‌మేట్‌ వెంటపడ్డాడు, ప్రేమిస్తున్నానని. ఈ ఆవారాగాన్ని ఎవరు ప్రేమిస్తారు? రోజూ అల్లరి. ఆ అమ్మాయి పాపం కాలేజీ మానేసింది. ఇంటి దగ్గరకెళ్ళి నానా గొడవ. 


ఘర్షణ పెరిగి కత్తితో పొడిచి చంపాడు పబ్లిగ్గా. ఎలాగైనా కేసు గెలిపించమంటాడు వాళ్ళ నాన్న. కేసు టేకప్‌ చేయొద్దనుకున్నా. కానీ ఆయన పలుకుబడి ఉన్నవాడు. పైగా ఫీజు భారీ.. ఎల్బీ సృష్టించి కేసు గెలిపించటానికి తలప్రాణం తోకకు వచ్చింది.. ”


"మనం అనుకుంటాం కదండి. కానీ దైవానుగ్రహం లేకుండా ఏదీ సాధ్యపడదండీ”. 

 ————————————————————

 "ఓల్డ్‌ ఏజ్‌లో ఇంత కష్టపడుతున్నారు. మీ ఇంటి ఓనర్స్‌కి పిల్లలు లేరా?”


"ఎందుకు లేరు?ఉన్న ఇద్దరూ అమెరికాలోనే సెటిలయ్యారు”. 

 

 "వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండొచ్చుగా.. ”


“ఏం చెప్పేది? పాపం పిల్లల కెరియర్‌ కోసం వీళ్ళు ఎంతో త్యాగం చేశారు. గ్రాండ్‌ పేరెంట్స్ ఉంటే గారాబం ఎక్కువై చదువు రాదనీ, ఇంగ్లీషు లో మాట్లాడరని కన్న తల్లిదండ్రు

 లను దూరంగా ఉంచారు. కానీ ఇప్పుడా పిల్లలు తమ పిల్లల కోసం వీళ్ళని త్యాగం.... ”. 

——————————————————————————

"రాను రాను సమాజం ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదు. ఎటు చూసినా అవినీతి..స్వార్థం..వ్యాపార ధోరణి పెరిగిపోతోంది. మన భాషా సంస్కృతి నాశనమై పోతున్నాయి. దొంగ స్వాములు, ..దొంగ భక్తులు.. ”


"అయ్యా; సమాజమంటే ప్రజలే. వారి అర్హతలను బట్టే సమాజం. ’ గంజాయి విత్తనాలు నాటుతూ, తులసి మొక్కలు రావాలంటే..”


**కొసమెరుపు: గంజాయి విత్తనాలు నాటుతూ, తులసి మొక్కలు రావాలంటే రావు కదా 


***శుభంభూయాత్‌***


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








Commentaires


bottom of page