'Madhyataragathi Kutumbam' New Telugu Story
Written By Kidala Sivakrishna
మధ్యతరగతి కుటుంబం తెలుగు కథ
రచన: కిడాల శివకృష్ణ
(ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత)
పాఠశాల స్థాయిలో విద్య పూర్తయ్యింది. అందులో మంచి ప్రతిభ కనబరిచాడు కృష్ణ. కళాశాల స్థాయిలో చదువును కొనసాగించడానికి కొంత మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని తన తండ్రి అయిన బసవయ్యకు చెప్పాడు కృష్ణ.
అప్పుడు “నా దగ్గర మన సంసార జీవితం గడవడానికే డబ్బులు లేవు, అలాంటిది నువ్వు డబ్బులు కట్టి చదువులు చదవాలంటే చాలా కష్టం. నేను నిన్ను చదివించలేను” అనసాగాడు బసవయ్య.
ఆ మాటలకు కృష్ణ కళ్ళు సముద్రాన్ని తలపిస్తున్నవి. “ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తే ఒకవేళ మార్కులు తక్కువగా వస్తె మాత్రమే డబ్బుకు కట్టాల్సి ఉంటుంది, ఎక్కువ మార్కులు వస్తె అవసరం లేదు” అని ఎంత సేపు చెప్పినా తన మాటలను విన్న పాపాన పోలేదు బసవయ్య. ఎందుకంటే వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఒక్కరి కష్టం మీద నలుగురు ఆధారపడాల్సిన పరిస్థితి..
అంతే కాకుండా వారి కుటుంబంలో అందరూ పని చేసినా కూడా మొత్తం పొలంలో పనులు చేయడం వలన డబ్బులు చేతిలో ఆడవు, పంటలు పండి చేతికి డబ్బులు వచ్చినపుడు ఎంత వచ్చినా అప్పుల వడ్డీలు కట్టలేకపోతున్నారు. ఎందుకంటే తీసుకున్న అప్పులు చెల్లించే సరికి వేరొక అవసరం తలుపు తడుతుంది, వీటితో పాటుగా మద్యం అలవాటు ఇంటి పెద్దలకు ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం.
వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు.. సమస్యల వలలో చిక్కి రాత్రి సమయంలో నిద్ర పట్టకపోతే తప్పక మనసొప్పక నిద్ర కోసం త్రాగితే అది కాలానుగతంగా వ్యసనంగా మారి మధ్యతరగతి కుటుంబాలను సైతం పేద కుటుంబాలుగా మారుతున్నాయి. ఇలాంటి దీన స్థితిలో ఇంతటి కష్టాలను కన్నీళ్ళను దిగమింగి కృష్ణ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వచ్చాయి. అందువలనే ప్రభుత్వ కళాశాలలో సీట్ స్పాధించాడు కృష్ణ.
సీట్ వరకు అయితే ఎలాగోలా సాధించగలిగాడు కానీ అక్కడ ఉండటానికి మాత్రం హాస్టల్ లో డబ్బుకు కట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బులు కూడా తాను కట్టలేని అనే పరిస్థితిలో ఉన్నాడు బసవయ్య.
“నాన్నా! నేను కళాశాలలో చేరే వరకు వేరే పని చేస్తూ ఉంటాను. నాకు వచ్చిన డబ్బుకు నీవు కొంత మొత్తంలో జమచేస్తే నేను చదువుకోవడానికి సులభంగా ఉంటుంది” అన్నాడు కృష్ణ.
“సరే.. నీకు కొంత మొత్తంలో మాత్రమే డబ్బులు ఇవ్వడం సాధ్యం అవుతుంది. ఎక్కువ ఇచ్చుకొలేను” అంటూ బసవయ్య చెప్పాడు.
సరే అని కృష్ణ కొన్ని రోజులు పని చేసుకుని కళాశాలకు వెళ్లాలని అనుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత వెళ్ళాసిన సమయం దగ్గర పడుతుంది.
ఈ విషయాన్ని గుర్తు చేసుకుని కృష్ణ “నాన్న.. నేను వెళ్ళడానికి సమయం దగ్గర పడుతుంది. కాబట్టి మీరు డబ్బులు ఇస్తే నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను” అన్నాడు.
ఆ మాటలకు బసవయ్య “ఏమి మాట్లాడుతున్నావు రా.. మీ అన్నయ్య కొడుకుకి జ్వరం వచ్చి డబ్బులు అన్నీ హాస్పిటల్లోనే ఖర్చయ్యాయి. మరి నన్నేం చేయమంటావు.. తప్పదు కదా సంసారం అన్నాక ఇటువంటి ఖర్చులు అన్నీ కూడా వస్తుంటాయి. నేను వాడికి ఆరోగ్యానికి మాత్రమే ఖర్చు పెట్టగలను. నీ చదువుకు మాత్రం పెట్టలేను” అన్నాడు బసవయ్య.
“సరే.. నేను ఇప్పుడున్న సమయంతో పని చేసి నా ఖర్చులకు వాడుకుంటాను. పొలంలో పనులు నాకు చెప్పకండి నాన్న” అన్నాడు కృష్ణ.
“సరే.. పని చేసుకుని కళాశాలకు వెళ్తానంటే నేనేమీ అనను. నీవు సంపాదించిన సొమ్మును నువ్వే తీసుకెళ్ళు” అన్నాడు బసవయ్య.
“సరే నాన్న.. ఇప్పటికీ నేను సర్ధుకుంటాను కానీ నాకు రెండేళ్ల తర్వాత కోచింగ్ నిమిత్తం ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మర్చిపోకండి” అన్నాడు కృష్ణ.
“అదేమిటి రా అలా అంటావ్.. నేను ఏమైనా ఊరికే కూర్చుని తింటున్నానా.. మీ చెల్లికి పెళ్లి చేయాలి, అంతకంటే ముందుగా జాతర్లు జరిపించాలి. నగలు తీసుకురావాలి. ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నావు.. ఈ సంవత్సరం చాలా ఖర్చు అవుతుంది. దానికే నేను ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తుంటే ఇవన్నీ చెపుతున్నావు.. అయినా, రెండు సంవత్సరాల తర్వాత కదా.. అప్పటికీ అన్నీ బాగుంటే ఇపిస్తానులే. ఇప్పుడైతే వెళ్లి బుద్దిగా చదువుకో ముందు” అన్నాడు బసవయ్య.
‘రెండు సంవత్సరాల తర్వాత బాగానే ఉంటుందిలే సంసారం.. అప్పుడు ఖచ్చితంగా చదివిస్తారు. కోచింగ్ కు అయ్యే ఖర్చులు మా నాన్న చూసుకుంటాడు’ అని మనస్సులో అనుకొని సరే నాన్న అంటూ వెళ్ళిపోయాడు కృష్ణ.
ఒక సంవత్సరం గడిచిపోతున్న తరుణంలో అనుకున్న విధంగానే జాతర జరిపించి, అంగరంగ వైభవంగా చిట్టచివరి కూతురి పెళ్లి జరిపించారు బసవయ్య గారు. పెళ్లైపోయిన చాలా తక్కువ సమయంలోనే పెద్దకొడుకు కూతురు పుష్పవతి అయ్యింది. ఈ అమ్మాయికి వాళ్ళ మేన మామ గారు నలుగు తెస్తాను అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.
బసవయ్య ఎంత వద్దని మొత్తుకొని చెప్పినా వినకుండా వాళ్ళు చేశారు.. వీళ్ళు చేశారు.. మనం చేయకపోతే ఎలా ఉంటుంది.. అంటూ ఇతరులతో పోల్చుకుని కూర్చోబెట్టారు.
అప్పుడు పదిహేను వేలారూపాయల వరకు ఖర్చు అయ్యింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పెద్దకొడలు నా కూతురికి బంగారం చేయించాలంటూ మొండిపట్టు పట్టి కూర్చుంది. చేసేదేమీ లేక మనసొప్పక, మాట చెల్లక తప్పని సరి పరిస్థితుల్లో బంగారం చేయించాడు బసవయ్య. రెండు సంవత్సరాల చదువు పూర్తయ్యింది కృష్ణది. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అంటూ మొదలుపెట్టగానే బసవయ్య “నీకు చదువుకునే యోగ్యత లేదనుకో.. ఎందుకంటే మీ అమ్మ ఆరోగ్యం నిలకడగా లేదు. నా దగ్గర మీ అమ్మ వైద్యానికి అయ్యే ఖర్చును సంపాదించడానికి కూడా స్థోమత లేదు. నువ్వు చదువు అదీ ఇదీ అంటూ అనడం మానేసి చదివిన చదువుతో ఎదైనా ఉద్యోగం చేయి. అది పెద్దదా చిన్నదా అని అవసరం లేదు. కాకపోతే ఖచ్చితంగా నీవు ఉద్యోగం చేయాల్సిందే. మీ అన్నయ్య పొలం పనులు తపిస్తే వేరే పనులు చేయలేడు. ఎంతో కొంత చదువుకున్న వాడివి నీవే.. నాకు ఎంతో కొంత నీకు ఇష్టమైనంత ఇస్తువులే కానీ చదువు మాత్రం పక్కన పెట్టి ముందు పనిచేసుకో” అన్నాడు బసవయ్య.
చేసేదేమీ లేక వెనుదిరిగి నా కలలు అన్నీ కల్లలుగా ఉండి పోవాల్సిందేనా అనుకుంటూ ఒక్క సారిగా తను కలలు గన్న ప్రపంచాన్ని మొత్తంగా ఒకే సారి గుర్తుకు తెచ్చుకున్నాడు కృష్ణ.
‘అయినా మా జీవితాలు మారుతాయని అనుకోవడం నా అవివేకమే. ఎందుకంటే మావి తీరే సమస్యలు కాదు. పెరిగే సమస్యలు’ అనుకుంటూ ఆ రోజు మొత్తం బాధపడ్డాడు కృష్ణ.
మరుసటి రోజు తనకు దగ్గరగా ఉన్న ఒక చిన్న హాస్టల్ లో వార్డ్ బాయ్ గా పని చేయడానికి సిద్దమయ్యాడు కృష్ణ. ఇలా తన జీవితాన్ని ఎలాగోలా గడిపేదాం అనుకున్నాడు కృష్ణ.
ఇంతలోనే వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ కోలుకోలేని స్థితికి రానే వచ్చింది. అప్పుడు తన తండ్రి అయిన బసవయ్య కృష్ణను పిలిపించి నీవు మీ అమ్మకి ఆరోగ్యం కోసం హాస్పిటల్ కి వెళ్లి రావాలి అంటూ చెప్పాడు.
తప్పని పరిస్థితుల్లో కృష్ణ హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్ లోకి వెళ్ళిన కృష్ణకి అక్కడ ఉన్న పరిస్థితి అర్థం కావడం లేదు. వాళ్ళు ఆ టెస్ట్ లు ఈ టెస్ట్ లు అంటూ ఉన్న డబ్బులు మొత్తం లాగేశారు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోతూ వచ్చింది. డబ్బు లేని కారణంగా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా వివరించాడు తండ్రి అయిన బసవయ్యకు కృష్ణ.
“ఇప్పుడు ఎలా రా..” అంటే “మనము ఇక్కడ ఉంటే కాదు. ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్దాం” అంటూ కృష్ణ చెప్పాడు.
బసవయ్యకు ఇంకొక మార్గం తోచక సరే అంటూ తమకి దగ్గరలో ఉన్న ప్రభుత్వం వైద్యశాలను చేరుకున్నారు.
అక్కడ డాక్టర్లు ఎవ్వరూ పట్టించుకోరు. అందరూ బిజీ బిజీగా తమ పనులు చేస్తున్నట్లు నటించసాగారు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణ “సార్! మీరు మా అమ్మకు వైద్యం చేయండి” అంటూ ప్రాధేయపడితే సరే అంటూ చికిత్స చేయానికి ఒక్క డాక్టర్ గారు ముందుకు వచ్చారు. అంటే పూర్తి బాధ్యతతో కృష్ణ అమ్మగారికి వైద్యం అందించడం మొదలుపెట్టారు.
ముందుగానే తీయించిన పరీక్షలను మరలా చేయాలి అని చెబితే తన కష్టాలను చెప్పుకున్నాడు కృష్ణ డాక్టర్ గారితో.
డాక్టర్ గారు కృష్ణ బాధను అర్థం చేసుకొని, ప్రభుత్వం అందించే వైద్య సేవలను గురించి చెప్పి “ఈ విధంగా వైద్యం చేయించుకోండి. అప్పుడే మీకు డబ్బుల అవసరం లేకుండా వైద్యం అందుతుంద”ని చెప్పాడు.
‘సరే సార్’ అంటూ డాక్టర్ గారు చెప్పిన విధంగానే పనులను ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేసి వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కోసం హాస్పిటలోనే గడిపేస్తున్నారు బసవయ్య, కృష్ణ ఇద్దరూ.
కొన్ని రోజులు గడిచాయి, కృష్ణ అమ్మగారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది, అయితే ఇంట్లో వాళ్ళు పంపిన డబ్బులు సరిపోక పోవడం వలన అక్కడ ఉన్నన్ని రోజులూ తన దగ్గర ఉన్న డబ్బును ఖర్చుచేసేశాడు కృష్ణ. అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటికి వెళ్లారు కృష్ణ గారి అమ్మగారు. ఇంటికి వెళ్లగానే మేము పంపిన డబ్బులకు సంభంధించిన లెక్కలు చెప్పు అంటూ అడిగారు కృష్ణని వాళ్ళ అన్నయ్యలు, వదినమ్మలు.
ఆ మాటకు ‘మీరు పంపిన డబ్బులు ఖర్చులకు అయిపోయాయి. ఏమి మిగలలేదు’ అని అన్నాడు.
“మరి నీకు వచ్చిన జీతం?’ అన్నారు ఇంట్లో వాళ్ళు.
“నాకు వచ్చిన జీతం డబ్బులు కూడా అమ్మకు ఖర్చు అయిపోయాయి. నా దగ్గర ఏమి లేవు” అన్నాడు కృష్ణ.
“అలా ఎలా అయిపోతాయి? నువ్వు కేవలం టెస్ట్ లు మాత్రమే కదా బయట ప్రైవేట్ హాస్పిటల్లో తీయించింది.. మిగతా వైద్యం అంతా ప్రభుత్వ వైద్యశాలలో కదా చేయించింది” అన్నారు.
వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం చూసిన బసవయ్య “మీరు ఆపండి రా. డబ్బు అయిపోయాయి. నాకు తెలుసు” అంటూ మధ్యన కలుగజేసుకుని గొడవ కాకుండా ఆపాడు కృష్ణ గారి నాన్నగారు.
ఇదంతా చూసిన కృష్ణ ఒక్కసారిగా కోపంతో
“మారవు మన జీవితాలు మారవు ఎందుకంటే
మధ్యతరగతి కుటుంబం మనది
తీరని కోరికలు
చావని ఆశలు
చాలని ఆస్తులు
బంధాలు పదిలం కావు
ఆదాయం అక్కరకు రాదు
బాధలు తీరవు
బాధ్యతలు తరుగవు
బ్రతుకు చావదు
బ్రహ్మ కరుణించడు
నడవని బ్రతుకు చక్రాలు
సాగని చదువులు
చేరని అధృష్టాలు
ఇరుకు ఇల్లులు
పొరుగు వారితో పోల్చుకోవడాలు
ఉన్నత వారిలా ఊహించుకోవడాలు
పునరావతం అయ్యే సమస్యలు
పెరగని సిరిసంపదలు
మధ్యలో మరుగైపోయే మధ్యస్థ జీవితాలు మన మధ్యతరగతి కుటుంబాలు..
మనం ఈ విధంగా ఉన్నాము కాబట్టే ఇలాగే ఉన్నాము. ఒకరికి ఒకరం కలిసి పని చేస్తూ సహకరించుకుంటే మన బ్రతుకులు మారుతాయి. కానీ ఇలాగే ఉంటే చచ్చేంత వరకు బాగుపడలేము, చచ్చినా బాగుపడలేము” అన్నాడు.
“మన బ్రతుకు బాగుపడాలంటే ముందుగా మన ఆలోచనలు మార్చుకోవాలి ఈ సమస్యలు ఎప్పుడూ మనకు తొడుగానే ఉంటాయి కాబట్టి మనం కూడా కలిసి పనిచేసుకుంటూ జీవించాలి” అన్నాడు.
నిజమే రా.. మాది తప్పైయ్యింది. ఐకనుంచైనా అవగాహనతో జీవిద్దాం" అన్నారు కుటుంబ సభ్యులు....!!!!
సర్వే జనా సుఖినోభవంతు
కిడాల శివకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
30/10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ నవతరం రచయిత బిరుదు పొందారు.
Comments