top of page

లోపం


'Lopam' written by K. Geetha

రచన : కే. గీత

నాకు చదువు అబ్బ లేదు కానీ వ్యాపార దక్షత అబ్బిందని కాబోలు నా వాటాకి మా నాన్న ఆ షాపు ఇచ్చారు. చిన్నప్పటి నుండీ నాన్న తో షాపులో కూర్చోడం ఒక ఎత్తు. ఇప్పుడో ఎత్తు.

మా షాపు గాంధీనగర్ నడి బొడ్డులో ఉంది. గాంధీనగర్ తెలుసుగా, స్టేషన్ నుండి రెండు మలుపులు తిరిగితే , ఓ ముప్పావు కిలోమీటరు దాటాక రోడ్డుకి కుడి చేతి వైపు మా షాపు. మా షాపుకి ఎదురు రోడ్డుకి ఆ వైపు అంటే స్టేషన్ నుండి వస్తూంటే ఎడమ వైపు తాతా వారి సత్రం. పెద్ద పెద్ద ఆర్చిలతో ‘గోపీ’ కలరు వేసి ఉంటుందా సత్రం. సత్రం ముందువైపు భాగంలో శాస్త్రి స్వీట్ షాపు, సైకిల్ షాపు , మెడికల్ షాపు… రామం వాళ్ళది…ఇలా వరుసగా ఉంటాయి. నా చిన్నతనంలో తాతా వారి సత్రం అంటే …ఓ పెద్ద చిరునామా. తాతా వెంకట్రావు గారబ్బాయి వాళ్ళ నాన్న గారి పేరు నిలబెట్టి మంచి పనులు చేస్తున్నారని చెప్పేవారు మా నాన్న. ఇల్లు సత్రం ఎందుకయిందో నాకూ ఇప్పటికీ అర్ధం కాదు.

సత్రం ఆ రోడ్డు మొగ నుండి మొదలై ఒక 75 -100 మీటర్ల పొడవు … అంత పెద్ద సత్రం. ఇప్పుడు రోడ్డు మొగన అంటే సత్రం బిల్డింగు ప్రారంభమైన చోట ఆటోలు కార్లూ పాసింజర్లని దించుతూ ఎక్కించు కుంటూ ఉంటాయి. షేరాటోల రద్దీ ఈమధ్య బాగానే పెరిగిపోయింది. చిన్నతనంలో మా షాపులో నుండి ఆ మొగ వైపు చూస్తూ ఉంటే … ఇంత రద్దీగా ఉండేది కాదు కానీ అపుడూ సైకిల్ రిక్షా వాళ్ళతో రద్దీగానే ఉండేది. రిక్షా వాళ్ళ బేరాలు, తగువులు, ఎక్కడి నుంచో వచ్చి జంటగా రిక్షాఎక్కే వాళ్ళు, జంటగా దిగిన వాళ్ళు, వేరే దార్లంట పోయే వాళ్ళు…. ఫుట్పాత్ ప్రక్కన పూల దుకాణాలు, లాటరీ టికెట్ల బడ్డీలూ ….. అర్ధమ్యేది కాదు. ప్రపంచం రాను రాను అర్ధమవ సాగింది.

ఆ రద్దీలో నిశితంగా చూడాలే కానీ బోళ్డన్ని కేరక్టర్లు… మనుషుల హావ భావాలు, వచ్చే వాళ్ళు, పోయే వాళ్ళు .. మా షాపులోకి వచ్చి బేరాలాడే వాళ్ళు ….ఓహ్ … ఒకటేమిటి…ప్రపంచం అంతా అక్కడే !

మనం చూసిందే మన ఆలోచన, మనకు తెలిసిందే ప్రపంచం కదా.

****

ఆరోజు పదింటికే మామూలుగా షాపెక్కాను. పదకొండున్నర అవుతోంది… బేరాలంతగా లేవు. ఎండ దంచడం మొదలు పెట్టింది. అందువల్ల రద్దీ కూడా తక్కువ గానే ఉంది.

అదిగో…. అంతలో సత్రం మొగన ఓ కారు వచ్చి ఆగింది. కారు లోంచి ఒకావిడ దిగింది. ఆమె నడి వయస్కురాలు అనుకుంటా. మరీ అంత లావుగానూ సన్నగానూ కాకుండా … సరయిన వంటితో.

ఆమె కట్టుకున్న నెమలి పింఛం రంగు చీర అదే రంగు జాకెట్టూ ఓహ్ … ఆమె తెల్లని శరీర కాంతి కి కాంట్రాస్టు గా….. ఎంత అందం. దూరం ఎక్కువ లేదు…. బాగా తెలుస్తోంది ఆమె నడుముని ఆమె చీర కప్ప లేక పోతోంది. ఆమె పొట్ట లోతుగానే ఉందేమో పయ్యెద ప్రస్ఫుటంగా అందంగా కనబడుతోంది. కారు దిగినపుడు ఆమె చేతి లో బేగ్ కానీ సూట్ కేస్ కానీ లేదు….! కారు దిగంగానే నీడ కోసమో కానీ ఎవరి కోసమో కానీ నలు వైపులా చూస్తోంది ఆమె. నా ఆలోచన సాగుతోంది నీడ కోసమైతే దిగడం ఎందుకూ….. వెతకడం ఎందుకు. నీడ కోసమే …. ఆమెకు కావాల్సిన వాళ్ళు వచ్చేవరకూ నీడ కోసమే. ఎండ కదా.

ఆమెను చూస్తే ‘అయ్యో’ అనిపించడం లేదు!

ప్రొద్దునే నా …. ఎవరి కోసమో.

నా లెక్క ప్రకారం ఇంకో కారు వస్తుంది.

ఆ కారు ఆమె ఎక్కి వెళ్ళి పోతుంది… ఇదేగా జరిగేది. ఎన్ని చూసాం ఇలాంటివి. ఇదొక దౌర్భాగ్యమయి పోయింది. పన్నెండు కావొస్తోంది.

దాని వెయిటింగ్ నాకు విచిత్రంగా ఉంది. దాని కోసం ఎవరొస్తారో చూడాలి. ఎంత డబ్బున్న వాడు ఎలాంటి వాడు వస్తాడో. ఇదేగా తంతు.

వేరేగా ఆలోచిద్దామన్నా ఇదేగా జరిగేది.

చెమటకు అనుకుంటా పమిట కొంగుతో ముఖం తుడుచు కుని ఎడమ చేతి కిందగా నడుములో భలే అందంగా దోపింది. ఈ వయ్యారానికి తక్కువ లేదు. నెర జాణ.

ఇంత లో రానే వచ్చింది ఓ…కారు.

చెప్పానుగా వస్తుందని. మన లెక్క తప్పు కాదు. మనకెంత ఎక్స్పీరియన్స్ .

ఈ లోగా సత్రం గేటు తెరుచుకుంది. రోజూ వచ్చేవాళ్ళే బిచ్చగాళ్ళు గేటు దగ్గర గుమికూడారు. చెప్పడం మరిచాను కదా. సత్రంలో రోజూ అన్న దానం జరుగుతుంది. సుమారు వందమంది దాకా వస్తారు. అందరికీ అన్నం , పప్పు, కూర పేకట్లు ఇస్తారు… ఓ ఆకుతో సహా. ఈ బిచ్చ్గాళ్ళు నా దృష్టిని దాని నుండి, ఆ కారు నుండి ఒక్క సెకను మరల్చినా … అటే చూసాను.

చెప్పానుగా….. కారు ఆమె ముందే ఆగింది. ఆమె నవ్వుతూ కారువైపు అడుగులు వేసింది.

కారు నుండి ఓ ఆకారం డ్రైవర్ సీట్లోంచి దిగింది.

గమనిస్తూనే ఉన్నా… అయినా మనకు తెలిసిందే గా.

తీసుకు పోయే వాడు దిగడం ఎందుకో.

ఇంతలో అతను … అదే కారునుండి దిగిన అతను వెనక్కి వెళ్ళి డిక్కీ తీసాడు.

డిక్కీ లోంచి ఏవో బేగులు తీసాడు …. కంగారుగా.

ఇదేంటి …. ఆమె కారు ఎక్కడం లేదు.

ఎహె… ఈ పరిగెడుతున్న బిచ్చగాళ్ళు ఒకళ్ళు మధ్యలో.

విసుగొచ్చింది …. వాళ్ళ మీద. మాంచి పట్టులో ఉన్న సంఘటన….!

ఇద్దరూ కలిసి ఆ బేగులు పట్టుకొని సత్రం గేటువైపు నడవడం మొదలు పెట్టారు. పదడుగులు. అర్ధం కాలేదు నాకు. చూసిన ప్రపంచానికి భిన్నంగా…. అదే నేను చూసిన ప్రపంచానికి భిన్నంగా…..!

నా ఆలోచనలు ఇంకో రూపం దిద్దుకొనే లోపు… వాళ్ళిద్దరూ సత్రం గేటు వైపు పోయి…. బయట నుంచుని బేగులు తెరిచి అందులోని బట్టల్ని అన్నం పేకట్ల తో సత్రం లోంచి వస్తున్న బిచ్చ గాళ్ళకి పంచి పెడుతున్నారు. అతను అందివ్వడం …. ఈమె పంచడం. పుచ్చుకున్న వాళ్ళ ముఖాల్లో ఆనందం…. నా దృష్టి దాటి పోలేదు.

నేను చూసిన ప్రపంచం వెకిలి నవ్వు నవ్వింది నా మీద. కానీ అర్ధం కాలేదు. ముందే ఆమె వచ్చి ఆగడం ఎందుకు. ఒకే కార్లో రావచ్చుగా… ఏమో ఆమె ఒక దిక్కునుండి వచ్చిఉండవచ్చు, బట్టలు ఆమె ఇంకో దిక్కునుండి తెప్పించి ఉండవచ్చు…. టైం గేప్ ఉండి ఉండవచ్చు….. నా ఆలోచనలలో లా….!

లోపం నాదే.... ప్రపంచం బాగానే ఉంది!

**************************************


రచయిత్రి పరిచయం :

ధన్యవాదాలు..

నా పేరు కె.గీత

నేను 2015 నుండి కథలు, కవితలు ,వ్యాసాలు వ్రాస్తున్నాను. వివిధ పత్రికలలో బహుమతులు అందుకున్నాను..


3 Comments


Sweta Vasuki
Sweta Vasuki
Jun 20, 2021

కథ చాలా బావుంది గీత గారు 👌👍

Like

rajeshyalla
rajeshyalla
Jun 20, 2021

కథ బావుందండీ! 👌👌👌💐💐💐

Like
Geetha Srinivas
Geetha Srinivas
Jun 20, 2021
Replying to

Thanks

Like
bottom of page