top of page

మధ్యతరగతి మందహాసాలు

#Vijayasundar, #విజయాసుందర్, #MadhyataragathiMandahasalu, #మధ్యతరగతిమందహాసాలు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Madhyataragathi Mandahasalu - New Telugu Story Written By Vijayasundar

Published In manatelugukathalu.com On 28/11/2024

మధ్యతరగతి మందహాసాలు - తెలుగు కథ

రచన: విజయా సుందర్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



మిహిర బస్ కోసం నిలబడి అరగంట అయింది. ఎక్కడా అది వస్తున్న జాడే లేక, నిలబడే శక్తి లేని ఆమెకి విసుగు తారస్థాయికి చేరుకున్నది. 


'ప్చ్.. ఇంకా వెళ్తూ వెళ్తూ డే కేర్ నుండి బబ్లూని తీసుకుని వెళ్ళాలి. వాడు ఏ స్టేజ్ లో ఉన్నాడో? ఇవాళ గంట ఆలస్యంగా వెళ్తున్నాను.. ఆంటీ ఎన్ని చదువుతుందో? ఇప్పుడు నేను ఉన్న స్థితిలో ఇంకా పడే శక్తిలేదు. ప్చ్ ఎన్ని అనుకున్నా నాకు ఏదీ తప్పదు. ఇంతకీ అసలు హీరో గారైన శ్రీవారు ఏ మూడ్ లో వస్తారో'.. ఆలోచనల వలన అలసటే మిగిలినా, బస్సు వచ్చి నిలబడగానే, 'మరకమంచిదే’ అన్నట్లు ఎదురు తెన్నులు లేకుండా వచ్చినట్లనిపించింది బస్సు అంతసేపు నిలబడినా కూడా.. 'ఇంతేగా జీవితం, పెద్ద గీత పక్కన చిన్న గీత!' వేదాంతిలా నవ్వుకుని, రెండు కాళ్ళు ఊన్చుకుని నిలబడ్డది బస్సులో. 


తల్లిని చూడగానే పరుగున వచ్చి చుట్టుకుపోతున్న కొడుకుని అక్కున చేర్చుకుంటూ ఆ తల్లి, 'ఈ ఆనందమే కదా నాకు ఊపిరి' అనుకున్నది వాణ్ణి గుండెలకదుముకుంటూ. ఏడ్చిన గుర్తుగా వాడి బుగ్గలు మీద అట్ట కట్టిన కన్నీటి చారికలు ఆ కన్నతల్లిని కదిలించి వేసాయి. అంత బాధపడినా ఆనందం ఎదురు రాగానే అన్నీ మర్చిపోయే ఆ పసితనం ఎంతటి మహత్తర వరమో కదా అనుకున్నది. ! అదే పెద్ద వాళ్ళు అయితే సంజాయిషీలు, లేదా సాధింపులు. 


"ఏమిటి మిహిరా! ఏకంగా గంట ఆలస్యం చేసేసావు? ఇప్పుడింత నవ్వుతున్నాడే భడవ.. ఎంత ఏడిపించాడనీ? కాళ్ళ చేతులా నిలవడాయే. ఏమి పెట్టినా తినడు. ఇట్లా అయితే నాకు కష్టమమ్మా. వేరే పిల్లల్ని కూడా చూడాలా, లేదా? నువ్వు చేస్తే రేపు ఇంకోళ్లు కూడా ఇలాగే చేస్తారు. అయినా ఆఫీసు 6 గంటలకల్లా అయిపోతుందని చెప్పినదానివి, నెలలో 4,5 సార్లు ఇదే తంతు. పనవ్వగానే వచ్చి పిల్లాణ్ణి తీసుకెళ్లాలి తప్ప బజారు పనులన్నీ చేసుకుని వస్తానంటే నాకు కుదరదమ్మాయ్" చేతిలో ఉన్న కవర్, సంచీ లని గుర్రుగా చూస్తూ, గునిసింది డేకేర్ ధనలక్ష్మి ఆంటీ.. మిహిర 'అయిపోయాయి లేమ్మా నీకు నాకు ఈ కష్టాలు' అనుకున్నది నిర్వేదంగా. 


"నేనే షాపింగ్ చెయ్యలేదు ఆంటీ.. వస్తోంటే బండి మీద కూరలు చూసి ఏవో నాలుగు రకాలు తీసుకున్నానంతే. ఆంటీ! అనుకోకుండా పై ఆఫీసర్ వచ్చారు. నా సీట్లోనే ఏదో పని కావాల్సి వచ్చి అప్పటికప్పుడు పూర్తి చేసి, మెయిల్ చేసేప్పటికి ఇంత ఆలస్యమయింది. అయినా ఫిన్ చూసానే. మీ అబ్బాయి ఫోన్ ఎత్తారు.. ఈ మాట చెప్పాను కూడాను. ఇంకొక్క పదిహేను రోజుల్లో మా అత్తగారు వాళ్ళు టూర్ నుండి వచ్చేస్తారు ఆంటీ. ఈ నెల అయిపోయాక ఇంక అవసరం లేదులెండి.. అప్పటిదాకా కాస్త ఓర్చుకోండి. నేను మీకు ఇంకో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను లెండి" అని చెప్పాక ధనలక్ష్మిగారి ముఖం వికసించింది. 



తాళం తియ్యగానే ఎదురుకుండా ఎండిపోయిన కాఫీ కప్పు, చిందవరగా పెట్టిన న్యూస్ పేపర్ చూడగానే, మిహిర మనసు కోపంతో శివతాండవమే చేసింది. 'ఛీ ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే.. తాగిన కప్పు సింక్ లో వేయడానికి ఏమి కష్టమో తెలియదు, అనుకుంటూ అన్నీ తీసి సర్దుకుంటూ లోపలకి వచ్చి, కాఫీ కలుపుకున్నది.. పిల్లాడికి పాలు బిస్కెట్లు ఇచ్చి, తాను ఒక చేత్తో మంచినీళ్లు, ఇంకో చేత్తో కాఫీ కప్పు పట్టుకుని సోఫాలో జారగిలపడ్డది. 


విరించి, మిహిర అన్యోన్యమైన జంట. విరించి బాంక్ లో క్లర్క్. మిహిర చిట్ ఫండ్ కంపెనీలో చేస్తున్నది. పెద్దలు పద్దతిగా చేసిన పెళ్లి. పెళ్లి అయిన ఏడాదికి స్నిగ్ధ పుట్టింది, ఆ తరవాత రెండేళ్లకు బబ్లూ గాడు అదే శ్యామ్ పుట్టాడు. 


మిహిరకి కొద్దిగా కోపం తొందరగా వస్తుంది కానీ, కాస్త నెమ్మదిగా నచ్చచెప్తే మళ్లీ సర్దుకుంటుంది. విరించి చాలా సాత్వికుడు, పరిణితి బాగా ఉన్నవాడు. కాకపోతే ఇద్దరూ మంచివాళ్ళు, ముఖ్యంగా ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ, కుటుంబం పట్ల బాధ్యత ఉన్నవాళ్లు. 


సంగీతం నుండి పిల్లని తీసుకుని వచ్చిన విరించి దగ్గరగా వేసి ఉన్న తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. స్నిగ్ధ, "బబ్లూ" ఆంటూ తమ్ముణ్ణి ముద్దు చేసి, వాడితో ఆడుకుంటూ ఏదో గుర్తుకు వచ్చినట్లు, "అమ్మా! నాకు ఇవాళ ఇండియా మాప్ వెయ్యడం నేర్పాలి. రేపు స్కూల్ లో మేము అక్కడికక్కడే వెయ్యాలి తెలుసా?" మంచంమీద అటు తిరిగి పడుకున్న మిహిర పలక్కపోతే, మంచం ఎక్కి తల్లి మీదకి వంగి చెప్తున్న కూతుర్ని ఒక్క విదిలింపు విదిలించింది. బిక్క మొహం వేసుకున్న కూతుర్ని దగ్గరకు తీసుకుని, "మన మూడ్ స్వింగ్స్ పిల్లల మీద చూపకూడదని ఎన్నిసార్లు చెప్పాను" విరించి విసుగ్గా అన్నాడు. 


"ఆ నేనూ చెప్పాను సవాలక్షసార్లు తాగిన కప్పు సింక్ లో వెయ్యండి అని" ఊడిపోతున్న జుట్టు ముడేసుకుంటూ లేచింది మిహిర. 


కళ్లన్నీ ఎర్రగా అయి చాలా అలిసిపోయినట్లున్న భార్య మొహం చూశాక అతనికి అర్థమైంది, సమస్య కప్పు సింక్ లో పడేయడం కాదు మరేమిటోనని. 


"మిహీ! ఏమయింది అలా ఉన్నావు?" భర్తకి సమాధానంగా తన చేతిలోని కాగితం అతని చేతిలో పెట్టి, చిన్నబుచ్చుకుని నిలబడ్డ కూతుర్ని దగ్గరకు తీసుకున్నది మిహిర. విషయం భర్తకి చెప్పేసాక ఒకరకమైన నిశ్చింత ఆమె వదనంలో. 


అందుకే కదా ఒకరికి ఒకరనేది. 


కాగితంలోది చదివాక విరించి ముఖం పాలిపోయింది. మారుతున్న భర్త ముఖకవళికలు చూసి, పిల్లలకి టి వి లో కార్టూన్ షో పెట్టి భర్త పక్కనే కూర్చుని, "ఏమి చెయ్యడం ఇప్పుడు? వదిన పురిటికి వస్తుంది అత్తయ్య గారు వాళ్ళతో ఇంకో 15 రోజుల్లో. ఇప్పుడు నా ఉద్యోగం లేకపోతే ఈ ఖర్చులు తట్టుకునేదెట్లాగ?" అప్పటికే కొంచెం స్థిమితపడుతున్న అతను,"పోనీ చెల్లాయి పురుడు అన్నయ్య చూసుకుంటాడేమో అడగనా.. పరిస్థితి చెప్తే కాదంటాడా?"


"ఎంత పిచ్చి వాళ్లండీ మీరు? మామయ్యగారి ఆపేరేషన్ అంటేనే, ఆవడ దూరం పారిపోయాడు, వాళ్ళ నార్త్ టూర్ కి డబ్బు కట్టేసామంటూ. ఏమీ వద్దు. భగవంతుడే ఏదో దారి చూపించకపోడు. "

అప్పటికి స్థిమితపడ్డారు. 


***

అనసూయమ్మ, సత్యనారాయణ టూర్ నుండి వచ్చి నాలుగు రోజులయింది. వాళ్లతో పాటు తొలి కాన్పుకని వచ్చిన స్వాతి మేనల్లుడు శ్యామ్ ని తెగ ముద్దు చేస్తోంది. ఆడబడుచు వచ్చాక మిహిరకి ఒక పని తగ్గింది. హాయిగా ఉన్నది అనుకుంటూ,'హు ఇంకెన్నాళ్లు ఈ హాయి ఇంకో 15 రోజులంతే' అనుకుని వేదాంతిలా నవ్వుకున్నది. 


రోజులు శరవేగంగా గడిచిపోతున్నాయి. ఆరోజు కోడలు ఇంకా వంటింట్లోనే ఉంటే 

 అనసూయమ్మ, "అమ్మాయ్ మిహిరా! ఆఫీసు లేదా?" అంటూ కేకేసింది. భోజనం చేస్తున్న విరించి, ఏమి చెప్పాలా అని తటపటాయిస్తున్న మిహిరతో, "ఉన్న విషయం చెప్పెయ్యి. కనీసం కొన్ని ఖర్చులైనా తగ్గించుకుంటారు" అన్నాడు. 


మిహిర మెల్లిగా బయటకు వచ్చి " అదీ ఆ కంపెనీ దివాలా తీసింది అత్తయ్యగారు" అన్నది. ఆవిడ నోట మాట లేక. నిట్రాట అయ్యారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆవిడ భర్త," అయ్యో ఇప్పుడేది దారి?" అన్నాడు. 


"మెల్లిగా అండీ! అమ్మాయి బాత్రూంలో ఉన్నది, అది వింటే బాధపడుతుంది". మిగిలిన ముగ్గురూ నాలిక్కరుచుకుని, ఆవిడ జాగ్రత్తకి అబ్బురపడ్డారు. నలుగురూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మిన్నకుండి పోయారు. 


అనసూయమ్మకి మనసు మనసులో లేదు. ఏడో నెల వెళ్లే లోపు స్వాతికి. సీమంతం చెయ్యాలి. ఏదో తూ తూ మంత్రం అనిపించడానికి వీలు లేదు. వాళ్ళ అత్తగారి వేపు బంధు బలగం ఎక్కువ. తొలి చూలు గ్రాండ్ గా చెయ్యాలని వాళ్ళ అత్తగారు చెప్పి పంపనే పంపింది. ఏమని అడగగలను వాణ్ణి ఈ పరిస్తుతుల్లో? భగవంతుడా! నువ్వే దారి చూపాలి'. అత్తగారి ఆవేదన మిహిరకి తెలుసు. ఆమె కూడా వెయ్యి దేవుళ్ళకి దణ్ణం పెట్టుకుంటున్నది ఎలాగైనా ఈ కార్యం గట్టెక్కించమని. 


బాంకులో పని అన్నమాటే గానీ వచ్చే లోన్ లు అన్నీ వాడేసుకోవాల్సి వచ్చింది, చెల్లెలి పెళ్లి, తమ్ముడి చదువు, చిన్న ఇల్లు కట్టుకున్నారు, తండ్రి ఎప్పుడో కొన్న స్థలం ఉన్నది కదా అని.. ఆ లోన్లతో వచ్చే జీతం నామ మాత్రమే. ఇల్లు గడపాలి, ఇద్దరు చిన్న పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళు తామిద్దరు, తమ్ముడు. ఇప్పుడు పురిటికి వచ్చిన చెల్లెలు. 


సత్యనారాయణగారు ఆలోచిస్తున్నారు, తమ ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు అమ్మేస్తేనో అని. కానీ ఇంత ఆఘమేఘాలమీద అమ్ముడు పోవద్దూ? ప్చ్.. ఆయనా ఆలోచనల్లో సతమతమవుతున్నారు. ఇంట్లో అందరి గంభీర ముద్రలు, వదిన ఇంట్లోనే ఉండటం చూసి స్వాతి తన దగ్గర ఏదో దాస్తున్నారని అర్థం చేసుకుని, అడిగినా చెప్పరని ఏమీ చేయలేక తన భర్త దగ్గర వాపోయింది. 


వదిన కి ఉద్యోగం పోయిన సంగతి ఆ చిట్ఫండ్ కంపెనీ పెట్టిన తన భర్త స్నేహితుని ద్వారా తెలిసింది స్వాతికి. ఇంక కథ అంతా అర్థమయింది. 


స్వాతి భర్త మూర్తి, ధనంలో మామూలు మధ్యతరగతి వాడే కానీ గుణంలో చాలా పై స్థాయి వాడు. అందుకే తాను లోన్ తీసుకుని, తన అత్తగారు వాళ్లకి, తన వాళ్ళ దగ్గర ఎటువంటి మాట రాకుండా చూడాలని, విరించితో మాట్లాడాడు ఆ ఆదివారం నాడు. 


ముందు విరించి సిగ్గుతో కుంచించుకుపోయాడు. 


తాను మానేజ్ చేసుకుంటానంటే, "మనిద్దరమూ ప్రాణస్నేహితులమనే కదరా నీ చెల్లెల్ని నాకిచ్చింది. మరి అదే ప్రాతిపదికన నేనిప్పుడు చెప్తున్నది చేస్తానంటున్నాను. ఇందులో మనందరి ఆనందం ఉన్నది. పెద్ద వాళ్లకు ఎవరికీ ఈ విషయం చెప్పాల్సిన పని లేదు” అంటూ తీర్మానించేశాడు. 


"నేనయినా ఊరికే ఇవ్వట్లేదు కదా నువ్వు కించపడ్డానికి. మెల్లిగా తీర్చేద్దువులే" అని స్నేహితుడు, బావమరిది విరించిని ఒప్పించాడు.. 


 విరించి తమ్ముడు శివ వచ్చాడు ఆనందం మూట కట్టుకుని. "అన్నయ్యా! భగవంతుడు నీ చేతికి ఆసరా కావడానికే నాకు ఉద్యోగం ఇచ్చాడు" అంటూ తల్లిదండ్రి, తరవాత అన్నా వదినలకి నమస్కరించాడు. 


కష్టాలు కలకాలమూ ఉండవని ఆ ఇంట నవ్వులు పువ్వులు విరిసాయి!


***

విజయా సుందర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar

నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.

'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!


59 views1 comment

1 Comment


mk kumar
mk kumar
5 days ago

ఈ కథలో "మధ్యతరగతి మందహాసాలు" అనే అంశాన్ని విజయాసుందర్ గారు సమర్థంగా ప్రతిఫలించారు. మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నచిన్న సంఘర్షణలు, ప్రేమ, బాధ్యత, సమన్వయం, అలాగే ఆర్ధిక కష్టాల్లో కూడా ఒకరికొకరు అండగా ఉండే భావాన్ని ఆమె చక్కగా వివరించారు.


మిహిర, విరించి పాత్రల ద్వారా నిత్యజీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, పిల్లల పట్ల బాధ్యత, కుటుంబంలోని పెద్దల అంచనాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలను మమేకం చేస్తూ, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడం ఎట్లా ఉంటుందో చూపించారు.


రచనలోని భాష హృదయానికి చేరువగా ఉంటుంది. పాత్రల భావోద్వేగాలను అక్షర రూపంలో ప్రతిబింబిస్తూ, పాఠకులను కథతో మమేకం చేయడం వారి ప్రత్యేకత.


ఈ కథనిలో పాఠకులు తమ జీవితంలోనూ ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటారు. ఇందులోని పాత్రలు మన పరిసరాల్లో ఉండే వ్యక్తుల్లా అనిపిస్తారు.


ఇది ఒక మంచి మధ్యతరగతి కుటుంబ కథ. విజయాసుందర్ గారికి అభినందనలు!


Like
bottom of page