మహా శివరాత్రి పర్వదినం - ప్రాముఖ్యత
- Sudha Vishwam Akondi

- Feb 15
- 3 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, #Devotional, #MahaSivarathriParvadinamPramukhyatha, #మహాశివరాత్రిపర్వదినంప్రాముఖ్యత

Maha Sivarathri Parvadinam Pramukhyatha - New Telugu Article Written By Sudhavishwam Akondi Published in manatelugukathalu.com on 15/02/2026
మహా శివరాత్రి పర్వదినం - ప్రాముఖ్యత - తెలుగు వ్యాసం
వివరణ: సుధావిశ్వం ఆకొండి
మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి రోజున మాస శివరాత్రి వస్తుంది . ఆవేళ కూడా శివారాధన చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
మాఘ బహుళ చతుర్దశి నాడు జరుపుకునే మహా శివరాత్రి, శివ పార్వతుల కళ్యాణం మరియు శివుడు లింగోద్భవుడైన అంటే లింగ రూపంలో దర్శనమిచ్చిన పవిత్రమైన రాత్రిగా ప్రసిద్ధి చెందింది. రాత్రి అజ్ఞానానికి సంకేతం అయితే తేజోమయమైన లింగాకారం జ్ఞానానికి సంకేతం! ఈ పండుగ రోజున ఆ పరమశివుని పైనే మనసు నిలిపితే, ఆ భక్తి, జీవుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించి ముక్తిపథానికి పయనింపజేస్తుంది.
ఈ పండుగనాడు ఉపవాసం ఉండి, లింగాభిషేకం చేసి, నిరంతర శివనామ స్మరణతో గడుపుతూ, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివాలయంలో అభిషేకం చేసి, లేదా దర్శించుకుని, శివనామ స్మరణతో జాగరణ చేస్తూ గడిపితే ఆ జీవుడు ఉత్తమ గతులు పొందుతాడు. జన్మానికో శివరాత్రి అనే నానుడి ఉంది. అంతే కనీసం ఈ జన్మలో ఒక్కసారైనా పద్ధతిగా శివరాత్రి రోజున గడిపితే అది ఉత్తమ గతులు కలిగిస్తుందని పెద్దలు చెబుతారు.
అందుకే భక్తులు ఉపవాసం, జాగరణ మరియు లింగాభిషేకాలతో పరమశివుని కృప కోసం రాత్రంతా శివనామ స్మరణతో గడిపే పరమ పవిత్రంగా గడుపుతారు.
శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, రాత్రంతా మేల్కొని (జాగరణ) శివుడిని పూజిస్తే, వ్యక్తిలోని తమోగుణం, రజోగుణం తగ్గి, సత్వగుణం పెరుగుతుందని పెద్దలు చెబుతారు.
శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలతో శివుని అర్చించి, ఫలాలతో నైవేద్యం పెడతారు. ఆ ఫలాలు మాత్రమే ఆహారంగా తీసుకుని శివనామ స్మరణతో గడుపుతారు.
ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.
భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో
శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి, ఇది శివశక్తి ఐక్యతను సూచిస్తుంది.
సముద్ర మథన సమయంలో లోక రక్షణ కోసం శివుడు హాలాహలం (విషం) మింగిన రాత్రి కూడా ఇదేనని, అందువల్ల శివుడిని 'నీలకంఠుడు' అని కొలుస్తారని కూడా చెబుతారు.
ఈ రాత్రి, గ్రహాల అమరిక వల్ల శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రవహిస్తుందని, తద్వారా ధ్యానానికి, ఆత్మజ్ఞానానికి చాలా విశేషమైన రోజుగా యోగులు భావిస్తారు.
***
ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందని శివరాత్రి మహత్యం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం.
శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. తొందరగా ప్రసన్నుడై అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అందుకే భక్తవశంకరుడనీ, భోళా శంకరుడనీ అన్నారు.
ఒక గొప్ప సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు! సమస్త దుర్గుణాలన్నీ అలవరచుకుంటాడు. తల్లిదండ్రులను ఎదిరించి బయటకు వెళ్లి, వేశ్యలతో తిరుగుతాడు. వాళ్లు ధనం ఇస్తేనే రమ్మని అంటే ఇంట్లోనే దొంగతనం చేస్తాడు. అది చూసి బాధపడి అడ్డుపడిన తండ్రిని తోసేసి పోతాడు. ఆ బాధతోనే అతని తల్లిదండ్రులు మరణిస్తారు. ఇలా అన్ని విధాలుగా పతనమైన ఆ గుణనిధి చివరకు ఆ వేశ్యలకు ఇవ్వడానికి ధనం లేకపోవడం వల్ల, వారు బయటకు గెంటుతారు. ఎక్కడా ఎవ్వరూ ఆదరించే వారు లేక, తిండికి లేక రోడ్డుపైన పిచ్చివాడిలా తిరుగుతూ వుంటాడు.
మహా శివరాత్రి నాడు అప్పటికి రెండు రోజుల నుండి తిండి లేకపోవడంతో ఆకలితో ఒక శివాలయంలోకి వెళతాడు. అక్కడ భక్తులు అందరూ నైవేద్యాలు అక్కడ పెట్టి శివ భజనలు చేస్తుంటారు. అక్కడ ప్రసాదం దొరుకుతుందనే ఆశతో ఓ మూలన కూర్చుంటాడు గుణనిధి. భజన చేసి అందరూ నిద్రపోయాక అక్కడ పెట్టినవి తిని ఆకలి తీర్చుకుందామని చూస్తూ కూర్చుంటాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంతోనే ఉన్న భక్తులు జోగుతూ ఉండడం చూసి, ఆహారం తీసుకుందామని చూస్తే చిమ్మచీకటికి శివుని సన్నిధిలో ఉన్న దీపం వెలిగించి, అటు వైపు వెళతాడు. ఈ లోపు కాలికి ఏదో తగిలి శబ్దం రావడం వల్ల భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు గుణనిధి. అనుకోకుండా ఉపవాసం, జాగరణ శివసన్నిధిలో చేస్తూ, భక్తులు చేస్తున్న శివస్తుతులు చెవిలో పడడం, అక్కడే ప్రాణాలు విడువడంతో ముక్తి పొందుతాడు. శివరాత్రి మహత్యం అంత గొప్పది.
అందుకే శివరాత్రి నాడు యధాశక్తి ఉపవాసం ఉండి, జాగరణ చేసి, ఆరోజంతా శివ నామస్మరణతో గడిపితే జన్మ ధన్యం అవుతుంది. ఉపవాసం అనగానే ఏం తినకుండా ఉండడం అనే కాదు. భగవంతునికి దగ్గరగా ఉండడం అని అర్థం. అంతే ఆయన స్మరణతోనే గడపడం. మన శారీరక పరిస్థితిని అనుసరించి తిని, ఆ స్వామిని మనసులో తలుస్తూనే ఆరోజు గడపాలి.
అందరికీ ఆ పరమశివుని అనుగ్రహం ప్రసరించి, లోకమంతా ప్రశాంతంగా ఉండాలని ఆ భోళా శంకరుని ప్రార్థన చేసుకుందాం!
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
శివార్పణమస్తు 🙏🙏🙏🙏🙏
సుధావిశ్వం
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
💐 💐 💐 💐 💐
సుధావిశ్వం

-సుధావిశ్వం




Comments