top of page
Writer's pictureLakshmi Madan M

మా ఊరి అంగడి


'Ma Uri Angadi' New Telugu Story


Written By Lakshmi Madan



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


బుధవారం వచ్చిందంటే చాలు మా ఊరు సందడి సందడిగా మారుతుంది. ఎందుకంటే ఆ రోజు అంగడి. మా ఊరి అంగడిలో ఆరోజు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. గొర్రెలు, బర్రెల దగ్గర నుండి గోర్ల పెయింట్ వరకు అమ్మకానికి ఉంటాయి. కూరగాయలు, పండ్లు, బట్టలు, పక్క పిన్నిసులు, బొట్టు బిళ్ళలు, బొంబాయి బొట్టు, కుంకుమ, పసుపు, మొలదారాలు.. ఒక్కటేమిటి అక్కడ దొరకనిది లేదు.


చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లన్నిటికీ మా ఊరి అంగడి ఆధారం. ఏమి కొనుక్కొని పోవాలన్నా బుధవారం నాడు మాత్రమే వీలవుతుంది. అందుకని అంగడి కోసం తయారుగా ఉండేవారు. కొందరికి ఏమో స్వకార్యం స్వామి కార్యం అన్నట్లు కొనుగోలు చేయడంతో పాటు ఆటవిడుపు లాగా వేరే ఊరికి రావడం సంతోషంగా ఉండేది.


ఇక కథలోకి పోదాం.


సరోజనమ్మ పనులన్నీ తొందరగా ముగించుకొని అంగడికి పోవాలి అని అనుకుంటుంది. ఇంట్లో పనులు అంత తొందరగా తెములుతాయా! పిల్లలు స్కూల్కు పోవాలి, భర్త ఆఫీసుకు పోవాలి, ఇంట్లో ఉన్న పెద్దమనిషి అత్తకు మడివంటకి అన్ని సిద్ధం చేయాలి.. వ్యవసాయ ఆధారమైన ఇల్లు కాబట్టి వడ్ల పని బియ్యం పని ఉండనే ఉంటుంది.


అన్ని పనులు అయ్యాక భోజనం చేద్దామని అనుకున్నది కానీ పక్క ఊరి నుండి వచ్చే వరుసకు బంధువులైన తల్లి కూతుర్లు వస్తారని ఊహించి కాసేపు వాళ్ల కోసం ఎదురు చూద్దాం అనుకున్నది. ఇంతలో తల్లి కూతుర్లు రానే వచ్చారు.. కామాక్షమ్మ ,కాంతమ్మ. సినిమాల్లో సూర్యకాంతం, గిరిజ ఎలాగో వీళ్ళు అలా అన్నమాట. పరమగయ్యాళ్లు. వీళ్లకు వీరే సాటి. వీరి నోటికి జడిసి చాలామంది వీరికి దూరంగా ఉండేవాళ్ళు. కానీ ప్రేమస్తులు.


హి హి అని నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వచ్చారు. ఈ ఊరు నుండి ఆ ఊరికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది, వస్తారు. కామాక్షమ్మ కి భర్త లేడు. కాంతమ్మ భర్తను వదిలేసింది. కాంతమ్మ వాళ్ల పెరట్లో పూసిన గన్నేరు పూలు, సబ్జా ఆకు కలిపి పెద్ద దండలుకొని నెత్తినిండా పెట్టుకుంది. సౌరంతో వేసుకున్న జడ చాలా పెద్దగా ఉంది. చక్కగా ఎక్కడికో టూర్ వెళ్లినట్టుగా తయారైంది. కానీ పాపం ఆ పల్లెటూరు నుండి వారం కి ఒకసారే కదా పట్టణానికి రావడం.. ఇదే వాళ్లకు ఒక వ్యాపకం ఒక ఆనందం, ఒక సరదా.


"సరోజనా! ఓ సరోజనా! ఉన్నావే.. గిన్ని మంచినీళ్లు ఇయ్యి. ఎండల వడి వచ్చినం" అన్నది కామాక్షమ్మ.


ఇద్దరూ భవంతిలో మొగురంని ఆనుకొని చతికిలబడి కూర్చున్నారు.


" కూర్చుండి పెద్దాయి.. నీళ్లు తీసుకొని వస్తా. నీ కోసమే ఎదురు చూస్తున్న" అని అనుకుంటూ లోపలికి వెళ్లి గుండెలో నుండి పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్లు ఒక గ్లాసు పట్టుకొని వచ్చింది. ఇద్దరు నీళ్లను తీసుకొని గటగట గొంతెత్తి పోసుకున్నారు.


"హమ్మయ్య పానం సల్ల వడ్డదే! నీ కడుపు చల్లగుండ" అని చెంబు గ్లాసు అక్కడ పెట్టి సంచులు ఓ పక్కన పెట్టుకున్నారు.


"పెద్దాయి, కాంతక్క.. ఇద్దరు రండి. అన్నం తిందాం. నేను కూడా తినకుండా మీకోసమే చూస్తున్నా. అత్త మనకు కంచాలల్ల వడ్డిస్తాది" అన్నది సరోజిని.


"మా కోసం వండినావే చెల్లె" అని నవ్వుకుంటా అడిగింది కాంతమ్మ. అసలే పళ్ళు లేవు. నోరంతా కోహరంలా తెరిచి సంతోషంతో నవ్వుతూ ఉంది.


"అయ్యో.. అంగడికి వస్తారని తెలుసు కదా అక్క.. వండకుండా ఎట్లుంట" అన్నది సరోజిని.


కామాక్షమ్మ, కాంతమ్మ ఇద్దరూ చేదబావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడుకొని, కాళ్లు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి, వడ్డించిన కంచాల ముందు పీటల మీద కూర్చున్నారు.


కంచాలలో ఆవకాయ, పాలకూర పప్పు, వంకాయ రోటి పచ్చడి వేసి వడ్డించింది సరోజమ్మ. సరోజినీ అత్త నర్సమ్మ వచ్చి..


"మీరు తినుండి. మారు ఏం కావాలో నేను వడ్డిస్తా" అన్నది.


"వదినే.. బాగున్నవా? దేవుడి అర్రలా ఉంటే పూజ కాలేదేమో అనుకున్నా. గందికే లోపటికి రాలే" అన్నది కామాక్షమ్మ.


"ఊ! జపము అయ్యేవరకు ఆలస్యం అయింది" అనుకుంటూ స్పటిక జపమాలను దేవుడి భువనేశ్వరంలో పెట్టి బయటకు వచ్చింది నరసమ్మ.


వీళ్ళు కడుపునిండా భోజనం చేసి అంగడికి పోదామా అని అనుకొని అంగడికి వెళ్లారు..


రాశులు పోసినట్లున్న కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు అన్ని తాజా తాజాగా ఉన్నాయి. అప్పట్లో అన్ని సవ్వ సేరు, అర్ధ సేరు, సేరు లెక్క.. ఏరుకొని ఏరుకొని కూరగాయలు తీసుకున్నారు.


సరోజినీకి పిల్లలు చెప్పింది గుర్తు వచ్చింది. ఉల్లిగడ్డలు ఉల్లిపోర్క తీసుకోమని చెప్పారు. కానీ ఇంట్లో ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ నిషేధం. పిల్లలేమో ఒకటే తీరుగా తీసుకోమని అడుగుతున్నారు. ఏం చేయాలి అని ఆలోచించి మెల్లగా ఒక సవ్వ సేరు ఉల్లిగడ్డ, ఒక కట్ట ఉల్లి పొరక తీసుకుని కూరగాయలకు అడుగున పెట్టింది. ఎవరైనా చూస్తే అయ్యో ఉల్లిగడ్డలు తింటారా.. అని నోరు నొక్కుకుంటారని భయం. ఆ రోజుల్లో చాలావరకు ఇళ్లల్లో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ తినేవాళ్లు కాదు. అన్ని తీసుకొని, పిల్లలకు రిబ్బన్లు అయిపోయాయని రిబ్బన్లు కొనుక్కొని, ఇంటిదారి పట్టింది సరోజినమ్మ. కామాక్షమ్మ, కాంతమ్మ ఇంకా ఎవరింటికో వెళ్లాలని వాళ్ళు వెళ్లిపోయారు.


మెల్లగా ఇంటికి నడుచుకుంటూ వచ్చిన సరోజిని ఒక పెద్ద పాలగుళ్లలో కూరగాయలన్నీ పోసింది.. అన్ని కూరగాయలని చేద బావి దగ్గరికి తీసుకెళ్లి నీళ్లు చేదు అన్నిటినీ కడిగి, మళ్లీ గుల్లలోకి ఎత్తి లోపలికి తీసుకొని వచ్చింది.. ఫ్రిజ్లు లేని కాలం కదా.. ఆ కూరగాయల మీద ఒక తట్టు సంచి తడిపి కప్పి పెట్టింది. వారంకు సరిపడా కూరగాయలు.. ఇంకా సరిపోకుంటే ఇంట్లో పెరట్లో పాదుకి కాసిన సొరకాయను బీరకాయను తోటకూర ఆకులో చేసుకోవచ్చు..


ఇలా అంగడంటే భలే సందడిగా ఉండేది సంతోషంగా కూడా ఉండేది.. అక్కడ వేరే వాడుకుంటూ కూరగాయలు కొనుక్కోవడం పాసంగమం ఉందని గులగడము.. ఆ కూరగాయల వాళ్లేమో ఎందవ్వా! ఇంత మంచిగా ఇచ్చినా కూడా గిట్ల అంటావ్? అనడం అలా ఒక వ్యాపకంగా ఉండేది.


ఇంచుమించు కూరగాయల వాళ్ళందరూ ప్రతివారం పోతాం కాబట్టి గుర్తుపట్టేవాళ్ళు కొంతమంది ఏమో అక్కడే కొని అక్కడే షాప్ పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఎక్కువ అని మా నాయనమ్మ చెప్పేది. మారు బేరం వాళ్ల దగ్గర కొనొద్దు. ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరనే కొనాలి అని..


ఇట్లా ప్రతిదానితో మనకు ఒక అనుబంధం ఉండేది. మనుషులతో సాన్నిహిత్యం ఉండేది. ఇప్పుడు అన్ని క్షణాల్లో ఆర్డర్ చేసుకోవడం, మనుషులతో కమ్యూనికేషన్ మొత్తం తగ్గిపోయింది. అన్నిటికీ ఆన్లైన్ మీద ఆధారపడిపోవడం.. మళ్లీ మునుపటి రోజులు వస్తే బాగుండు..


నేనైతే మా ఇంటి పక్కన బుధవారం జరిగే సంతకే వెళ్తాను. ఇక్కడ కూడా అంటే హైదరాబాదులో మాల్ లో తెచ్చుకుందాం అంటారు మా ఇంట్లో. కానీ అంగడికి వెళ్ళినంత ఆనందం ఉండదని ప్రతివారం గొడవే..

ఏది ఏమైనా మా ఊరి అంగడి భలే మంచి సందడి..

***

లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link



Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు


50 views0 comments

Comentários


bottom of page